ప్రభువు కొరకు సమయాన్ని కేటాయించండి
ప్రతిరోజూ—మీ జీవితంలో ప్రభువు కోసం సమయాన్ని కేటాయించడం ద్వారా ప్రాపంచిక విషయాల ప్రలోభాలను మరియు శోధనలను ఎదుర్కోవాలని ఈ రోజు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
నా ప్రియమైన సహోదర సహోదరిలారా, రెండు రోజులపాటు ప్రభువు యొక్క సేవకుల చేత మనము చక్కగా బోధించబడ్డాము, ఆయన వారిని ఏమి బోధించాలని కోరుచున్నారో తెలుసుకొనుటకు వారు శ్రద్ధగా వెదికారు.
రాబోయే ఆరు నెలలలో మనం చేయవలసిన పనులు మనకు బోధించబడ్డాయి. ఇప్పుడు, ప్రశ్న ఏమిటంటే, మనం వినిన మరియు అనుభూతి చెందిన వాటి వలన మనం ఏవిధంగా భిన్నంగా ఉంటాము?
మనం నియంత్రించలేని పరిస్థితులను బట్టి జీవితం ఎంత త్వరగా మారగలదో మహమ్మారి నిరూపించింది. అయితే, మనం నియంత్రించ గల అనేక విషయాలు ఉన్నాయి. మన స్వంత ప్రాధాన్యతలను మనము ఏర్పరుచుకుంటాము మరియు మన శక్తిని, సమయాన్ని, వనరులను ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తాము. మనం ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకుంటాము. సత్యం మరియు మార్గదర్శకత్వం కోసం మనం ఎవరిని ఆశ్రయిస్తామో వారిని మనము ఎన్నుకుంటాము.
ప్రాపంచిక స్వరాలు మరియు ఒత్తిళ్ళు ఆకర్షణీయమైనవిగా, అనేకమైనవిగా ఉంటాయి. కానీ చాలా స్వరాలు మోసపూరితమైనవి, ప్రలోభపరిచేవి మరియు మనల్ని నిబంధన మార్గం నుండి తీసివేయగలవు. తరువాత వచ్చే అనివార్యమైన హృదయ వేదనను నివారించడానికి, ప్రతిరోజూ మీ జీవితంలో ప్రభువు కోసం సమయాన్ని కేటాయించడం ద్వారా ప్రాపంచిక విషయాల ప్రలోభాలను మరియు శోధనలను ఎదుర్కోవాలని ఈ రోజు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
మీకు లభించే సమాచారంలో అధికం సాంఘిక లేదా ఇతర మాధ్యమాల నుండి వచ్చినట్లయితే, ఆత్మ యొక్క గుసగుసలను వినగల మీ సామర్థ్యం తగ్గిపోతుంది. మీరు అనుదిన ప్రార్థన ద్వారా మరియు సువార్త అధ్యయనం ద్వారా ప్రభువును వెదకకపోయినట్లయితే, ఆసక్తి కలిగించేవి అయినప్పటికీ నిజము కాని తత్వశాస్త్రాలకు మిమ్మల్ని మీరు గురుచేసుకుంటారు. మరొకవిధంగావిశ్వాసులైన పరిశుద్ధులు కూడా నిరంతర ప్రాపంచిక ప్రలోభాలకు లొంగిపోవచ్చు.
నా సహోదర సహోదరిలారా, ప్రభువు కొరకు సమయాన్ని కేటాయించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను! పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతో ఉండడానికి అనుమతించే వాటిని చేయడం ద్వారా మీ స్వంత ఆత్మీయ పునాదిని దృఢంగా, దీర్ఘకాలము నిలిచేదిగా చేసుకోండి.
“ఆత్మ సత్యమును పలుకును … అది విషయములను గూర్చి అవి వాస్తవముగా ఉన్నట్లు, వాస్తవముగా ఉండబోవునట్లు పలుకును”1 అనే లోతైన సత్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. అది “మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు చూపును.”2
యేసు క్రీస్తుపై మీ దృష్టిని కేంద్రీకరించడం కంటే మరేదీ ఆత్మను ఆహ్వానించదు. క్రీస్తు గురించి మాట్లాడండి, క్రీస్తులో ఆనందించండి, క్రీస్తు మాటలను విందారగించండి మరియు క్రీస్తునందు నిలకడతో ముందుకు సాగండి.3 మీరు ఆయనను ఆరాధించి, సంస్కారములో పాలుపంచుకొని, మరియు ఆయన దినమును పరిశుద్ధంగా ఆచరించి మీ విశ్రాంతిదినమును ఆనందంగా చేసుకోండి.4
ఈ ఉదయం నేను నొక్కిచెప్పినట్లుగా, దయచేసి ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరములో ఆయన కొరకు సమయం కేటాయించండి. దేవాలయ సేవ మరియు దేవాలయ ఆరాధన బలపరచినట్లుగా మీ ఆత్మీయ పునాదిని మరేవి బలపరచవు.
మా క్రొత్త దేవాలయాలలో పనిచేస్తున్న వారందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అవి ప్రపంచవ్యాప్తంగా నిర్మించబడుతున్నాయి. ఈ క్రింది ప్రదేశాలలో లేదా సమీపంలో మరిన్ని దేవాలయాలను నిర్మించాలనే మా ప్రణాళికలను ప్రకటిస్తున్నందుకు ఈ రోజు నేను సంతోషిస్తున్నాను: కవోసియుంగ్, తైవాన్; టాక్లోబన్, ఫిలిప్పైన్స్; మన్రోవియా, లైబీరియా; కనంగా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో; అంటాననారివో, మడగాస్కర్; క్యూలియాకాన్, మెక్సికో; విటెరియా, బ్రెజిల్; లా పాజ్, బొలీవియా; శాంటియాగో వెస్ట్, చిలీ; ఫోర్ట్ వర్త్, టెక్సాస్; కోడి, వ్యోమింగ్; రెక్స్‌బర్గ్ నార్త్, ఐడాహో; హీబెర్ వ్యాలీ, యూటా; మరియు ఓరెమ్ యూటా దేవాలయం అంకితమివ్వబడిన తర్వాత ప్రోవో యూటా దేవాలయ పునర్నిర్మాణం.
ప్రియమైన సహోదర సహోదరిలారా, నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. ప్రభువు మిమ్ములను ఎరిగియున్నారు మరియు మిమ్ములను ప్రేమిస్తున్నారు! ఆయన మీ రక్షకుడు మరియు మీ విమోచకుడు. ఆయన తన సంఘాన్ని నడిపిస్తున్నారుమరియు మార్గనిర్దేశం చేస్తున్నారు. మీ జీవితంలో ప్రతిరోజూ మీరు ఆయన కోసం సమయం కేటాయించినట్లయితే, ఆయన మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్నినడిపిస్తారు మరియు మీకు మార్గనిర్దేశం చేస్తారు.
మనము మరలా కలుసుకునే వరకు దేవుడు మీకు తోడైయుండును గాక, యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.