ముందుకు సాగుట
ప్రభువు కార్యము స్థిరముగా ముందుకు సాగుతోంది.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క 190వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశమును మనం ప్రారంభించగా మీతో ఉండడం ఎంత ఆనందకరం! మీ గృహాలలో లేదా మీరు ఎక్కడ ఉన్నా, ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారులు మరియు ఇతర సంఘ నాయకుల సందేశాలను వినడానికి నేను మీతో చేరడం నాకెంతో ప్రీతికరమైనది.
యేసు క్రీస్తు శిష్యుల యొక్క గొప్ప ప్రపంచవ్యాప్త సమావేశంగా కలుసుకొనుటకు వీలుకల్పించే సాంకేతిక పరిజ్ఞానానికి మనం ఎంతో కృతజ్ఞతలు కలిగియున్నాము. గత ఏప్రిల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశాన్ని గతంలో జరిగిన వాటి కంటే ఎక్కువ మంది ప్రజలు చూశారు, అది మరలా జరుగుతుందనే నిరీక్షణను మేము కలిగియున్నాము.
గత కొన్ని నెలల్లో, ప్రపంచ మహమ్మారి, ఉగ్రమైన అడవి మంటలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు మన ప్రపంచాన్ని తలక్రిందులుగా చేశాయి. ఈ సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన మీలో ప్రతి ఒక్కరితో నేను దుఃఖిస్తున్నాను. మరియు ప్రస్తుతం బాధపడుతున్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను.
ఇవి ఇట్లుండగా, ప్రభువు కార్యము స్థిరముగా ముందుకు సాగుతోంది. సామాజిక దూరం, ముఖమునకు మాస్క్‌లు ధరించుట మరియు జూమ్ సమావేశాల మధ్య మనము కొన్ని పనులను భిన్నంగా, మరికొన్నిటిని మరింత సమర్థవంతంగా చేయడం నేర్చుకున్నాము. అసాధారణ సమయాలు అసాధారణమైన బహుమానాలు తెస్తాయి.
మన సువార్తికులు మరియు సువార్తసేవ నాయకులు సహాయకరముగా, హుషారుగా ఉండి, వారు నిజంగా గొప్పవారైయున్నారు. చాలా మంది సువార్తికులు తమ పనిని చేయడానికి క్రొత్త సృజనాత్మక మార్గాలను కనుగొనవలసి ఉన్నప్పటికీ, చాలా మిషన్లు మునుపటి కంటే ఎక్కువ బోధన చేస్తున్నట్లు నివేదించాయి.
మేము కొంతకాలం దేవాలయాలను మూసివేయాల్సి వచ్చింది, మరియు కొన్ని నిర్మాణ ప్రాజెక్టులు కొంతకాలం ఆలస్యం అయ్యాయి, కాని ఇప్పుడు అవన్నీ ముందుకు సాగుతున్నాయి. 2020 క్యాలెండర్ సంవత్సరంలో, మేము 20 కొత్త దేవాలయాలకు శంకుస్థాపన చేసి ఉంటాము!
కుటుంబ చరిత్ర కార్యము విశేషముగా పెరిగింది. అనేక కొత్త వార్డులు మరియు స్టేకులు సృష్టించబడ్డాయి. 150 దేశాలలో 895 ప్రాజెక్టులకు సంఘము మహమ్మారి మానవతా సహాయం అందించినట్లు నివేదించడానికి మేము సంతోషిస్తున్నాము.
అనేక గృహాలలో సువార్త అధ్యయనం పెరగడం వల్ల బలమైన సాక్ష్యాలు, కుటుంబ సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఒక తల్లి ఇలా వ్రాసింది: “మేము ప్రతి ఆదివారం జూమ్‌లో సమావేశమవుతున్నప్పుడు మా పిల్లలు, మనవరాళ్లతో చాలా సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తాము. రండి, నన్ను అనుసరించండి గురించి ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను పంచుకుంటారు. మా కుటుంబ సభ్యుల ప్రార్థనలలో మార్పు వచ్చింది, ఎందుకంటే వారికి ఏమి అవసరమో మేము బాగా అర్థం చేసుకున్నాము.”
ప్రజలుగా మనం ఈ ప్రత్యేకమైన సమయాన్ని ఆధ్యాత్మికంగా వృద్ధిచెందడానికి ఉపయోగించాలని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తును అనుసరించడానికి, క్రమం తప్పకుండా పశ్చాత్తాపపడడానికి, నేర్చుకోవడానికి మరియు పురోగతి చెందడానికి మనం ఎంచుకుంటామా లేదా అని పరీక్షింపబడడానికి మనం ఈ భూమిపై ఉన్నాము. మన ఆత్మలు పురోగతి చెందడానికి ఆశపడుతున్నాయి. నిబంధన మార్గంలో దృఢంగా ఉండడం ద్వారా మనము దానిని ఉత్తమంగా చేస్తాము.
ఈ పరిస్థితులన్నిటిలో, మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నారు! వారు మనల్ని సంరక్షిస్తున్నారు! వారు మరియు వారి పరిశుద్ధ దేవదూతలు మనల్ని కనిపెట్టుకొనియున్నారు. 1 ఇది సత్యమని నాకు తెలుసు.
తన సేవకులు ప్రసంగించడానికి ప్రభువు ప్రేరేపించిన మాటలను వినడానికి మనము సమావేశమవుతున్నప్పుడు, ప్రభువు ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. “తక్షణమైనది మరియు బలమైనది, అపవాది యొక్క సమస్త వంచన, వలలు మరియు తంత్రములను నేరుగా విభజించు దేవుని వాక్యము దానిని హత్తుకొను వారిని, … క్రీస్తు యొక్క [శిష్యులను] ఒక తిన్నని ఇరుకైన మార్గమందు నడిపించును” అని ఆయన ప్రకటించెను. 2
ఈ సర్వసభ్య సమావేశంలో ప్రకటించినట్లుగా దేవుని వాక్యాన్ని హత్తుకొనియుండుటకు మీరు ఎంచుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ పట్ల ప్రభువు యొక్క పరిపూర్ణ ప్రేమను 3 మీరు అనుభవించాలని నేను ప్రార్థిస్తున్నాను, యేసు క్రీస్తు పవిత్ర నామములో, ఆమేన్.