దేవుని ప్రేమ: ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనది
మన జీవితపు పరిస్థితులలో కాదు గానీ, మన జీవితాల్లో ఆయన ఉన్నప్పుడు దేవుని ప్రేమ కనుగొనబడుతుంది.
సహోదర సహోదరీలారా, దేవుడైన మన పరలోక తండ్రి మిమ్మల్ని ఎంత పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారో మీకు తెలుసా? మీ మనస్సు లోతుల్లో ఆయన ప్రేమను మీరు అనుభవించారా?
దేవుని బిడ్డగా మీరెంత పరిపూర్ణంగా ప్రేమించబడుతున్నారో తెలుసుకొని, అర్థం చేసుకున్నప్పుడు అది సమస్తాన్ని మార్చివేస్తుంది. మీరు తప్పులు చేసినప్పుడు మీ గురించి మీరు భావించే విధానాన్ని అది మారుస్తుంది. కష్టమైన విషయాలు జరిగినప్పుడు మీరు భావించే విధానాన్ని అది మారుస్తుంది. దేవుని ఆజ్ఞలను మీరు చూసే విధానాన్ని అది మారుస్తుంది. ఇతరుల పట్ల మీ దృష్టిని మరియు మార్పు తేవడంలో మీ సామర్థ్యాన్ని అది మారుస్తుంది.
ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా బోధించారు: “నిత్యత్వమంతటిలో మొదటి గొప్ప ఆజ్ఞ ఏదనగా, దేవుడిని మనం మన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ప్రేమించాలి—అదే మొదటి గొప్ప ఆజ్ఞ. కానీ నిత్యత్వమంతటిలో మొదటి గొప్ప సత్యం ఏదనగా, దేవుడు మనల్ని తన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ప్రేమిస్తున్నారు.”1
నిత్యత్వము యొక్క ఆ గొప్ప సత్యాన్ని మన మనస్సు లోతుల్లో మనలో ప్రతిఒక్కరం ఎలా తెలుసుకోగలము?
దేవుని ప్రేమ యొక్క అత్యంత శక్తివంతమైన సాక్ష్యము ప్రవక్తయైన నీఫైకి దర్శనంలో చూపబడింది. జీవవృక్షాన్ని చూసిన తర్వాత, దాని అర్థమేమిటో చెప్పమని నీఫై అడిగాడు. దానికి జవాబుగా ఒక దేవదూత నీఫైకి ఒక పట్టణాన్ని, ఒక తల్లిని, బిడ్డను చూపించాడు. నజరేతు పట్టణాన్ని మరియు బాలుడైన యేసును తన చేతుల్లో ఎత్తుకొని ఉన్న నీతిమంతురాలైన తల్లి మరియను నీఫై చూసినప్పుడు, దేవదూత—“దేవుని గొఱ్ఱెపిల్లను, నిజముగా నిత్యుడగు తండ్రి యొక్క కుమారుని చూడుము!” అని ప్రకటించాడు.2
ఆ పరిశుద్ధ క్షణంలో, రక్షకుని పుట్టుకలో దేవుడు తన స్వచ్ఛమైన, పరిపూర్ణమైన ప్రేమను చూపుతున్నాడని నీఫై గ్రహించాడు. దేవుని ప్రేమ “తననుతాను నరుల సంతానము యొక్క హృదయముల యందు చిందించుకొనుచున్నది” అని నీఫై సాక్ష్యమిచ్చాడు.3
దేవుని ప్రేమను జీవవృక్షం నుండి ప్రసరిస్తున్న వెలుగుగా, భూమియందంతటా తననుతాను నరుల సంతానము యొక్క హృదయముల యందు చిందించుకొనుచున్నట్లుగా మనం ఊహించుకోగలము. దేవుని ప్రేమ మరియు వెలుగు ఆయన సృష్టి అంతటా వ్యాపించియుంది.4
మనం ఇనుప దండాన్ని అనుసరించి, ఫలాన్ని తినిన తర్వాత మాత్రమే దేవుని ప్రేమను అనుభవించగలమని కొన్నిసార్లు మనం తప్పుగా అనుకుంటాము. అయినప్పటికీ, దేవుని ప్రేమ ఆ వృక్షం వద్దకు వచ్చిన వారిచేత మాత్రమే పొందబడదు, కానీ అది ఆ వృక్షాన్ని వెదకమని మనల్ని ప్రేరేపించే శక్తియైయున్నది.
“అందువలన, అది అన్ని వస్తువులను మించి మిక్కిలి కోరదగినది,” “అవును, ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనది” అని నీఫై బోధించాడు మరియు దేవదూత ప్రకటించాడు.5
ఇరవై ఏళ్ళ క్రితం, ప్రియమైన కుటుంబ సభ్యుడొకరు సంఘం నుండి దూరమయ్యారు. జవాబు దొరకని ప్రశ్నలెన్నో అతనికి ఉన్నాయి. పరివర్తన చెందిన అతని భార్య తన విశ్వాసానికి యథార్థంగా నిలిచింది. అప్పుడు ఎదురైన అభిప్రాయబేధాల మధ్య తమ వివాహాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు.
గత సంవత్సరం, సంఘం గురించి సమాధానపడేందుకు అతనికి కష్టమైన మూడు ప్రశ్నలను వ్రాసి, అతడు వాటిని అనేక సంవత్సరాలుగా అతని స్నేహితులుగా ఉన్న రెండు జంటలకు పంపాడు. ఆ ప్రశ్నల గురించి ఆలోచించమని మరియు వారి ఆలోచనలను పంచుకోవడానికి భోజనానికి రమ్మని వారిని అతడు ఆహ్వానించాడు.
స్నేహితులను కలుసుకున్న తర్వాత అతడు తన గదికి వెళ్ళి, ఒక విషయం మీద పనిచేయడం ప్రారంభించాడు. సాయంకాలపు సంభాషణ మరియు తన స్నేహితులు తన పట్ల చూపిన ప్రేమ ముందుగా అతని మనస్సులో మెదిలాయి. తన పనిని ఆపివేయాలని అతడు బలవంతం చేయబడ్డాడని తరువాత అతడు వ్రాసాడు. అతడిలా చెప్పాడు: “ప్రకాశవంతమైన వెలుగొకటి నా ఆత్మను నింపింది. … ఈ వెలుగు యొక్క లోతైన భావముతో నాకు పరిచయముంది, కానీ ఈ సందర్భంలో అది ఎన్నడూ లేనంత బలంగా పెరగడం కొనసాగి, చాలా నిముషాలు నిలిచియుంది. ఆ భావనతో నేను నిశ్శబ్దంగా కూర్చున్నాను, అది నా కోసం దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత అని నేను గ్రహించాను. … నేను సంఘానికి తిరిగి వెళ్ళగలనని మరియు అక్కడ నేను చేసే వాటిలో దేవుని యొక్క ఈ ప్రేమను వ్యక్తపరచగలనని ఒక ఆత్మీయ భావన నాతో చెప్పినట్లు నేను భావించాను.”
తర్వాత అతను తన ప్రశ్నల గురించి ఆశ్చర్యపడ్డాడు. అతడు పొందిన భావానికి అర్థమేమనగా, దేవుడు అతని ప్రశ్నలకు సంతోషించాడు మరియు స్పష్టమైన జవాబులు రాకపోవడం అతని పురోగమనాన్ని ఆపరాదు.6 అతడు ధ్యానించడం కొనసాగిస్తూనే అందరితో దేవుని ప్రేమను పంచుకోవాలి. ఆ భావనపై అతడు పనిచేసినప్పుడు, తన మొదటి దర్శనం తర్వాత, “నా ఆత్మ ప్రేమతో నింపబడింది మరియు అనేక దినములు నేను గొప్ప ఆనందంతో ఆనందించగలిగాను” అని ప్రత్యేకంగా చెప్పిన జోసెఫ్ స్మిత్‌తో అతను బంధుత్వాన్ని భావించాడు.7
విశేషంగా, కొన్ని నెలల తర్వాత, ఈ కుటుంబ సభ్యుడు 20 సంవత్సరాలకు ముందు అతడు కలిగియున్న అదే పిలుపును అందుకున్నాడు. మొదటిసారి అతడు పిలుపును కలిగియున్నప్పుడు, సంఘము యొక్క విధేయుడైన సభ్యునిగా అతడు తన బాధ్యతలను నిర్వర్తించాడు. ఇప్పుడు అతనికున్న ప్రశ్న, “ఈ పిలుపును నేను ఏవిధంగా నెరవేర్చగలను?” అని కాదు, కానీ “నా సేవ ద్వారా దేవుని ప్రేమను నేనెలా చూపగలను?” అని. ఈ క్రొత్త దృక్పథంతో అతడు తన పిలుపు యొక్క అంశాలన్నిటిలో ఆనందాన్ని, అర్థాన్ని మరియు ఉద్దేశ్యాన్ని అనుభవించాడు.
సహోదర సహోదరీలారా, దేవుని ప్రేమ యొక్క పరివర్తనాశక్తిని మనమెలా పొందగలము? “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులందరికి ఆయన అనుగ్రహించిన ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని హృదయము యొక్క పూర్ణ శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి” అని ప్రవక్తయైన మోర్మన్ మనల్ని ఆహ్వానిస్తున్నారు.8 ఇతరుల కోసం ఆయన ప్రేమను మనం అనుభవించగలిగేలా ప్రార్థన చేయాలని మాత్రమే కాదు, కానీ మన కోసం దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనం తెలుసుకోగలిగేలా ప్రార్థించమని మోర్మన్ మనల్ని ఆహ్వానిస్తున్నారు.9
ఆయన ప్రేమను మనం పొందినప్పుడు, “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరులుగా” మారి, ఆయనలా ప్రేమించడానికి మరియు సేవ చేయడానికి ప్రయత్నించడంలో మనం గొప్ప ఆనందాన్ని కనుగొంటాము.10
మన జీవితపు పరిస్థితులలో కాదు గానీ, మన జీవితాల్లో ఆయన ఉన్నప్పుడు దేవుని ప్రేమ కనుగొనబడుతుంది. మన స్వంత దానికి మించిన శక్తిని మనం పొందినప్పుడు మరియు ఆయన ఆత్మ శాంతిని, ఓదార్పును, మార్గనిర్దేశాన్ని తెచ్చినప్పుడు మనం ఆయన ప్రేమను తెలుసుకుంటాము. కొన్నిసార్లు ఆయన ప్రేమను అనుభవించడం కష్టం కావచ్చు. మన జీవితాలలో ఆయన హస్తమును చూడడానికి మరియు ఆయన సృష్టి యొక్క అందాలలో ఆయన ప్రేమను చూడడానికి మన కన్నులు తెరువబడాలని మనం ప్రార్థించగలము.
రక్షకుని యొక్క జీవితం మరియు ఆయన అనంతమైన త్యాగము గురించి మనం ధ్యానించినప్పుడు, మన కోసం ఆయన ప్రేమను గ్రహించడాన్ని మనం ప్రారంభించగలము. మనం భక్తితో ఎలైజా ఆర్. స్నో యొక్క పదాలను పాడుతాం: “అమూల్యమైన తన రక్తాన్ని ఆయన ఉచితముగా చిందించెను; తన ప్రాణాన్ని ఆయన ఉచితముగా ఇచ్చెను.”11 మనకోసం పడిన బాధలో యేసు యొక్క అణకువ మన ఆత్మలను శుద్ధిచేస్తుంది, ఆయన నుండి క్షమాపణ కోరడానికి మన హృదయాలను తెరుస్తుంది మరియు ఆయన వలె ప్రేమించాలనే కోరికతో మనల్ని నింపుతుంది.12
“ఆయన జీవితంలా మన జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి మనం ఎంత ఎక్కువగా నిబద్ధులమైతే, మన ప్రేమ అంత స్వచ్ఛంగా మరియు ఎక్కువ దైవికంగా మారుతుంది” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వ్రాసారు.13
మా అబ్బాయి ఇలా చెప్పాడు:“నేను 11 ఏళ్ళు ఉన్నప్పుడు, మా బోధకుని నుండి దాగుకొని, మా ప్రాథమిక తరగతిలో మొదటి భాగాన్ని ఎగవేయాలని నేను, నా స్నేహితులు నిర్ణయించుకున్నాము. చివరికి మేము తరగతికి వచ్చినప్పుడు, బోధకుడు మమ్మల్ని ప్రేమగా పలకరించడం చూసి మేము ఆశ్చర్యపోయాము. తర్వాత ఆయన హృదయపూర్వక ప్రార్థన చేసారు, అందులో ఆ రోజు మేము స్వచ్ఛందంగా తరగతికి రావాలని నిర్ణయించుకున్నందుకు ప్రభువుకు మనఃపూర్వకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేని గురించి పాఠం చెప్పారో లేదా మా బోధకుని పేరేమిటో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు, సుమారు 30 సంవత్సరాల తర్వాత కూడా ఆరోజు ఆయన నాపట్ల చూపిన స్వచ్ఛమైన ప్రేమచేత నేనింకా స్పృశించబడుతున్నాను.”
ఐదేళ్ళ క్రితం, రష్యాలో ప్రాథమికకు హాజరవుతున్నప్పుడు దైవిక ప్రేమకు ఒక ఉదాహరణను నేను గమనించాను. విశ్వాసురాలైన ఒక సహోదరి ఇద్దరు అబ్బాయిల ముందు మోకరించి, వారిద్దరు మాత్రమే భూమి మీద నివసిస్తున్నప్పటికీ, కేవలం వారి కోసం యేసు బాధననుభవించి, మరణించియుండేవారని వారికి సాక్ష్యమివ్వడాన్ని నేను చూసాను.
మనలో ప్రతి ఒక్కరి కోసం నిజంగా మన ప్రభువు మరియు రక్షకుడు మరణించారని నేను సాక్ష్యమిస్తున్నాను. మన కోసం మరియు ఆయన తండ్రి కోసం ఆయన అనంతమైన ప్రేమకు నిదర్శనమది.
“నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు. మధురమైన ఈ వాక్యం ఎంత ఓదార్పునిస్తుంది! … తన ప్రేమతో (మనల్ని) దీవించడానికి ఆయన జీవిస్తున్నారు.”14
మన కోసం దేవుడు కలిగియున్న స్వచ్ఛమైన ప్రేమను పొందడానికి మన హృదయాలను మనం తెరుద్దాం, ఆ తర్వాత మనం ఉండే మరియు చేసే వాటన్నిటిలో ఆయన ప్రేమను వెదజల్లుదాం. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.