మనము దీనితో వారిని నిరూపిద్దాం
మన దేవుడైన ప్రభువు మనల్ని ఆజ్ఞాపించు అన్ని విషయాలను చేయగలుగుటకు, సిద్ధపడుటకు, సమ్మతించుటకు మనల్ని మనం నిరూపించుటకు సమయం ఇదే.
ఈ సర్వ సభ్య సమావేశము కొరకు సిద్ధపాటులో నా మనస్సు మరియు హృదయములో వచ్చిన ఆలోచనలను, భావనలను పంచుకొన్నప్పుడు మనందరి కొరకు పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోసం నేను ప్రార్ధిస్తున్నాను.
పరీక్షల యొక్క ప్రాముఖ్యత
పూర్తి-కాల సంఘ సేవ కొరకు నా పిలుపుకు ముందు రెండు దశాబ్దాలకు పైగా, విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుడిగా మరియు కార్యనిర్వహాకునిగా నేను పనిచేసాను. ఒక ఉపాధ్యాయునిగా నా ప్రధాన బాధ్యత ఏమనగా విద్యార్ధులు వారికై వారు ఎలా నేర్చుకోవాలో సహాయపడుట. నా పని యొక్క ముఖ్యమైన అంశము ఏమనగా పరీక్షలు ఏర్పాటు చేయటం, విద్యార్ధులు వ్రాసిన దానిని సరిదిద్ది మార్కులు వేయడం, పరీక్షలపై విద్యార్ధి పనితీరు గురించి అభిప్రాయాన్ని అందించడం. వ్యక్తిగత అనుభవము నుండి మీకు ఇదివరకే తెలిసినట్లుగా, విద్యార్ధుల శిక్షణ ప్రక్రియలో సాధారణంగా పరీక్షలు అనేవి ఎక్కువగా ఇష్టపడే భాగం కాదు!
కానీ నేర్చుకోవటానికి నియమిత కాల పరీక్షలు ఖచ్చితంగా అవసరం. ఒక నిర్దిష్ట విషయం గురించి మనకు వాస్తవంగా తెలిసిన వాటితో మనం తెలుసుకోవలసిన వాటిని పోల్చడానికి ఒక సమర్థవంతమైన పరీక్ష మనకు సహాయపడుతుంది; ఇది మన అభ్యాసం మరియు అభివృద్ధిని అంచనా వేయగల ప్రమాణాన్ని కూడా అందిస్తుంది.
అదేవిధంగా, మర్త్యత్వము యొక్క పాఠశాలలో పరీక్షలు మన నిత్య పురోగతికి కీలకమైన అంశం. అయినప్పటికీ, ఆసక్తికరంగా, పరీక్ష అనే మాట ఆంగ్లములోని ప్రమాణ కార్యముల లేఖన గ్రంధములో ఒక్కసారి కూడా కనుగొనబడలేదు. బదులుగా నిరూపించు, పరీక్షించు, మరియు ప్రయత్నించు వంటి పదాలు మన పరలోక తండ్రి యొక్క సంతోషము యొక్క నిత్య ప్రణాళికను గూర్చి అవగాహన, దానిని గూర్చి మన ఆత్మీయ జ్ఞానమును మరియు దానికి సమర్పణను తగిన విధంగా రుజువు చేసే వేర్వేరు నమూనాలను, రక్షకుని ప్రాయశ్చిత్తఃము యొక్క దీవెనల కొరకు వెదకుటకు మన సమర్ధతను వర్ణించడానికి ఉపయోగించబడినవి.
రక్షణ ప్రణాళికను రచించిన ఆయన ప్రాచీన మరియు ఆధునిక లేఖనములో నిరూపించు, పరీక్షించు, మరియు ప్రయత్నించు వంటి పదాలను ఉపయోగిస్తూ మన మర్త్య శిక్షణా కాలము యొక్క ముఖ్య ఉద్దేశమును వివరించాడు. “మరియు ప్రభువైన వారి దేవుడు ఆజ్ఞాపించే పనులన్నీ వారు చేయుదురేమో అని చూచుటకు దీనితో మనం వారిని నిరూపించెదము.” 1
కీర్తనకారుడైన దావీదు ప్రార్థనను గమనించండి:
ప్రభువా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము.
“నీ కృపను నా కన్నుల యెదుట నుంచుకొనియున్నాను, నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.” 2
1833 లో ప్రభువు ప్రకటించాడు, “కాబట్టి మీ శత్రువులను గూర్చి భయపడకుడి, ఏలయనగా మీరు యోగ్యులుగా కనుగొనబడునట్లు, మరణమును లెక్కచేయక నా నిబంధనలో మీరు నిలుతురో లేదోనని అన్ని విషయములలో మిమ్ములను పరీక్షించుటకు నేను నా హృదయములో శాసనమును వ్రాసియున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” 3
ప్రస్తుత-దిన నిరూపణ మరియు పరీక్ష
2020 సంవత్సరం ప్రపంచ మహమ్మారి ద్వారా గుర్తించబడింది, అది మనల్ని అనేక విధాలుగా నిరూపించి, పరిశోధించి మరియు పరీక్షించింది. వ్యక్తులు మరియు కుటుంబాలుగా కష్టమైన అనుభవాలు మాత్రమే మనకు బోధించగల విలువైన పాఠాలను మనము నేర్చుకోవాలని నేను ప్రార్ధిస్తున్నాను. మనమందరం “దేవుని యొక్క గొప్పతనమును” “ఆయన [మన ] బాధలను [మన] లాభము కొరకు ప్రతిష్ఠించును” అనే సత్యమును మరింత సంపూర్ణంగా అంగీకరిస్తారని కూడా నేనాశిస్తున్నాను. 4
అవి ఏమైనప్పటికినీ, మన జీవితాలలో నిరూపించే, పరీక్షించే ప్రయత్నాలను మనము ఎదుర్కొన్నప్పుడు రెండు ముఖ్యమైన సూత్రాలు మనల్ని నడిపించి, బలపరుస్తాయి: (1) సిద్ధపాటు సూత్రము, మరియు (2) క్రీస్తునందు నిలకడతో ముందుకు సాగి వెళ్లే సూత్రము.
నిరూపించుట మరియు సిద్ధపాటు
రక్షకుని యొక్క శిష్యులుగా, మనము “అవసరమైన ప్రతిదానిని సిద్ధపరచుకొనుటకు; ఒక మందిరమును అనగా ఒక ప్రార్థనామందిరమును, ఒక ఉపవాసమందిరమును, ఒక విశ్వాసమందిరమును, ఒక అభ్యాసమందిరమును, ఒక మహిమమందిరమును, ఒక క్రమమైన మందిరమును, ఒక దేవుని మందిరమును స్థాపించుటకు” 5 మనము ఆజ్ఞాపించబడ్డాము.
“మీరు సిద్ధపడిన యెడల మీరు భయపడరు” అని కూడా వాగ్దానమివ్వబడ్డాము.
“శత్రువు యొక్క శక్తిని మనము తప్పించుకొనునట్లు, మచ్చలేని, నిందలేని నీతిమంతులైన జనులుగా ఆయనకు సేకరించబడెదము.” 6
ఈ లేఖనాలు మన జీవితాలను, గృహాలను భౌతికంగా మరియు ఆత్మీయంగా రెండు విధాలా క్రమపరచుకోవడానికి, సిద్ధపరుచుకోవడానికి పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తాయి. మర్త్యత్వము యొక్క నిరూపించే అనుభవాల కొరకు సిద్ధపడుటకు మన ప్రయత్నాలు మేధోపరంగా, శారీరక, ఆధ్యాత్మిక మరియు సామాజిక సంసిద్ధతల యొక్క —మిశ్రితమైన సమతుల్యతతో “జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లిన” 7 రక్షకుని యొక్క మాదిరిని అనుసరించాలి.
కొన్ని నెలల క్రితం ఒక మధ్యాహ్నకాలం, సూజన్, నేను మా ఆహార నిల్వను, అత్యవసర సరఫరాలను పట్టిక చేసాము. ఆ సమయమందు, కోవిద్ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్నది, మరియు యూటాలోని మా గృహాన్ని పలు భూకంపాలు కదిలించాయి. ఊహించని సవాళ్ల కొరకు సిద్ధపడుట గురించి ప్రవచనాత్మక సలహాను అనుసరించటానికి మా వివాహపు ప్రారంభ దినాల నుండి మేము పని చేసాము, ఆవిధంగా వైరస్, మరియు భూకంపాల మధ్యలో మా సిద్ధపాటు స్థాయిని “పరిశోధించుట” మంచిదైన, సమయానుకూలమైన విషయంగా కనబడింది. ఈ ప్రకటించబడని పరీక్షలపై మా శ్రేణులను కనుగొనాలని మేము కోరాము.
మేము చాలా నేర్చుకున్నాము. అనేక విషయాలలో, మా సిద్ధపాటు కార్యము సరిగా ఉన్నది. అయినప్పటికిని, మిగిలిన కొన్ని విషయాలలో మెరుగుదల అవసరమైంది ఎందుకనగా మేము ప్రత్యేక అవసరాలను సమయానుకూల విధానాలలో గుర్తించలేదు మరియు పరిష్కరించలేదు.
మేము చాలా నవ్వుకున్నాము. ఉదాహరణకు, మూలనున్న అల్మారాలోని ఆహారనిల్వలో దశాబ్దాలుగా ఉంచబడిన ఆహారపదార్ధాలను మేము కనుగొన్నాము. స్పష్టముగా, మరొక ప్రపంచవ్యాప్త మహమ్మారిని విప్పుతామనే భయంతో కొన్ని డబ్బాలను తెరిచి పరిశీలించడానికి మేము భయపడ్డాము! కానీ మేము ప్రమాదకరమైన పదార్ధాలను సరిగా పారవేసామని, ప్రపంచానికి ఆరోగ్య గండం తొలగించబడిందని తెలుసుకొనుటకు మీరు సంతోషించవచ్చు.
కొందరు సంఘ సభ్యులు అత్యవసర ప్రణాళికలు మరియు సరఫరాలు, ఆహార నిల్వ మరియు 72-గంటలకు కావాల్సిన వస్తు సామగ్రి ఇకపై ముఖ్యమైనవి కాదని అభిప్రాయపడ్డారు, ఎందుకంటే సర్వసభ్య సమావేశంలో వీటిని, వీటి సంబంధిత విషయాల గురించి ఇటీవల సహోదరులు విస్తృతంగా మాట్లాడలేదు. కానీ సిద్ధపడమనే పునరావృతమైన బోధనలు దశాబ్దాలుగా సంఘ నాయకుల చేత ప్రకటించబడినవి. కాలక్రమేణా ప్రవచనాత్మక సలహా యొక్క స్థిరత్వం ఒక శక్తివంతమైన మరియు స్పష్టమైన సందేశాన్ని సృష్టిస్తుంది మరియు ఈ పునరావృతమైన సందేశాలు ఒక్కసారి ఇవ్వబడే హెచ్చరిక కంటే మిక్కిలి ముఖ్యమైనవి.
సవాళ్లతో కూడిన సమయాలు భౌతిక సిద్ధపాటులోని అసమర్ధతలను బయల్పరచినట్లుగా, క్రమం కాని ఆత్మీయ యాధృచ్చికత, నిర్లక్ష్యముల వ్యాధులు కూడా కష్టమైన శ్రమలందు వాటి మిక్కిలి హానికరమైన ప్రభావాలను కలిగించును. ఉదాహరణకు, పదిమంది కన్యకల ఉపమానములో సిద్ధపాటును ఆలక్ష్యం చేయుట విఫలమైన నిరూపణకు నడిపిస్తుందని మనము నేర్చుకున్నాము. పెండ్లి కుమారుని రాకడ దినమున వారికి ఇవ్వబడిన పరీక్ష కోసం తగినట్లుగా సిద్ధపడటానికి బుద్ధిలేని కన్యకలు ఎలా విఫలమయ్యారో జ్ఞాపకం చేసుకోండి.
“బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని, తమతో పాటు నూనెను తీసికొనిపోలేదు:
“కానీ బుద్ధిగల వారు తమ దివిటీలతో పాటు సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి. …
“అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.
“అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి.
“బుద్ధిలేని ఆ కన్యకలు లేచి మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారి నడిగిరి.
“అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకుపోయి కొనుక్కొనుడని చెప్పిరి.
“వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి: అంతట తలుపు వేయబడెను.”
“ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడిగెను.” 8
“అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” 9
కనీసము ఈ పరీక్షలో, ఐదుగురు బుద్ధిలేని కన్యకలు వినువారుగా మాత్రమే గాని, వాక్యప్రకారము ప్రవర్తించువారుగా లేరని వారికై వారు నిరూపించుకున్నారు. 10
నాకొక స్నేహితుడున్నాడు, అతడు లా పాఠశాలలో శ్రద్ధగా, కష్టపడి పనిచేసే విద్యార్ధి. సెమిస్టరు సమయంలో, శామ్ తాను చేరిన ప్రతీ కోర్సు కోసం తన నోట్సులనుండి సమీక్షించి, సంక్షిప్తపరచి, నేర్చుకోవడానికి ప్రతీరోజు సమయాన్ని వెచ్చించాడు. ప్రతీ వారాంతము మరియు ప్రతీ నెల తన తరగతులన్నిటి కోసం అదే మాదిరిని అతడు అనుసరించాడు. అతడి విధానం అతడు వివరాలను కంఠస్తము చేయటానికి మాత్రమే కాక చట్టమును నేర్చుకోవడానికి సాధ్యపరచింది. ముగింపు పరీక్షలు సమీపించినప్పుడు, శామ్ సిద్ధపడియున్నాడు. వాస్తవానికి, ముగింపు పరీక్ష సమయం తన చట్టపరమైన శిక్షణలో తక్కువ ఒత్తిడిగల భాగాలలో ఒకటిగా అతడు కనుగొన్నాడు. ప్రభావవంతమైన, సమయానుకూలమైన సిద్ధపాటు తరువాత విజయవంతమైన నిరూపణ జరుగును.
తన న్యాయ విద్య పట్ల శామ్ యొక్క విధానం పెరుగుదల మరియు అభివృద్ధి కోసం ప్రభువు యొక్క ప్రాధమిక నమూనాలలో ఒకదానిని ఎత్తి చూపిస్తుంది. “ప్రభువైన దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు: “నేను నరుల సంతానమునకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను, సూత్రము వెంబడి సూత్రమును, ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చెదను; నా సూక్తులను ఆలకించువారు, నా సలహాకు చెవియొగ్గువారు ధన్యులు, వారు జ్ఞానమును నేర్చుకొందురు; ఏలయనగా స్వీకరించువానికి నేను ఇంకా అధికంగా ఇచ్చెదను” 11
“[మన] ప్రవర్తనలను పరిగణించుటకు,” 12 “[మనము] విశ్వాసములో ఉన్నామో లేదో పరిశీలించుటకు; [మనలను] [మనము] నిరూపించుకొనుటకు మనలో ప్రతీఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను.” 13 ఈ ఇటీవలి నెలల్లో జీవనశైలి సర్దుబాట్లు, పరిమితుల గురించి మనం ఏమి నేర్చుకున్నాము? ఆత్మీయంగా, శారీరకంగా, సామాజికంగా, మానసికంగా మరియు మేధోపరంగా మన జీవితంలో మనం ఏమి మెరుగుపరుచుకోవాలి? మన దేవుడైన ప్రభువు మనల్ని ఆజ్ఞాపించు అన్ని విషయాలను చేయగలుగుటకు, సిద్ధపడుటకు, సమ్మతించుటకు మనల్ని మనం నిరూపించుటకు ఇదే సమయం.
నిరూపించుట మరియు ముందుకు సాగుట
ఒక ప్రమాదంలో మరణించిన యువ మిషనరీ అంత్యక్రియలకు ఒకసారి నేను హాజరయ్యాను. కార్యక్రమంలో మిషనరీ తండ్రి మాట్లాడాడు మరియు ప్రియమైన బిడ్డనుండి ఊహించని మర్త్య వేర్పాటు యొక్క హృదయవేదనను వివరించాడు. అటువంటి సంఘటన కొరకు కారణాలు లేక సమయాన్ని తాను వ్యక్తిగతంగా గ్రహించలేదని అతడు నిజాయితీగా, సూటిగా ప్రకటించాడు. కానీ తన బిడ్డ మరణము కొరకు కారణాలు మరియు సమయాన్ని దేవుడు ఎరుగునని తాను ఎరుగుదునని— ఆ జ్ఞానముతో తాను తృప్తి చెందానని ఈ మంచి వ్యక్తి ప్రకటించుట నేను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకుంటాను అతడు, అతడి కుటుంబము విచారకరంగా ఉన్నప్పటికిని, బాగానే ఉంటామని; వారి సాక్ష్యములు దృఢముగా మరియు స్థిరముగా నిలిచియున్నవని అతడు సమూహానికి తెలియజేసాడు. ఈ ప్రకటనతో అతడు తన ప్రసంగాన్ని ముగించాడు, “యేసు క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించినంత వరకు, మా కుటుంబము పూర్తిగా ఒడంబడిక చేసుకొనియున్నదని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. మేమంతా ఒడంబడిక చేసుకున్నాము.”
ప్రియమైన వారిని కోల్పోవుట చాలా-బాధాకరమైనది, కష్టమైనదైనప్పటికిని, ఈ విశ్వాసులైన కుటుంబసభ్యులు తాము బాధింపబడిన విషయాల ద్వారా నిత్య ప్రాముఖ్యతను గూర్చిన పాఠాలను నేర్చుకున్నట్లు నిరూపించుటకు ఆత్మీయంగా సిద్ధపడ్డారు. 14
విశ్వాసము మూర్ఖత్వము లేక మతన్మోదము కాదు. బదులుగా, అది మన రక్షకునిగా యేసు క్రీస్తు నందు, ఆయన నామమందు, ఆయన వాగ్దానములందు మన విశ్వాసమునుంచుట, నమ్ముట. మనము “క్రీస్తునందు ఒక నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి మరియు దేవుని యొక్క మరియు మనుష్యులందరి యొక్క ప్రేమను కలిగి ముందుకు సాగినప్పడు” 15 మన పరిమితమైన మర్త్య సామర్ధ్యానికి మించి విస్తరించి ఉన్న నిత్య దృక్పథం మరియు దృష్టితో దీవించబడతాము. మనము “పరిశుద్ధ స్థలములలో కలిసి సమావేశమగుటకు” 16 సాధ్యము చేయబడతాము మరియు “ప్రభువు వచ్చు దినము వరకు, కదలకయుండెదము.” 17
నేను ఐడహో- బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయ అధ్యక్షునిగా సేవ చేస్తుండగా, 1998 డిసెంబరులో మా వారాంతపు భక్తి కూడికలలో ప్రసంగించడానికి ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ కళాశాల ప్రాంగణానికి వచ్చారు. ఆయన తన సందేశాన్ని ఇవ్వకముందు ఎల్డర్ హాలండ్‌ను కలుసుకొని, మాట్లాడటానికి విద్యార్ధుల గుంపును సూజన్, నేను ఆహ్వానించాము. మేము కలిసియున్న సమయం ముగుస్తున్నప్పుడు, నేను ఎల్డర్ హాలండ్‌ను అడిగాను, “ఈ విద్యార్ధులకు మీరు ఒక్కమాటలో బోధించగల విషయం ఏమిటి?” అని.
ఆయన సమాధానమిస్తూ:
“మనము రెండు వ్యతిరేక నమ్మకాలలో ఒకదాని వైపుకు గొప్ప కదిలికను చూస్తున్నాము. కడవరి-దిన పరిశుద్ధులైన మనకు మధ్యలో ఉండే అవకాశం తీసివేయబడుతుంది. రహదారి మధ్యభాగం ఉపసంహరించబడుతుంది.
“మీరు ఒక నది ప్రవాహంలో తేలుతూ పోతే, మీరు ఎక్కడికో వెళతారు. ప్రవాహము మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతుందో అక్కడికి మాత్రమే మీరు వెళతారు. మన నమ్మకాలలో జనాదరణ పొందిన దానిని లేదా తేలికైన వాటిని అనుసరించడం మనకు సముచితం కాదు.
“ఎంపికలు చేయబడాలి. ఎంపిక చేయకపోవటం ఒక ఎంపిక. ఎంపిక చేయడం ఇప్పుడు నేర్చుకొనండి.”
పెరుగుతున్న వ్యతిరేక నమ్మకాల గురించి ఎల్డర్ హాలండ్ యొక్క ప్రకటన నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పటి నుండి 22 సంవత్సరాల సామాజిక పోకడలు, సంఘటనల ద్వారా ప్రవచనాత్మకంగా నిరూపించబడింది. ప్రభువు మరియు లోకము యొక్క విధానముల మధ్య విస్తరించిన విభేధమును ముందుగా చెప్పుచు, మనము లోక విషయాలు, అభిప్రాయాలలో పాల్గొంటూ, ఇంకా పునఃస్థాపించబడిన సంఘములో భాగముగా ఉండలేమని ఎల్డర్ హాలండ్ హెచ్చరించారు. ప్రభువు యొక్క ఈ సేవకుడు రక్షకుని యొక్క సమర్పించబడిన శిష్యులుగా మారమని, ఎంపిక చేయమని, సిద్ధపడమని యువకులను ప్రోత్సహిస్తున్నారు. ఆయన వారిని సిద్ధపడుటకు, ముందుకు సాగివెళ్లుటకు, జీవితపు శ్రమలు, పరీక్షలు వచ్చే వరకు వారి జీవితంలో కొనసాగుతూ, వారు సరైనదాన్ని ఎన్నుకుంటామని నిరూపించుకోమని వారికి సహాయపడుతున్నారు.
వాగ్దానము మరియు సాక్ష్యము
మనల్ని మనం నిరూపించుకొనే ప్రక్రియ పరలోక తండ్రి యొక్క గొప్ప సంతోష ప్రణాళికలో ఒక ప్రధానమైన భాగము. మనము సిద్ధపడి, రక్షకునియందు విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు, మర్త్యత్వము యొక్క ముగింపు పరీక్షలో మనమందరం అదే శ్రేణిని పొందుతామని నేను వాగ్దనము చేస్తున్నాను: “భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యాజమానుని సంతోషములో పాలు పొందుము.” 18
నిత్యుడైన తండ్రి మన తండ్రియని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు ఆయన అద్వితీయ కుమారుడు మరియు సజీవుడు, మన రక్షకుడు, విమోచకుడు. ఈ సత్యాలను గూర్చి నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.