సంఘం పేరు మార్చబడదు
ప్రత్యేకించి ముందుగా మనం ఆలోచించిన దానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, వినయం మరియు త్యాగం అవసరమైనప్పటికీ, జీవించియున్న తన ప్రవక్త ద్వారా బయల్పరచినట్లుగా ప్రభువు యొక్క ఉపదేశాన్ని మనం ఇష్టపూర్వకంగా అనుసరించినట్లయితే, అదనపు ఆత్మీయ శక్తితో ప్రభువు మనల్ని దీవిస్తారు.
2018, ఆగష్టు 16న జరిగిన ఒక పత్రికా సమావేశంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమైన ప్రభువు సంఘానికి ఆయన ఇచ్చిన పేరు యొక్క ప్రాముఖ్యతను ఆయన నాకు తెలియజేసారు. 1 ఈ పేరును ఉపయోగించడానికి సంబంధించి ఆయన చిత్తముతో సామరస్యంగా ఉండేందుకు మనం చాలా చేయవలసి ఉంది.” 2
రెండు రోజుల తర్వాత, ఆగష్టు 18న నేను కెనడాలోని మాంట్రియల్‌లో అధ్యక్షులు నెల్సన్‌తో ఉన్నాను. మనోహరమైన పాలై డి కాంగ్రిలో మన సభ్య సమావేశం తరువాత, విలేఖరుల ప్రశ్నలకు అధ్యక్షులు నెల్సన్ సమాధానమిచ్చారు. “వంద ఏళ్ళకు పైగా ఉన్న ఆచారాన్ని (సంఘం యొక్క పేరును పునఃస్థాపించడం) మార్చడం సవాలుతో కూడుకున్నది” అని ఆయన ఒప్పుకున్నారు. కానీ, “సంఘం పేరు మార్చబడదు” అని ఆయన చెప్పారు. 3
ఏడు వారాల తర్వాత ఆయన సర్వ సభ్య సమావేశంలో మాట్లాడారు: “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమైన ప్రభువు సంఘానికి ఆయన ఇచ్చిన పేరు యొక్క ప్రాముఖ్యతను ఆయన నాకు తెలియజేసారు. … ‘ఈ విధంగా సంఘము పిలువబడుతుంది’ అని రక్షకుడే స్వయంగా చెప్పారు.” తరువాత, “సంఘం పేరు మార్చబడదు” అని అధ్యక్షులు నెల్సన్ మరలా చెప్పారు. 4
ఒక మంచి ప్రశ్న
ఒక మంచి ప్రశ్న ఎదురైంది: అనేక దశాబ్దాలుగా మనం “మోర్మన్” అనే ముద్దుపేరును హత్తుకున్నప్పుడు, “ఇప్పుడెందుకు?” “మోర్మన్ టాబర్నాకిల్ గాయకబృందం,” “నేనొక మోర్మన్‌ను” అనే వీడియోలు, “నేనొక మోర్మన్ బాలుడను” అనే ప్రాథమిక పాట ఉన్నప్పుడు?
క్రీస్తు యొక్క సిద్ధాంతము మారనిది మరియు శాశ్వతమైనది. అయినప్పటికీ, రక్షకుని కార్యములో ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన దశలు వాటికి తగిన సమయంలో బయల్పరచబడతాయి. “పునఃస్థాపన అనేది ఒక ప్రక్రియ, సంఘటన కాదు” 5 అని అధ్యక్షులు నెల్సన్ ఈ ఉదయం చెప్పారు. మరియు “అన్ని విషయములు సరైన సమయములో వచ్చును” అని ప్రభువు చెప్పారు. 6 మనకిదే సరైన సమయం. సంఘము యొక్క బయల్పరచబడిన పేరును మనం పునఃస్థాపిస్తున్నాము.
మనం ఆయన పేరుతో పిలువబడడం యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క గుర్తింపుకు, భవిష్యత్తుకు అవసరం. ఇటీవల నేను ఒహైయోలోని కర్ట్‌లండ్‌లో ఉన్నాను, అక్కడ కేవలం కొద్దిమంది సంఘ సభ్యులతో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఇలా ప్రవచించారు, “ ఈ సంఘము ఉత్తర మరియు దక్షిణ అమెరికాను నింపుతుంది—ఇది ప్రపంచాన్ని నింపుతుంది.” 7 ప్రభువు ఈ యుగము యొక్క కార్యమును “ఒక అద్భుతకార్యము మరియు ఒక ఆశ్చర్యకార్యము” 8 అని వర్ణించారు. “భూమి అంతా … ఆశీర్వదించబడుట[కు]” అనుమతించు “కడవరి దినములలో నెరవేరవలసి[యున్న] నిబంధనను “ గురించి ఆయన మాట్లాడారు. 9
ఈ సమావేశపు ప్రసంగాలు 55 భాషలలోనికి ప్రత్యక్షంగా అనువదించబడుతున్నాయి. క్రమంగా, ఈ మాటలు 220కు పైగా దేశాలు మరియు భూభాగాలలో 98 భాషలలో వినబడి, చదువబడతాయి.
రక్షకుడు ఘనత మరియు మహిమలో తిరిగి వచ్చినప్పుడు, ప్రపంచంలోని సమస్త దేశాలు, జనులు, జాతులు, భాషలు మరియు సంప్రదాయాలలో యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు ఉంటారు.
అధికమవుతున్న సంఘము యొక్క ప్రభావం
యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘ ప్రభావము కేవలం సంఘ సభ్యుల మీద మాత్రమే ఉండదు. మన కాలంలో పరలోక ప్రత్యక్షతల కారణంగా, పవిత్రమైన లేఖనాలు భూమిపై పునఃస్థాపించబడినందువలన మరియు శక్తివంతమైన పరిశుద్ధాత్మ వరం కారణంగా, యేసు క్రీస్తుపై అవిశ్వాసం విస్తరిస్తున్న ఈ లోకంలో మనం కొండమీద వెలుగైయుంటాము. విమోచకునిలో వారి విశ్వాసం కోల్పోయేలా చేయడానికి అనేకమంది లోకాన్ని అనుమతించినప్పటికీ, మనం “(మన) స్థానం నుండి కదిలింపబడము.” 10 మన సంఘ సభ్యులుకాని క్రైస్తవులు మన పాత్రను, క్రీస్తు గురించి ఖచ్చితమైన మన సాక్ష్యాన్ని స్వాగతిస్తారు. ఇప్పుడు మన సంఘాన్ని సందేహించే క్రైస్తవులు కూడా ఒకనాటికి మనల్ని స్నేహితులుగా హత్తుకుంటారు. రాబోయే రోజులలో మనము యేసు క్రీస్తు యొక్క పేరుతో పిలువబడతాము.
సంఘము యొక్క నిజమైన పేరును ముందుకు తీసుకురావడంలో మీ గొప్ప కృషికి మా కృతజ్ఞతలు. “రక్షకుని సంఘము యొక్క సరైన పేరును ఉపయోగించుటకు మన శ్రద్ధగల ఆసక్తి … హెచ్చించబడిన విశ్వాసము మరియు గొప్ప ఆత్మీయమైన శక్తిని [మనకు తెస్తుందని]” 11 మూడేళ్ళ క్రితం సమావేశంలో అధ్యక్షులు నెల్సన్ మనకు వాగ్దానము చేసారు.
ప్రపంచవ్యాప్తంగా భక్తిగల శిష్యుల చేత ఈ వాగ్దానము నెరవేర్చబడింది. 12
సంఘము యొక్క పూర్తి పేరును చెప్పడం కొన్నిసార్లు ఎబ్బెట్టుగా ఉంటుందని తూర్పు సంయుక్త రాష్ట్రాలకు చెందిన సహోదరుడు లారీ అహోలా చెప్పారు. కానీ ప్రవక్త యొక్క సలహా కారణంగా, ఆయన దానిని కొనసాగిస్తున్నారు. ఒకానొక సందర్భంలో, ఆయన మరొక విశ్వాసానికి చెందిన సంఘములో ఒక స్నేహితుడిని చూడడానికి వెళ్ళారు. ఆయన ఇలా చెప్పారు:
“తెలిసిన వారొకరు, ‘మీరు మోర్మనులా?’ అని అడిగారు.
“‘అవును, నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యుడిని,’ అని చెప్పాను. ‘మోర్మన్ సంఘము నమ్ముతుందా … ?’ అని మొదలుపెట్టి అతడు నన్ను అనేక ప్రశ్నలు అడగసాగాడు. ప్రతిసారీ నేను, ‘క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘములో మేము నమ్మేదేమిటంటే …’ అనే వాక్యంతో నా సమాధానం ప్రారంభించాను.
“నేను ‘మోర్మన్’ అనే పేరును అంగీకరించడం లేదని గమనించినప్పుడు, అతడు సూటిగా ‘మీరు మోర్మనులు కాదా?’ అని అడిగాడు.
“అప్పుడు నేను, మీకు మోర్మన్ తెలుసా అని అడిగాను—అతనికి తెలియదు. మోర్మన్ ఒక ప్రవక్తయని … (ఆయన)తో సహవాసాన్ని (నేను) గౌరవంగా భావిస్తున్నానని అతనితో చెప్పాను.
“‘కానీ, మోర్మన్ నా పాపాల కోసం మరణించలేదు. మోర్మన్ … (నా కోసం) గెత్సేమనెలో బాధ అనుభవించలేదు లేదా సిలువపై మరణించలేదు. … యేసు క్రీస్తు నా దేవుడు మరియు నా రక్షకుడు. … ఆయన పేరుతో నేను పిలువబడాలనుకుంటున్నాను.’ … అని చెప్పాను.
“… కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత, ‘అయితే, మీరు క్రైస్తవులు!’ (అన్నాడా పరిచయస్తుడు).” 13
అధ్యక్షులు నెల్సన్ మాటలు గుర్తున్నాయా? “ప్రభువు సంఘము యొక్క సరైన పేరును పునఃస్థాపించడానికి మన శాయశక్తులా చేసినప్పుడు, ఈ సంఘం ఎవరిదో ఆయన మనమెన్నడూ చూడని విధాలుగా కడవరి దిన పరిశుద్ధుల శిరస్సులపై ఆయన శక్తిని, దీవెనలను క్రుమ్మరించునని నేను వాగ్దానము చేస్తున్నాను.” 14
ప్రభువు ఎల్లప్పుడూ మార్గాన్ని తెరుస్తారు
ప్రభువు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తారు. మనం ఆయన పనిని చేసినప్పుడు, ఆయన మన కోసం మార్గాన్ని తెరుస్తారు.
ChurchofJesusChrist.org మరియు ChurchofJesusChrist.com అనే ఇంటర్నెట్ డొమైన్ సైట్‌లను కొనాలని ఎన్నో ఏళ్ళుగా మేము ఆశించాము. వాటిలో ఏదీ అమ్మకానికి లేదు. అధ్యక్షులు నెల్సన్ ప్రకటించిన సమయంలో, రెండూ అకస్మాత్తుగా అందుబాటులోకి వచ్చాయి. అది ఒక అద్భుతం. 15
చాలాకాలంగా సంఘానికి సంబంధించిన పేర్లను నవీకరించడంలో మా ప్రయత్నాలను ప్రభువు ఘనపరిచారు.
విశ్వాసంలో ముందుకు సాగుతూ, మోర్మన్ టాబర్నాకిల్ గాయకబృందం పేరు టెంపుల్ స్క్వేర్ వద్ద టాబర్నాకిల్ గాయకబృందముగా మార్చబడింది. ప్రతినెలా 2 కోట్ల 10 లక్షలమంది చూసే LDS.org వెబ్‌సైటు ChurchofJesusChrist.org 16 గా మార్పుచెందింది. ఎల్ డి ఎస్ బిజినెస్ కళాశాల ఎన్‌సైన్ కళాశాలగా మారింది. Mormon.org వెబ్‌సైట్ ChurchofJesusChrist.org లోకి మళ్ళించబడింది. “మోర్మన్” లేదా “ఎల్ డి ఎస్” అనే పేరు జతచేయబడిన వెయ్యి కంటే ఎక్కువ వస్తువుల పేర్లు మార్చబడ్డాయి. విశ్వాసులైన కడవరి దిన పరిశుద్ధులు తమ వెబ్‌సైట్‌లు, పాడ్‌కాస్ట్‌లు మరియు ట్విటర్ అకౌంట్లను సవరించుకున్నారు.
మనము యేసు క్రీస్తును నమ్ముతున్నామని తెలుసుకోవడానికి అది ఇతరులకు సహాయపడుతుంది.
“చిహ్నం మధ్యలో థోర్వాల్డ్‌సెన్ పాలరాయి విగ్రహం క్రైస్టస్ యొక్క ఆకారం ఉంటుంది. ఇది పునరుత్థానం చెందిన, జీవించుచున్న ప్రభువును తన వద్దకు వచ్చే వారందరినీ హత్తుకోవడానికి సమీపిస్తున్నట్లు చిత్రీకరిస్తుంది.
“చిహ్నరూపకముగా, పునరుత్థానం చెందిన రక్షకుడు సమాధి నుండి బయటకు రావడాన్ని మనకు (గుర్తుచేస్తూ) యేసు క్రీస్తు ఒక ధనురాకారము క్రింద నిలబడియుంటారు.” 17
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ఈ క్రొత్త చిహ్నాన్ని 50 కంటే ఎక్కువ భాషలలో పొందుపరిచింది. ప్రపంచమంతటా క్రొత్త డొమైన్ పేర్లు పొందబడ్డాయి.
ఇతరుల సహాయం కొరకు అభినందనలు
సంఘం యొక్క సరైన పేరుతో పిలువబడాలనే మా కోరికను గౌరవించిన అనేకమంది దయగల, మంచి జనులను మేము అభినందిస్తున్నాము. “కడవరి దిన పరిశుద్ధులు” 18 అని సూచిస్తూ ఒక కేథలిక్ మతాధికారి ఉదహరించిన ఒక కథనాన్ని నేను ఇటీవల చదివాను. ఒక నెల క్రితం నేను తూర్పు సంయుక్త రాష్ట్రాలలో ఒక క్రైస్తవ సంఘ నాయకుడిని సందర్శించినప్పుడు, ఆయన మొదటిసారి సంఘము గురించి ప్రస్తావించినప్పుడు మన పూర్తి పేరును సూచించారు మరియు ఆ తరువాత ఒకటి కంటే ఎక్కువసార్లు “యేసు క్రీస్తు యొక్క సంఘము” అని ఉపయోగించారు.
మన పేరుకు ఆరు పదాలను జతచేయడం మీడియాకు అసాధ్యం కానప్పటికీ, అధ్యక్షులు నెల్సన్ ముందుగా చెప్పినట్లు, “బాధ్యత గల మీడియా మన మనవికి సానుకూలంగా స్పందిస్తుందని” మేము తెలుసుకున్నాము. 19 మాకు నచ్చిన పేరును ఉపయోగిస్తూ సాంప్రదాయక, క్రీడాసంబంధమైన, రాజకీయ లేదా సామాజిక సంస్థలకు ఇచ్చిన అదే గౌరవాన్ని మాకిచ్చినందుకు ధన్యవాదాలు.
మన సువార్త పరిచర్య యొక్క ప్రాముఖ్యతను నిందించాలని లేదా తగ్గించాలని ఆశించేవారు కొందరు మనల్ని “మోర్మనులు” లేదా “మోర్మన్ సంఘము” అని పిలవడం కొనసాగిస్తారు. దాదాపు 200 సంవత్సరాలుగా ఉన్న మన పేరుతో పిలువబడాలనే మా కోరికను దయతో గౌరవించాలని న్యాయమైన మనస్సు గల మీడియా వారిని మేము మళ్ళీ అడుగుతున్నాము.
కడవరి దిన పరిశుద్ధుల ధైర్యము
సంఘము యొక్క పేరును ధైర్యంగా ప్రకటించిన కడవరి దిన పరిశుద్ధులు అనేక వేలమంది ఉన్నారు. మనం మన వంతును చేసినప్పుడు, ఇతరులు అనుసరిస్తారు. తహితి నుండి ఈ కథ నాకిష్టము.
అధ్యక్షులు నెల్సన్ గారి ఉపదేశాన్ని అనుసరిస్తానని పదేళ్ళ వయస్సున్న ఇరియురా జీన్ తీర్మానించుకుంది.
“ఆమె పాఠశాల తరగతి గదిలో వారు తమ వారాంతం గురించి చర్చించారు … ఇరియురా సంఘం గురించి మాట్లాడింది.
“‘ఓ, అయితే నువ్వు మోర్మనువా?’ అని ఆమె బోధకురాలు వైట్ పిఫావో అన్నది.
“‘కాదు … నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యురాలిని!’ అని ఇరియురా ధైర్యంగా చెప్పింది.
“‘అవును, … నువ్వు ఒక మోర్మన్‌వి’ అని ఆమె బోధకురాలు అన్నది.
“‘కాదు టీచర్, నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యురాలిని!’ అని ఇరియురా నొక్కిచెప్పింది.
“ఇరియురా యొక్క దృఢవిశ్వాసానికి శ్రీమతి పిఫావో అబ్బురపడింది మరియు ఆమె తన సంఘము యొక్క సుదీర్ఘమైన పేరును ఉపయోగించాలని ఎందుకంత పట్టుబట్టిందోనని ఆశ్చర్యపోయింది. (ఆమె సంఘము గురించి మరింతగా తెలుసుకోవాలని నిర్ణయించుకుంది.)
“(తరువాత సహోదరి) వైట్ పిఫావో బాప్తిస్మము తీసుకున్నప్పుడు, ఇరియురా అధ్యక్షులు నెల్సన్ గారి ఉపదేశాన్ని వినినందుకు (ఆమె కృతజ్ఞతలు తెలిపింది).” 20
“సంఘం పేరు మార్చబడదు.” విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రత్యేకించి ముందుగా మనం ఆలోచించిన దానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, వినయం మరియు త్యాగం అవసరమైనప్పటికీ, జీవించియున్న తన ప్రవక్త ద్వారా బయల్పరచినట్లుగా ప్రభువు యొక్క ఉపదేశాన్ని మనం ఇష్టపూర్వకంగా అనుసరించినట్లయితే, అదనపు ఆత్మీయ శక్తితో ప్రభువు మనల్ని దీవిస్తారు మరియు మనకు సహకారమిచ్చేందుకు, మనకు తోడుగా నిలిచేందుకు తన దేవదూతలను పంపుతారు. 21 ప్రభువు యొక్క ధృవీకరణను, ఆయన అనుమతిని మనం పొందుతాము.
మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారిపై ఉంచబడిన పరలోక శక్తికి నేను ప్రత్యక్ష సాక్షిని. ప్రభువును సంతోషపరచి, మన పరలోకపు తండ్రి బిడ్డలను దీవించాలనేదే ఆయన అత్యంత హృదయపూర్వక కోరికయైయున్నది. పవిత్రమైన, వ్యక్తిగత అనుభవం నుండి, నేను ఆయన పట్ల ప్రభువు ప్రేమను గూర్చి సాక్ష్యమిస్తున్నాను. ఆయన దేవుని యొక్క ప్రవక్త.
యేసే క్రీస్తని, దేవుని కుమారుడని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.