సర్వసభ్య సమావేశము
“వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?”
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


13:6

“వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?”

మీరు ప్రథమంగా ప్రభువును ప్రేమిస్తున్నారని చూపించడానికి మీ స్వంత జీవితంలో మీరు వేటిని చేయగలరు?

2019 నవంబరులో, నేను మరియు నా స్నేహితుడు పరిశుద్ధ దేశాన్ని సందర్శించాము. అక్కడ ఉన్నప్పుడు, మేము యేసు క్రీస్తు జీవితం గురించి లేఖనాలను సమీక్షించి, అధ్యయనం చేసాము. ఒక రోజు ఉదయం, మేము గలిలయ సముద్రం యొక్క వాయువ్య తీరంలో నిలబడ్డాము, అది యేసు తన పునరుత్థానం తరువాత తన శిష్యులను కలిసిన ప్రదేశమై ఉండవచ్చు.

యోహాను 21 అధ్యాయంలో మనం చదివినట్లుగా, యేసు పునరుత్థానమైన తరువాత పేతురు మరియు ఇతర శిష్యులు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించారు కానీ విజయవంతం కాలేదు.1 ఉదయకాలమందు, ఒడ్డున నిలబడి ఉన్న ఒక వ్యక్తిని వారు చూసారు, పడవ అవతలి వైపు తమ వల వేయమని ఆయన వారికి చెప్పారు. వారి ఆశ్చర్యపోయేలా వల అద్భుతంగా నిండిపోయింది.2

ఆ వ్యక్తి ప్రభువు అని వారు వెంటనే గుర్తించారు మరియు ఆయనను పలకరించడానికి వారు పరుగెత్తారు.

చేపలతో నిండియున్న వలను వారు దరికిలాగినప్పుడు, “రండి భోజనము చేయుడని”3 యేసు వారికి సెలవిచ్చారు. “వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” 4 అని అడిగెనని యోహను నివేదించును.

నేను అదే సముద్ర తీరంలో నిలబడి ఉన్నప్పుడు, రక్షకుడు అడిగిన ప్రశ్న ఏదో ఒక రోజు ఆయన నన్ను అడిగే ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి కావచ్చు అని నేను గ్రహించాను. “రస్సెల్, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” అని అడిగిన ఆయన స్వరాన్ని దాదాపు నేను వినగలిగాను.

యేసు పేతురును “వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” అని అడిగినప్పుడు యేసు దేని గురించి మాట్లాడుతున్నారో అని మీరు ఆశ్చర్యపోతున్నారా?

మన కాలంలో ఈ ప్రశ్నను మనకు అనువర్తింపజేస్తూ, మనం ఎంత తీరికలేకుండా ఉన్నామో, మన దృష్టి మరియు మన సమయం కోసం పోటీపడే అనేక సానుకూల, ప్రతికూల ప్రభావాల గురించి ప్రభువు మనల్ని అడగవచ్చు. ఈ ప్రపంచంలోని విషయాల కంటే మనం ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా అని ఆయన మనలో ప్రతి ఒక్కరినీ అడగవచ్చు. జీవితంలో మనం నిజంగా దేనికి విలువ ఇస్తామో, మనం ఎవరిని అనుసరిస్తామో, కుటుంబ సభ్యులు మరియు పొరుగువారితో మన సంబంధాలను ఎలా చూస్తామో అనే వాటి గురించి ఈ ప్రశ్న అయిఉండవచ్చు. లేదా ఏది మనకు నిజంగా ఆనందాన్ని, సంతోషాన్ని తెస్తుందో అని ఆయన అడుగుతూ ఉండవచ్చు.

ఈ ప్రపంచంలోని విషయాలు, రక్షకుడు తన శిష్యులకు ఇచ్చిన మరియు మనకు ఇవ్వాలనుకుంటున్న ఆనందం, సంతోషం మరియు శాంతిని మనకు ఇవ్వగలవా? మనము ఆయనను ప్రేమిస్తూ మరియు ఆయన బోధలను అనుసరించడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందం, సంతోషం మరియు శాంతిని ఆయన మనకు ఇవ్వగలరు.

“వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” అనే ప్రశ్నకు మనం ఏమి సమాధానమిస్తాము?

మనము ఈ ప్రశ్నకు పూర్తి అర్థాన్ని కనుగొన్నప్పుడు, మనం ఉత్తములైన కుటుంబ సభ్యులుగా, పొరుగువారిగా, పౌరులుగా, సంఘ సభ్యులుగా మరియు దేవుని కుమారులు, కుమార్తెలుగా మారగలము.

ఈ వయస్సులో, నేను అనేక అంత్యక్రియలకు హాజరయ్యాను. నేను గమనించిన వాటిని మీలో చాలామంది గమనించి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరణించిన కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడి జ్ఞాపకార్థ కూడికలో ప్రసంగించేవారు ఆ వ్యక్తి ఇంటి పరిమాణం, కార్ల సంఖ్య లేదా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు గురించి మాట్లాడుట అరుదు. వారు సాధారణంగా సోషల్ మీడియా పోస్టుల గురించి మాట్లాడరు. నేను పాల్గొనిన దాదాపు అన్ని అంత్యక్రియలలో, వారికి ప్రియమైనవారితో వారి సంబంధాలు, ఇతరులకు సేవ, జీవిత పాఠాలు, అనుభవాలు మరియు యేసు క్రీస్తు పట్ల వారి ప్రేమపై దృష్టి పెడతారు.

నన్ను అపార్థం చేసుకోవద్దు. మంచి ఇల్లు లేదా మంచి కారు ఉండటం తప్పు అని లేదా సోషల్ మీడియాను ఉపయోగించడం చెడ్డదని నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే, అన్నింటిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు, రక్షకుని ప్రేమించడంతో పోలిస్తే ఆ విషయాలు చాలా అల్పమైనవి.

మనం ఆయనను ప్రేమించి ఆయనను అనుసరించినప్పుడు, మనం ఆయనపై విశ్వాసం కలిగి ఉంటాము. మనం పశ్చాత్తాపపడతాము. ఆయన మాదిరిని అనుసరించి, బాప్తిస్మము తీసుకొని, పరిశుద్ధాత్మను పొందుతాము. మనం అంతము వరకు సహించి, నిబంధన మార్గంలో ఉంటాము. మనము కలిగి ఉన్న ద్వేషాలను వదిలి పెట్టడం ద్వారా కుటుంబ సభ్యులను మరియు పొరుగువారిని క్షమిస్తాము. దేవుని ఆజ్ఞలను పాటించడానికి మనము హృదయపూర్వకంగా ప్రయత్నిస్తాము. విధేయులై యుండటకు మనం ప్రయత్నిస్తాము. నిబంధనలను చేసుకొని, వాటిని మనం పాటిస్తాము. మనం మన తల్లిదండ్రులను సన్మానిస్తాము. ప్రతికూల ప్రాపంచిక ప్రభావాలను మనము పక్కన పెడతాము. ఆయన రెండవ రాక కోసం మనం సిద్ధపడతాము.

“జీవముతో ఉన్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము” లో మనం ఇలా చదువుతాము: “[యేసు] ఏదో ఒక రోజు భూమికి తిరిగి వచ్చను. … రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన పరిపాలించును మరియు ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయన యెదుట ఆరాధించి మాట్లాడును. మనలో ప్రతి ఒక్కరము మన క్రియలు మరియు మన హృదయ వాంఛలను బట్టి ఆయన చేత తీర్పు తీర్చబడుటకు నిలబడతాము.”5

“జీవముతో ఉన్న క్రీస్తు” పత్రంలో సంతకం చేసిన అపొస్తలులలో ఒకరిగా, యేసే “వెలుగు, జీవము మరియు ప్రపంచం యొక్క నిరీక్షణ”6 అని తెలుసుకోవడం, నాకు ప్రతిరోజూ ఆయనను ఎక్కువగా ప్రేమించాలనే గొప్ప కోరికను ఇస్తుందని నేను చెప్పగలను.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు సజీవులని నేను సాక్ష్యమిస్తున్నాను. వారు మనల్ని ప్రేమిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”7 అని లేఖనములు బోధిస్తున్నాయి. యేసు “లోకమును ఎంతగా ప్రేమించెననగా, నమ్మువారందరు దేవుని కుమారులగుటకు [మరియు కుమార్తెలగుటకు] తన ప్రాణమును అర్పించెను”8 అని కూడా లేఖనములు బోధిస్తున్నాయి.

పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించారు గనుక ఒక రక్షకుడిని ప్రధానమైన పాత్రధారిగా ఉంచి, తన రక్షణ ప్రణాళికను సిద్ధం చేసారు. యేసు మనల్ని ఎంతగానో ప్రేమించారు గనుక, పరలోకంలోని గొప్ప ఆలోచన సభలో పరలోక తండ్రి, “నేనెవరిని పంపవలెను?” అని అడిగినప్పుడు; తండ్రి యొక్క ఆత్మ పిల్లలందరిలో జ్యేష్ఠుడయిన యేసు, “నేనున్నాను, నన్ను పంపుము”9 అని సమాధానమిచ్చారు. “తండ్రీ, నీ చిత్తము నెరవేరును గాక, మహిమ ఎప్పటికీ నీకే కలుగును” 10 అని ఆయన తండ్రితో చెప్పారు. యేసు మన రక్షకునిగా మరియు విమోచకునిగా ఉండటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, తద్వారా మనం వారివలె మారి, వారి సన్నిధికి తిరిగి వెళ్ళగలము.

వారి సన్నిధికి తిరిగి వెళ్ళాలంటే మనం నమ్మాలి అని ఈ రెండు లేఖనాలు కూడా బోధిస్తున్నాయి. యేసును మరియు దేవుని సంతోషకరమైన ప్రణాళికను మనం నమ్మాలి. నమ్మడం అంటే, శ్రమలు మరియు కలహాల మధ్య కూడా మన రక్షకుడిని ప్రేమించి, అనుసరించడం మరియు ఆజ్ఞలను పాటించడం.

నేటి ప్రపంచం అస్థిరంగా ఉంది. నిరాశలు, విభేదాలు, బాధలు మరియు అంతరాయాలు ఉన్నాయి.

2017లో అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ మాట్లాడుతూ, ఈ క్రింది వాటిని గుర్తించారు: “గొప్ప ఆందోళనలతో నిండియున్న సవాలుతో కూడిన సమయాలివి: యుద్ధాలు మరియు యుద్ధాల గురించిన వదంతులు, మహమ్మారులు వచ్చుటకు అవకాశముగల అంటు వ్యాధులు, కరువులు, వరదలు మరియు భౌగోళిక ఉష్ణోగ్రత పెరగడం వంటివి.”11

మనం విపరీతమైన సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ, యేసుపై మన ప్రేమను మరియు నిరీక్షణను కోల్పోలేము. పరలోక తండ్రి మరియు యేసు మనల్ని ఎప్పటికీ మరచిపోరు. వారు మనల్ని ప్రేమిస్తున్నారు.

గత అక్టోబరులో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను బోధించారు. ఇశ్రాయేలు అనే పదానికి ఒక అర్థం “దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి”12 అని అధ్యక్షులు నెల్సన్ మనకు బోధించారు.

అధ్యక్షులు నెల్సన్ మనలో ప్రతి ఒక్కరిని ఈ ప్రశ్నలు అడిగారు: “మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? దేవునిని మీ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉండనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? ప్రతిరోజు మీరు చేసే దానిని ప్రభావితం చేయడానికి ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మరియు ఆయన నిబంధనలను మీరు అనుమతిస్తారా? ఇతర వాటికి పైగా ఆయన స్వరము ప్రాధాన్యత సంతరించుకొనేలా మీరు అనుమతిస్తారా? మీరు చేయాలని ఆయన కోరేదానిని మీ ఆశయాలన్నిటి కంటే అతిముఖ్యమైన దానిగా భావించడానికి మీరు సమ్మతిస్తున్నారా? మీ చిత్తము ఆయన చిత్తమందు ఉపసంహరించబడడానికి మీరు సమ్మతిస్తున్నారా?” 13

మన నిజమైన సంతోషం దేవునితో, యేసు క్రీస్తుతో మరియు ఒకరితో ఒకరు కలిగియున్న సంబంధంపై ఆధారపడి ఉంటుందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

మన ప్రేమను ప్రదర్శించడానికి ఒక మార్గం ఏమిటంటే, ఒకరికొకరు బాగా సేవ చేయడానికి కొన్ని చిన్న చిన్న పనులు చేయడంలో కుటుంబం, స్నేహితులు మరియు పొరుగువారితో చేరడం. ఈ ప్రపంచాన్ని శ్రేష్ఠమైన ప్రదేశంగా మార్చే పనులు చేయండి.

మీరు ప్రథమంగా ప్రభువును ప్రేమిస్తున్నారని చూపించడానికి మీ స్వంత జీవితంలో మీరు వేటిని చేయగలరు?

ఆయన వారిని ప్రేమించినట్లుగా మనం కూడా పొరుగువారిని ప్రేమించడంపై దృష్టి పెట్టినప్పుడు, మన చుట్టూ ఉన్నవారిని మనం నిజంగా ప్రేమించడం ప్రారంభిస్తాము.14

నేను మరలా అడుగుతున్నాను, “వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” అనే రక్షకుని ప్రశ్నకు మీరు ఎలా స్పందిస్తారు?

ఈ ప్రశ్నను నేను పరిగణించినట్లుగా మీరు పరిగణించినప్పుడు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు ”15 అని చాలా కాలం క్రితం పేతురు చెప్పినట్లుగా మీరు సమాధానం చెప్పవచ్చని నేను ప్రార్థిస్తున్నాను.

మనం జీవిస్తున్న విధానమును మరియు మనందరం పరస్పరం ఆదరించుకోవడంలో మనల్ని నడిపించడానికి యేసు క్రీస్తు సువార్తను కలిగి ఉండటానికి మనము దీవించబడ్డామని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనలో, దేవుని యొక్క ప్రతి కుమార్తె మరియు కుమారుడు ఆయనకు చాలా విలువైనవారని మనము కనుగొంటాము.

యేసు క్రీస్తు మన రక్షకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఈ సాక్ష్యాన్ని నేను వినయముగా యేసు క్రీస్తు నామములో ఇస్తున్నాను, ఆమేన్.