సర్వసభ్య సమావేశము
క్రీస్తును నమ్ముట ద్వారా మన ఆత్మీయ తుఫానులను ఎదుర్కొనుట
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


9:49

క్రీస్తును నమ్ముట ద్వారా మన ఆత్మీయ తుఫానులను ఎదుర్కొనుట

క్రీస్తును నమ్ముట మరియు ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా మన ఆత్మీయ తుఫానులను మనం ఉత్తమంగా ఎదుర్కొంటాము.

గత ఆరు సంవత్సరాలుగా నా ప్రియసఖి యాన్ మరియు నేను గల్ఫ్ తీరము వద్ద టెక్సాస్‌లో నివసించాము, అక్కడ పెద్ద తుఫానులలో కొన్ని బ్రహ్మాండమైన నాశనమును కలిగిస్తూ, అనేకమంది ప్రాణాలను తీస్తూ అమెరికాను తాకాయి. విచారకరంగా, ఇటీవల నెలలలో అటువంటి నాశనకరమైన సంఘటనలు అనేకసార్లు సంభవించాయి. ఏ విధంగానైనా ప్రభావితమైన వారందరికీ మా ప్రేమను మరియు ప్రార్థనలను తెలియజేస్తున్నాము. 2017లో మేము హార్వే తుఫానును ప్రత్యక్షంగా చూసాము, దాని రికార్డు స్థాయి వర్షపాతము 60 అంగుళాల (150 సె.మీ) వరకు నమోదయింది.

ప్రకృతి నియమాలు తుఫానులు ఏర్పడుటను నియంత్రిస్తాయి. సముద్రపు ఉష్ణోగ్రత కనీసం 80 డిగ్రీల ఫారెన్‌హీట్ (27 డిగ్రీలు సె) ఉండాలి, సముద్ర ఉపరితలానికి 165 అడుగుల (50 మీ) దిగువ వరకు వ్యాపించి ఉండాలి. వెచ్చని సముద్రపు నీటితో గాలి కలిసినప్పుడు అది నీరు ఆవిరై వాతావరణంలోకి ప్రవేశించునట్లు చేస్తుంది, అక్కడ అది ద్రవమవుతుంది. అప్పుడు మేఘాలు ఏర్పడతాయి మరియు గాలులు సముద్రపు ఉపరితలంపై ఒక మెలికల నమూనాను ఉత్పత్తి చేస్తాయి.

హరికేన్

వాతావరణంలో 50,000 అడుగులు (15,240 మీ) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తుకు చేరుకొని మరియు కనీసం 125 మైళ్ల వరకు (200 కిమీ) విస్తరించి ఉండి, హరికేన్లు భారీ పరిమాణంలో ఉంటాయి. ఆసక్తికరంగా, హరికేన్లు భూమిని తాకినప్పుడు అవి బలహీనపడటం ప్రారంభమవుతాయి, ఎందుకంటే తమ బలాన్ని పెంచడానికి అవసరమైన వెచ్చని నీటిపైన అవి లేవు.1

నాశనకరమైన భౌతిక హరికేనును మీరు ఎప్పుడూ ఎదుర్కొనకపోవచ్చు. అయినప్పటికీ, మనలో ప్రతిఒక్కరం ఆత్మీయ తుఫానులను ఎదుర్కొన్నాము మరియు ఎదుర్కొంటాము, అవి శాంతిని అనుభవించడాన్ని మనకు కష్టతరము చేసి, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. నేటి ప్రపంచంలో అవి తరచుదనమందు, తీవ్రతయందు పెరుగుతున్నట్లు కనబడుతున్నాయి. అదృష్టవశాత్తూ, వాటిని సంతోషంగా జయించడానికి ప్రభువు మనకు ఒక నిశ్చయమైన విధానమును దయచేసారు. యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుట ద్వారా “శ్రమల యొక్క చీకటి మేఘాలు మనపై వ్రేలాడినప్పుడు, మన శాంతిని నాశనము చేస్తాయని భయపెట్టినప్పుడు, మనము నిరీక్షణను కలిగియుండి, సంతోషంగా ఉండగలమని” మనకు హామీ ఇవ్వబడింది.2

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వివరించారు:

“ప్రతీ పరిస్థితిలో పరిశుద్ధులు సంతోషంగా ఉండగలరు. చెడ్డ రోజు, చెడ్డ వారము లేక ఒక చెడ్డ సంవత్సరం కలిగియున్నప్పుడు కూడా మనము సంతోషమును ఆనందించగలము!

“ … మనం పొందే ఆనందం మన జీవితపు పరిస్థితులపైన తక్కువగా ఆధారపడును కాని మన జీవితాల యొక్క దృష్టిసారింపుపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

“మన జీవితాల యొక్క దృష్టిసారింపు … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపైన ఆధారపడి ఉన్నప్పుడు, మన జీవితాలలో ఏది జరిగిన—లేదా ఏది జరగకపోయినా మనం సంతోషాన్ని అనుభవించగలము.”3

ప్రకృతి నియమాలు భౌతిక తుఫానులను శాసించినట్లే, దైవిక నియమాలు మన ఆత్మీయ తుఫానుల సమయంలో ఆనందాన్ని ఎలా అనుభూతి చెందాలో శాసిస్తాయి. జీవితపు తుఫానులను మనము ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు, మనము అనుభవించే సంతోషము లేక దుఃఖము దేవుడు నిర్దేశించిన నియమాలతో ముడిపడి ఉంటాయి. “వాటిని ఆజ్ఞలని పిలుస్తారు కానీ అవి విమానాన్ని పైకి లేపే నియమము, గురుత్వాకర్షణ నియమము మరియు హృదయ స్పందనను నియంత్రించే చట్టం నిజమైనట్లుగా అవి నిజమైనవి” అని అధ్యక్షులు నెల్సన్ పంచుకున్నారు.

“ఆజ్ఞలను పాటించుటకు మరియు సంతోషముగా ఉండుటకు మధ్య గల సంబంధాన్ని తీర్మానించే నియమమును గ్రహించుట సులభమైనది: మీరు సంతోషంగా ఉండాలని కోరితే, ఆజ్ఞలను పాటించండి,” అని అధ్యక్షులు నెల్సన్ కొనసాగించారు. 4

సందేహము ఒక వ్యక్తి యొక్క విశ్వాసమును మరియు సంతోషమును బలహీనపరుస్తుంది. వెచ్చని సముద్రపు నీళ్ళుగల ప్రాంతాలలో మాత్రమే తుఫానులు ఏర్పాడినట్లుగా, ఆత్మీయ తుఫానులకు సందేహం పుట్టినిల్లు. నమ్మకము ఒక ఎంపిక అయినట్లే, సందేహము కూడా ఒక ఎంపిక. సందేహించడానికి మనము ఎన్నుకున్నప్పుడు, అపవాదికి శక్తిని అప్పగిస్తూ దానిపై పని చేయడానికి మనము ఎన్నుకుంటాము, తద్వారా మనల్ని బలహీనంగా, దుర్భలంగా విడిచిపెడుతుంది.5

మనకు హాని కలిగించే అనుమానపు భావాలకు నడిపించడానికి సాతాను ప్రయత్నిస్తాడు. మనము నమ్మకుండా ఉండేందుకు అతడు మన హృదయాలను కఠినపరచాలని కోరతాడు.6 హాని కలిగించే సందేహపు భావాలకు నడిపించే స్థితి ఆహ్వానించేదిగా కనబడవచ్చు ఎందుకంటే అది శాంతికరముగా కనబడుతుంది, వెచ్చని నీళ్ళకు మనము “దేవుని నోట నుండి వచ్చే ప్రతీ మాట ద్వారా” జీవించవలసిన అవసరము లేదు.7 అటువంటి నీటియందు మన ఆత్మీయ జాగరూకతను సడలించడానికి సాతాను మనల్ని శోధిస్తాడు. ఆ అజాగ్రత్త ఆత్మీయ విశ్వాసము లేకపోవడాన్ని ప్రేరేపిస్తుంది, ఇక్కడ మనం “చల్లగా లేదా వేడిగా ఉండము.”8 మన జీవితాలలో అతి ముఖ్య అంశమైన క్రీస్తుపై ఆధారపడనట్లయితే, సందేహము మరియు దాని ఆకర్షణలు మనల్ని ఉదాసీనతకు నడిపిస్తాయి, అక్కడ మనము అద్భుతాలు, శాశ్వత ఆనందం, లేక “[మన] ఆత్మలకు విశ్రాంతి” కనుగొనము.9

తుఫానులు భూమిపై బలహీనపడినట్లే, క్రీస్తుపై మన పునాదిని మనము నిర్మించినప్పుడు, సందేహము విశ్వాసముతో భర్తి చేయబడుతుంది. అప్పుడు మనము ఆత్మీయ తుఫానులను వాటి సరైన దృష్టికోణముతో చూడగలుగుతాము మరియు వాటిని జయించడానికి మన సామర్థ్యము విస్తరించబడుతుంది. తరువాత “అపవాది అతని బలమైన గాలులను, అవును సుడిగాలి యందు అతని బాణములను ముందుకు పంపునప్పుడు, … మనుష్యులు వారు కట్టిన పడిపోని ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది. [మనము] కట్టబడిన బండను బట్టి, దౌర్భాగ్యపు అఘాథము మరియు అంతములేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొని పోవుటకు … అది మీపైన ఏ శక్తి కలిగియుండకుండును.”10

అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు:

యేసు క్రీస్తునందు విశ్వాసము నమ్మకానికంతటికి పునాది మరియు దైవిక శక్తికి మార్గము. …

“ఆయన పరిపూర్ణమైన శక్తికి ప్రవేశం కలిగియుండేందుకు మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగియుండాలని ప్రభువు కోరడం లేదు. కానీ, మనం విశ్వసించాలని ఆయన కోరుతున్నారు.”11

గత సర్వసభ్య సమావేశము నుండి, “[మా] సవాళ్ళను అసమానమైన వృద్ధి మరియు అవకాశంగా మార్చటానికి”12 సహాయపడటానికి యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిమునందు మా విశ్వాసమును బలపరచాలని నా కుటుంబము, నేను కోరుతూ ఉన్నాము.

మా మనుమరాలు రూబీ బలమైన, బాధ్యతాయుతమైన సంకల్పము చేత దీవించబడింది. ఆమె పుట్టినప్పుడు, ఆమె అన్నవాహిక, ఆమె కడుపుతో జతపరచబడలేదు. పసిబిడ్డగా కూడ రూబీ, తన తల్లిదండ్రుల సహాయంతో ఈ శ్రమను అసాధారణమైన తీర్మానముతో ఎదుర్కొన్నది. రూబీకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు. ఆమె చాలా చిన్నది అయినప్పటికీ, తన సంతోషాన్ని నిర్ణయించడానికి తన పరిస్థితులను అనుమతించకపోవడానికి ఆమె శక్తివంతమైన మాదిరి. ఆమె ఎల్లప్పుడు సంతోషంగా ఉంది.

గత మే, రూబీ తన జీవితంలో కష్టమైన శ్రమను విశ్వాసముతో ఎదుర్కొన్నది. పునర్నిర్మాణ శస్త్రచికిత్స అవసరమయ్యే పూర్తిగా అభివృద్ధి చెందని చేతితో కూడ ఆమె జన్మించింది. సంక్లిష్టమైన శస్త్రచికిత్సకు ముందుగా మేము ఆమెతో కలిసి సందర్శించి, రక్షకుని చేతిని అప్యాయంగా పట్టుకొన్న ఒక బిడ్డ చేతిని చిత్రీకరించిన బొమ్మను ఆమెకు ఇచ్చాము. ఆమె భయపడుతుందా అని మేము అడిగినప్పుడు, ఆమె, ఇలా జవాబిచ్చింది, “లేదు, నేను సంతోషంగా ఉన్నాను!”

రక్షకుని హస్తము చిత్తరువుతో రూబీ

తరువాత మేము ఆమెను, “రూబీ, అది ఎలా సాధ్యం?“ అని అడిగాము.

రూబీ విశ్వాసంగా ధృవీకరించింది, “ఎందుకంటే యేసు నా చేయిని పట్టుకుంటారని నాకు తెలుసు.”

రూబీ కోలుకోవడం అద్భుతమైనది మరియు ఆమె సంతోషంగా ఉండటం కొనసాగించింది. మనము పెద్ద వారైనప్పుడు, తరచుగా మనల్ని శోధించగల అవివేకపు సందేహము కంటె ఒక బిడ్డ యొక్క స్వచ్ఛమైన విశ్వాసము ఎంతో భిన్నంగా ఉన్నది. 13 కానీ, మనమందరం చిన్న పిల్లలవలె కాగలము మరియు మన అపనమ్మకాన్ని ప్రక్కకు పెట్టడానికి ఎంపిక చేయగలము. అది సాధారణమైన ఎంపిక.

శ్రద్ధగా చూసే ఒక తండ్రి రక్షకునిని శ్రద్ధగా వేడుకున్నాడు, “ఏమైనను నీవలననైతే, … మాకు సహాయము చేయుము.”14

అప్పుడు యేసు అతనితో ఇలా చెప్పాడు:

“నమ్ముట నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే.”

“వెంటనే ఆ తండ్రి … నమ్ముచున్నాను, నాకు అపనమ్మముండకుండ సహాయము చేయమని, కన్నీళ్లతో బిగ్గరగా చెప్పెను.”15

ఈ వినయముగల తండ్రి తన సందేహము కంటే క్రీస్తుయందు నమ్మడాన్ని తెలివిగా ఎంపిక చేసాడు. “మీ జీవితంలోని కొండలను కదిలించడానికి మిమ్మల్ని అద్భుతాలతో దీవించడం నుండి దేవుడిని ఆపేది కేవలం మీ అవిశ్వాసమే.”16

దేవుడు ఎంత కనికరముగల వాడు, ఈ విషయాలు సత్యమని నమ్మమని మాత్రమే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు, అవి సత్యమని తెలుసుకోమని కాదు.

ఆల్మా ఇలా బోధించారు:

“దేవుని యొక్క వాక్యమందు విశ్వసించువాడు ధన్యుడు.”17

“[ఏలయనగా] ఆయన నామమును విశ్వసించు వారందరికి దేవుడు కనికరముగల వాడు; కాబట్టి మొదటగా మీరు విశ్వసించవలెను.”18

అవును, మొదటగా మనము ఆయనను విశ్వసించాలని దేవుడు కోరుతున్నారు.

క్రీస్తును విశ్వసించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మన ఆత్మీయ తుఫానులను మనము ఉత్తమంగా ఎదుర్కొంటాము. మన నమ్మకము మరియు విధేయత, “మన జీవితాలలో —[ఏమి] జరుగుతున్నది—లేక జరగటం లేని దానిని” జయించడానికి మన స్వశక్తిని మించిన శక్తితో మనల్ని జతపరుస్తుంది. 19 అవును, విశ్వసించి విధేయులమైనందుకు దేవుడు “[మనల్ని] వెంటనే ఆశీర్వదిస్తారు”20 వాస్తవానికి, కాలక్రమేణా మన స్థితి సంతోషంగా మారుతుంది మరియు మనము ఆయనయందు మన విశ్వాసమును అభ్యసించి, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, “మనము క్రీస్తునందు సజీవులముగా చేయబడ్డాము.”21

సహోదర సహోదరీలారా, “సందేహించవద్దు కాని విశ్వసించుచూ ఉండుటకు”22 మనము ఈరోజు ఎంపిక చేద్దామా. “క్రీస్తునందు విశ్వసించడమే సరైన మార్గం.”23 మనము “[ఆయన] అరచేతుల మీద … చెక్కబడ్డాము.”24 ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, మన తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు.25 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.