విశ్వాసంతో వెదకినపుడు ఫలితం దక్కింది
ఆయనను వెదకు ప్రతి ఒక్కరి జీవితములను నిరంతరము మార్చుచుండు క్రీస్తునందు విశ్వాసమును పెంపొందించుకోవాలని మనందరినీ ఆహ్వానించుచున్నాను.
1846 మొదలుకొని వేలాదిమంది అగ్రగాములైన స్త్రీలు, పురుషులు మరియు పిల్లలు పడమటి దిక్కున సీయోనుకు ప్రయాణించసాగారు. వారి గొప్ప విశ్వాసము వారిలో అవధులులేని ధైర్యాన్ని పురికొల్పింది. మార్గమధ్యంలోనే కొందరు మరణించడం వలన వారి ప్రయాణం పూర్తి కాలేదు. మిగిలినవారు, తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ విశ్వాసంతో ముందుకు సాగారు.
వారికారణంగా కొన్ని తరాల తరువాత నా కుటుంబం యేసు క్రీస్తు సత్య సువార్త యొక్క దీవెనలను ఆనందించింది.
నేను తరువాత చెప్పబోయే మరో యువకునివలే, నేను మతాన్ని మరియు నా విశ్వాసాన్ని ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు నా వయసు 14. నేను మా ఇంటి దగ్గరలోని వేరే సంఘ ఆరాధనకు హాజరయ్యేవాడిని, కాని అనేక ఇతర సంఘాలను దర్శించాలని ఆశ కలిగింది.
ఒక మధ్యాహ్నం ఇద్దరు యువకులు నల్లని సూట్లు తెల్లని షర్టులు ధరించి మా పొరుగింటిలోనికి ప్రవేశించడం గమనించాను. ఈ యువకులు ప్రత్యేకంగా—కనిపించారు.
మరునాడు మా పొరుగింటి లియోనార్ లోపెజ్‌ను కలిసి ఆ ఇద్దరు యువకులను గూర్చి ఆమెను అడిగాను. వారు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సువార్తికులని లియోనార్ వివరించింది. తన కుటుంబము ఒక ఏడాది క్రిందట ఆ సంఘంలో బాప్తిస్మము పొందారని ఆమె సంతోషంగా చెప్పింది. నా ఆసక్తిని చూసి, ఆ సువార్తికులను కలుసుకొని వారి సంఘమును గూర్చి తెలుసుకోమని లియోనార్ నన్ను ఆహ్వానించింది.
రెండు రోజుల తరువాత, నేను సువార్తికులను కలుసుకోవడానికి లోపెజ్ కుటుంబంతో చేరాను. వారు యూటాలోని ఓగ్డెన్ నుండి వచ్చిన ఎల్డర్ జాన్ మెసర్లీ మరియు కాలిఫొర్నియాలోని వాల్నట్ క్రీక్ నుండి వచ్చిన ఎల్డర్ క్రిస్టఫర్ ఒసోరియో అని తమను తాము పరిచయం చేసుకున్నారు. వారిని నేనెన్నటికీ మరచిపోను.
నా వయసు 14 మాత్రమే, కాబట్టి వారు నాకు ఏమి బోధిస్తున్నారో నా తల్లికి తెలియాలని ప్రక్కనే ఉన్న మా ఇంటికి వెళ్ళాలని ఎల్డర్ మెసర్లీ గట్టిగా కోరాడు. వారు యేసు క్రీస్తును గూర్చిన సందేశం పంచుకోడానికి వచ్చినట్లు అక్కడ నమ్రతగా వివరించి, నాకు బోధించడానికి ఆమె అనుమతి అడిగాడు. నా తల్లి అంగీకరించింది మరియు వారు బోధించుచుండగా ఆమె కూడా మాతో చేరింది.
ఆ సువార్తికులు ముందుగా ప్రార్థనచేయవలెనని లియోనార్‌ను అడిగారు. ఆమె ప్రార్థన నాకు గాఢంగా నచ్చింది ఎందుకంటే ఆమె ప్రార్థన కంఠస్థం చేసిన వ్యర్థమైన మాటలు కావు, అవి ఆమె హృదయంలోనుండి వెలువడిన భావాలు. ఆమె నిజంగా తన పరలోక తండ్రితో మాట్లాడుచున్నట్లు నాకు అనిపించింది.
అప్పుడు ఆ సువార్తికులు యేసు క్రీస్తును గూర్చి బోధించారు. వారు చూపిన చిత్రం నన్నుప్రభావితం చేసింది ఎందుకంటే అది పునరుత్థానుడై సజీవుడైన క్రీస్తు యొక్క చిత్రం.
ప్రాచీన కాలంలో యేసు తానే శిరస్సుగా ఉండి పన్నెండు మంది అపొస్తలులతో ఏవిధంగా తన సంఘాన్ని స్థాపించారో వారు బోధించడం కొనసాగించారు. వారు మాకు విశ్వాసభ్రష్టత్వము గురించి—ఆయన యొక్క అపొస్తలులు మరణించిన తరువాత ఏ విధంగా సత్యము మరియు క్రీస్తు యొక్క అధికారము భూమి మీదినుండి తీసివేయబడిందో బోధించారు.
1800ల ప్రారంభంలో జోసెఫ్ స్మిత్ అనబడే ఒక 14 యేండ్ల యవ్వన బాలుడు సత్యాన్ని వెదకుచు ఏ విధంగా వివిధ సంఘాలను దర్శించాడో వారు చెప్పారు. కాలం గడిచే కొలది జోసెఫ్ మరింత కలవరపడ్డాడు. జ్ఞానము కొరకు “అడుగుడి మీకియ్యబడును” అని బైబిలులో చదివిన తరువాత జోసెఫ్ విశ్వాసముతో వ్యవహరించి, తాను ఏ సంఘములో చేరవలెనో అని ప్రార్థించి అడుగుటకు చెట్ల వనములోనికి వెళ్ళాడు.
ఆయన ప్రార్థించగా ఏమి జరిగిందో జోసెఫ్ వృత్తాంతమునుండి సువార్తికులలో ఒకరు చదివారు:
నాపై “సరిగ్గా నా తలపై సూర్యకాంతిని మించిన ఒక కాంతి స్తంభమును చూచితిని, అది నా మీద పడువరకు క్రమముగా క్రిందకు దిగెను.
“ఆ కాంతి నాపై నిలిచిన తరువాత గాలిలో నా పైన నిలువబడిన ఇద్దరు వ్యక్తులను నేను చూచితిని, వారి తేజస్సు, మహిమ వర్ణనాతీతముగా నుండెను. వారిలో ఒకరు నన్ను పేరుపెట్టి పిలిచి మరొకరిని చూపించుచూ—ఈయన నా ప్రియకుమారుడు. ఈయన మాట వినుము!”2 అని చెప్పెను.
ఆ బోధన సమయములో పరిశుద్ధాత్మ నాకు అనేక సత్యములను నిర్ధారించింది.
మొదటిది, దేవుడు ఆయన బిడ్డలందరి యొక్క నిజాయితీగల ప్రార్థనలను వినును మరియు పరలోకము అందరికీ తెరువబడియున్నది—కేవలము కొద్దిమందికే కాదు.
రెండవది, తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు స్వరూపులు, “నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుట” అను వారి ఉద్దేశ్యము కొరకు ఐక్యమైయున్నారు.
మూడవది, మనము దేవుని స్వరూపములో సృజింపబడియున్నాము. మన పరలోకతండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు, మనవలెనే మాంసము మరియు ఎముకలు గల శరీరములను కలిగియున్నారు, కానీ వారు మహిమపరచబడిన పరిపూర్ణులు, మరియు పరిశుద్ధాత్ముడు ఆత్మ స్వరూపి.
నాల్గవది, జోసెఫ్ స్మిత్ ద్వారా యేసు క్రీస్తు తన సువార్తను మరియు నిజమైన సంఘమును భూమిమీద పునఃస్థాపించియున్నారు. 2000 యేండ్ల క్రిందట క్రీస్తు యొక్క అపొస్తలుల మీద ఏ యాజకత్వపు అధికారం నిర్ధారింపబడినదో అదే యాజకత్వం జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీల మీద పేతురు, యాకోబు మరియు యోహానుల చేత నిర్ధారింపబడినది.
చివరిగా, యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధనయైన మోర్మన్ గ్రంథము గురించి మనము తెలుసుకున్నాము. అది ప్రాచీన ప్రవక్తల చేత వ్రాయబడి, యేసు క్రీస్తు జన్మకు పూర్వము, క్రీస్తు సమకాలంలోను, మరియు క్రీస్తు శకంలోను అమెరికా ఖండములో నివసించిన ప్రజలను గురించి చెప్పుచున్నది. తద్వారా పునరుత్థానుడైన రక్షకునిగా వారికి కనిపించిన క్రీస్తును వారు ఏవిధంగా తెలుసుకున్నారో, ప్రేమించారో మరియు ఆరాధించారో మనము నేర్చుకుంటాము.
“ఇదిగో లోకములోనికి వచ్చునని ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన యేసు క్రీస్తును నేనే” అని రక్షకుడు వారికి చేసిన ప్రకటన నేను తెలుసుకున్నప్పుడు ఆత్మ నన్ను విపరీతంగా కదిలించింది.
సువార్తికులు మోర్మన్ గ్రంథము యొక్క ఒక స్వంత ప్రతిని మాకు ఇచ్చారు. మోర్మన్ గ్రంథము యొక్క చివరిభాగంలో కనిపించిన ఆహ్వానమును చదివి అంగీకరించాము, అదే మనగా:
నేను దానిని తెరచినప్పుడు, మొదటి పేజీలో క్రింది వాగ్దానము వ్రాయబడింది: “మీరు ఈ సంగతులను పొందినప్పుడు, ఇవి సత్యమా కాదా అని మీరు నిత్యుడగు తండ్రియైన దేవుడిని క్రీస్తు యొక్క నామమందు అడుగవలెనని నేను మీకు ఉద్బోధించుచున్నాను; మీరు యథార్థ హృదయముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి, మనఃపూర్వకముగా అడిగిన యెడల, ఆయన వాటి సత్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రత్యక్షపరచును.”
“మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మీరు అన్ని సంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలరు.”7
నా తల్లి మరియు నేను మొట్టమొదటిగా క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుట యొక్క ఆనందము మరియు శక్తిని తెలుసుకొని ఇప్పటికి దాదాపు 45 యేండ్లు గడచాయి. క్రీస్తునందు వారి విశ్వాసమూలముగా లోపెజ్ కుటుంబము వారి నూతన విశ్వాసమును నాతో పంచుకున్నారు. క్రీస్తునందు వారి విశ్వాసమూలముగా నన్ను, నా తల్లిని కనుగొనడానికి ఈ ఇద్దరు సువార్తికులు అమెరికా సంయుక్త రాష్ట్రములలో తమ గృహములను విడిచి వచ్చారు. విశ్వాసమూలముగా ఈ ప్రియమైన స్నేహితులు మాలో నాటిన ఆవగింజంత విశ్వాసము, అప్పటినుండి పెరిగి పెద్దదై నిత్యమైన ఆశీర్వాదముల యొక్క మహా వృక్షమైనది.
ఈ ఆశీర్వాదకరమైన యేండ్లలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రకటించినట్లు: “జీవితంలో ప్రతి మంచిది—నిత్యరాజ్య ప్రాధాన్యతగల శక్తివంతమైన ప్రతి ఆశీర్వాదము—విస్వాసముతోనే ప్రారంభమగును. మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యతనివ్వడమనేది మనల్ని నడిపించడానికి ఆయన సమ్మతిస్తున్నారనే విశ్వాసంతో మొదలవుతుంది. మనల్ని శుద్ధిచేయడానికి, స్వస్థపరచడానికి మరియు బలపరచడానికి యేసు క్రీస్తు శక్తి కలిగియున్నారనే విశ్వాసంతో నిజమైన పశ్చాత్తాపము మొదలవుతుంది.8
నా ప్రియమైన తల్లియొక్క మరియు నాయొక్క జీవితములను మార్చిన క్రీస్తునందలి విశ్వాసమును నిరంతరం పెంపొందించుకోవలెనని మరియు ఆయనను వెదకు ప్రతి ఒక్కరి జీవితమును మార్చుటను కొనసాగించవలెనని మనందరినీ ఆహ్వానించుచున్నాను. జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్త అని, అధ్యక్షులు నెల్సన్ ఈనాటి మన ప్రవక్త అని, యేసు సజీవుడైన క్రీస్తు మరియు మన విమోచకుడు అని, పరలోక తండ్రి జీవించుచున్నారు మరియు ఆయన బిడ్డలందరి ప్రార్థనలకు జవాబిస్తారని నాకు తెలుసు. ఈ సత్యముల గురించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.