సర్వసభ్య సమావేశము
ఒక శాతం మెరుగైనది
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:1

ఒక శాతం మెరుగైనది

మార్పుచెందడానికి మనము చేసే ప్రతీ ప్రయత్నము వలన—అది మనకు ఎంత చిన్నదిగా కనబడినప్పటికీ—మన జీవితాలలో చాలా గొప్ప వ్యత్యాసాన్ని కలిగియుండవచ్చు.

ఒక శతాబ్దానికి పైగా, గ్రేట్ బ్రిటన్ యొక్క అంతర్జాతీయ సైకిల్ రేసింగ్ జట్లు ఇతర దేశాల రైడర్ల చేత ఎగతాళి చేయబడ్డాయి. బ్రిటిష్ సైకిల్ రైడర్లు రేసింగ్ క్రీడలో మెరుగుపడలేనివారిగా లేదా రాణించలేనివారిగా కనిపించారు, వారు 100 సంవత్సరాల ఒలింపిక్ పోటీలలో కొన్ని బంగారు పతకాలను మాత్రమే సాధించగలిగారు మరియు సైక్లింగ్‌లో అతి ముఖ్యమైన ఘటనయైన, కఠోరమైన మూడు వారాల సుదీర్ఘమైన ఫ్రాన్స్ చుట్టు జరిగే సైకిలు రేసులో మరింత అధ్వాన్నంగా ఉన్నారు—అందులో 110 ఏళ్ళలో ఏ బ్రిటిష్ రైడర్ విజయం సాధించలేదు. బ్రిటిష్ సైకిల్ రైడర్ల దుస్థితి ఎంత విచారకరమైనదంటే, ఓడిపోయిన చరిత్రగల జట్టుకు సైకిళ్ళను అమ్మితే కష్టపడి సంపాదించిన తమ ప్రతిష్ఠలు తగ్గిపోతాయని భయపడుతూ కొన్ని సైకిల్ తయారీ కంపెనీలు వారికి తమ సైకిళ్ళను అమ్మడానికి తిరస్కరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మరియు ప్రతీ క్రొత్త శిక్షణా నియమావళికి అపారమైన వనరులను కేటాయించినప్పటికీ, ఏవీ పని చేయలేదు.

బ్రిటిష్ సైక్లిస్టులు

2003లో బ్రిటిష్ సైక్లింగ్ పథాన్ని శాశ్వతంగా మార్చగల చిన్నది మరియు అంతగా గుర్తింపులేని ఒక మార్పు సంభవించేవరకు, చెప్పుకోదగ్గ మార్పు ఏమీ సంభవించలేదు. ఆ క్రొత్త విధానం మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి తరచుగా గందరగోళపరిచే మర్త్య తపన గురించి ఒక వాగ్దానముతో కూడిన నిత్య సూత్రమును కూడా వెల్లడిస్తుంది. అయితే, బ్రిటిష్ సైక్లింగ్‌లో జరిగిన ఏ విషయము దేవుని యొక్క ఉత్తమమైన కుమార్తెలు మరియు కుమారులుగా ఉండటానికి మన వ్యక్తిగత అన్వేషణకు గొప్ప సంబంధాన్ని కలిగియుండవచ్చు?

2003లో, సర్ డేవ్ బ్రెయిల్స్‌ఫోర్డ్ నియమించబడ్డాడు. మరింత అనుకూలమైన స్థితికి దారితీసే నాటకీయమైన, ఆకస్మికమైన మార్పును ప్రయత్నించిన ఇంతకుముందు కోచ్‌ల మాదిరిగా కాక, సర్ డేవ్ బ్రెయిల్స్‌ఫోర్డ్ ఒక వ్యూహనికి కట్టుబడియున్నాడు, దానిని అతడు “స్వల్ప లాభాల సమీకరణగా” సూచించాడు. దీని ప్రకారం ప్రతిదానిలో చిన్న చిన్న మెరుగుదలలను అమలు చేయాలి. చిన్న నిర్దిష్ట బలహీనతలపై దృష్టి పెట్టడానికి కీలకమైన గణాంకాలను నిరంతరం కొలవడం మరియు శిక్షణ దినచర్యలను మార్చడం అని దాని అర్థము.

ఇది కొంతవరకు లేమనీయుడు మరియు ప్రవక్తయైన సమూయేలు యొక్క భావనయైన “జాగ్రత్తగా నడుచు[చున్నారు]”1 అనే దానితో సమానంగా ఉంటుంది. ఈ విస్తృతమైన, మరింత సమగ్రమైన దృక్పథం స్పష్టమైన సమస్య లేదా ఎక్కువ గమనించదగిన పాపంపై తరచుగా అతిగా దృష్టిసారించే ఉచ్చును తప్పిస్తుంది. “సైకిలును నడపడానికి మీరు ఆలోచించగల ప్రతిదాన్ని విచ్ఛిన్నం చేసి, ఆపై దానిని 1 శాతం మెరుగుపరచినప్పుడు, మీరు వాటిన్నటిని కలిపినప్పుడు మీకు గణనీయమైన వృద్ధిని పొందుతారనే ఆలోచన నుండి ఆ సూత్రమంతా వచ్చింది” అని బ్రెయిల్స్‌ఫోర్డ్ చెప్పాడు.2

అతని విధానము ప్రభువు యొక్క విధానముతో సమరేఖలో ఉన్నది, తప్పిపోయిన ఒక్క గొఱ్ఱెను వెదకడం ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పడానికి 99 గొఱ్ఱెలను విడిచిపెట్టిన ఉపమానమును కూడా ఆయన మనకు బోధించారు. అవును, అవసరతలో ఉన్న వ్యక్తులను వెదకవలెను అనే సువార్త బాధ్యతను ఆయన బోధిస్తున్నారు. అయితే, అదే సూత్రమును మనము సువార్త యొక్క మధురమైన, రుచికరమైన రెండవ సూత్రమైన పశ్చాత్తాపమునకు అన్వయిస్తే? మన జీవితంలో నిరంతరం తప్పులు చేయడం మరియు ఆ తప్పుల గురించి పశ్చాత్తాపపడడం కంటే, మనం విస్తరింపజేసిన మన దృష్టిసారింపును తగ్గించేలా మన విధానం ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? ప్రతి దానిని పరిపూర్ణముగా చేయడానికి ప్రయత్నించుటకు బదులుగా, ఒక చిన్న విషయాన్ని మాత్రమే సంబాళించుటకు మనం ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?

ఉదాహరణకు, మీ పరిస్థితిని క్రొత్త విశాలమైన కోణంలో చూసి, ప్రతిరోజు మోర్మన్ గ్రంథాన్ని చదవటం మీరు నిర్లక్ష్యం చేసారని మీరు గమనిస్తే? మంచిది, ఒకే రాత్రి 531 పేజీలన్ని త్వరగా నిస్సహాయంగా చదవడానికి బదులుగా, దానిని ఒక శాతము మాత్రమే చదవడానికి లేదా మీ ప్రస్తుత పరిస్థితులలో నిర్వహించగలరని మీరు భావించినట్లుగా ఐదు పేజీలు లేదా మరొక మొత్తము చదవడానికి మీరు కట్టుబడియుంటే? మన జీవితాలలో చిన్నవే కానీ, స్థిరమైన ప్రయత్నాలతో కలిగే లాభాలు చివరకు మన వ్యక్తిగత పొరపాట్లలలో అత్యంత ఇబ్బందికరమైన వాటిపై కూడా విజయాన్ని పొందటానికి మార్గము కాగలదా? మన బలహీనతలను జయించుటకు చిన్నవి మరియు సులువుగా నిర్వహించే పనులను చేసే ఈ విధానము నిజంగా పని చేస్తుందా?

విజయాన్ని పొందే ఒకరి అవకాశాలను ఈ వ్యూహము మెరుగుపరుస్తుందని శ్రేష్ఠమైన పుస్తకాలను వ్రాసే రచయత జేమ్స్ క్లియర్ చెప్పాడు. “అలవాట్లు ‘ఒకరు మెరుగుపరచుకోవడానికి ఎక్కువ పరిమాణంలో ప్రయోజనము’ అని అతడు కొనసాగించాడు. మీరు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఒక్క శాతం మెరుగుపరచుకోగలిగితే … సంవత్సరాంతానికెల్లా ఆ విషయంలో మీరు 37 రెట్లు మెరుగుగా ఉంటారు.”3

బ్రెయిల్స్‌ఫోర్డ్ యొక్క చిన్న లాభాలు సామగ్రితో, యూనిఫారమ్ కుట్టే బట్టలు మరియు శిక్షణా మాదిరులు వంటి స్పష్టమైన వాటితో ప్రారంభించబడ్డాయి. కానీ అతడి జట్టు చేసిన మెరుగుదలలు అక్కడితో ఆగిపోలేదు. వారు పోషణ, నిద్ర మరియు నిర్వహణ సూక్ష్మ నైపుణ్యాలు వంటి నిర్లక్ష్యం చేయబడిన మరియు ఊహించని ప్రాంతాల్లో 1 శాతం మెరుగుదలలను కనుగొనడం కొనసాగించారు. కాలక్రమేణా, ఇవి మరియు అనేక ఇతర సూక్ష్మ మెరుగుదలలు అద్భుతమైన ఫలితాలుగా సేకరించబడ్డాయి, ఇది ఎవరైనా ఊహించిన దాని కంటే వేగంగా వచ్చింది. నిజంగా, వారు “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇక్కడ కొంచెం మరియు అక్కడ కొంచెం”4 సాధన చేయడంలో నిత్య సూత్రమును వారు అనుసరించారు.

స్వల్ప సవరణలు మీరు కోరే ఆ “బలమైన మార్పును తెస్తాయా?” 5 అవి సరిగా అమలు చేయబడినప్పుడు, 99 శాతం నిశ్చయంగా పనిచేస్తుందని నేను ఖచ్చితముగా చెప్పగలను! “కానీ ఈ విధానములో ఉన్న ఒక ఆటంకము ఏమిటంటే, చిన్న ప్రయోజనాలు ఒక సముదాయముగా అవ్వాలంటే, స్థిరమైన అనుదిన ప్రయత్నము చేయబడాలి. మనమ పరిపూర్ణులము కాలేకపోయినప్పటికీ, సహనముతో కూడిన పట్టుదలగల ప్రయత్నము అవసరమని మనము తప్పక తీర్మానించుకోవాలి. దానిని చెయ్యండి, హెచ్చించబడిన నీతి యొక్క మధురమైన ఫలితాలు మీరు వెదికే ఆనందాన్ని మరియు శాంతిని తెస్తాయి. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా: “క్రమం తప్పకుండా పశ్చాత్తాపముపైన అనుదినం దృష్టిసారించుట కంటే మరేది కూడా మిక్కిలి స్వేచ్ఛనిచ్చేది, ఘనత చేకూర్చేది లేదా మన వ్యక్తిగత అభివృద్ధికి మిక్కిలి ఆవశ్యకమైనది ఏదియ లేదు. పశ్చాత్తాపము అనేది ఒక సంఘటన కాదు; అది ఒక ప్రక్రియ. అది సంతోషానికి, మనశ్శాంతికి మూలము. విశ్వాసముతో కలిసినప్పుడు, పశ్చాత్తాపము అనేది యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క శక్తిని మనము సమీపించుటకు మార్గము తెరుచును.”6

ఆవగింజ
ఆవాలు చెట్టు

విశ్వాసమునకు ముందుగా అవసరమైన దానికి సంబంధించి, లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి. మొదటగా కావలిసింది, కేవలము “రేణువంత విశ్వాసము.”7 మనము ఈ “ఆవగింజ” 8 మనస్తత్వాన్ని సేకరించిన యెడల, మనము కూడా ఊహించని దానిని మరియు మన జీవితంలో అసాధారణమైన మెరుగుదలను ఆశించవచ్చు. కాని జ్ఞాపకముంచుకోండి, ఒక్క రాత్రిలో మనము అట్టిల్లా హాన్ నుండి మదర్ థెరిస్సా వలె హఠాత్తుగా మారడానికి ప్రయత్నించనట్లే, మనం కూడా మెరుగుదల యొక్క మాదిరులను క్రమంగా మార్చాలి. మీ జీవితంలో అవసరమైన మార్పులు పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ, చిన్న స్థాయిలో ప్రారంభించండి. నిరుత్సాహంగా లేదా నిరాశకు గురైనట్లు భావిస్తే ఇది తప్పకుండా వర్తిస్తుంది.

ఈ ప్రక్రియ ఎల్లప్పుడూ సరళ పద్ధతిలో సాధించబడదని గుర్తుంచుకోండి. పురోగతి చెందాలని బలంగా తీర్మానించుకున్న వారికి కూడా ఎదురుదెబ్బలు తగలవచ్చు. నా జీవితంలో నిరాశను అనుభవించి యుండి, కొన్నిసార్లు 1 శాతం ముందుకు వెళ్ళి, 2 శాతం వెనక్కి వెళ్ళే సంఘటనలు అనుభవించడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ 1 శాతం ప్రయోజనాల కోసం దేనినైనా స్థిరంగా చేయడానికి మనం చేసిన తీర్మానములో పట్టువిడవకుండా ఉన్నయెడల, మన “వ్యసనములు భరించిన”9 ఆయన నిశ్చయముగా మనకు సహాయపడతారు.

సహజంగానే, మనం ఘోరమైన పాపాలలో పాలుపంచుకున్నట్లయితే, ప్రభువు స్పష్టంగా మరియు నిస్సందేహంగా ఉన్నారు; మనము ఆగాలి, మన బిషప్పు నుండి సహాయం పొందాలి మరియు అలాంటి పద్ధతుల నుండి వెంటనే దూరంగా మరలిపోవాలి. కానీ ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించినట్లుగా: “స్వల్పమైన, స్థిరమైన, క్రమమైన ఆత్మీయ మెరుగుదలలు ప్రభువు మనల్ని తీసుకోవాలని కోరే చర్యలు. దేవుని యెదుట నిర్దోషులుగా నడుచుకొనుటకు సిద్ధపడుట మర్త్యత్వము యొక్క ప్రధాన ఉద్దేశాలలో ఒకటి మరియు జీవితకాలపు అన్వేషణ; అప్పుడప్పుడు కలిగే తీవ్రమైన ఆత్మీయ కార్యకలాపముల నుండి అది రాదు.”10

బ్రటిష్ సైక్లిస్టులు

కాబట్టి, పశ్చాత్తాపము మరియు నిజమైన మార్పుకు స్వల్పమైన విధానము నిజంగా పనిచేస్తుందా? ఉపమానరీతిలో చెప్పాలంటే, నెమ్మదిగా సైకిలు తొక్కడం యొక్క నిజమైన విలువ, విజయం లేదా ప్రభావాన్ని ప్రయత్నించడం లేదా ఉపయోగించడం ద్వారా పరీక్షలో పెట్టడం ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. ఈ తత్వశాస్త్రాన్ని అమలు చేసినప్పటి నుండి గత రెండు దశాబ్దాలలో బ్రిటిష్ సైక్లింగ్‌కు ఏమి జరిగిందో పరిశీలించండి. బ్రిటీష్ సైక్లిస్టులు ఇప్పుడు ఫ్రాన్స్‌ టూర్‌ను ఆరుసార్లు గెలిచారు. గత నాలుగు ఒలింపిక్ క్రీడలలో, గ్రేట్ బ్రిటన్ అన్ని సైక్లింగ్ విభాగాలలో అత్యంత విజయవంతమైన దేశంగా ఉంది. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో, ఇతర దేశాల కంటే యూకే సైక్లింగ్‌లో ఎక్కువ బంగారు పతకాలు సాధించింది.

ఒలింపిక్ వీరులు

బ్రిటీష్ సైక్లిస్టుల ఫోటోలు (ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో) ఫ్రైడెమాన్ వోగెల్, జాన్ గిల్స్ మరియు గ్రెగ్ బేకర్/గెట్టి ఇమేజెస్

కానీ వెండి లేదా బంగారం కంటే ఎక్కువ విలువైన వారిగా ఉండి, నిత్యత్వమునకు నడిపించు దారిలో మర్త్యత్వము గుండా మన ప్రయాణములో మన విలువైన వాగ్దానము ఏమిటంటే మనము నిజంగా “క్రీస్తుయందు విజయాన్ని”11 పొందుతాము. చిన్నవే కానీ స్థిరమైన మెరుగుదలలు చేయడానికి మనము కట్టుబడియున్నప్పుడు, మనకు “వాడబారని మహిమ కిరీటము” 12 వాగ్దానము చేయబడింది. వాడబారని మెరుపును ఆస్వాదించడంతో, మీ జీవితాన్ని పరిశీలించమని మరియు నిబంధన మార్గంలో ముందుకు సాగనివ్వకుండా మిమ్మల్ని నెమ్మదిగా చేసిన లేదా మందగించిన వాటిని చూడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తరువాత ఒకరు ఎక్కువగా మెరుగుపరచవలసిన విషయాలను పరిగణించండి. మీ జీవితంలో మంచి కొరకు మార్పు చెందే మధురమైన ఆనందాన్ని కలిగించే నిరాడంబరమైనవే గాని చేయదగిన పరిష్కారాలను వెతకండి.

జ్ఞాపకముంచుకోండి, జయింపశక్యముకానట్లు కనబడిన దిగ్గజుడైన గొల్యాతును చంపడానికి దావీదు చిన్న రాయిని మాత్రమే ఉపయోగించాడు. కానీ అతడికి మిగిలిన నాలుగు రాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా, చిన్నవాడైన ఆల్మా యొక్క చెడు స్వభావమును మరియు శాశ్వతమైన విధిని మార్చిన విషయము ఏమిటంటే, ఒక సాధారణమైన, సరైన ఆలోచన—యేసు క్రీస్తు యొక్క రక్షించే కృపలను గూర్చి అతడి తండ్రి బోధించిన దానిని జ్ఞాపకం చేసుకొనుట. మన రక్షకునితో కూడా ఆవిధంగా ఉన్నది, ఆయన పాపము లేని వాడైనప్పటికీ, “మొదట సంపూర్ణతను పొందలేదు, … కానీ ఆయన సంపూర్ణతను పొందేంత వరకు, కృప వెంబడి కృపను కొనసాగించాడు.”13

యేసు క్రీస్తు

పిచ్చుక పడిపోవుట ఎరిగిన ఆయన, అదేవిధంగా మన జీవితంలోని ముఖ్యమైన క్షణాలు మరియు నిమిషాలపై దృష్టిసారించి మరియు ఈ సమావేశం నుండి ప్రతిఒక్కరు తమను తాము మెరుగుపరచుకోవడానికి ఏదైనా చిన్నది ఎంపిక చేస్తే మీకు సహాయం చేయడానికి ఆయన ఇప్పుడే సిద్ధంగా ఉన్నారు. పశ్చాత్తాపపడటానికి మనము చేసే ప్రతీ ప్రయత్నము వలన, అది మనకు ఎంత చిన్నదిగా కనబడినప్పటికీ, మీ జీవితంలో మిక్కిలి పెద్ద వ్యత్యాసాన్ని కలిగియుంటుంది.

ఈ ఉద్దేశము కోసం, ఎల్డర్ నీల్ ఎ. మాక్సవెల్ బోధించారు, “నీతివంతమైన కోరిక యొక్క ప్రతి ప్రకటన, ప్రతీ సేవా క్రియ మరియు ప్రతి ఆరాధన చర్య, ఎంత చిన్నవి మరియు పెరుగుతున్నవి అయినప్పటికీ, మన ఆత్మీయ వేగానికి చేర్చబడతాయి.”14 నిజంగా, చిన్న, సాధారణమైన వస్తువుల ద్వారా 1 శాతం విషయాల ద్వారా కూడా గొప్ప క్రియలు జరిగించబడతాయి.15 మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి, యోగ్యతలు మరియు కృప ద్వారా “మనము సమస్తము చేసిన తరువాత” అంతిమ విజయము 100 శాతం ఖచ్చితంగా ఉంటుంది.12 ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.