2024 రండి, నన్ను అనుసరించండి
జూలై 1-7: “నేను మిమ్మును ఒక సాధనముగా చేయుదును.” ఆల్మా 17–22


“జూలై 1-7: ‘నేను మిమ్మును ఒక సాధనముగా చేయుదును.’ ఆల్మా 17-22,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“జూలై 1-7. ఆల్మా 17-22,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
రాజైన లమోనైతో మాట్లాడుతున్న అమ్మోన్

Ammon and King Lamoni [అమ్మోన్ మరియు రాజైన లమోనై], స్కాట్ ఎమ్. స్నో చేత

జూలై 1-7: “నేను మిమ్మును ఒక సాధనముగా చేయుదును”

ఆల్మా 17–22

సువార్తను పంచుకోకపోవడానికి జనులు ఇచ్చే కారణములన్నిటి గురించి ఆలోచించండి: “నాకు సరిగ్గా తెలియదు” లేదా “వారికి ఇష్టమో కాదో నాకు తెలియదు” లేదా “ఒకవేళ నన్ను నిరాకరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.” కొన్ని సమయాలలో మీరు కూడా అదేవిషయాలను ఆలోచిస్తున్నట్లు కనుగొనియుండవచ్చు. లేమనీయులతో సువార్తను పంచుకోకపోవడానికి నీఫైయులకు ఒక అదనపు కారణమున్నది: వారు “ఆటవికులు, కఠినాత్ములు, క్రూరులైన జనులు; నీఫైయులను హత్యచేయుట యందు ఆనందించు జనులు” అని వర్ణించబడ్డారు (ఆల్మా 17:14; ఆల్మా 26:23–25 కూడా చూడండి). కానీ మోషైయ కుమారులు లేమనీయులతో సువార్తను తప్పనిసరిగా పంచుకోవాలని భావించడానికి ఇంకా బలమైన కారణాన్ని కలిగియున్నారు: “ప్రతి ప్రాణికి రక్షణ ప్రకటించబడవలెనని వారు కోరిరి, ఏలయనగా ఏ మానవ ఆత్మయు నశించిపోవుటను వారు సహించలేకపోయిరి” (మోషైయ 28:3). అమ్మోన్ మరియు అతడి సహోదరులను ప్రేరేపించిన ఈ ప్రేమ మీ కుటుంబము, స్నేహితులు మరియు పరిచయస్తులతో—దానిని అంగీకరించనట్లు కనబడు వారితో కూడా—సువార్తను పంచుకొనుటకు మిమ్మల్ని కూడా ప్రేరేపించవచ్చు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 17:1-4

క్రీస్తు పట్ల భక్తి యొక్క సాధారణమైన, స్థిరమైన చర్యలు ఆయన శక్తిని పొందడానికి నాకు సహాయపడతాయి.

యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యమును, ఆయన పట్ల మీ నిబద్ధతను ఎలా నిలుపుకోవాలి అనేదాని గురించి ఆల్మా 17:1–4 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మోషైయ కుమారులు ఏమి చేసారు మరియు ప్రభువు వారిని ఎలా దీవించారు?

ఆల్మా 17–22లో మోషైయ కుమారుల యొక్క అనుభవాల గురించి మీరు చదువుతున్నప్పుడు, వారి ఆత్మీయ సిద్ధపాటు లేమనీయుల మధ్య వారి సేవను ఎలా ప్రభావితం చేసిందో గమనించండి (ఉదాహరణకు, ఆల్మా 18:10–18, 34–36; 20:2–5; 22:12–16 చూడండి). వారి మాదిరిని అనుసరించడానికి మీరు ఏమి చేయడానికి ప్రేరేపించబడ్డారు ?

ఆల్మా 17:6-12; 19:16–36

చిత్రం
సెమినరీ చిహ్నము
నేను దేవుని హస్తములలో సాధనముగా ఉండగలను.

లేఖనాలలో మనము చదివే పరివర్తన వృత్తాంతాలు తరచు నాటకీయంగా ఉంటాయి, కానీ వాటిలో ముఖ్యంగా ధైర్యముగా మాట్లాడగలిగి, యేసు క్రీస్తుయందు వారి విశ్వాసాన్ని పంచుకునే వ్యక్తులను సాధారణంగా మనం కనుగొంటాము. ఏబిష్ మరియు మోషైయ కుమారుల గురించి ఈ వారము మీరు చదివినప్పుడు, దీని గురించి ఆలోచించండి.

దేవుని హస్తములలో ఒక సాధనముగా ఉండడం అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? మీ అనుదిన జీవితంలో మీరు ఉపయోగించే సాధనాలు లేదా పనిముట్ల గురించి ఆలోచించడం సహాయకరంగా ఉండవచ్చు. ఆల్మా 17:6–12లో, దేవుని హస్తములలో వారు సాధనములుగా ఉండగలుగుటకు మోషైయ కుమారులు చేసిన దాని కొరకు చూడండి. ఇతరులు క్రీస్తు నొద్దకు వచ్చుటకు సహాయపడడంలో మరింత ప్రభావవంతమైన సాధనంగా మీరెలా మారగలరు?

ఆల్మా 19:16–36లో ఏబిష్ గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? క్రీస్తు యందు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇతరులకు సహాయపడడం గురించి ఏబిష్ నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ఉదాహరణకు, మీరు ప్రేమించేవారు “దేవుని శక్తి యందు విశ్వసించునట్లు” ఏది సహాయపడుతుందని మీరు భావిస్తున్నారు? (ఆల్మా 19:17).

ఏబిష్ అనుభవాన్ని మీరు “సువార్త పరిచర్య: మీ హృదయములో నున్నది పంచుకొనుట” (లియహోనా, 2019 మే, 15–18) లో ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ బోధించిన సూత్రాలతో కూడా పోల్చవచ్చు. ఎల్డర్ ఉఖ్‌డార్ఫ్ యొక్క “ఐదు సులభమైన సలహాలను” ఏబిష్ ఎలా ఉదహరించింది? యేసు క్రీస్తు గురించి మీరు చెప్పగల కొన్ని విషయాలను వ్రాయడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, “నా మట్టుకు, యేసు క్రీస్తు …” లేదా “… రక్షకుడు నాకు సహాయపడతారు.”

వస్తు పాఠములను ఉపయోగించండి. జనులు వారు నేర్చుకుంటున్న దానికి సంబంధించినది ఏదైనా చూసినప్పుడు లేదా తాకినప్పుడు, వారు దానిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఉదాహరణకు, మీరు ఆల్మా 17:11 గురించి బోధిస్తున్నట్లయితే, దేవుని హస్తములలో సాధనముగా ఉండడం గురించి ఒక చర్చను ప్రేరేపించడంలో సహాయపడేందుకు సంగీత పరికరాలను లేదా వ్రాత సాధనాలను చూపించడం గురించి ఆలోచించండి.

ఆల్మా 17-19

మనం ఇతరుల కొరకు ప్రేమ చూపించినప్పుడు, యేసు క్రీస్తు సువార్తను స్వీకరించడానికి మనం వారికి సహాయపడగలము.

లేమనీయుల పట్ల అమ్మోన్ యొక్క ప్రేమ యేసు క్రీస్తు సువార్తను పంచుకోవడానికి అతని ప్రయత్నాలను ఎలా ప్రేరేపించిందో చూపే ఆల్మా 17-19 లోని వచనాల కొరకు చూడండి. సువార్తను పంచుకోవడం గురించి అతని మాదిరి నుండి ఏ ఇతర సత్యాలను మీరు నేర్చుకుంటారు?

చిత్రం
రాజు యొక్క గొఱ్ఱెలను రక్షిస్తున్న అమ్మోన్

మినర్వా టైఛర్ట్ (1888–1976), Ammon Saves the King’s Flocks [రాజు యొక్క గొఱ్ఱెలను అమ్మోన్ రక్షిస్తాడు], 1949-1951, కృత్రిమ చెక్కపై తైలవర్ణ చిత్రము, 91 సె.మీ. × 122 సె.మీ. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, 1969.

ఆల్మా 19:36

పశ్చాత్తాపపడడానికి ప్రభువు నాకు సహాయపడతారు.

లమోనై మరియు అతని జనుల పరివర్తన వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత, యేసు క్రీస్తు గురించి ఒక పరిశీలనతో మోర్మన్ ఆ వృత్తాంతాన్ని సంక్షిప్తపరిచాడు. ప్రభువు యొక్క స్వభావము గురించి ఆల్మా 19:36 మీకేమి బోధిస్తుంది? ఆయన గురించి ఆల్మా 19:16–36 లోని వృత్తాంతము మీకు ఇంకేమి బోధిస్తుంది? ప్రభువు యొక్క బాహువు మీ వైపు చాపబాడుటను మీరు ఎప్పుడు భావించారు?

ఆల్మా 20:23; 22:15-18

దేవుని గురించి తెలుసుకోవడానికి ఏ త్యాగమైనా విలువైనదే.

తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి లమోనై తండ్రి ఇష్టపూర్వకంగా ఇచ్చివేయాలనుకున్న దానిని (ఆల్మా 20:23 చూడండి), తరువాత అతడు సువార్త యొక్క ఆనందాన్ని పొందడానికి మరియు దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపూర్వకంగా ఇచ్చివేయాలనుకున్న దానితో (ఆల్మా 22:15, 18 చూడండి) పోల్చండి. మరింత పూర్తిగా దేవుని గురించి తెలుసుకోవడానికి ఏమి త్యాగం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారో ధ్యానించండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 17:2-3

నేను లేఖనాలను చదివి, ప్రార్థించి, ఉపవాసమున్నప్పుడు, యేసు క్రీస్తును గూర్చి నా సాక్ష్యము పెరుగుతుంది.

  • యేసు క్రీస్తు గురించి వారి సాక్ష్యాలను పెంపొందించుకోవడానికి మోషైయ కుమారుల మాదిరులు మీ పిల్లలకు ఎలా సహాయపడగలవు? ఆల్మా 17:2-3 లో తమ ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకోవడానికి మోషైయ కుమారులు చేసిన దానిని కనుగొనడానికి మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు. తరువాత వారు ఈ విషయాలను సూచించే బొమ్మలను గీయవచ్చు లేదా వస్తువులను కనుగొనవచ్చు. రక్షకుని గురించి వారి సాక్ష్యాలను బలపరచుకోవడానికి వారు ఏమి చేస్తారో ప్రణాళిక చేయడానికి వారికి సహాయపడండి.

ఆల్మా 17-19

ఇతరులతో యేసు క్రీస్తు సువార్తను గూర్చి నేను పంచుకోగలను.

  • మోషైయ కుమారుల వలె దేవుని హస్తములలో సాధనముగా ఉండడం గురించి నేర్చుకోవడానికి, మీరు మరియు మీ పిల్లలు ఒక సాధనము లేదా పనిముట్టు వైపు చూడవచ్చు మరియు అది దేని కొరకు ఉపయోగించబడుతుందో మాట్లాడవచ్చు. తరువాత మీరు ఆల్మా 17:11 చదివి, యేసు క్రీస్తు గురించి నేర్చుకోవడానికి జనులకు సహాయపడేందుకు పరలోక తండ్రి యొక్క సాధనములుగా ఉండడమంటే అర్థమేమిటనే దాని గురించి మాట్లాడవచ్చు.

  • ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీలో రాజైన లమోనైకి అమ్మోన్ బోధించిన సత్యాలను సూచించే చిత్రాలున్నాయి. ఆల్మా 18:24-40 లో ఈ సత్యాలను కనుగొనడానికి మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు. మీ పిల్లలు సువార్తికుల వలె నటిస్తూ, ఈ సత్యాల గురించి వారికి తెలిసిన దానిని పంచుకోవచ్చు.

  • మీ పిల్లలతో కలిసి ఏబిష్ గురించి చదివిన తర్వాత (ఆల్మా 19:16–20, 28–29), ఉన్నచోటే పరుగెత్తడం, తలుపులు తట్టడం మరియు ఆల్మా 19:1–17 లో జరిగిన దాని గురించి చెప్పడం ద్వారా ఏబిష్ వలె వారు నటించవచ్చు. మనం ఏబిష్ వలె ఉండి, యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మనకు తెలిసిన దానిని ఎలా పంచుకోగలము?

ఆల్మా 17:21–25; 20:8–27; 22:1–3

ఇతరులకు నా ప్రేమను చూపడం ద్వారా వారు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు నేను సహాయము చేయగలను.

  • మొదట్లో రాజైన లమోనై మరియు అతని తండ్రి ఇద్దరూ సువార్త పట్ల కఠిన హృదయాలు కలిగియున్నారు. తరువాత, వారి హృదయాలు మృదువుగా చేయబడ్డాయి మరియు వారు యేసు క్రీస్తును నమ్మారు. ఇది ఎలా జరిగింది? అమ్మోన్ అనుభవాలను మీరు వారితో కలిసి పునర్వీక్షించినప్పుడు, ఈ ప్రశ్నకు జవాబులు కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. అమ్మోన్ రాజైన లమోనైకి సేవచేయడం మరియు అమ్మోన్ రాజైన లమోనై యొక్క తండ్రిని కలుసుకోవడం యొక్క వృత్తాంతాలను వారు నటించి చూపవచ్చు. లేదా వృత్తాంతములో వేర్వేరు భాగముల చిత్రాలను మీ పిల్లలు గీయవచ్చు మరియు వృత్తాంతమును చెప్పుటకు చిత్రాలను ఉపయోగించవచ్చు. యేసు క్రీస్తు సువార్తకు వారి హృదయాలను తెరవడానికి లమోనైకి, అతని తండ్రికి సహాయపడేందుకు అమ్మోన్ ఏమి చేసాడు? (ఆల్మా 17:21–25; 20:8–27; 22:1–3 చూడండి).

  • బహుశా యేసు క్రీస్తు గురించి తెలుసుకోవడం అవసరమైన ఒకరి గురించి మీరు, మీ పిల్లలు ఆలోచించవచ్చు. లమోనై మరియు అతని తండ్రి కొరకు అమ్మోన్ చేసినట్లుగా, వారు మంచి మాదిరులుగా ఉండగలిగి, ఆ వ్యక్తి పట్ల ప్రేమ చూపగల విధానాల గురించి ఆలోచించడానికి వారికి సహాయపడండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
ఏబిష్ యొక్క వివరణ

An illustration of Abish [ఏబిష్ యొక్క వివరణ], డిల్లీన్ మార్ష్ చేత

ముద్రించు