గొప్ప మహిమయందు, దేవుని శక్తితో
నిబంధనలను ఘనపరచడం పరిశుద్ధతతో మరియు గొప్ప మహిమయందు దేవుని యొక్క శక్తితో ఆయుధములుగా మనల్ని ధరింపచేస్తుంది.
కాలముల సంపూర్ణ యుగములో రక్షణ యొక్క ఆశ్చర్యకార్యమును మరియు ఉన్నతస్థితిని మనము పరిగణించినప్పుడు పరిశుద్ధాత్మ మనందరికీ జ్ఞానవృద్ధిని, ఆత్మీయాభివృద్ధిని కలుగజేయాలని నేను ప్రార్థిస్తున్నాను.
జోసెఫ్ స్మిత్‌కు మొరోనై యొక్క మొదటి దర్శనము
మొదటి దర్శనమునకు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, 1823, సెప్టెంబరు 21 రాత్రి, యువ జోసెఫ్ స్మిత్ తన పాపములకు పరిహారము పొందాలని మరియు దేవుని ఎదుట అతని స్థితిని, స్థాయిని తెలుసుకోవాలని ప్రార్థించాడు.1 అతని మంచము ప్రక్కన ఒక వ్యక్తి ప్రత్యక్షమై, జోసెఫ్‌ను పేరుతో పిలిచి, “అతడు దేవుని సన్నిధి నుండి పంపబడిన ఒక దూత అని … అతని పేరు మొరోనై” అని ప్రకటించాడు. “[జోసెఫ్] చేయవలసిన ఒక పనిని దేవుడు కలిగియున్నాడని”2 అతడు వివరించాడు మరియు తరువాత మోర్మన్ గ్రంథము రాకను గూర్చి అతనికి ఉపదేశించాడు. విశేషమేమిటంటే, మొరోనై సందేశంలో చెప్పబడిన అంశాలలో మోర్మన్ గ్రంథము మొదటిది.
మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన మరియు కడవరి దినములలో పరివర్తనకు గొప్ప సాధనము. సువార్తను పంచుకోవడంలో మన ఉద్దేశ్యమేమిటంటే యేసు క్రీస్తు 3 వద్దకు రావాలని అందరినీ ఆహ్వానించడం, పునఃస్థాపించబడిన సువార్త దీవెనలు పొందడం, మరియు రక్షకునిపై 4 విశ్వాసం ద్వారా అంతము వరకు సహించడం. వ్యక్తులు హృదయము యొక్క గొప్ప మార్పును5 అనుభవించడానికి మరియు పవిత్ర నిబంధనలు, విధుల ద్వారా తమను తాము దేవునితో బంధించుకోవడానికి సహాయపడడమే సువార్తను ప్రకటించడానికి గల ప్రాథమిక ఉద్దేశ్యాలు.
మొరోనై మోర్మన్ గ్రంథమును జోసెఫ్ స్మిత్‌కు పరిచయం చేయడం కాలముల సంపూర్ణ యుగములో తెరకు ఇటువైపు ఉన్న వ్యక్తుల కొరకు రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యమును ప్రారంభించింది.
జోసెఫ్‌కు తన ఉపదేశాన్ని కొనసాగిస్తూ మొరోనై, కింగ్ జేమ్స్ అనువాదంలో ఉపయోగించిన భాషలో కొంత మార్పుతో పాత నిబంధనలోని మలాకీ గ్రంథం నుండి వ్యాఖ్యానించాడు:
“ప్రభువు నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలీయా చేతిద్వారా యాజకత్వమును నేను మీకు తెలియజేయుదును.
“… పితరులకు చేయబడిన వాగ్దానములను పిల్లల హృదయాలలో అతడు నాటును, అప్పుడు పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరుగును. అట్లు కానియెడల, ఆయన రాకడ సమయమున భూమి యంతయు పూర్తిగా నాశనము చేయబడును.” 6
దేవాలయాలను నిర్మించడంలో మన ఉద్దేశ్యం, మానవ కుటుంబం యొక్క రక్షణ మరియు ఉన్నతస్థితికి అవసరమైన పవిత్ర నిబంధనలను సజీవులకు మరియు మృతులకు నిర్వహించే పరిశుద్ధ స్థలాలను అందుబాటులో ఉంచడం. ఏలీయా గురించి మరియు యాజకత్వ అధికారం యొక్క ప్రాముఖ్యమైన పాత్ర గురించి జోసెఫ్ స్మిత్‌కు మొరోనై చేసిన సూచన, తెరకు ఇటువైపు రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యమును విస్తరించి, తెరకు అటువైపు ఉన్న మృతుల కొరకు కార్యమును మన యుగములో ప్రారంభించింది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, మోర్మన్ గ్రంథము మరియు ఏలీయా యొక్క నియమితకార్యము గురించి 1823 సెప్టెంబరులో మొరోనై చేసిన బోధనలు తెరకు రెండు వైపులా రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము కొరకు సిద్ధాంతపరమైన పునాదిని ఏర్పాటు చేసింది.
ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ యొక్క బోధనలు
మొరోనై నుండి జోసెఫ్ స్మిత్ నేర్చుకున్న పాఠాలు అతని పరిచర్యలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేశాయి. ఉదాహరణకు, 1837, ఏప్రిల్ 6న కర్ట్‌లాండ్ దేవాలయములో జరిగిన ఒక గంభీరమైన సభలో, ప్రవక్త ఇలా అన్నారు: “సమస్తము చెప్పబడిన తరువాత, అత్యంత ఘనమైన మరియు అతి ముఖ్యమైన కర్తవ్యం సువార్తను ప్రకటించడం.”7
సరిగ్గా ఏడు సంవత్సరాల తరువాత, 1844, ఏప్రిల్ 7న, కింగ్ ఫోల్లెట్ ఉపన్యాసముగా నేడు పిలువబడే ప్రసంగాన్ని జోసెఫ్ స్మిత్ చేసారు. “ఈ ప్రపంచంలో దేవుడు మనపై ఉంచిన గొప్ప బాధ్యత మన మృతుల కొరకు వెదకడం”8 అని ఆయన తన ప్రసంగంలో ప్రకటించారు.
అయితే, సువార్త ప్రకటించడం మరియు మృతల కొరకు వెదకడం ఈ రెండూ దేవుడు మనపై ఉంచిన ఏకైక గొప్ప కర్తవ్యం మరియు బాధ్యత ఎలా అవుతుంది? అధికారముగల యాజకత్వ విధుల ద్వారా నిబంధనలలోనికి ప్రవేశించడం, ప్రభువైన యేసు క్రీస్తుకు మనలను బంధించగలవని మరియు తెరకు రెండువైపులా రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమునకు ముఖ్యమైన అంశమని ఈ రెండు ప్రకటనలలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ నొక్కిచెప్పారు.
సువార్త పరిచర్య, దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యము అనేవి పవిత్ర నిబంధనలు మరియు విధులపై దృష్టిసారించే ఒక గొప్ప కార్యము యొక్క పరిపూరకమైన మరియు పరస్పర సంబంధమైన అంశాలు, అవి మన జీవితాలలో దైవత్వము యొక్క శక్తిని పొందడానికి, మరియు చివరకు పరలోక తండ్రి సన్నిధికి తిరిగి వెళ్ళడానికి వీలు కల్పిస్తాయి. అందువలన, ప్రవక్త యొక్క ఈ రెండు ప్రకటనలు మొదట్లో విరుద్ధంగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి ఈ గొప్ప కడవరి దిన కార్యము యొక్క కేంద్ర బిందువును ప్రధానాంశముగా పేర్కొంటాయి.
నిబంధనలు మరియు విధులు ద్వారా రక్షకునికి కట్టుబడియుండుట
రక్షకుడు ఇలా చెప్పారు:
“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” 9
పవిత్ర నిబంధనలు మరియు విధుల గురించి మనం నేర్చుకొని, యోగ్యతతో స్వీకరించి, వాటిని ఘనపరచినప్పుడు మనపై రక్షకుని కాడిని తీసుకుంటాయి. మనం అంగీకరించిన బాధ్యతలను విశ్వాసంగా జ్ఞాపకముంచుకొని, వాటి ప్రకారం జీవించడానికి మన వంతు కృషి చేసినప్పుడు మనము రక్షకునికి మరియు రక్షకునితో సురక్షితంగా బంధించబడి ఉంటాము. ఆయనతో ఆ బంధము మన జీవితంలోని ప్రతి కాలములో ఆత్మీయ బలానికి మూలాధారము.
ప్రభువు యొక్క నిబంధన జనులు
నిబంధన పాటించు యేసు క్రీస్తు యొక్క శిష్యులకు వాగ్దానము చేయబడిన దీవెనలను పరిగణించమని నేను మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. ఉదాహారణకు, నీఫై “[కడవరి దినములలో] నేను దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క సంఘమును చూచెను … దాని సభ్యుల సంఖ్య స్వల్పముగా నుండెను; దేవుని పరిశుద్ధులు కూడా భూముఖమంతటా ఉండిరి; వారి ఆధిపత్యములు … స్వల్పముగా ఉండెను.”10
నీఫై మనల్ని మరియు మన కాలాన్ని చూసి ఇలా వ్రాసాడు, “భూముఖమంతటిపై చెదిరియున్న గొఱ్ఱెపిల్ల సంఘము యొక్క పరిశుద్ధులపైన, ప్రభువు నిబంధన జనులపైన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క శక్తి దిగివచ్చుట నీఫైయను నేను చూచితిని; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి.”11
“గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి” అనే వచనము కేవలము మంచి ఆలోచన లేదా అందమైన లేఖన భాషకు ఉదాహరణ కాదు. బదులుగా, ప్రభువు యొక్క అసంఖ్యాకమైన కడవరి దిన శిష్యుల జీవితాలలో ఈ దీవెనలు స్పష్టంగా కనిపిస్తాయి.
పన్నెండుమంది సభ్యుడిగా నా నియామకాలు నన్ను ప్రపంచమంతా తీసుకువెళతాయి. మీలో చాలా మందిని కలవడం మరియు చిరస్మరణీయమైన పాఠాలు నేర్చుకోవడం వలన నేను దీవించబడ్డాను. ప్రభువు యొక్క నిబంధన జనులు నేడు నిజముగా గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. దేవుడు మాత్రమే సమకూర్చగల మర్త్య సామర్థ్యానికి మించి విస్తరించిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని, దృష్టికోణాన్ని, పట్టుదల మరియు ఆనందాన్ని నేను చూసాను.
భయంకరమైన మోటారు వాహన ప్రమాదంలో పాక్షికంగా పక్షవాతానికి గురైన ఒక యువ సంఘ సభ్యుని జీవితములో నిబంధనలు మరియు విధుల ద్వారా పొందిన గొప్ప మహిమయందు పరిశుద్ధతను,దేవుని శక్తిని నేను చూసాను. స్వస్థతపొందే ఆ బాధాకరమైన నెలలు మరియు పరిమితమైన చలనముతో క్రొత్త జీవనశైలికి అలవాటు పడిన తరువాత, నేను ఈ ధైర్యవంతుడ్ని కలుసుకుని, మాట్లాడాను. మా సంభాషణ సమయంలో నేను ఇలా అడిగాను, “ఈ అనుభవం మీకు ఏమి నేర్చుకోవడానికి సహాయపడింది? తక్షణమే వచ్చిన ప్రతిస్పందన, “నేను విచారంగా లేను. నేను కోపంగా లేను. అంతా బాగానే ఉంటుంది.”
సంఘములో క్రొత్తగా బాప్తిస్మము పొంది, నిర్ధారించబడిన సభ్యుల జీవితాలలో నిబంధనలు మరియు విధుల ద్వారా పొందిన గొప్ప మహిమయందు నీతిని, మరియు దేవుని శక్తిని నేను చూసాను. పరివర్తన చెందిన వీరు నేర్చుకోవడానికి మరియు సేవ చేయడానికి ఆతృతగా ఉన్నారు, సమ్మతించుచున్నప్పటికీ, పాత అలవాట్లు మరియు బలమైన సంప్రదాయాలను ఎలా ప్రక్కన పెట్టాలనే దాని గురించి తరచుగా వీరికి తెలియదు, అయినప్పటికీ “పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారు”12 అగుటకు ఆనందించుచున్నారు.
ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న జీవిత భాగస్వామి మరియు తండ్రిని ఆప్యాయంగా చూసుకున్న ఒక కుటుంబము యొక్క జీవితాలలో నిబంధనలు మరియు విధుల ద్వారా పొందిన గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని నేను ప్రత్యక్షంగా చూసాను. ఈ ధైర్యవంతులైన శిష్యులు తమ కుటుంబం ఒంటరిగా భావించిన సమయాలను—మరియు ప్రభువు హస్తము వారిని పైకెత్తి, బలోపేతం చేస్తున్నట్లు వారు తెలుసుకున్న సమయాలను వివరించారు. మనము అభివృద్ధి చెందడానికి, పరలోక తండ్రి మరియు మన విమోచకుడైన యేసు క్రీస్తువలె మరింతగా మారడానికి అనుమతించే కష్టమైన మర్త్య అనుభవాలకు ఈ కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దేవుడు ఈ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ సహవాసంతో పోషించి, దీవించారు మరియు వారి ఇంటిని దేవాలయం వలె పవిత్రమైన ఆశ్రయ దుర్గముగా చేసారు.
విడాకుల గుండెకోతను అనుభవించిన సంఘ సభ్యురాలి జీవితంలో నిబంధనలు మరియు విధుల ద్వారా పొందిన గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని నేను ప్రత్యక్షంగా చూసాను. ఈ సహోదరి యొక్క ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ బాధ ఆమె జీవిత భాగస్వామి నిబంధనలను ఉల్లంఘించడం మరియు వారి వివాహం విచ్ఛిన్నం కావడంతో సంబంధం ఉన్న అన్యాయ భావనతో అధికమయ్యింది. న్యాయం మరియు జవాబుదారీతనాన్ని ఆమె కోరింది.
ఈ నమ్మకమైన స్త్రీ తనకు జరిగిన అన్ని విషయాలతో పోరాడుతున్నందున, ఆమె జీవితంలో మునుపెన్నడూ లేనంత శ్రద్ధగా, తీవ్రంగా రక్షకుని ప్రాయశ్చిత్తాన్ని అధ్యయనం చేసింది మరియు ధ్యానించింది. క్రమంగా, క్రీస్తు యొక్క విమోచన నియమితకార్యముపై అనగా మన పాపాల కొరకు మరియు మన బాధలు, బలహీనతలు, నిరాశలు మరియు వేదన కొరకు ఆయన పడిన శ్రమ యొక్క లోతైన అవగాహన ఆమె ఆత్మపై కురిసింది. ఆమె తనను తాను ఒక సూటైన ప్రశ్నను అడగడానికి ప్రేరేపించబడింది: ఆ పాపాలకు ఇప్పటికే ధర చెల్లించినందున, ధరను రెండుసార్లు చెల్లించాలని నీవు గట్టిగా అడుగుతావా? అలాంటి ఆవశ్యకత న్యాయమైనది లేదా దయగలది కాదని ఆమె గ్రహించింది.
నిబంధనలు మరియు విధుల ద్వారా రక్షకునితో ఆమె బంధించబడడం వలన మరొక వ్యక్తి యొక్క నైతిక కర్తృత్వమును అన్యాయంగా సాధన చేయడం వలన కలిగే గాయాలను నయం చేయగలదని, క్షమించడానికి మరియు శాంతి, దయ, ప్రేమను పొందే సామర్థ్యాన్ని కనుగొనడానికి ఆమెకు వీలు కల్పించిందని తెలుసుకుంది.
వాగ్దానము మరియు సాక్ష్యము
నిబంధన వాగ్దానాలు మరియు దీవెనలు మన రక్షకుడైన యేసు క్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతాయి. ఆయనవైపు చూడమని,13 ఆయన యొద్దకు రమ్మని,14 ఆయన గురించి నేర్చుకోమని,15 మరియు ఆయన పునఃస్థాపించబడిన సువార్త యొక్క నిబంధనలు మరియు విధుల ద్వారా మనల్ని ఆయనతో బంధించుకోవాలని16 ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. నిబంధనలను ఘనపరచడం మనల్ని గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనేలా చేస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు వాగ్దానం చేస్తున్నాను. మరియు జీవముగల ప్రభువైన యేసు క్రీస్తు మన రక్షకుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ సత్యాలను గూర్చి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఆనందంగా నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.