యేసు క్రీస్తు సువార్త యొక్క అద్భుతాలు
ఆయన సువార్త మనకు నిరీక్షణను, శాంతిని మరియు సంతోషమును తెస్తుందని, ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తు తరములలో కూడా లెక్కలేనంత మందిని దీవిస్తుందని నేనెరుగుదును.
మబుహే! ఫిలిప్పీన్స్ యొక్క అద్భుతమైన సభ్యుల నుండి ప్రేమను మరియు అప్యాయమైన చిరునవ్వులను నేను మీకు తెస్తున్నాను. ఫిలిప్పీన్స్ యొక్క ద్వీపాలలో మొదటి సువార్తికులు వచ్చి ఈ సంవత్సరముతో 60 సంవత్సరాలు పూర్తవుతుంది. నేడు 23 మిషన్లు మరియు 123 స్టేకులలో 800,000 పైగా సభ్యులున్నారు. ఇప్పుడు పని చేస్తున్న, నిర్మాణములో ఉన్న లేక ప్రకటించబడిన ఏడు దేవాలయాలున్నాయి. ఇది నిజంగా ఒక అద్భుతము. 2 నీఫై 10:21లో ప్రవచించబడిన ప్రవచనము యొక్క నెరవేర్పును మనము ప్రత్యక్షంగా చూస్తున్నాము: “సముద్రము యొక్క ద్వీపముల పైన ఉన్నవారికి ప్రభువు యొక్క వాగ్దానములు గొప్పవి.”
ఈ ప్రార్థన 1961 మనీలాలో ఎల్డర్ గార్డన్ బి. హింక్లీ చేసిన ప్రార్థనలోని ప్రవచనము యొక్క నెరవేర్పు కూడా. ఆ ప్రార్థనలో ఎల్డర్ హింక్లీ ఇలా వ్యాఖ్యానించారు: “ఇక్కడకు వచ్చు వారితో వారు స్నేహపూర్వకంగా, ఆతిథ్యమిచ్చి, దయ, కనికరము కలిగియుండాలని, మీ దీవెనలు ఈ దేశ ప్రజలపైకి రావాలని అర్థిస్తున్నాము. అవును, ప్రభువా, ఇక్కడ [అనేకమంది,] అనేక వేలమంది ఈ సందేశమును పొందాలని, తద్వార దీవించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. గ్రహించే మనస్సులు మరియు జ్ఞానముగల హృదయాలతో మరియు అంగీకరించే విశ్వాసముతో మరియు సువార్త సూత్రములను దీవించుటకు ధైర్యముతో మీరు వారిని దీవించండి“ (at American War Memorial Cemetery, Philippines, Apr. 28, 1961).
వేలకువేలమంది కడవరి దిన పరిశుద్ధులకు మాత్రమే కాదు, ఆే దేశము మరియు దాని ప్రజలకు సువార్త యొక్క అద్భుతము సానుకూలమైన మార్పులను తెచ్చింది. దీనికి నేను సజీవమైన సాక్షిని. మిండానో యొక్క దక్షిణ ద్వీపములోని సంఘములో నా తల్లిదండ్రులు చేరినప్పుడు నేను ఆరు సంవత్సరాల వాడిని. ఆ సమయంలో, దేశమంతటిలో ఒకే ఒక మిషను ఉండి, ఏ స్టేకులు లేవు. రక్షకుని అనుసరించడానికి నా తల్లిదండ్రుల ధైర్యము మరియు నిబద్ధత కొరకు నేను శాశ్వతంగా కృతజ్ఞత కలిగియున్నాను. నేను వారిని మరియు ఫిలిప్పీన్స్‌లో సంఘ అగ్రగాములందరినీ గౌరవిస్తున్నాను. రాబోయే తరములు దీవించబడుటకు వారు మార్గమును సిద్ధపరిచారు.
మోర్మన్ గ్రంథములో రాజైన బెంజమిన్ ఇలా వ్యాఖ్యానించారు: “ఇంకను, దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా, ఇదిగో, వారు ఐహికమైన మరియు ఆత్మ సంబంధమైన రెండింటి యందు అన్ని వస్తువులలో ఆశీర్వదింపబడి యున్నారు” (మోషైయ 2:41).
సువార్త యొక్క నియమముులు మరియు విధులను మనము జీవించి వాటిని గైకొనినప్పుడు మనము దీవించబడతాము, పరివర్తన చెందుతాము మరియు యేసు క్రీస్తు వలె ఎక్కువగా మారటానికి మార్పు చెందుతాము. నా కుటుంబముతో కలిపి ఫిలిప్పినో పరిశుద్ధులను సువార్త ఆవిధంగా మార్చింది మరియు దీవించింది. సువార్త నిజంగా సంతోషకరమైన, సమృద్ధియైన జీవితానికి మార్గము.
ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము యేసు క్రీస్తు యొక్క సువార్తలో మొదటి నియమము. అనేకమంది ఫిలిప్పినోలు దేవునియందు సహజమైన నమ్మకాన్ని కలిగియున్నారు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట మాకు సులభమైనది మరియు మన ప్రార్థనలకు జవాబులను మనము పొందగలమని ఎరిగియున్నాము.
దీనికి ఒబెడోజా కుటుంబము ఒక గొప్ప మాదిరి. నేను యువకునిగా ఉన్నప్పుడు సహోదరుడు ఒబెడోజా నా శాఖాధ్యక్షుడిగా ఉన్నారు. సహోదరి మరియు సహోదరుడు ఒబెడోజా యొక్క గొప్ప కోరిక మనీలా దేవాలయములో వారి కుటుంబముతో ముద్రవేయబడుట. వారు మనీలా నుండి, 1,000 మైళ్ల (1,600 కి.మీ) దూరంలో జనరల్ శాంటోస్ నగరంలో నివసించారు. తొమ్మిదిమంది గల కుటుంబము కొరకు, దేవాలయానికి ప్రయాణం చేయడం అసాధ్యమైనదిగా కనబడింది. కానీ అమూల్యమైన ముత్యము కొనడానికి వెళ్ళి అతడు తనకు కలిగిన సమస్తమును అమ్మిన వ్యాపారస్తుని వలె, (మత్తయి 13:45–46 చూడండి), ఈ దంపతులు ప్రయాణము కొరకు చెల్లించడానికి వారి ఇంటిని అమ్మడానికి నిర్ణయించుకున్నారు. తిరిగి వచ్చాక వారికి ఇక ఇల్లు ఉండదని సహోదరి ఒబేడోజా అందోళన చెందింది. ప్రభువు దయచేస్తాడని సహోదరుడు ఒబేడోజా ఆమెకు హామీ ఇచ్చారు.
వారు దేవాలయములో ఈ లోకము మరియు నిత్యత్వమంతటి కొరకు ఒక కుటుంబంగా ముద్రవేయబడ్డారు. దేవాలయములో వారు అసమానమైన ఆనందాన్ని—వారి అమూల్యమైన ముత్యమును కనుగొన్నారు. సహోదరుడు ఒబేడోజా మాటలు నిజం చేస్తూ ప్రభువు వారికి సమకూర్చారు. మనీలా నుండి వారు తిరిగి వచ్చాక, నివసించడానికి పరిచయస్తులు వారికి స్థలములు ఇచ్చారు మరియు చివరకు వారు తమ స్వంత ఇంటిని సంపాదించుకున్నారు. ఆయనయందు తమ విశ్వాసమును రుజువు చేసే వారిపట్ల ప్రభువు శ్రద్ధ వహిస్తారు.
రెండవ సువార్త సూత్రము, పశ్చాత్తాపము. పశ్చాత్తాపమనగా పాపము నుండి మరలిపోయి క్షమాపణ కోసం దేవుని వైపు తిరుగుట. అది మనస్సు మరియు హృదయము యొక్క బలమైన మార్పు. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, “ప్రతిరోజు కాస్త మెరుగ్గా ఉండుట మరియు చేయుట” (“We Can Do Better and Be Better” Liahona, మే 2019, 67).
పశ్చాత్తాపము ఎక్కువగా సబ్బును పోలి ఉన్నది. యువ రసాయన ఇంజనీరుగా, నేను ఫిలిప్పైన్స్‌లో ఒక సబ్బు ఫ్యాక్టరీలో పనిచేసాను. సబ్బు ఎలా తయారు చేయాలి మరియు అది పని చేసే ప్రక్రియను నేను నేర్చుకున్నాను. క్షారముతో నూనెను మిళితం చేసి, బాక్టీరియా సంహారక కారకాలను మీరు కలిపినప్పుడు, అది బ్యాక్టీరియా మరియు వైరస్‌లను తొలగించగల శక్తివంతమైన పదార్థాన్ని సృష్టిస్తుంది. సబ్బువలె పశ్చాత్తాపము, శుద్ధి చేసే కారకము. అది మన మలినాలను, మన పాత చెత్తను తొలగించడానికి అవకాశాన్ని మనకిస్తుంది, ఆవిధంగా మనము దేవునితో జీవించడానికి యోగ్యలై ఉంటాము, “అపరిశుద్ధమైనదేదియు [దేవుని] రాజ్యమును స్వతంత్రించుకోలేదు” (ఆల్మా11:37 ).
పశ్చాత్తాపము ద్వారా మనము యేసు క్రీస్తు యొక్క శుద్ధి చేసే, పరిశుద్ధపరచే శక్తిని ఉపయోగిస్తాము. అది యేసు క్రీస్తు యొక్క సువార్తలో భాగము. మోర్మన్ గ్రంథములో ఆంటై-నీఫై-లీహైయులుకు ఇదే జరిగింది. వారు చాలా సంపూర్ణంగా మార్పు చెందిన లేమనీయులు వారు “ఎన్నడును పడిపోలేదు” (ఆల్మా 23:6–8 చూడండి). వారు తమ యుద్ధ అయుధాలను సమాధి చేసారు మరియు వాటిని ఎన్నడూ తీసుకోలేదు. వారు ఆ నిబంధననుల ఉల్లంఘించడం కంటె మరణించడానికి ఇష్టపడతారు. మరియు వారు దానిని రుజువు చేసారు. వారి త్యాగము అద్భుతాలను తెచ్చింది, వారికి వ్యతిరేకంగా పోరాడిన వేలమంది వారు ఆయుధాలను పడవేసి, పరివర్తన చెందారు. సంవత్సరాల తరువాత బలమైన యౌవన యోధులుగా మనకు తెలిసినట్లుగా, వారి కుమారులు విజయము పొందలేరని ఊహించిన దానికి వ్యతిరేకంగా కాపాడబడ్డారు.
నా కుటుంబము మరియు అనేక ఫిలిప్పినో పరిశుద్ధులు అదేవిధమైన పరివర్తన ప్రక్రియను ఎదుర్కొన్నారు. యేసు క్రీస్తు యొక్క సువార్తను మేము అంగీకరించి, సంఘములో చేరినప్పుడు, సువార్తకు అనుగుణంగా మా విధానాలు మరియు మా సంస్కృతిని మార్చుకున్నాము. మా తప్పుడు సంప్రదాయాలను మేము విడిచిపెట్టవలసి వచ్చింది. మా నాన్న సువార్తను తెలుసుకొని, పశ్చాత్తాపపడినప్పుడు నేను దీనిని ఆయనలో చూసాను. ఆయన ధూమపానం అతిగా చేసేవాడు, కానీ ఆయన తన సిగరెట్లను పారవేసి, మరొకసారి ఎన్నడూ వాటిని తాకలేదు. మారాలనే ఆయన నిర్ణయము వలన, అతని తరువాత నాలుగు తరములు దీవించబడ్డాయి.
పరిశుద్ధ విధుల ద్వారా నిబంధనలు చేసి పాటించడానికి పశ్చాత్తాపము మనల్ని నడిపిస్తుంది. పాపముల పరిహారము నిమిత్తము ముంచడం ద్వారా బాప్తీస్మము రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క మొదటి విధి. బాప్తీస్మము పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందడానికి మరియు ప్రభువుతో నిబంధనలో ప్రవేశించడానికి మనల్ని అనుమతిస్తుంది. మనము సంస్కారము తీసుకొన్నప్పుడు ప్రతీవారము మనము ఈ బాప్తీస్మపు నిబంధనను క్రొత్తదిగా చేసుకుంటాము. ఇది కూడా ఒక అద్భుతమే!
సహోదర సహోదరీలారా, ఈ అద్భుతాన్ని మీ జీవితంలోనికి తీసుకురమ్మని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు యొద్దకు రండి మరియు ఆయన యందు మీ విశ్వాసాన్ని సాధన చేయండి; పశ్చాత్తాపపడి, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులందు కనుగొనబడిన నిబంధనలను చేసి, వాటిని పాటించండి. అది మీరు క్రీస్తుతో కలిసి పనిచేసి, దైవత్వము యొక్క శక్తిని మరియు దీవెనలను పొందడానికి అనుమతిస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20 చూడండి).
యేసు క్రీస్తు యొక్క వాస్తవికతను గూర్చి, వ్యక్తిగతంగా మనలో ప్రతిఒక్కరిని ప్రేమిస్తున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన సువార్త మనకు నిరీక్షణను, శాంతిని మరియు సంతోషమును తెస్తుందని, ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తు తరములలో లెక్కించలేనంత మందిని కూడా దీవిస్తుందని నేనెరుగుదును. ఫిలిప్పినో పరిశుద్ధుల యొక్క అందమైన, అప్యాయమైన చిరునవ్వులకు అదే కారణము. అది సువార్త మరియు క్రీస్తు సిద్ధాంతము యొక్క అద్భతము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.