అడుగుడి, వెదకుడి, మరియు తట్టుడి
మనకు అవసరమైన ఏ సమయములోనైనా సరే ఆయనతో సంభాషించుటకు గల అవకాశము పరలోక తండ్రి యొక్క ప్రణాళిక లోని ముఖ్యమైన భాగము.
నాలుగు నెలల క్రిందట, నేను నా లేఖన అధ్యయనముకొరకు రండి, నన్ను అనుసరించండి: అను పుస్తకమునందు అమ్మోనిహాలో ఆల్మా యొక్క పరిచర్యను గూర్చి చదువుచుండగా “నీఫై జనాంగమునకు దేవుడు అనుగ్రహించిన గొప్ప దీవెనలను(ఆల్మా 9:19-23చూడండి), గూర్చి చదివినప్పుడు, దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప దీవెనలను గూర్ఛి ధ్యానించండి”1 అనే సలహా అందులో ఇవ్వబడింది. నాకు కలిగిన దేవుని దీవెనల జాబితాను నాయొక్క డిజిటల్ బోధన గ్రంథంలో పొందుపరచవలెనని నిశ్చయించుకున్నాను. కొద్ది నిముషాల వ్యవధిలో నేను 16 దీవెనలను జాబితా చేశాను.
వాటిలో మొదటిగా రక్షకుని కరుణ, నా తరపున ఆయన చేసిన ప్రాయశ్చిత్త త్యాగము అనే గొప్ప దీవెనలు ఉన్నాయి. ఆ రక్షకునికి ప్రాతినిధ్యము వహిస్తూ ఒక యవ్వన సువార్తికునిగా పోర్చుగల్లులో, ఆ తరువాత నా ప్రియమైన నిత్య సహచారిణి, ప్యాట్రీషియాతో కలిసి బ్రెజిల్ పోర్టో అలెగ్రి దక్షిణ మిషనులో మేము 522 మంది బలమైన, అద్భుతమైన సువార్తికులతో సేవచేయుటకు కలిగిన దీవెన కూడా వ్రాశాను. ప్యాట్రీషియా గూర్చి చెప్పుచూ, ఆ రోజు నేను జాబితాచేసిన దీవెనలలో ఎక్కువ భాగము మేము జంటగా మా 40 సంవత్సరాల దాంపత్యంలో అనుభవించిన దీవెనలన్నీ అనగా మా వివాహబంధం సావో పౌలో బ్రెజిల్ దేవాలయంలో ముద్రించబడుట, మా ముగ్గురు అద్భుతమైన పిల్లలు, వారి జీవిత భాగస్వాములు, మరియు మా 13 మంది మనుమలు మనుమరాండ్రు అందులో ఉన్నారు.
నన్ను సువార్త సూత్రాల ప్రకారం పెంచి పెద్దచేసిన నీతిమంతులైన నా తల్లిదండ్రులవైపు కూడా నా ఆలోచనలు మళ్ళాయి. నేను సుమారు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా ప్రియమైన తల్లి నా పడకవద్ద ప్రార్థించుటకు నాతో మోకరించిన సందర్భము ప్రత్యేకంగా జ్ఞాపకం వచ్చింది. నా ప్రార్థనలు పరలోకమందున్న తండ్రిని చేరాలంటే అవి మెరుగుపడవలసిన అవసరం ఉందని ఆమె భావించియుండవచ్చును. అందుచేత “మొదట నేను ప్రార్థిస్తాను, నా ప్రార్థన తరువాత, నువ్వు ప్రార్థించు” అని ఆమె చెప్పింది. నియమంలోను, ఆచరణలోను పరలోక తండ్రితో మాట్లాడుట నేను నేర్చుకున్నానని ఆమెకు నమ్మకం కుదిరేవరకు ఈ పధ్ధతిని అనేక రాత్రులు తను కొనసాగించింది. ప్రార్థన చేయుట నేర్పినందుకు ఆమెకు ఎప్పటికీ కృతజ్ఞుడనైయుంటాను, ఎందుకంటే, నా ప్రార్థనలను పరలోక తండ్రి విని, జవాబిచ్చును అని నేను నేర్చుకున్నాను.
నిజంగా, అది నేను నా జాబితాలో చేర్చిన మరొక దీవెన ఏదనగా ఆ ప్రభువు మాటను ఆలకించి ఆయన చిత్తమును తెలుసుకోగలుగుట అనే వరము. మనకు అవసరమైన ఏ సమయములోనైనా సరే ఆయనతో సంభాషించుటకు గల అవకాశము పరలోక తండ్రి యొక్క ప్రణాళికలోని ముఖ్యమైన భాగము.
ప్రభువు నుండి ఆహ్వానము
ఆయన పునరుత్థానము తరువాత ఆ రక్షకుడు అమెరికాను దర్శించినపుడు, ఆయన గలిలయలో తన శిష్యులకు ఇచ్చిన ఆహ్వానమును పునరుద్ఘాటించెను. ఆయన చెప్పెను:
“అడుగుడి మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు తీయబడును.
“అడుగు ప్రతివాడును పొందును; వెదకువానికి దొరుకును; తట్టువానికి తీయబడును” (3 నీఫై 14:7–8; మత్తయి 7:7–8) కూడా చూడుము.
మన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ రోజు మనకు అదేవిధమైన ఆహ్వానమును ఇచ్చియున్నారు. ఆయన ఇలా చెప్పారు:, “మీ చింతనలు, మీ భయాలు, మీ బలహీనతలు—అవును, మీ హృదయ వాంఛలన్నిటిని గూర్చి యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుడి. ఆ తరువాత వినండి! మీ మనసులో ఇవ్వబడిన ఆలోచనలను వ్రాయండి. మీ భావాలను వ్రాయండి, మీరు ప్రేరేపించబడిన చర్యలతో వాటన్నిటిని అనుసరించండి. ఈ ప్రక్రియను మీరు ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పునరావృతం చేసిన యెడల మీరు బయల్పాటు నియమంలో ఎదుగుదురు.’”2
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇంకా చెప్పుచూ, “రాబోయే దినములలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, దర్శకత్వము, ఆదరణ, మరియు నిరంతర ప్రాభావము లేనియెడల ఆత్మీయ మనుగడ సాధ్యంకాదు.”3
మన ఆత్మీయ మనుగడకు బయల్పాటు ఎందుకంత అవసరము? ఎందుకంటే, ఈ ప్రపంచం గందరగోళంతో, ధ్వనులతో, మోసముతో, మరియు వ్యాకులములతో నిండియుండగలదు. పరలోకపు తండ్రితో సంభాషించుట ద్వారా మనము ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ఆ దేవుని ప్రణాళిక ప్రకారం మనకు యుక్తమైనది అని విడమరచుటకు సాధ్యపరచును. ఈ ప్రపంచం కఠినంగాను, గుండెలను విరిచే విధంగా ఉండగలదు. ఐతే, ప్రార్థనలో మన హృదయాలను తెరచినపుడు మనము పరలోక తండ్రి నుండి కలుగు ఆదరణను అనుభూతి చెందుతాము. ఆయన మనలను ప్రేమించుచున్నాడని, మనమాయనకు విలువైన వారమనే నిర్ధారణ కలుగుతుంది.
అడుగుడి
“అడుగు ప్రతివాడును పొందును.” అని ప్రభువు చెప్పెను. అడుగుట సులభమనిపించినప్పటికీ అది శక్తివంతమైనది ఎందుకనగా అది మన కోరికలను, మన విశ్వాసాన్ని బయలుపరచును. అయితే ప్రభువు స్వరమును తెలుసుకొనుటకు అర్ధము చేసుకొనుటకు సమయము, సహనము కావాలి. మన ప్రవక్త ఉపదేశించిన ప్రకారము మన మనసులు, హృదయాలలోకి వచ్చిన ఆలోచనలను, భావనలను శ్రద్ధగా గమనిస్తాము, మరియు వాటిని వ్రాసియుంచుకుంటాము. మన అభిప్రాయములను వ్రాసియుంచుట వాటిని పొందుటలోని ముఖ్య భాగము. ప్రభువు మనకు బోధించు విషయములను జ్ఞాపకం చేసుకొనుటకు, పునఃపరిశీలించుటకు, తిరిగి మననం చేసుకొనుటకు అది సహాయపడును.
ఇటీవల ప్రియులలో ఒకరు నాతో అన్నారు, “వ్యక్తిగత బయల్పాటు నిజమని నేను నమ్ముచున్నాను. నేను చేయవలసిన సమస్త కార్యములను ఆ పరిశుద్ధాత్మ నాకు సూచించును. 4 నా హృదయము అచంచల విశ్వాసంతో జ్వలించినపుడు అది సులభంగా నమ్మవచ్చును.5 ఈ స్థాయిలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నాతో మాట్లాడుట నేను ఎలా పొందగలను?”
నేను కూడా పరిశుద్దాత్మ ద్వారా అటువంటి ధృడమైన భావనల అనుభూతిని నిరంతరం పొందాలని, నేను అనుసరించవలసిన మార్గము ఎల్లప్పుడు తేటగా చూడవలెనని నా ప్రియమైన వానికి, మీలో ప్రతి ఒక్కరికి చెప్పగలను. కాని, నేను పొందను. ఐతే, ఆ ప్రభువు యొక్క స్వచ్చమైన, మృదువైన స్వరం మన మనసు, హృదయంతో గుసగుసలాడుచు, ఇలా చెప్పు భావన మనకు అధికంగా కలుగవచ్చును: “నేను ఇక్కడున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొనసాగించు, సాధ్యమైనంత ఉత్తమంగా చెయ్యి. నేను నిన్ను బలపరచెదను.” మనము ఎల్లప్పుడు ప్రతి విషయమును తెలుసుకొనుట, లేదా చూచుట ఆవశ్యకం కాదు.
ఆ శాంతికరమైన, చిన్న స్వరం పునరుద్ఘాటిస్తూ, ప్రోత్సహిస్తూ మరియు ఆదరిస్తూ మరియు అనేకసార్లు ఆ దినమునకు మనకు సరిగ్గా అవసరమైన దానిని అందిస్తున్నది. పరిశుద్ధాత్మ అనునది నిజమైనది, అతని అభిప్రాయములు నిజమైనవి—గొప్పవి మరియు అల్పమైనవైయున్నవి.
వెదకుడి
మరియు “వెదకు వానికి దొరుకును.” అని ప్రభువు వాగ్దానము చేశారు. వెదకుట అనేది మానసిక, ఆత్మీయ కృషిని అనగా ఆలోచించుట, పరీక్షించుట, ప్రయత్నించుట, మరియు ధ్యానించుటను సూచిస్తున్నది. ప్రభువు యొక్క వాగ్దానములను నమ్మెదము కనుక మనము వెదకెదము. ఏలయనగా దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను శ్రద్దతో వెదకువారికి ప్రతిఫలమిచ్చువాడనియు నమ్మవలెను, హెబ్రీ11:6). మనము వెదకునప్పుడు మనము దీనముగా నేర్చుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నదని, మరింత గ్రహించునట్లు ఆ ప్రభువు మన అవగాహనను విస్తరింపచేయునని అంగీకరించుచున్నాము. “ఏలయనగా ఇదిగో ప్రభువైన దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు: నేను నరుల యొక్క సంతానమునకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను, సూత్రము వెంబడి సూత్రమును ఇచ్చట కొంత, అచ్చట కొంత; … పుచ్చుకొనువానికి నేను మరింత అధికంగా ఇచ్చెదను.” (2 నీఫై 28:30).
తట్టుడి
చివరగా ప్రభువు ఇట్లు చెప్పెను, “తట్టు వానికి తీయబడును.” తట్టుట అనగా విశ్వాసముతో ఆచరించుట. మనము క్రియాశీలకంగా ఆయనను అనుసరించినప్పుడు, ఆ ప్రభువు మనకు ముందున్న మార్గమును తెరచును. ఒక చక్కని కీర్తన మనకు ఇలా బోధిస్తుంది, “పైనున్న మన నివాసముగూర్చి కలలు కనడం కంటే మేల్కొనియుండి ఏదైనా చేయుము. మంచిని చేయుట ఆహ్లాదం, లెక్కలేనంత ఆనందము, బాధ్యత మరియు ప్రేమ యొక్క దీవెన.” 6 పన్నెండు మంది సమూహం యొక్క ఎల్డర్ గేర్రిట్ డబ్ల్యు. గాంగ్ ఇటీవల మనం మంచిని చేసే పనిలో ఉన్నప్పుడే బయల్పాటు తరచూ వస్తుందని వివరించారు. ఆయన అన్నారు: “మన చుట్టూ ఉన్న వారికి సేవ చేయుటకు ప్రయత్నించినప్పుడు ప్రభువు వారి కొరకు మనలో అధికమైన తన ప్రేమను పంచును, ఆవిధంగా మనకును పంచునని నేను తలంచుచున్నాను. మనము మన చుట్టునున్న వారికోసం ప్రార్థించినప్పుడు ఆయన జవాబివ్వడానికి ఎక్కువగా కోరే ప్రార్థనలలో అటువంటి ప్రార్థన ఒకటి కనుక ఆయన స్వరాన్ని మనం వింటాము, ఆయనను మరొకవిధంగా అనుభవిస్తాము.” 7
ఆల్మా యొక్క మాదిరి
రండి, నన్ను అనుసరించండి లోని చిన్న సలహా ప్రకారం నాయొక్క దీవెనలను గూర్చి నేను ఆలోచించుట నాకు మధురమైన ఆత్మను, మరికొన్ని ఊహకందని లోతైన ఆత్మీయ అవగాహనను తెచ్చినవి. ఆల్మాను గూర్చి, మరియు అమ్మోనిహాలో అతని పరిచర్యను గూర్చి చదవడం కొనసాగించినపుడు, అడుగుడి, వెదకుడి, మరియు తట్టుడి అంటే అర్ధం ఏమిటో తెలుసుకోడానికి ఆల్మా ఒక మంచి ఉదాహరణ అని నేను కనుగొన్నాను. ఆ ప్రజలపై తన ఆత్మను కుమ్మరించమని ఆల్మా శక్తివంతమైన ప్రార్థన ద్వారా దేవునితో పెనుగులాడుచు ఆత్మలో ఎంతో శ్రమపడెనని మనము చదివియున్నాము. ఐతే, ఆ ప్రార్థన అతడు ఆశించిన విధముగా నెరవేరలేదు, మరియు ఆల్మా పట్టణమునుండి వెలివేయబడెను. “దుఃఖముతో కృంగిపోయి,” ఆల్మా విరక్తి చెందుచుండగా, ఒక దేవదూత ఈ సందేశమును అందించెను: “ఆల్మా, నీవు ధన్యుడవు కనుక నీ తల ఎత్తుకొని సంతోషించుము, ఏలయనగా నీవు సంతోషించుటకు గొప్ప కారణమున్నది.” అప్పుడు ఆ దేవదూత అతనిని అమ్మోనిహాకు తిరిగి వెళ్లి మరొకసారి ప్రయత్నించుమని చెప్పెను, మరియు ఆల్మా “వేగముగా తిరిగి వెళ్లెను” 8
అడుగుట, వెదకుట మరియు తట్టుట గూర్చి ఆల్మా నుండి ఏమి నేర్చుకుంటాము? ప్రార్థనకు ఆత్మపరమైన శ్రమ అవసరమని, అది ప్రతిసారి మనము ఆశించిన ఫలితానికి నడిపించదని మనము నేర్చుకుంటున్నాము. కాని, మనకు నిరాశాభావం కలిగినపుడు, లేక దుఃఖముతో కృంగిపోయినపుడు, ఆ ప్రభువు మనకు వివిధ మార్గాలలో ఆదరణను, బలమును అనుగ్రహించును. మన ప్రశ్నలన్నిటికి ఆయన వెంటనే జవాబియ్యకపోవచ్చును లేక మన సమస్యలన్నిటిని తక్షణమే పరిష్కరించక పోవచ్చును, కాని, ప్రయత్నిస్తూ ఉండుటకు ఆయన మనలను ప్రోత్సహించును. ఆ సమయంలో మన ప్రణాళికను వేగంగా ఆయన ప్రణాళికతో సమన్వయంచేస్తే, మనకు కూడా ఆల్మావలే ఆయన మార్గమును తెరచును.
ఇది పరిపూర్ణ సువార్త యొక్క యుగము అని నేను సాక్ష్యమిస్తున్నాను. మన జీవితాలలో యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క దీవెనలు మనము అనుభవించగలము. లేఖనములు మనకు విరివిగా అందుబాటులో నున్నవి. మనము జీవించుచున్న ఈ కష్టకాలమునకు తగినట్లు ఆ ప్రభువు యొక్క చిత్తమును బోధించు ప్రవక్తలచేత మనము నడిపింపబడుచున్నాము. పైగా, ఆ ప్రభువు మనలను ఆదరించి, నడిపించునట్లు మనము వ్యక్తిగతంగా బయల్పాటు పొందుటకు వీలు కలిగియున్నాము. దేవదూత ఆల్మాతో పలికినట్లు మనము “సంతోషించుటకు గొప్ప కారణము” కలదు. (ఆల్మా 8:15) యేసు క్రీస్తు నామములో, ఆమేన్.