రండి, నన్ను అనుసరించండి
మార్చి 2–8. 2 నీఫై 31–33: “మార్గము ఇదే”


“మార్చి 2–8. 2 నీఫై 31–33: ‘ఆయనే మార్గం,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“మార్చి 2–8. 2 నీఫై 31–33,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

యేసు తన శిష్యులకు బోధించుట

యేసు తన శిష్యులకు బోధించుట, జస్టిన్ కంజ్ చేత

మార్చి 2–8

2 నీఫై 31–33

“మార్గము ఇదే”

ఈ సారాంశం 2 నీఫై 31–33 లో మీకు అర్థవంతముగా అనిపించే సూత్రాలను సూచిస్తుంది. కానీ మీ అధ్యయనంలో మీరు నేర్చుకునే అతి ముఖ్యమైన విషయాలు ఆత్మ యొక్క గుసగుసలనుండి వస్తాయి. ఈ నడిపింపును వెతకండి మరియు మీకు వచ్చే ప్రేరేపణలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

నీఫై చివరిగా నమోదు చేసిన పదాలలో, ఈ ప్రకటనను మేము కనుగొన్నాము: “ప్రభువు నన్ను ఆజ్ఞాపించెను మరియు నేను లోబడవలెను” (2 నీఫై 33:15). ఇది నీఫై జీవితానికి సరిపోయే సారాంశం లాగే ఉంది. ఆయన ప్రభువు చిత్తాన్ని వెతికి, ధైర్యంగా దానిని నెరవేర్చడానికి ప్రయత్నించెను—అది లేబన్ నుండి ఇత్తడి పలకలను పొందడానికి అతని ప్రాణాలకు తెగించడం, పడవను నిర్మించి సముద్రం దాటడం లేదా క్రీస్తు సిద్ధాంతాన్ని తేటదనం మరియు శక్తితో నమ్మకంగా బోధించడం కావచ్చు. “నిత్యజీవానికి దారి చూపించే తిన్నని, ఇరుకైన మార్గం“ అనుసరించడం ద్వారా “క్రీస్తులో స్థిరత్వంతో ముందుకు సాగవలసిన“ ఆవశ్యకతను నీఫై స్పష్టంగా వివరించగలిగెను. (2 నీఫై 31:20, 18), ఎందుకంటే ఆయన ఆ మార్గాన్నే అనుసరించెను. ఈ మార్గం, కొన్ని సమయాల్లో గట్టిగా కోరబడినట్లుగా ఉన్నప్పటికి, అది చాలా సంతోషకరమైనదని, మరియు “దేవుని రాజ్యమందు మనుష్యుడు రక్షించబడుటకు పరలోకం క్రింద ఇయ్యబడిన ఏ ఇతర మార్గము గాని నామము గాని లేదు” అని ఆయన అనుభవంతో గ్రహించెను. (2 నీఫై 31:21).

వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు

2 నీఫై 31–32

యేసు క్రీస్తు మరియు ఆయన సిద్ధాంతం మాత్రమే నిత్యజీవానికి ఏకైక మార్గం.

మీరు నిత్యజీవ మార్గాన్ని కొన్ని మాటలలో సంగ్రహించి చెప్పాలంటే, మీరు ఏమి చెబుతారు? నీఫై, తన స్వాభావిక తేటదనం మరియు సరళతతో ఈ విధంగా చేసెను: క్రీస్తుపై విశ్వాసం, పశ్చాత్తాపం, బాప్తీస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందటం మరియు అంతము వరకు సహించడం. మీరు 2 నీఫై 31–32 లో నీఫై బోధనలను అధ్యయనం చేసిన తర్వాత, మీ స్వంత మాటలలో మీరు వాటిని ఎవరికైనా ఎలా వివరిస్తారో పరిశీలించండి. ఈ బోధనలను అనుసరించి జీవించడం వలన మీరేవిధంగా దీవించబడ్డారో ఆలోచించండి. మీరు 2 నీఫై 31:18–20 లో నీఫై బోధనలను పరిశీలించవచ్చు మరియు సువార్త మార్గంలో “ముందుకు వెళ్లడానికి” మీ స్వంత ప్రయత్నాలను పరీక్షించి చూసుకోవచ్చు.

3 నీఫై 11:32–39; 27:13–22; డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “క్రీస్తు సిద్ధాంతం,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2012, 86–90; బ్రయన్ కె. ఆష్టన్, “క్రీస్తు సిద్ధాంతం,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2016, 106–9 కూడా చూడండి, .

ఒక కుటుంబం కలిసి ప్రార్థించుట

యేసు క్రీస్తు బోధనలను అనుసరించడం మనల్ని నిత్య జీవమునకు నడిపిస్తుంది.

2 నీఫై 31:4–13

యేసు క్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు విధేయతకు సరైన ఉదాహరణగా నిలిచెను.

మీ బాప్తిస్మం నిన్న జరిగినా లేదా 80 సంవత్సరాల క్రితం జరిగినా, ఇది ఒక కీలకమైన క్షణం—మీరు యేసు క్రీస్తును అనుసరించడానికి జీవితకాల నిబంధనలోనికి ప్రవేశించారు. మీరు 2 నీఫై 31:4–13 లోని రక్షకుని బాప్తీస్మము గురించి చదువుతున్నప్పుడు మీ బాప్తీస్మము గురించి ఆలోచించండి. రక్షకుడు ఎందుకు బాప్తీస్మం తీసుకున్నారు? ఆయన బాప్తీస్మం తీసుకున్న కారణాలు మరియు మీరు బాప్తీస్మం తీసుకున్న కారణాల మధ్య సారూప్యత ఏమిటి? విధేయతకు రక్షకుని యొక్క మాదిరిని అనుసరించుటను కొనసాగించడానికి మీరు ఈ రోజు ఏమి చేస్తున్నారు?

మీరు యేసు క్రీస్తును అనుసరించడానికి తిరిగి వాగ్దానము చేయడానికి సంస్కార విధి ప్రతి వారం మీకున్న ఒక అవకాశం. తదుపరిసారి మీరు సంస్కారంలో పాల్గొన్నప్పుడు, 2 నీఫై 31:13 చదవడం గురించి పరిగణించండి మరియు “హృదయము యొక్క పూర్తి ఉద్దేశముతో కుమారుని అనుసరించడానికి” మరియు “క్రీస్తు నామాన్ని మీ పైన తీసుకోవడానికి” మీ సంకల్పం గురించి ఆలోచించండి.

2 నీఫై 31:17–20; 32

నేను ఏమి చేయాలో పరిశుద్ధాత్మ నాకు చూపించును.

బాప్తీస్మము మరియు నిర్ధారణ అనేవి “[మనం] ప్రవేశించే ద్వారం” తిన్నని, ఇరుకైన మార్గం అయితే, (2 నీఫై 31:17), మనం ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మనం ఏమి చేయాలి? దాని గురించే నీఫై ప్రజలు ఆలోచించారు (2 నీఫై 32:1 చూడండి). 2 నీఫై 31:19–20 మరియు 32వ అధ్యాయంలో నీఫై ఏమి సమాధానాలు ఇచ్చెను? మీ అంతట మీరు ఏ సమాధానాలు కనుగొన్నారు?

అలాగే డేవిడ్ఎ . బెడ్నార్, “పరిశుద్ధాత్మను పొందండి,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2010, 94–97; “పరిశుద్ధాత్మ,” సువార్త అంశాలు, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

2 నీఫై 33

మోర్మన్ గ్రంథము క్రీస్తును విశ్వసించమని అందరిని ఒప్పిస్తుంది.

2 నీఫై 33లో, నీఫై తన రచనలను ముగించి, అసలు తాను వాటిని వ్రాయడానికి గల కారణాలను వివరించెను. ఈ అధ్యాయంలో మీరు ఏ కారణాలను కనుగొన్నారు? 1 నీఫై మరియు 2 నీఫైలలో మీరు ఇప్పటివరకు చదివిన వాటిని మరియు మీరు పక్కన వ్రాసుకుని ఉంటే, ఆ గమనికలను ఒకసారి చూడండి. ఆ కథలు మరియు బోధనలు నీఫై యొక్క ఉద్దేశాలను మీకు ఏవిధంగా నెరవేర్చాయి? ఉదాహరణకు, “[క్రీస్తు] నందు విశ్వాసముంచునట్లు, అంతము వరకు సహించునట్లుగా” వారు మీకు ఎలా బోధించారు? (4వ వచనం). ఈ అనుభవాలను నమోదు చేయడం లేదా వాటిని కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడితో పంచుకోవడాన్ని పరిగణించండి.

కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

2 నీఫై 31:5–13

కుటుంబ సభ్యులు ఎవరైనా బాప్తీస్మము కోసం సిద్ధపడుతున్నారా లేదా ఇటీవల ఎవరైనా బాప్తీస్మము తీసుకున్నారా? బహుశా, వారు బాప్తీస్మం తీసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారో వారు పంచుకోవచ్చు. నీఫై బోధనల ప్రకారం, మనం బాప్తీస్మం తీసుకోవడానికి కొన్ని కారణాలు ఏమిటి? బాప్తీస్మము తీసుకున్నప్పుడు మనకు లభించే కొన్ని దీవెనలు ఏమిటి?

2 నీఫై 31:17–21

“తిన్నని, ఇరుకైన మార్గం” గురించి నీఫై సాదృశ్యము అర్థం చేసుకోవడంలో మీ కుటుంబానికి మీరు ఎలా సహాయపడగలరు? (2 నీఫై 31:18). ఉదాహరణకు, 2 నీఫై 31:17–21లో నీఫై వివరించిన మార్గం యొక్క చిత్రాన్ని గియ్యడానికి మీరు కలిసి పనిచెయ్యవచ్చు, మనం ఆ మార్గంలో ప్రవేశించి, దానిలో ముందుకు సాగడానికి మనం తప్పక చేయవలసిన పనులను దానిపై వ్రాయవచ్చును. ఆ మార్గంలో ముందుకెళ్లడానికి రక్షకుడు మనకు ఎలా సహాయం చేస్తారు?

2 నీఫై 31:20

మనం అంతము వరకు ఎలా సహించాలో అర్థం చేసుకోవడంలో మీరు మీ కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే, నా సువార్తను ప్రకటించండి లోని 6వపేజీ లో సహాయకరమైన నిర్వచనం లభిస్తుంది; అదే విధంగా ఎల్డర్ డేల్ జి. రెన్లండ్ సందేశం “కడవరి దిన పరిశుద్ధులు ప్రయత్నిస్తూనే ఉంటారు” (ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2015, 56–58) కూడా సహాయపడుతుంది.

2 నీఫై 32:8–9

మనము “ఎల్లప్పుడూ ప్రార్థన చేయవచ్చు” అని అర్థం చేసుకోవడంలో కుటుంబ సభ్యులకు సహాయపడటానికి, మనము ప్రార్థన చేయగల వివిధ సందర్భాల జాబితాను మీరు తయారు చేయవచ్చు (లేదా వాటిని సూచించడానికి చిత్రాలను గీయవచ్చు). అప్పుడు మీ కుటుంబం ప్రార్థన గురించి బోధించే “మీరు ప్రార్థన చేయాలని అనుకున్నారా?” లాంటి పాటను పాడవచ్చు (కీర్తనలు, సం. 140), పాటలోని కొన్ని పదాలను వారి జాబితాలోని పదాలతో భర్తీ చేస్తూ పాడాలి. మనం ఎప్పుడూ ప్రార్థించినప్పుడు ప్రభువు మనల్ని ఏవిధంగా దీవిస్తారు?

2 నీఫై 33:1–2

ప్రజలు “పరిశుద్ధాత్మకు విరోధముగా వారి హృదయాలను కఠినపరచుకోవడానికి” వారిని ఏది నడిపిస్తుంది ? పరిశుద్ధాత్మకు “[మనలో] స్థానం” ఉందని ఎలా నిర్ధారించుకోవచ్చు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచడం

రక్షకుడిని అనుసరించండి. రక్షకుడు బోధించిన విధానం—అంటే, ఆయన ఉపయోగించిన పద్ధతులు మరియు ఆయన చెప్పిన విషయాలను అధ్యయనం చేయడం సహాయపడుతుంది. కానీ ఇతరులకు బోధించడానికి, పైకి తీసుకురావడానికి గల యేసు శక్తి అంతిమంగా ఆయన ఎవరు మరియు ఆయన ఎలా జీవించారు అనే దాని నుండి వచ్చింది. యేసు క్రీస్తులా జీవించడానికి మరియు అతని ప్రాయశ్చిత్త శక్తిపై ఆధారపడటానికి మీరు ఎంత శ్రద్ధగా ప్రయత్నిస్తారో, అంత సహజంగానే మీరు ఆయన మార్గంలో బోధిస్తారు.

బాప్తీస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తీస్మమిచ్చుట

సమస్త నీతిని నెరవేర్చడానికి, లిజ్ లెమన్ స్విండిల్ చేత