సర్వసభ్య సమావేశము
క్రీస్తు యొద్దకు రండి, కానీ ఒంటరిగా రావద్దు
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:19

క్రీస్తు యొద్దకు రండి, కానీ ఒంటరిగా రావద్దు

ఆయనను అనుసరించమని అందరిని ఆహ్వానించడం ద్వారా ప్రపంచాన్ని క్రీస్తు కొరకు సిద్ధం చేయడమే ప్రపంచాన్ని వృద్ధిచేయడానికి మీకు గల ఉత్తమమైన మార్గం.

ఇటీవల ధైర్యవంతురాలైన ఒక యువతి నుండి నేనొక ఉత్తరం అందుకున్నాను. ఆమె ఇలా వ్రాసింది, “నేను ఆగిపోయాను. … నేను ఎవరినో నాకు తెలియదు, కానీ గొప్ప నిత్య ఉద్దేశ్యము కొరకు ఇక్కడున్నానని నేననుకుంటున్నాను.”

మీ జీవిత ఉద్దేశ్యము తెలుసుకోవాలని మీరెప్పుడైనా కోరుకున్నారా? పరలోక తండ్రికి మీరు తెలుసా మరియు ఆయనకు మీరు అవసరమా అని ఆశ్చర్యపడ్డారా? నా ప్రియ యౌవనులకు మరియు మీ అందరికి, జవాబు అవును! అని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రభువు మీ కొరకు ఒక ప్రణాళికను కలిగియున్నారు. ఆయన గొప్ప కార్యములో మంచి కొరకు బలముగా, బలగముగా ఉండేందుకు ఈనాటి కొరకు, ఇప్పటి కొరకు ఆయన మిమ్మల్ని సిద్ధపరిచారు. మాకు మీ అవసరముంది! మీరు లేకుండా ఆయన కార్యము గొప్పది కాలేదు!

మీ గొప్ప, మహిమకరమైన కార్యానికి పునాదియైన రెండు సరళమైన సత్యాలను పవిత్రమైన పరిస్థితులలో మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నాకు గుర్తుచేసారు.

నేను నా భర్తతో కలిసి సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు, మన ప్రవక్త మాకు దగ్గరగా తన కుర్చీని లాక్కొని, గ్రుచ్చుకొనే తన నీలి కళ్ళతో నావైపు చూసారు. యువతుల ప్రధాన అధ్యక్షురాలిగా సేవచేయడానికి ఆయన నన్ను పిలిచినప్పుడు, నా గుండె వేగం పెరిగి, ఒక్క క్షణం ఆగినట్లయింది. ఆయన అడిగిన ప్రశ్న నా మనస్సులో ఇంకా ధ్వనిస్తోంది, “బోన్ని, (యువత) తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి?”

నేను ఒక్క క్షణం ఆలోచించి, “వారెవరో వారు తెలుసుకోవాలి” అన్నాను.

“అవును!” “మరియు వారి ఉద్దేశ్యాన్ని వారు తెలుసుకోవాలి” అని ఆయన గట్టిగా చెప్పారు.

మన దైవిక గుర్తింపు

నీవు పరలోక తండ్రిచేత పోషించబడిన ప్రియమైన బిడ్డవు. ఆయన మిమ్మల్ని ఎంత పరిపూర్ణంగా ప్రేమిస్తారంటే, మీ కోసం మరియు నా కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును పంపారు.1 మనం విఫలమైనప్పుడు కూడా మనపై రక్షకుని ప్రేమ విఫలముకాదు! దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదు.2 ఈ ప్రేమను గుర్తుంచుకోవడం మీ సామర్థ్యాన్ని మీ నుండి దోచుకొనే వాటిని లేదా మీ దైవిక గుర్తింపులో మీ నమ్మకాన్ని బలహీనపరిచే గందరగోళమైన ఆలోచనలను పారద్రోలగలదు.

కష్టపడుతున్న ఇద్దరు యువతులను ఒక ఎఫ్ఎస్‌వై (యౌవనుల బలము కొరకు) సమావేశంలో నేను కలిసాను. వారిలో ప్రతిఒక్కరు ఒకే మూలాధారము వైపు, అనగా తమ గోత్రజనకుని దీవెన వైపు తిరిగి, వ్యక్తిగతంగా తమ కోసం ప్రభువు యొక్క ప్రేమను, నడిపింపును మరలా కనుగొన్నారు. మీ గోత్రజనక దీవెనను కనుగొనండి, తప్పనిసరి అయితే దుమ్మును దులపండి, కానీ తరచుగా అధ్యయనం చేయండి. మీకు గోత్రజనక దీవెన లేకపోయినట్లయితే, త్వరలో దానిని పొందండి. మీరు ఎవరో అనేదాని గురించి ఇప్పుడు ప్రభువు మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆలస్యం చేయవద్దు.

మన నిత్య ఉద్దేశ్యము

ఆ రోజు అధ్యక్షులు నెల్సన్ మాతో మాట్లాడిన రెండవ సత్యం మన ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడమే. ఇది మన ఘనమైన మరియు ఉన్నతమైన బాధ్యత.

చాలా సంవత్సరాల క్రితం, మా అబ్బాయి టేనర్ తన మొదటి సాకర్ ఆట ఆడినప్పుడు అతని వయస్సు సుమారు ఐదేళ్ళు. అతడు పులకరించిపోయాడు!

మేము ఆట స్థలానికి వెళ్ళినప్పుడు, అతని జట్టు—ఐదేళ్ళ వయస్సు వారికి తగిన వలను కాకుండా చాలా పెద్దదైన వలను—క్రమబద్ధం చేయబడిన కొలత గల సాకర్ గోలును ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్నాము.

టేనర్ గోల్‌ కీపర్ స్థానంలో ఉండడం చూసి ఆట అకస్మాత్తుగా చాలా ముఖ్యమైనదిగా అనిపించింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. వలను కాపలా కాయడంలో తన ఉద్దేశ్యాన్ని అతడు నిజంగా అర్థం చేసుకున్నాడా?

ఈల వేయగానే మేము ఆటలో ఎంతగా మునిగిపోయామంటే, టేన్నర్ గురించి పూర్తిగా మరచిపోయాము. అకస్మాత్తుగా ఎదుటి జట్టులో ఒక సభ్యుడు బంతి తీసుకొని వేగంగా టేనర్ వైపుకు తన్నాడు. అతడు తన స్థానంలో ఉండి గోలును రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని నిర్ధారించుకోవడానికి నేను టేనర్ వైపు నేను చూసాను. నేను ఊహించనిదాన్ని చూసాను.

గోలు కొడుతున్న బాలుడు

ఆటలో ఒక సమయంలో టేనర్ దృష్టిమళ్ళి, వలలోని రంధ్రం గుండా తన ఎడమచేతిని ఊపడం మొదలుపెట్టాడు. తర్వాత తన కుడిచేతితో అలాగే చేసాడు. చివరికి తన ఎడమ కాలితో. చివరికి తన కుడికాలితో కూడా అలాగే చేసాడు. టేనర్ పూర్తిగా వలలో చిక్కుకుపోయాడు. అతడు తన ఉద్దేశ్యాన్ని మరియు తనకు అప్పగించిన బాధ్యతను మరచిపోయాడు.

వలలో చిక్కుకున్న బాలుడు

టేనర్ సాకర్ ఆట ఎంతోకాలం కొనసాగనప్పటికీ, ఆ రోజు అతడు నాకు నేర్పిన పాఠం ఎప్పటికీ మరువలేనిది. మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో అనే దానినుండి అప్పుడప్పుడు మన దృష్టి మరలి, మన శక్తినంతా తప్పుదారి పట్టిస్తాము. సాతాను యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి, మంచి మరియు ఉత్తమమైన హేతువులతో మనల్ని దృష్టి మళ్ళించి, తద్వారా అవసరమైన సమయాల్లో ఈ లోకంలో మనం ఎందుకు జన్మించామో మరిచిపోయేటట్లు మనల్ని గ్రుడ్డివారిగా చేసి, బంధించడమే.3

మన నిత్య ఉద్దేశ్యమేమనగా క్రీస్తు యొద్దకు వచ్చి, ఆయన గొప్ప పనిలో చురుకుగా ఆయనతో చేరడమే. ఇది అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లు చేసేంత సులభమైనది: “దేవునితో వారి నిబంధనలు చేయడానికి మరియు పాటించడానికి … ఎవరికైనా సహాయపడేందుకు ఎప్పుడైనా మనమేదైనా చేసినప్పుడు, మనం ఇశ్రాయేలును సమకూర్చడానికి సహాయపడుతున్నాము.” 4 మరియు మనము ఆయనతో కలిసి ఆయన పనిని చేసినప్పుడు, మనం ఆయన్ని మరింత ఎక్కువగా తెలుసుకుంటాము మరియు ప్రేమిస్తాము.

విశ్వాసము, విలువైన పశ్చాత్తాపము మరియు ఆజ్ఞలను పాటించడం ద్వారా నిరంతరము రక్షకునికి దగ్గరవ్వాలని మనం కోరుకుంటాము. నిబంధనలు మరియు విధుల ద్వారా మనల్ని మనం ఆయనకు కట్టుబడేలా చేసుకున్నప్పుడు, మన జీవితాలు నమ్మకం, 5 రక్షణ6 మరియు లోతైన, శాశ్వతమైన ఆనందంతో నింపబడతాయి.7

మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన కళ్ళతో మనం ఇతరులను చూస్తాము.8 క్రీస్తు యొద్దకు రండి. ఇప్పుడే రండి, కానీ ఒంటరిగా రాకండి!9

యేసు క్రీస్తు యొక్క సువార్త మంచిది మాత్రమే కాదు, అది అందరి కొరకు ఆవశ్యకమైనది. “మనం రక్షింపబడగల మరే ఇతర మార్గము లేదా సాధనము లేదు, కేవలము క్రీస్తు నందు మరియు ద్వారానే.”10 మనకు యేసు క్రీస్తు అవసరం! ప్రపంచానికి యేసు క్రీస్తు అవసరం.11

ఆయనను అనుసరించమని అందరిని ఆహ్వానించడం ద్వారా ప్రపంచాన్ని క్రీస్తు కొరకు సిద్ధం చేయడమే ప్రపంచాన్ని వృద్ధిచేయడానికి మీకు గల ఉత్తమమైన మార్గం అని గుర్తుంచుకోండి.

పునరుత్థానం చెందిన క్రీస్తు నీఫైయులతో సమయం గడిపిన శక్తివంతమైన కథ మోర్మన్ గ్రంథంలో ఉంది. అది ఎలా ఉండియుండవచ్చో మీరూహించగలరా?

తాను తండ్రి యొద్దకు తిరిగివెళ్ళాలని క్రీస్తు చెప్పినప్పుడు, “ఆయన సమూహము వైపు మరలా చూసారు.”12 జనుల కళ్ళల్లో కన్నీళ్ళు చూసినప్పుడు, ఆయన ఆలస్యంగా వెళ్ళాలని వారి హృదయాలు కోరుకుంటున్నట్లు అయనకు తెలుసు.

స్వస్థపరచబడేందుకు నీఫైయులను ఆహ్వానిస్తున్న రక్షకుడు

ఆయన అన్నారు: “మీ మధ్య రోగులెవరైనా ఉన్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి. కుంటివారు, గ్రుడ్డివారు, … చెవిటి వారు లేదా ఏ విధముగానైనా బాధింపబడిన వారు మీలోనున్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి, నేను వారిని స్వస్థపరిచెదను.”13

గొప్ప జాలితో, ఆయన ఎటువంటి పరిమితులు విధించలేదు మరియు “ఏ విధముగానైనా బాధింపబడిన” వారందరికి పిలుపునిచ్చారు. యేసు క్రీస్తుకు స్వస్థపరచడానికి ఏ రోగము పెద్దది లేదా చిన్నది కాదు.

మన బాధలు మరియు శ్రమలు ఆయనకు బాగా తెలుసు మరియు ఆందోళనతో, ఒత్తిడితో ఉన్నవారు, అలసినవారు, గర్విష్టులు, భద్రత లేనివారు, అపార్థం చేసుకోబడినవారు, ఒంటరివారు లేదా “ఏ విధముగానైనా బాధింపబడిన” వారిని ఆయన వద్దకు తీసుకురమ్మని చెప్పారు.

స్వస్థపరచుచున్న రక్షకుడు

వారందరు “ముందుకు వెళ్ళారు …; ఆయన వారిలో ప్రతివానిని స్వస్థపరిచెను. …

“… స్వస్థపరచబడినవారు మరియు ఆరోగ్యముగా ఉన్నవారు ఇరువురు ఆయన పాదములవద్ద మోకరించి, ఆయనను ఆరాధించిరి.” 14

నేను దీనిని చదివిన ప్రతిసారి, నన్ను నేను ఇలా ప్రశ్నించుకుంటాను: నేను క్రీస్తు దగ్గరకు ఎవరిని తీసుకువస్తాను? మీరు ఎవరిని తీసుకువస్తారు?

ఎవ్వరూ వదిలివేయబడలేదని నిశ్చయపరచడానికి ఆయనలా మనము కూడా సమూహము వైపు మరలా చూసి, ఆయనను తెలుసుకోవడానికి రమ్మని ప్రతిఒక్కరిని ఆహ్వానించగలమా?

ఇది ఎంత సులభం కాగలదో తెలిపే ఒక ఉదాహరణను మీతో పంచుకుంటాను. 15 ఏళ్ళ వయస్సున్న నా స్నేహితురాలు పేటన్ ప్రతిరోజు అల్పాహార సమయంలో లేఖనాల నుండి ఐదు వచనాలు చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది, కానీ ఆమె ఒంటరిగా దానిని చేయలేదు. మళ్ళీ ఆలోచించి, పేటన్ తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఐదేళ్ళ వయస్సున్న తన తమ్ముడిని కూడా అలా చేయడానికి ఆహ్వానించింది. “వారిని ఇక్కడకు తీసుకురండి” అని ఆహ్వానించినప్పుడు, ఈ చిన్న చర్య గురించే క్రీస్తు బోధిస్తున్నారు.

ప్రభువు నుండి ఈ ఆహ్వానం నేటికీ ఇవ్వబడుతోంది. యువతీ యువకులారా, మీ ఇంటిలో ఇప్పుడే మొదలుపెట్టండి. మీ తల్లిదండ్రులు క్రీస్తు యొద్దకు రావడం కొనసాగిస్తున్నప్పుడు, మీరు వారికి ఎలా సహకరించగలరని మీరు ప్రార్థించి, పరలోక తండ్రిని అడుగుతారా? మీకు వారి అవసరం ఎంత ఉందో వారికి మీ అవసరం అంతే ఉంది.

తర్వాత మీ తోబుట్టువులు, స్నేహితులు మరియు పొరుగువారి గురించి మళ్ళీ ఆలోచించండి. మీరు ఎవరిని క్రీస్తు యొద్దకు తీసుకువస్తారు?

“ఇదిగో నేను వెలుగునైయున్నాను; నేను మీ కొరకు ఒక మాదిరిని ఉంచియున్నాను,”15 అని రక్షకుడు ప్రకటించారు. దేవుని కుటుంబాన్ని కాపాడడంలో మనం ఆయనతో చేరినప్పుడు, రక్షకుని ప్రేమ మరియు శాంతిని మనము అనుభవిస్తాము, ఎందుకంటే “నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును”16 అని ఆయన వాగ్దానం చేసారు.

క్రీస్తు యొక్క హేతువులో నిమగ్నమైయుండేందుకు ఎంత గొప్ప సమయమిది!

అవును, అద్భుతమైన యౌవనులారా, గొప్ప నిత్య ఉద్దేశ్యము కొరకు మీరిక్కడ ఉన్నారు. “ప్రపంచాన్ని మార్చడానికి ప్రభువుకు మీరు అవసరము. మీ కొరకు ఆయన చిత్తాన్ని అంగీకరించి, మీరు ఆయనను వెంబడించినప్పుడు, అసాధ్యమైన దానిని మీరు సాధించడాన్ని మీరు కనుగొంటారు!”17

మీరు ఎవరో ప్రభువుకు తెలుసని, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నేను ధైర్యంగా సాక్ష్యమిస్తున్నాను! క్రీస్తు తనకుతానుగా ఈ భూమి పైకి తిరిగివచ్చి, “ఇక్కడకు” రండి అని మనలో ప్రతిఒక్కరిని పిలిచే ఆ గొప్ప దినము వరకు మనమందరం కలిసి ఆయన ఉద్దేశ్యాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మనం ఆనందంగా కలిసి సమకూడుదాం, ఎందుకంటే మనం క్రీస్తు యొద్దకు వచ్చేవారము మరియు మనం ఒంటరిగా రాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.