నీతియందును, ఐక్యతయందును హృదయములు ముడివేయబడెను
మన సంఘ చరిత్రలో ఈ 200 సంవత్సరాల ప్రాముఖ్యమైన సమయములో, నీతిగా జీవించడానికి మరియు మునుపెన్నడూ లేని విధంగా ఐక్యంగా ఉండడానికి సంఘ సభ్యులుగా మనం కట్టుబడి ఉందాం.
నీతి మరియు ఐక్యత చాలా ప్రాముఖ్యమైనవి. 1 జనులు హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించినప్పుడు, ఆయనవలె మారడానికి నీతియుక్తముగా ప్రయత్నించినప్పుడు, సమాజంలో తక్కువ కలహం, వివాదం ఉంటాయి. ఎక్కువ ఐక్యత ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఉన్న నిజమైన వృత్తాంతమంటే నాకెంతో ఇష్టము.
పరిశుద్ధులు నావూ నుండి పారిపోవలసి వచ్చినప్పుడు, మన విశ్వాసమునకు చెందని యువకుడిగా జనరల్ థామస్ ఎల్. కేన్ వారికి సహాయం చేసి, కాపాడెను. అతడు చాలా సంవత్సరాలు సంఘమునకు న్యాయవాదిగా పనిచేశాడు. 2
1872 లో జనరల్ కేన్, ప్రతిభావంతురాలైన అతని భార్య ఎలిజబెత్ వుడ్ కేన్ మరియు వారి ఇద్దరు కుమారులు పెన్సిల్వేనియాలోని వారి ఇంటి నుండి సాల్ట్ లేక్ సిటీకి వెళ్ళారు. వారు యూటాలోని సెయింట్ జార్జ్‌కు దక్షిణాన ఒక పర్వతారోహణములో బ్రిగం యంగ్ మరియు అతని సహచరులతో కలిసి ప్రయాణించారు. ఎలిజబెత్ మొట్టమొదట యూటాను దర్శించినప్పుడు ఆమె మహిళల గురించి సందేహాలను కలిగియుంది. ఆమె నేర్చుకున్న కొన్ని విషయాలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఉదాహరణకు, స్త్రీకి జీవనోపాధిని ఇవ్వగల ఏ వృత్తికైనా సరే యూటాలో వారి కొరకు మార్గం తెరువబడి ఉందని ఆమె కనుగొంది. 3 స్థానిక అమెరికన్ల పట్ల సంఘ సభ్యులు దయ మరియు అవగాహన కలిగి ఉన్నారని ఆమె గుర్తించింది. 4
ఈ పర్యటనలో వారు ఫిల్మోర్‌లో థామస్ ఆర్. మరియు మెటిల్డా రాబిసన్ కింగ్ ఇంటి వద్ద బస చేశారు. 5
అధ్యక్షులు యంగ్ మరియు ఆయన బృందం కోసం మెటిల్డా భోజనం సిద్ధం చేస్తున్నప్పుడు, ఐదుగురు అమెరికన్ ఇండియన్లు గదిలోకి వచ్చారని ఎలిజబెత్ రాశారు. ఆహ్వానించబడనప్పటికీ, వారు బృందములో చేరాలని ఆశించినట్లు స్పష్టమైంది. సహోదరి కింగ్ వారితో “వారి భాషాశైలిలో” మాట్లాడారు. వారు ఆహ్లాదకరమైన ముఖారవిందాలతో వారి దుప్పట్లతో క్రింద కూర్చున్నారు. “మీ అమ్మ ఆ మనుష్యులతో ఏమి చెప్పింది…?” అని కింగ్ పిల్లలలో ఒకరిని ఎలిజబెత్ అడిగింది.
“‘ఈ అపరిచితులు మొదట వచ్చారు, నేను వారికి మాత్రమే వండాను; కానీ మీ భోజనం ఇప్పుడు పొయ్యిమీద తయారవుతూ ఉంది, అది సిద్ధమైన వెంటనే నేను మిమ్మల్ని పిలుస్తాను,‘ అని ఆమె చెప్పిందని” మెటిల్డా కుమారుడు సమాధానం ఇచ్చాడు.
“ఆమె నిజంగా అలా చేస్తుందా, లేదా వంటగదిలో మిగిలిపోయిన ఆహారాన్ని ఇస్తుందా?” అని ఎలిజబెత్ అడిగింది. 6
“అమ్మ మీకు వడ్డించినట్లే వారికి వడ్డిస్తుంది మరియు ఆమె బల్ల వద్ద వారికి స్థానం ఇస్తుంది” అని మెటిల్డా కుమారుడు సమాధానమిచ్చాడు.
ఆమె చెప్పినట్లుగానే చేసింది, మరియు “వారు పద్దతిగా భోంచేసారు.” ఆతిధ్యమివ్యడంలో ఆమె తన అంచనాలకు మించిపోయిందని ఎలిజబెత్ వివరించింది. 7 బాహ్య లక్షణాలలో ప్రజలు భిన్నంగా ఉన్నప్పటికీ వారిని గౌరవ మర్యాదలతో చూచినప్పుడు ఐక్యత పెరుగుతుంది.
నాయకులుగా మనము, గతంలో అన్ని సంబంధాలు పరిపూర్ణంగా ఉన్నాయని, అన్ని ప్రవర్తనలు క్రీస్తులాంటివి లేదా అన్ని నిర్ణయాలు న్యాయమైనవి అనే భ్రమలో లేము. అయినప్పటికీ, మనమందరము పరలోకమందున్న మన తండ్రి పిల్లలము అని మన విశ్వాసము బోధిస్తుంది మరియు మనము ఆయనను, మన రక్షకుడు ఆయన కుమారుడునైన యేసు క్రీస్తును ఆరాధిస్తాము. మన కోరిక ఏమిటంటే, మన హృదయములు, మనస్సులు నీతియందు, ఐక్యతయందు ముడివేయబడి, మనము వారితో ఏకమైయుండడమే. 8
నీతియుక్తత అనే పదం అనేక అర్థాలను కలిగియున్నప్పటికీ, అది ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను పాటించడం అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. 9 ఇది నిబంధన మార్గాన్ని కలిగియున్న పరిశుద్ధ విధులకు మనల్ని అర్హులుగా చేసి, మన జీవితాలకు నడిపింపునిచ్చే ఆత్మను కలిగియుండునట్లు మనల్ని ఆశీర్వదిస్తుంది. 10
నీతిమంతులుగా ఉండుట అనేది మన జీవితాలలో మనలో ప్రతి ఒక్కరు ఈ సమయంలో ప్రతి దీవెనను కలిగియుండడంపై ఆధారపడి ఉండదు. మనము వివాహం చేసుకోకపోవచ్చు లేదా పిల్లలతో ఆశీర్వదించబడకపోవచ్చు లేదా ఇప్పుడు ఇతర ఆశీర్వాదాలను పొందలేకపోవచ్చు. కానీ, విశ్వాసపాత్రులైన నీతిమంతులు “దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు” అని ప్రభువు వాగ్దానం చేశారు. 11
ఐక్యత అనే పదం కూడా అనేక అర్థాలను కలిగియుంది, కానీ చాలా ఖచ్చితంగా దేవుడిని ప్రేమించడం మరియు మన పొరుగువారిని ప్రేమించడం అనే మొదటి మరియు రెండవ గొప్ప ఆజ్ఞలను ఉదహరిస్తుంది. 12 వారి హృదయములు మరియు మనస్సులు “ఐక్యతతో ముడివేబయడిన“ సీయోను ప్రజలను ఇది సూచిస్తుంది. 13
నా సందేశము యొక్క సందర్భము దీనికి వ్యత్యాసముగా ఉండి, లేఖనాల నుండి తీసుకోబడిన పాఠాలను కలిగియుంటుంది.
1820లో తండ్రి మరియు ఆయన కుమారుడు మొదట ప్రత్యక్షమై, యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపనను ప్రారంభించి 200 సంవత్సరాలైంది. మోర్మన్ గ్రంథములో 4వ నీఫైలోని వృత్తాంతము ప్రాచీన అమెరికాలో రక్షకుడు ప్రత్యక్షమై, ఆయన సంఘాన్ని స్థాపించిన తరువాత ఇటువంటి 200 సంవత్సరాల కాలమును కలిగి ఉంటుంది.
4వ నీఫైలో మనం చదివే చారిత్రక గ్రంథము అసూయలు, జగడములు, అల్లర్లు, అబద్ధములు, హత్యలు, లేక ఏ విధమైన కాముకత్వము లేని ప్రజల గురించి వివరిస్తుంది. ఈ నీతి కారణంగా ఆ గ్రంథము ఇలా పేర్కొంటుంది, “…నిశ్చయముగా, దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు.” 14
ఐక్యతకు సంబంధించి, 4వ నీఫైలో ఇలా చదువబడుతుంది, “జనుల హృదయములలో గల దేవుని ప్రేమను బట్టి, దేశమందు ఎట్టి వివాదము లేకుండెను.” 15
దురదృష్టవశాత్తూ, తరువాత “రెండు వందల ఒకటవ సంవత్సరమందు” 16 దుర్ణీతి మరియు విభజన నీతిని, ఐక్యతను నాశనం చేసినప్పుడు ప్రారంభమైన అనూహ్య మార్పును 4వ నీఫై వివరిస్తుంది. వివిధ స్థాయిల్లో అప్పుడు సంభవించిన దుష్టత్వము ఎంతో చెడ్డదైనందున, గొప్ప ప్రవక్తయైన మోర్మన్ తన కుమారుడు మొరోనై వద్ద చివరికి ఇలా విలపించాడు:
“కానీ ఓ నా కుమారుడా, జనులు ఈ విధముగా అంత అధికమైన అసహ్యమందు ఎట్లు ఆనందించగలరు —
“మనకు వ్యతిరేకముగా తీర్పునందు దేవుడు తన చేతిని ఆపునని మనమెట్లు ఆశించగలము?” 17
ఈ యుగములో, మనము ఒక ప్రత్యేక సమయంలో జీవిస్తున్నప్పటికీ, 4వ నీఫై లో వివరించిన నీతి, ఐక్యతలతో ప్రపంచం ఆశీర్వదించబడలేదు. నిజానికి, ముఖ్యంగా మనం బలమైన విభజనల సమయములో జీవిస్తున్నాము. అయినప్పటికీ, యేసు క్రీస్తు సువార్తను అంగీకరించిన లక్షలాది మంది నీతిని, ఐక్యతను రెండిటిని సాధించడానికి కట్టుబడి ఉన్నారు. మనం ఇంకా ఉత్తమముగా చేయగలమని మనందరికీ తెలుసు మరియు ఈనాడు మనం ఎదుర్కొనే సవాలు అదియే. మొత్తంగా సమాజాన్ని మెరుగుపరచి, ఆశీర్వదించే శక్తిగా మనం ఉండగలం. మన సంఘ చరిత్రలో ఈ 200 సంవత్సరాల ప్రాముఖ్యమైన సమయములో, నీతిగా జీవించడానికి మరియు మునుపెన్నడూ లేని విధంగా ఐక్యంగా ఉండడానికి సంఘ సభ్యులుగా మనం కట్టుబడి ఉందాం. “ఎక్కువ నాగరికతను, జాతిపరమైన, భాషాపరమైన సామరస్యాన్ని మరియు పరస్పర గౌరవాన్ని ప్రదర్శించమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని కోరారు. 18 దీని అర్థం ఒకరినొకరు మరియు దేవుడిని ప్రేమించడం, ప్రతి ఒక్కరినీ సహోదర, సహోదరీలుగా అంగీకరించడం మరియు నిజంగా సీయోను ప్రజలుగా ఉండడం.
మన సమగ్ర సిద్ధాంతంతో, మనం ఐక్యతకు ఒయాసిస్సు కావచ్చు మరియు భిన్నత్వమును ఆనందిచవచ్చు. ఐక్యత మరియు భిన్నత్వము ఒకదానికొకటి వ్యతిరేకము కాదు. భిన్నత్వమును ఆహ్వానించి, గౌరవించే వాతావరణాన్ని పెంపొందించుకోవడంతో మనం ఎక్కువ ఐక్యతను సాధించగలము. నేను శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా స్టేకు అధ్యక్షత్వములో పనిచేసిన కాలంలో, స్పానిష్-, టోంగన్-, సమోవన్-, తగలోగ్- మరియు మాండరిన్ భాష మాట్లాడే సమూహములను మేము కలిగియున్నాము. ఇంగ్లీష్ మాట్లాడే మా వార్డులు అనేక జాతులు మరియు సాంస్కృతిక నేపథ్యాల ప్రజలను కలిగియుండేవి. అక్కడ ప్రేమ, నీతి మరియు ఐక్యత ఉండేవి.
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములోని వార్డులు మరియు శాఖలు భాష లేక భౌగోళికం చేత నిర్ణయించబడతాయే తప్ప, 19 జాతి లేక సంస్కృతి వలన కాదు. సభ్యత్వ రికార్డులలో జాతి గుర్తించబడదు.
మోర్మన్ గ్రంథములో, క్రీస్తు జన్మించడానికి సుమారు 550 సంవత్సరాల ముందు, పరలోక తండ్రి పిల్లల మధ్య గల సంబంధమును గూర్చి ప్రాథమిక ఆజ్ఞ మనకు బోధించబడెను. అందరూ ప్రభువు ఆజ్ఞలను పాటించవలెను, మరియు ప్రభువు మంచితనంలో పాలుపంచుకోవడానికి అందరూ ఆహ్వానించబడ్డారు; “తన యొద్దకు వచ్చువానిని, నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా ఎవ్వరిని ఆయన నిరాకరించడు; ఆయన అన్యమతస్థులను జ్ఞాపకము చేసుకొనును; యూదుడు మరియు అన్యుడు ఇరువురూ దేవునికి ఒకే రీతిగా ఉన్నారు.” 20
అన్ని జాతులు, వర్ణాల వారు దేవుని పిల్లలు అని రక్షకుని పరిచర్య మరియు సందేశము స్థిరంగా ప్రకటించాయి. మనందరము సహోదర, సహోదరీలము. పునఃస్థాపన కొరకు నియమించబడిన అతిథేయ దేశమైన సంయుక్త రాష్ట్రాలలో అమెరికా రాజ్యాంగం 21 మరియు సంబంధిత పత్రాలు 22 అపరిపూర్ణ మనుష్యులచేత వ్రాయబడినవని, ప్రజలందరినీ ఆశీర్వదించడానికి దేవునిచేత ప్రేరేపించబడ్డాయని మన సిద్ధాంతములో మనము నమ్ముచున్నాము. సిద్ధాంతము మరియు నిబంధనలలో మనం చదివినట్లుగా, ఈ పత్రాలు “స్థాపించబడినవి, మరియు సర్వశరీరుల హక్కులు, ఆత్మరక్షణ కొరకు న్యాయమైన, పరిశుద్ధమైన నియమములను బట్టి అవి నిర్వహించబడవలెను.” 23 ఈ సూత్రములలో రెండు ఏవనగా స్వతంత్రత మరియు తన పాపముల కొరకు జవాబుదారిత్వము. ప్రభువు ఇలా ప్రకటించెను:
“కాబట్టి, ఏ మనుష్యుడు మరొకనికి బానిసగానుండుట సరికాదు.
“ఈ ఉద్దేశము కొరకే ఈ దేశపు రాజ్యాంగమును, ఈ ఉద్దేశమునకై నేను పుట్టించిన తెలివిగల మనుష్యుల ద్వారా నేను స్థాపించితిని మరియు రక్తము చిందించుట చేత దేశమును విమోచించితిని.” 24
1833 లో మిస్సోరిలోని పరిశుద్ధులు గొప్ప హింసకు గురైనప్పుడు ఈ బయల్పాటు ఇవ్వబడింది. సిద్ధాంతము మరియు నిబంధనలు 101వ శీర్షికలో కొంతభాగం ఇలా చదువబడుతుంది: “అల్లరిమూకలు జాక్సన్ కౌంటీలో తమ గృహముల నుండి వారిని వెళ్ళగొట్టిరి. … సంఘ [సభ్యులు] అనేకులు వ్యక్తిగతంగా మరణపు బెదిరింపులను ఎదుర్కొనిరి.” 25
ఇది అనేక విధాలుగా ఉద్రిక్తత నెలకొనియున్న సమయం. చాలామంది మిస్సోరీయులు స్థానిక అమెరికన్లను కనికరంలేని శత్రువుగా భావించారు మరియు వారిని దేశమునుండి పంపివేయాలని కోరుకున్నారు. అదనంగా, మిస్సోరి స్థిరనివాసులలో చాలామంది బానిస యజమానులైయుండి, బానిసత్వాన్ని వ్యతిరేకించే వారిచే బెదిరింపులకు గురయ్యారు.
దీనికి విరుద్ధంగా, మన సిద్ధాంతం స్థానిక అమెరికన్లను గౌరవించింది మరియు వారికి యేసు క్రీస్తు సువార్తను నేర్పించాలని మనం కోరుకున్నాం. ఎవ్వరూ మరొకరికి బానిసలుగా ఉండకూడదని బానిసత్వము గురించి మన లేఖనాలు స్పష్టం చేశాయి. 26
చివరకు, పరిశుద్ధులు హింసాత్మకంగా మిస్సోరి 27 నుండి తరిమివేయబడ్డారు మరియు తరువాత పశ్చిమమునకు వెళ్ళుటకు బలవంతము చేయబడ్డారు. 28 పరిశుద్ధులు వర్థిల్లి, నీతి, ఐక్యత మరియు యేసు క్రీస్తు సువార్తను జీవించడం వలన కలుగు శాంతిని కనుగొన్నారు.
యోహాను సువార్తలో నమోదు చేయబడిన రక్షకుని మధ్యవర్తిత్వ ప్రార్థనయందు నేను ఆనందిస్తాను. తండ్రి తనను పంపెనని, రక్షకుడైన తాను చేయవలసిన పనిని పూర్తి చేశానని రక్షకుడు అంగీకరించారు. ఆయన తన శిష్యుల కోసం మరియు క్రీస్తును విశ్వసించేవారి కోసం ప్రార్థించారు: “వారందరు ఏకమైయుండవలెను; నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమైయుండవలెను.” 29 క్రీస్తు తాను మోసగించబడి, సిలువ వేయబడడానికి ముందు ప్రార్థించినది ఏకత్వం కొరకే.
యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపన యొక్క మొదటి సంవత్సరంలో, సిద్ధాంతము మరియు నిబంధనలు 38వ ప్రకరణములో, నమోదు చేయబడిన దానిలో ప్రభువు యుద్ధాలు మరియు దుష్టత్వం గురించి మాట్లాడి, ఇలా ప్రకటించును, “ఒకటిగా నుండుడి; మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు.” 30
మన సంఘ సంస్కృతి యేసు క్రీస్తు యొక్క సువార్త నుండి వస్తుంది. అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక లోతైనభావము గలది. 31 రోమ్‌లో ప్రారంభ సంఘము యూదులు మరియు అన్యజనులతో కూడి ఉండెను. ఈ ప్రారంభ యూదులు యూదా సంస్కృతిని కలిగియున్నారు మరియు “వారి విముక్తిని గెలుచుకొని, ఫలించి వృద్ధి చెందడం ప్రారంభించారు.” 32
రోమ్‌లోని అన్యజనులకు గణనీయమైన గ్రీకు చరిత్ర ప్రభావము గల సంస్కృతి ఉంది, ఏథెన్సు మరియు కొరింథులలో తన అనుభవాల వల్ల అపొస్తలుడైన పౌలు దానిని బాగా అర్థం చేసుకున్నాడు.
పౌలు యేసు క్రీస్తు సువార్తను సమగ్ర పద్ధతిలో పేర్కొన్నాడు. అతడు యేసు క్రీస్తు యొక్క నిజమైన సువార్తతో విభేదించే యూదుల మరియు అన్యజనుల సంస్కృతి 33 యొక్క సంబంధిత అంశాలను వివరించాడు. యేసు క్రీస్తు సువార్తకు అనుగుణంగా లేని వారి నమ్మకాలు మరియు సంస్కృతి నుండి సాంస్కృతిక అవరోధాలను వదిలివేయమని అతడు ప్రతి ఒక్కరినీ కోరును. ఆజ్ఞలను పాటించాలని, ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఆ నీతి రక్షణకు దారితీస్తుందని పౌలు యూదులను, అన్యజనులను హెచ్ఛరించును. 34
యేసు క్రీస్తు సువార్త యొక్క సంస్కృతి అన్యుల సంస్కృతి లేదా యూదుల సంస్కృతి కాదు. ఇది ఒకరి చర్మపు వర్ణము లేదా ఒకరు నివసించే ప్రదేశం ద్వారా నిర్ణయించబడదు. విలక్షణమైన సంస్కృతులను మనం ఆనందిస్తున్నప్పుడు, యేసు క్రీస్తు సువార్తతో విభేదించే ఆ సంస్కృతుల అంశాలను మనం వదిలివేయాలి. మన సభ్యులు మరియు నూతనముగా పరివర్తన చెందినవారు తరచూ విభిన్న జాతి మరియు సాంస్కృతిక నేపథ్యాల నుండి వస్తారు. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి అధ్యక్షులు నెల్సన్ చేసిన ఉపదేశాన్ని మనం పాటిస్తే, పౌలు కాలంలో యూదులు మరియు అన్యజనుల మాదిరిగానే మనము కూడా భిన్నంగా ఉన్నామని మనం కనుగొంటాము. అయినప్పటికీ మన ప్రేమలో మరియు యేసు క్రీస్తునందు విశ్వాసములో మనం ఐక్యంగా ఉండవచ్చు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక, యేసు క్రీస్తు సువార్త యొక్క సంస్కృతి మరియు సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తున్న సూత్రాన్ని నెలకొల్పుతుంది. ఇది నేటికీ మనకు ఒక నమూనాగా ఉన్నది. 35 దేవాలయ విధులు మనల్ని ప్రత్యేక మార్గాల్లో ఐక్యం చేసి, నిత్య ప్రాముఖ్యమైన ప్రతి మార్గంలో ఒకటిగా ఉండడానికి అనుమతిస్తాయి.
వారు పరిపూర్ణులు కావడం వలన కాదు, కానీ వారు కష్టాలను అధిగమించడం, త్యాగాలు చేయడం, క్రీస్తువలె ఉండాలని కోరుకోవడం వలన మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి, రక్షకుడితో ఏకమైయుండడానికి ప్రయత్నిస్తున్నందువలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన మార్గదర్శక సభ్యులను మనము గౌరవిస్తాము. రక్షకునితో వారి ఐక్యత వారిని ఒకరితోనొకరు ఐక్యముగా ఉండునట్లు చేసింది. ఈ సూత్రం నేడు మీకు మరియు నాకు సత్యమైనదిగా ఉన్నది.
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధ సంఘ సభ్యులకు స్పష్టమైన పిలుపు ఏమిటంటే, ఏక హృదయము, ఏక మనస్సు గలిగి నీతియందు నివసించే సీయోను ప్రజలుగా ఉండడానికి ప్రయత్నించడం. 36
మనం నీతిమంతులుగా, ఐక్యంగా ఉండాలని, నేను సాక్ష్యమిచ్చే మన రక్షకుడైన యేసు క్రీస్తును సేవించడం మరియు ఆరాధించడంపై పూర్తిగా దృష్టి పెట్టాలని నా ప్రార్థన. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.