సర్వసభ్య సమావేశము
నా దినములన్నిటిలో ప్రభువు చేత అనుగ్రహింపబడితిని
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


8:59

నా దినములన్నిటిలో ప్రభువు చేత అనుగ్రహింపబడితిని

మన కష్టాల పట్ల మనమెలా స్పందించాలి? మనం మన సమస్యల కంటే ఎక్కువగా మన దీవెనలపై దృష్టిసారించినందువల్ల మనం కృతజ్ఞులుగా భావిస్తామా?

ప్రపంచ చరిత్రలో దేవుని పిల్లలు ఎదుర్కొన్న అనేక శ్రమలు మరియు సవాళ్ళలో కొవిడ్-19 మహమ్మారి ఒకటి. ఈ సంవత్సరం ఆరంభంలో నేను, నా ప్రియ కుటుంబము కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాము. ప్రియమైన వారిలో కొద్దిమంది మరణం ద్వారా మహమ్మారి మరియు ఇతర కారణాలు మా కుటుంబానికి మరణాన్ని, బాధను తెచ్చాయి. వైద్యం, ఉపవాసం మరియు ప్రార్థన చేసినప్పటికీ, ఐదు వారాల వ్యవధిలో నా సహోదరుడు చార్లీ, నా సహోదరి సూసీ మరియు బావ జిమ్మీ మరణించారు.

తన సహోదరుడైన లాజరు మరణంతో వేదన చెందిన మరియను చూసినప్పుడు, లాజరును లేపగల శక్తి తనకున్నదని మరియు తన స్నేహితుడిని త్వరలోనే మరణం నుండి కాపాడడానికి తాను ఈ శక్తిని ఉపయోగిస్తానని తెలిసి రక్షకుడు ఎందుకు రోదించారోనని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను.1 మరియ పట్ల రక్షకుని కనికరము, సానుభూతి చూసి నేను ఆశ్చర్యపడ్డాను; తన సహోదరుడైన లాజరు మరణం పట్ల మరియ అనుభవించిన వర్ణింపనలవికాని బాధను ఆయన అర్థం చేసుకున్నారు.

మన ప్రియమైన వారి నుండి తాత్కాలిక ఎడబాటును అనుభవించినప్పుడు మనం అదేవిధంగా తీవ్రమైన బాధను అనుభవిస్తాము. రక్షకుడు మన కోసం పరిపూర్ణమైన కనికరమును కలిగియున్నారు. మన హ్రస్వ దృష్టి లేదా మన నిత్య ప్రయాణాన్ని చూడడంలో పరిమితుల కారణంగా ఆయన మనల్ని తక్కువగా పరిగణించరు. బదులుగా, మన విచారము మరియు బాధ పట్ల ఆయన కనికరము కలిగియున్నారు.

మనం ఆనందంగా ఉండాలని పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కోరుతున్నారు.2 అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “మనం పొందే ఆనందం మన జీవితపు పరిస్థితులపైన తక్కువగా ఆధారపడుతుంది, కానీ మన జీవితము యొక్క దృష్టిసారింపుపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మన జీవితాల యొక్క దృష్టి అంతా దేవుని రక్షణ ప్రణాళిక పైన ఉన్నప్పుడు, … మన జీవితాల్లో ఏమి జరుగుతోంది — ఏమి జరగడం లేదు—అనేదానితో సంబంధం లేకుండా మనం ఆనందాన్ని అనుభవించగలము.”3

నేను యౌవన సువార్తికునిగా ఉన్నప్పుడు, నేను మెచ్చుకొనే ఒక అద్భుతమైన సువార్తికుడు విధ్వంసకరమైన సమాచారాన్ని అందుకోవడం నాకు గుర్తుంది. ఒక ఘోరమైన ప్రమాదంలో అతని తల్లి మరియు అతని తమ్ముడు మరణించారు. అంత్యక్రియల కోసం ఇంటికి వెళ్ళే అవకాశాన్ని మిషను అధ్యక్షుడు ఈ ఎల్డర్‌కు కల్పించారు. అయినప్పటికీ, ఫోనులో తన తండ్రితో మాట్లాడిన తర్వాత ఈ సువార్తికుడు అక్కడే ఉండి తన సువార్తసేవను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆసుపత్రిలో సువార్తికుని సందర్శించుట

కొంతకాలం తర్వాత, మేము అదే ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు నేను, నా సహవాసి ఒక అత్యవసర పిలుపును అందుకున్నాము; కొంతమంది దొంగలు అదే సువార్తికుని సైకిలు దొంగిలించి, కత్తితో అతడిని గాయపరిచారు. అతడు మరియు అతని సహవాసి దగ్గరలోని ఆసుపత్రికి నడిచి వెళ్ళారు, అక్కడ నేను మరియు నా సహవాసి వారిని కలిశాము. ఆసుపత్రికి వెళ్ళే దారిలో ఈ సువార్తికుని కోసం నేను బాధపడ్డాను. అతడు చాలా విచారంగా ఉంటాడు మరియు ఈ బాధాకరమైన అనుభవం తర్వాత తప్పకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని కోరుకుంటాడని నేను ఊహించుకున్నాను.

కానీ మేము ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, ఈ సువార్తికుడు తన మంచంపై పడుకొని, శస్త్రచికిత్స కోసం వేచి చూస్తూ—నవ్వుతూ ఉండడం నేను చూసాను. “ఇటువంటి సమయంలో అతనెలా నవ్వగలుగుతున్నాడు?” అని నేననుకున్నాను. ఆసుపత్రిలో అతడు కోలుకుంటున్నప్పుడు, ఉత్సాహంగా అతడు వైద్యులు, నర్సులు మరియు ఇతర రోగులకు కరపత్రాలు, మోర్మన్ గ్రంథ ప్రతులను ఇచ్చాడు. ఈ కష్టకాలంలో కూడా అతడు ఇంటికి తిరిగి వెళ్ళదలచుకోలేదు. దానికి బదులుగా, అతడు విశ్వాసం, శక్తి, బలము మరియు ఉత్సాహంతో తన సువార్తసేవలో చివరి రోజు వరకు సేవ చేసాడు.

మోర్మన్ గ్రంథము యొక్క ఆరంభంలో నీఫై ఇలా వ్యాఖ్యానించాడు, “నా జీవిత కాలములో అనేక బాధలను చూచినప్పటికీ, నా దినములన్నిటిలో ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడితిని.”4

నీఫై అనుభవించిన అనేక శ్రమల గురించి నేను ఆలోచిస్తాను, వాటిలో అనేకము అతని వ్రాతలలో చేర్చబడ్డాయి. మనమందరము కష్టాలను ఎదుర్కొంటామని గ్రహించడానికి అతని శ్రమలు మనకు సహాయపడతాయి. ఈ శ్రమలలో ఒకటి లేబన్ దగ్గరున్న ఇత్తడి పలకలను పొందడానికి యెరూషలేముకు తిరిగివెళ్ళమని నీఫై ఆజ్ఞాపించబడినప్పుడు సంభవించింది. నీఫై సహోదరులలో కొందరు అల్పవిశ్వాసులు. వారు నీఫైని కర్రతో కొట్టారు. నీఫై తన విల్లును విరుగగొట్టుకొని, తన కుటుంబం కోసం ఆహారాన్ని సంపాదించలేకపోయినప్పుడు అతడు మరొక శ్రమను అనుభవించాడు. తర్వాత, ఓడ నిర్మించమని నీఫై ఆజ్ఞాపించబడినప్పుడు, అతని సహోదరులు అతడిని ఎగతాళి చేసి, సహాయం చేయడానికి నిరాకరించారు. అతని జీవితకాలంలో వీటిని మరియు అనేక ఇతర శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ, నీఫై ఎల్లప్పుడు దేవుని మంచితనాన్ని గుర్తించాడు.

ఓడ మీద బంధించబడిన నీఫై

అతని కుటుంబము వాగ్దానదేశానికి వెళ్ళే దారిలో సముద్రాన్ని దాటుతున్నప్పుడు, నీఫై కుటుంబంలో కొందరు “తమనుతాము ఉల్లాసపరచుకోవడం,” కఠినంగా మాట్లాడడం మరియు ప్రభువు యొక్క శక్తి వారిని కాపాడిందని మరచిపోవడం మొదలుపెట్టారు. నీఫై వారిని గద్దించినప్పుడు వారు అవమానకరంగా భావించి, కదలకుండా అతడిని త్రాళ్ళతో కట్టివేసారు. అతని సహోదరులు “(అతని)తో చాలా కఠినముగా ప్రవర్తించిరి”; అతని చేతి మణికట్టులు మరియు కాలి చీలమండలు “అధికముగా వాచియుండి, ఆ బాధ చాలా తీవ్రముగా ఉండెను” అని మోర్మన్ గ్రంథము చెప్తుంది.5 తన సహోదరుల హృదయ కాఠిన్యము చేత నీఫై దుఃఖించాడు మరియు కొన్నిసార్లు బాధ చేత జయించబడ్డాడు.6 “అయినప్పటికీ, నేను నా దేవుని వైపు చూచి దినమంతయు ఆయనను స్తుతించితిని; నా శ్రమలను బట్టి నేను ప్రభువుకు వ్యతిరేకముగా సణుగలేదు”7 అని అతడు ప్రకటించాడు.

నా ప్రియ సహోదర సహోదరీలారా, మన కష్టాల పట్ల మనమెలా స్పందించాలి? వాటి గురించి ప్రభువు యెదుట మనం సణుగుతామా? లేదా నీఫై మరియు సువార్తసేవలో నా పూర్వ స్నేహితుడిలా మనం మన సమస్యల కంటే ఎక్కువగా మన దీవెనలపై దృష్టిసారించినందువల్ల మన మాట, ఆలోచన మరియు క్రియలో కృతజ్ఞులుగా భావిస్తామా?

మన రక్షకుడైన యేసు క్రీస్తు తన భూలోక పరిచర్యలో మనకు మాదిరినిచ్చారు. కష్టము మరియు శ్రమల సమయాల్లో మన తోటివారికి సేవ చేయడం కంటే అధిక శాంతిని, తృప్తిని ఇచ్చే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. హెరోదియ కుమార్తెను సంతోషపెట్టడానికి హేరోదు రాజు తన బంధువైన బాప్తిస్మమిచ్చు యోహాను తలగొట్టించాడని రక్షకుడు తెలుసుకున్నప్పుడు ఏమి జరిగిందో మత్తయి గ్రంథము వివరిస్తుంది:

“అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి.

“యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడ నుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి.

“ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.

“సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి.

“యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పెను.”8

శ్రమలు మరియు ప్రతికూలత గల సమయాల్లో మనం ఇతరుల కష్టాలను గుర్తించగలమని యేసు క్రీస్తు మనకు చూపారు. కనికరముతో ప్రేరేపించబడి మనం ఇతరులను సమీపించి, వారిని వృద్ధిచేయగలము. మనం అలా చేసినప్పుడు, క్రీస్తువంటి మన సేవ ద్వారా మనం కూడా వృద్ధిపొందగలము. అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఇలా వ్యాఖ్యానించారు: “నాకు తెలిసి విచారానికి సరైన విరుగుడు పని చేయడమే. నిరాశకు సరైన మందు సేవ చేయడం. అలసటకు సరైన చికిత్స అంతకంటే ఎక్కువ అలసిన వారికి సహాయపడమని సవాలు చేయబడడం.”9

యేసు క్రీస్తు యొక్క ఈ సంఘంలో పరిచర్య చేయడానికి మరియు నా తోటివారికి సేవ చేయడానికి నాకు అనేక అవకాశాలు కలిగాయి. ఆ సమయాల్లో పరలోక తండ్రి నా భారాలను తేలిక చేస్తున్నట్లుగా నేను భావించాను. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ భూమిపై దేవుని ప్రవక్త; కష్టసమయాల్లో మనం ఇతరులకు ఎలా పరిచర్య చేయాలనడానికి ఆయన ఒక గొప్ప ఉదాహరణ. దేవుడు మన ప్రియమైన పరలోక తండ్రియని అనేకమంది ఇతర పరిశుద్ధులతో పాటు నేను నా సాక్ష్యాన్ని జతచేస్తున్నాను. అనంతమైన ఆయన ప్రేమను నా కష్టకాలంలో నేను అనుభవించాను. మన రక్షకుడైన యేసు క్రీస్తు మన బాధలను, కష్టాలను అర్థం చేసుకుంటారు. ఆయన మన భారాలను తేలికచేసి, మనల్ని ఓదార్చాలనుకుంటున్నారు. మన భారాల కంటే అధిక భారాలతో ఉన్నవారికి సేవ చేయడం మరియు పరిచర్య చేయడం ద్వారా మనం తప్పకుండా ఆయన మాదిరిని అనుసరించాలి. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.