క్రీస్తు యొక్క శాంతి శత్రుత్వాన్ని నిర్మూలించును
మన జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రేమ అతిముఖ్యమైన విషయమైనప్పుడు, మనం విభేదాలను సాత్వీకము, సహనము మరియు దయతో సమీపిస్తాము.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, గుండె ఒత్తిడి పరీక్షలో గుండె మీద భారం పెరుగుతుంది. నడకను తట్టుకోగలిగిన గుండెలు ఎత్తుకు పరిగెత్తడానికి సహకరించేందుకు కష్టపడవచ్చు. ఈ విధానంలో, మరొకరకంగా కనిపించని అంతర్లీన వ్యాధులను ఒత్తిడి పరీక్ష బయటపెట్టగలదు. అప్పుడు గుర్తించబడిన ఏ సమస్యలకైనా అనుదిన జీవితంలో అవి గంభీరమైన సమస్యలను సృష్టించకముందే చికిత్స చేయగలము.
కొవిడ్-19 మహమ్మారి ఖచ్చితంగా ఒక ప్రపంచవ్యాప్త ఒత్తిడి పరీక్ష! ఈ పరీక్ష మిశ్రమ ఫలితాలనిచ్చింది. సురక్షితమైన, ప్రభావవంతమైన టీకాలు వృద్ధిచేయబడ్డాయి.1 వైద్య నిపుణులు, అధ్యాపకులు, సంరక్షకులు మరియు ఇతరులు ఎంతో పరాక్రమంతో త్యాగం చేసారు మరియు ఇంకా చేయడాన్ని కొనసాగిస్తున్నారు. అనేకమంది ఔదార్యాన్ని, దయను ప్రదర్శించారు మరియు ఇంకా ప్రదర్శించడాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ, అంతర్లీనమైన నష్టాలు ప్రత్యక్షపరచబడ్డాయి. దుర్బలమైన వ్యక్తులు బాధపడ్డారు మరియు ఇంకా బాధపడడాన్ని కొనసాగిస్తున్నారు. అంతర్లీనంగా ఉన్న ఈ అసమానతలపై పనిచేస్తున్న వారు ప్రోత్సహించబడాలి మరియు కృతజ్ఞతలు తెలుపబడాలి.
మహమ్మారి రక్షకుని సంఘానికి, దాని సభ్యులకు ఒక ఆత్మీయ ఒత్తిడి పరీక్ష కూడా. ఫలితాలు అదేవిధంగా మిశ్రమమైనవి. “ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన విధానంలో” పరిచర్య చేయడం ద్వారా,2 రండి, నన్ను అనుసరించండి పాఠ్యప్రణాళిక ద్వారా మరియు గృహ-కేంద్రిత, సంఘ-సహకార సువార్త అభ్యాసం ద్వారా మన జీవితాలు దీవించబడ్డాయి. ఈ కష్టకాలంలో అనేకమంది దయగల సహాయాన్ని, ఓదార్పును అందించారు మరియు అందించడాన్ని కొనసాగిస్తున్నారు.3
అయినా కొన్ని సందర్భాల్లో, ఆత్మీయ ఒత్తిడి పరీక్ష వివాదం మరియు విభజన ధోరణులను చూపింది. మన హృదయాలను మార్చుకోవడానికి మరియు రక్షకుని యొక్క నిజమైన శిష్యులుగా ఏకమవడానికి మనం చేయవలసిన కార్యముందని ఇది సూచిస్తుంది. ఇది ఒక క్రొత్త సవాలు కాదు, కానీ ఇది క్లిష్టమైనది.4
రక్షకుడు నీఫైయులను దర్శించినప్పుడు ఆయన ఇలా బోధించారు, “మీ మధ్య ఏ వివాదములుండరాదు. … వివాదము యొక్క ఆత్మను కలిగియున్నవాడు నా సంబంధి కాడు, కానీ వివాదము యొక్క తండ్రియైన అపవాది సంబంధియై యున్నాడు; మరియు వారు ఒకరితోనొకరు కోపముతో పోరాడునట్లు మనుష్యుల హృదయాలను అతడు పురిగొల్పును.”5 మనం కోపంతో ఒకరితో ఒకరం పోట్లాడినప్పుడు, అది సాతానును సంతోషపెడుతుంది మరియు దేవుడిని బాధపెడుతుంది.6
కనీసం రెండు కారణాల కోసం సాతాను సంతోషపడి, దేవుడు బాధపడతాడు. మొదటిది, యేసు క్రీస్తు గురించి, ఆయన “మంచితనము, … కనికరము మరియు కృప” ద్వారా వచ్చే విమోచన గురించి ప్రపంచానికి సమిష్టిగా మనమిచ్చే సాక్ష్యాన్ని వివాదం బలహీనం చేస్తుంది.7 రక్షకుడు ఇలా చెప్పారు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. … మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”8 దానికి వ్యతిరేకమైనది కూడా నిజమే—మనం ఒకరిపట్ల ఒకరం ప్రేమ చూపనప్పుడు మనం ఆయన శిష్యులం కాదని ప్రతిఒక్కరికి తెలుస్తుంది. ఆయన శిష్యుల మధ్య వివాదం లేదా శత్రుత్వం9 ఉన్నప్పుడు ఆయన కడవరి దిన కార్యము బలహీనపరచబడుతుంది.10 రెండవది, వివాదమనేది వ్యక్తులుగా మనకు ఆత్మీయంగా అనారోగ్యకరమైనది. మన నుండి శాంతి, ఆనందం, విశ్రాంతి దోచుకొనబడుతుంది మరియు ఆత్మను అనుభవించే మన సామర్థ్యము బలహీనపరచబడుతుంది.
“ఒకరికి వ్యతిరేకముగా మరొకరు కోపముతోనుండునట్లు మనుష్యుల హృదయాలను పురిగొల్పుట నా సిద్ధాంతము కాదు; కానీ, అట్టి క్రియలు ఆపివేయవలెను అనునదే నా సిద్ధాంతమైయున్నది” అని యేసు క్రీస్తు వివరించారు.11 నేను అవమానించబడినట్లు భావించినా లేదా అభిప్రాయబేధాల పట్ల కోపంగా లేదా న్యాయరహితంగా స్పందించినా, నేను ఆత్మీయ ఒత్తిడి పరీక్షలో “విఫలమవుతాను”. విఫలమైన ఈ పరీక్షకు అర్థం నేను నిరాశ చెందినవాడినని కాదు. దానికి బదులుగా, నేను మార్పుచెందాలని అది చెప్తుంది. మరియు అది తెలుసుకోవడం మంచిది.
రక్షకుడు అమెరికాను దర్శించిన తర్వాత, జనులు ఏకమయ్యారు; “దేశమంతటా ఏ వివాదము లేకుండెను.”12 వారంతా ఒకేలా ఉన్నందుకు జనులు ఏకమయ్యారా లేదా వారి మధ్య అభిప్రాయభేదాలు లేనందుకు ఏకమయ్యారని మీరనుకుంటున్నారా? నేను సందేహిస్తున్నాను. దానికి బదులుగా, వివాదము మరియు శత్రుత్వము కనుమరుగైపోయాయి, ఎందుకంటే వారు అన్నిటికంటే ఎక్కువగా రక్షకుని పట్ల వారి శిష్యత్వానికి ప్రాధాన్యతనిచ్చారు. రక్షకుని ప్రేమను వారు పంచుకోవడంతో పోల్చితే వారి అభిప్రాయభేదాలు వెలవెలబోయాయి మరియు వారు “దేవుని రాజ్యమునకు వారసులుగా” ఏకమయ్యారు.13 ఫలితంగా, “దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు.”14
ఐక్యతకు ప్రయత్నం అవసరము.15 మనం మన హృదయాలలో దేవుని ప్రేమను అభివృద్ధి చేసినప్పుడు16 మరియు మన నిత్య గమ్యంపై దృష్టిసారించినప్పుడు17 అది వృద్ధిచెందుతుంది. దేవుని పిల్లలుగా మన ఉమ్మడి, ప్రాథమిక గుర్తింపు ద్వారా18 మరియు పునఃస్థాపించబడిన సువార్త యొక్క సత్యాలకు మన నిబద్ధత ద్వారా మనం ఏకమైయున్నాము. క్రమంగా, దేవుని పట్ల మన ప్రేమ మరియు యేసు క్రీస్తు పట్ల మన శిష్యత్వము ఇతరుల కోసం ప్రత్యేక చింతను కలుగజేస్తుంది. ఇతరుల యొక్క వివిధ రకాల స్వభావాలు, దృష్టికోణాలు మరియు తలాంతులకు మనం విలువిస్తాము.19 యేసు క్రీస్తు పట్ల మన శిష్యత్వాన్ని మనం వ్యక్తిగత ఆసక్తులు మరియు దృష్టికోణాల కంటే పైగా నిలుపలేక పోయినట్లయితే, మన ప్రాధాన్యతలను తిరిగి పరీక్షించుకోవాలి మరియు మార్చుకోవాలి.
“నువ్వు నాతో అంగీకరిస్తే మనం ఐకమత్యాన్ని కలిగియుండగలం!” అని మనం చెప్పాలనుకోవచ్చు. “ఐకమత్యాన్ని పెంపొందించడానికి నేనేమి చేయగలను? క్రీస్తుకు దగ్గరయ్యేందుకు ఈ వ్యక్తికి సహాయపడడానికి నేనెలా స్పందించగలను? వివాదాన్ని తగ్గించి, దయ మరియు శ్రద్ధగల సంఘ సమాజాన్ని నిర్మించడానికి నేనేమి చేయగలను?” అని అడగడం సరైన పద్ధతి.
మన జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రేమ అతిముఖ్యమైన విషయమైనప్పుడు,20 మనం విభేదాలను సాత్వీకము, సహనము మరియు దయతో సమీపిస్తాము.21 మన స్వంత సున్నితభావాల కంటే ఎక్కువగా పొరుగువారి భావాల గురించి మనం చింతిస్తాము. మనం “మితంగా ఉండడానికి, ఐకమత్యముతో మెలగడానికి కోరతాము.”22 “సందేహపూరిత వివాదములలో” మనము కలుగజేసుకోము, మనం విభేదించే వారిని తీర్పుతీర్చము లేదా వారు తడబడునట్లు చేయుటకు ప్రయత్నించము.23 దానికి బదులుగా, మనం ఎవరితోనైతే విభేదిస్తున్నామో వారు వారికి కలిగిన జీవితానుభవాలలో వారు చేయగలిగినంత మంచిగా చేస్తున్నారని మనం అనుకుంటాము.
నా భార్య 20 ఏళ్ళకు పైగా న్యాయవాదిగా పని చేసింది. న్యాయవాదిగా ఆమె తరచు వ్యతిరేక అభిప్రాయాలను స్పష్టంగా వాదించే వారితో పనిచేసింది. కానీ కఠినంగా లేదా కోపంగా లేకుండానే విభేదించడాన్ని ఆమె నేర్చుకుంది. ప్రతివాదులతో ఆమె ఇలా చెప్పవచ్చు, “ఈ విషయంపై మనకు ఏకాభిప్రాయం కుదరడం లేదని నాకనిపిస్తోంది. మీరంటే నాకు ఇష్టం. నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. మీరు నా పట్ల ఇదేవిధమైన దయను చూపగలరని ఆశిస్తున్నాను.” విభేదాలు ఉన్నప్పటికీ తరచు ఇది పరస్పర గౌరవాన్ని, స్నేహాన్ని అనుమతించింది.
మునుపటి శత్రువులు కూడా రక్షకుని పట్ల వారి శిష్యత్వంలో ఏకం కాగలరు.24 2006లో, ఫిన్‌లాండ్‌లోని సంఘానికి తొలుత పరివర్తన చెందిన మా నాన్న మరియు తాతమామ్మల గౌరవార్థం నేను హెల్సింకి ఫిన్‌లాండ్ దేవాలయ ప్రతిష్ఠాపనకు హాజరయ్యాను. మా నాన్నతో పాటు ఫిన్‌లు దశాబ్దాల తరబడి ఫిన్‌లాండ్‌లో దేవాలయం కోసం కలలుగన్నారు. ఆ సమయంలో, దేవాలయ జిల్లాలో ఫిన్‌లాండ్, ఈస్టోనియా, లాత్వియా, లుథియానా, బెలారస్ మరియు రష్యాలు కలిసి ఉన్నాయి.
ప్రతిష్ఠాపన సమయంలో, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను తెలుసుకున్నాను. సాధారణ నిర్వహణలో మొదటి రోజు రష్యా సభ్యులు దేవాలయ విధులను నిర్వహించడం కోసం ప్రత్యేకపరచబడింది. ఇది ఎంత ఆశ్చర్యకరమైనదో వివరించడం కష్టం. శతాబ్దాల తరబడి రష్యా మరియు ఫిన్‌లాండ్ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. రష్యాను మాత్రమే కాక రష్యనులందరిని మా నాన్న నమ్మేవారు కాదు, ఇష్టపడేవారు కాదు. అటువంటి భావాలను తీవ్రంగా ఆయన వ్యక్తపరిచేవారు మరియు ఆయన భావాలు ప్రత్యేకించి రష్యా పట్ల ఫిన్‌ల శత్రుత్వాన్ని చూపుతాయి. ఫిన్‌లు మరియు రష్యనుల మధ్య జరిగిన 19వ శతాబ్దపు యుద్ధ వృత్తాంతాన్ని తెలిపే ఇతిహాస కావ్యాలను ఆయన కంఠస్థం చేసారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫిన్‌లాండ్ మరియు రష్యా మళ్ళీ విరోధులుగా ఉన్నప్పుడు, ఆయన అనుభవాలు ఆయన అభిప్రాయాలను ఏమాత్రం మార్చలేదు.
హెల్సింకి ఫిన్‌లాండ్ దేవాలయ ప్రతిష్ఠాపనకు ఒక సంవత్సరం ముందు, ప్రతిష్ఠాపన కోసం ప్రణాళికలను చర్చించడానికి ఫిన్నిష్ సభ్యులను మాత్రమే కలిగియున్న దేవాలయ కమిటీ సమావేశమైంది. ఆ సమావేశ సమయంలో, ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు రష్యను పరిశుద్ధులు చాలారోజులు ప్రయాణించి వస్తారని మరియు ఇంటికి తిరిగి వెళ్ళేముందు తమ దేవాలయ దీవెనలు పొందాలని ఆశిస్తారని ఒకరు గమనించారు. ఫిన్‌లు కొంతకాలం వేచియుండగలరని, దేవాలయంలో రష్యనులు దేవాలయ విధులను మొదట నిర్వహించవచ్చని కమిటీ అధ్యక్షుడైన సహోదరుడు స్వెన్ ఎక్లండ్ సూచించారు. దానికి కమిటీ సభ్యులంతా అంగీకరించారు. రష్యను పరిశుద్ధులకు అవకాశం కల్పించడానికి విశ్వాసులైన కడవరి దిన పరిశుద్ధ ఫిన్‌లు తమ దేవాలయ దీవెనలను ఆలస్యం చేసుకున్నారు.
ఆ దేవాలయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రాంతీయ అధ్యక్షుడైన ఎల్డర్ డెన్నిస్ బి. నొయిన్స్వండర్ తరువాత ఇలా వ్రాసారు: “ఈ క్షణంలో నేను ఫిన్‌ల గురించి గర్వించిన విధంగా ఎప్పుడూ భావించలేదు. తూర్పున ఉన్న తన పొరుగువారితో ఫిన్‌లాండ్ యొక్క కఠిన చరిత్ర … మరియు వారి స్వంత నేలపై చివరికి ఒక దేవాలయం నిర్మించబడుతుందనే వారి ఉత్సాహము అన్నీ ప్రక్కన పెట్టబడ్డాయి. ముందుగా దేవాలయంలో ప్రవేశించడానికి రష్యనులను అనుమతించడం అనేది ప్రేమ మరియు త్యాగాల యొక్క వ్యక్తీకరణ.”25
ఈ దయాళుత్వం గురించి నేను మా నాన్నకు చెప్పినప్పుడు, ఆయన హృదయం ద్రవించి, ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. నిగ్రహం గల ఆ ఫిన్‌కు అరుదుగా జరిగేదది. అప్పటినుండి మూడు సంవత్సరాల తర్వాత ఆయన మరణించే వరకు, ఆయన ఎన్నడూ రష్యా గురించి ఒక్క వ్యతిరేక భావాన్ని కూడా వ్యక్తపరచలేదు. తన సహ ఫిన్‌ల మాదిరి చేత ప్రేరేపించబడి, మా నాన్న యేసు క్రీస్తు పట్ల తన శిష్యత్వాన్ని ఇతర ఆలోచనలన్నింటి కంటే పైగా ఉంచడానికి ఎన్నుకున్నారు. ఫిన్‌లు ఫిన్‌లుగా ఉండడం మానలేదు; రష్యనులు రష్యనులుగా ఉండడం మానలేదు; శత్రుత్వాన్ని రూపుమాపడానికి ఏ ఒక్కరూ తమ సంప్రదాయాన్ని, చరిత్రను లేదా అనుభవాలను వదులుకోలేదు. వారికి ఆ అవసరం కూడా లేదు. దానికి బదులుగా, వారు యేసు క్రీస్తు పట్ల తమ శిష్యత్వాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా చేసుకోవడానికి ఎంచుకున్నారు.26
వారలా చేయగలిగితే మనము చేయగలము. మనం మన వారసత్వాన్ని, సంప్రదాయాన్ని, అనుభవాలను యేసు క్రీస్తు యొక్క సంఘానికి తీసుకురాగలము. ఒక లేమనీయునిగా తన వారసత్వాన్ని సమూయేలు 27 లేదా ఒక నీఫైయునిగా తన వారసత్వాన్ని మోర్మన్ వదులుకోలేదు.28 కానీ ప్రతిఒక్కరు రక్షకుని పట్ల తమ శిష్యత్వానికి ప్రాధాన్యతనిచ్చారు.
మనము ఒకటిగానుండని యెడల మనము ఆయన వారము కాము.29 దేవుని పట్ల మన ప్రేమను, రక్షకుని పట్ల శిష్యత్వాన్ని అన్ని ఆలోచనలకంటే పైగా ఉంచడంలో మనము శూరులైయుందామని నేను ఆహ్వానిస్తున్నాను.30 మన శిష్యత్వంలో స్వాభావిక నిబంధనను—ఒక్కటిగా ఉండాలనే నిబంధనను మనం నిలబెట్టుకుందాము.
ప్రపంచమందంతటా విజయవంతంగా క్రీస్తు యొక్క శిష్యులుగా మారిన పరిశుద్ధుల మాదిరిని మనం అనుసరిద్దాము. మనం యేసు క్రీస్తుపై ఆధారపడగలము, ఆయన “మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును … (ప్రాయశ్చిత్త త్యాగమందు) కొట్టివేయుటచేత మన మధ్యనున్న గోడను పడగొట్టెను.”31 యేసు క్రీస్తు గురించి ప్రపంచానికి మన సాక్ష్యము బలపరచబడుతుంది మరియు మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాము.32 మనం “వివాదాన్ని విడిచిపెట్టి, ప్రేమయందు ప్రభువుతో ఏక-మనస్కులుగా మారి, విశ్వాసమందు ఆయనతో ఏకమైనప్పుడు,” ఆయన శాంతి మనదవుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను.33 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.