2024 రండి, నన్ను అనుసరించండి
మే 13-19: “ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు.” మోషైయ 11–17


“మే 13-19: ‘ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు.’ మోషైయ 11-17,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“మే 13-19. మోషైయ 11-17,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

రాజైన నోవాహ్ ఎదుట సాక్ష్యమిస్తున్న అబినడై

Abinadi before King Noah [రాజైన నోవాహ్ ఎదుట అబినడై], ఆండ్రూ బోస్లే చేత

మే 13-19: “ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు”

మోషైయ 11–17

పెద్ద మంటలు ఒక చిన్న నిప్పురవ్వతో మొదలు కాగలవు. శక్తివంతమైన ఒక రాజుకు, అతని సభకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్న ఏకైక వ్యక్తి అబినడై మాత్రమే. అధికులచేత అతని మాటలు నిరాకరించబడి, అతనికి మరణశిక్ష విధించబడింది. అయినప్పటికీ, “ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు” (మోషైయ 16:9) అయిన యేసు క్రీస్తు గురించిన ఆయన సాక్ష్యము యౌవన యాజకుడైన ఆల్మాపై ప్రభావం చూపింది. ఆల్మా అనేకమంది ఇతరులను పశ్చాత్తాపమునకు మరియు యేసు క్రీస్తు నందు విశ్వాసమునకు తెస్తుండగా పరివర్తన యొక్క ఆ నిప్పురవ్వ నెమ్మదిగా పెరిగింది. అబినడైను చంపిన అగ్నికీలలు క్రమంగా ఆరిపోయాయి, కానీ అతని మాటలు సృష్టించిన విశ్వాసపు అగ్ని నీఫైయులపైన—మరియు నేడు అతని మాటలు చదివే వారిపైన చిరకాల ప్రభావాన్ని కలిగియుంటుంది. మనలో ఎక్కువమంది మన సాక్ష్యాల కారణంగా అబినడై ఎదుర్కొన్నటువంటి వాటిని ఎన్నడూ ఎదుర్కోరు, కానీ యేసు క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు మన ధైర్యానికి, విశ్వాసానికి పరీక్ష పెట్టే క్షణాలను మనందరం కలిగియుంటాము. బహుశా అబినడై సాక్ష్యాన్ని చదవడం, మీ హృదయంలో కూడా సాక్ష్యము మరియు ధైర్యము యొక్క మంటలు రేపుతుంది.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సెమినరీ చిహ్నము

మోషైయ 11–13; 17

నేను ఒంటరిగా ఉన్నప్పటికీ, నేను యేసు క్రీస్తు కొరకు నిలబడగలను.

మీరు మోషైయ 11–13; 17 చదువుతున్నప్పుడు, ఈ సారాంశంలో అబినడై చిత్రాలను చూడండి. క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడడం అనగా అర్థమేమిటనే దాని గురించి మీరేమి నేర్చుకుంటారు? ప్రత్యేకించి, మీరు మీ అధ్యయనాన్ని ఇటువంటి గద్యభాగాలు మరియు ప్రశ్నలపై కేంద్రీకరించవచ్చు:

  • నోవాహ్ మరియు అతని జనులను మీరు ఎలా వర్ణిస్తారు? వారితో దేవుని సందేశాన్ని పంచుకోవడానికి అబినడైకు ధైర్యం ఎందుకు అవసరమైంది? (మోషైయ 11:1–19, 27–29; 12:9–15 చూడండి).

  • మీరు అబినడైని ఎలా వర్ణిస్తారు? అతని సాక్ష్యములో ధైర్యంగా ఉండడానికి అతనికి సహాయపడేలా అబినడై అర్థం చేసుకున్నదేమిటి? (మోషైయ 13:2–9, 28, 33–35; 17:8–10, 20 చూడండి).

రక్షకుడు మరియు ఆయన సువార్తను కాపాడుటలో మీరు ఒంటరిగా ఉన్నారని మీరెప్పుడు భావించారు? ఆయన మీతో ఉన్నారని మీరు భావించేలా ఆయన ఎలా సహాయపడ్డారు? మీరు దీనిని ధ్యానిస్తున్నప్పుడు, 2 రాజులు 6:14–17లో ఎలీషా మరియు అతని యువ సేవకుని వృత్తాంతాన్ని మీరు చదువవచ్చు. ఈ వృత్తాంతము గురించి ఏది మీకు ప్రేరణనిస్తుంది?

అబినడై నుండి మీరు నేర్చుకున్న దానిని మీరు ఎలా అన్వయిస్తారు? మీరు ఆలోచించగల ఇతర మాదిరులు ఏవి?

రోమా 1:16; 2 తిమోతి 1:7–8 కూడా చూడండి.

ఆత్మచేత బోధించండి. “శక్తివంతమైన సువార్త బోధనకు కేవలం పాఠాన్ని సిద్ధం చేయడమే కాకుండా, మీరు బోధించడం ప్రారంభించే ముందు ఆత్మీయంగా మిమ్మల్ని మీరు బాగా సిద్ధం చేసుకోవడం అవసరం” (Teaching in the Savior’s Way, 17).

మోషైయ 12:19-37

దేవుని వాక్యాన్ని గ్రహించడానికి నేను నా హృదయమును ఉపయోగించాలి.

రాజైన నోవాహ్ యొక్క యాజకులు దేవుని వాక్యమును బాగా ఎరిగినవారు. వారు లేఖన భాగములను ఉదహరించగలరు మరియు ఆజ్ఞలను బోధిస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ, వారి జీవితాలు రక్షకుని సువార్త చేత ఏమాత్రం ప్రభావితం కానట్లు ఉన్నాయి. ఎందుకలా ఉన్నాయి?

మీరు మోషైయ 12:19-37 చదువుతున్నప్పుడు, దీని గురించి ఆలోచించండి. దేవుని వాక్యమును గ్రహించడానికి మీ హృదయమును ఉపయోగించడం అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? సువార్తను నేర్చుకోవడానికి మీరు అనుసరించే పద్ధతుల్లో మార్పులు చేయడానికి ఏ పదాలు లేదా వాక్యభాగాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి?

మోషైయ 13:11-26

దేవుని ఆజ్ఞలు నా హృదయంలో వ్రాయబడాలి.

ఆజ్ఞలు యాజకుల “హృదయాలలో వ్రాయబడలేదు” అనే అబినడై పరిశీలనను ధ్యానించండి (మోషైయ 13:11). ఈ వాక్యభాగానికి అర్థము ఏమైయుండవచ్చు? మీరు మోషైయ 13:11–26 చదువుతున్నప్పుడు, మీ హృదయంలో ఈ ఆజ్ఞలు వ్రాయబడ్డాయో లేదో ఆలోచించండి.

యిర్మీయా 31:31-34; 2 కొరింథీయులకు 3:3 కూడా చూడండి.

మోషైయ 14–15

యేసు క్రీస్తు నా కొరకు బాధలనుభవించారు.

మోషైయ 14–15లో, రక్షకుడిని మరియు ఆయన మీ కొరకు పడిన బాధను వివరించే పదాలను, వాక్యభాగాలను గమనించండి. ఆయన పట్ల మీ ప్రేమను, కృతజ్ఞతను హెచ్చించడానికి ఏ వచనాలు సహాయపడతాయి?

మోషైయ 15:1–12

యేసు క్రీస్తు ఏ విధంగా తండ్రి మరియు కుమారుడైయున్నారు?

కుమారుడైన దేవుడు—యేసు క్రీస్తు—విమోచకుడని (మోషైయ 15:1 చూడండి), శరీరధారియై నివసిస్తున్నాడని, మనిషి మరియు దేవుడు రెండూ అయ్యున్నాడని (2–3 వచనాలు) అబినడై బోధించాడు. తండ్రియైన దేవుని చిత్తానికి ఆయన తననుతాను పూర్తిగా అప్పగించుకున్నారు (5–9 వచనాలు). ఇందుమూలంగా, యేసు క్రీస్తు దేవుని కుమారుడు మరియు తండ్రియైన దేవునికి పరిపూర్ణమైన భూలోక ప్రతినిధి (యోహాను 14:6–10 చూడండి).

ఆయన విమోచనను మనం అంగీకరించినప్పుడు మనం “ఆయన సంతానం” మరియు “దేవుని రాజ్యానికి వారసులం” అవుతాము, ఆ విధంగా యేసు క్రీస్తు తండ్రి కూడా అవుతారు (మోషైయ 15:11–12). మరొక విధంగా, మనము ఆయన ద్వారా ఆత్మీయంగా మరలా జన్మిస్తాము (మోషైయ 5:7 చూడండి).

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి ఈ విషయాలను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమైనదని మీరు భావిస్తున్నారు? వారి యందు మీ విశ్వాసాన్ని అబినడై సాక్ష్యము ఎలా బలపరుస్తుంది?

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

మోషైయ 11–1317

నేను ఒంటరిగా ఉన్నప్పటికీ, నేను యేసు క్రీస్తు కొరకు నిలబడగలను.

  • మన జీవితాలలో ఎప్పుడో ఒకసారి, యేసు క్రీస్తునందు మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఎంపికలు చేయడానికి మనందరం ఒత్తిడిని ఎదుర్కొంటాము. జనసమ్మతం కానప్పటికీ, యేసు క్రీస్తుకు సాక్షిగా నిలిచియుండడం గురించి అబినడై నుండి మీ పిల్లలు ఏమి నేర్చుకోగలరు? ఈ సారాంశంలో ఉన్న కళాఖండం మోషైయ 11–13; 17 లోని వృత్తాంతాన్ని దృశ్యీకరించడంలో వారికి సహాయపడగలదు. అబినడైలో వారికి నచ్చింది ఏమిటని వారిని అడగండి.

  • అబినడై కథలో భాగాలను అభినయించడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. తర్వాత, ఇతరులు ఏదైనా తప్పు చేయమని వారిని కోరినట్లయితే వారు ఏమి చేస్తారనే దానిని సాధన చేయడానికి వారు నిజ-జీవిత సందర్భాలను అభినయించవచ్చు. లేదా వారు యేసు క్రీస్తును అనుసరించడంలో ధైర్యంగా ఉన్నప్పటి అనుభవాలను వారు పంచుకోవచ్చు. అబినడై యేసు క్రీస్తును ఎలా అనుసరించాడు? (మోషైయ 13:2–9; 17:7–10 చూడండి). సరైనదని అతనికి తెలిసిన దానిని రాజైన నోవాహ్ ఎందుకు చేయలేదు? (మోషైయ 17:11–12 చూడండి).

మోషైయ 12:33-36; 13:11–24

నేను పది ఆజ్ఞలకు లోబడియుండాలి.

  • రాజైన నోవాహ్ యొక్క యాజకులు ఆజ్ఞలను ఎరిగియున్నారు, కానీ వాటిని “[వారి] హృదయాలలో వ్రాసుకోలేదు” (మోషైయ 13:11). ఆజ్ఞలను ఎరిగి, వాటిని ప్రేమించడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడతారు? మోషైయ 12:33–36 మరియు 13:11–24 నుండి ఆజ్ఞలను వారు హృదయాకార కాగితాలపై వ్రాయవచ్చు. వారలా చేస్తున్నప్పుడు, ఈ ఆజ్ఞలకు అర్థాన్ని మరియు వాటిని ఎలా అనుసరించాలనే దాని గురించి వారితో మాట్లాడండి. మన హృదయాలలో ఈ ఆజ్ఞలను మనమేవిధంగా “వ్రాస్తాము”?

  • ఆజ్ఞల గురించి ఒక పాటను కూడా మీరు కలిసి పాడవచ్చు. ఆజ్ఞలను పాటించడం నుండి వచ్చే దీవెనలు ఏవి?

లేఖనాలు చదువుతున్న తండ్రీ కొడుకులు

లేఖనాలు మనకు దేవుని ఆజ్ఞలను బోధిస్తాయి.

మోషైయ 14; 16:4–9

నన్ను తిరిగి ఆయన వద్దకు నడిపించడానికి పరలోక తండ్రి యేసు క్రీస్తును పంపారు.

  • చిన్న అధ్యాయమైనప్పటికీ, మోషైయ 14 యేసు క్రీస్తును వర్ణించే అనేక పదాలు మరియు వాక్యభాగాలను కలిగియుంది. మీరు కలిసి అధ్యాయాన్ని చదివినప్పుడు, మీరు, మీ పిల్లలు వాటిని జాబితా చేయవచ్చు. తర్వాత మీరు ఈ పదాలు మరియు వాక్యభాగాలను చదివినప్పుడు, మీరు రక్షకుని గురించి ఏవిధంగా భావిస్తారనే దాని గురించి మాట్లాడవచ్చు.

  • యేసు క్రీస్తు గురించి బోధించడానికి, మనల్ని తప్పిపోయిన గొర్రెలతో పోల్చిన ప్రవక్త యెషయాను అబినడై వ్యాఖ్యానించాడు. బహుశా మీ పిల్లలు వారు ఏదైనా కోల్పోయిన లేదా వారిని వారు కోల్పోయిన అనుభవాలను పంచుకోవచ్చు. వారు ఎలా భావించారు? వారు ఏమి చేసారు? తర్వాత, మోషైయ 14:6 మరియు 16:4–9ను వారు కలిసి చదువవచ్చు. మనము దేవుని నుండి దూరంగా తిరుగులాడే గొర్రెల వలె ఎట్లున్నాము? తిరిగి రావడానికి యేసు క్రీస్తు మనకు ఏవిధంగా సహాయపడతారు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

రాజైన నోవాహ్ ఎదుట సాక్ష్యమిస్తున్న అబినడై

His Face Shone with Exceeding Luster [ఆయన ముఖము అత్యంత ప్రకాశముతో మెరిసెను], జెరెమి విన్బర్గ్ చేత