2024 రండి, నన్ను అనుసరించండి
జూలై 8-14: “వారు ‘ఎన్నడూ తొలగిపోలేదు.’” ఆల్మా 23–29


“జూలై 8-14: ‘వారు “ఎన్నడూ తొలగిపోలేదు.’” ఆల్మా 23-29,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“జూలై 8-14. ఆల్మా 23-29,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

తమ ఆయుధములను పాతిపెడుతున్న ఆంటై-నీఫై-లీహైయులు

Anti-Nephi-Lehies Bury Their Weapons of War [ఆంటై-నీఫై-లీహైయులు తమ యుద్ధ ఆయుధములను పాతిపెట్టెదరు], జోడీ లివింగ్‌స్టన్ చేత

జూలై 8-14: వారు “ఎన్నడూ తొలగిపోలేదు”

ఆల్మా 23–29

జనులు నిజంగా మారగలరా అని మీరు కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నారా? మీరు చేసిన చెడు ఎంపికలు లేదా మీరు వృద్ధి చేసిన దురలవాట్లను జయించగలరో లేదోనని మీరు చింతిస్తూ ఉండవచ్చు లేదా మీరు ప్రేమించే వారి గురించి అటువంటి చింత కలిగియుండవచ్చు. అలాగైతే, ఆంటై-నీఫై-లీహైయుల కథ మీకు సహాయపడగలదు. ఈ జనులు నీఫైయుల బద్ధ శత్రువులు. మోషైయ కుమారులు వారికి సువార్త ప్రవచించాలని నిర్ణయించినప్పుడు, నీఫైయులు “[వారిని] ఎగతాళి చేస్తూ నవ్వారు.” లేమనీయులలో పరివర్తన కలిగించడం కంటే వారిని చంపడం ఎక్కువ న్యాయమైన పరిష్కారంగా తోచింది. (ఆల్మా 26:23–25 చూడండి.)

కానీ యేసు క్రీస్తు యొక్క పరివర్తన శక్తి ద్వారా లేమనీయులు మారారు. ఒకప్పుడు “కఠినాత్ములు, క్రూరులైన జనులుగా” (ఆల్మా 17:14) యెంచబడినవారు, “దేవుని యెడల వారి ఆసక్తి నిమిత్తము ప్రత్యేకపరచబడిరి” (ఆల్మా27:27). నిజానికి, వారు “ఎన్నడూ తొలగిపోలేదు” (ఆల్మా 23:6).

విడిచిపెట్టవలసిన తప్పుడు ఆచారాలను లేదా క్రింద పడవేయవలసిన “తిరుగుబాటు ఆయుధాలను” మీరు కలిగియుండవచ్చు (ఆల్మా 23:7). లేదా మీరు దేవుని యెడల మరికాస్త ఆసక్తిని కలిగియుండవలసి రావచ్చు. మీకు ఎటువంటి మార్పులు అవసరమైనప్పటికీ, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి ద్వారా శాశ్వత మార్పు సాధ్యమనే నిరీక్షణను ఆల్మా 23–29 మీకు ఇవ్వగలదు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 23–2527

seminary icon
యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పట్ల నా పరివర్తన నా జీవితాన్ని మారుస్తుంది.

లేమనీయులు పరివర్తనకు అవకాశం లేనివారిగా కనిపించారు, అయినప్పటికీ వారిలో అనేకులు యేసు క్రీస్తు కారణంగా అద్భుతమైన మార్పులను అనుభవించారు. పరివర్తన చెందిన ఈ లేమనీయులు తమనుతాము ఆంటై-నీఫై-లీహైయులని పిలుచుకున్నారు.

ఆల్మా 23–2527 చదవడం మీ స్వంత పరివర్తన గురించి ధ్యానించేలా మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. ఆంటై-నీఫై-లీహైయులు ఎలా మారారో—వారు “ప్రభువునకు” (ఆల్మా 23:6) ఎలా పరివర్తన చెందారో చూడండి. క్రింది వచనాలతో మీరు ప్రారంభించవచ్చు.

యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త ఏ విధాలుగా మిమ్మల్ని మార్చింది? ఆయనకు దగ్గరగా మీరు ఎప్పుడు భావించారు? యేసు క్రీస్తునకు మీరు పరివర్తన చెందుతున్నారని మీరెలా చెప్పగలరు? తరువాత ఏమి చేయాలని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించుచున్నది?

డేల్ జి. రెన్లండ్, “యేసు క్రీస్తు పట్ల అచంచలమైన నిబద్దత,” లియహోనా, నవ. 2019, 22–25 చూడండి.

ఆల్మా 24:7–19; 26:17–22

దేవుడు దయామయుడు కాబట్టి, నేను పశ్చాత్తాపపడినప్పుడు ఆయన నన్ను క్షమిస్తారు.

ఆంటై-నీఫై-లీహైయులు అనుభవించిన మార్పు ప్రవర్తనలో మార్పు కంటే మించినది—అది యేసు క్రీస్తు యందు విశ్వాసము మరియు మనఃపూర్వకమైన పశ్చాత్తాపము నుండి పుట్టిన హృదయము యొక్క మార్పు. బహుశా ఆల్మా 24:7-19 లో ప్రతీ వచనంలో పశ్చాత్తాపము గురించి ఒక సత్యము చొప్పున మీరు కనుగొనవచ్చు. పశ్చాత్తాపపడిన వారి యెడల దేవుని దయ గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి? ఆల్మా 26:17–22 నుండి ఏ ఇతర సత్యాలను మీరు నేర్చుకుంటారు?

మీ జీవితంలో దేవుడు తన కనికరమును ఎలా చూపారో ధ్యానించండి. ఆయనపట్ల మీ కృతజ్ఞతను మీరెలా చూపగలరు?

ఆల్మా 26; 29

సువార్తను పంచుకోవడం నాకు ఆనందాన్నిస్తుంది.

రక్షకుని సువార్తను జీవించడంలో మరియు పంచుకోవడంలో ఆనందాన్ని ఎలా పొందాలో నేర్చుకోవడానికి ఈ అధ్యాయాలను మంచి స్థలంగా చేస్తూ, ఆనందము అనే పదము ఆల్మా 23–29 లో 24 సార్లు కనిపిస్తుంది. అమ్మోన్, మోషైయ కుమారులు మరియు ఆల్మా ఆనందించడానికి గల కారణాల కొరకు చూస్తూ, ఆల్మా 26:12–22, 35–37 మరియు 29:1–17 చదవడం గురించి ఆలోచించండి. మీ జీవితంలో మరింత ఆనందానికి దారితీయగలిగేలా ఈ గద్యభాగాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

ఎల్డర్ మార్కస్ బి. నాష్ ఇలా బోధించారు: “సువార్తను పంచుకోవడం దాత మరియు గ్రహీత ఇద్దరి ఆత్మలలో ఆనందం మరియు ఆశను కలుగజేస్తుంది. … సువార్తను పంచుకోవడం మనకున్న ఆనందాన్ని, ఆశను రెట్టింపు చేస్తుంది” (“మీ దీపమును పైకెత్తండి,” లియహోనా, నవ. 2021, 71). ఇతరులతో సువార్తను పంచుకోవడంలో మీకు కలిగిన అనుభవాలేవి? సువార్తను పంచుకోవడానికి కోరినప్పుడు మీరు ఎదుర్కొనే సవాళ్ళేవి? ఈ సవాళ్ళను జయించడంలో పరలోక తండ్రి మీకేవిధంగా సహాయపడగలరు?

సువార్తను ఎలా పంచుకోవాలి—దానిని జీవించడంలో ఆనందాన్ని ఎలా కనుగొనాలి అనేదానిపై ప్రవచనాత్మక ఉపదేశం కొరకు—అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ సందేశం, “Sharing the Restored Gospel,” (Liahona, Nov. 2016, 57–60) చదవడం గురించి ఆలోచించండి. ఆయన సందేశంలో మీరు ఏ సలహాలను కనుగొంటారు?

మోర్మన్ గ్రంథము గురించి ఒక స్నేహితునితో మీరు పంచుకొనే విషయాలను జాబితా చేయడానికి ఆలోచించండి. మోర్మన్ గ్రంథ యాప్‌ను ఉపయోగించి మోర్మన్ గ్రంథమును పంచుకోవడానికి ప్రయత్నించండి.

నమూనాలు మరియు ఇతివృత్తాల కోసం చూడండి. లేఖనాలను చదువుతున్నప్పుడు, పునరావృతం చేయబడిన పదాలు, వాక్యభాగాలు లేదా ఉపాయాల కొరకు చూడడం ద్వారా మనం అమూల్యమైన సత్యాలను కనుగొనగలము. పునరావృతం చేయబడిన ఆ ఉపాయాలు ఆధార సూచికలు కాగలవు లేదా సులువుగా వాటిని చూడగలిగేలా చేయడానికి మీ లేఖనాలకు జతచేయబడగలవు.

ఆల్మా 26:5–7

యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తలో నేను ఆశ్రయం కనుగొనగలను.

పంటకోయు సమయంలో తరచు ధాన్యము పనలు అనబడే కుప్పలుగా కూర్చబడుతుంది మరియు కొన్నిసార్లు ధాన్యాగారములు అనబడే గిడ్డంగులలో ఉంచబడుతుంది. ఆల్మా 26:5–7 లో పనలు, ధాన్యాగారములు మరియు తుఫాను మీ జీవితంలో దేనిని సూచించవచ్చో ధ్యానించండి. యేసు క్రీస్తులో మీరు ఆశ్రయాన్ని ఎలా కనుగొంటారు?

రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది,” లియహోనా, నవ. 2021, 93–96 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 24:6-24

ఆయనతో నేను చేసిన వాగ్దానాలను నిలుపుకోవడానికి నేను ప్రయత్నించినప్పుడు, ప్రభువు నన్ను దీవిస్తారు.

  • ఆంటై-నీఫై-లీహైయుల వలె, బహుశా మీ పిల్లలు వారి “ఆయుధాలను” పాతిపెట్టడాన్ని ఆనందించవచ్చు. రక్షకుడిని అనుసరించడానికి ఆంటై-నీఫై-లీహైయులు చేసిన వాగ్దానాల గురించి పిల్లలకు బోధించడానికి మీరు ఆల్మా 24:6–24 నుండి కొన్ని వచనాలను చదువవచ్చు. తర్వాత ఆయనను అనుసరించడానికి వారు మార్చుకొనే విషయం గురించి వారు ఆలోచించి, ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీలో దానిని వ్రాసి, ఒక గొయ్యి త్రవ్వుతున్నట్లుగా నటిస్తూ, వారి ఆయుధాన్ని పాతిపెట్టవచ్చు.

  • “దేవునికి ఒక సాక్ష్యముగా” ఆంటై-నీఫై-లీహైయులు చేసిన దాని కొరకు చూస్తూ, మీ పిల్లలు ఆల్మా 24:15–19 చదువవచ్చు. తర్వాత, మన నిబంధనలు “దేవునికి ఒక సాక్ష్యముగా” (18వ వచనము) ఎలా కాగలవనే దాని గురించి మీరు వారితో మాట్లాడవచ్చు. ఆయనను అనుసరించాలని వారు కోరుతున్నట్లు వారు దేవునికి ఎలా చూపగలరనే దాని గురించి మీ పిల్లలను మాట్లాడనివ్వండి.

ఆల్మా 24:7-10; 26:23-34; 27:27-30.

నేను పశ్చాత్తాపపడగలను.

  • మనం పశ్చాత్తాపపడినప్పుడు మనం మారడానికి యేసు క్రీస్తు ఎలా సహాయపడగలరో చూడడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, మీరు వారికి ఆంటై-నీఫై-లీహైయుల గురించి బోధించవచ్చు. దీనిని చేయడానికి, మీరు రెండు గిన్నెల మీద “ముందు” మరియు “తరువాత” అని వ్రాయవచ్చు. అప్పుడు మీ పిల్లలు ఆల్మా 17:14–15 మరియు 27:27–30 చదువవచ్చు, లేమనీయులు అంతకుముందు మరియు పశ్చాత్తాపపడిన తరువాత ఎలా ఉన్నారో వ్రాసి, వాటిని సరైన గిన్నెలో వేయవచ్చు. ఆల్మా 24:7–10 ప్రకారం, వారు మారడానికి సహాయపడినదేమిటి? ఆయన కనికరము కొరకు మనం దేవునికి మన కృతజ్ఞతను ఎలా చూపగలము?

ఆల్మా 26; 29

యేసు క్రీస్తు నాకు ఆనందాన్ని ఇస్తారు మరియు నేను ఈ ఆనందాన్ని పంచుకోగలను.

  • యేసు క్రీస్తు సువార్తలో మీకు ఆనందాన్నిచ్చే విషయాల బొమ్మలు గీయడాన్ని బహుశా మీరు, మీ పిల్లలు ఆనందించవచ్చు. మీ చిత్రాన్ని మీ పిల్లలతో పంచుకోండి మరియు మరొకరు కూడా ఆనందించునట్లు సహాయపడేందుకు వారి చిత్రాన్ని ఎవరితోనైనా పంచుకోమని వారిని ప్రోత్సహించండి.

  • ఆల్మా 26 మరియు 29 లో ఆనందము మరియు ఆనందించు అనే పదాలు కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. అమ్మోన్ మరియు ఆల్మాలకు ఆనందాన్నిచ్చినది లేదా వారు ఆనందించేలా చేసినది ఏది? ఈ ప్రశ్న యేసు క్రీస్తు సువార్తను జీవించడం లేదా పంచుకోవడం నుండి వచ్చే ఆనందం గురించి ఒక చర్చకు దారితీయవచ్చు.

ఆల్మా 27:20-30

యేసు క్రీస్తు సువార్తను జీవించడానికి నేను నా స్నేహితులకు సహాయపడగలను.

  • ఇకపై ఎన్నడూ యుద్ధము చేయమనే వారి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఆంటై-నీఫై-లీహైయులకు సహాయపడేందుకు నీఫైయులు చేసిన దాని కొరకు చూస్తూ, మీ పిల్లలు ఆల్మా 27:22–23 చదువవచ్చు. వారి వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి మన స్నేహితులకు మనమెలా సహాయపడగలము? మీ పిల్లలు సందర్భాలను నటించి చూపవచ్చు. ఉదాహరణకు, అబద్ధమాడాలని లేదా ఇతరులను బాధపెట్టాలని కోరే ఒక స్నేహితునికి మనం ఏమి చెప్పగలము?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

తమ ఆయుధములను పాతిపెడుతున్న ఆంటై-నీఫై-లీహైయులు

Illustration of the Anti-Nephi-Lehies burying their weapons [తమ ఆయుధములను పాతిపెడుతున్న ఆంటై-నీఫై-లీహైయుల యొక్క వివరణ], డాన్ బర్ చేత