సుస్థిరమైన సమాజములు
మనలో మరియు మన పొరుగువారిలో తగినంతమంది దేవుని యొక్క సత్యం చేత మన జీవితాలను నడిపించడానికి ప్రయత్నిస్తే, ప్రతి సమాజంలో అవసరమైన నైతిక ధర్మాలు పుష్కలంగా ఉంటాయి.
మనోహరమైన రక్షకుని గురించి గాయకబృందం ఎంతో అందంగా పాడింది.
2015 లో, ఐక్యరాజ్యసమితి “సుస్థిర అభివృద్ధి కోసం 2030 కార్యక్రమపట్టిక” అని పిలువబడిన ఒక ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. “ప్రస్తుతము మరియు భవిష్యత్తులో ప్రజలకు, భూగ్రహానికి శాంతి శ్రేయస్సుల కోసం ఉమ్మడి వివరణాత్మక పథకం,” అని ఇది వర్ణించబడింది. సుస్థిర అభివృద్ధి కోసం కార్యక్రమపట్టికలో 2030 నాటికి సాధించాల్సిన 17 లక్ష్యాలు ఉన్నాయి, అవి: పేదరికం లేకుండుట, ఆకలి నిర్మూలన, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం మరియు మంచి ఉద్యోగం వంటివి. 1
సుస్థిరమైన అభివృద్ధి అనే అంశం ఆసక్తికరమైనది మరియు ముఖ్యమైనది. ఆదర్శవంతమైన సమాజాల గురించిన విస్తృత ప్రశ్న దానికంటే మరింత అత్యవసరమైనది. అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని, ముఖ్యంగా దాని సభ్యులలో ఆనందం, పురోగతి, శాంతి మరియు శ్రేయస్సును ప్రోత్సహించే సమాజాన్ని కొనసాగించే ప్రాథమిక అంశాలు ఏవి? కనీసం రెండు అభివృద్ధి చెందుతున్న అటువంటి సమాజాల గురించి మనకు లేఖనాత్మక వృత్తాంతము కలదు. వాటినుండి మనమేమి నేర్చుకోగలము?
పూర్వం గొప్ప గోత్రజనకుడు, ప్రవక్తయైన హనోకు నీతిని బోధించెను మరియు “పరిశుద్ధ పట్టణము అనగా సీయోను అని పిలువబడే ఒక పట్టణాన్ని నిర్మించెను.” 2 “ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను, ఎందుకనగా వారు ఏక హృదయమును ఏక మనస్సును కలిగియుండి, నీతియందు జీవించిరి; వార మధ్య బీదవారెవరును లేరు.” 3
“ప్రభువు ఆ దేశమును దీవించెను, పర్వతములపై ఉన్నవారు, ఎత్తైన స్థలములలో ఉన్నవారు దీవించబడి అభివృద్ధి చెందిరి” 4 అని చెప్పబడింది.
పశ్చిమార్ధగోళంలో నీఫైయులు మరియు లేమనీయులు అని పిలువబడే మొదటి మరియు రెండవ శతాబ్దపు ప్రజలు అభివృద్ధి చెందుతున్న సమాజానికి మరో అద్భుతమైన ఉదాహరణను అందిస్తారు. వారి మధ్య పునరుత్థానుడైన రక్షకుని యొక్క గొప్ప పరిచర్యను అనుసరించి, “వారు ఉపవాసములో, ప్రార్థనలో మరియు ప్రార్థన చేయుటకు, ప్రభువు యొక్క వాక్యము వినుటకు తరచుగా సమకూడుటలో కొనసాగుచూ వారి ప్రభువు మరియు వారి దేవుని నుండి పొందిన ఆజ్ఞలననుసరించి నడిచిరి. …
“ఎట్టి అసూయలు, జగడములు, అల్లర్లు, జారత్వములు, అబద్ధములు, హత్యలు, లేక ఏ విధమైన కాముకత్వము లేకయుండెను; మరియు నిశ్చయముగా, దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు.” 5
ఈ రెండు ఉదాహరణలలోని సమాజాలు రెండు గొప్ప ఆజ్ఞల పట్ల వారికున్న ఆదర్శప్రాయమైన భక్తి వలన పొందిన పరలోక దీవెనల వలన కొనసాగాయి, అవి: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” మరియు “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” 6 వారు తమ వ్యక్తిగత జీవితంలో దేవునికి విధేయులుగా ఉన్నారు మరియు వారు ఒకరికొకరు శారీరక, ఆధ్యాత్మిక సంక్షేమంపై శ్రద్ధచూపారు. సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క మాటలలో ఇవి “ప్రతి మనుష్యుడు తన పొరుగువాని ఆసక్తిని వెదకుతూ దేవుని మహిమ కొరకు ఏకదృష్టితో అన్ని సంగతులు చేసిన” సమాజాలు. 7
దురదృష్టవశాత్తూ, మోర్మన్ గ్రంథము యొక్క 4వ నీఫైలో వివరించబడిన ఆదర్శ సమాజం దాని రెండవ శతాబ్దము తరువాత కొనసాగలేదు. సుస్థిరత హామీ ఇవ్వబడదు మరియు అభివృద్ధి చెందుతున్న సమాజం దాని శాంతి మరియు శ్రేయస్సును సమర్థించే ప్రాథమిక సుగుణాలను వదిలివేసిన కొంత కాలానికి విఫలమవుతుంది. ఈ సందర్భములో, అపవాది యొక్క ప్రలోభాలకు లొంగిపోతూ జనులు “వర్గములుగా విభజింపబడసాగిరి; లాభము సంపాదించుటకు వారు తమ కొరకు సంఘములను కట్టుట మొదలుపెట్టిరి మరియు క్రీస్తు యొక్క నిజమైన సంఘమును తిరస్కరించసాగిరి.” 8
“మరియు మూడు వందల సంవత్సరములు గతించి పోయినప్పుడు, నీఫై యొక్క జనులు మరియు లేమనీయులు ఇరువురు ఒకరివలే మరొకరు మిక్కిలి దుర్మార్గులైరి.” 9
మరో శతాబ్దం చివరి నాటికి, లక్షలాది మంది అంతర్గత యుద్ధంలో మరణించారు మరియు ఒకప్పుడు సామరస్యంగా ఉన్న వారి దేశం పోరాటం చేస్తున్న గోత్రములకు పరిమితం చేయబడింది.
ఇది మరియు ఒకప్పుడు అభివృద్ధి చెంది తరువాత చెడిపోయిన సమాజాలకు గల ఇతర ఉదాహరణలపై ప్రతిబింబిస్తూ, ప్రజలు దేవునికి వారు జవాబుదారులనే భావన నుండి తొలగిపోయి, “శరీర బాహువందు” నమ్మకముంచడం ప్రారంభించినప్పుడు గొప్ప విపత్తు దాగి ఉందని చెప్పడం సురక్షితమని నేను భావిస్తున్నాను. శరీర బాహువునందు నమ్మకముంచడం అంటే మానవ హక్కులు మరియు మానవ గౌరవం యొక్క దైవిక రచయితను విస్మరించడం మరియు సిరిసంపదలకు, అధికారం మరియు ప్రపంచ ప్రశంసలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం (తరచూ వేరే ప్రమాణాన్ని అనుసరించే వారిని ఎగతాళి చేయడం మరియు హింసించడం). ఇది ఇట్లుండగా, సుస్థిరమైన సమాజాలలో ఉన్నవారు “[తమను] సృష్టించిన ఆయన మహిమ యొక్క జ్ఞానమందు లేక న్యాయమైన సత్యమైనదాని యొక్క జ్ఞానమందు ఎదుగవలెను” 10 అని రాజైన బెంజిమెన్ చెప్పినదానిని చేయుటకు ఆపేక్షించుచున్నారు.
శాశ్వతమైన సమాజాన్ని నిలబెట్టే సద్గుణాలతో వ్యక్తులను, సమాజాలను దీవించడానికి కుటుంబము మరియు మతము అనే రెండు సంస్థలు కీలకమైనవి. సువార్త సూత్రాలలో నాటబడిన ఈ సుగుణాలలో సమగ్రత, బాధ్యత మరియు జవాబుదారీతనం, కరుణ, వివాహం మరియు వివాహంలో విశ్వసనీయత, ఇతరులను, ఇతరుల ఆస్తిని గౌరవించడం, సేవ, పని యొక్క ఆవశ్యకత మరియు దానిపట్ల గౌరవం మొదలైనవి ఉన్నాయి.
ఉమ్మడి సంపాదకుడైన జెరార్డ్ బేకర్ ఈ సంవత్సరం ప్రారంభంలో తన తండ్రియైన ఫ్రెడెరిక్ బేకర్ 100వ జన్మదినము సందర్భంగా ఆయనను గౌరవిస్తూ ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక వ్యాసాన్ని వ్రాసాడు. బేకర్ తన తండ్రి దీర్ఘాయువుకు గల కారణాల గురించి ఊహించాడు, కాని తరువాత ఈ ఆలోచనలను జోడించాడు:
“మనమందరం దీర్ఘకాలము జీవించుటకు గల రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పటికీ, మనకిచ్చిన సమయంలో మంచి జీవితాన్ని ఎలా గడపాలి అనే దానిపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని నేను భావిస్తున్నాను. ఇక్కడ, నా తండ్రి రహస్యం నాకు తెలుసు అనే నమ్మకం నాకుంది.
“జీవితమనేది ప్రధానంగా విధి చేత నిర్వచించబడెనని, హక్కు చేత కాదని, సామాజిక బాధ్యతల చేత నిర్వచించబడెనని, వ్యక్తిగత అధికారాల చేత కాదని నమ్మే యుగానికి ఆయన చెందియుండెను. తన శతాబ్దం అంతటా ప్రాథమిక ప్రేరేపిత సూత్రం ఏమిటంటే కుటుంబము, దేవుడు మరియు దేశం పట్ల బాధ్యత ఉంది అనే భావం.
“విడిపోయిన కుటుంబాల నష్టంతో ఆధిపత్యం చెలాయించిన యుగంలో, నా తండ్రి 46 సంవత్సరాలు భార్యకు అంకితమైన భర్త, ఆరుగురు పిల్లల కొరకు బాధ్యతగల తండ్రి. నా తల్లిదండ్రులు ఒక బిడ్డను కోల్పోయే ఊహించలేని విషాదాన్ని ఎదుర్కొన్నప్పటి కంటే ఎక్కువగా ఆయన ఎన్నడూ ఎక్కువగా, క్రీయాశీలముగా నిమగ్నమైయుండలేదు. …
“మతం అనేది పెరుగుతున్న ఉత్సుకతగా ఉన్న యుగంలో, నా తండ్రి నిజమైన, నమ్మకమైన కేథలిక్‌గా, క్రీస్తు వాగ్దానాలపై అచంచలమైన నమ్మకంతో జీవించాడు. వాస్తవానికి, వారు చనిపోయేటప్పుడు నేను కలుసుకున్న వారందరికంటే ఆయన బాగా సిద్ధమైనందున ఇంతకాలం జీవించారని నేను కొన్నిసార్లు అనుకుంటాను.
“మంచి విద్య, నా అద్భుతమైన కుటుంబం, నేను అర్హుడ్ని కాని కొన్ని ప్రాపంచిక విజయాల ద్వారా ఆశీర్వదించబడినందున నేను అదృష్టవంతుడిని. కానీ, నేను ఎంత గర్వంగా కృతజ్ఞతగా భావించినప్పటికీ, ఎటువంటి హంగు ఆర్భాటము లేకుండా, బహుమానము లేదా గుర్తింపు ఆశించకుండా, సాధారణ విధులతో బాధ్యతలతో చివరికి సద్గుణమైన జీవితాన్ని గడిపిన ఆనందాలతో ఒక శతాబ్దం పాటు జీవించిన వ్యక్తి పట్ల నేను కలిగియున్న గర్వము మరియు కృతజ్ఞత చేత అది మరుగుచేయబడింది. 11
మతం మరియు మత విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఇటీవలి సంవత్సరాలలో చాలా దేశాలలో క్షీణించింది. నేటి ప్రపంచంలో వ్యక్తులు లేదా సమాజాలు నైతిక న్యాయం పొందడానికి దేవునిపై నమ్మకం మరియు విధేయత కలిగియుండడం అవసరం లేదని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు. 12 ఎటువంటి మత విశ్వాసం లేదని చెప్పుకునే వారు తరచు మంచి, నీతిగల వ్యక్తులు కాగలరని మనమందరం అంగీకరిస్తామని నా అభిప్రాయం. అయితే, ఇది దైవిక ప్రభావం లేకుండా జరుగుతుందని మనము అంగీకరించము. నేను క్రీస్తు యొక్క వెలుగును గూర్చి మాట్లాడుచున్నాను. “ఈ లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించు నిజమైన ఆత్మను నేనే” 13 అని రక్షకుడు ప్రకటించెను. దాని గురించి తెలిసినా, తెలియకపోయినా ప్రతి విశ్వాసం, స్థలం మరియు సమయమునకు చెందిన ప్రతి పురుషుడు, స్త్రీ మరియు బిడ్డ క్రీస్తు వెలుగుతో నింపబడి ఉంటారు, అందువల్ల మనం తరచుగా మనస్సాక్షి అని పిలిచే తప్పు ఒప్పుల యొక్క జ్ఞానాన్ని కలిగియుంటారు. 14
అయినప్పటికీ లౌకికభావము, పౌర ధర్మాన్ని దేవునికి జవాబుదారీతనం నుండి వేరుచేసినప్పుడు అది మొక్కను దాని మూలాల నుండి వేరుచేస్తుంది. సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడానికి సంస్కృతి మరియు సంప్రదాయంపై ఆధారపడటం మాత్రమే సరిపోదు. ఒకరికి తనకన్నా గొప్ప దేవుడు లేనప్పుడు మరియు తన సొంత కోరికలు, ప్రాధాన్యతలను సంతృప్తి పరచడం కంటే గొప్ప మంచిని వారు కోరుకోనప్పుడు, దాని ప్రభావాలు తగిన సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి.
ఉదాహరణకు, లైంగిక చర్యకు వ్యక్తిగత సమ్మతి ఒక్కటే అడ్డంకిగా ఉన్న ఒక సమాజం, క్షీణించిన సమాజం. వ్యభిచారం, సంభోగం, వివాహేతర జననాలు, 15 మరియు వాంఛిత గర్భస్రావాలు అనేవి కొనసాగుతున్న లైంగిక విప్లవం నుండి పెరిగే కొన్ని చేదు ఫలాలు. ఆరోగ్యకరమైన సమాజం యొక్క సుస్థిరతకు వ్యతిరేకంగా పనిచేసే తదుపరి పరిణామాలలో కొన్నిసార్లు అనేక తరాల వరకు పేదరికంలో మరియు తండ్రుల సానుకూల ప్రభావం లేకుండా పెంచబడుతున్న పిల్లల సంఖ్య అధికమవడం; పంచుకోవలసిన బాధ్యతలను కొన్నిసార్లు స్త్రీలు ఒంటరిగా భరించడం మరియు తీవ్ర లోపం ఉన్న విద్య పాఠశాలలు, ఇతర సంస్థల మాదిరిగా గృహ వైఫల్యాన్ని భర్తీ చేయడానికి బాధ్యత వహించడం కలవు. 16 సాంఘిక ప్రమాణాలను ఉల్లఘించు ఈ వైఖరులకు జోడించబడినవి ఏవనగా, వ్యక్తిగత హృదయ విదారకం మరియు నిరాశ—అనగా దోషులకు, అమాయకులకు సంభవించు మానసిక, భావోద్రేక విధ్వంసం యొక్క లెక్కించలేనన్ని ఉదాహరణలు.
నీఫై ఇలా ప్రకటించును:
“మనుష్యుల సూక్తులను ఆలకించి దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ వరమును తిరస్కరించు వానికి ఆపద! …
“క్లుప్తముగా, దేవుని సత్యము కారణముగా వణికి, కోపపడు వారందరికి ఆపద!” 17
దీనికి విరుద్ధంగా, మన పిల్లలకు మరియు మానవాళికి మన సంతోషకరమైన సందేశం ఏమిటంటే, “దేవుని సత్యం” మంచి మార్గమును లేదా పౌలు చెప్పినట్లుగా “సర్వోత్తమమైన మార్గమును” 18 సూచిస్తుంది, అది ఇప్పుడు వ్యక్తిగత సంతోషానికి, సమాజ శ్రేయస్సుకు మరియు ఇకపై నిత్య శాంతికి, ఆనందానికి గల మార్గం.
దేవుని సత్యము ఆయన తన పిల్లలకు తన సంతోష ప్రణాళికలో వివరించే ప్రధాన సత్యాలను సూచిస్తుంది. ఈ సత్యాలు ఏవనగా, దేవుడు జీవించియున్నాడు; ఆయన మన ఆత్మలకు పరలోక తండ్రి; తన ప్రేమ యొక్క ప్రత్యక్షతగా ఆయనతో సంపూర్ణ ఆనందాన్ని పొందడానికి మనల్ని నడిపించే ఆజ్ఞలను ఆయన మనకిచ్చారు; యేసు క్రీస్తు దేవుని కుమారుడు మరియు మన విమోచకుడు; మన పశ్చాత్తాపం యొక్క షరతులపై మన పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం ఆయన శ్రమ అనుభవించి మరణించారు; మానవజాతి అంతటికి పునరుత్థానం తీసుకొని వచ్చుటకు ఆయన మృతులలోనుండి లేచారు; మరియు తీర్పు తీర్చబడడానికి అనగా మన జీవితాలకు లెక్క అప్పగించడానికి మనమందరం ఆయన యెదుట నిలబడతాము. 19
మోర్మన్ గ్రంథంలో “న్యాయాధిపతుల పరిపాలన” అని పిలువబడే తొమ్మిది సంవత్సరాలకు ప్రవక్తయైన ఆల్మా సంఘ నాయకత్వానికి పూర్తి సమయం ఇవ్వడానికి ప్రధాన న్యాయాధిపతి పదవికి రాజీనామా చేసాడు. అతని ఉద్దేశ్యమేమనగా ప్రజలలో మరియు ముఖ్యంగా సంఘ సభ్యులలో పెరుగుతున్న అహంకారం, హింస మరియు దురాశను నివారించడం. 20 ఎల్డర్ స్టీఫెన్ డి. నాడాల్డ్ ఒకసారి గమనించినట్లు, “[ఆల్మా] ప్రేరేపిత నిర్ణయం తన ప్రజల ప్రవర్తనను సరిదిద్దడానికి ఎక్కువ నియమాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి ఎక్కువ సమయం గడపడం కాదు, కానీ దేవుని వాక్యంతో వారితో మాట్లాడడం, సిద్ధాంతాన్ని బోధించడం మరియు విమోచన ప్రణాళికపై వారి అవగాహన వారి ప్రవర్తనను మార్చడానికి వారిని నడిపించేలా చేయడం.” 21
మనం నివసిస్తున్న సమాజాల సుస్థిరతకు మరియు విజయానికి తోడ్పడడానికి పొరుగువారిగా, తోటి పౌరులుగా మనం చేయగలిగేది చాలా ఉంది, మరియు ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప విమోచన ప్రణాళికలో అంతర్లీనంగా ఉన్న సత్యాలను బోధించడం మరియు జీవించడం మన అత్యంత ప్రాథమిక మరియు శాశ్వతమైన సేవయైయుంటుంది. కీర్తన యొక్క పదాలలో వ్యక్తీకరించినట్లు:
మన తండ్రుల విశ్వాసాన్ని మనము ప్రేమిస్తాము
మన కలహాలలో స్నేహితుడిని, శత్రువును ఇరువురిని ప్రేమిస్తాము,
మరియు విశ్వాసాన్ని దయగల మాటల ద్వారా ప్రేమతో
మరియు ధర్మబద్దమైన జీవితాన్ని (జీవించడం ద్వారా) బోధిస్తాము. 22
మనలో మరియు మన పొరుగువారిలో తగినంతమంది దేవుని యొక్క సత్యం చేత మన నిర్ణయాలను తీసుకొని, మన జీవితాలను నడిపించడానికి ప్రయత్నిస్తే, ప్రతి సమాజంలో అవసరమైన నైతిక ధర్మాలు పుష్కలంగా ఉంటాయి.
మనకు నిత్యజీవము లభించేలా ప్రేమతో మన పరలోక తండ్రి తన అద్వితీయ కుమారుడిని ఇచ్చారు. 23
“[యేసు క్రీస్తు] లోకమునకు ప్రయోజనకరమైన దానిని తప్ప మరిదేనిని చేయరు; ఏలయనగా ఆయన తన ప్రాణమును పణంగాపెట్టి మనుష్యులందరినీ తన వైపు ఆకర్షించునంతగా లోకమును ప్రేమించెను. అందువలన, ఆయన రక్షణలో పాలుపొందరాదని ఆయన ఎవరినీ ఆజ్ఞాపించరు.
“నా యొద్ద నుండి తొలగిపొమ్మని ఆయన ఎవరికైనను చెప్పునా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; కానీ భూదిగంతముల నుండి మీరందరు నా యొద్దకు రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే పాలు తేనెలను కొనుడి అని ఆయన చెప్పుచున్నాడు.” 24
“గంభీరమైన హృదయముతో, సాత్వీకమైన మనస్సుతో” 25 మరియు యేసు క్రీస్తు నామములో మేము దీనిని ప్రకటిస్తున్నాము, ఆమేన్.