క్రీస్తులో ఎక్కువగా అగుట: వాలు యొక్క ఉపమానం
ప్రభువు సమయములో, మనం ఎక్కడ ప్రారంభించామన్నది కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామనేది చాలా ముఖ్యమైనది.
చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు, నాకు గొప్ప ఆకాంక్షలు ఉండేవి. ఒక రోజు పాఠశాల ముగిసిన తర్వాత నేను ఇలా అడిగాను: “అమ్మా, నేను పెద్దవాడినైనప్పుడు ఏమి అవ్వాలి: వృత్తిపరమైన బాస్కెట్‌బాల్ ఆటగాడినా లేదా ప్రఖ్యాత గాయకుడినా?” దురదృష్టవశాత్తు, ఏ ప్రతిభలు లేని క్లార్క్ భవిష్యత్తు క్రీడాకారుడిగా లేదా సంగీత వైభవంగల వ్యక్తిగా ఏ సూచనలను చూపించలేదు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, నా పాఠశాల అధునాతన విద్యా కార్యక్రమానికి ప్రవేశం పలుమార్లు నిరాకరించబడింది. చివరకు నా ఉపాధ్యాయులు నేను ప్రామాణిక తరగతి గదికి కట్టుబడి ఉండాలని సూచించారు. కాలక్రమేణా, నష్టపరిహార అధ్యయన అలవాట్లను నేను అభివృద్ధి చేసుకున్నాను. కానీ జపాన్‌లో సువార్తసేవ చేసే వరకు నా మేధోపరమైన మరియు ఆత్మీయ అవకాశాలు కనిపించడం ప్రారంభించాయని నేను భావించలేదు. నేను కష్టపడి పనిచేయడం కొనసాగించాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా, నేను నా అభివృద్ధిలో దేవుని సహాయాన్ని క్రమపద్ధతిలో తీసుకొన్నాను మరియు అది నాలో మార్పుకు కారణమయింది.
సహోదర సహోదరీలారా, ఈ సంఘములో మనము దేవుని పిల్లలందరి యొక్క దైవిక సామర్థ్యాన్ని మరియు క్రీస్తులో మరింతగా మారగల మన సామర్థ్యాన్ని నమ్ముతాము. ప్రభువు సమయములో, మనం ఎక్కడ ప్రారంభించామన్నది కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామనేది చాలా ముఖ్యమైనది.1
ఈ సూత్రాన్ని ప్రదర్శించడానికి, నేను కొంత ప్రాథమిక గణితాన్ని ఉపయోగిస్తాను. ఇప్పుడు, సర్వసభ్య సమావేశంలో గణితం అనే పదాన్ని విన్నప్పుడు భయపడవద్దు. అనుభవము లేనివారు కూడా ఈ ముఖ్యాంశాన్ని గ్రహించగలరని మా బివైయు–ఐడహో గణిత అధ్యాపకులు నాకు హామీ ఇచ్చారు. ఒక రేఖ యొక్క సూత్రముతో ఇది మొదలవుతుంది. ఇప్పుడు మన ఉపయోగము నిమిత్తము అంతరఖండం మన రేఖ యొక్క ఆరంభము అనుకోండి. అంతరఖండం అధిక లేదా తక్కువ ప్రారంభ స్థానాన్ని కలిగియుండవచ్చు. రేఖ యొక్క వాలు అప్పుడు సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు.
మనమందరం జీవితంలో వేర్వేరు అంతరఖండాలను కలిగి ఉన్నాము—మనం వివిధ ప్రదేశాలలో విభిన్న ప్రతిభలు మరియు జీవిత వరాలతో ప్రారంభిస్తాము. కొందరు మంచి ఆరోగ్యముతో మరియు సఫలము కావడానికి తగినన్ని అవకాశాలతో జన్మించారు. ఇతరులు సవాలుగా మరియు అన్యాయంగా అనిపించే ప్రారంభ పరిస్థితులను ఎదుర్కొంటారు.2 అప్పుడు మనం వ్యక్తిగత అభివృద్ధి యొక్క వాలు వెంట పురోగమిస్తాము. మన భవిష్యత్తు మన ప్రారంభ స్థానం ద్వారా చాలా తక్కువగా నిర్ణయించబడుతుంది మరియు మన వాలు ద్వారా చాలా ఎక్కువగా నిర్ణయించబడుతుంది. మనం ఎక్కడ ప్రారంభించినప్పటికీ, యేసు క్రీస్తు మన దైవిక సామర్థ్యాన్ని చూస్తారు. ఆయన దానిని బిచ్చగాడు, పాపి, మరియు వైకల్యము గలవానిలో చూసారు. ఆయన దానిని జాలరి, పన్ను వసూలు చేసే వ్యక్తి మరియు అత్యుత్సాహవంతుడిలో కూడా చూసారు. మనం ఎక్కడ మొదలుపెట్టినప్పటికీ, మనకు ఇవ్వబడిన దానితో మనం ఏమి చేస్తామో అని క్రీస్తు పరిశీలిస్తారు.3 ప్రపంచం మన అంతరఖండంపై దృష్టి పెడుతుండగా, దేవుడు మన వాలుపై దృష్టి పెడతారు. ప్రభువు ఉపయోగించే గణాంక విధానములో, మన వాలులను పరలోకం వైపు మళ్ళించడంలో ఆయన మనకు తనవంతు సహాయాన్ని చేస్తారు.
ఈ సూత్రం కష్టపడేవారికి ఓదార్పునివ్వాలి మరియు అన్ని ప్రయోజనాలు ఉన్నట్లు అనిపించే వారికి విరామం ఇవ్వాలి. పేదరికం, విద్యకు పరిమిత ప్రవేశము, సవాలుతో కూడిన కుటుంబ పరిస్థితులు వంటి కష్టతరమైన ప్రారంభ పరిస్థితులతో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడడం ద్వారా నేను ప్రారంభిస్తాను. ఇతరులు శారీరక సవాళ్ళు, మానసిక ఆరోగ్య పరిమితులు లేదా బలమైన జన్యుపరమైన పూర్వ వైఖరిని ఎదుర్కొనవచ్చు.4 కష్టమైన ప్రారంభ పరిస్థితులతో పోరాడుతున్న వారెవరైనా సరే, మన పోరాటాలు రక్షకుడికి తెలుసు అని దయచేసి గుర్తించండి. “… ఆయన ప్రేగులు కనికరముతో నిండవలెనని, [మన] బలహీనతలను బట్టి [మనల్ని] ఎట్లు ఆదరించవలెనో … ఆయన ఎరుగునట్లు ఆయన [మన] బలహీనతలను తనపైన [తీసుకొనెను].” 5
కష్టతరమైన ప్రారంభ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ప్రోత్సాహాన్ని అందించే రెండు పరిధులను నన్ను పంచుకోనివ్వండి. మొదట, మీరు ఎక్కడ ప్రారంభించారో అనేదానిపైన కాకుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారనే దానిపై దృష్టి పెట్టండి. మీ పరిస్థితులను విస్మరించడం తప్పు—అవి వాస్తవమైనవి మరియు వాటిని పరిష్కరించవలసిన అవసరం ఉంది. కానీ కష్టమైన ప్రారంభ బిందువుపై ఎక్కువ దృష్టి పెట్టడం వలన అది మిమ్మల్ని నిర్వచించగలదు మరియు ఎంచుకునే మీ సామర్థ్యాన్ని కూడా అడ్డుకోగలదు. 6
అనేక సంవత్సరాల క్రితం, నేను మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో అంతర్-నగర యువ బృందంతో పనిచేసాను, వారికి సువార్త మరియు సంఘము యొక్క అంచనాలు చాలా క్రొత్తగా ఉన్నాయి. వారి పరిస్థితి పట్ల నా సానుభూతి మరియు ఆందోళన దేవుని ప్రమాణాలను తగ్గించాలనే కోరికతో నన్ను శోధించేదిగా ఉన్నది.7 నా అంచనాలను ఎన్నటికీ తగ్గించకుండా ఉండడమే నా ప్రేమను చూపించడానికి గల అత్యంత శక్తివంతమైన మార్గం అని నేను చివరికి గ్రహించాను. ఏమి చేయాలోనని నాకు తెలిసినదంతా కూడగట్టుకొని, మేము వారి సామర్థ్యంపై దృష్టి పెట్టాము మరియు వారిలో ప్రతి ఒక్కరు సానుకూల దిశలో పురోగతి సాధించడం ప్రారంభించారు. సువార్తలో వారి పెరుగుదల క్రమంగా, స్థిరంగా ఉంది. నేడు, వారు సువార్తసేవ చేసారు, కళాశాల నుండి పట్టభద్రులయ్యారు, దేవాలయంలో వివాహం చేసుకున్నారు మరియు అద్భుతమైన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలను గడుపుతున్నారు.
రెండవది, సానుకూల దిశలో పురోగతి సాధించే ప్రక్రియలో ప్రభువును చేర్చండి. ప్రపంచవ్యాప్త బివైయు–పాథ్‌వే అధ్యక్షునిగా పనిచేస్తున్నప్పుడు, పెరూలోని లిమాలో ఎల్డర్ కార్లోస్ ఎ. గొడోయ్ ప్రసంగీకునిగా ఉన్న పెద్ద భక్తికూడికలో కూర్చోవడం నాకు గుర్తుంది. ఆయన జనసమూహాన్ని చూసినప్పుడు, చాలామంది నమ్మకమైన మొదటి తరం విశ్వవిద్యాలయ విద్యార్థులను చూసి ఆయన భావోద్వేగానికి లోనైయ్యారు. బహుశా అలాంటి పరిస్థితులగుండా ప్రయాణించిన తన స్వంత త్రోవ గురించి ఆలోచిస్తూ, ఎల్డర్ గొడోయ్ భావోద్వేగంతో ఇలా చెప్పారు: “మీకు మీరు సహాయం చేసుకోగల దానికంటే ప్రభువు ఎక్కువ సహాయం చేస్తారు.” [కాబట్టి] ఈ ప్రక్రియలో ప్రభువును చేర్చండి.”8 ప్రవక్తయైన నీఫై ఇలా బోధించారు “సమస్తము చేసిన తర్వాత కూడా మనము కృప చేతనే రక్షింపబడియున్నాము.”9 మనం మన వంతు కృషి చేయాలి,10 కానీ ఆయన దయ ద్వారా మాత్రమే మన దైవిక సామర్థ్యాన్ని సాధించగలం.11
చివరగా, మరిన్ని అవకాశాలున్న పరిస్థితుల్లో జన్మించిన వారికి రెండు పరిధుల కొరకు సలహాను నన్ను పంచుకోనివ్వండి. మొదట, మనకు మనం సృష్టించియుండని పరిస్థితుల కోసం కొంత వినయాన్ని చూపించగలమా? బివైయు మాజీ అధ్యక్షులు రెక్స్ ఇ. లీ తన విద్యార్థులకు ఉదహరించినట్లుగా, “మనమంతా మనము త్రవ్వని బావుల నుండి త్రాగాము మరియు మనం వేయని మంటల ద్వారా వెచ్చదనాన్ని పొందాము.”12 మునుపటి అగ్రగాములు నిర్మించిన విద్యా బావులను తిరిగి ఇచ్చి, అభివృద్ధి చేయమని తరువాత అధ్యక్షులు లీ తన విద్యార్ధులకు పిలుపునిచ్చారు. ఇతరులు నాటిన పొలాలలో తిరిగి విత్తనాలు వేయడంలో వైఫల్యం, వృద్ధిలేకుండా ప్రతిభను తిరిగి ఇవ్వడంతో సమానం.
రెండవది, మరిన్ని అవకాశాలున్న పరిస్థితుల్లో జన్మించడంపై దృష్టి పెట్టడం వలన మనం అభివృద్ధి చెందుతున్నామనే భావన తరచుగా మనల్ని చిక్కుల్లో పడేలా చేస్తుంది. వాస్తవానికి, మన అత్మీయాభివృద్ధి వృద్ధిలేకుండా నిశ్చలంగా ఉండవచ్చు. చాలా విజయవంతమైన వ్యక్తులు అత్యంత వినయము గలవారని, ఎందుకంటే వారు సరిదిద్దబడడానికి మరియు ఎవరినుండి అయినా నేర్చుకోవడానికి తగినంత ఆత్మవిశ్వాసంతో ఉంటారని హార్వర్డ్ ఆచార్యులు క్లేటన్ ఎం. క్రిస్టెన్‌సెన్ బోధించారు.13 “దిద్దుబాటును అంగీకరించడానికి మరియు కోరడానికి కూడా ఇష్టపూర్వకంగా మార్గాలను కనుగొనమని”14 ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ మనకు సలహా ఇచ్చారు. అంతా సవ్యంగా జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ, మనం ప్రార్థనాపూర్వకమైన విజ్ఞాపన ద్వారా మెరుగుపరచుకొనే అవకాశాలను వెదకాలి.
మనం కష్టతరమైన లేదా సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో ప్రారంభించినప్పటికీ, దేవుడిని మన భాగస్వామిగా చేసినప్పుడు మాత్రమే మన అంతిమ సామర్థ్యాన్ని సాధించగలమని మనము గ్రహిస్తాము. బివైయు–పాథ్‌వే విద్యార్థుల విజయం గురించి విచారణ చేస్తున్న జాతీయ స్థాయి ప్రముఖ విద్యావేత్తతో నేను ఇటీవల సంభాషించాను. అతడు తెలివైనవాడు మరియు అతని విచారణ నిజాయితీగా ఉంది, కానీ అతను స్పష్టంగా లౌకిక ప్రతిస్పందనను కోరుకున్నాడు. మా కొనసాగింపు కార్యక్రమాలు మరియు మార్గదర్శక ప్రయత్నాలను నేను అతనితో పంచుకున్నాను. కానీ నేను ఇలా చెప్పి ముగించాను, “ఇవన్నీ మంచి పద్ధతులు, కానీ మా విద్యార్థులు అభివృద్ధి చెందడానికి అసలైన కారణం వారి దైవిక సామర్థ్యాన్ని మేము వారికి బోధించడమే. మీ జీవితమంతా, మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్పినట్లయితే ఎలా ఉంటుందో ఊహించండి. తరువాత మీరు దైవిక సంభావ్యత కలిగిన దేవుని కుమారుడు లేదా కుమార్తె అని బోధించడం వలన కలిగే ప్రభావాన్ని పరిగణించండి.” అతడు ఒక్క క్షణం ఆగిన తరువాత, “అది శక్తివంతమైనది” అని సమాధానమిచ్చాడు.
సహోదర సహోదరీలారా, ప్రభువు యొక్క సంఘంలోని అద్భుతాలలో ఒకటి ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరు క్రీస్తులో ఎక్కువ కావచ్చు. సేవ చేయడానికి, తిరిగి ఇవ్వడానికి, పశ్చాత్తాపపడడానికి మరియు మంచి వ్యక్తులుగా మారడానికి తన సభ్యులకు మరిన్ని అవకాశాలను ఇచ్చే మరే ఇతర సంస్థ గురించి నాకు తెలియదు. మనం కష్టతరమైన లేదా సమృద్ధిగా ఉన్న పరిస్థితులలో ప్రారంభించినప్పటికీ మన దృష్టిని, అభివృద్ధిని పరలోకమువైపు కొనసాగిద్దాము. మనం అలా చేసినప్పుడు, క్రీస్తు మనలను ఉన్నత స్థానానికి హెచ్చిస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.