రక్షకుని యొక్క శాశ్వతమైన కనికరము
ఇతరుల పట్ల కనికరము చూపించుట యేసు క్రీస్తు సువార్త యొక్క సారాంశమైయున్నది.
రక్షకుడు తన భూలోక పరిచర్యలో బోధించిన అత్యంత అద్భుతమైన సూత్రాలలో ఒకటి ఇతరుల పట్ల కనికరముతో వ్యవహరించడం. పరిసయ్యుడైన సీమోను ఇంటిని యేసు సందర్శించిన వృత్తాంతాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ సూత్రము మరియు దాని ఆచరణాత్మక అన్వయము గురించి మనం ఆలోచిద్దాం.
యేసు సీమోను ఇంట్లో ఉండగా పాపాత్మురాలుగా పరిగణించబడే ఒక ప్రత్యేక మహిళ ప్రవేశించిందని లూకా సువార్త ఉదహరించును. వినయపూర్వకమైన పశ్చాత్తాపముతో, ఆ స్త్రీ యేసును సమీపించి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ప్రత్యేకమైన అత్తరు వాటికి పూసింది.1 స్త్రీ కంటే నైతికంగా గొప్పవాడిగా భావించిన గర్విష్ఠుడైన ఆ అతిధేయుడు, నింద మరియు అహంకారముతో, “ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు” 2 అని తనలో తాను అనుకొన్నాడు.
నీ కంటే పవిత్రుడ్ని అనే పరిసయ్యుడి వైఖరి యేసును మరియు ఆ స్త్రీని అన్యాయంగా తీర్పుతీర్చేలా చేసింది. కానీ రక్షకుడు తన సర్వజ్ఞతతో సీమోను మనస్సు యెరిగియుండి, గొప్ప జ్ఞానంతో సీమోను యొక్క తిరస్కారాన్ని సవాలు చేసారు, అలాగే రక్షకుని వంటి ప్రత్యేక అతిథిని తన ఇంట్లో స్వీకరించే మర్యాద లేనందుకు అతడిని మందలించారు. వాస్తవానికి, యేసు ప్రవచన వరాన్ని కలిగియున్నారని మరియు వినయపూర్వకమైన, నలిగిన హృదయమును కలిగిన ఈ స్త్రీ పశ్చాత్తాపపడి, తన పాపాలకు క్షమాపణ పొందెనని తెలుపుటకు యేసు పరిసయ్యుడ్ని ప్రత్యక్షంగా మందలించడం ఒక సాక్ష్యంగా పనిచేసింది.3
యేసు యొక్క భూలోక పరిచర్యలో అనేక ఇతర సంఘటనల వలె, రక్షకుడు తన యొద్దకు వచ్చే వారందరి పట్ల భేదం లేకుండా, ముఖ్యంగా ఆయన సహాయం అవసరమైన వారి పట్ల కనికరంతో వ్యవహరించారని ఈ వృత్తాంతము మరోసారి రుజువు చేస్తుంది. ఆ స్త్రీ యేసు పట్ల చూపిన పశ్చాత్తాపం మరియు భక్తిపూర్వక ప్రేమ ఆమె హృదయపూర్వక పశ్చాత్తాపమునకు మరియు తన పాపాల నుండి ఉపశమనం పొందాలనే కోరికకు నిదర్శనం. అయినప్పటికీ, సీమోను యొక్క ఆధిపత్య భావం అతని కఠిన హృదయంతో చేరి, 4 ఆ పశ్చాత్తాపపడిన ఆత్మ పట్ల సహానుభూతి చూపకుండా అతడ్ని నిరోధించింది మరియు అతడు లోక రక్షకుని కూడా ఉదాసీనత మరియు ధిక్కారంతో సూచించాడు. అతడి జీవన విధానం నియమాలను కఠినంగా, బూటకంగా పాటించడం మరియు తనను తాను హెచ్చించుకోవడం ద్వారా మరియు అసత్యమైన పరిశుద్ధత ద్వారా అతడి నమ్మకాలను బాహ్యంగా వ్యక్తీకరించడం తప్ప మరొకటి కాదని అతడి వైఖరి వ్యక్తపరిచింది.5
ఈ వృత్తాంతములో యేసు యొక్క కనికరముగల మరియు వ్యక్తిగతీకరించబడిన పరిచర్య, మన పొరుగువారితో మనం ఎలా వ్యవహరించాలో ఒక ఖచ్చితమైన నమూనాను ప్రదర్శిస్తుంది. రక్షకుడు లోతైన మరియు స్థిరమైన కనికరముతో కదిలింపబడి, ఆయన తన కాలంలోని వ్యక్తులతో ఎలా సంభాషించారో, బాధపడుతున్న వారికి మరియు “కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్న వారికి”6 ఏవిధంగా సహాయపడ్డారో తెలిపే లెక్కలేనన్ని ఉదాహరణలు లేఖనాలలో ఉన్నాయి. భౌతికంగా మరియు అత్మీయంగా వారి భారాల నుండి ఉపశమనం అవసరమైన వారికి ఆయన తన దయగల హస్తాన్ని అందించారు.7
యేసు యొక్క కనికరము గల వైఖరి దాతృత్వములో 8 అనగా ఆయన స్వచ్ఛమైన మరియు పరిపూర్ణమైన ప్రేమలో స్థిరపరచబడింది, ఇదే ఆయన ప్రాయశ్చిత్త త్యాగము యొక్క సారాంశము. కనికరము అనేది పవిత్రత కోసం ప్రయత్నించేవారి ప్రాథమిక లక్షణం మరియు దుఃఖించే వారితో దుఃఖించడం, సహానుభూతి, కరుణ మరియు దయ కలిగియుండడం వంటి ఇతర క్రైస్తవ లక్షణాలతో అది ముడిపడి ఉంటుంది.9 ఇతరుల పట్ల కనికరమును వ్యక్తపరచడమనేది నిజానికి, యేసు క్రీస్తు సువార్త యొక్క సారాంశము మరియు రక్షకుని పట్ల మన ఆత్మీయ, భావోద్వేగ సాన్నిహిత్యానికి గుర్తించదగిన సాక్ష్యము. ఇంకను, ఇది మన జీవన విధానంపై ఆయన ప్రభావం యొక్క స్థాయిని చూపుతుంది మరియు మన ఆత్మల యొక్క పరిమాణాన్ని రుజువు చేస్తుంది.
యేసు యొక్క కనికరముగల చర్యలు పూర్తి చేయవలసిన పనుల జాబితా ఆధారంగా అప్పుడప్పుడు మరియు తప్పనిసరిగా చేయబడే వ్యక్తీకరణలు కాదని, దేవుడు మరియు ఆయన పిల్లల పట్ల ఆయన స్వచ్ఛమైన ప్రేమ యొక్క వాస్తవికత మరియు వారికి సహాయం చేయాలనే తన నిరంతర కోరిక యొక్క అనుదిన వ్యక్తీకరణ అని గమనించడం అర్థవంతమైనది.
సుదూరంలో ఉన్న ప్రజల అవసరాలను కూడా యేసు గుర్తించగలిగారు. కాబట్టి, ఒక శతాధిపతి దాసుడిని 10 స్వస్థపరిచిన వెంటనే, యేసు కపెర్నహోము నుండి నాయీనను ఊరికి ప్రయాణం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించదు. విధవరాలైన ఒక తల్లి యొక్క ఏకైక కుమారుడు, మృతిచెందిన యువకుడిని లేచి, జీవించుము అని ఆదేశించినప్పుడు యేసు తన భూలోక పరిచర్యలో అత్యంత సున్నితమైన అద్భుతాలలో ఒకదాన్ని చేశారు. యేసు ఆ పేద తల్లి యొక్క తీవ్రమైన బాధను మాత్రమే కాకుండా ఆమె జీవితంలో క్లిష్ట పరిస్థితులను గ్రహించారు మరియు ఆమె పట్ల నిజమైన కనికరముతో కదిలించబడ్డారు.11
పాపాత్మురాలైన స్త్రీ మరియు నాయీను యొక్క విధవరాలి వలె, మన ప్రభావ పరిధిలోని చాలా మంది ఓదార్పును, శ్రద్ధను, చేరికను మరియు మనం వారికి అందించే ఏదైనా సహాయాన్ని కోరుతున్నారు. మనమందరము ప్రభువు చేతిలో సాధనాలుగా ఉండగలము మరియు యేసు చేసినట్లుగా, అవసరతలో ఉన్న వారి పట్ల కనికరముతో వ్యవహరించగలము.
చాలా సంక్లిష్టమైన చీలిన పెదవులు మరియు చీలిన అంగిలితో పుట్టిన ఒక చిన్న అమ్మాయి నాకు తెలుసు. ఆమె తన జీవితంలో రెండవ రోజున, అనేక శస్త్రచికిత్సల శ్రేణిలో మొదటిది ఆమెకు చేయవలసి వచ్చింది. ఇదే సవాలును ఎదుర్కొంటున్న వారి పట్ల నిజమైన కనికరముతో, ఈ అమ్మాయి మరియు ఆమె తల్లిదండ్రులు ఈ సంక్లిష్ట వాస్తవికతను ఎదుర్కొనే ఇతరులకు మద్దతు, అవగాహన మరియు భావోద్వేగ సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు తమ స్వంత మాటలలో ఇలా పంచుకున్నారు: “మా కుమార్తె యొక్క సవాలు ద్వారా, ఓదార్పు, మద్దతు మరియు ప్రోత్సాహం అవసరము గల అద్భుతమైన వ్యక్తులను కలిసే అవకాశం మాకు లభించింది. ఇప్పుడు 11 సంవత్సరాల వయస్సుగల మా కుమార్తె, కొంతకాలం క్రితం అదే సవాలుతో పుట్టిన శిశువు తల్లిదండ్రులతో మాట్లాడింది. ఈ సంభాషణ జరుగుతుండగా, సమస్యను పరిష్కరించడానికి రాబోయే కొన్నేళ్ళలో ఆ శిశువు ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నప్పటికీ, ఆశ ఉందని ఆ తల్లిదండ్రులు చూడగలుగుటకు మా కుమార్తె మహమ్మారి కారణంగా ఆమె ధరించిన ముసుగును క్షణంలో తీసివేసింది. రక్షకుడు మా కోసం చేసినట్లుగా, బాధపడేవారికి మా సానుభూతిని చూపే అవకాశము కొరకు మేము చాలా కృతజ్ఞులము. వేరొకరి బాధ నుంచి ఉపశమనం కలిగించిన ప్రతిసారీ మా బాధను మేము తగ్గించుకుంటామని భావిస్తున్నాము.”
నా ప్రియమైన మిత్రులారా, రక్షకుని ద్వారా ఉదహరించబడినట్లుగా, మన జీవిత విధానంలో కనికరముగల వైఖరిని చేర్చడానికి మనము ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించినప్పుడు, ప్రజల అవసరాలకు మరింత సున్నితంగా మారతాము. పెరిగిన ఆ సున్నితత్వంతో, నిజమైన ఆసక్తి మరియు ప్రేమ భావాలు మన ప్రతి చర్యలోనూ వ్యాపిస్తాయి. ప్రభువు మన ప్రయత్నాలను గుర్తిస్తారు మరియు హృదయాలను మృదువుగా చేయడంలో, మరియు “క్రుంగియున్న … హస్తములు” కలిగియున్న వారికి ఉపశమనం కలిగించడంలో ఆయన హస్తాలలో సాధనాలుగా ఉండే అవకాశాలతో మనం తప్పకుండా దీవించబడతాము.12
సీమోను అనే పరిసయ్యునికి యేసు ఇచ్చిన ఉపదేశం మన తోటి స్త్రీ పురుషులకు కఠినమైన మరియు క్రూరమైన తీర్పుతీర్చకూడదని కూడా స్పష్టం చేసింది, ఎందుకంటే మన లోపాల కొరకు మన ప్రేమగల పరలోక తండ్రి నుండి అవగాహనను, కరుణను పొందవలసిన అవసరాన్ని మనమందరము కలిగియున్నాము. “నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?” 13 అని చెప్పినప్పుడు రక్షకుడు మరొక సందర్భంలో బోధించినది ఇది కాదా?
ఒకరి వైఖరి లేదా ప్రతిచర్యకు దోహదపడే అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదని మనం పరిగణించాల్సిన అవసరమున్నది. స్వరూపాలు మోసపూరితమైనవి మరియు తరచుగా ఒకరి ప్రవర్తన యొక్క ఖచ్చితమైన కొలతను అవి సూచించవు. మీవలె నా వలె కాకుండా, ఇవ్వబడిన ఒక పరిస్థితి యొక్క అన్ని కోణాలను క్రీస్తు స్పష్టంగా చూడగలరు.14 మన బలహీనతలన్నిటినీ ఆయన తెలుసుకున్నప్పటికీ రక్షకుడు మనల్ని కఠినంగా ఖండించరు, కానీ మన కంటి నుండి దూలము తొలగించడానికి మనకు సహాయం చేస్తూ, కాలక్రమేణా కనికరముతో మనతో పని చేస్తూనే ఉంటారు. యేసు ఎల్లప్పుడూ హృదయాన్ని చూస్తారు, కానీ పైరూపాన్ని కాదు.15 “వెలిచూపునుబట్టి తీర్పు తీర్చవద్దు”16 అని ఆయనే ప్రకటించారు.
ఇప్పుడు, ఈ ప్రశ్నకు సంబంధించి పన్నెండు మంది నీఫైయ శిష్యులకు రక్షకుడు ఇచ్చిన తెలివైన సలహాను పరిగణించండి:
“మరియు నేను మీకు ఇవ్వబోవు న్యాయమైన తీర్పును బట్టి, మీరు ఈ జనుల యొక్క న్యాయాధిపతులుగా ఉందురని మీరు ఎరుగుదురు. కావున, మీరు ఏ విధమైన మనుష్యులై యుండవలెను? నేను ఉన్నట్లుగానే అని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.”17
“కావున నేను లేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణులైయున్నట్లు మీరును పరిపూర్ణులు కావలెనని నేను కోరుచున్నాను.”18
ఈ సందర్భంలో, ఇతరుల లోపాలుగా భావించేవాటిని అన్యాయంగా తీర్పుతీర్చే అధికారాన్ని తమపై తీసుకున్న వారిపై ప్రభువు తన తీర్పును స్థిరపరుస్తారు. నీతివంతమైన తీర్పులు తీర్చడానికి మనల్ని మనం అర్హులుగా చేసుకోవడానికి, మనం రక్షకునిలా మారడానికి ప్రయత్నించాలి మరియు వ్యక్తుల లోపాలను కనికరముతో అనగా ఆయన కంటితో కూడా చూడాలి. పరిపూర్ణతను చేరుకోవడానికి మనం ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నదని పరిగణిస్తూ, ఇతరుల లోపాలను గుర్తించడానికి ఎక్కువ సమయాన్ని మరియు శక్తిని వెచ్చించకుండా, పరిసయ్యుని ఇంట్లో పశ్చాత్తాపపడిన స్త్రీ వలె మన స్వంత లోపాల గురించి మనం యేసు పాదాల వద్ద కూర్చుని, దయ కొరకు వేడుకొనుట మంచిది.
నా ప్రియమైన మిత్రులారా, రక్షకుని కరుణతో కూడిన ఉదాహరణను మన జీవితాలలో చేర్చడానికి మనము కృషి చేస్తున్నప్పుడు, మన పొరుగువారి సద్గుణాలను ప్రశంసించే సామర్థ్యం పెరుగుతుంది మరియు వారి లోపాలను నిర్ధారించే సహజ స్వభావం తగ్గుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. దేవునితో మన అనుబంధం పెరుగుతుంది, మరియు ఖచ్చితంగా మన జీవితాలు మధురంగా మారతాయి, మన భావాలు మరింత సున్నితంగా మారతాయి, మరియు మనం ఎన్నటికీ అంతముకాని ఆనందాన్ని కనుగొంటాము. సమాధానపరచువారు19 అని మనము పిలువబడతాము, వారి మాటలు వసంతకాల ఉదయపు మంచువలె మృదువుగా ఉంటాయి.
మనం ఇతరుల పట్ల మరింత దీర్ఘశాంతాన్ని, అవగాహనను కలిగి ఉండాలని మరియు ప్రభువు యొక్క కరుణ సంపూర్ణ సౌమ్యతతో, ఇతరుల లోపాలతో మన అసహనాన్ని తగ్గించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇది రక్షకుడు మనకు ఇచ్చిన ఆహ్వానము. ఆయన సజీవుడని నేను సాక్ష్యమిస్తున్నాను. దయగల మరియు సహనశీల శిష్యత్వానికి ఆయన పరిపూర్ణమైన నమూనా. ఈ సత్యముల గురించి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో నా సాక్ష్యమును ఇస్తున్నాను, ఆమేన్.