“మే 6-12: ‘ప్రభువు నుండి బలము పొంది.’ మోషైయ 7-10,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)
“మే 6-12. మోషైయ 7–10,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)
మే 6-12: “ప్రభువు నుండి బలము పొంది”
మోషైయ 7–10
జరహేమ్లలో రాజైన మోషైయ యొక్క జనులు “నిరంతర సమాధానమును” ఆనందిస్తుండగా (మోషైయ 7:1), అనేక సంవత్సరాలకు ముందు లీహై-నీఫై దేశములో నివసించడానికి వెళ్ళిన మరో నీఫైయుల సమూహం పైకి వారి ఆలోచనలు మరిలాయి. తరాలు గడిచిపోయాయి, కానీ వారి గురించి ఎటువంటి సమాచారమును మోషైయ జనులు వినలేదు. కాబట్టి, వెళ్ళిపోయిన నీఫైయులను కనుగొనడానికి ఒక అన్వేషణ బృందమును నడిపించమని మోషైయ, అమ్మోన్‌ను అడిగాడు. “దుష్టత్వమును బట్టియే” (మోషైయ 7:24) ఈ నీఫైయులు, లేమనీయుల దాస్యములో ఉన్నారని అన్వేషణ బృందము కనుగొన్నది. కానీ అమ్మోన్ మరియు అతని సహోదరుల రాకతో అకస్మాత్తుగా అక్కడ విడుదలకు నిరీక్షణ కలిగింది.
కొన్నిసార్లు మనము దాస్యములో ఉన్న ఈ నీఫైయుల వలె ఉన్నాము, మన పాపముల కారణంగా బాధపడుతూ, మరలా సమాధానమును ఏవిధంగా పొందగలమని ఆశ్చర్యపడుతూ ఉంటాము. కొన్నిసార్లు మనం అమ్మోన్ వలె ఇతరులను సమీపించాలనే ప్రేరేపణను పొందుతాము మరియు క్రమంగా మన ప్రయత్నాలు వారిని, “(తమ) తలలు పైకెత్తి ఆనందించుచు, దేవుని యందు (తమ) నమ్మికయుంచమని” (మోషైయ 7:19) ప్రేరేపించినట్లు కనుగొంటాము. మన పరిస్థితులు ఏవైనప్పటికీ, మనందరం పశ్చాత్తాపపడవలెను మరియు “ఆయన (మనల్ని) … విడిపించునను” విశ్వాసముతో, “హృదయము యొక్క పూర్ణ సంకల్పముతో ప్రభువు తట్టు తిరుగవలెను” (మోషైయ 7:33).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
నన్ను విడుదల చేసే శక్తి యేసు క్రీస్తుకు ఉంది.
అమ్మోన్‌ను కలుసుకోవడం రాజైన లింహైకు నిరీక్షణనిచ్చింది మరియు అతడు ఆ నిరీక్షణను తన ప్రజలకు అందించాలనుకున్నాడు. బహుశా అతని మాటలు మీకు కూడా నిరీక్షణనివ్వగలవు. సందర్భం కొరకు, మోషైయ 7:20–25లో లింహై జనుల పరిస్థితిని సమీక్షించడాన్ని పరిగణించండి. తరువాత మీరు మోషైయ 7:14-33 చదువుతున్నప్పుడు, ఈ ప్రశ్నలను ధ్యానించండి:
-
క్రీస్తు నందు అతని జనుల విశ్వాసాన్ని, నిరీక్షణను బలపరచడానికి లింహై ఏమి చెప్పాడు?
-
నిరీక్షణను భావించడానికి ఏ వాక్యభాగాలు మీకు సహాయపడతాయి? (19, 33 వచనాలు చూడండి).
-
దైవుడు మిమ్మల్ని విడిపించగలరు మరియు విడిపిస్తారని నమ్మడానికి ఏ అనుభవాలు మీకు సహాయపడ్డాయి?
నేను “దేవుని స్వరూపంలో” సృష్టించబడ్డాను.
మోషైయ 7:26–27లో, అబినడై బోధించిన సత్యాలలో కొన్నింటిని లింహై వివరించాడు. ఈ వచనాలలో ఏ సత్యాలను మీరు గుర్తించగలరు? దేవుడిని మరియు మిమ్మల్ని మీరు చూసే విధానాన్ని ఈ సత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి?
మనుష్యులకు లాభం చేకూర్చడానికి ప్రభువు ప్రవక్తలను, దీర్ఘదర్శులను, బయల్పాటుదారులను ఏర్పాటు చేస్తారు.
ప్రభువు ఒక దీర్ఘదర్శిని లేవనెత్తాడని అమ్మోన్ సాక్ష్యమును లింహై వినినప్పుడు, లింహై “మిక్కిలి సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించెను” (మోషైయ 8:19). అతడు ఆవిధంగా భావించాడని మీరెందుకు అనుకుంటున్నారు? మోషైయ 8:13–19లో అమ్మోన్ మాటల నుండి దీర్ఘదర్శుల గురించి మీరేమి నేర్చుకుంటారు?
నేడు ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనం ఆమోదిస్తున్నాము. వారు మీకు “గొప్ప ప్రయోజనకారులుగా” ఎలా ఉన్నారు? (మోషైయ 8:18). యేసు క్రీస్తును గూర్చి వారు మీకు ఏమి బోధించారు?
ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల అవసరం గురించి అమ్మోన్ వలె ధైర్యంగా మీరు ఎలా మాట్లాడగలరు? (మోషైయ 8:13–18 చూడండి). ఉదాహరణకు, దాని గురించి మీ కుటుంబముతో లేదా సామాజిక మాధ్యమంలో మీరు ఏమి పంచుకోగలరు:
-
మన కాలంలో జోసెఫ్ స్మిత్ మరియు ప్రభువు యొక్క ఇతర ప్రవక్తల చేత సత్యాలు పునఃస్థాపించబడ్డాయి (దేవుని స్వభావము, మన దైవిక గుర్తింపు లేదా కుటుంబం యొక్క నిత్య స్వభావము వంటివి). “యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన” లేదా “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” (సువార్త గ్రంథాలయము) ను సమీక్షించడం ఈ సత్యాలలో కొన్నింటి గురించి ఆలోచించడానికి మీకు సహాయపడగలదు.
-
ఆజ్ఞలు లేదా విధుల యొక్క దీవెనలు (జ్ఞాన వాక్యము, పవిత్రత యొక్క చట్టము లేదా కుటుంబాలు ముద్రింపబడుట వంటివి).
గత నెల మనం సర్వసభ్య సమావేశంలో ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల నుండి విన్నాము. ఏ సందేశాలు మిమ్మల్ని ప్రేరేపించాయి? మీరు నేర్చుకొన్న దానిపై ఆధారపడి మీరు దేనిని భిన్నంగా చేస్తారు? “రాబోవు విషయములను గూర్చి” ప్రభువు యొక్క దీర్ఘదర్శులు ఏమి చెప్పారు? (మోషైయ 8:17).
“ప్రభువు నుండి బలము పొంది” నేను నా సవాళ్ళను ఎదుర్కోగలను.
అతని తప్పులు అతని జనులను కష్టమైన పరిస్థితులలో పడవేసాయని జెనిఫ్ ఒప్పుకున్నాడు. కానీ తర్వాత, లేమనీయులకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు, తన జనులు ప్రభువునందు విశ్వాసంతో తమ సవాళ్ళను ఎదుర్కోవడానికి అతడు సహాయపడ్డాడు. మీరు మోషైయ 9–10 చదివినప్పుడు, తమ విశ్వాసాన్ని చూపడానికి జెనిఫ్ యొక్క జనులు ఏమి చేసారో చూడండి. దేవుడు వారినెలా బలపరిచారు? ఆయన మిమ్మల్ని ఎలా బలపరిచారు? మీ దృష్టిలో “ప్రభువు నుండి బలము పొంది” ముందుకు వెళ్ళడమంటే అర్థమేమిటి? (మోషైయ 9:17; 10:10-11).
నా ఎంపికలు తరతరాలను ప్రభావితం చేయగలవు.
మీరు మోషైయ 10:11–17 చదువుతున్నప్పుడు, లేమనీయుల పూర్వీకుల చర్యలు మరియు దృక్పథాలు తరువాతి తరాలను ఏవిధంగా ప్రభావితం చేసాయో గుర్తించండి. మీ ఎంపికలు—మంచికైనా, చెడుకైనా—ఇంకా పుట్టని వారితో కలిపి ఇతరులను ఎలా ప్రభావితం చేయవచ్చు అనేదాని గురించి ఇది ఏమి సూచిస్తోంది?
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
లేఖనాలలోని జనులకు దేవుడు సహాయపడ్డారు మరియు ఆయన నాకు సహాయపడగలరు.
-
అతని జనులు కష్టాలలో ఉన్నప్పుడు, వారి విశ్వాసాన్ని పెంపొందించడానికి రాజైన లింహై లేఖనాలను పంచుకున్నాడు. విశ్వాసం కలిగియుండడానికి వారికి సహాయపడే లేఖన కథలు లేదా పాత్రల గురించి మీ పిల్లలను అడగండి. అప్పుడు మీరు వారి కోసం మోషైయ 7:19 చదువవచ్చు మరియు ఈ వచనంలో చెప్పబడిన కథలను సమీక్షించవచ్చు. మీ పిల్లలు వాటిని నటించి చూపాలనుకోవచ్చు. ఈ కథలలోని జనులకు ప్రభువు ఏవిధంగా సహాయపడ్డారు? ఆయన మనకెలా సహాయపడగలరు?
-
ప్రభువు మోర్మన్ గ్రంథములోని జనులకు ఎలా సహాయపడ్డారు మరియు ఆయన మనకెలా సహాయపడగలరో గుర్తించడానికి వారికి సహాయపడండి.
దేవుడు మనకు ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులను ఇచ్చారు.
-
దీర్ఘదర్శుల గురించి బోధించడానికి ఒక విధానము, మనం బాగా చూడగలిగే వస్తువులు అనగా, కళ్ళద్దాలు, దుర్బిణీలు లేదా మైక్రోస్కోపు వంటి వాటితో వారిని పోల్చడం. తరువాత మీరు మోషైయ 8:17ను మీ పిల్లల కోసం చదువుతున్నప్పుడు, వారు “దీర్ఘదర్శి” అనే పదమును వినిన ప్రతీసారి దుర్బిణీల గుండా చూస్తున్నట్లుగా వారి కళ్ళపై తమ చేతులుంచవచ్చు (మోషైయ 6:35–36 కూడా చూడండి). మనము చూడలేనివి, ప్రవక్తలు “చూడడానికి” ప్రభువు సహాయపడే విషయాల గురించి వారితో మాట్లాడండి. మన ప్రవక్తలు లేదా దీర్ఘదర్శులు, జోసెఫ్ స్మిత్ వంటి వారు మనకేమి బయల్పరిచారు?
-
మోషైయ 8:16–18ను మీ పిల్లలతో చదివిన తర్వాత, ఒక దీర్ఘదర్శి … వంటివారు, … మనకు సహాయం చేస్తారు వంటి వాక్యాన్ని పూరించే విధానాల కొరకు ఆలోచించడానికి మీరు వారికి సహాయపడవచ్చు. ఉదాహరణకు, దీర్ఘదర్శి ఒక ట్రాఫిక్ చిహ్నము వంటివారు, యేసు వైపు మనకు దారిచూపుతారు.
-
మీరు కాగితంతో పాదముద్రలను తయారుచేసి, వాటి మీద ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులు మనల్ని చేయమని ఉపదేశించిన విషయాల బొమ్మలు గీయమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. పాదముద్రలను గది చుట్టూ ఒక మార్గంలో ఉంచండి మరియు మీ పిల్లలు ఆ పాదముద్రలపై నడిచేలా చేయండి. ఒక దీర్ఘదర్శి మనకు “గొప్ప ప్రయోజనకారుడు” ఎలా కాగలడు? (మోషైయ 8:17–18 చూడండి).
నేను బలహీనంగా ఉన్నప్పుడు, ప్రభువు నన్ను బలపరచగలరు.
-
పిల్లలు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు, వారు కొన్నిసార్లు బలహీనంగా, నిస్సహాయులుగా భావిస్తారు. ప్రభువు యొక్క బలముపై ఆధారపడడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడతారు? శారీరకంగా బలంగా తయారు కావడానికి మనమేమి చేస్తామని మీరు వారిని అడగవచ్చు. “మనుష్యుల నుండి బలాన్ని” పొందడమంటే అర్థమేమిటి? (మోషైయ 10:11 చూడండి). “ప్రభువు నుండి బలాన్ని” పొందడమంటే అర్థమేమిటి? (మోషైయ 9:17-18; 10:10 కూడా చూడండి). మనం ప్రభువు నుండి బలాన్ని ఎలా పొందుతాము? ప్రభువు నుండి బలాన్ని పొందడానికి వారికి సహాయపడే వాటి చిత్రాన్ని మీ పిల్లలు గీయవచ్చు.