సర్వసభ్య సమావేశము
ప్రతి తలంపులో క్రీస్తును వెదకుము
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


14:47

ప్రతి తలంపులో క్రీస్తును వెదకుము

శోధనలకు వ్యతిరేకంగా పోరాడడానికి జీవితకాల శ్రద్ధ మరియు విశ్వాసం అవసరము. కానీ, ప్రభువు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని దయచేసి తెలుసుకోండి.

తన కవితా ప్రశంసల కీర్తనలో, కీర్తనకారుడు ఇలా ప్రకటించాడు:

“యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు.

“నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

“ నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.” 1

ఈ కవిత యొక్క అర్థ సమాంతరతలో, కీర్తనకారుడు ప్రభువు యొక్క దైవిక లక్షణమైన సర్వజ్ఞానాన్ని ప్రశంసించాడు, ఎందుకంటే మన ఆత్మల యొక్క ప్రతి అంశము ఆయనకు నిజంగా తెలుసు.2 ఈ జీవితంలో మనకు అవసరమైన అన్ని విషయాల గురించి తెలిసియుండి, ప్రతి తలంపులోనూ ఆయనను వెదకాలని మరియు మన పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించాలని రక్షకుడు మనల్ని ఆహ్వానించారు.3 ఆయన వెలుగులో మనం నడవగలమని మరియు ఆయన మార్గదర్శకత్వం మన జీవితంలో చీకటి ప్రభావాన్ని నిరోధిస్తుందని ఇది వాగ్దానం ఇస్తుంది.4

ప్రతి తలంపులో క్రీస్తును వెదకడానికి, మన పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించడానికి మన మనస్సును, కోరికలను ఆయన వాటితో సమన్వయం చేయడం అవసరము. 5 లేఖనాలు ఈ అమరికను “ప్రభువునందు స్థిరంగా యుండుట” అని సూచిస్తాయి.6 మనము క్రీస్తు సువార్తకు అనుగుణంగా మన జీవితాలను నిరంతరం నిర్వహించాలని 7మరియు మంచిదైన ప్రతిదానిపై ప్రతిరోజూ దృష్టి సారించాలని ఈ కార్యప్రణాళిక మనకు సూచిస్తుంది. అప్పుడే మనం “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” పొందవచ్చు మరియు అది “యేసు క్రీస్తు వలన [మన] హృదయములకును తలంపులకును కావలి యుండును.”8 రక్షకుడు స్వయంగా ఫిబ్రవరి 1831 లో సంఘ పెద్దలను ఇలా ఆదేశించెను: “ఈ సంగతులను మీ హృదయాలలో భద్రపరచుకొనుడి, నిత్యత్వపు పవిత్ర సత్యములను గూర్చి మీ మనస్సులలో ఆలోచన చేయుడి.”9

ప్రభువును వెదకడానికి మనం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, విరుద్దమైన ఆలోచనలు మన మనస్సులోకి చొచ్చుకుపోవచ్చు. అలాంటి ఆలోచనలు అనుమతించబడినప్పుడు, నిలిచియుండుటకు అవి ఆహ్వానించబడినప్పుడు, అవి మన హృదయవాంఛలను రూపుదిద్దగలవు మరియు ఈ జీవితంలో మనం ఏమి అవుతామో మరియు చివరికి మనం నిత్యత్వమునకు వారసత్వంగా దేనిని పొందుతామో దాని యొద్దకు మనల్ని నడిపించగలవు.10 ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఒకసారి ఈ సూత్రాన్ని నొక్కిచెప్పారు, “కోరికలు… ఫలితాలలో స్థాయిలను నిర్ణయించడంతో పాటు ‘ పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడినవారు కొందరే’ ఎందుకో తెలియజేస్తాయి.”11

మన ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలు మనం మన ఆత్మీయ పటుత్వమును కోల్పోకుండా మరియు గందరగోళంగా దిక్కుతోచని స్థితిలో ఉండి, భ్రమలో పడకుండా ఉండడానికి శోధనలను జయించాలని నిరంతరం గుర్తు చేసియున్నారు.

ఉపమానంగా చెప్పాలంటే, శోధనలకు లొంగడం లోహ వస్తువుతో అయస్కాంతాన్ని సమీపించడం లాంటిది. అయస్కాంతం యొక్క అదృశ్య శక్తి లోహ వస్తువును ఆకర్షిస్తుంది మరియు దానిని గట్టిగా పట్టుకుంటుంది. లోహ వస్తువును దాని నుండి దూరంగా ఉంచినప్పుడు మాత్రమే అయస్కాంతం దానిపై తన శక్తిని కోల్పోతుంది. కాబట్టి, అయస్కాంతానికి దూరముగా ఉన్న లోహ వస్తువుపై దానికి శక్తి లేనట్లే, మనం శోధనలను ఎదిరించేటప్పుడు, అది మసకబారుతుంది మరియు మన మనస్సుపై, హృదయంపై దాని శక్తిని కోల్పోతుంది, తత్ఫలితంగా మన చర్యలపై శక్తిని కోల్పోతుంది.

ఈ సారూప్యత కొంతకాలం క్రితం చాలా విశ్వాసం గల ఒక సంఘ సభ్యురాలు నాతో పంచుకున్న అనుభవాన్ని నాకు గుర్తుచేస్తుంది. ఈ సభ్యురాలు ఒక నిర్దిష్ట ఉదయమున మేల్కొన్నప్పుడు, ఆమె ఎప్పుడూ అనుభవించని ఒక అనుచిత ఆలోచన అనుకోకుండా ఆమె మనసులోకి ప్రవేశించిందని నాకు చెప్పింది. ఇది ఆమెను పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ, ఆమె వెంటనే ఆ సందర్భానికి వ్యతిరేకంగా స్పందిస్తూ, తనతో మరియు ఆ ఆలోచనతో, “వద్దు! అని చెప్పి, ఇష్టపడని ఆలోచన నుండి మళ్ళించడానికి ఆమె మనస్సును మంచి ఆలోచనతో భర్తీ చేసింది. ఆమె తన నైతిక స్వతంత్రతను నీతియందు సాధన చేసినప్పుడు, ఆ ప్రతికూల అసంకల్పిత ఆలోచన వెంటనే మాయమైందని ఆమె నాకు చెప్పింది.

క్రీస్తును విశ్వసించమని మరియు పశ్చాత్తాపపడమని జనులకు మొరోనై పిలుపునిచ్చినప్పుడు, తమ దుష్టత్వమును వదిలి హృదయపూర్వకంగా రక్షకుని యొద్దకు రమ్మని అతడు వారిని వేడుకున్నాడు. ఇంకా, వారు శోధనలలో పడకుండునట్లు పటిష్టమైన దృఢ నిశ్చయంతో దేవుడిని అడగమని మొరోనై వారిని ఆహ్వానించాడు.12 ఈ సూత్రాలను మన జీవితంలో అన్వయించుకోవడానికి కేవలం నమ్మకం సరిపోదు, మన మనస్సులను, హృదయాలను ఈ దైవిక సూత్రాలకు తగినట్లు సర్దుబాటు చేసుకోవాలి. ఇటువంటి సర్దుబాటుకు రక్షకునిపై మనం ఆధారపడడంతో పాటు, రోజువారీ మరియు స్థిరమైన వ్యక్తిగత ప్రయత్నం అవసరం, ఎందుకంటే మన మర్త్య ప్రవృత్తులు వాటికవే తొలగిపోవు. శోధనలకు వ్యతిరేకంగా పోరాడడానికి జీవితకాల శ్రద్ధ మరియు విశ్వాసం అవసరము. కానీ, మన వ్యక్తిగత ప్రయత్నాలలో ప్రభువు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మరియు మనం అంతము వరకు సహిస్తే గొప్ప ఆశీర్వాదాలను వాగ్దానము చేసారని దయచేసి తెలుసుకోండి.

లిబర్టీ చెరసాలలో ఉన్న జోసెఫ్ స్మిత్ మరియు అతని తోటి ఖైదీలకు వారి ఆలోచనలు తప్ప మరే విధమైన స్వేచ్ఛ లేనప్పుడు, ప్రభువు వారికి సహాయకరమైన సలహాను, ఒక వాగ్దానాన్ని ఇచ్చారు, అది మనందరికి కూడా ఇవ్వబడింది:

“నీ ఆంత్రములు మనుష్యులందరి యెడల, విశ్వాస గృహము యెడల దాతృత్వముతో నిండనీయుము, నీ ఆలోచనలు నిరంతరము సుగుణముతో అలంకరింపబడనీయము; అప్పుడు నీ ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా ఎదుగును; …

“పరిశుద్ధాత్మ నీ స్థిర సహచరునిగాయుండును, నీ దండము నీతి సత్యముల యొక్క మారని దండముగానుండును.”13

ఆవిధముగా చేయుట ద్వారా, పవిత్రమైన ఆలోచనలు నిరంతరం మన మనస్సులను అలంకరిస్తాయి మరియు స్వచ్ఛమైన కోరికలు నీతివంతమైన చర్యలకు మనల్ని నడిపిస్తాయి.

మొరోనై కూడా తన జనులను వారి వ్యామోహాలకు లోనుకావద్దని గుర్తు చేశాడు.14 వ్యామోహం అనే పదం ఏదో ఒకదాని పట్ల తీవ్రమైన మరియు అనుచిత కోరికను సూచిస్తుంది.15 ఏదైనా చీకటి ఆలోచనలు లేదా చెడు కోరికలను ఇది కలిగి ఉంటుంది, ఇది ఒక వ్యక్తి మంచి చేయడం, దయ చూపడం మరియు దేవుని ఆజ్ఞలను పాటించడం కంటే స్వార్థపూరిత అభ్యాసాలపై లేదా ప్రాపంచిక సంపదపై దృష్టి సారించేలా చేయడానికి కారణమవుతుంది. ఇది తరచుగా ఆత్మ యొక్క అధికమైన శరీరేచ్ఛల ద్వారా వ్యక్తమవుతుంది. వీటిలో అపవిత్రత, కాముకత్వము, … ద్వేషం, … కోపం, కలహం, … అసూయలు, … వంటి కొన్ని భావాలను అపొస్తలుడైన పౌలు గుర్తించెను. 16 వ్యామోహము యొక్క అన్ని చెడు అంశాలతో పాటు, శత్రువు తప్పు చేయమని మనల్ని శోధించినప్పుడు దానిని మనకు వ్యతిరేకంగా రహస్యంగా మరియు మోసపూరిత ఆయుధంగా ఉపయోగిస్తున్నాడని మనం మర్చిపోలేము.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మన ఆత్మల రక్షకుడైన రక్షణ బండపై ఆధారపడి మనం మొరోనై సలహాను అనుసరించినప్పుడు, మన ఆలోచనలను నియంత్రించే మన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. మన ఆత్మీయ పరిపక్వత వేగవంతముగా వృద్ధిచెందుతుందని, మన హృదయాన్ని మారుస్తుందని, మనల్ని యేసు క్రీస్తు వలె చేస్తుందని నేను మీకు అభయము ఇవ్వగలను. అదనంగా, పరిశుద్ధాత్మ ప్రభావం మన జీవితంలో మరింత తీవ్రంగా నిరంతరము ఉంటుంది. అప్పుడు శత్రువు యొక్క శోధనలు మనపై వాటి శక్తిని కొద్దికొద్దిగా కోల్పోతాయి, ఫలితంగా సంతోషకరమైన, మరింత స్వచ్ఛమైన పవిత్రమైన జీవితం లభిస్తుంది.

ఏ కారణం చేతనైనా శోధనలకు లోనవుతూ, అవినీతి క్రియలలో జీవించేవారికి క్రీస్తుయందు నిరీక్షణ కలదని, మరలా నీతివైపుకు వెళ్ళుటకు ఒక మార్గం ఉందని నేను మీకు అభయమిస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ఒక ప్రియమైన సభ్యుని కలుసుకొనే అవకాశం నాకు లభించింది, అతడు తీవ్రమైన అతిక్రమము చేసిన తరువాత తన జీవితంలో చాలా కష్టమైన సమయాన్ని అనుభవించాడు. నేను అతడిని మొదటిసారి చూసినప్పుడు, అతని ముఖంలో నిరీక్షణ యొక్క ప్రకాశంతో పాటు అతని కళ్ళలో ఒక బాధను నేను చూడగలిగాను. అతని వ్యక్తీకరణ వినయపూర్వకమైన మరియు మారిన హృదయాన్ని ప్రతిబింబించింది. అతను అంకితభావము గల క్రైస్తవుడు మరియు ప్రభువు చేత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అయినప్పటికీ, అతను ఒక అనుచిత ఆలోచనను తన మనస్సులోనికి అనుమతించాడు, అది ఇతర ఆలోచనలకు దారితీసింది. అతడు క్రమంగా ఈ ఆలోచనలను మరింతగా అనుమతించడంతో, త్వరలోనే అవి అతని మనస్సులో పాతుకుపోయి అతని హృదయంలో లోతుగా పెరగడం ప్రారంభించాయి. అతడు చివరికి ఈ అనర్హమైన కోరికల ప్రకారము నడుచుకున్నాడు, ఇది అతని జీవితంలో అత్యంత విలువైన వాటికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి దారితీసింది. ముందుగా ఆ మూర్ఖమైన ఆలోచనకు అతడు చోటివ్వకపోతే, అతడు శత్రువు యొక్క శోధనలకు—కొంతకాలంపాటు తన జీవితంలో చాలా బాధను కలిగించిన శోధనలకు అతడు గురయ్యేవాడు కాదని అతడు నాకు చెప్పాడు.

అదృష్టవశాత్తూ, లూకా సువార్తలో చెప్పబడిన ప్రసిద్ధమైన ఉపమానములో కనుగొనబడు తప్పిపోయిన కుమారుడిలా “అతడు తన చెడు మార్గములను విడిచిపెట్టి,” ఆ పీడకల నుండి మేల్కొన్నాడు.17 అతడు ప్రభువుపై తన నమ్మకాన్ని నూతనపరుచుకొని, నిజమైన దుఃఖాన్ని అనుభవించాడు మరియు చివరికి ప్రభువు సంఘమునకు తిరిగి రావాలని కోరిక కలిగియున్నాడు. ఆ రోజు మేమిద్దరము మా కొరకు రక్షకుని విమోచన ప్రేమను అనుభూతిచెందాము. మా క్లుప్త సమావేశము ముగిసిన తరువాత మేమిద్దరం ఉద్వేగానికి లోనయ్యాము మరియు అతడు నా కార్యాలయం నుండి బయలుదేరినప్పుడు అతని ముఖంలో ఉన్న ఆనందాన్ని నేటి వరకు నేను గుర్తుంచుకున్నాను.

నా ప్రియమైన మిత్రులారా, మన జీవితంలో తరచుగా ఊహించని విధంగా వచ్చే చిన్న శోధనలను జయించినప్పుడు, తీవ్రమైన అతిక్రమములను నివారించడానికి మనము బాగా సిద్ధపడి ఉంటాము. అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ చెప్పినట్లుగా, “పెద్దవాటికి తలుపులు తెరిచే చిన్న చిన్న అతిక్రమములు చేయకుండా ఒకరు పెద్ద అతిక్రమమును చేయడం అరుదు. … ‘పరిశుభ్రమైన క్షేత్రం అకస్మాత్తుగా కలుపుగా (మారదు).’”18

భూమిపై తన దైవిక నియమితకార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నప్పుడు రక్షకుడైన యేసు క్రీస్తు, మన నిత్య ఉద్దేశాన్ని గ్రహించకుండా నిరోధించే ప్రతిదానిని మనం నిరంతరం జయించవలసిన ప్రాముఖ్యతను వివరించారు. తన నియమితకార్యము నుండి ఆయనను దారి మళ్ళించడానికి ప్రయత్నించిన శత్రువు యొక్క అనేక విఫలమైన దాడుల తరువాత, రక్షకుడు ఈ విధంగా అపవాదిని తరిమివేసెను: “సాతానా, పొమ్ము. … అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.”19

నా సహోదర సహోదరీలారా, మనము రక్షకుని నుండి బలాన్ని, ధైర్యాన్ని పొంది, అవాంఛనీయ ఆలోచనలు మన మనస్సుల్లోకి వచ్చిన మొదటి క్షణం “వద్దు” మరియు “నా నుండి పొమ్ము” అని చెబితే ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా? మన హృదయవాంఛలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఫలితంగా మనం చేసే క్రియలు మనల్ని రక్షకుని వద్దకు ఏవిధంగా తీసుకువచ్చి, మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నిరంతర ప్రభావాన్ని ఎలా అనుమతిస్తాయి? యేసు ఉదాహరణను అనుసరించడం ద్వారా కుటుంబ సమస్యలు, భిన్నాభిప్రాయాలు, ప్రతికూల భావోద్వేగాలు, చెడుకు మొగ్గుచూపడం, అన్యాయాలు మరియు దుర్వినియోగాలకు పాల్పడడం, చెడు వ్యసనాల ద్వారా బానిసలుగా మారడం, ప్రభువు ఆజ్ఞలకు విరుద్ధమైన మరేదైనా విషాదాలు మరియు అవాంఛనీయ ప్రవర్తనలను మనము తప్పించుకుంటామని నాకు తెలుసు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తన చారిత్రాత్మక మరియు హత్తుకునే సందేశంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆయనను వినుటకు”—యేసు క్రీస్తును వినుము— ఆయన ఆజ్ఞలను పాటించుటకు ఇష్టపడే వారందరూ “శోధనలు, పోరాటాలు మరియు బలహీనతలు” ఎదుర్కోవడానికి అదనపు శక్తితో ఆశీర్వదించబడతారు” అని, పెరుగుతున్న ప్రస్తుత అల్లకల్లోల సమయంలో కూడా ఆనందాన్ని అనుభవించే మన సామర్థ్యం పెరుగుతుందని వాగ్దానం చేశారు.”20

మన ప్రియమైన ప్రవక్త ఇచ్చిన వాగ్దానాలు రక్షకుడు స్వయంగా ఇచ్చిన వాగ్దానాలు అని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. మన జీవితంలో దుఃఖాన్ని కలిగించే అన్ని విషయాలకు “వద్దు” మరియు “ఇక్కడినుండి పొమ్ము” అని చెప్పే బలం మరియు ధైర్యాన్ని పొందడానికి ప్రతి తలంపులో “ఆయనను వినుము” అని, పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించమని నేను మనందరినీ ఆహ్వానిస్తున్నాను. మనము ఆవిధముగా చేసినట్లైతే మనల్ని బలోపేతం చేయడానికి, ఓదార్చడానికి ప్రభువు తన పరిశుద్ధాత్మను పంపునని మరియు ప్రభువు ఇష్టానుసారులైన మనుష్యులుగా మనం మారవచ్చునని నేను వాగ్దానం చేస్తున్నాను.21

యేసు క్రీస్తు సజీవుడని మరియు ఆయన ద్వారా శత్రువు యొక్క చెడు ప్రభావాలపై మనము విజయం సాధించగలమని, మన ప్రియ పరలోక తండ్రి సమక్షంలో ఆయనతో శాశ్వతంగా జీవించడానికి అర్హత సాధించవచ్చని నా సాక్ష్యము చెప్పుచున్నాను. మీ యెడల మరియు మన మనోహరమైన రక్షకుని యెడల నాకున్న ప్రేమంతటితో ఈ సత్యములను గూర్చి సాక్ష్యమిస్తున్నాను, ఎప్పటికీ ఆయన నామమునకు మహిమ, ఘనత మరియు స్తోత్రములు చెల్లిస్తాను. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నేను ఈ విషయాలు చెప్పుచున్నాను, ఆమేన్.