మీ కథను వ్రాయడానికి క్రీస్తును ఆహ్వానించండి
మీ కథనం విశ్వాసంతో కూడుకున్నది కానివ్వండి, మీ మాదిరి, రక్షకుడునైన యేసు క్రీస్తును అనుసరించనివ్వండి.
స్వీయ చింతనకు సంబంధించిన అనేక ప్రశ్నలు అడగడంతో నేను ప్రారంభిస్తాను:
-
మీ జీవితం కొరకు ఏవిధమైన వ్యక్తిగత చరిత్రను మీరు వ్రాస్తున్నారు?
-
మీ కథలో మీరు వర్ణించే మార్గం తిన్నగా మరియు ఇరుకుగా ఉందా?
-
మీరు మొదలుపెట్టిన చోట అనగా మీ పరలోక గృహం వద్ద మీ కథ అంతమవుతుందా?
-
మీ కథలో ఏదైనా మాదిరి ఉందా—అది రక్షకుడైన యేసు క్రీస్తేనా?
రక్షకుడే “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు” అని నేను సాక్ష్యమిస్తున్నాను.1 మీ కథకు కర్తయు దానిని కొనసాగించువానిగా ఉండేందుకు మీరు ఆయనను ఆహ్వానిస్తారా?
ఆయన ఆదియు అంతమును ఎరుగును. ఆయన భూమ్యాకాశముల సృష్టికర్త. ఆయన మరియు మన పరలోక తండ్రి యొద్దకు మనం ఇంటికి తిరిగి రావాలని ఆయన కోరుతున్నారు. ఆయన మనకు సహాయపడేందుకు ప్రతిదానిని వినియోగించారు మరియు మనం సఫలం కావాలని కోరుతున్నారు.
మన కథను వ్రాయడానికి ఆయనపై ఆధారపడడం నుండి మనల్ని దూరముంచుతున్నది ఏమిటని మీరనుకుంటున్నారు?
మీ స్వీయ పరీక్షకు బహుశా ఈ ఉదాహరణ సహాయపడుతుంది.
వాదోపవాదాలు జరిగే సమయంలో అరుదుగా ఒక సాక్షిని తనకు సమాధానం తెలియని ప్రశ్న అడగాలని ఒక మంచి న్యాయవాదికి తెలుసు. అటువంటి ప్రశ్న అడగడం అంటే మీకు—న్యాయాధిపతికి మరియు న్యాయ సహాయకులకు—మీకిదివరకే తెలియని దానిని చెప్పమని సాక్షిని ఆహ్వానించడం. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే జవాబు మీకు దొరకవచ్చు మరియు మీ దావా కోసం మీరు తయారుచేసుకున్న వివరణకు విరుద్ధంగా ఉండవచ్చు.
ఒక సాక్షిని తనకు జవాబు తెలియని ప్రశ్న అడగడం అనేది సాధారణంగా ఒక మంచి న్యాయవాది లక్షణం కానప్పటికీ, దానికి వ్యతిరేకమైనది మన విషయంలో సత్యము. మన ప్రియ పరలోక తండ్రి గురించి కనికరముగల మన రక్షకుని నామములో మనం ప్రశ్నలు అడగవచ్చు మరియు పరిశుద్ధాత్మయే మన ప్రశ్నలకు జవాబిచ్చే సాక్షి, ఆయన ఎల్లప్పుడూ సత్యం గురించి సాక్ష్యమిస్తారు.2 పరిశుద్ధాత్మ పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో పరిపూర్ణ ఐక్యతలో పనిచేస్తారు, కాబట్టి పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు ఆధారపడదగినవి అని మనకు తెలుసు. అయితే, పరిశుద్ధాత్మ చేత మనకు సత్యం ప్రత్యక్షపరచబడినప్పుడు, ఈ విధమైన పరలోక సహాయం కోరడానికి కొన్నిసార్లు మనమెందుకు అడ్డు చెప్తాము? సాక్షి మనతో స్నేహపూర్వకంగా ఉండడమే కాకుండా ఎల్లప్పుడూ సత్యమే చెప్తున్నప్పుడు, మనకు జవాబు తెలియని ప్రశ్న అడగడానికి మనమెందుకు ఆలస్యం చేస్తున్నాము?
బహుశా, మనం పొందే జవాబును అంగీకరించేటంత విశ్వాసం మనకు లేనందువలన కావచ్చు. బహుశా, పరిస్థితులను పూర్తిగా ప్రభువు చేతిలో పెట్టి, ఆయనను సంపూర్ణంగా నమ్మడానికి మనలో ఉన్న ప్రకృతిసంబంధియైన మనిషి అడ్డగించడం వలన కావచ్చు. అందుకే మన కోసం మనం వ్రాసుకున్న కథకు, అనగా గొప్ప రచయిత చేత సవరణలు చేయబడని సౌకర్యవంతమైన కథనం ఉన్న మన కథకే పరిమితం కావాలని ఎంచుకొనియుండవచ్చు. మన కోసం మనం వ్రాసుకుంటున్న కథలో చక్కగా ఇమడని ప్రశ్నను అడగాలని కాని, జవాబు పొందాలని కాని మనం కోరుకోము.
స్పష్టముగా, మనలో కొద్దిమందే మనల్ని మెరుగుపెట్టే శోధనలను మన కథలలో వ్రాసియుండవచ్చు. కానీ, మనం చదివే కథలో నాయకుడు శోధనను జయించినప్పుడు కలిగే మహిమకరమైన ఉన్నతస్థితిని మనం ఇష్టపడమా? శోధనలనేవి మనకిష్టమైన కథలను నిర్బంధమైనవిగా, కాలాతీతంగా, విశ్వాసాన్ని ప్రేరేపించేవిగా మరియు చెప్పడానికి యోగ్యమైనవిగా చేసే కథావస్తువులు. మన కథలలో వ్రాయబడిన అందమైన శ్రమలు మనల్ని రక్షకునికి దగ్గర చేసి, మరింతగా ఆయన వలె తయారుచేస్తూ మనల్ని మెరుగుపెడతాయి.
దావీదు గొల్యాతును జయించడంలో ఆ బాలుడు భారీకాయుడిని ఎదుర్కోవడానికి సమ్మతించాలి. గొర్రెలు మేపుకోవడానికి తిరిగివెళ్ళడం దావీదుకు సౌకర్యవంతమైన కథనం కావచ్చు. కానీ దానికి బదులుగా, సింహం మరియు ఎలుగుబంటి నుండి గొర్రెపిల్లలను రక్షించిన తన అనుభవం గురించి అతడు ఆలోచించాడు. ఆ వీరోచితమైన సాహసాలపై ఆధారపడుతూ, “సింహము యొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడను నన్ను విడిపించునని”3 చెప్తూ తన కథను వ్రాయడానికి దేవుడిని అనుమతించేందుకు కావలసిన విశ్వాసం మరియు ధైర్యాన్ని అతడు కూడదీసుకున్నాడు. దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వాలనే కోరికతో, పరిశుద్ధాత్మకు చెవియొగ్గి, తన కథకు కర్తయు దానిని కొనసాగించువానిగా రక్షకుడు ఉండాలనే సమ్మతితో బాలుడైన దావీదు గొల్యాతును ఓడించి, తన జనులను కాపాడాడు.
కర్తృత్వము యొక్క ఘనమైన సూత్రము మన స్వంత కథలను వ్రాయడానికి మనల్ని అనుమతిస్తుంది—దావీదు ఇంటికి తిరిగివెళ్ళి, గొర్రెలను మేపుకొనియుండవచ్చు. కానీ, మనల్ని దైవిక సాధనాలుగా, ఉత్తమ రచనను వ్రాయడానికి ఆయన చేతిలో చెక్కిన పెన్సిళ్ళుగా ఉపయోగించడానికి యేసు క్రీస్తు సిద్ధంగా ఉంటారు. ఆయనను అనుమతించేటంత విశ్వాసం నాకున్నట్లయితే, నా కథ వ్రాయడానికి నేను ఆయనను అనుమతించినట్లయితే, సన్నటి పెన్సిలు అయిన నన్ను ఆయన చేతులలో ఒక సాధనంగా ఉపయోగించడానికి ఆయన దయతో సమ్మతిస్తారు.
దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిచ్చే మరొక అందమైన ఉదాహరణ ఎస్తేరు. స్వీయ రక్షణ గురించి జాగ్రత్త వహించే కథనాన్ని అంటిపెట్టుకొని ఉండడానికి బదులుగా ఆమె తననుతాను పూర్తిగా ప్రభువు చేతికప్పగించుకొని, విశ్వాసాన్ని సాధన చేసింది. పర్షియాలో యూదులందరి వినాశనానికి హామాను కుట్రపన్నుతున్నాడు. ఎస్తేరు బంధువైన మొర్దెకై ఆ కుట్ర గురించి తెలుసుకొని, ఆమె జనుల తరఫున రాజుతో మాట్లాడమని అభ్యర్థిస్తూ ఆమెకు లేఖ వ్రాసాడు. పిలుపు రాకుండా రాజు దగ్గరకు వెళ్ళేవారికి మరణదండన విధించబడుతుందని ఆమె వివరించింది. కానీ విశ్వాసం యొక్క మహత్తర కార్యంలో, యూదులను సమకూర్చి తన కోసం ఉపవాసం చేయమని ఆమె మొర్దెకైను అడిగింది. “నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను”4 అని చెప్పింది.
మర్త్యత్వపు దృష్టిలో అంతము విషాదాంతమైయున్నప్పటికీ, తన కథను వ్రాయడానికి రక్షకుడిని అనుమతించడానికి ఎస్తేరు సమ్మతించింది. దీవెనకరంగా, రాజు ఎస్తేరును స్వీకరించాడు మరియు పర్షియాలోని యూదులు రక్షించబడ్డారు.
అయితే, ఎస్తేరు వంటి ధైర్యము అరుదుగా మన నుండి అడుగబడింది. కానీ దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి, మన కథలకు కర్తయు దానిని కొనసాగించువానిగా రక్షకుడిని అనుమతించడానికి మనం ఆయన ఆజ్ఞలను మరియు ఆయనతో చేసిన నిబంధనలను పాటించాలి. పరిశుద్ధాత్మ ద్వారా బయల్పాటును పొందడానికి మన కోసం మార్గం తెరిచే సాధనమే మనం పాటించే ఆజ్ఞలు మరియు నిబంధనలు. ఆత్మ యొక్క ప్రత్యక్షతల ద్వారానే మనతోపాటు మన కథలను వ్రాయడంలో బోధకుని హస్తాన్ని మనం భావిస్తాము.
యేసు క్రీస్తులో మనకు మరింత విశ్వాసమున్నట్లయితే, మనమేమి చేయగలమో ఆలోచించమని 2021, ఏప్రిల్‌లో మన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని అడిగారు. యేసు క్రీస్తులో మరింత విశ్వాసంతో మనకు జవాబు తెలియని ప్రశ్నను మనం అడగవచ్చు—సత్యం గురించి సాక్ష్యమిచ్చే పరిశుద్ధాత్మ చేత జవాబు పంపమని యేసు క్రీస్తు నామములో మన పరలోక తండ్రిని అడగవచ్చు. మనకు మరింత విశ్వాసం ఉన్నట్లయితే మనం ప్రశ్న అడుగుతాం మరియు మనం పొందే జవాబు సౌకర్యవంతమైన మన కథనంలో ఇమడనప్పటికీ, దానిని అంగీకరించడానికి సమ్మతిస్తాం. యేసు క్రీస్తు నందు విశ్వాసంతో చర్య తీసుకోవడం వలన కలిగే వాగ్దాన దీవెన ఏదనగా, మన కర్తయు దానిని కొనసాగించువానిగా ఆయన యందు అధికమైన విశ్వాసం. “విశ్వాసం ఎక్కువగా అవసరమైన దానిని చేయడం ద్వారా మనం విశ్వాసాన్ని ఎక్కువగా పొందుతాము” అని అధ్యక్షులు నెల్సన్ ప్రకటించారు.5
కాబట్టి, సంతానలేమితో బాధపడుతున్న పిల్లలులేని ఒక జంట తమకోసం వ్రాసుకున్న కథనంలో అద్భుతమైన పుట్టుకను చేర్చినప్పటికీ, వారు ఒక బిడ్డను దత్తత తీసుకొని, జవాబును అంగీకరించడానికి సమ్మతించవచ్చా అని విశ్వాసంతో అడుగవచ్చు.
ఒక వృద్ధ జంట తమకోసం వ్రాసుకున్న కథనంలో పనిచేయడానికి మరింత సమయం కావాలని చేర్చినప్పటికీ, వారు సువార్త పరిచర్య చేయడానికి మరియు వెళ్ళేందుకు సమ్మతించడానికి ఇది సరైన సమయమా అని అడుగవచ్చు. లేదా “ఇప్పుడే కాదు” అని జవాబు రావచ్చు మరియు వారు ఇంకొంత కాలం ఇంటి దగ్గరే ఎందుకు ఉండాలో అనేదానిని వారు తమ కథలో తరువాతి అధ్యాయాలలో తెలుసుకోవచ్చు.
క్రీడలు లేదా విద్య లేదా సంగీతాన్ని అభ్యసించడంలో అత్యంత విలువైనదేది అని ఒక యువకుడు లేదా యువతి విశ్వాసంతో అడుగవచ్చు మరియు పరిపూర్ణ సాక్షియైన పరిశుద్ధాత్మ ప్రేరేపణలను అనుసరించడానికి సమ్మతించవచ్చు.
రక్షకుడే మన కథలకు కర్తయు దానిని కొనసాగించువానిగా ఉండాలని మనమెందుకు కోరుతున్నాము? ఎందుకంటే మన సామర్థ్యాన్ని పరిపూర్ణంగా ఎరిగినది ఆయనే. మనకైమనం ఎన్నడూ ఊహించని ప్రదేశాలకు ఆయన మనల్ని తీసుకువెళ్తారు. మనల్ని ఒక దావీదుగా లేదా ఒక ఎస్తేరుగా ఆయన చేయవచ్చు. ఆయన వలె ఎక్కువగా కావడానికి ఆయన మనల్ని సాగదీస్తారు మరియు మెరుగుపెడతారు. మనం మరింత విశ్వాసంతో పనిచేసినప్పుడు మనం సాధించే విషయాలు యేసు క్రీస్తునందు మన విశ్వాసాన్ని హెచ్చిస్తాయి.
సహోదర సహోదరీలారా, కేవలం ఒక సంవత్సరం క్రితం ప్రియమైన మన ప్రవక్త అడిగారు: “మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? మీరు చేయాలని ఆయన కోరేదానిని మీ ఆశయాలన్నిటి కంటే అతిముఖ్యమైనదానిగా భావించడానికి మీరు సమ్మతిస్తున్నారా?”6 ఆ ప్రవచనాత్మక ప్రశ్నలకు నేను వినయంగా జోడిస్తున్నాను: “మీ కథకు కర్తయు దానిని కొనసాగించువానిగా ఉండేందుకు మీరు దేవుడిని అనుమతిస్తారా?”
మనం దేవుని యెదుట నిలబడి, మన క్రియలను బట్టి జీవగ్రంథముల నుండి తీర్పు తీర్చబడతామని ప్రకటనల గ్రంథంలో మనం నేర్చుకున్నాము.7
మన జీవగ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి మనం తీర్పుతీర్చబడతాము. మన కోసం మనం సౌకర్యవంతమైన కథనాన్ని వ్రాసుకోవడానికి ఎంచుకోగలము. లేదా మనం చేయాలని ఆయన కోరేదానిని మన ఆశయాలన్నిటి కంటే అతిముఖ్యమైనదానిగా భావించడానికి సమ్మతిస్తూ, మనతోపాటు మన కథను వ్రాయడానికి గొప్ప కర్తయు దానిని కొనసాగించువానిని మనం అనుమతించగలము.
క్రీస్తును మీ కథకు కర్తయు దానిని కొనసాగించువానిగా ఉండనివ్వండి!
పరిశుద్ధాత్మను మీ సాక్షిగా ఉండనివ్వండి!
మీరు నిలిచే మార్గం తిన్నగా ఉండేలా, దేవుని సన్నిధిలో జీవించడానికి మీ పరలోక గృహానికి తిరిగివెళ్ళే దారిలో మిమ్మల్ని నడిపించేలా ఒక కథను వ్రాయండి.
మీరు యేసు క్రీస్తుకు దగ్గరవడానికి మరియు ఎక్కువగా ఆయనవలె కావడానికి ప్రతి మంచి కథలో భాగమైన ప్రతికూలత మరియు శోధనను కారణం కానివ్వండి.
పరలోకాలు తెరువబడినట్లు మీరు గుర్తించిన ఒక కథ గురించి చెప్పండి. మీ కోసం ఆయన చిత్తాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియజేయడానికి దేవుడు సమ్మతిస్తున్నాడని తెలుసుకొని, మీకు జవాబు తెలియని ప్రశ్నలు అడగండి.
మీ కథనం విశ్వాసంతో కూడుకున్నది కానివ్వండి, మీ మాదిరి, రక్షకుడునైన యేసు క్రీస్తును అనుసరించనివ్వండి. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.