కష్ట కాలములలో వ్యక్తిగత శాంతి
వ్యక్తిగత శాంతిని వెదకడం ఇంతకు ముందెప్పుడూ అంత ముఖ్యమైనదిగా లేదు.
చారిత్రాత్మక నావూలో కొంత భాగాన్ని అంకితమివ్వడానికి నేను ఇటీవల నియమించబడ్డాను. అప్పగించబడిన ఆ పనిలో భాగంగా, నేను మిస్సోరిలోని లిబర్టీ చెరసాలను సందర్శించగలిగాను. చెరసాలను చూసినప్పుడు, సంఘ చరిత్రలో దీనిని ఒక ముఖ్యమైన భాగంగా చేసిన సంఘటనల గురించి నేను ఆలోచించాను. మిస్సోరి గవర్నర్ జారీ చేసిన బహిష్కరణ ఉత్తర్వు ఫలితంగా పరిశుద్ధుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. అదనంగా, ప్రవక్తయైన జోసెఫ్ మరియు కొంతమంది ప్రియమైన సహచరులు లిబర్టీ చెరసాలలో అన్యాయంగా ఖైదు చేయబడ్డారు. మన సభ్యుల పట్ల హింసాత్మక వ్యతిరేకతకు ఒక కారణం వారిలో ఎక్కువ మంది బానిసత్వాన్ని వ్యతిరేకించడమే.1 జోసెఫ్ స్మిత్ మరియు తన అనుచరులకు చేయబడిన ఈ తీవ్రమైన హింస, కర్తృత్వము అన్యాయముగా సాధన చేయబడితే అది నీతిమంతులైన వ్యక్తులను ప్రభావితం చేయగలదనుటకు ఒక తీవ్రమైన మాదిరిని ఏర్పరుస్తుంది. జోసెఫ్ లిబర్టీ చెరసాలలో ఉన్న సమయం, ప్రతికూలత అనేది ప్రభువు యొక్క అయిష్టతకు లేదా ఆయన దీవెన ఉపసంహరింపుకు రుజువు కాదని నిరూపిస్తుంది.
లిబర్టీ చెరసాలలో నిర్బంధించబడినప్పుడు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ప్రకటించినదానిని చదివినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను: “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు? నిన్ను మరుగుపరచు స్థలమును కప్పియుంచు తెర ఎక్కడనున్నది?”2 ఎంతకాలము వారు “ఈ తప్పిదములను, అన్యాయపు హింసలను సహించవలెను?”3 అని జోసెఫ్ విచారించెను.
నేను లిబర్టీ చెరసాలలో నిలబడినప్పుడు, ప్రభువు సమాధానం చదివినప్పుడు నేను లోతుగా ప్రభావితం చేయబడ్డాను: “నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక; నీ లేమి, నీ కష్టములు కొంతకాలమే ఉండును; దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించును; నీ శత్రువులందరి పైన నీవు జయము పొందెదవు.”4 శాశ్వతమైన, సిలెస్టియల్ గమ్యస్థానం కోసం వ్యతిరేకత మనలను మెరుగుపరుస్తుందని స్పష్టమవుతుంది.5
“నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక”6 అనే రక్షకుని విలువైన పదాలు వ్యక్తిగతంగా నాకు ప్రతిధ్వనిస్తాయి మరియు మన కాలం కొరకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆయన మర్త్య పరిచర్యలో తన శిష్యులకు చేసిన బోధనను అవి నాకు గుర్తు చేస్తాయి.
గెత్సేమనే తోటలో మరియు శిలువపై క్రీస్తు బాధపడక ముందు, “నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను”7 అని ఆయన ఆయన తన అపొస్తలులకు ఆజ్ఞాపించారు మరియు తరువాత వారిని ఈ మాటలతో ఓదార్చారు: “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.”8
మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన పేర్లలో ఒకటి “సమాధానకర్తయగు అధిపతి.”9 చివరకు ఆయన రాజ్యం సమాధానము మరియు ప్రేమతో సహా శాశ్వతంగా స్థాపించబడుతుంది.10 మెస్సీయ యొక్క వెయ్యేండ్ల పరిపాలన కోసం మనం ఎదురుచూస్తున్నాము.
వెయ్యేండ్ల పరిపాలన యొక్క ఈ వివరణతో సంబంధం లేకుండా, మన కాలంలో ప్రపంచ శాంతి మరియు సామరస్యం ప్రబలంగా లేవని మనకు తెలుసు.11 నా జీవితకాలంలో, నాగరికత ఎక్కువగా లేకపోవడాన్ని మునుపెన్నడూ నేను చూడలేదు. సమాధానము మరియు ప్రశాంతతను నాశనం చేసే కోపంతో, వివాదాస్పదమైన భాష మరియు రెచ్చగొట్టే, విధ్వంసకర చర్యలతో మనము ముట్టడించబడ్డాము.
ప్రపంచంలో సమాధానము యేసు క్రీస్తు రెండవ రాకడ వరకు వాగ్దానం చేయబడలేదు లేదా హామీ ఇవ్వబడలేదు. తన భూసంబంధమైన సువార్త పరిచర్య విశ్వశాంతిని సాధించదని రక్షకుడు తన అపొస్తలులకు సూచించారు. ఆయన ఇలా బోధించారు, “నేను భూమిమీదికి సమాధానమును పంప వచ్చితినని తలంచకుడి.”12 రక్షకుని తొలి మర్త్య పరిచర్యలో విశ్వ శాంతి భాగం కాదు. విశ్వ శాంతి నేడు ఉనికిలో లేదు.
అయినప్పటికిని, ఈ రోజు మన ప్రపంచాన్ని దెబ్బతీసే మరియు భ్రష్టుపట్టించే కోపం, కలహం మరియు విభజన ఉన్నప్పటికీ వ్యక్తిగత శాంతిని సాధించవచ్చు. వ్యక్తిగత శాంతిని వెదకడం ఇంతకు ముందెప్పుడూ అంత ముఖ్యమైనదిగా లేదు. నేటి యువత కోసం సహోదరుడు నిక్ డే వ్రాసిన ఒక అందమైన మరియు ప్రియమైన క్రొత్త కీర్తన “క్రీస్తులో శాంతి” అనే పేరుతో, “భూమిపై శాంతి లేనప్పుడు, క్రీస్తులో శాంతి ఉంటుంది”13 అని ప్రకటిస్తుంది. ప్రపంచవ్యాప్త కోవిడ్-19 మహమ్మారికి ముందు ఈ కీర్తనను మనం కలిగి ఉండటానికి మన ఆశీర్వాదించబడ్డాము.
ఈ కీర్తన శాంతి యొక్క ఆకాంక్షను అందమైన రీతిలో ప్రతిబింబిస్తుంది, యేసు క్రీస్తు జీవితం మరియు మిషనులో శాంతి లంగరు వేయబడిందని తగిన విధంగా నొక్కి చెబుతుంది. అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఇలా ప్రకటించారు, “మానవజాతి దేవుని సత్యాన్ని మరియు దేవుని సందేశాన్ని స్వీకరించేంత వరకు మరియు దైవికమైన ఆయన జ్ఞానాన్ని, అధికారాన్ని గుర్తించే వరకు శాంతి మరియు ప్రేమ యొక్క ఆత్మ ప్రపంచానికి ఎన్నటికీ రాదు.”14
విశ్వ శాంతిని సాధించే ప్రయత్నాల నుండి మనం ఎప్పటికి వెనక్కి తగ్గనప్పటికీ, క్రీస్తు బోధించినట్లుగా మనం వ్యక్తిగత శాంతిని పొందగలమని మనకు హామీ ఇవ్వబడింది. ఈ సూత్రం సిద్ధాంతము మరియు నిబంధనలలో పేర్కొనబడింది: “కానీ ఎవడైతే నీతిగల కార్యములు చేయునో వాడు తన ప్రతిఫలమును, అనగా ఈ లోకములో శాంతిని, రాబోవు లోకములో నిత్యజీవమును పొందునని నేర్చుకొనుము.”15
వివాదాలను పరిష్కరించడానికి, కలహాలను తగ్గించడానికి మరియు ఈ ప్రపంచంలో శాంతిని కనుగొనడంలో మనకు సహాయపడే కొన్ని “నీతిని అనుసరించి చేసిన క్రియలు” ఏమిటి? క్రీస్తు బోధనలన్నీ వివాదాలను పరిష్కరించడానికి మరియు ఈ ప్రపంచంలో శాంతిని కనుగొనడంలో మనకు సహాయపడతాయి. ప్రత్యేకంగా ముఖ్యమైనవిగా భావించే కొన్నింటిని నేను ప్రస్తావిస్తాను.
మొదటిది: దేవుడిని ప్రేమించండి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించండి మరియు అందరినీ క్షమించండి.
అధ్యక్షులు జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ 1945 లో సంఘ అధ్యక్షులయ్యారు. శాంతిని ప్రేమించే నాయకునిగా, అపొస్తలునిగా తన కాలంలో ప్రసిద్ది చెందారు. ఆయన అధ్యక్షులు కావడానికి 15 సంవత్సరాల ముందు, ప్రపంచవ్యాప్త మాంద్యం యొక్క సవాళ్ళు మరియు శ్రమలు, తరువాత రెండవ ప్రపంచ యుద్ధం యొక్క మరణం మరియు విధ్వంసంతో అది గొప్ప వివాదాస్పదమైన సమయంగా ఉండెను.
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో, 1945 అక్టోబరులో అధ్యక్షునిగా తన మొదటి సర్వసభ్య సమావేశంలో, తమ పొరుగువారిని ప్రేమించమని మరియు వారి శత్రువులను క్షమించమని అధ్యక్షులు స్మిత్ రక్షకుని ఆహ్వానాన్ని గుర్తుచేసారు మరియు తరువాత ఇలా బోధించారు, “వారు ఏదో ఒక రోజు ఆయన సమక్షంలో నిలబడి, ఇంటికి రమ్మని ఆయన నుండి ఘన స్వాగతం పొందాలని ఆశించినట్లయితే, అటువంటి వైఖరిని కడవరి దిన పరిశుద్ధులందరూ కలిగి ఉండవలెను.”16
రెండు: ఆత్మ ఫలములను అపేక్షించండి
అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందడానికి మనల్ని అర్హులుగా చేసే నీతి కార్యములు మరియు పశ్చాత్తాపం లేకుండా, మనలను అనర్హులుగా చేసే పనుల మధ్య ఉన్న విభేదాలను పేర్కొన్నారు. మనల్ని అర్హులుగా చేసే వాటిలో ఆత్మ యొక్క ఫలాలైన “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము”17 ఉన్నాయి. ఒకని భారములు మరొకరునొక భరించుట మరియు మేలు చేయుటయందు విసుకక యుండుటను కూడా పౌలు వాటిలో చేర్చెను.18 నీతి లేని పనులలో ద్వేషం, క్రోధములు మరియు కక్షలను ఆయన చేర్చారు.19
పాత నిబంధన కాలంలోని గొప్ప పాఠాలలో ఒకటి పితరుడైన అబ్రాహాముకు సంబంధించినది. అబ్రాహాము మరియు అతని మేనల్లుడు లోతు ధనవంతులు, కానీ వారు కలిసి నివసించలేరని కనుగొన్నారు. కలహాలను తొలగించడానికి లోతు తనకు కావలసిన భూమిని ఎంచుకోవడానికి అబ్రాహాము అనుమతించాడు. లోతు యొర్దాను మైదానమును ఎంచుకున్నాడు, అది అందముగా, నీళ్లు పారు దేశముగా ఉన్నది. అబ్రాహాము మామ్రే యొక్క తక్కువ సారవంతమైన మైదానాన్ని తీసుకున్నాడు. అప్పుడు అబ్రాహాము తన గుడారము వేసుకుని “యెహోవాకు బలిపీఠమును”20 కట్టెనని లేఖనాలు చెపుతున్నాయి. లోతు, మరోవైపు, “సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను.”21 మనం శాంతియుత సంబంధాలను కలిగియుండాలంటే ఏమి చేయాలో ఈ పాఠం స్పష్టం చేస్తుంది: నీతిని కలిగియుండని విషయాలకు సంబంధించి కలహాలను తొలగించడానికి మరియు రాజీపడడానికి మనం సిద్ధంగా ఉండాలి. రాజైన బెంజమిన్ ఇలా బోధించారు, “మీరు ఒకరినొకరు గాయపరచుకోకుండా సమాధానముతో నివసించుటకు కోరుకొందురు.”22 కానీ నీతి మరియు సిద్ధాంతపరమైన ఆవశ్యకతలకు సంబంధించిన ప్రవర్తనపై, మనం దృఢంగా మరియు స్థిరంగా ఉండాలి.
నీతివంతమైన పనులకు ప్రతిఫలంగా ఉండే శాంతిని మనం కోరుకుంటే, మనము ప్రపంచం వైపు మన గుడారాలను వేసుకోము. మనం దేవాలయము వైపు మన గుడారాలను వేసుకుంటాము.
మూడవది: నీతిని ఎంచుకోవడానికి కర్తృత్వాన్ని ఉపయోగించండి.
శాంతి మరియు కర్తృత్వము రక్షణ ప్రణాళిక యొక్క ముఖ్యమైన అంశాలుగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. “కర్తృత్వము మరియు జవాబుదారీతము” గురించి సువార్త అంశంలో వివరించబడినట్లుగా, “కర్తృత్వము అనేది దేవుడు మనకు మనం ఎంచుకోవడానికి, పనిచేయడానికి ఇచ్చే సామర్థ్యం మరియు హక్కు.”23 అందువలన, కర్తృత్వము అనేది వ్యక్తిగత అభివృద్ధి మరియు అనుభవం యొక్క అత్యంత ముఖ్యమైన భాగం, మనం రక్షకునిని అనుసరిస్తున్నప్పుడు అది మనల్ని దీవిస్తుంది.24
కర్తృత్వము అనేది “పరలోకంలో పూర్వ మర్త్య సభలో” లో ప్రధాన సమస్యగా మరియు క్రీస్తును అనుసరించడానికి ఎంచుకున్న వారికి మరియు సాతాను అనుచరుల మధ్య వివాదముగా ఉండెను.25 అహంకారాన్ని విడిచిపెట్టాలని కోరుకోవడం, ప్రతిదాన్ని నియంత్రించవలసిన అవసరాన్ని తొలగించడం, రక్షకుడిని ఎన్నుకోవడం వలన మనం ఆయన వెలుగును మరియు ఆయన శాంతిని కలిగియుండటకు మనల్ని అనుమతిస్తుంది. కానీ ప్రజలు తమ కర్తృత్వాన్ని హానికరమైన మరియు గాయపరిచే మార్గాల్లో ఉపయోగించినప్పుడు వ్యక్తిగత శాంతి సవాలు చేయబడుతుంది.
లోక రక్షకుడు మన తరఫున ఏమి సాధిస్తారనే దాని గురించి మనకున్న జ్ఞానం ద్వారా మన హృదయాలలో మనం భావించిన శాంతియుత అభయము బలపరచబడుతుందని నా విశ్వాసము. నా సువార్తను బోధించుడిలో ఇది అందంగా చెప్పబడింది: “మనం యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం మీద ఆధారపడుతుండగా, మన కష్టాలు, అనారోగ్యాలు మరియు బాధలను భరించడంలో ఆయన మనకు సహాయపడగలరు. మనం ఆనందం, శాంతి మరియు ఓదార్పుతో నింపబడగలము. జీవితంలో అన్యాయమైనవిగా ఉన్నవన్నీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడతాయి.”26
నాల్గవది: మన హృదయాలలో మరియు గృహాలలో సియోనును నిర్మించండి
మనము దేవుని పిల్లలము మరియు ఆయన కుటుంబంలో భాగమైయున్నాము. మనం పుట్టిన కుటుంబంలో కూడా మనం భాగమే. కుటుంబమనే సంస్థ సంతోషానికి మరియు శాంతికి పునాదిగా ఉన్నది. గృహ కేంద్రీకృత, సంఘ సహకార మతపరమైన ఆచరణ, “కుటుంబాల యొక్క శక్తిని బయటకు తీసి … [మన] గృహము [లను] విశ్వాసము యొక్క పరిశుద్ధ స్థలముగా మార్చగలదు”27 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు బోధించారు మరియు ఈ మహమ్మారి సమయంలో దానిని మనం నేర్చుకున్నాము. మన గృహాలలో ఈ మతపరమైన ఆచరణ ఉంటే, మనము రక్షకుని శాంతిని కూడా కలిగియుంటాము.28 మీలో చాలామందికి నీతివంతమైన గృహాల యొక్క ఆశీర్వాదాలు లేవని మరియు అన్యాయాన్ని ఎంచుకునే వారితో క్రమం తప్పకుండా పోరాడతారని మాకు తెలుసు. చివరికి జీవితపు తుఫానుల నుండి భద్రత మరియు ఆశ్రయం కోసం మీకు మార్గనిర్దేశం చేయడానికి రక్షకుడు రక్షణ మరియు శాంతిని ఇవ్వగలరు.
నీతిగల కుటుంబాలను ప్రేమించడంలో కలిగే ఆనందం, ప్రేమ మరియు నెరవేర్పు శాంతి మరియు సంతోషాన్ని రెండింటినీ ఉత్పత్తి చేస్తాయని నేను మీకు అభయమిస్తున్నాను. మన హృదయాలలో మరియు గృహాలలో సీయోనును కలిగి ఉండడానికి ప్రేమ మరియు దయ కేంద్రంగా ఉన్నాయి.29
ఐదవది: మన ప్రవక్త యొక్క ప్రస్తుత ఉపదేశములను అనుసరించండి
ప్రభువు యొక్క ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారిని మనము అనుసరించినప్పుడు మన శాంతి చాలా మెరుగుపడుతుంది. ఆయన నుండి వినడానికి మనకు త్వరలో అవకాశం ఉంటుంది. ఈ పిలుపు కోసం ఆయన జగత్తు పునాది వేయబడినప్పటి నుండి సిద్ధపరచబడ్డారు. ఆయన వ్యక్తిగత సిద్ధపాటు మిక్కిలి అసాధారణమైనది.30
మనం మన రక్షకుడైన యేసు క్రీస్తు వలె మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు,“అల్లకల్లోలమైన సమయంలో కూడా మనం శాంతి మరియు ఆనందాన్ని అనుభూతిచెందగలము”32 అని ఆయన మనకు బోధించారు. ప్రభువు యొక్క “శుద్ధీకరణ, స్వస్థత మరియు బలపరచు శక్తిని” పొందుటకు “ప్రతిరోజూ పశ్చాత్తాపపడమని” ఆయన మనకు ఉపదేశించారు.32 మన ప్రియమైన ప్రవక్త ద్వారా పరలోకము నుండి బయల్పాటు పొందబడినది మరియు పొందబడుట కొనసాగుతుందనుటకు నేను ప్రత్యక్ష సాక్షిని.
మనము ఆయనను మన ప్రవక్తగా గౌరవించుచు, బలపరుచుచుండగా, మన పరలోక తండ్రిని మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తును ఆరాధిస్తాము. మనము పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య చేయబడతాము.
లోక రక్షకుడు మరియు విమోచకుడు అయిన యేసు క్రీస్తు ఆయన పునఃస్థాపించబడిన సంఘాన్ని నడిపిస్తున్నారని మరియు మార్గనిర్దేశం చేస్తున్నారని నేను నా వ్యక్తిగత అపొస్తలత్వ సాక్ష్యమిస్తున్నాను. ఆయన జీవితం మరియు ప్రాయశ్చిత్త పరిచర్య శాంతికి నిజమైన ఆధారము. ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఆయన జీవిస్తున్నారని నేను ఖచ్చితంగా మరియు గంభీరంగా సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.