2010–2019
యేసు క్రీస్తు పట్ల అచంచలమైన నిబద్దత
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

యేసు క్రీస్తు పట్ల అచంచలమైన నిబద్దత

మన పాత విధానాల వైపు పూర్తిగా తిరిగి వెళ్లకుండా తీసివేసి, క్రీస్తునందు ఒక క్రొత్త జీవితమును మొదలుపెట్టాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు.

గత ఏప్రిల్‌లో, కాంగో యొక్క కిన్షాసా డెమోక్రటిక్ రిపబ్లిక్ దేవాలయమును ప్రతిష్ఠించే విశేషాధికారాన్ని నేను పొందాను. 1 నేను మరియు విశ్వాసులైన కాంగో ప్రజలు వారి దేశములో ఒక దేవాలయము ప్రతిష్ఠించబడుటను చూసి పొందిన ఆనందము మాటలలో చెప్పలేనిది.

కాంగో జలపాతముల యొక్క చిత్రలేఖనము

కిన్షాసా దేవాలయములో ప్రవేశించువారు కాంగో జలపాతాలు 2 అనే పేరుగల అసలైన చిత్రలేఖనమును చూస్తారు. వారు స్థిరముగా యేసు క్రీస్తుకు నిబద్ధత కలిగియుండి, మన పరలోక తండ్రి ప్రణాళిక యొక్క నిబంధన మార్గమును అనుసరించుటకు అది అపూర్వముగా కాంగో ప్రజల అచంచలమైన నిబద్ధతను గుర్తుచేస్తుంది. ఆ చిత్రలేఖనములో వర్ణించబడిన ఆ జలపాతములు కాంగోలో క్రైస్తవత్వానికి మొదట పరివర్తన చెందిన వారి మధ్య ఒక శతాబ్దము కంటే ఎక్కువ కాలము ఉన్న ఒక ఆచారాన్ని మన దృష్టికి తెస్తుంది.

జాంగో జలపాతముల చిత్రలేఖనము

వారి పరివర్తనకు ముందు, వారు ఆ వస్తువులు లోకాతీతమైన శక్తులను కలిగియున్నాయని నమ్ముచు, జీవంలేని విగ్రహాలను పూజించారు.3 పరివర్తన చెందిన తరువాత, కాంగో నది తీరము వెంబడి ఉన్న లెక్కలేని జలపాతాలలో ఒకటైన జాంగో జలపాతాలకు 4 అనేకులు తీర్థయాత్రలకు వెళ్లారు. ఈ పరివర్తన చెందినవారు తమ పాత ఆచారాలను వదిలి, యేసు క్రీస్తును అంగీకరిస్తున్నట్లు దేవునికి మరియు ఇతరులకు చిహ్నముగా వారు తమ విగ్రహములను పోలిన వస్తువులను జలపాతాలలో పడవేసారు. వారు ఉద్దేశపూర్వకముగానే తమ వస్తువులను నిమ్మళముగా, లోతు తక్కువగల నీటిలో పడవెయ్యలేదు; అక్కడ ఆ వస్తువులు తిరిగి తీసుకొనే వీలు లేకుండా వారు గలగల పారుచున్న భారీ జలపాతాలలోవాటిని పడవేసారు. యేసు క్రీస్తు పట్ల అచంచలమైన నిబద్ధత ఆరంభానికి ఈ చర్యలు ఒక చిహ్నము.

ఇటువంటి విధానాలలోనే ప్రపంచ చరిత్రలో ఇతర ప్రదేశాలలో మరియు కాలాలలో ఉన్న జనులు యేసు క్రీస్తు పట్ల వారి నిబద్ధతను ప్రదర్శించారు.5 మోర్మన్ గ్రంథములో ఆంటై-నీఫై-లీహైయులుగా పిలువబడు జనులు “వారి తిరుగుబాటు యొక్క ఆయుధాలను క్రిందపడవేసిరి,” దేవునికి ఒక సాక్ష్యముగా … [వారి] ఆయుధాలను తిరిగి ఎన్నడూ ఉపయోగించకుండా “భూమియందు లోతుగా” వాటిని పాతిపెట్టిరి. 6 ఆ విధంగా చేయుట ద్వారా, దేవుని బోధనలను అనుసరిస్తామని, వారి నిబద్ధతలో ఎన్నటికీ వెనుతిరగమని వారు వాగ్దానము చేసారు. ఈ చర్య “ప్రభువునకు పరివర్తన చెందుటకు” 7 మరియు ఎన్నడూ పడిపోకుండా ఉండుటకు ప్రారంభము.

“ప్రభువునకు పరివర్తన చెందుట” అనగా పాత నమ్మకాల వ్యవస్థ చేత ఆదేశించబడిన మార్గమును మార్చుకొని, పరలోక తండ్రి యొక్క ప్రణాళికయందు, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమందున్న విశ్వాసముపైన ఆధారపడియున్న క్రొత్త దానివైపు తిరుగుట. ఈ మార్పు వారి బోధనలను మానసికంగా అంగీకరించుట కంటే ఎక్కువ. అది మన గుర్తింపును ప్రభావితం చేస్తుంది, ఈ జీవిత పరమార్థమును గూర్చి మన అవగాహనను మారుస్తుంది, దేవుని పట్ల మార్పులేని విశ్వసనీయతకు దారితీస్తుంది. స్థిరముగా యేసు క్రీస్తుకు నిబద్ధత కలిగియుండి, నిబంధన మార్గమును అనుసరించుటకు వ్యతిరేకముగా ఉన్న వ్యక్తిగత కోరికలు తొలగిపోయి, పరలోక తండ్రి చిత్తమునకు సమర్పించుకొనే సంకల్పంతో అవి భర్తీ చెయ్యబడతాయి.

ప్రభువునకు పరివర్తన చెందుట అనేది దేవునికి అచంచలమైన నిబద్ధతను కలిగియుండి, తరువాత మన జీవితాలకు ఆ నిబద్ధతను కేంద్రముగా చేసుకొనుటతో ప్రారంభమౌతుంది. అటువంటి నిబద్ధత మన జీవితాలలో స్థిరముగా స్థాపించబడటం ఒక జీవితకాల ప్రక్రియ మరియు దానికి సహనము, నిరంతర పశ్చాత్తాపము అవసరము. చివరకు, ఈ నిబద్ధత మనమెవరమో దానిలో భాగమౌతుంది, మన స్వంత భావనలో మిళితమై ఎప్పటికీ మన జీవితాలలో ఉంటుంది. మనం దేనిగురించి ఆలోచిస్తున్నప్పటికి మన పేరును మనం ఎన్నడూ ఎలా మర్చిపోమో, అదేవిధంగా మన హృదయాలలో చెక్కబడిన ఆ నిబద్ధతను మనమెన్నడూ మర్చిపోము. 8

మన పాత విధానాలను మళ్ళీ వాటివైపు ఎన్నడూ తిరిగి వెళ్లకుంగా మార్చుకొని, క్రీస్తునందు ఒక క్రొత్త జీవితమును మొదలుపెట్టాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది రక్షకునియందు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు జరుగుతుంది, విశ్వాసము కలిగిన వారు సాక్ష్యము చెప్పగా వినుట వలన అది మొదలౌతుంది.9 ఆ తరువాత, ఆయనకు మనము స్థిరమైన నిబద్ధతను కలిగియుండే విధానాలలో క్రియలు చూపించడం వలన విశ్వాసము మరింత బలపడుతుంది.10

ఇప్పుడు, అధికమైన విశ్వాసము ఫ్లూ లేదా సాధారణ జలుబు వలే వ్యాప్తి చెందితే బాగుండేది. అప్పుడు ఒక “ఆత్మీయ” తుమ్ము ఇతరులలో విశ్వాసాన్ని నెలకొల్పుతుంది. కాని అది ఆవిధంగా జరుగదు. విశ్వాసము పెరగాలంటే ఒకే ఒక్క మార్గము ఆ వ్యక్తి విశ్వాసముతో చేసి చూపించుట. ఈ చర్యలు తరచు ఇతరులచేత ఇవ్వబడిన ఆహ్వానాల వల్ల ప్రేరేపించబడతాయి, కాని ఇంకొకరి విశ్వాసాన్ని మనం “వృద్ధి” చెయ్యలేము లేదా మన విశ్వాసాన్ని పదిలపరచుకొనుటకు కేవలం ఇతరులపైన ఆదారపడలేము. మన విశ్వాసము అభివృద్ధి చెందుటకు, విశ్వాసమును-పెంచే చర్యలైన ప్రార్థించుట, లేఖనములను అధ్యయనము చేయుట, సంస్కారములో పాలుపొందుట, ఆజ్ఞలు పాటించుట, మరియు ఇతరులకు సేవ చేయుట వంటివి మనం తప్పక ఎంచుకోవాలి.

యేసు క్రీస్తునందు మన విశ్వాసము పెరుగుతున్నప్పుడు, ఆయనతో వాగ్దానాలు చెయ్యమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తారు. అటువంటి వాగ్దానాలుగా పిలవబడు ఈ నిబంధనలు మన పరివర్తనకు రుజువులు. నిబంధనలు మన ఆత్మీయ అభివృద్ధికి ఒక స్థిరమైన పునాదిని కూడా సృష్టిస్తాయి. మనం బాప్తీస్మము తీసుకోవడానికి, ఎన్నుకొన్నప్పుడు, మనము యేసు క్రీస్తు11 యొక్క నామమును మనపైకి తీసుకొనుట ప్రారంభిస్తాము మరియు ఆయనతో మనల్ని మనం గుర్తించుటకు ఎన్నుకుంటాము. ఆయన వలె అగుటకు, ఆయన లక్షణాలు పెంపొందించుకొనుటకు మనం ప్రతిజ్ఞ పూనుతాము.

నిబంధనలు మనల్ని రక్షకునికి స్థిరమైన నిబద్ధతను కలిగి ఉండేలా చేసి, మన పరలోక గృహానికి నడిపించే మార్గమంతటిలో ముందుకు నడిపిస్తాయి. నిబంధనల యొక్క శక్తి మన హృదయములో కలిగిన బలమైన మార్పును కొనసాగించుటకు సహాయపడుతుంది, ప్రభువుకు మన పరివర్తనను ఎక్కువ చేస్తుంది మరియు క్రీస్తు ప్రతిరూపాన్ని మన ముఖములపైన మరింత సంపూర్ణముగా పొందుటకు సహాయము చేస్తుంది.12 మన నిబంధనలకు చిత్తశుద్ధిలేని నిబద్ధత మనకు దేనిని అభయమివ్వదు.13 మనం చేసిన నిబంధనలకు నిబద్ధత కలిగియుండకుండా, మన పాత విధానాలను నిశ్చలమైన నీటిలో త్రోసివేసి లేదా తిరుగుబాటు అనే మన ఆయుధాలను వాటి పిడులు పైకి కనిపించేట్లు పాతిపెట్టుటకు మనం శోధించబడవచ్చును. కాని మన నిబంధనలకు ద్వంద్వ ప్రవృత్తిగల నిబద్ధత పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క శుద్ధిచేయు శక్తికి ద్వారములు తెరువవు.

కిన్షాసా దేవాలయము

మన నిబంధనలను పాటించుటకు మన నిబద్ధత షరతులతో కూడినదిగా ఉండకూడదు లేదా మన జీవితాలలో మారుచున్న పరిస్థితులకు అనుగుణంగా మారకూడదు. కిన్షాసా దేవాలయానికి దగ్గర పారుచు, దానిపై ఆధారపడగల కాంగో నది వలె దేవుని యెడల మన స్థిరత్వము ఉండాలి. ఈ నది ప్రపంచములో ఉన్న మిగిలిన నదులవలె కాక, సంవత్సరమంతా ప్రవహిస్తూ 14, ఒక సెకనుకు 11 మిలియన్ గ్యాలన్ల (41.5 మిలియన్ లీటర్ల) నీటిని అట్లాంటిక్ మహా సముద్రములో ప్రవహింపజేస్తుంది.

ఆధారపడగలిగిన వారిగా మరియు స్థిరముగా ఉండమని రక్షకుడు తన శిష్యులను ఆహ్వానించెను. ఆయన తన శిష్యులతో “కాబట్టి, నేను బోధించి, ఆజ్ఞాపించు వాటిని చేయుదుమని మీ హృదయాలలో ఒక తీర్మానము తీసుకొనుము,”15 అని ఆయన సెలవిచ్చెను. మన నిబంధనలను పాటించాలనే ఒక “స్థిరమైన” దృఢసంకల్పము దేవుని వాగ్దానాల యొక్క పూర్తి నెరవేర్పుకు అనుమతిస్తుంది తద్వారా మనం శాశ్వతమైన సంతోషాన్ని పొందగలము.16

అనేకమంది విశ్వాసులైన కడవరి దిన పరిశుద్ధులు తమ నిబంధనలు పాటిస్తామని దేవునితో తీర్మానించుకున్నారని, శాశ్వతముగా మార్పుచెందారని వారు కనపరిచారు. అటువంటి ముగ్గురు వ్యక్తులైన—సహోదరుడు బాంజా ముసియోకో, సహోదరి బాంజా రెజిన్ మరియు సహోదరుడు బ్యూయి కితబుంగి గురించి నన్ను చెప్పనివ్వండి.

బంజా కుటుంబము

1977లో బాంజా దంపతులు, ఇప్పుడు డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోగా పిలవబడు జైర్ దేశములోని కిన్షాసాలో నివసించారు. వారు తమ ప్రొటస్టెంట్ సంఘ సమాజములో మిక్కిలి గౌరవింపబడినవారు. వారికున్న ప్రతిభల వలన, వారి సంఘము వారి యౌవన కుటుంబము స్విట్జర్లాండు వెళ్లి చదువుకొనుటకు వారి కొరకు ఒక విశ్వవిద్యాలయ స్కాలర్‌షిప్‌ను సమకూర్చింది.

జెనీవాలో ఉన్నప్పుడు, వారి కాలేజీకు వెళ్లు బస్సు మార్గములో, సహోదరుడు బాంజా “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము” అనే పేరుతో ఒక చిన్న సంఘ కూడిక మందిరమును తరచు చూస్తూ ఉండెను. “ఈ కడవరి దినాలలో, యేసు క్రీస్తు ఇప్పుడు పరిశుద్ధులను కలిగియున్నారా?” అని ఆశ్చర్యపడెను. చివరకు అతను వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నాడు.

ఆ శాఖలో సహోదరుడు మరియు సహోదరి బాంజా మనఃపూర్వకముగా పలకరించబడ్డారు. “దేవుడు గాలివలే ఆత్మయైతే, ఆయన పోలికచొప్పున మనమెలాగు సృష్టించబడగలము?” మొదలైన దేవుని యొక్క స్వభావము గురించి వారికి దీర్ఘకాలము ఉన్న ప్రశ్నలలో కొన్నిటిని వారు అడిగారు. ఆయన సింహాసనముపైన ఎలా కూర్చోగలరు?” ఒక క్లుప్త సమావేశములో మిషనరీలు పునఃస్థాపించబడిన సిద్ధాంతమును వివరించినంత వరకు వారు ఎన్నడూ సంతృప్తికరమైన సమాధానము పొందలేదు. ఆ సువార్త పరిచారకులు వెళ్లిన తరువాత, బాంజా దంపతులు ఒకరి వైపు మరొకరు చూసి, “మనం విన్నది సత్యము కాదా?” అని అన్నారు. వారు సంఘమునకు క్రమముగా వస్తూ, మిషనరీలను కలుస్తూ ఉండేవారు. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘములో బాప్తీస్మము తీసుకొనుట వలన పర్యవసానాలు ఉంటాయని వారికి తెలుసు. వారి స్కాలర్‌షిప్‌లు వెనుకకు తీసుకోబడతాయి, వారి వీసాలు రద్దు చెయ్యబడతాయి, వారు మరియు వారి ఇద్దరి చిన్నపిల్లలు స్విట్జర్లాండ్ విడిచి వెళ్లవలసి వస్తుంది. ఐనప్పటికి, 1979 అక్టోబర్‌లో వారు బాప్తీస్మము తీసుకొని, నిర్ధారించబడ్డారు.

బాప్తీస్మము తీసుకొన్ని రెండు వారాల తరువాత, సహోదరుడు మరియు సహోదరి బాంజా వారి దేశములో మొదటి మరియు రెండవ సభ్యులుగా కిన్షాసాకు తిరిగివచ్చారు. జెనీవా శాఖలో సభ్యులు వారితో పరిచయాన్ని కొనసాగించారు మరియు సంఘ నాయకులతో కలుసుకొనుటకు వారికి సహాయము చేసారు. జైర్‌లో దేవుడు తన సంఘాన్ని స్థాపించే వాగ్దానము చేయబడిన గడియ వరకు విశ్వాసముగా వేచియుండమని బాంజా దంపతులు ప్రోత్సాహించబడ్డారు.

ఎల్డర్ బ్యూయి

ఇది ఇలా ఉండగా, జైర్ నుండి బదులు విద్యార్థియైన సహోదరుడు బ్యూయి బెల్జియంలో చదువుతున్నాడు. అతడు బ్రస్సెల్స్ వార్డులో 1980లో బాప్తీస్మము తీసుకొన్నాడు. ఆ తరువాత వెంటనే అతడు ఇంగ్లాండులో పూర్తి-కాల సువార్త పరిచర్య చేసెను. మరియు దేవుడు తన అద్భుతాలను చేసెను. సహోదరుడు బ్యూయి తన దేశములో మూడవ సంఘ సభ్యునిగా జైర్‌కు తిరిగి వచ్చెను. తల్లిదండ్రుల అనుమతితో, అతని కుటుంబ గృహములో సంఘ కూడికలు జరిపించబడ్డాయి. 1986 ఫిబ్రవరిలో సంఘము అధికారికముగా గుర్తించబడాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టబడెను. జైర్ యొక్క ముగ్గురు పౌరుల సంతకాలు కావాలి. అర్జీకి ఆనందముతో సంతకము చేసిన ఆ ముగ్గురు ఎవరనగా సహోదరుడు బాంజా, సహోదరి బాంజా మరియు సహోదరుడు బ్యూయి.

సహోదరుడు బ్యూయి మరియు బాంజాలు

ఈ భక్తిగల సభ్యులు సత్యమును విన్నప్పుడు దానిని తెలుసుకున్నారు; బాప్తీస్మము వద్ద ఒక నిబంధన చేసుకున్నారు అది రక్షకునికి స్థిరమైన నిబద్ధతను కలిగియుండి, నిబంధన మార్గమును వెంబడించుటకు వారికి సహాయపడింది. కాని వారు ఉపమానరీతిగా తమ పాత విధానాలను వాటిని తిరిగి తీసుకునే ఉద్దేశమును కలిగిలేకుండా గలగల పారుచున్న జలపాతాలలో పడవేసారు. ఆ మార్గము ఎల్లప్పుడు సులభముగా ఉండలేదు. రాజకీయ అలజడి, సంఘ నాయకులతో అంత తరుచుగా కలువకపోవడం, పరిశుద్ధుల సమాజమును నిర్మించుటలో ఉండే సవాళ్లు తక్కువ నిబద్ధత కలిగిన వారిని నిరుత్సాహపరిచి ఉండేవి. సహోదరుడు మరియు సహోదరి బాంజా, సహోదరుడు బ్యూయి విశ్వాసములో స్థిరముగా ఉండిరి. జైర్ దేశములో సంఘము అధికారికముగా గుర్తింపు పొందడానికి దారి తీసిన అర్జీపై సంతకము చేసిన 33 సంవత్సరాల తరువాత కిన్షాసా దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు వారు అక్కడ హాజరయ్యారు.

సహోదరుడు మరియు సహోదరి బాంజా

బాంజా దంపతులు నేడు సమావేశ కేంద్రములో ఇక్కడ ఉన్నారు. వారితో పాటు వారి ఇద్దరి కుమారులు జూనియర్ మరియు ఫిల్, కోడళ్ళు యానీ మరియు యుయు కూడా ఉన్నారు. 1986లో, జూనియర్ మరియు ఫిల్ జైర్‌లో ఉన్న సంఘములో బాప్తీస్మము తీసుకొన్న మొదటి వ్యక్తులు. సహోదరుడు మ్యూయి తన భార్యయైన మగుయ్ మరియు వారి ఐదుగురు పిల్లలతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు.

సహోదరి మరియు సహోదరుడు మ్యూయి

ఈ అగ్రగాములు నిబంధనలు అనగా అర్థమేమిటో గ్రహించారు, వాటి ద్వారా “వారి దేవుడైన ప్రభువు యొక్క జ్ఞానములోనికి తీసుకొనిరాబడి, వారి విమోచకుడైన యేసు క్రీస్తునందు ఆనందించిరి.” 17

వీరు మరియు వారిని అనుసరించిన పదుల వేల కాంగో పరిశుద్ధులు మరియు ప్రపంచమంతటా ఉన్న మిలియన్లకొద్ది ఇతరుల వలె మనం ఏవిధంగా రక్షకునికి స్థిరమైన నిబద్ధతను కలిగియుండి, విశ్వాసముగా ఉండగలము? ఎలా ఉండాలో రక్షకుడు మనకు బోధించారు. ప్రతివారము మనం సంస్కారములో పాలుపొంది మన పరలోక తండ్రితో ఒక నిబంధన చేసుకుంటాము. ఆయన నామమును మనపై తీసుకొని, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొని, ఆయన ఆజ్ఞలు పాటిస్తామని మన సమ్మతిని ప్రతిజ్ఞ చేయుట ద్వారా మన గుర్తింపును రక్షకునితో ముడిపెడతామని మనం వాగ్దానము చేస్తాము.18 ప్రతి వారము జాగ్రత్తగా సిద్ధపడుచు, యోగ్యతతో ఈ నిబంధనలను చేయుట ద్వారా రక్షకునికి స్థిరమైన నిబద్ధతను మనం కలిగియుండేలా చేయును, మన నిబద్ధతను అంతర్గతము చేసుకొనుటకు19 మనకు సహాయపడును మరియు నిబంధన మార్గములో శక్తివంతముగా ముందుకు తీసుకొనివెళ్ళును.

శిష్యత్వమనే జీవితాంత ప్రక్రియకు కట్టుబడి ఉండాలని నేను మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. నిబంధనలను చేసి, పాటించండి. మీ పాత విధానాలను లోతైన గలగల పారే జలపాతాలలో పడవేయండి. తిరుగుబాటు అనే మీ ఆయుధాలను వాటి పిడులు పైకి కనబడకుండా పూర్తిగా పాతిపెట్టండి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమువలన, నిజమైన ఉద్దేశముతో నిబంధనలు చేయడం, నమ్మకముగా వాటిని ఘనపరచడం ద్వారా మీ జీవితము శాశ్వతముగా మారుతుంది. మీరు ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకొని, అనుసరించి, ప్రేమించినప్పుడు మీరు రక్షకునివలె మరింతగా మార్పుచెందుతారు. ఆయన స్థిరమైన పునాది అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన నమ్మదగినవాడు మరియు ఆయన వాగ్దానాలు నిశ్చయమైనవి. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. మట్టల ఆదివారము, ఏప్రిల్ 14, 2019లో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత నియమించబడినట్లుగా ఆ దేవాలయ ప్రతిష్ఠ జరిగింది.

  2. చిత్రకారుడైన డేవిడ్ మెకిల్, కాంగో జలపాతములను కియుబు జలపాతముల ఛాయాచిత్రముల నుండి చిత్రీకరించెను. కియుబు జలపాతములు డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క ఆగ్నేయ భాగమైన లుబుంబాషి యొక్క ఉత్తరముగా దాదాపు 249 మైళ్ళ (400 కిలోమీటర్ల) దూరంలో ఉన్నాయి.

  3. ఈ వస్తువులు కికోన్గోలో ఇన్కిసి అని, ఫ్రెంచ్‌లో ఫెటిషెస్ అని ప్రాచుర్యములో ఉన్నాయి. ఈ పదము “అమ్యూలెట్స్ ,” “టాలిస్మాన్స్,” లేదా “ఫెటిషెస్,” అని ఆంగ్లములో అనువదించబడును.

  4. డేవిడ్ మెకిల్ జలపాతాల ఛాయాచిత్రముల ఆధారముగా జాంగో జలపాతములను కూడా చిత్రీకరించెను. జాంగో జలపాతాలు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, కిన్షాసా నుండి 81 మైళ్ల (130 కిలోమీటర్ల) దూరంలో ఉన్నాయి. ఈ జలపాతాలవద్ద నది జడి ఇంకిసి, లేదా “రివర్ ఆఫ్ ఫెటిషెస్” అని పిలువబడును. మూలగ్రంథములో వివరించబడిన ఆచారమును ఆ పేరు ప్రతిబింబిస్తుంది.

  5. క్రీ.శ. 1000వ సంవత్సరములో ఐస్‌లాండ్ గోత్రము వారు రెండు వారాల వార్షిక ఆల్టింగ్, కొరకు కూడి వచ్చారు, అది ఒక అనధికారిక అసెంబ్లీ, అది అందరికి వర్తించే చట్టాలను రూపోందించును. క్రైస్తవత్వములోకి మారాలా లేదా నార్వే దేవుళ్ళను పూజించు కొనసాగించాలా అని థోర్‌గెయ్‌ర్ అని పేరుగల వ్యక్తిని అందరి కొరకు నిర్ణయము తీసుకోమని అడిగారు. మూడు రోజులు తన గుడారములో ఏకాంతముగా గడిపిన తరువాత థోర్‌గెయ్‌ర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు: ఆ గోత్రము వారు క్రైస్తవులుగా మారెదరు. థోర్‌గెయ్‌ర్ తన పల్లెకు తిరిగి వస్తుండగా, తాను విలువైనవిగా భావించిన నార్వే దేవుళ్ళ విగ్రహాలను ఇప్పుడు గోడాఫోస్, లేదా దేవుళ్ళ జలపాతాలు అని పిలవబడు జలపాతాలలో పడవేసెను.” థోర్‌గెయ్‌ర్ క్రైస్తవత్వమునకు పూర్తిగా పరివర్తన చెందడాన్ని ఈ చర్య తెలియజేస్తుంది.

  6. ఆల్మా 23:13; 24:17–18.

  7. ఆల్మా 23:6; డేవిడ్ ఏ. బెడ్నార్, “Converted unto the Lord,” Liahona, నవం. 2012, 106–9 చూడండి.

  8. యెహేజ్కేలు 11:19–20; 2 కొరింథీయులకు 3:3 చూడండి.

  9. రోమా 10:14, 17 చూడండి.

  10. Preach My Gospel: A Guide to Missionary Service, rev. ed. (2018), 203 చూడండి.

  11. డాలిన్ హెచ్. ఓక్స్, “Taking upon Us the Name of Jesus Christ,” Ensign, మే 1985, 80–83 చూడండి.

  12. ఆల్మా 5:12-14 చూడండి.

  13. సిద్ధాంతము మరియు నిబంధనలు 82:10 చూడండి.

  14. కాంగో నది, అత్యంత లోతైన, అతి శక్తివంతమైన వాటిలో రెండవది మరియు ప్రపంచంలో పొడవైన నదులలో తొమ్మిదవ నది. ఇది భూమధ్య రేఖను రెండుసార్లు దాటుతుంది కాబట్టి, నదిలో ఒక భాగము ఎల్లప్పుడు వర్షాకాలములో ఉండి, ఫలితంగా క్రమముగా నీటి ప్రవాహాన్ని కలిగియుంటుంది. క్రమముగా నీటి ప్రవాహము ఉండటమంటే ఆ ప్రవాహము సంవత్సరము పొడవున స్థిరముగా ఉండి, సంవత్సరాలుగా నీటి ప్రవాహ రేటు మారినప్పటికి (సెకనుకు 23,000 నుండి 75,000 క్యూబిక్ మీటర్లు మధ్య) సెకనుకు సరాసరి 41,000 క్యూబిక్ మీటర్ల నీటిని ప్రవహింప చేస్తుంది.

  15. జోసెఫ్ స్మిత్ అనువాదము, లూకా 14:28 (లూతా 14:27, పాదవివరణ బిలో).

  16. 2 నీఫై 9:18; రస్సెల్ ఎమ్. నెల్సన్, “Joy and Spiritual Survival,” Liahona, నవం. 2016, 81–84 చూడండి. “సంతోషము అనేది విశ్వాసులకు ఇవ్వబడు వరము” అని అధ్యక్షులు నెల్సన్ అన్నారు.

  17. ఆల్మా 37:9.

  18. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడుము. 2019 జూన్‌లో సువార్త పరిచర్య నాయకత్వ సెమినార్ లో, సంస్కారములో పాలుపొందిన తరువాత, ఆయన వ్యవహారిక సందేశము మొదలుపెట్టక ముందు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు, “ఈ రోజు నేను సిద్ధపరచిన సందేశము కంటే నేను ఒక నిబంధనను చేసుకొనుట ఎక్కువ ప్రాముఖ్యమైనదని నాకు ఒక ఆలోచన కలిగింది. యేసు క్రీస్తు నామమును నాపైకి తీసుకుంటానని, ఆయన ఆజ్ఞలు పాటించుటకు సమ్మతిస్తున్నానని సంస్కారములో పాలుపొందుచున్నప్పుడు నేనొక నిబంధన చేసాను. బాప్తీస్మము సమయంలో చేసిన నిబంధనలను క్రొత్తవిగా చేయుటకు సంస్కారములో పాలుపొందుతుందామనే భావవ్యక్తీకరణను తరచుగా నేను వింటాను. అది నిజమైనప్పటికి, ఇది అంతకంటే ఎక్కువే. నేనొక నూతన నిబంధన చేసాను. మీరు కూడా నూతన నిబంధనలు చేసారు. … అప్పుడు బదులుగా ఆయన ఆత్మను ఎల్లప్పుడు మనతో కలిగియుంటామని ఆయన ఒక ప్రకటన చేసారు. ఎంత గొప్ప దీవెన!”

  19. 3 నీఫై 18:12 చూడండి.