సర్వసభ్య సమావేశము
అనుదిన పునఃస్థాపన
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


13:43

అనుదిన పునఃస్థాపన

పరలోక వెలుగు యొక్క నిరంతర, దైనందిన ప్రేరేపణ మనకు అవసరం. “సేదదీర్చే సమయాలు” మనకు అవసరం. వ్యక్తిగత పునఃస్థాపన సమయాలు.

ఈ అందమైన విశ్రాంతిదిన ఉదయం క్రీస్తును గూర్చి మాట్లాడేందుకు, ఆయన సువార్తలో ఆనందించేందుకు మరియు మన రక్షకుని “మార్గం”1లో నడుస్తున్నప్పుడు ఒకరికొకరు సహకారమిచ్చుకొని, కాపాడుకొనేందుకు మనము సమకూడాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, మనము సంవత్సరమంతా ప్రతి విశ్రాంతి దినమున ఈ ఉద్దేశ్యము నిమిత్తము సమకూడుతాము. మీరు సంఘ సభ్యులు కానట్లయితే, మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము మరియు రక్షకుడిని ఆరాధించి, ఆయన గూర్చి నేర్చుకోవడానికి మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీలాగే—అపరిపూర్ణులమైనప్పటికీ—మంచి స్నేహితులు, పొరుగువారు, మనుష్యులుగా మారడానికి మేము ప్రయత్నిస్తున్నాము2 మరియు మన మాదిరియైన యేసు క్రీస్తును అనుసరించడం ద్వారా మేము ఇది చేయడానికి కోరుతున్నాము.

రక్షకుడైన యేసు క్రీస్తు

మనఃపూర్వకమైన మా సాక్ష్యాన్ని మీరు భావించగలరని మేము ఆశిస్తున్నాము. యేసు క్రీస్తు సజీవుడు! ఆయన సజీవుడైన దేవుని కుమారుడు మరియు మన కాలంలో భూమి మీద ప్రవక్తలను ఆయన నిర్దేశిస్తారు. వచ్చి, దేవుని వాక్యము విని, ఆయన మంచితనంలో పాలుపొందమని అందరిని మేము ఆహ్వానిస్తున్నాము. దేవుడు మనతో ఉన్నాడని మరియు ఆయన యొద్దకు వచ్చే వారందరి యొద్దకు ఆయన నిశ్చయంగా వస్తారని వ్యక్తిగతంగా నేను సాక్ష్యమిస్తున్నాను.3

మీతో కలిసి రక్షకుని మాదిరిని అనుసరిస్తూ, ఆయన శిష్యులుగా ఉండడాన్ని మేము గౌరవంగా పరిగణిస్తున్నాము.

తిన్నని దారిలో నడిచే నైపుణ్యం

దారి తప్పినవారు వృత్తాకారంలో నడుస్తారని తరచు చెప్పబడిన సిద్ధాంతమొకటి ఉంది. కొద్దికాలం క్రితం, Max Planck Institute for Biological Cybernetics (మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైబర్‌నెటిక్స్) లోని శాస్త్రజ్ఞులు ఆ సిద్ధాంతాన్ని పరీక్షించారు. పాల్గొనే సభ్యులను వారు దట్టమైన అడవికి తీసుకువెళ్ళి, “తిన్నని దారిలో నడవండి” అనే సరళమైన ఆదేశాలిచ్చారు. కనిపించే మార్గసూచికలేవీ అక్కడ లేవు. పరీక్షలో పాల్గొనేవారు మార్గం కోసం పూర్తిగా వారి జ్ఞానంపై ఆధారపడాలి.

వారెంత వరకు సఫలమయ్యారని మీరనుకుంటున్నారు?

“వారు నడిచే మార్గంలో ఆధారపడదగిన సూచనలు లేనప్పుడు జనులు నిజంగా వృత్తాకారంలో నడుస్తారని” శాస్త్రజ్ఞులు చెప్పారు.4 తరువాత వారిని ప్రశ్నించినప్పుడు, కొందరు సభ్యులు తాము కొంచెం కూడా దారి తప్పలేదని ఆత్మ విశ్వాసంతో చెప్పారు. వారు ఎంతో విశ్వాసంతో చెప్పినప్పటికీ, వారు 20 మీటర్ల వ్యాసం గల వృత్తాలలో నడిచినట్లు జిపిఎస్ సమాచారం చూపించింది.

తిన్నని దారిలో నడవడానికి మనము ఎందుకంత కష్టపడుతున్నాము? దారిలో చిన్నవి, అతి స్వల్పంగా కనిపించే మలుపులు మార్పు కలుగజేస్తాయని కొందరు పరిశోధకులు ఊహించారు. ఇతరులు మన రెండు కాళ్ళలో ఒకటి కొంచెం ఎక్కువ బలంగా ఉంటుందనే వాస్తవాన్ని ఎత్తిచూపారు. అయినప్పటికీ “దానికి మించి,తిన్నగా ముందుకు నడవడం గురించి అనిశ్చితి పెరుగుతున్న (కారణంగా)” మనం తిన్నగా ముందుకు నడవడానికి కష్టపడతాము.5

కారణం ఏదైనప్పటికీ, అది మానవ స్వభావం: ఆధారపడదగిన మార్గసూచికలు లేకపోతే మనం దారి నుండి తొలగిపోతాము.

దారి తప్పిపోవుట

చిన్నవి, అతి స్వల్పంగా కనిపించే విషయాలు మన జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురాగలవు అనేది ఆసక్తికరంగా ఉంది కదా?

ఒక పైలట్‌గా వ్యక్తిగత అనుభవం నుండి నేనిది తెలుసుకున్నాను. నేను విమానాశ్రయంలో విమానాన్ని క్రిందికి దించాలనుకున్న ప్రతిసారీ, మేము కోరుకున్న రన్‌వేలో సురక్షితంగా విమానాన్ని దించడానికి నేను చేయవలసిన దానిలో అధికం గమనంలో నిరంతరం స్వల్ప దిద్దుబాట్లు చేయడమేనని నేను తెలుసుకున్నాను.

ఒక వాహనం నడిపేటప్పుడు ఇటువంటి అనుభవాన్నే మీరు కలిగియుండవచ్చు. ఇతర చోదకుల చర్యలను చెప్పడం లేదు—కానీ, గాలి, దారిలో ఎత్తుపల్లాలు, చక్రాల అపరిపూర్ణ సమతుల్యత, అశ్రద్ధ అన్నీ మీరు ఉద్దేశించిన దారి నుండి మిమ్మల్ని త్రోసివేయగలవు. ఈ విషయాలపై శ్రద్ధ చూపడంలో విఫలమైతే మీరు సమస్యల్లో చిక్కుకుంటారు.6

నీటిగుంటలో కారు

ఇది మనకు భౌతికంగా అన్వయిస్తుంది.

ఇది మనకు ఆధ్యాత్మికంగా కూడా అన్వయిస్తుంది.

మన ఆధ్యాత్మిక జీవితాల్లోని మార్పుల్లో అధికం—సవ్యమైనవి మరియు అపసవ్యమైనవి—ఒక్కసారి ఒక్కటి చొప్పున క్రమంగా జరుగుతాయి. మాక్స్ ప్లాంక్ అధ్యయనంలోని సభ్యులవలె, మనం దారి తప్పినప్పుడు మనం తెలుసుకోలేకపోవచ్చు. మనం తిన్నని దారిలో నడుస్తున్నామనే అధిక విశ్వాసాన్ని కూడా మనం కలిగియుండవచ్చు. కానీ నిజమేమిటంటే, మనల్ని నడిపించడానికి మార్గసూచికల సహాయం లేనట్లయితే మనం తప్పకుండా దారి తప్పిపోతాం మరియు మనమెప్పుడూ ఊహించని ప్రదేశాలకు చేరుకుంటాము.

ఇది వ్యక్తుల విషయంలో నిజము. ఇది సమాజాలు మరియు దేశాల విషయంలో కూడా నిజము. లేఖనములు ఉదాహరణలతో నిండియున్నాయి.

యెహోషువ మరణించిన తరువాత, “యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టెను”7 అని న్యాయాధిపతుల గ్రంథము నమోదు చేసింది.

మోషే మరియు యెహోషువల జీవితకాలంలో ఇశ్రాయేలు సంతానము ఆశ్చర్యకరమైన పరలోక ప్రమేయాలు, దర్శనాలు, కాపాడబడడాలు మరియు అద్భుతమైన విజయాలను చూసినప్పటికీ, ఒక్క తరంలోనే జనులు మార్గాన్ని విడిచిపెట్టి, తమ స్వంత కోరికల ప్రకారం నడుచుకోనారంభించారు. అయితే, ఆ ప్రవర్తనకు పరిహారం చెల్లించేందుకు ఎంతోకాలం పట్టలేదు.

కొన్నిసార్లు ఈ పతనానికి తరాలు పట్టవచ్చు. కొన్నిసార్లు ఇది కొన్ని సంవత్సరాలు లేదా నెలల్లోనే జరుగవచ్చు.8 కానీ, మనమందరం ఎంపికలు చేయడానికి ఆకర్షింపబడతాము. గతంలో మన ఆత్మీయ అనుభవాలు ఎంత బలంగా ఉన్నప్పటికీ, మానవులుగా మనం దారి తప్పుతాం. ఆదాము కాలము నుండి ఇప్పటి వరకు అదే మాదిరియైయున్నది.

ఇదిగో మంచి వార్త

సమస్తము కోల్పోబడలేదు. పరీక్షలో దారి తప్పి తిరుగుతున్న సభ్యుల వలె కాకుండా, ఆధారపడదగినవి, కనిపించే మార్గసూచికలు మనకున్నాయి మరియు మన దారులను తిన్నగా చేయడానికి మనం వాటిని ఉపయోగించగలము.

ఈ మార్గసూచికలు ఏమిటి?

నిశ్చయంగా వాటిలో అనుదిన ప్రార్థన, లేఖనాలను ధ్యానించుట మరియు రండి, నన్ను అనుసరించండి వంటి ప్రేరేపిత సాధనాల ఉపయోగము వంటివి ఉంటాయి. ప్రతిరోజు మనం అణకువతో, నిజాయితీగా దేవునితో సంభాషించగలము. ఆయన చిత్తముతో మన చిత్తము మరియు కోరికలను పరిగణిస్తూ, మన చర్యలను ధ్యానిస్తూ, మనం మన రోజువారి క్షణాలను పునర్వీక్షించగలము. మనం దారి తప్పినట్లయితే, మనల్ని పునఃస్థాపించమని దేవుడిని వేడుకుంటాము మరియు మంచిగా చేయడానికి నిబద్ధులమవుతాము.

రక్షకుడు తన గొఱ్ఱెలను నడిపించును

ఆత్మశోధన యొక్క ఈ సమయం జీవితాన్ని సరిచూసుకోవడానికి గల అవకాశం. ఇది మనం లోతుగా ధ్యానించడానికి గల సమయం, ఇప్పుడు మనం దేవుడిని అనుసరించి, ఆయనతో సంభాషించగలము మరియు మన పరలోక తండ్రి యొక్క వాక్యముచేత, ఆత్మీయంగా బయల్పరచబడిన మాట చేత ఉపదేశించబడి, బోధించబడి, శుద్ధిచేయబడగలము. మృదువైన క్రీస్తును అనుసరించడానికి మన గంభీరమైన నిబంధనలను మనం గుర్తు చేసుకున్నప్పుడు, మన పురోగతిని అంచనా వేసినప్పుడు మరియు దేవుడు తన పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయ మార్గసూచికలతో మనల్ని మనం సమతుల్యం చేసుకొనినప్పుడు అది ఒక పవిత్రమైన సమయం అవుతుంది.

దానిని మీ వ్యక్తిగత, అనుదిన పునఃస్థాపనగా అనుకోండి. మహిమ మార్గంలో యాత్రికులుగా మన ప్రయాణంలో తడబడడం ఎంత సులువో మనకు తెలుసు. కానీ, అతిచిన్న మలుపులు మనల్ని రక్షకుని మార్గం నుండి ఎలా తప్పించగలవో అలాగే తిరిగి సమతుల్యం చేసుకోవడానికి చేసే చిన్న, సరళమైన చర్యలు నిశ్చయంగా మనల్ని మళ్ళీ ఆ మార్గానికి మళ్ళిస్తాయి. ఎప్పుడూ కలిగేలా మనకు సందేహాలు వచ్చినప్పుడు, మన అనుదిన పునఃస్థాపన పరలోక వెలుగువైపు మన హృదయాలను తెరుస్తుంది, అది మన ఆత్మలను వెలుగుతో నింపి, నీడలను, భయాలను, సందేహాలను తరిమికొడుతుంది.

చిన్న చుక్కాని, పెద్ద ఓడలు

మనం కోరినట్లయితే, “తన పరిశుద్ధాత్మ వలన దేవుడు (మనకు) జ్ఞానమును అనుగ్రహిస్తారు, అవును, మాటలతో వర్ణించలేని పరిశుద్ధాత్మ వరము వలన అనుగ్రహిస్తారు.”9 మనం అడిగినంత తరచుగా ఆయన మనకు మార్గాన్ని బోధిస్తారు మరియు దానిని అనుసరించడానికి మనకు సహాయపడతారు.

అయితే, దీనికి మన వంతుగా నిరంతర ప్రయత్నం అవసరము. గతంలోని ఆత్మీయ అనుభవాలతో మనం తృప్తి పొందలేము. మనకు నిరంతరం ఆత్మీయ అనుభవాలు అవసరం.

మనం ఇతరుల సాక్ష్యాలపై ఆధారపడలేము. మన స్వంత సాక్ష్యాలను మనం పొందాలి.

పరలోక వెలుగు యొక్క నిరంతర, దైనందిన ప్రేరేపణ మనకు అవసరం.

“సేదదీర్చే సమయాలు” మనకు అవసరం.10 వ్యక్తిగత పునఃస్థాపన సమయాలు.

“ప్రవహించు జలములు ఎంతోకాలము కల్మషముగా ఉండలేవు.”11 మన ఆలోచనలను, క్రియలను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి మనం వృద్ధిచెందడాన్ని కొనసాగించాలి.

ఏదేమైనా, పునఃస్థాపన అనేది ప్రతి ఒక్కరి కోసం ఒకేసారి జరిగింది కాదు. అది ఒక్కోసారి ఒకరోజు, ఒక్కోసారి ఒక హృదయం చొప్పున సాగే నిరంతర ప్రక్రియ.

మనం చేసే పనులే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక రచయిత ఇలా చెప్పాడు: “ఒక రోజు ఒక పూర్తి జీవితం వంటిది. మీరు ఒక పనిని ప్రారంభిస్తారు, కానీ మరేదో చేస్తారు, ఒక రోజువారీ పని చేయాలని ప్రణాళిక చేస్తారు, కానీ చేయలేకపోతారు. … మీ జీవితపు అంతములో, మీ సంపూర్ణ ఉనికి కూడా అదేవిధంగా అస్తవ్యస్తమైన నాణ్యత కలిగియుంటుంది. ఒక్క రోజు ఉన్న విధంగానే మీ పూర్తి జీవితం ఉంటుంది.”12

మీ జీవిత స్వరూపాన్ని మీరు మార్చాలనుకుంటున్నారా?

మీ రోజు యొక్క స్వరూపాన్ని మార్చండి.

మీరు మీ రోజును మార్చాలనుకుంటున్నారా?

ఈ సమయాన్ని మార్చండి.

ఈ క్షణం మీరు ఆలోచించేదానిని, భావించేదానిని మరియు చేసే దానిని మార్చండి.

ఒక చిన్న చుక్కానిచేత పెద్ద ఓడ త్రిప్పబడగలదు.13

చిన్న ఇటుకలు అద్భుతమైన భవనాలు కాగలవు.

చిన్న విత్తనాలు అతిపొడవైన చెట్లు కాగలవు.

సరిగ్గా గడిపిన నిముషాలు, గంటలు సరిగ్గా జీవించిన జీవితానికి సోపానాలు. అవి మంచితనాన్ని ప్రేరేపించగలవు, అపరిపూర్ణతల ఊబిలో నుండి మనల్ని పైకెత్తగలవు, క్షమాపణ మరియు శుద్ధి యొక్క విమోచన మార్గానికి మనల్ని తిరిగి నడిపించగలవు.

క్రొత్త ఆరంభాల దేవుడు

క్రొత్త అవకాశం, క్రొత్త జీవితం, క్రొత్త నిరీక్షణ అనే అద్భుతమైన బహుమానం కొరకు మీతో పాటు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

మన సమృద్ధిగల, క్షమించు దేవునికి స్తుతులు చెల్లించడంలో మనం మన స్వరాలనెత్తుతాము. నిశ్చయంగా ఆయన క్రొత్త ఆరంభాల దేవుడు. ఆయన పిల్లలమైన మనం అమర్త్యత్వము మరియు నిత్యజీవము కొరకు చేసే అన్వేషణలో సఫలమయ్యేందుకు మనకు సహాయపడడమే ఆయన పనియంతటి యొక్క ఘనమైన ముగింపు.14

మనం క్రీస్తులో నూతన సృష్టి కాగలము, ఎందుకంటే “ఎంత తరచుగా నా జనులు పశ్చాత్తాపపడుదురో అంత తరచుగా నాకు వ్యతిరేకముగా వారు చేసిన అతిక్రమములను నేను క్షమించెదను”15 మరియు “వాటిని ఇక జ్ఞాపకముంచుకొనను”16 అని దేవుడు వాగ్దానం చేసారు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రియమైన స్నేహితులారా, మనమందరము ఎప్పటికప్పుడు దారి తప్పుతూ ఉంటాము.

కానీ పశ్చాత్తపపడి, మళ్ళీ తిరిగి దారిలోకి రాగలము. ఆయన అందించిన ఆత్మీయ మార్గసూచికలను వెదకి, వ్యక్తిగత బయల్పాటును హత్తుకొని, అనుదిన పునఃస్థాపన కొరకు మనం ప్రయత్నించినట్లయితే, ఈ జీవితపు అంధకారం మరియు శ్రమల గుండా మన మార్గం వెంబడి మనం ప్రయాణించగలము మరియు మన ప్రియమైన పరలోక తండ్రి వద్దకు తిరిగివెళ్ళే మార్గం కనుగొనగలము. ఈ విధంగా మనం మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులమవుతాము.

ఈవిధంగా మనం చేసినప్పుడు, దేవుడు మనల్ని చూసి సంతోషిస్తారు. “నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రభువు తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును.”17

మనం అనుదిన పునఃస్థాపనను వెదకి, యేసు క్రీస్తు మార్గంలో నడిచేందుకు నిరంతరం ప్రయత్నించాలనేది నా ప్రార్థన. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని యేసు బోధించెను (యోహాను 14:6). NIV First-Century Study Bible (మొదటి శతాబ్ద బైబిలు అధ్యయనపు క్రొత్త అంతర్జాతీయ అనువాదం) ఈ వివరణను కలిగియుంది: “హెబ్రీ బైబిలులో బాట లేదా మార్గము యొక్క రూపము తరచు దేవుని ఆజ్ఞలు లేదా బోధనలను పాటించడంపై నిలిచింది [ కీర్తనలు 1:1; 16:11; 86:11 చూడండి]. నమ్మకాలు, బోధనలు లేదా అభ్యాసాల సమూహంలో క్రియాశీలకంగా పాల్గొనడానికి ఇదొక సామాన్యమైన ప్రాచీన ఉదాహరణ. డెడ్ సీ స్క్రోల్స్ సమాజము తమనుతాము ‘మార్గమును’ వెంబడించువారిగా పిలుచుకున్నారు. దాని ద్వారా దేవుడిని సంతోషపెట్టు మార్గమని వారు అనువదించుకున్న వారి స్వంత మార్గమును వారు వెంబడించువారని అర్థము. పౌలు మరియు తొలి క్రైస్తవులు తమనుతాము ‘మార్గమును వెంబడించువారిగా’ పిలుచుకున్నారు [అపొస్తలుల కార్యములు 24:14 చూడండి]” (in “What the Bible Says about the Way, the Truth, and the Life,” Bible Gateway, biblegateway.com/topics/the-way-the-truth-and-the-life).

    1873లో, Didache అను పేరుగల ఒక ప్రాచీన గ్రంథము కాన్‌స్టాంటినోపెల్ వద్ద యెరూషలేము యొక్క గోత్రజనకుని గ్రంథాలయంలో కనుగొనబడింది. అది మొదటి శతాబ్దం (క్రీ.శ. 80–100)లో వ్రాయబడి, ఉపయోగించబడిందని అనేకమంది పండితులు నమ్మారు. Didache ఈ మాటలతో ప్రారంభమవుతుంది: “రెండు విధానాలున్నాయి, ఒకటి జీవానికి సంబంధించినది మరియు రెండవది మరణానికి సంబంధించినది, కానీ రెండు విధానాల మధ్య గొప్ప వ్యత్యాసముంది. అప్పటి జీవన విధానము ఇది: మొదటిది, నిన్ను తయారుచేసిన దేవుడిని నీవు ప్రేమించవలెను; రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని” (Teaching of the Twelve Apostles, trans. Roswell D. Hitchcock and Francis Brown [1884], 3).

    సంఘము ఉనికిలో ఉన్న తొలిరోజులలో, యేసు యొక్క మెస్సీయత్వమును అంగీకరించి, ఆయనను తమ ప్రభువుగా ఒప్పుకొనిన వారు తమనుతాము ‘మార్గమును’ వెంబడించువారిగా పిలుచుకున్నారని The Expositor’s Bible Commentary వంటి ఇతర మూలాధారాలు సూచిస్తున్నాయి [అపొస్తలుల కార్యములు 19:9, 23; 22:4; 24:14, 22 చూడండి]” (ed. Frank E. Gaebelein and others [1981], 9:370).

  2. మోషైయ 2:17 చూడండి.

  3. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:63 చూడండి.

  4. “Walking in Circles,” Aug. 20, 2009, Max-Planck-Gesellschaft, mpg.de.

  5. “Walking in Circles,” mpg.de. అధ్యయనంలో పాల్గొనిన నలుగురి జిపిఎస్ సమాచారాన్ని ఈ చిత్రం చూపుతుంది. వారిలో ముగ్గురు మబ్బుపట్టిన రోజు నడిచారు. వారిలో ఒకరు (SM) మబ్బులు సూర్యుడిని కమ్ముకున్నప్పుడు నడవడం ప్రారంభించారు, కానీ 15 నిముషాల తర్వాత మబ్బులు వీడిపోయి ఆ సభ్యుడు సూర్యుడిని అస్పష్టంగా చూడగలిగాడు. సూర్యుడు కనిపించినప్పుడు, ఆ సభ్యుడు ఎంత ఎక్కువ విజయవంతంగా తిన్నని దారిలో నడుస్తున్నాడో గమనించండి.

  6. గమనంలో కేవలం రెండు డిగ్రీల చిన్న తప్పు వలన ఒక ప్రయాణికుల జెట్ ఎలా అంటార్కిటికాలోని ఎరెబస్ పర్వతాన్ని గుద్దుకొని, 257 మంది మరణానికి కారణమయ్యిందో తెలిపే ఒక బాధాకరమైన ఉదాహరణ కొరకు, Dieter F. Uchtdorf, “A Matter of a Few Degrees,” Liahona, May 2008, 57–60 చూడండి.

  7. న్యాయాధిపతులు 2:10.

  8. క్రీస్తు అమెరికాను దర్శించిన తర్వాత, జనులు వారి పాపాల కొరకు నిజంగా పశ్చాత్తాపపడి, బాప్తిస్మము తీసుకొని, పరిశుద్ధాత్మను పొందారు. ఒకప్పుడు వివాదాస్పదమైన, గర్విష్ఠులైన జనులున్న చోట ఇప్పుడు “వారి మధ్య ఏ వివాదములు, తగవులు లేకుండెను మరియు ప్రతి మనుష్యుడు ఒకనితోనొకడు న్యాయముగా వ్యవహరించెను” (4 నీఫై 1:2). నీతియుక్తత గల ఈ సమయం జనులు మార్గం నుండి మరలిపోయి, గర్వం ప్రారంభమవడానికి ముందు దాదాపు రెండు శతాబ్దాలు నిలిచింది. అయినప్పటికీ, ఆత్మీయ సుడిగుండం కూడా చాలా త్వరగా సంభవించగలదు. ఒక ఉదాహరణగా, దశాబ్దాలకు ముందు, మోర్మన్ గ్రంథములో న్యాయాధిపతుల పరిపాలన యొక్క 50వ సంవత్సరంలో అక్కడ జనుల మధ్య “నిరంతరమైన సమాధానము మరియు గొప్ప సంతోషముండెను.” కానీ సంఘ సభ్యుల హృదయాలలో ప్రవేశించిన గర్వము కారణంగా నాలుగు సంవత్సరాల స్వల్ప సమయం తర్వాత, “సంఘమందు అనేక విభేధములుండెను మరియు అధిక రక్తపాతము జరుగునంతగా జనుల మధ్య ఒక వివాదముండెను” (హీలమన్ 3:32–4:1 చూడండి).

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:26.

  10. అపొస్తలుల కార్యములు 3:19.

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:33.

  12. Michael Crichton, Jurassic Park (2015), 190.

  13. “ఓడలను మాదిరిగా తీసుకోండి. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును” (యాకోబు 3:4; క్రొత్త అంతర్జాతీయ అనువాదం).

  14. మోషే 1:39 చూడండి.

  15. మోషైయ 26:30.

  16. సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42.

  17. ద్వితీయోపదేశకాండము 28:8–9; 1–7 వచనాలు కూడా చూడండి.