సర్వసభ్య సమావేశము
నా ఆత్మ యొక్క విషయములు
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


13:4

నా ఆత్మ యొక్క విషయములు

మీరు ఏ విషయాలను లోతుగా ఆలోచిస్తారు? మీకు నిజంగా ఏ విషయములు ముఖ్యమైనవి? మీ ఆత్మకు సంబంధించిన విషయములు ఏమిటి?

నా సహోదర సహోదరిలారా, నేను మన ప్రియమైన సమావేశ కేంద్రంలో మరోసారి నిలబడినప్పుడు, అపొస్తలుడైన పేతురు మాటలు నాకు జ్ఞాపకము చేయబడ్డాయి: “ప్రభువా, మన మిక్కడ ఉండుట మంచిది.”1

ఈ రోజు నా ఆలోచనలు తండ్రియైన లీహై మరణం తరువాత తన జనుల వృత్తాంతమును వ్రాసిన ప్రవక్తయైన నీఫై మాటలపై కేంద్రీకృతమై ఉన్నాయి. నీఫై ఇలా వ్రాసాడు, “వీటిపై నేను నా ఆత్మ యొక్క విషయములను వ్రాయుదును.”2

విషయములు అనే పదము చాలా సొగసైనది లేదా ఆత్మీయమైనది కాదని, “నా ఆత్మ” అనే దానితో జత చేసేంత గొప్పది కాదని ఆలోచిస్తూ, నేను ఈ వచనాన్ని దాటవేసే వాడిని. అయినప్పటికీ, విషయములు అనే పదము లేఖనాలలో 2,354 సార్లు ఉపయోగించబడిందని నేను నేర్చుకున్నాను.3 ఉదాహరణకు, మోషేలో: “ఆదియు అంతమును, సర్వశక్తిగల దేవుడను నేనే; నా అద్వితీయ కుమారుని ద్వారా వీటిని నేను సృజించితిని.4 మరియు నీఫై వాక్యములు: “నా ఆత్మ ప్రభువు యొక్క కార్యములందు ఆనందించును; నా హృదయము నేను చూచిన మరియు వినియున్న దర్శనములపై నిరంతరము ధ్యానించును.”5

నీఫై మాటలు ఈ ప్రశ్నలను లేవనెత్తుతాయి.“మీరు ఏ విషయాల గురించి ధ్యానిస్తున్నారు?” “మీకు నిజంగా ఏ విషయములు ముఖ్యమైనవి?” “మీ ఆత్మకు సంబంధించిన విషయములు ఏమిటి?”

ప్రశ్నలు అడగడం ద్వారా మన ఆత్మ యొక్క విషయములు తరుచుగా స్పష్టం చేయబడతాయి మరియు పెరుగుతాయి.

వర్చువల్ సమావేశంలో ఎల్డర్ రాస్‌బాండ్
యువత భక్తికూడిక
యువ వయోజన ప్రసారం

మహమ్మారి సమయమందు, నేను ప్రసారాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా పెద్దవైన, చిన్నవైన అనేక భక్తికూడికలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతతో కలుసుకున్నాను మరియు మేము వారి ప్రశ్నల గురించి చర్చించాము.

పధ్నాలుగేళ్ళ జోసెఫ్ స్మిత్ ఆత్మలో లోతైన ప్రశ్న కలిగియుండి, అతడు దానిని ప్రభువు వద్దకు తీసుకువెళ్ళాడు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఉద్ఘాటించారు: “మీ ప్రశ్నలను ప్రభువు యొద్దకు మరియు ఇతర విశ్వసనీయ మూలాధారాల యొద్దకు తీసుకువెళ్ళండి. ప్రవక్త జీవితంలో లోపాన్ని లేదా గ్రంథాలలో వ్యత్యాసాన్ని కనుగొనగలరనే ఆశతో కాకుండా నమ్మాలనే కోరికతో అధ్యయనం చేయండి. సందేహించువారితో … మీ సందేహాలను సాధన చేయడం ద్వారా వాటిని పెంచుకోవడం ఆపండి. మీ ఆత్మీయ పరిశోధన ప్రయాణంలో మిమ్మల్ని నడిపించడానికి ప్రభువును అనుమతించండి.”6

నేను ఏమి నమ్ముతాను మరియు ఎందుకు నమ్ముతాను అని యువత తరచుగా నన్ను అడుగుతుంది.

వాస్తవంగా ఒక యువతిని ఆమె ఇంట్లో వర్చువల్‌గా సందర్శించడం నాకుజ్ఞాపకముంది. ఒక అపొస్తలుడు ఆమె ఇంటికి రావడం ఇదే మొదటిసారా అని నేను అడిగాను. ఆమె వెంటనే నవ్వి, “అవును” అని ప్రతిస్పందించింది. “నేను తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి?” అని ఆమె నన్ను అడిగిన ప్రశ్న మంచిది.

ప్రేరణలను వినడానికి నన్ను సిద్ధం చేసే విషయాలు, ప్రపంచంలోని మార్గాలకు అతీతంగా నా దృష్టిని లేవనెత్తగలిగేవి, సువార్తలో నా పనికి మరియు నా జీవితానికి ఉద్దేశ్యాన్ని తెలిపే నా ఆత్మ యొక్కవిషయాలతో నేను సమాధానమిచ్చాను.

నేను నా ఆత్మ యొక్క విషయములలో కొన్ని పంచుకోవచ్చా? యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలని కోరుకునే వారందరికీ ఈ విషయాలు వర్తిస్తాయి. జ్ఞాపకముంచుకోవడానికి పది మంచి సంఖ్య కాబట్టి నా జాబితాలో పది విషయాలు చేరుస్తాను. మీ స్వంత అనుభవాల నుండి మీరు ఎనిమిది, తొమ్మిది మరియు పది విషయాలను పూర్తి చేస్తారనే ఆశతో ఈరోజు నేను మీకు ఏడు విషయాలు ఇస్తున్నాను.

ముందుగా, తండ్రి అయిన దేవుని మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తును ప్రేమించండి.

యేసు మొదటి గొప్ప ఆజ్ఞను ఆదేశించారు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.”7

ప్రభువు సంఘానికి నాయకత్వం వహించడానికి పిలువబడినప్పుడు అధ్యక్షులు నెల్సన్ దేవునికి, మన నిత్య తండ్రికి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుకు తన భక్తిని ఇలా ప్రకటించారు, “నేను వారిని ఎరుగుదును, వారిని ప్రేమిస్తున్నాను, మరియు నా జీవితంలో మిగిలిన ప్రతి శ్వాసతో వారికి మరియు మీకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.”8

కాబట్టి ముందుగా తండ్రిని మరియు కుమారుడిని ప్రేమించండి.

రెండవది, “నీ పొరుగువాని ప్రేమింపవలెను.”9

అది మంచి ఆలోచన మాత్రమే కాదు; ఇది రెండవ గొప్ప ఆజ్ఞ. మీ పొరుగువారు ఎవరంటే, మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం, వార్డు సభ్యులు, సహోద్యోగులు, సహవాసులు, మన విశ్వాసానికి చెందనివారు, సహాయం కావలసినవారు మరియు ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతిఒక్కరు. “నీ పొరుగువాని ప్రేమింపవలెను” యొక్క సారాంశం “ఒకరినొకరు ప్రేమించండి” అనే కీర్తనలో చెప్పబడింది.10

“మనం దేవుడిని మన పూర్ణ హృదయాలతో ప్రేమించినప్పుడు, ఆయన మన హృదయాలను ఇతరుల శ్రేయస్సు వైపు మళ్ళిస్తారు” అని అధ్యక్షులు నెల్సన్ మనకు గుర్తుచేస్తున్నారు.11

మూడవది, మిమ్మల్ని మీరు ప్రేమించండి.

ఇక్కడే చాలామంది ప్రయాసపడుతున్నారు. ఇతరులను ప్రేమించడం కంటే మనల్ని మనం ప్రేమించుకోవడం అంత తేలికగా కనిపించడం ఆసక్తికరంగా లేదా? అయినప్పటికీ ప్రభువు ఇలా చెప్పారు, “నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము.”12 ఆయన మనలోని దైవత్వానికి విలువ ఇస్తారు; కాబట్టి మనం కూడా తప్పక విలువ ఇవ్వాలి. తప్పులు, గుండెకోతలు, అసమర్థత, నిరాశ, కోపం లేదా పాపపు భావాలతో మన జీవితం భారమైనప్పుడు దైవిక రూపకల్పన ద్వారా రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క శక్తి ఆత్మను పైకెత్తే వాటిలో ఒకటి.

నాల్గవది, ఆజ్ఞలను పాటించండి.

రక్షకుడు మనకు దీనిని స్పష్టంగా చెప్పారు: “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.” 13 కొంచెం మెరుగ్గా ఉండుటకు మరియు చేయుటకు ప్రతిరోజూ శ్రమించండి మరియు నీతియందు ముందుకు సాగండి.

ఐదవది, దేవాలయానికి హాజరు కావడానికి ఎల్లప్పుడూ యోగ్యులై ఉండండి.

దీనిని నేను ప్రభువుకు సిఫారసు చేయబడుట అని అంటాను. మీకు దేవాలయానికి ప్రవేశము కలిగి ఉన్నా లేకపోయినా, చెలామణి అయ్యే దేవాలయ సిఫార్సుకు యోగ్యులుగా ఉండడం వలన ఆవశ్యకమైన విషయాలపై అనగా నిబంధన బాటపై స్థిరంగా మీరు దృష్టిసారించేలా చేస్తుంది.

ఆరవది, ఆనందంగా మరియు ఉల్లాసముగా ఉండండి.

“భయపడక ధైర్యముగానుండుడి”14 అని ప్రభువు సెలవిచ్చారు. ఎందుకు? మనం ఏమి చేసినప్పటికీ తరచుగా సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ఎలా ఉండగలము? ఎందుకంటే యేసు క్రీస్తు ఇచ్చిన ఈ వాగ్దానం వలన: “ఏలయనగా ప్రభువైన నేను మీతోనున్నాను మరియు మీ ప్రక్కన నిలిచెదను.”15

పునఃస్థాపించబడిన సువార్తను “ఆనందం యొక్క సందేశం!” అని అధ్యక్షులు నెల్సన్ బోధించారు. మరియు “మనం పొందే ఆనందం16 మన జీవితపు పరిస్థితులపైన తక్కువగా ఆధారపడియుండి, మన జీవితాల దృష్టిసారింపుపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది”17 అని ఆయన వివరించారు.

ఏడవది, దేవుని సజీవ ప్రవక్తను అనుసరించండి.

ఇది నా విషయాల జాబితాలో ఏడవది కావచ్చు, కానీ ఈ రోజు దాని ప్రాముఖ్యత విషయంలో ఇది నా మనస్సులో అగ్రస్థానంలో ఉంది.

నేడు భూమిపై మనకు దేవుని ప్రవక్త ఉన్నారు! ఇది మీకు ముఖ్యమైనది కాదని ఎన్నడూ అనుకోవద్దు. ప్రారంభంలో నేను చెప్పిన యువతిని జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఏ విషయములు అత్యంత ప్రాముఖ్యమైనవో తెలుసుకోవాలనుకుంది. “జీవించియున్న ప్రవక్తను అనుసరించండి,” అని నేను అప్పుడు చెప్పాను మరియు నేను ఈ రోజు మరలా ఉద్ఘాటిస్తున్నాను.

ఈ కాలము కొరకు దేవునిచే పిలువబడిన ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల చేత నడిపించబడే సంఘముగా మనము ప్రసిద్ధి చెందాము. వారి ఉపదేశాన్ని ఆలకించి, పాటించినప్పుడు మీరు ఎప్పటికీ తప్పుదారిలో నడిపించబడరని నేను హామీ ఇస్తున్నాను. ఎన్నడూలేదు

ఆత్మీయతత, మర్యాద, చిత్తశుద్ధి మరియు గౌరవంపై దాడి చేయబడుతూ, “ఇటు అటు కొట్టుకొనిపోవుచున్న” 18 కాలంలో మనం జీవిస్తున్నాము. మేము ఎంపికలు చేసుకోవాలి. మన భయాలను శాంతింపజేయడానికి మరియు మన ఆత్మగౌరవాన్ని హెచ్చించడానికి తన ప్రవక్త ద్వారా ప్రభువు స్వరం మనకు అందుబాటులో ఉంది, ఎందుకంటే అధ్యక్షులు నెల్సన్ మాట్లాడేటప్పుడు, ఆయన ప్రభువు కోసం మాట్లాడతారు.

“నా తలంపులు మీ తలంపులవంటిని కావుమీ త్రోవలు నా త్రోవలవంటిని కావుఇదే యెహోవా వాక్కు”19 అని మనకు గుర్తుచేసే లేఖనాలు మరియు బోధనలతో మనము ఆశీర్వదించబడ్డాము.

కాబట్టి ప్రవక్తయైన ఎలీషా అతడిని స్వస్థపరచగలడని సిరియాలో ఒక గొప్ప సైనిక నాయకుడు మరియు కుష్ఠురోగి అయిన నయమానుకు చెప్పబడినప్పుడు అదే జరిగింది. యొర్దాను నదిలో ఏడుసార్లు స్నానము చేయమని మరియు అతడు శుద్ధుడవుతాడని నయమానుకు చెప్పుటకు ఎలీషా తన దూతను పంపారు. నయమాను అపహాస్యం చేసాడు. ఖచ్చితంగా యొర్దాను కంటే శక్తివంతమైన నది ఉంది, మరియు ప్రవక్త అయిన ఎలీషా అతన్ని వ్యక్తిగతంగా నయం చేయాలని ఆశించినప్పుడు ఒక సేవకుడిని ఎందుకు పంపాలి? నయమాను వెళ్ళిపోయాడు, కానీ చివరకు సేవకుల చేత ఒప్పించబడ్డాడు: “ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా?”20 నయమాను చివరకు యొర్దానులో ఏడుసార్లు మునిగి, స్వస్థపరచబడ్డాడు.

మన ఆలోచన, మన అంచనాలు లేదా నేటి ప్రమాణాలకు సరిపోయే భాగాలను ప్రవచనాత్మక సలహా నుండి తీసుకోవడం మరియు ఎంచుకోవడం వలన కలిగే నష్టాలను నయమాను యొక్క వృత్తాంతము మనకు గుర్తు చేస్తుంది. స్వస్థత పొందుటకు మన స్వంత యొర్దాను నది వైపుకు మన ప్రవక్త నిరంతరం సూచిస్తారు.

మనం వినగల, ధ్యానించగల మరియు అనుసరించగల అత్యంత ముఖ్యమైన మాటలు ఏవనగా మన సజీవ ప్రవక్త ద్వారా బయలుపరచబడిన మాటలు. సంఘము యొక్క మరియు ప్రపంచం యొక్క ముఖ్యమైన విషయాలను చర్చించడానికి నేను అధ్యక్షులు నెల్సన్‌తో సలహాసభలో కూర్చున్నానని, ఆయన ద్వారా బయల్పాటులు ప్రవహించడాన్ని చూసానని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ప్రభువును ఎరుగును, ఆయన మార్గాలను ఎరుగును, మరియు దేవుని పిల్లలందరూ ప్రభువైన యేసు క్రీస్తును వినాలని ఆయన కోరుకుంటున్నారు.

చాలా సంవత్సరాలుగా మనం సర్వసభ్య సమావేశంలో సంవత్సరానికి రెండుసార్లు ప్రవక్త నుండి విన్నాము. కానీ మన కాలంలోని క్లిష్టమైన సమస్యలను బట్టి, పౌరసభలలో21 , సోషల్ మీడియా22, భక్తికూడికలు23, మరియు విలేఖరి సమావేశాలలో 24 అధ్యక్షులు నెల్సన్ మరింత ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన లోతైన బయల్పాటు సందేశాలను సిద్ధం చేసి, ప్రదర్శించడం నేను గమనించాను అవి మరింత కృతజ్ఞతను ప్రోత్సహించాయి, భూమిపై ఉన్న మన సహోదర సహోదరిల కలయికను ఎక్కువగా ప్రొత్సాహించాయి, మరియు మన వ్యక్తిగత జీవితాలలో శాంతి, నిరీక్షణ, ఆనందం, ఆరోగ్యం మరియు స్వస్థతను హెచ్చించాయి.

అధ్యక్షులు నెల్సన్ ఒక అద్భుతమైన సందేశకర్త, అంతకంటే ముఖ్యమైనది ఆయన దేవుని యొక్క ప్రవక్త. మీరు దాని గురించి ఆలోచించినప్పుడు అధైర్యాన్ని కలిగిస్తుంది, కానీ ఆయన స్పష్టమైన దిశ మనందరినీ నేడు ప్రపంచంలో ఊపందుకుంటున్న మోసం, కపటం మరియు లౌకిక మార్గాల నుండి కవచంలా కాపాడుతుంది.25

ప్రవక్త యొక్క ఉత్తరీయం సమస్తము బయల్పాటు గూర్చినది. ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశంలో ఇవ్వబడిన “యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచానికి ద్విశతాబ్ది ప్రకటన,” ప్రభువు ఈ కార్యమును నడిపిపిస్తున్నారనిఉద్ఘాటిస్తుంది. ఈ ప్రకటనలో, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండు మంది అపొస్తలుల సమూహము ఇలా పేర్కొన్నారు: “వాగ్దానం చేయబడిన పునఃస్థాపన నిరంతర బయల్పాటు ద్వారా ముందుకు సాగుతుందని మేము సంతోషంగా ప్రకటిస్తున్నాము. దేవుడు “సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చునప్పుడు,” ( ఎఫెసీయులకు 1:10 ) 26ఈ భూమి మునుపటిలా ఇంకెన్నడూ ఉండదు.

“సమస్తమును క్రీస్తునందు ఉన్నవి”27 మరియు “నా ఆత్మ యొక్క విషయములు”28 అనేవి ఈ సంఘము, ఈ సువార్త మరియు ఈ ప్రజల గురించి సమస్తము వివరించును.

నేను ఈ రోజు పంచుకున్న ఏడు “నా ఆత్మ యొక్క విషయములు” పరిగణలోకి తీసుకోవాలని మీలో ప్రతి ఒక్కరికీ ఆహ్వానంతో ముగిస్తాను: తండ్రియైన దేవుడిని మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తును ప్రేమించండి; మీ పొరుగువారిని ప్రేమించండి; మిమ్మల్ని మీరు ప్రేమించండి; ఆజ్ఞలను పాటించండి; ఎల్లప్పుడూ దేవాలయ సిఫార్సుకు యోగ్యులైయుండండి; సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉండండి; మరియు దేవుని యొక్క జీవిస్తున్న ప్రవక్తను అనుసరించండి. మీ స్వంత ఎనిమిది, తొమ్మిది మరియు పది విషయములను గుర్తించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు మీ హృదయపూర్వక “విషయములను” ఇతరులతో పంచుకునే మార్గాలను పరిశీలించండి మరియు ప్రార్థించడానికి, ధ్యానించడానికి మరియు ప్రభువు నడపింపును కోరడానికి వారిని ప్రోత్సహించండి.

మీవి మీకు విలువనైట్లే, నా ఆత్మ విషయములు నాకు విలువైనవి. ఈ విషయములు సంఘంలో మరియు జీవితంలోని అన్ని రంగాలలో మన సేవను బలపరుస్తాయి. అవి మనల్ని యేసు క్రీస్తుకు నిబద్ధత కలిగియుండేలా చేస్తాయి, అవి మన నిబంధనలను గుర్తుచేస్తాయి మరియు ప్రభువు బాహువులలో సురక్షితంగా భావించడానికి అవి మనకు సహాయం చేస్తాయి. మనం ఆయన నిజమైన శిష్యులుగా మారాలని, తండ్రితో ఆయన ఏకమైయున్నట్లే మనము ఆయనతో ఏకమైయుండాలని కోరుకున్నప్పుడు, మన ఆత్మలు “ఎన్నడూ ఆకలిగొనవు లేదా దప్పిగొనవు, కానీ ఆయన ప్రేమతో నింపబడవలెను”29 అని ఆయన కోరుకుంటున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.