సర్వసభ్య సమావేశము
యెహోవాకు పరిశుద్ధత చెల్లించుట
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:16

యెహోవాకు పరిశుద్ధత చెల్లించుట

త్యాగమంటే తక్కువ అర్థములో “వదులుకోవడం” మరియు ఎక్కువ అర్థములో దేవునికి “ఇవ్వడం.”

గత సంవత్సరం, ఆసియా ఉత్తర ప్రాంత అధ్యక్షత్వములో పనిచేస్తున్నప్పుడు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు నాకు ఫోను చేసి, అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కులో రెండవ సలహాదారునిగా సేవ చేయమని నన్నాహ్వానించారు. ఆ సంభాషణలో పాల్గొనమని ఆయన నా భార్య లోరీని దయతో ఆహ్వానించారు. ఫోను సంభాషణ ముగిసిన తరువాత, నా భార్య “అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కు ఏమి చేస్తారు?” అని అడిగినప్పుడు మేమింకా నమ్మలేని స్థితిలో ఉన్నాము. ఒక క్షణం ఆలోచించిన తరువాత, “నాకు ఖచ్చితంగా తెలియదు!” అని నేను స్పందించాను.

ఒక సంవత్సరం తరువాత, వినయం మరియు కృతజ్ఞతగల లోతైనా భావాలను పొందిన తరువాత, నేను నా భార్య ప్రశ్నకు మరింత ఎక్కువ అవగాహనతో సమాధానం చెప్పగలను. అనేక ఇతర విషయాలతోపాటు, సంఘము యొక్క సంక్షేమం మరియు మానవతావాద కార్యమును అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కు పర్యవేక్షిస్తారు. ఈ పని ఇప్పుడు మొత్తం భూగోళమంతా విస్తరించింది మరియు మునుపెన్నడూ లేనంతగా దేవుని బిడ్డలను ఆశీర్వదిస్తుంది.

అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కుయైన మాకు అద్భుతమైన సంఘ ఉద్యోగులు మరియు ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షత్వముతో సహా ఇతరులు సహకరిస్తారు, వారు సంఘ సంక్షేమం మరియు స్వయంసమృద్ధి ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాతో కలిసి సేవ చేస్తారు. సంఘము యొక్క ఇటీవలి మానవతావాద ప్రయత్నాల గురించి ఆ కమిటీ సభ్యులుగా మా హోదాలో మీతో పంచుకోవాలని ప్రథమ అధ్యక్షత్వము మరియు అలాగే నిన్న సాయంత్రం మనతో మాట్లాడిన సహోదరి యుబాంక్ నన్ను అడిగారు. మేము ప్రత్యేకంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయమని కూడా వారు అభ్యర్థించారు, ఎందుకంటే, సహోదరి సహోదరులారా, ఆ మానవతావాద ప్రయత్నాలను మీరే సాధ్యం చేసారు.

మానవతావాద విరాళాలు
అదనపు మానవతావాద విరాళాలు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సంక్షోభం యొక్క ప్రారంభ ఆర్థిక ప్రభావాలను మేము ఆందోళనతో గమనించినప్పుడు, పరిశుద్ధులు ఇవ్వగలిగే ధన సహకారం తగ్గుతుందని మేము సులభంగా ఊహించగలిగేవారము. వాస్తవానికి, మన స్వంత సంఘ సభ్యులు కూడా మహమ్మారి నుండి ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు. మేము దానికి విరుద్ధమైన ఫలితాలను గమనించినప్పుడు మా భావాలను ఊహించండి! 2020లో మానవతావాద విరాళాలు ఎన్నడూ లేనంత ఎక్కువగా వచ్చాయి మరియు ఈ సంవత్సరం మరింత ఎక్కువగా వస్తున్నాయి. మీ ఔదార్యం ఫలితంగా, సంఘము మానవతావాద నిధి ప్రారంభమైనప్పటి నుండి 150కి పైగా దేశాలలో 1,500లకు పైగా కోవిడ్ సహాయక ప్రాజెక్ట్‌లతో అత్యంత విస్తృతమైన ప్రతిస్పందనను సాధించగలిగింది. మీరు ప్రభువుకు ఎంతో నిస్వార్థంగా ఇచ్చిన ఈ విరాళాలు జీవితాన్ని నిలబెట్టే ఆహారం, ఆక్సిజన్, వైద్య సామాగ్రి మరియు టీకాలుగా మార్చబడ్డాయి, మీరు విరాళాలు ఇచ్చి ఉండకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.

శరణార్థులు
శరణార్థులు
శరణార్థులు

వస్తు రూపంలో ఇచ్చే విరాళాలు ఎంత ముఖ్యమైనవో, సంఘ సభ్యులు మానవతావాద హేతువు కోసం విరాళంగా ఇచ్చే విస్తారమైన వారి సమయం మరియు శక్తిసామర్థ్యాలు అంతే ముఖ్యమైనవి. మహమ్మారి ప్రబలినప్పటికీ, ప్రకృతి వైపరీత్యాలు, పౌర సంఘర్షణ మరియు ఆర్థిక అస్థిరత అవిశ్రాంతంగా ఉన్నది మరియు మిలియన్ల మంది ప్రజలు తమ గృహాలను విడిచి వెళ్లునట్లు చేయడం కొనసాగించింది. ప్రపంచంలో 82 మిలియన్లకు పైగా ప్రజలు బలవంతంగా స్థానభ్రంశము చేయబడ్డారని ఐక్యరాజ్యసమితి ఇప్పుడు నివేదించింది.1 తమకు లేదా వారి పిల్లలకు మెరుగైన జీవితం కోసం పేదరికం లేదా అణచివేత నుండి పారిపోవడానికి ఎంచుకున్న మిలియన్ల మంది ఇతరులను జోడించండి మరియు ఈ ప్రపంచ పరిస్థితి యొక్క పరిమాణం గురించి మీరు సంగ్రహవలోకనము పొందడం ప్రారంభించవచ్చు.

ఆమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు ఐరోపాలోని అనేక ప్రదేశాలలో శరణార్థులు మరియు వలసదారుల స్వాగత కేంద్రాలను సంఘము నిర్వహిస్తుందని తెలుపుటకు నేను సంతోషిస్తున్నాను. అనేకమంది యొక్క స్వచ్ఛంద సమయం మరియు ప్రతిభలకు ధన్యవాదాలు. మీరిచ్చిన విరాళాలకు ధన్యవాదాలు, ప్రపంచవ్యాప్తంగా ఇతర సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు సహాయం చేయడానికి మనము వస్తువులు, నిధులు మరియు వాలంటీర్లను అందిస్తాము.

ఈ శరణార్థులు స్థిరపడడానికి మరియు స్వయంసమృద్ధిగల వారిగా మారడంలో సహాయం చేయడానికి ఆహారము, దుస్తులు, స్నేహాన్ని పంచిన పరిశుద్ధులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నిన్న సాయంత్రం, సహోదరి యుబాంక్ ఈ విషయంలో పరిశుద్ధులు చేసిన కొన్ని అద్భుతమైన ప్రయత్నాలను మీతో పంచుకున్నారు. ఈ ప్రయత్నాల గురించి నేను ఆలోచించినప్పుడు, త్యాగము యొక్క సూత్రం గురించి, దేవుడిని ప్రేమించడం మరియు మన పొరుగువారిని ప్రేమించడం అనే రెండు గొప్ప ఆజ్ఞలకు ఈ సూత్రం యొక్క ప్రత్యక్ష అనుసంధానం గురించి తరచు నేను ఆలోచిస్తాను.

ఆధునిక వాడుకలో, త్యాగం అనే పదం ప్రభువు మరియు ఆయన రాజ్యం కోసం “వదులుకోవడం” అనే భావనను తెలియజేస్తుంది. ఏదేమైనా, ప్రాచీన కాలంలో సాక్రిఫైస్ (త్యాగం) అనే పదానికి అర్థం దాని రెండు లాటిన్ మూలాలతో మరింత దగ్గరగా ముడిపడి ఉంది: సేసర్ అంటే పవిత్రమైనది లేదా పరిశుద్ధమైనది మరియు ఫేసర్ అంటే “తయారు చేయడం.”2 అందువలన, ప్రాచీనంగా త్యాగం అంటే దేనినైనా లేదా ఎవరినైనా పరిశుద్ధంగా చేయడం.3 అలా చూసినప్పుడు, త్యాగం అనేది పరిశుద్ధంగా మారడం మరియు దేవుడిని తెలుసుకోవడం అనే ప్రక్రియే తప్ప అది ఒక సంఘటన లేదా ఆచారబద్ధంగా ప్రభువు కోసం వస్తువులను “వదులుకోవడం” కాదు.

ప్రభువు సెలవిచ్చారు, “నేను బలిని కోరను గాని [దాతృత్వమును] కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.”4 మనం పరిశుద్ధులము కావాలని,5 దాతృత్వం కలిగి ఉండాలని6 మరియు ఆయన గురించి తెలుసుకోవాలని ప్రభువు కోరుచున్నారు.7 అపొస్తలుడైన పౌలు బోధించినట్లుగా, “బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.”8 చివరకు, ప్రభువు మన హృదయాలను కోరుచున్నారు; మనం క్రీస్తులో నూతన సృష్టిగా మారాలని ఆయన కోరుచున్నారు.9 ఆయన నీఫైయులకు సూచించినట్లుగా, “మీరు విరిగిన హృదయమును, నలిగిన ఆత్మను బలిగా నాకు అర్పించెదరు.”10

ప్రభువుకు పరిశుద్ధత

త్యాగమంటే తక్కువ అర్థములో “వదులుకోవడం” మరియు ఎక్కువ అర్థములో ప్రభువుకు “ఇవ్వడం.” మన ప్రతి దేవాలయ ప్రవేశ ద్వారం మీద “ప్రభువుకు పరిశుద్ధత; ప్రభువు మందిరము” అనే పదాలు చెక్కబడ్డాయి. త్యాగం చేయడం ద్వారా మన నిబంధనలను పాటించినప్పుడు, యేసు క్రీస్తు కృప ద్వారా మనం పరిశుద్ధులమవుతాము; మరియు పరిశుద్ధ దేవాలయ బలిపీఠాల వద్ద విరిగిన హృదయాలు మరియు నలిగిన ఆత్మలతో మన పరిశుద్ధతను దేవునికి మనము సమర్పిస్తాము. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఇలా బోధించారు: “ఒకరి ఇష్టాన్ని [లేదా హృదయాన్ని11] సమర్పించడం నిజంగా దేవుని బలిపీఠం మీద మనం ఉంచవలసిన ఏకైక వ్యక్తిగత విషయం. … ఏదేమైనా, మీరు మరియు నేను చివరకు మనల్నిమనం సమర్పించుకున్నప్పుడు, మన వ్యక్తిగత సంకల్పాలు దేవుని చిత్తంలో కలిసి పోవడానికి అనుమతించడం ద్వారా మనం నిజంగా ఆయనకు ఏదో ఇస్తున్నాము!”12

ఇతరుల తరఫున మన త్యాగాలను “వదులుకోవడం” అనే కోణం నుండి చూసినప్పుడు, మన త్యాగాలు గుర్తించబడనప్పుడు లేదా బహుమతి లభించనప్పుడు మనం వాటిని భారంగా భావించి నిరుత్సాహపడవచ్చు. కానీ, దేవునికి “ఇవ్వడం” అనే కోణం నుండి చూసినప్పుడు, ఇతరుల తరఫున మన త్యాగాలు బహుమతులుగా మారతాయి మరియు ఉదారంగా ఇవ్వడం వల్ల కలిగే ఆనందం దానికదే బహుమతి అవుతుంది. ఇతరుల నుండి ప్రేమ, ఆమోదం లేదా ప్రశంసల అవసరత నుండి విముక్తి పొంది, మన త్యాగాలు రక్షకుని మరియు మన తోటి మనుష్యుల పట్ల మన కృతజ్ఞత మరియు ప్రేమ యొక్క స్వచ్ఛమైన, లోతైన వ్యక్తీకరణలుగా మారతాయి. స్వీయ త్యాగం యొక్క గర్వించదగిన భావం ఏదైన కలిగితే, అది కృతజ్ఞత, ఔదార్యం, సంతృప్తి మరియు ఆనందానికి దారితీస్తుంది.13

మన జీవితాలు, మన ఆస్తులు, మన సమయం, లేదా మన ప్రతిభలు—అది ఏది అయినప్పటికీ, దానిని వదులుకోవడం ద్వారా మాత్రమే కాకుండా దానిని ప్రభువుకు అర్పించడం14 ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. సంఘము యొక్క మానవతావాద కార్యము అటువంటి బహుమానము. ఇది పరిశుద్ధుల సామూహిక, సమర్పించబడిన అర్పణల ఉత్పత్తి, ఇది దేవుడు మరియు ఆయన పిల్లల పట్ల మనకున్న ప్రేమకు నిదర్శనం.15

ఆమె సేవ చేయుచున్న వారితో సహోదరి కేన్‌ఫీల్డ్

స్టీవ్ మరియు అనితా కేన్‌ఫీల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కడవరి దిన పరిశుద్ధుల యొక్క ప్రతినిధులు, ప్రభువుకు ఇవ్వడం ద్వారా వచ్చే స్వభావాన్ని మార్చే దీవెనలను తమకుతాముగా అనుభవించారు. సంక్షేమం మరియు స్వయంసమృద్ధి సువార్తికులైన క్యాన్‌ఫీల్డ్స్ ఐరోపాలోని శరణార్థ శిబిరాలు మరియు వలస కేంద్రాలలో సహాయం అందించమని కోరబడ్డారు. తన వృత్తిపరమైన జీవితంలో సహోదరి కేన్‌ఫీల్డ్ ప్రపంచ స్థాయి ఇంటీరియర్ డిజైనర్, సంపన్న ఖాతాదారుల యొక్క విలాసవంతమైన గృహాలు లేదా హోటళ్ళను అందంగా తీర్చిదిద్దడానికి ఒప్పందం కుదుర్చుకొనబడింది. అకస్మాత్తుగా, భూసంబంధమైన ఆస్తుల విషయంలో దాదాపు ప్రతిదీ కోల్పోయిన వ్యక్తుల మధ్య సేవ చేసినందున ఆమె పూర్తి విరుద్ధమైన ప్రపంచంలోకి నెట్టబడుట కనుగొన్నది. ఆమె మాటల్లో, ఆమె “పాలరాతి బాటలను మురికి నేలలతో” మార్పిడి చేసుకుంది, అలా చేయడం ద్వారా ఆమె మరియు ఆమె భర్త సంరక్షణ అవసరమైన వారితో స్నేహం చేయడం మొదలుపెట్టినప్పుడు---మరియు త్వరలోనే వారిని ప్రేమించి, ఆలింగనం చేసుకున్నప్పుడు ఆమె అపరిమితమైన నెరవేర్పును కనుగొన్నారు.

కేన్‌ఫీల్డ్స్ దీనిని గమనించారు, “దేవుని సేవ చేయడానికి ఏదైనా ‘వదులుకున్నట్లు’ మేము భావించలేదు. మా కోరిక ఏమిటంటే, ఆయన పిల్లలను దీవించడానికి మమ్మల్ని ఏ విధంగానైనా వాడుకోవడానికి మా సమయాన్ని మరియు శక్తిని ఆయనకు ‘ఇవ్వడం’. మేము మా సహోదర సహోదరీలతో కలిసి పనిచేసినప్పుడు, బాహ్యంగా కనిపించే మా నేపథ్యాలలో లేదా మేము కలిగియున్న వాటిలో తేడాలు కనిపించి ఉంటే అవి మా మధ్య తొలగిపోయాయి మరియు మేము ఒకరి హృదయాన్ని ఒకరము చూసాము. దేవుని పిల్లలలో అత్యంత వినయపూర్వకంగా ఉన్నవారికి సేవలందించే ఈ అనుభవాలు మమ్మల్ని సుసంపన్నం చేసిన దానికి సమానంగా ఏ విధమైన ఉద్యోగ విజయం లేదా భౌతిక లాభాల స్థాయి ఉండదు.”

సరళమైనదే కానీ చాలా లోతైన అర్థాన్ని కలిగిన ప్రాథమిక పాట యొక్క సాహిత్యాన్ని అభినందించడంలో కాన్‌ఫీల్డ్స్ కథ మరియు ఇంకా చాలా మంది నాకు సహాయపడ్డారు.16

“ఇవ్వండి,” అని చిన్న సెలయేరు చెప్పింది,

అది కొండ క్రిందకు త్వరపడినప్పుడు,

“నేను చిన్నదానినని, నాకు తెలుసు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా

పొలాలు ఇంకా పచ్చగా పెరుగుతాయి.”

అవును, మనలో ప్రతిఒక్కరూ చిన్నవారే, కానీ మనం దేవునికి మరియు మన తోటి మనుష్యులకు ఇవ్వడానికి త్వరపడినప్పుడు; మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ జీవితాలు సుసంపన్నమవుతాయి మరియు దీవించబడతాయి.

ఈ పాట యొక్క మూడవ వచనము అంతగా తెలియబడలేదు కానీ ఈ ప్రేమపూర్వకమైన ఆహ్వానంతో ముగుస్తుంది:

యేసు ఇచ్చినట్లుగా ఇవ్వండి;

అందరు ఇవ్వగలిగేది ఏదో ఒకటి ఉంటుంది.

ప్రవాహాలు మరియు పుష్పములు వికసించినట్లు చేయండి:

దేవుడు మరియు ఇతరుల కొరకు జీవించండి.16

ప్రియమైన సహోదర సహోదరీలారా మన వనరులను, మన సమయాన్ని మరియు అవును, మనల్నిమనం కూడా సమర్పించుకోవడం ద్వారా దేవుని కొరకు మరియు ఇతరుల కొరకు మనము జీవిస్తున్నప్పుడు, మనం ప్రపంచ పచ్చదనాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాము, దేవుని పిల్లలను ఇంకొంచెం సంతోషంగా ఉంచుతున్నాము మరియు ఈ ప్రక్రియలో ఇంకొంచెం పరిశుద్ధంగా మారుతున్నాము.

మీరు ఆయన కొరకు స్వేచ్ఛగా చేసే త్యాగాలకు ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.

దేవుడు జీవిస్తున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను. “పరిశుద్ధుడు అని ఆయనకు పేరు.”17 యేసు క్రీస్తు ఆయన కుమారుడు మరియు ఆయనే అన్ని మంచి బహుమతులు ఇచ్చేవాడు.18 ఆయన కృప ద్వారా మరియు త్యాగం వలన మన నిబంధనలను పాటించడం ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడవచ్చును మరియు ప్రభువుకు మరింత ప్రేమను, పవిత్రతను ఇవ్వవచ్చును.19 యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.