“ఫిబ్రవరి 24–మార్చి 1. 2 నీఫై 26–30:“ఒక అద్భుత క్రియ మరియు ఒక ఆశ్చర్యకార్యము”, రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“ఫిబ్రవరి 24–మార్చి 1. 2 నీఫై 26–30,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
ఫిబ్రవరి 24–మార్చి 1
2 నీఫై 26–30
“ఒక అద్భుత క్రియ మరియు ఒక ఆశ్చర్యకార్యము”
ప్రభువు ఇలా చెప్పెను, “నేను వారితో పలుకు మాటలను వ్రాయవలెనని … నేను మనుష్యులందరిని ఆజ్ఞాపిస్తున్నాను” (2 నీఫై 29:11). మీరు ప్రభువు వాక్యమును చదువుతున్నప్పుడు ఆత్మ ద్వారా ఆయన మీతో మాట్లాడతారు. మీరు పొందే దానిని నమోదు చేయండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
“అంత్య దినముల గురించి నేను మీకు ప్రవచించాను,” అని నీఫై వ్రాసెను (2 నీఫై 26:14). ఇంకా చెప్పాలంటే, అతడు మన రోజు గురించి వ్రాసెను. అతడు చూసిన దాని గురించి ఆందోళన చెందడానికి కారణం ఉంది: దేవుని శక్తి మరియు అద్భుతాలను కాదంటున్న వ్యక్తులు, ప్రబలమైన అసూయ మరియు కలహాలు, బలమైన త్రాళ్ళతో జనులను బంధిస్తున్న అపవాది. కానీ అపవాది నేతృత్వంలో ఈ కడవరి దినపు “అంధకార క్రియలకు” (2 నీఫై 26:10, 22) అదనంగా, ప్రభువు నేతృత్వంలోని “ఒక అద్భుత క్రియ మరియు ఒక ఆశ్చర్యకార్యమును” గురించి కూడా నీఫై మాట్లాడెను (2 నీఫై 27:26). మరియు ఒక గ్రంథము ఆ కార్యానికి కేంద్రమైయుంటుంది—ధూళి నుండి మాట్లాడేది, సాతాను అబద్ధాలను బహిర్గతం చేసేది మరియు నీతిమంతులను ఒక ప్రమాణంలా సమీకరించే గ్రంథము. ఆ గ్రంథము మోర్మన్ గ్రంథము, ఇందులో ఆశ్చర్య కార్యము అనగా కడవరి దినములలో ప్రభువు సంఘము యొక్క కార్యము, మరియు అద్భుతమేమనగా, మన బలహీనతలు ఉన్నప్పటికీ, పాల్గొనడానికి ఆయన మనందరినీ ఆహ్వానించడం.
వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు
యేసు క్రీస్తు తన వద్దకు రమ్మని అందరినీ ఆహ్వానించారు.
పరలోక తండ్రి “దయ మరియు దీవెనలు, మనం నమ్మడానికి లేదా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నదాని కంటే అనంతమైనవి” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు. (జోసెఫ్ స్మిత్ పత్రాలు, “చరిత్ర, 1838–1856, సంపుటి D–1,” పే. 4 [అనుబంధం], josephsmithpapers.org). 2 నీఫై 26:20–22లో నీఫై ముందుగానే చూచినవి, వచనాలు 23–33 లో రక్షకుని గురించి అతడు బోధించినవి చదివి, వాటిని జోసెఫ్ స్మిత్ ప్రకటనతో సరిపోల్చండి. ప్రభువు యొక్క అనంతమైన దయ గురించి మీరు ఏమి నేర్చుకున్నారు? మీరు దేవుని పిల్లలతో ప్రవర్తించే విధానంలో మరింతగా క్రీస్తు వలె ఉండడానికి యేసు క్రీస్తు సంఘ సభ్యునిగా మీరు ఏమి చేయవచ్చు?
3 నీఫై 18:30–32 కూడా చూడండి.
ఈ అధ్యాయాలలో పేర్కొనబడిన గ్రంథము ఏమిటి?
2 నీఫై 26–27 లోని నీఫై ప్రవచనం, యెషయా మునుపటి ప్రవచనం నుండి ఎక్కువగా తీసుకోబడింది (యెషయా 29 చూడండి), మోర్మన్ గ్రంథము రావడం గురించి ముందే చెబుతుంది. ఈ ప్రవచనం ఈ క్రింది వాటిని వివరిస్తుంది:
-
లీహై సంతానం (అతని వారసులు) మాటలు “ధూళిలో నుండి గుసగుసలుగా మాట్లాడుతున్నట్లుగా”, “పరిచయముగల స్వరమువలె ఉండును” మరియు “ఒక గ్రంథము నందు వ్రాయబడి ముద్రవేయబడును” (2 నీఫై 26:14–17; యెషయా 29:4 కూడా చూడండి).
-
గ్రంథములో కొంత భాగాన్ని ఒక చదువుకున్న వ్యక్తికి ఇవ్వడం, అతడు “నేను చదవలేను” అని చెప్పడం (2 నీఫై 27:15–20; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:64–65; యెషయా 29:11 కూడా చూడండి).
యెషయాతో పాటు, ఇతర బైబిలు ప్రవక్తలు కూడా పేరుపెట్టి చెప్పకపోయినా మోర్మన్ గ్రంథము గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు, యెహెజ్కేలు 37:15–20 “యోసేపు కర్రతునక” గురించి మాట్లాడును, అది యోసేపు వంశస్థులు అయిన నీఫైయుల గ్రంథాన్ని సూచించవచ్చు. ఈ గ్రంథము“యూదా కర్రతునక” అనగా బైబిలుతో ఏకమవుతుంది.
ఇతర ఉదాహరణలను “మోర్మన్ గ్రంథము” (లేఖన మార్గదర్శి, scriptures.ChurchofJesusChrist.org)లో కనుగొనవచ్చు.
సాతాను మోసగించడానికి ప్రయత్నిస్తాడు.
2 నీఫై 28లో అంత్య దినముల గురించి నీఫై వర్ణనలలో సాతాను యొక్క అనేక అబద్ధాలు మరియు వ్యూహాల గురించి బహిర్గతం చేయబడింది. వాటిని మీరు కనుగొనగలరేమో చూడండి (ఉదాహరణకు, వచనాలు 6, 8, 21–23, 29 చూడండి). సాతాను అబద్ధాల గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి? అపవాది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఏమి చేస్తారు?
దేవుడు తన పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి బయల్పాటు ఇస్తూనే ఉంటారు.
కడవరి దిన పరిశుద్ధులుగా మనం దేవుని వాక్కుతో సమృద్ధిగా దీవించబడ్డాము, కాబట్టి నీఫై హెచ్చరికలు మనకు వర్తించగలవు: “మనకు తగినంత ఉంది!” అని మనం ఎప్పుడూ భావించకూడదు. మీరు 2 నీఫై 28 మరియు 29లో హెచ్చరికలను చదువుతున్నప్పుడు, ఇలాంటి ప్రశ్నలను ధ్యానించండి:
-
ఆయన వాక్యం గురించి నేను ఎలా భావించాలని, స్పందించాలని ప్రభువు కోరుకుంటారు?
-
దేవుని నుండి ఎక్కువ సత్యాన్ని పొందడం గురించి ప్రజలు కొన్నిసార్లు ఎందుకు “కోపపడతారు“? (2 నీఫై 28:28). నేను ఎప్పుడైనా ఈ విధంగా భావిస్తున్నానా? అలా అయితే, నేను సత్యాన్ని మరింత సిద్ధంగా ఎలా స్వీకరించగలను?
-
దేవుని వాక్యమును స్వీకరించడం అంటే ఏమిటి? నేను ఆయన వాక్యమును ఎక్కువగా పొందాలనుకుంటున్నాను అని ఆయనకు ఎలా చూపించగలను?
ఆల్మా 12:10–11; 3 నీఫై 26:6–10 కూడా చూడండి.
దేవుడు మన కాలం కొరకు మోర్మన్ గ్రంథాన్ని సిద్ధం చేశారు.
మోర్మన్ గ్రంథము పూర్తిగా వ్రాయబడక ముందే, ఇది ఒక రోజు “నరుల సంతానానికి చాలా విలువైనదిగా” అవుతుందని నీఫై బయల్పాటు ద్వారా తెలుసుకొనెను. (2 నీఫై 28:2). మోర్మన్ గ్రంథము మీకు ఎందుకు ఎంతో విలువైనది? మీరు 2 నీఫై 29–30 చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మోర్మన్ గ్రంథము ద్వారా దేవుడు ప్రపంచంలో మరియు మీ జీవితంలో సాధిస్తున్న కొన్ని “ఆశ్చర్య” కార్యములు ఏమిటి?
కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
2 నీఫై 26:12–13
యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకుంటారని నీఫై బోధించెను. రక్షకుని గురించి వారి సాక్ష్యములను పరిశుద్ధాత్మ బలపరిచినప్పుడు కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఏ అనుభవాలను పంచుకోవచ్చు?
2 నీఫై 26:22; 28:19–22
అపవాది గురించి 2 నీఫై 26:22 ఏమి బోధిస్తుందో వివరించే వస్తుపాఠాన్ని మీ కుటుంబం ఆనందించవచ్చు. సాతాను వ్యూహాల గురించి 2 నీఫై 28:19–22లో మీరు చదువుతున్నప్పుడు, “నారతో చేసిన తాడు” సూచించడానికి మీరు ఒకరి చేతి మణికట్టుల చుట్టూ ఏదైనా దారం చుట్టవచ్చు. నారతో చేసిన తాడు సాతాను శోధనల మాదిరిగా ఎలా ఉంటుంది? ఏవిధంగా ఇది బలమైన తాడుగా కావచ్చు? సాతాను అబద్ధాలను మనం ఎలా గుర్తించగలం?
2 నీఫై 27:20–21
“నేను నా స్వంత పనిని చేయగలను” అని ప్రభువు చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? ఆయన సంఘంలో మనం సేవ చేసే విధానాన్ని ఈ సత్యం ఎలా ప్రభావితం చేస్తుంది?
2 నీఫై 28:30–31
మీ కుటుంబం దేవుని నుండి బయల్పాటు వంటిదేదైనా ఒకటి ఒక్కొక్కసారి కొద్దికొద్దిగా పొందటమే ఉత్తమమని ఆలోచించగలదా? దేవుడు మనకు నిజాన్ని అంతా ఒక్కసారిగా కాకుండా “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచ్చట కొంత అచ్చట కొంత” ఎందుకు వెల్లడిస్తారు?
2 నీఫై 29:7–9
మోర్మన్ గ్రంథముతో ప్రభువు ఏమి నిరూపించాలని లేక చూపాలని కోరుతున్నారు?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కొరకు రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లోని ఈ వారం సారాంశం చూడండి.