సర్వసభ్య సమావేశము
రాబోయే దానివైపు చూడండి
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


9:20

రాబోయే దానివైపు చూడండి

అతిముఖ్యమైన విషయాలు—ప్రత్యేకించి “భవిష్యత్తులోని” విషయాలు, నిత్య విషయాల మీద దృష్టి కేంద్రీకరించడం అనేది ఈ జీవితంలో నిష్కపటంగా ఉండేందుకు ఆవశ్యకమైనది.

నాకు 15 ఏళ్ళ వయస్సున్నప్పుడు నేను అభ్యాసకుని అనుమతి పొందాను, అది నా తల్లిదండ్రులలో ఒకరు నాతో ఉన్నట్లయితే నేను కారు నడపడానికి అనుమతించేది. దూర ప్రయాణం చేయడం నీకిష్టమా అని మా నాన్న అడిగినప్పుడు, నేను ఉత్సాహపడ్డాను.

కొన్ని మైళ్ళ దూరంలో ఊరి పొలిమేరలో తిన్నగా, సుదీర్ఘంగా ఉండి, చాలా తక్కువమంది ఉపయోగించే రెండు-లైన్ల రహదారికి ఆయన నడిపించారు—అది ఆయన సురక్షితంగా భావించిన ఏకైక ప్రదేశం అని నేను చెప్పాలి. రహదారి పైన వాహనాలు నిలిపే స్థలంలో ఆయన ఆపినప్పుడు, మేము మా స్థానాలు మార్చుకున్నాము. ఆయన నాకు కొంత శిక్షణనిచ్చిన తరువాత, “జాగ్రత్తగా నడపడం మొదలుపెట్టి, నేను ఆపమని చెప్పేవరకు నడుపు” అని నాతో చెప్పారు.

ఆయన ఆదేశాలను నేను ఖచ్చితంగా అనుసరించాను. కానీ సుమారు 60 సెకన్ల తరువాత, “బాబు, కారు ప్రక్కకు ఆపు. నాకు తలతిరిగేలా నువ్వు నడుపుతున్నావు. నువ్వు రహదారి మీదంతా అటుఇటు తిరుగుతున్నావు. నువ్వు ఎటు వైపు చూస్తున్నావు?” అన్నారాయన.

కొంత ఉద్రేకంతో, “నేను రహదారి వైపు చూస్తున్నాను” అన్నాను.

తర్వాత ఆయన ఇలా అన్నారు: “నేను నీ కళ్ళను గమనిస్తున్నాను. నువ్వు సరిగ్గా కారు ముందున్న వాటిని మాత్రమే చూస్తున్నావు. కేవలం నీ ముందున్న వాటినే నువ్వు చూసినట్లయితే, నువ్వు ఎప్పటికీ తిన్నగా నడపలేవు.” తర్వాత ఆయన, “రాబోయే దానివైపు చూడు. తిన్నగా నడపడానికి అది నీకు సహాయపడుతుంది” అని నొక్కి చెప్పారు.

15 ఏళ్ళ వయస్సున్న వాడిగా నేను కారు నడపడాన్ని నేర్చుకోవడంలో అదొక మంచి పాఠం అనుకున్నాను. అప్పటినుండి దానినొక గొప్ప జీవితపాఠంగా కూడా నేను గుర్తించాను. అతిముఖ్యమైన విషయాలు—ప్రత్యేకించి “భవిష్యత్తులోని” విషయాలు, నిత్య విషయాల మీద దృష్టి కేంద్రీకరించడం అనేది ఈ జీవితంలో నిష్కపటంగా ఉండేందుకు ఆవశ్యకమైనది.

రక్షకుని జీవితంలో ఒక సందర్భంలో ఆయన ఒంటరిగా ఉండాలని కోరుకున్నారు, కాబట్టి “ప్రార్థనచేయుటకు ఆయన ఏకాంతముగా కొండయెక్కి పోయిరి.”1 సముద్రమును దాటడానికి సూచనలిచ్చి ఆయన తన శిష్యులను పంపివేసారు. రాత్రి చీకటిలో శిష్యులు వెళ్తున్న ఓడ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకుంది. వారిని కాపాడడానికి యేసు వెళ్ళారు, కానీ సంప్రదాయేతర విధానంలో వెళ్ళారు. “రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను”2 అని లేఖన వృత్తాంతము చెప్తుంది. వారు ఆయనను చూచినప్పుడు భయపడసాగిరి, ఎందుకనగా వారి యొద్దకు వచ్చుచున్న ఆకారము భూతమని వారు అనుకొనిరి. వారి భయమును గ్రహించిన యేసు వారి మనస్సులు మరియు హృదయాలను తేలిక చేయాలని కోరి, “ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడి”3 అని వారితో చెప్పిరి.

పేతురు ఉపశమింపజేయబడడమే కాకుండా ధైర్యమివ్వబడ్డాడు. ఎల్లప్పుడు ధైర్యము కలిగియుండి, తరచు ఆసక్తిగల పేతురు యేసుతో, “ప్రభువా, నీవే అయితే నీళ్ళమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.”4 “రమ్ము”5 అని తన సుపరిచిత మరియు కాలాతీతమైన ఆహ్వానంతో యేసు జవాబిచ్చారు.

ఆ అవకాశానికి పేతురు నిశ్చయంగా పులకరించి, పడవలో నుండి బయటికి నీటిలోనికి కాకుండా నీటిపైన అడుగుపెట్టాడు. అతడు రక్షకునిపై కేంద్రీకరించినప్పుడు, నీటిపైన నడవడం వంటి అసాధ్యమైన కార్యాన్ని అతడు చేయగలిగాడు. మొదట్లో పేతురు తుఫాను చేత అడ్డగించబడలేదు. కానీ క్రమంగా “ప్రచండమైన”6 గాలి అతడి దృష్టి మరల్చింది మరియు అతడు గురితప్పాడు. భయం కమ్ముకుంది. పర్యవసానంగా అతని విశ్వాసం క్షీణించి, అతడు మునిగిపోసాగాడు. “ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసాడు.”7 ఎల్లప్పుడూ రక్షించడానికి ఆతృతగా ఉండే రక్షకుడు అతని చెయ్యి పట్టుకొని పైకి లాగారు.

ఈ అద్భుతమైన వృత్తాంతము నుండి వేలసంఖ్యలో పాఠాలు నేర్చుకోవచ్చు, కానీ నేను మూడింటి గురించి చెప్తాను.

క్రీస్తుపై కేంద్రీకరించండి

మొదటి పాఠము: యేసు క్రీస్తుపై కేంద్రీకరించండి. పేతురు తన దృష్టిని యేసుపై కేంద్రీకరించినప్పుడు, అతడు నీటిపై నడవగలిగాడు. అతడు తన దృష్టిని రక్షకునిపై కేంద్రీకరించినంత వరకు తుఫాను, అలలు మరియు గాలి అతడిని అడ్డగించలేకపోయాయి.

మన అంతిమ ఉద్దేశ్యాన్ని గ్రహించడం మనం దేనిపై దృష్టి కేంద్రీకరించాలో నిశ్చయించుకోవడానికి మనకు సహాయపడుతుంది. లక్ష్యం తెలియకుండా మనం ఒక విజయవంతమైన ఆట ఆడలేము, అలాగే దాని ఉద్దేశ్యము తెలియకుండా మనం ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించలేము. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క గొప్ప దీవెనలలో ఒకటేమనగా, ఇతర విషయాలతో పాటు అది “జీవితము యొక్క ఉద్దేశ్యమేమిటి?” అనే ప్రశ్నకు జవాబిస్తుంది. “ఆనందాన్ని కలిగియుండి, దేవుని సన్నిధికి తిరిగివెళ్ళడానికి సిద్ధపడడమే ఈ జీవితంలో మన ఉద్దేశ్యము.”8 దేవునితో నివసించడానికి తిరిగివెళ్ళేందుకు సిద్ధపడడానికి మనం ఈ భూమిపై ఉన్నామని గుర్తుంచుకోవడం క్రీస్తు వైపు మనల్ని నడిపించే విషయాలపై దృష్టి కేంద్రీకరించడానికి మనకు సహాయపడుతుంది.

క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడానికి క్రమశిక్షణ అవసరం, ప్రత్యేకించి మంచి శిష్యులుగా కావడానికి మనకు సహాయపడే చిన్న మరియు సాధారణమైన ఆత్మీయ అలవాట్ల గురించి క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేకుండా శిష్యత్వము లేదు.

మనం ఎక్కడ ఉండాలని కోరుతున్నామో మరియు మనమేమి అవ్వాలని కోరుతున్నామో అనే భవిష్యత్తు వైపు చూసి, అక్కడకు చేరుకోవడానికి మనకు సహాయపడే విషయాలను చేయడానికి ప్రతిరోజు సమయం తీసుకున్నప్పుడు, క్రీస్తుపై మన దృష్టి మరింత స్పష్టమవుతుంది. క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడం మన నిర్ణయాలను సులభం చేస్తుంది మరియు మన సమయాన్ని, వనరులను మనం ఎంత బాగా ఉపయోగించగలమనే దానికి నడిపింపును అందిస్తుంది.

మనం దృష్టి కేంద్రీకరించడానికి తగిన విషయాలు అనేకం ఉన్నప్పటికీ, మన జీవితాల్లో ఎల్లప్పుడూ క్రీస్తుకు ప్రాధాన్యతనివ్వడం యొక్క ప్రాముఖ్యతను పేతురు యొక్క ఉదాహరణ నుండి మనం నేర్చుకుంటాము. క్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవునితో కలిసి జీవించడానికి తిరిగి వెళ్ళగలము. మనం ఆయన వలె కావడానికి ప్రయత్నించినప్పుడు మరియు మనం విఫలమవుతున్నప్పుడు ఆయన క్షమాపణను, బలపరచు శక్తిని కోరుకున్నప్పుడు మనం క్రీస్తు యొక్క కృప మీద ఆధారపడతాము.

పరధ్యానాల గురించి జాగ్రత్త వహించండి

రెండవ పాఠము: పరధ్యానాల గురించి జాగ్రత్త వహించండి. పేతురు తన దృష్టిని యేసు పైనుండి మరల్చి, తన పాదాలను తాకుతున్న గాలి మరియు అలలపై నిలిపినప్పుడు అతడు మునిగిపోసాగాడు.

క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడం నుండి మనల్ని దూరం చేయగలిగే “ముందున్న” విషయాలు అనేకం ఉంటాయి మరియు “భవిష్యత్తులో రాబోయే” నిత్య విషయాలు ఉంటాయి. అపవాది గొప్ప పరధ్యానం కలుగజేయువాడు. గొప్ప విశాలమైన భవనం నుండి వచ్చే స్వరాలు, దేవునితో నివసించడానికి తిరిగి వెళ్ళేందుకు సిద్ధపడే మార్గం నుండి మనల్ని మరలించే విషయాల వైపు ఆకర్షించడానికి కోరతాయని మనం లీహై దర్శనం నుండి నేర్చుకున్నాము.9

కానీ తక్కువ స్పష్టమైన ఇతర పరధ్యానాలు కూడా ప్రమాదకరం కాగలవు. సామెత చెప్పినట్లు, “చెడు గెలవడానికి కావలసిన ఒకేఒక్క విషయం మంచివారు ఏమీ చేయకుండా ఉండడమే.” మంచివారు ఏమీ చేయకుండా ఉండేలా చేయడానికి లేదా కనీసం వారి ఉన్నత ఉద్దేశ్యాలు మరియు లక్ష్యాల నుండి వారి దృష్టి మరల్చే విషయాలపై వారి సమయాన్ని వృధాచేసేలా చేయడానికి అపవాది నిశ్చయించుకున్నట్లు ఉన్నాడు. ఉదాహరణకు, పరిమితిలో నున్న కొన్ని ఆరోగ్యకరమైన మలుపులు క్రమశిక్షణ లేనప్పుడు అనారోగ్యకరమైన పరధ్యానాలు కాగలవు. ప్రభావవంతంగా ఉండేందుకు పరధ్యానాలు చెడ్డవి లేదా అవినీతికరమైనవి కానక్కరలేదని అపవాదికి తెలుసు.

మనము రక్షింపబడగలము

మూడవ పాఠం: మనము రక్షింపబడగలము. పేతురు మునిగిపోవ నారంభించినప్పుడు “ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసాడు. వెంటనే యేసు చెయ్యిచాపి అతడిని పట్టుకున్నారు.”10 మనం మునిగిపోతున్నామని తెలిసినప్పుడు, మనం శ్రమను ఎదుర్కొన్నప్పుడు లేదా మనం తడబడినప్పుడు, మనం కూడా ఆయనచేత రక్షింపబడగలము.

కష్టము లేదా శ్రమను ఎదుర్కొన్నప్పుడు, మీరు నా వలె ఉండి, వెంటనే రక్షింపబడగలరని ఆశించవచ్చు. కానీ—వారు రాత్రి చాలా సమయం తుఫానులో కష్టపడిన తర్వాత, రక్షకుడు అపొస్తలుల సహాయార్థం రాత్రి నాలుగవ జామున వచ్చారని గుర్తుంచుకోండి.11 సహాయం వెంటనే అందకపోయినా, అది కనీసం సుదీర్ఘమైన రాత్రి యొక్క రెండవ జామున లేదా మూడవ జామున అందుతుందని మనం ప్రార్థించవచ్చు. మనం తప్పక వేచియుండవలసి వచ్చినప్పుడు, మనం సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనియ్యడని స్థిరపరుస్తూ, రక్షకుడు ఎల్లప్పుడూ గమనిస్తున్నారనే నమ్మకంతో ఏదో ఒకటి చేయాలి.12 బహుశా ఇంకా బాధలలో ఉండి, రాత్రి నాలుగవ జాము వరకు వేచియున్న వారు నిరీక్షణ కోల్పోవద్దు. విశ్వాసులకు మర్త్యత్వములో లేదా నిత్యత్వములో రక్షణ ఎల్లప్పుడూ వస్తుంది.

కొన్నిసార్లు మన తప్పులు మరియు అతిక్రమముల కారణంగా మనం మునిగిపోతాము. ఆ కారణాల మూలంగా మీరు మునిగిపోతున్నట్లు కనుగొనినట్లయితే, పశ్చాత్తాపమనే ఆనందకరమైన ఎంపికను చేయండి.13 ఆయన వైపుకు తిరిగే లేదా తిరిగివచ్చే వారిని రక్షించడం కంటే రక్షకునికి అధిక ఆనందాన్నిచ్చే విషయాలు కొన్ని ఉన్నాయని నేను నమ్ముతున్నాను.14 ఒకప్పుడు తప్పుచేసి, పతనమైనప్పటికీ పశ్చాత్తాపపడి, క్రీస్తు యందు విశ్వాసములో దృఢంగా మారిన జనుల యొక్క కథలతో లేఖనాలు నిండియున్నాయి. మన కొరకు రక్షకుని ప్రేమ మరియు మనల్ని విమోచించడానికి ఆయన శక్తి అనంతమైనవని మనకు గుర్తుచేయడానికి ఆ కథలు లేఖనములలో ఉన్నాయని నేననుకుంటున్నాను. మనం పశ్చాత్తాపపడినప్పుడు రక్షకుడు మాత్రమే ఆనందంగా ఉండరు, మనం కూడా గొప్ప ఆనందాన్ని పొందుతాము.

ముగింపు

ఉద్దేశ్యపూర్వకంగా “రాబోయే దానివైపు చూడమని” మరియు నిజంగా అవసరమైన విషయాలపై అధికంగా మీ దృష్టి కేంద్రీకరించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన దృష్టి యొక్క కేంద్రబిందువుగా మనం క్రీస్తును నిలుపుదాం. పరధ్యానాలు, ముందున్న విషయాలు మరియు మనల్ని చుట్టుముట్టిన సుడిగాలులన్నిటి మధ్య, యేసు మన రక్షకుడు, మన విమోచకుడు మరియు మనల్ని కాపాడేవాడని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.