సరళముగా అందమైనది—అందంగా సరళమైనది
దైవికంగా నియమించబడిన మన బాధ్యతలను మనపై తీసుకున్నప్పుడు మనం సువార్తను సరళంగా ఉంచుదాం.
పరిచయము
ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రతిఒక్కరికి స్వాగతం పలుకుతున్నాను.
ఈ రోజు నేను యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క రెండు అంశాలను, తరువాత ఈ సూత్రాల అన్వయాన్ని నిరూపించేలా ప్రపంచవ్యాప్త కడవరి దిన పరిశుద్ధుల నుండి నాలుగు ప్రేరేపించు వృత్తాంతాలను వివరించాలని ఆశిస్తున్నాను. పునఃస్థాపించబడిన సువార్త యొక్క మొదటి అంశము—రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యము—దైవికంగా నియమించబడిన బాధ్యతలపై కేంద్రీకరిస్తుంది. రెండవ అంశము సువార్త స్పష్టమైనది, అమూల్యమైనది మరియు సరళమైనదని మనకు గుర్తుచేస్తుంది.
దైవికంగా నియమించబడిన బాధ్యతలు
నిత్యజీవాన్ని పొందడానికి మనము తప్పక “క్రీస్తు నొద్దకు వచ్చి, ఆయనలో పరిపూర్ణులం కావాలి.”1 మనం క్రీస్తు నొద్దకు వచ్చి, ఇతరులు కూడా రావడానికి సహాయం చేసినప్పుడు, మనం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యములో పాలుపంచుకుంటాము, అది దైవికంగా నియమించబడిన బాధ్యతలపై కేంద్రీకరిస్తుంది.2 ఈ దైవిక బాధ్యతలు సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 110వ ప్రకరణము లో నమోదు చేయబడినట్లుగా మోషే, ఎలియాసు మరియు ఏలియా చేత పునఃస్థాపించబడిన యాజకత్వపు తాళపుచెవులతో 3 మరియు మన పొరుగువారిని మనవలె ప్రేమించాలని యేసు క్రీస్తు చేత మనకివ్వబడిన రెండవ గొప్ప ఆజ్ఞతో వాటినవి కలుపుకుంటాయి.4 అవి సవరించబడిన ప్రధాన చేతిపుస్తకం యొక్క మొదటి రెండు పేజీలలో కనుగొనబడతాయి, సభ్యులందరికి లభ్యమవుతాయి.
“ప్రధాన చేతిపుస్తకం” లేదా “దైవికంగా నియమించబడిన బాధ్యతలు” అనే మాటలు వినడం సంక్లిష్టతతో లేదా మెలిపెట్టినట్లు మీకు భయం కలిగించినట్లయితే, దయచేసి భయపడకండి. ఈ బాధ్యతలు సరళమైనవి, ప్రేరేపితమైనవి, ప్రోత్సాహకరమైనవి మరియు నిర్వర్తించదగినవి. అవి ఏమనగా:
-
యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుట
-
అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట
-
సువార్తను పొందడానికి అందరిని ఆహ్వానించుట
-
నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయుట
మన ప్రియమైన పరలోక తండ్రి దగ్గరకు తిరిగివెళ్ళడానికి దారిచూపే పటంలా నేను చేస్తున్నప్పుడు మీరు వాటిని చూడవచ్చు.
సువార్త స్పష్టమైనది, అమూల్యమైనది మరియు సరళమైనది
యేసు క్రీస్తు యొక్క సువార్త “సరళముగా అందమైనది మరియు అందంగా సరళమైనది” అని చెప్పబడింది.5 ప్రపంచం అలా కాదు. అది క్లిష్టమైనది, అస్పష్టమైనది మరియు గందరగోళంతో, కలహంతో నింపబడియుంది. ప్రపంచంలో అతిసామాన్యంగా ఉన్న సంక్లిష్టత మనం సువార్తను స్వీకరించి, అభ్యసించే మార్గంలోకి ప్రవేశించకుండా ఉండేలా మనం జాగ్రత్త వహించినప్పుడు, మనం దీవించబడతాము.
అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా గమనించారు: “మనము యేసు క్రీస్తు యొక్క సువార్తలో అనేక చిన్న మరియు సాధారణమైన విషయాలు బోధించబడ్డాము. సుదీర్ఘకాలము కలపబడినప్పుడు చిన్నవిగా కనబడే విషయాలు గొప్ప క్రియలను జరిగించునని మనము జ్ఞాపకము చేయబడాలి.”6 ఆయన కాడి సులువైనదని, ఆయన భారము తేలికైనదని యేసు క్రీస్తు తనకుతానే వివరిస్తారు.7 సువార్తను—మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన తరగతుల్లో, సమూహాల్లో మరియు మన వార్డులలో, స్టేకులలో సరళముగా ఉంచడానికి మనమందరము ప్రయత్నించాలి.
నేను మీతో పంచుకొనే ఈ కథలను మీరు వినినప్పుడు, ఒకవిధంగా ప్రేరేపించడానికి, మరొక విధంగా తెలియజేయడానికి అవి శ్రద్ధగా ఎంపిక చేయబడ్డాయని గుర్తించండి. ఈ కడవరి దిన పరిశుద్ధులలో ప్రతిఒక్కరి చర్యలు అప్పుడే పరిచయం చేయబడిన దైవికంగా నియమించబడిన బాధ్యతలలో ఒకదానిని నేరవేరుస్తూ, సువార్తను స్పష్టమైన, అమూల్యమైన, సరళమైన విధాలుగా అన్వయిస్తూ మనలో ప్రతిఒక్కరి కొరకు మాదిరి అవుతాయి.
యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుట
మొదటిది, యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుట డెన్మార్క్‌కు చెందిన జెన్స్ సువార్తను జీవించడానికి మరియు పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణలను గమనించడానికి ప్రతిరోజు ప్రార్థిస్తాడు. ఆత్మ చేత నిర్దేశించబడినట్లు అతడు భావించినప్పుడు, వెంటనే చర్య తీసుకోవడాన్ని అతడు నేర్చుకున్నాడు.
జెన్స్ ఈ విధంగా పంచుకున్నాడు:
“గ్రామ కొలనుకు దగ్గరలో, సౌకర్యవంతమైన చిన్న గ్రామము మధ్యలో సగం చెక్కలతో, సగం ఇటుకలతో కట్టబడి, ఆకులతో పైకప్పు వేయబడిన ఒక ప్రత్యేకమైన చిన్న ఇంటిలో మేము నివసించేవారము.
“ఊహించదగినంత అందమైన డానిష్ వేసవికాలంలో ఈ రాత్రి తలుపులు మరియు కిటికీలు తెరిచియుంచబడి, అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. బాగా ప్రకాశవంతమైన, సుదీర్ఘ వేసవి రాత్రుల కారణంగా మా వాడుకగదిలో మాడిపోయిన బల్బును మార్చడానికి నేను త్వరపడలేదు.
“అకస్మాత్తుగా దానిని వెంటనే మార్చాలని నాకు బలమైన భావన కలిగింది! అదే సమయంలో, భోజనం తయారుగా ఉందని, చేతులు కడుక్కొని రమ్మని నా భార్య మారియన్ నన్ను మరియు పిల్లల్ని పిలవడం విన్నాను!
“నాకు వివాహమై చాలా కాలమైనందున, ఈ సమయంలో చేతులు కడుక్కోవడం తప్ప మరే పని చేయవద్దని నాకు తెలుసు, కానీ నాకైనేను ఇప్పుడే దుకాణానికి వెళ్ళి క్రొత్త బల్బును తీసుకువస్తానని మారియన్‌తో చెప్పడాన్ని నేను విన్నాను. వెంటనే వెళ్ళాలని నేను బలంగా భావించాను.
“సరుకుల దుకాణం కొలనుకు అవతలి వైపు ఉంది. మామూలుగా మేము నడిచివెళ్తాము, కానీ ఈ రోజు నేను నా బండి తీసుకున్నాను. కొలనును దాటి వెళ్తున్నప్పుడు, సుమారు రెండేళ్ళ చిన్నపిల్లాడు కొలను అంచులకు దగ్గరలో, నీటికి చాలా దగ్గరగా ఒంటరిగా నడవడం నా దృష్టిలో పడింది—అకస్మాత్తుగా అతను నీటిలో పడిపోయాడు! ఒక్క నిముషం అతనక్కడ ఉన్నాడు—అకస్మాత్తుగా అతడు పడిపోయాడు!
“ఇది జరగడం నేను తప్ప ఎవరూ చూడలేదు. నేను బండిని నేలమీద పడేసి, పరిగెత్తుకొని వెళ్ళి, నడుము లోతున్న కొలనులోకి దూకాను. నీటి ఉపరితలం వెంటనే నీటిమొక్కలతో మూసివేయబడి, నీటిలోపల చూడడాన్ని అసాధ్యం చేసింది. అప్పుడు ఒకవైపు కదలికను నేను గమనించాను. నా చేతిని నీటిలో పెట్టి, చొక్కా పట్టుకొని, ఆ చిన్నపిల్లాడిని నేను పైకి లాగాను. అతడు దగ్గుతూ, ఏడుస్తూ, వేగంగా ఊపిరి పీల్చడం మొదలుపెట్టాడు. తర్వాత వెంటనే అతడు తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు.”
వెంటనే బల్బును మార్చాలనే అసాధారణమైన ప్రేరణలా పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణలను గుర్తించడంలో సహాయం కోసం సహోదరుడు జెన్స్ ప్రతి ఉదయం ప్రార్థించినట్లే, దేవుని పిల్లలను దీవించడంలో తాను ఒక సాధనంగా ఉపయోగించబడాలని కూడా అతడు ప్రార్థిస్తాడు. ప్రతిరోజు దైవిక నడిపింపును వెదుకుతూ, యోగ్యునిగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ఆ తరువాత ఆ నడిపింపు వచ్చినప్పుడు దానిని అనుసరించడానికి తనకు చేతనైనంత చేస్తూ జెన్స్ సువార్తను జీవిస్తాడు.
అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట
అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుటకు ఇది ఒక మాదిరి. ఒకరోజు కొలంబియాలోని కుకుటా స్టేకులో ఒక స్టేకు అధ్యక్షుడు భయంకరమైన కష్టాలు పడుతున్న ఇద్దరు యువతులను మరియు యుక్తవయస్కుడైన వారి అన్నయ్యను కలుసుకోవడానికి స్టేకు యువతుల అధ్యక్షురాలితో కలిసి వెళ్ళారు. ఇటీవల వారి తండ్రి మరణించారు మరియు ఒక సంవత్సరం క్రితం వారి తల్లి మరణించింది. ఈ ముగ్గురు తోబుట్టువులు ఒక చిన్న ఇంటిలో ఒంటరిగా మిగిలారు. ఆ ఇంటి గోడలు కర్రలు, ప్లాస్టిక్ సంచులతో చేయబడి, ముడతలు పడ్డ తగరంతో ఉన్న పైకప్పు కేవలం వారు నిద్రించే స్థలాన్ని కప్పియుంది.
తమ సందర్శన తర్వాత, తాము సహాయపడాలని ఈ నాయకులు తెలుసుకున్నారు. వార్డు సలహామండలి ద్వారా వారికి సహాయపడేందుకు ఒక ప్రణాళిక రూపొందించబడింది. వార్డు మరియు స్టేకు నాయకులు—ఉపశమన సమాజము, పెద్దల సమూహము, యువకులు, యువతులు—మరియు అనేక కుటుంబాలు ఈ కుటుంబాన్ని దీవించే పనిలో నిబద్ధులైయున్నారు.
భవన నిర్మాణంలో పనిచేసే అనేకమంది వార్డు సభ్యులను వార్డు నిర్మాణాలు సంప్రదించాయి. కొందరు రూపకల్పనలో సహాయపడ్డారు, ఇతరులు సమయాన్ని, శ్రమను అర్పించారు, మరికొందరు భోజనం తయారుచేసారు, ఇంకా కొందరు అవసరమైన సామాగ్రిని ఇచ్చారు.
ఆ చిన్న ఇల్లు పూర్తయినప్పుడు, సహాయం చేసిన వారికి మరియు వార్డులోని ఆ ముగ్గురు యువ సభ్యులకు అది ఆనందకరమైన రోజు. ఈ అనాథ పిల్లలు తమ వార్డు కుటుంబముతో వెచ్చని, అభయమిచ్చు బంధాలను భావించారు. వారు ఒంటరివారు కాదని, దేవుడు ఎల్లప్పుడూ వారితో ఉన్నారని తెలుసుకున్నారు. వారికి సహాయపడిన వారు ఈ కుటుంబం కొరకు రక్షకుని ప్రేమను అనుభవించారు మరియు వారికి సేవ చేయడంలో రక్షకుని స్థానం తీసుకున్నారు.
సువార్తను పొందడానికి అందరిని ఆహ్వానించుట
సువార్తను పొందడానికి అందరిని ఆహ్వానించుట యొక్క ఈ మాదిరిని మీరు ఆనందిస్తారని నేననుకుంటున్నాను. ఒకరోజు తన వార్డు సెమినరీ తరగతిలో అడుగుపెట్టిన ఫలితంగా ఏమి జరుగుతుందో అనేది కేప్ వెర్డెకు చెందిన పదిహేడేళ్ళ క్లెటన్‌కు తెలియదు. కానీ అతనలా చేసినందుకు అతని జీవితం మరియు ఇతరుల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి.
తన తల్లి మరియు అన్నయ్యతో పాటు క్లెటన్ కొంతకాలం క్రితం సంఘములో బాప్తిస్మము తీసుకున్నాడు. అయినప్పటికీ ఆ కుటుంబము హాజరు కావడం మానివేసారు. సెమినరీకి హాజరు కావడమనే అతని ఏకైక చర్య ఆ కుటుంబంలో గొప్ప మార్పును తెచ్చేదిగా నిరూపించబడింది.
సెమినరీ తరగతిలో మిగిలిన యువత మంచిగా స్వాగతించారు. క్లెటన్ సౌకర్యవంతంగా భావించేలా వారు చేసారు మరియు మరొక ప్రోత్సాహ కార్యక్రమానికి హాజరుకమ్మని అతడిని ప్రోత్సహించారు. అతడు హాజరయ్యాడు మరియు త్వరలోనే అతడు ఇతర సంఘ సమావేశాలకు హాజరు కావడం ప్రారంభించాడు. తెలివిగల ఒక బిషప్పు క్లెటన్‌లోని ఆత్మీయ సామర్థ్యాన్ని చూసి, తన సహాయకునిగా ఉండేందుకు అతడిని ఆహ్వానించాడు. “ఆ క్షణం నుండి క్లెటన్ ఇతర యౌవనులకు ఒక మాదిరిగా, మంచి ప్రభావంగా మారాడని” బిషప్పు క్రూజ్ చెప్తారు.
మొదట తన తల్లిని, ఆ తర్వాత తన అన్నయ్యను తిరిగి సంఘానికి ఆహ్వానించాడు క్లెటన్. ఆ తర్వాత అతడు తన స్నేహితుల పరిధిని విస్తరించాడు. ఆ స్నేహితులలో ఒకరు అతని వయస్సున్న యువకుడు విల్సన్. అతడు మొదటిసారి సువార్తికులను కలిసినప్పుడు, బాప్తిస్మము పొందాలనే తన కోరికను విల్సన్ వ్యక్తం చేసాడు. విల్సన్‌తో అప్పటికే క్లెటన్ పంచుకొనిన దానిని బట్టి సువార్తికులు ఆశ్చర్యపడ్డారు.
క్లెటన్ ప్రయత్నాలు అంతటితో ఆగిపోలేదు. ఇతర విశ్వాసాలకు చెందిన స్నేహితులతో సువార్తను పంచుకోవడంతో పాటు తక్కువ క్రియాశీలక సభ్యులు తిరిగి రావడానికి కూడా అతడు సహాయపడ్డాడు. నేడు వృద్ధిచెందుతున్న సెమినరీ కార్యక్రమంతో వార్డులో 35 మంది క్రియాశీలక యౌవనులున్నారు. ప్రేమించడానికి, పంచుకోవడానికి మరియు ఆహ్వానించడానికి క్లెటన్ చేసిన ప్రయత్నాలకు అధిక ధన్యవాదాలు తెలపాలి. క్లెటన్ మరియు అతని అన్నయ్య క్లిబర్ ఇద్దరు పూర్తి కాల సువార్త పరిచర్య చేయడానికి సిద్ధపడుతున్నారు.
నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయుట
చివరిగా, నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయుటకు ఒక అందమైన ఉదాహరణను మీతో పంచుకుంటాను. ఉక్రెయిన్‌లోని కార్కివ్‌కు చెందిన లిడియా మొదటిసారి దేవాలయం గురించి సువార్తికుల నుండి తెలుసుకుంది. వెంటనే దేవాలయానికి హాజరు కావాలని లిడియా తీక్షణంగా కోరుకుంది మరియు తన బాప్తిస్మము తర్వాత, దేవాలయ సిఫారసును పొందడానికి ఆమె సిద్ధమవడం ప్రారంభించింది.
తన వరమును పొందడానికి లిడియా ఫ్రీబర్గ్ జర్మనీ దేవాలయానికి హాజరైంది మరియు తర్వాత అక్కడ ప్రాతినిధ్య కార్యము చేస్తూ చాలా రోజులు గడిపింది. క్యవ్ ఉక్రెయిన్ దేవాలయం ప్రతిష్ఠించబడిన తర్వాత లిడియా చాలా తరచుగా దేవాలయానికి హాజరైంది. ఆమె, ఆమె భర్త అనాటోలి అక్కడ నిత్యత్వము కొరకు ముద్రించబడ్డారు, ఆ తర్వాత దేవాలయ సువార్తికులుగా సేవచేయడానికి పిలువబడ్డారు. వారిద్దరూ కలిసి 15,000ల కంటే ఎక్కువమంది పూర్వీకుల పేర్లు కనుగొని, వారికి దేవాలయ విధులను అందించడానికి పనిచేసారు.
దేవాలయ కార్యానికి సంబంధించి ఆమె భావాల గురించి అడిగినప్పుడు, లిడియా ఇలా చెప్తుంది, “నేను దేవాలయంలో ఏమి పొందాను? నేను దేవునితో నూతన నిబంధనలు చేసాను. నా సాక్ష్యము బలపరచబడింది. నేను వ్యక్తిగత బయల్పాటును పొందడం నేర్చుకున్నాను. మరణించిన నా పూర్వీకుల కొరకు నేను రక్షణ విధులను నిర్వహించగలుగుతున్నాను. నేను ఇతరులను ప్రేమించి, సేవ చేయగలను.” “దేవాలయంలో మనల్ని తరచు చూడాలని ప్రభువు కోరుతున్నారు” అనే నిజమైన వ్యాఖ్యానంతో ఆమె ముగిస్తుంది.
ముగింపు
ఈ నాలుగు కథలలో కేంద్రీకరించబడిన భిన్నమైన మరియు వేర్వేరు నేపథ్యాలు గల ఈ కడవరి దిన పరిశుద్ధులలో ప్రతిఒక్కరి మంచితనం చేత నేను ప్రేరేపించబడ్డాను. సరళమైన సువార్త సూత్రాలను అన్వయించడం ద్వారా వచ్చిన అద్భుతమైన ఫలితాల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. వారు చేసినదంతా మన చేతిలో కూడా ఉంది.
యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడానికి, డెన్మార్క్‌కు చెందిన జెన్స్ చేసినట్లు ప్రేరేపణల పట్ల స్పందించడానికి దైవికంగా నియమించబడిన మన బాధ్యతలను మనపై తీసుకున్నప్పుడు మనం సువార్తను సరళంగా ఉంచుదాం. అనాథలైన వార్డు సభ్యులకు నివాసస్థలాన్ని ఏర్పాటు చేయడంలో కొలంబియాలోని కుకుటా స్టేకు సభ్యుల చేత చేసి చూపబడినట్లుగా అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధ చూపుదాం. ఆఫ్రికన్ ద్వీప దేశమైన కేప్ వెర్డెకు చెందిన క్లెటన్ తన స్నేహితులు మరియు కుటుంబంతో చేసిన విధంగా సువార్తను పొందడానికి అందరినీ ఆహ్వానిద్దాం. చివరగా, తన స్వంత దేవాలయ విధులు, కుటుంబ చరిత్ర ప్రయత్నాలు మరియు దేవాలయంలో సేవ ద్వారా ఉక్రెయిన్‌కు చెందిన సహోదరి లిడియా చేత చూపబడినట్లుగా నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేద్దాం.
అలా చేయడం ఖచ్చితంగా ఆనందాన్ని, శాంతిని తెస్తుంది. దీనిని గూర్చి—మరియు మన రక్షకునిగా, మన విమోచకునిగా యేసు క్రీస్తును గూర్చి—యేసు క్రీస్తు నామములో నేను వాగ్దానమిస్తున్నాను మరియు సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.