ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి
ఈరోజు నేను ప్రపంచమంతటా ప్రతీ దేశము నుండి సమస్త జనులను ప్రార్థన చేయమనే నా పిలుపును విస్తరిస్తున్నాను.
నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ఆయన మర్త్య పరిచర్య యొక్క చివరి వారమందు, యేసు తన శిష్యులకు “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు, ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి,” అని బోధించాడు.1
ఆయన రెండవ రాకడకు ముందు “జరుగబోవు సంగతుల,” మధ్య “యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములు[,] … అక్కడక్కడ కరవులును, తెగుళ్లు భూకంపములును,” ఉన్నవి.2
సిద్ధాంతములు మరియు నిబంధనలలో, రక్షకుడు చెప్పారు, “అన్ని విషయాలు గందరగోళంగా ఉంటాయి; … ఏలయనగా సమస్త జనులపై భయము కలుగును.”3
నిశ్చయముగా, సంగతులు గందరగోళంగా ఉన్న సమయంలో మనము జీవిస్తున్నాము. అనేకమంది జనులు భవిష్యత్తుకు భయపడుతున్నారు, మరియు అనేకమంది హృదయాలు దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుయందు వారి విశ్వాసము నుండి తొలగిపోయాయి.
దౌర్జన్యముగల వృత్తాంతములతో వార్తల నివేదికలు నింపబడినవి. దుర్నీతి, అవమానకరమైనవి ఆన్‌లైన్‌లో ప్రచురించబడినవి. శ్మశానాలు, సంఘాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు మరియు మతపరమైన మందిరాలు ధ్వంసం చేయబడ్డాయి.
ప్రపంచవ్యాప్త మహమ్మారి భూమి యొక్క ప్రతి మూలకు చేరుకున్నది: మిలియన్ల మంది ప్రజలకు వ్యాధి సోకింది; ఒక మిలియనుకు పైగా మరణించారు. పాఠశాల పట్టభద్రతలు, సంఘ ఆరాధన కార్యక్రమాలు, వివాహాలు, మిషనరీ సేవ, మరియు ఇతర ముఖ్యమైన జీవిత సంఘటనలు అనేకము అంతరాయపరచబడ్డాయి. అదనముగా, లెక్కలేనంత మంది ఒంటరిగా, ఏకాంతంగా విడువబడ్డారు.
హాఠాత్తైన ఆర్థికపరమైన మార్పులు అనేకమందికి, ప్రత్యేకంగా హానిపొందడానికి అవకాశమున్న మన పరలోక తండ్రి యొక్క పిల్లలకు కష్టాలు కలిగించాయి.
ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ఉద్రేకపూర్వకంగా ఉపయోగించుకోవడాన్ని మనము చూశాము మరియు కోపంతో ఉన్న గుంపుల అల్లర్లను మనము చూశాము.
అదే సమయంలో, ప్రపంచమంతటా వివాదాలను నిరంతరం మనము చూస్తున్నాము.
బాధపడుతూ, చింతిస్తూ, భయపడుతూ లేక ఒంటరిగా భావించే మీ గురించి నేను తరచుగా ఆలోచిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఎరుగునని, ఆయన మీ ఆలోచన, వేదన ఎరిగియున్నాడని, ఆయన మిమ్మల్ని సన్నిహితంగా, వ్యక్తిగతంగా, లోతుగా మరియు శాశ్వతంగా ప్రేమిస్తున్నాడని—మీలో ప్రతిఒక్కరికి నేను అభయమిస్తున్నాను.
ప్రతీరాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు, దుఃఖము, బాధ, ఒంటరితనము, మరియు విచారముతో భారమైన వారందరిని దీవించమని నేను ప్రభువును అడుగుతున్నాను. మిగిలిన సంఘ నాయకులు అవే విషయాలను గూర్చి ప్రార్థన చేస్తారని నేను ఎరుగుదును. వ్యక్తిగతంగా, సమిష్టిగా మా హృదయాలు, మిమ్మల్ని చేరుకుంటాయి, మరియు మీ తరఫున మా ప్రార్థనలు దేవునికి చేరతాయి.
నేను గత సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈశాన్య భాగంలో అమెరికన్ మరియు సంఘ చరిత్ర స్థలాలను సందర్శించాను, మన సువార్తికులు మరియు మన సభ్యులతో సమావేశాలకు హాజరయ్యాను మరియు ప్రభుత్వ మరియు వ్యాపార నాయకులను సందర్శించి కొన్నిరోజులు గడిపాను.
అక్టోబరు 20, ఒక ఆదివారము, నేను బోస్టన్,మాసాచుసెట్స్ దగ్గర పెద్ద సమావేశంలో ప్రసంగించాను. నేను ప్రసంగిస్తున్నప్పుడు, “ఈ దేశము కోసం, మన నాయకుల కోసం, మన జనుల కోసం, మరియు దేవుని చేత స్థాపించబడిన ఈ గొప్ప దేశములో నివసిస్తున్న కుటుంబాల కోసం ప్రార్థన చేయమని … నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను,” అని చెప్పుటకు నేను ప్రేరేపించబడ్డాను.4
అమెరికా మరియు భూమి యొక్క అనేక దేశాలు, గతంలో ఉన్నట్లుగానే, మరొక క్లిష్టమైన నిర్ణయాలు చేయాల్సి ఉన్నాయని మరియు మన ప్రార్థనలు అవసరమని కూడా నేను చెప్పాను.5
నేను సిద్ధపరచిన ప్రసంగంలో నా మనవి లేదు. వారి దేశము, వారి నాయకుల కోసం ప్రార్ధించమని హాజరైన వారిని ఆహ్వానించాలని ఆత్మ నన్ను ప్రేరేపించుటను నేను భావించినప్పుడు ఆ మాటలు నాకు వచ్చాయి.
ఈరోజు నేను ప్రపంచమంతటా ప్రతీ దేశము నుండి సమస్త జనులకు ప్రార్థన చేయమని నా పిలుపును విస్తరిస్తున్నాను. మీరు ఎలా ప్రార్ధించినా లేక ఎవరికి మీరు ప్రార్ధించినా, దయచేసి మీ విశ్వాసమును సాధనము చేయుము—మీ విశ్వాసము ఏదైనప్పటికినీ—మీ దేశము, మీ దేశ నాయకుల కోసం ప్రార్థన చేయండి. గత అక్టోబరులో మసాచుసెట్స్‌లో నేను చెప్పినట్లుగా, మనము ఈ రోజు చరిత్రలో ఒక ప్రధాన కూడలి వద్ద నిలబడ్డాము, మరియు భూమి యొక్క దేశాలు దైవిక ప్రేరేపణ మరియు నడిపింపు యొక్క తీరని అవసరాన్ని కలిగియున్నవి. ఇది రాజకీయాలు లేక విధానమును గూర్చినది కాదు. ఇది శాంతి యొక్క రాకుమారుడు మరియు సమస్త స్వస్థతకు ఆధారమైన, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా—వారి పట్టణాలు, నగరాలు, మరియు గ్రామాలు—దేశములలోని ఆత్మలకు అదేవిధంగా వ్యక్తులకు రాగల శాంతి మరియు స్వస్థత గూర్చినది.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు సహాయపడుటకు శ్రేష్టమైన విధానము జనులు దేవునిపై మరింత సంపూర్ణంగా ఆధారపడుట మరియు నిజాయితీగల ప్రార్థన ద్వారా ఆయనకు వారి హృదయాలను తెరచుట అనే భావన గత కొన్ని నెలలుగా నాకు కలిగింది. మనల్ని మనం తగ్గించుకొని, సహించుటకు పరలోకపు ప్రేరేపణను వెదకుట లేక మనముందున్న దానిని జయించుట ఈ కష్టకాలముల గుండా విశ్వాసంగా ముందుకు సాగిపోవుటకు సురక్షితమైన మరియు నిశ్చయమైన విధానము.
ఆయన మర్త్య పరిచర్య సమయంలో ప్రార్థన గురించి ఆయన బోధనలు అదేవిధంగా యేసు చేత చేయబడిన ప్రార్థనలను లేఖనాలు ప్రముఖంగా పేర్కోన్నాయి. ప్రభువు యొక్క ప్రార్థన మీకు జ్ఞాపకమున్నది.
“పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
“నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.
“మా అనుదినాహారము మాకు దయచేయుము.
“మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
“మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము: ఏలయనగా రాజ్యము, శక్తి, మరియు మహిమ శాశ్వతంగా మీదే. ఆమేన్.”6
ఈ దృష్టిసారించబడిన, అందమైన ప్రార్థన, క్రైస్తవత్వమంతటా తరచుగా పునరావృతం చేయబడింది, అది మనల్ని బాధించే దానికి జవాబుల కోసం “పరలోకమందున్న మా తండ్రీ” అని నేరుగా మనవి చేయుట సరైనదని స్పష్టపరచును. కాబట్టి, దైవిక నడిపింపు కోసం మనం ప్రార్థన చేద్దాం.
ఎల్లప్పుడును ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.7 మీ కుటుంబము కోసం ప్రార్థన చేయండి. దేశ నాయకుల కోసం ప్రార్థన చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ, ధనికులు మరియు పేదలు, యువకులు మరియు వృద్ధులను: ప్రభావితం చేసే సామాజిక, పర్యావరణ, రాజకీయ మరియు జీవసంబంధమైన తెగుళ్లకు వ్యతిరేకంగా ప్రస్తుత పోరాటాలలో ముందు వరుసలో ఉన్న ధైర్యవంతుల కోసం ప్రార్థించండి.
మనము ఎవరి కోసం ప్రార్థన చేయాలో పరిమితం చేయవద్దని రక్షకుడు మనకు బోధించాడు. “మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను శపించువారిని దీవించుడి, మిమ్ములను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్ములను దౌర్జన్యముగా ఉపయోగించి మరియు మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి,”8 అని ఆయన చెప్పాడు.
మన పాపముల కొరకు యేసు మరణించిన కల్వరి సిలువపై, ఆయన ప్రార్ధించినప్పుడు ఆయన బోధించిన దానినే ఆచరించాడు, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు.”9
మన శత్రువులుగా భావించిన వారి కొరకు నిజాయితీగా ప్రార్ధించుట, దేవుడు మన హృదయాలను, ఇతరుల హృదయాలను మార్చగలడనే మన నమ్మకమును రుజువు చేస్తుంది. అటువంటి ప్రార్థనలు మన స్వంత జీవితాలను, కుటుంబాలను, మరియు సమాజములలో అవసరమైన మార్పులు ఏవైనా చేయడానికి మన తీర్మానమును బలపరుస్తాయి.
మీరు ఎక్కడ నివసించినా, ఏ భాష మాట్లాడినా, లేక మీరు ఎదుర్కొనే కష్టాలు ఏవైనప్పటికినీ, దేవుడు ఆలకిస్తాడు మరియు ఆయన స్వంత విధానములో, స్వంత సమయంలో మీకు జవాబిస్తాడు. మనము ఆయన పిల్లలము కనుక, సహాయమ, ఓదార్పు, మరియు ప్రపంచంలో సానుకూలమైన ప్రత్యేకతను చేయుటకు క్రొత్తదైన కోరికతో మనము ఆయనను సమీపించగలము.
న్యాయము, శాంతి, పేదవారు, మరియు రోగుల కొరకు ప్రార్థన చేయుట తరచుగా సరిపోదు. మనము మోకరించి ప్రార్ధించిన తరువాత, మన మోకాళ్లపై నుండి లేచి, మనకై మనం, ఇతరులకు సహాయపడుటకు—మనము చేయగల సహాయమును చేయాల్సిన అవసరమున్నది.10
వారి స్వంత జీవితాలలో, ఇతరుల జీవితాలలో ప్రత్యేకతను చేయుటకు ప్రార్థనతో క్రియను జతపరచిన విశ్వాసముగల జనుల యొక్క మాదిరులతో లేఖనాలు నిండియున్నవి. ఉదాహరణకు, మోర్మన్ గ్రంధములో, మనము ఈనస్ గురించి చదువుతాము. “అతడి చిన్న పుస్తకంలో దాదాపు మూడింట రెండు వంతులు ప్రార్థన లేదా ప్రార్థనల పరంపరను వివరించును, మరియు అతడు పొందిన సమాధానాల ఫలితంగా అతడు ఏమి చేసాడో మిగిలిన మూడవ వంతు చెప్పును,” అని గమనించబడింది.11
1820 వసంత ఋతువులో తన తల్లిదండ్రుల చెక్క ఇంటి దగ్గర చెట్ల పొదలో, జోసెఫ్ స్మిత్ మొట్టమొదట బిగ్గరగా చేసిన ప్రార్థనతో ప్రారంభించబడి మన స్వంత సంఘ చరిత్రలో ప్రార్థన ఎలా మార్పు తెచ్చిందో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. క్షమాపణను, ఆత్మీయ నడిపింపును వెదకుట, జోసెఫ్ యొక్క ప్రార్థన పరలోకములను తెరచింది. ఈ రోజు మనము ప్రవక్త జోసెఫ్, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమును స్థాపించుటకు సహాయపడి, ప్రార్ధించి, పనిచేసిన మిగిలిన విశ్వాసులైన కడవరి-దిన పరిశుద్ధ పురుషులు మరియు స్త్రీల యొక్క లబ్దిదారులము.
మేరీ ఫీల్డింగ్ స్మిత్ వంటి విశ్వాసులైన మహిళల ప్రార్థనల గురించి నేను తరచుగా ఆలోచిస్తాను, ఆమె దేవుని సహాయంతో, ఇల్లినాయిస్‌లో పెరుగుతున్న హింస నుండి ధైర్యంగా తన కుటుంబాన్ని ఈ సాల్ట్‌లేక్ వేలీలో భద్రత వైపు నడిపించింది, అక్కడ ఆమె కుటుంబం ఆత్మీయంగా మరియు భౌతికంగా అభివృద్ధి చెందింది. మనఃపూర్వకంగా మోకరించి ప్రార్థన చేసిన తరువాత, ఆమె తన కష్టాలను జయించి, తన కుటుంబాన్ని దీవించడానికి కష్టపడి పనిచేసింది.
ప్రార్థన మనల్ని పైకెత్తును మరియు వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘముగా, మరియు ఒక ప్రపంచంగా మనల్ని దగ్గరగా చేస్తుంది. ప్రార్థన శాస్త్రవేత్తలను ప్రభావితం చేస్తుంది మరియు ఈ మహమ్మారిని అంతం చేసే టీకాలు మరియు ఔషధాల ఆవిష్కరణల వైపు వారికి సహాయపడుతుంది. ప్రార్థన ఒక ప్రియమైనవారిని కోల్పోయిన వారిని ఓదార్చును. మన స్వంత వ్యక్తిగత భద్రత కొరకు చేయాల్సిన దానిని తెలుసుకొనడంలో అది మనల్ని నడిపిస్తుంది.
సహోదర, సహోదరిలారా, ప్రార్థనకు మీ ఒడంబడికను రెట్టింపు చేయమని నేను మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. మీ గదిలోపల, మీ ప్రతీరోజు నడకలో, మీ గృహాలలో, మీ వార్డులలో, మరియు ఎల్లప్పుడు మీ హృదయాలలో ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.12
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ నాయకుల తరఫున, మా కోసం మీ ప్రార్థనల కొరకు నేను మీకు ధన్యవాదాలు. ఈ కష్టమైన సమయాల గుండా సంఘాన్ని నడిపించుటకు ప్రేరేపణ మరియు బయల్పాటును మేము పొందునట్లు ప్రార్ధించుట కొనసాగించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
ప్రార్థన మన స్వంత జీవితాలను మార్చగలదు. నిజాయితీగల ప్రార్థన చేత ప్రేరేపించబడి, మనము మెరుగుపరచుకోగలము మరియు ఇతరులు అదేవిధంగా చేయడానికి సహాయపడగలము.
నా స్వంత అనుభవము ద్వారా ప్రార్థన యొక్క శక్తిని నేను ఎరుగుదును. ఇటీవల నేను నా కార్యాలయములో ఒంటరిగా ఉన్నాను. అప్పుడే నాకు నా చేతిపై వైద్య చికిత్స జరిగింది. అది నల్లగా, నీలంగా ఉన్నది, వాచిపోయింది, మరియు అది నొప్పిగా ఉన్నది. నా బల్ల వద్ద నేను కూర్చోన్నప్పుడు, ఈ నొప్పి చేత నేను అంతరాయపరచబడి, ముఖ్యమైన, కష్టమైన విషయాలపై దృష్టిసారించలేకపోయాను.
నేను ప్రార్థనయందు మోకరించాను మరియు నా పనిని నెరవేర్చగలుగునట్లు దృష్టిసారించుటకు నాకు సహాయపడమని నేను ప్రభువును అడిగాను. నేను నిలబడి, నా బల్లపైనున్న కాగితాల గుట్టకు తిరిగివెళ్లాను. దాదాపు వెంటనే, నా మనస్సులోనికి స్పష్టత మరియు దృష్టి కలిగాయి మరియు నా ముందున్న అత్యవసర విషయాలను నేను నెరవేర్చగలిగాను.
ప్రపంచంలోని ప్రస్తుత గందరగోళ పరిస్థితి మనము చాలా సమస్యలను మరియు సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే భయంకరంగా అనిపించవచ్చు. అయితే అవసరమైన దీవెనలు మరియు నడిపింపు కోసం పరలోక తండ్రికి ప్రార్ధించి, అడిగిన యెడల, మన కుటుంబాలు, పొరుగువారు, సమాజములు, మరియు మనము నివసించే దేశాలను కూడ మనము ఎలా దీవించగలమో మనము తెలుసుకుంటామని నేను మనఃపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.
రక్షకుడు ప్రార్ధించాడు మరియు తరువాత ఆయన పేదవారికి ఆహారమిస్తూ, అవసరమైన వారికి ధైర్యమును, చేయూతను అందిస్తూ, ప్రేమ, క్షమాపణ, శాంతియందు చేరువై మరియు ఆయన వద్దకు వచ్చు వారికందరికీ విశ్రాంతి దయచేస్తూ “మేలు చేయుచు, సంచరించుచుండెను.”13 ఆయన మనకి చేరువవుతూనే ఉన్నాడు.
సంఘ సభ్యులందరూ, అదేవిధంగా మన పొరుగువారు, ప్రపంచవ్యాప్తంగా ఇతర మతాలకు చెందిన స్నేహితులను రక్షకుడు తన శిష్యులకు సలహా ఇచ్చినట్లుగా చేయమని నేను ఆహ్వానిస్తున్నాను: శాంతి కొరకు, ఓదార్పు కొరకు, భద్రత కొరకు, మరియు ఒకరినొకరు సేవ చేసుకొనే అవకాశాల కొరకు“ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి.”14
ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పది, మరియు నేటి ప్రపంచంలో దేవునియందు మరియు ఆయన ప్రియమైన కుమారునియందు మన విశ్వాసపు ప్రార్థనలు ఎంతగా అవసరము! ప్రార్థన యొక్క శక్తిని జ్ఞాపకముంచుకొనుము మరియు ప్రశంసించుము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.