యేసు క్రీస్తు యొక్క స్వస్థపరచు శక్తి
ఆయన యందు విశ్వాసమును అభ్యసించి, పశ్చాత్తాపపడి, నిబంధనలు చేసి పాటించుట ద్వారా మనము యేసు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, మన విరిగిన హృదయం—దానికి కారణమేదైనప్పటికీ—అది స్వస్థపరచబడగలదు.
ఈ సంవత్సరం ఆరంభమైనప్పటి నుండి, ఎన్నో అనుకోని సంఘటనలను మనం అనుభవించాము. విశ్వవ్యాప్త మహమ్మారి కారణంగా ఏర్పడ్డ ప్రాణనష్టం, ఆదాయనష్టం అంతర్జాతీయ సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపాలు, మంటలు, వరదలు, వాతావరణానికి సంబంధించిన వినాశనాలు మనుషుల్ని నిస్సహాయులుగా, నిరాశ చెందేలా, నిరుత్సాహపడేలా చేసి, వారి జీవితాలు మళ్ళీ మామూలుగా మారతాయా అని ఆశ్చర్యపోయేలా చేసాయి.
ఏదైనా విరగడం గురించి ఒక వ్యక్తిగత వృత్తాంతాన్ని మీకు చెప్తాను.
మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, వారు పియానో తరగతులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నేను, నా భర్త రూడీ మా పిల్లలకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని కోరుకున్నాము, కానీ మా దగ్గర పియానో లేదు. క్రొత్త పియానో కొనే స్థోమత మాకు లేదు, కాబట్టి వాడిన దాని కోసం రూడీ వెదకనారంభించారు.
ఆ సంవత్సరం క్రిస్టమస్‌కి, పియానోతో ఆయన మా అందరిని ఆశ్చర్యపరిచారు, సంవత్సరాలుగా మా పిల్లలు వాయించడం నేర్చుకున్నారు.
మా అబ్బాయిలు పెద్దవారై ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు, పాత పియానో ఉపయోగించకపోవడం వలన దుమ్ము పట్టడంతో మేము దానిని అమ్మేశాము. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, మేము కొంత డబ్బు కూడబెట్టాము. ఒకరోజు, ”మనం క్రొత్త పియానో కొనే సమయం వచ్చిందనుకుంటున్నాను,” అన్నారు రూడీ.
”మనలో ఎవరూ వాయించనప్పుడు, క్రొత్త పియానో ఎందుకు కొనడం?” అని నేను అడిగాను.
“ఓహ్, కానీ దానంతట అదే వాయించే పియానోను మనం కొనుక్కోవచ్చు కదా! కీర్తనలు, టాబర్నాకిల్ గాయకబృందం పాటలు, ప్రాథమిక పాటలు, ఇంకా ఎన్నో కలిపి 4,000 లకు పైగా పాటలను వాయించేలా ఐపాడ్ ఉపయోగించి నువ్వు పియానోను ప్రోగ్రామ్ చేయవచ్చు“ అని ఆయన అన్నారు.
చెప్పాలంటే, రూడీ ఒప్పించడంలో దిట్ట.
మేము ఒక అందమైన పెద్ద పియానో కొన్నాము, కొద్దిరోజుల తర్వాత, ఇద్దరు పెద్ద, బలమైన మనుషులు దానిని మా ఇంటికి తీసుకువచ్చారు.
దానిని ఎక్కడ పెట్టాలో వారికి చూపించి, నేను పక్కకు తప్పుకున్నాను.
అది చాలా పెద్ద బరువైన పియానో, దానిని తలుపు గుండా తీసుకురావడానికి వీలుగా వాళ్ళు దాని కాళ్ళను తొలగించి, వారితోపాటు తెచ్చిన చక్రాల బల్లమీద దానిని ఒక ప్రక్కగా వంచి పెట్టారు.
మా ఇల్లు ఒక ఏటవాలు స్థలం మీద ఉంటుంది, దురదృష్టవశాత్తూ ఆ రోజు మంచు కురిసి, అంతా తడిగా జారుతూ ఉంది. ఇది ఎటు వైపు దారితీస్తున్నదో మీరు ఊహించగలరా?
ఆ ఏటవాలు పైకి వాళ్ళు పియానోను తీసుకు వస్తున్నప్పుడు, అది జారిపడి, పెద్ద శబ్దం రావడం నేను విన్నాను. చక్రాల బల్లమీద నుండి పియానో జారిపడి, మా పచ్చికబయలులో పెద్ద గుంట చేస్తూ చాలా బలంగా నేలను తాకింది.
“అయ్యో, మీకేం కాలేదుగా?” నేను అడిగాను.
అదృష్టవశాత్తూ వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఒకరినొకరు చూసుకొన్నప్పుడు, వాళ్ళు కళ్ళు పెద్దవయ్యాయి, తర్వాత నా వైపు చూసి, “మమ్మల్ని క్షమించండి. మేము దీనిని తిరిగి దుకాణానికి తీసుకువెళ్ళి, మా మేనేజరుతో మీకు ఫోను చేయిస్తామని” చెప్పారు.
వెంటనే క్రొత్త పియానో పంపే ఏర్పాటు చేస్తామని మేనేజరు రూడీతో మాట్లాడుతున్నాడు. రూడీ దయ, క్షమాగుణం గలవారు, దెబ్బతిన్న దానిని బాగుచేసి, అదే పియానోను తిరిగి పంపినా ఫరవాలేదని మేనేజరుతో చెప్పారు, కానీ మాకు ఒక క్రొత్త దానిని పంపిస్తామని మేనేజరు పట్టుబట్టాడు.
“అది పెద్దగా దెబ్బతినలేదు. దానిని బాగుచేసి తిరిగి తీసుకొని రండి,” అని రూడీ చెప్పారు.
“చెక్క విరిగిపోయింది, ఒకసారి చెక్క విరిగితే, అది ఎన్నడూ మునుపటిలా శబ్దం చేయలేదు. మీకు క్రొత్తది పంపిస్తాము,” అని మేనేజరు చెప్పాడు.
సహోదరీ సహోదరులారా, మనమందరం ఈ పియానో వలె లేమా, కొద్దిగా విరిగి, పగుళ్ళు వచ్చి, దెబ్బతిని, మళ్ళీ ఎన్నడూ మునుపటిలా ఉండలేమని భావించడం లేదా? అయినప్పటికీ, ఆయన యందు విశ్వాసమును అభ్యసించి, పశ్చాత్తాపపడి, నిబంధనలు చేసి పాటించుట ద్వారా మనము యేసు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, మన విరిగిన హృదయం—దానికి కారణమేదైనప్పటికీ—అది స్వస్థపరచబడగలదు. మన జీవితాల్లోకి రక్షకుని యొక్క స్వస్థపరచు శక్తిని ఆహ్వానించే ఈ ప్రక్రియ, మనము ఇంతకుముందు ఉన్నట్లు మనల్ని పునర్నిర్మించడమే కాకుండా, మనము ఎన్నడూ లేనంత మంచిగా మనల్ని చేస్తుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనమందరం చక్కదిద్దబడి, పరిపూర్ణంగా చేయబడి, సరికొత్త పియానో అందమైన శబ్దాలు ధ్వనించినట్లుగా, మన ఉద్దేశమును నెరవేరుస్తామని నాకు తెలుసు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “తీవ్రమైన శ్రమలు మనకు కలిగినప్పుడు, అది దేవునియందు మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, కష్టపడి పనిచేయడానికి, ఇతరులకు సేవ చేయడానికి గల సమయము. అప్పుడు విరిగిన మన హృదయాలను ఆయన స్వస్థపరుస్తారు. వ్యక్తిగత శాంతిని, ఓదార్పును ఆయన మనపై క్రుమ్మరిస్తారు. ఆ గొప్ప వరములు మరణం చేత కూడా నాశనం చేయబడవు.” 1
యేసు చెప్పారు:
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
“ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి” (మత్తయి 11:28–30).
ఆయన యొద్దకు రావడం ద్వారా విరిగిన దానిని స్వస్థపరచడానికి మనకు యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉండాలి. “యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉండడమంటే అర్థము ఆయనపై పూర్తిగా ఆధారపడడం—అనంతమైన ఆయన శక్తియందు … ప్రేమ యందు నమ్మికయుంచడం. ఆయన బోధలను నమ్మడం కూడా అది కలిగియున్నది. దాని అర్థము, మనకు అన్ని విషయాలు అర్థం కాకపోయినా ఆయనకు అర్థమవుతాయని నమ్మడం. మన బాధలు, శ్రమలు, రోగాలన్నిటిని ఆయన అనుభవించారు గనుక మన అనుదిన కష్టాలను జయించడానికి మనకెలా సహాయపడాలో ఆయనకు తెలుసు.” 2
మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు, “మనం ఆనందం, శాంతి, ఓదార్పుతో నింపబడగలము. జీవితానికి సంబంధించి [కష్టమైనవి, సవాళ్ళతో కూడినవి] అన్నీ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడగలవు.” 3 “ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36) అని ఆయన మనకు ఉపదేశించారు.
మోర్మన్ గ్రంథములో ఆల్మా మరియు అతని జనులమీద మోపబడిన భారములచేత వారు నలుగగొట్టబడినప్పుడు, జనులు ఉపశమనం కోసం అర్థించారు. ప్రభువు వారి భారములను తీసివేయలేదు; బదులుగా వారికి ఆయన ఇలా వాగ్దానమిచ్చారు:
“మీ భుజములపై నున్న భారములను నేను సడలించెదను, అందువలన మీరు దాస్యములో ఉన్నప్పుడు కూడా వాటిని మీ వీపులపైన అనుభవించరు. ఇకమీదట మీరు నాకు సాక్షులుగా నిలబడునట్లు, నేను ప్రభువైన దేవుడనని, నా జనులను వారి శ్రమలలో దర్శించుదునని మీరు నిశ్చయముగా తెలుసుకొనునట్లు నేను దీనిని చేసెదను.
“ఇప్పుడు ఆల్మా, అతని సహోదరులపై ఉంచబడిన భారములు తేలిక చేయబడెను. ముఖ్యముగా వారు తమ భారములను సునాయాసముగా భరించునట్లు ప్రభువు వారిని బలపరిచెను మరియు వారు సంతోషముతోను సహనముతోను ప్రభువు యొక్క చిత్తమంతటికి లోబడిరి” (మోషైయ 24:14–15).
స్వస్థపరచడానికి, భారములు తేలిక చేయడానికి రక్షకునికి గల సామర్థ్యము గురించి ఎల్డర్ టాడ్ ఆర్. కాలిస్టర్ ఇలా బోధించారు:
“మనము రక్షకుని యొక్క సహాయపడే శక్తిని పొందగలుగుట ప్రాయశ్చిత్తము యొక్క దీవెనలలో ఒకటి. ప్రభువు యొక్క స్వస్థపరచు, నిశ్చలమైన ప్రభావం గురించి యెషయా పదేపదే చెప్పాడు. రక్షకుడు ‘దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉన్నారని’ (యెషయా 25:4) అతడు సాక్ష్యమిచ్చాడు. ‘దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు’ (యెషయా 61:2), ‘ప్రతివాని ముఖము మీది భాష్పబిందువులను తుడిచివేయుటకు’ (యెషయా 25:8; ప్రకటన 7:17 కూడా చూడండి); ‘వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు’ (యెషయా 57:15); ‘నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు’ (యెషయా 61:1; లూకా 4:18; కీర్తనలు 147:3 కూడా చూడండి) రక్షకుడు శక్తి కలిగియున్నారు. ఆయన సహాయపడే శక్తి ఎంత విస్తారమైనదనగా ఆయన ‘బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును’ (యెషయా 61:3) వారికిచ్చునని బాధపడేవారి గురించి యెషయా ప్రకటించాడు.
“ఈ వాగ్దానాల మూలంగా మనం గొప్ప నిరీక్షణను కలిగియుండగలము! … ఆయన ఆత్మ స్వస్థపరుస్తుంది; అది శుద్ధిచేస్తుంది; అది ఓదార్పునిస్తుంది; అది నిరాశ చెందిన హృదయాలకు క్రొత్త జీవాన్నిస్తుంది. జీవితంలో అందవిహీనమైన, పాడైన, విలువలేని వాటన్నిటిని శ్రేష్టమైన, మహిమకరమైన ప్రకాశములుగా మార్చే శక్తి దానికి కలదు. మర్త్యత్వపు బూడిదెను నిత్యత్వపు పూదండగా మార్చే శక్తి ఆయన కలిగియున్నాడు.” 4
యేసు క్రీస్తు మన ప్రియమైన రక్షకుడని, విమోచకుడని, గొప్ప స్వస్థత కలుగజేయువాడని, మన నమ్మకమైన స్నేహితుడని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము ఆయనపై ఆధారపడినట్లయితే, ఆయన మనల్ని స్వస్థపరుస్తారు, తిరిగి మనల్ని పరిపూర్ణం చేస్తారు. ఇది ఆయన సంఘమని, మహాప్రభావముతోను మహిమతోను పరిపాలించడానికి ఈ భూమి మీదకు మరలా తిరిగి రావడానికి ఆయన సిద్ధపడుతున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.