రండి, నన్ను అనుసరించండి
ఫిబ్రవరి 17–23. 2 నీఫై 11–25: “మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము”


“ఫిబ్రవరి 17–23. 2 నీఫై 11–25: ‘’మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ఫిబ్రవరి 17–23. 2 నీఫై 11–25,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటంబాల కొరకు: 2020

చిత్రం
యెషయా కాగితపు పత్రాలపై వ్రాయుట

ఫిబ్రవరి 17–23

2 నీఫై 11–25

“మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము”

యెషయా మాటలు “ప్రవచనము యొక్క ఆత్మతో నింపబడిన వారందరికి సరళముగా ఉన్నవి” అని నీఫై బోధించెను (2 నీఫై 25:4). మీరు చదివేటప్పుడు, మిమ్మల్ని మీరు ఆత్మీయంగా సిద్ధం చేసుకోవడం, ఆత్మను వినడం మరియు మీ అభిప్రాయాలను నమోదు చేయడం ద్వారా ప్రవచనాత్మను గ్రహించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

లోహపు పలకలపై చెక్కడం అంత సులభం కాదు, మరియు నీఫై చిన్న పలకలపై స్థలం పరిమితంగా ఉన్నది. కనుక, యెషయా రచనలను పెద్ద మొత్తంలో తన గ్రంథంలోకి నకలు చేసే దుర్భరమైన ప్రయత్నాన్ని నీఫై ఎందుకు చేసాడు? “తన జనులలో… ఈ మాటలను చూచిన వారు తమ హృదయములను ఎత్తుకొని ఆనందించునట్లు” అతడు దీనిని చేసెను (2 నీఫై 11:8). ఒక రకంగా, యెషయా రచనలను చదవడానికి ఇవ్వబడిన ఆహ్వానం ఆనందించడానికి ఇవ్వబడిన ఆహ్వానంతో సమానము. ఇశ్రాయేలును సమకూర్చడం, మెస్సీయా రాక, నీతిమంతులకు వాగ్దానం చేయబడిన వెయ్యేళ్ల శాంతి గురించి యెషయా ప్రవచనాలలో నీఫై లాగానే మీరు ఆనందం పొందవచ్చు. “బాధలు, అంధకారమందు” కూడా మీరు “గొప్ప వెలుగును చూచుచున్నారు” అని మీరు ఆనందించవచ్చు. (2 నీఫై 18:22; 19:2). మీరు “రక్షణాధారములైన బావులలో నుండి నీళ్ళు చేదుకొందురు” అని మీరు ఆనందించవచ్చు (2 నీఫై 22:3). మరో మాటలో చెప్పాలంటే, మీరు “క్రీస్తునందు ఆనందించవచ్చు” (2 నీఫై 25:26).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు

2 నీఫై 11–25

యెషయా బోధనలను నేను బాగా ఎలా అర్థం చేసుకోగలను?

కొంతమందికి, “యెషయా మాటలు సరళముగా ఉండవని” నీఫై అంగీకరించెను (2 నీఫై 25:4). నీఫై వలె పురాతన యూదుల సంస్కృతి మరియు భౌగోళికం గురించి తెలియని వారికి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది (2 నీఫై 25:6 చూడండి). కానీ యెషయా రచనలలోని అర్థాన్ని కనుగొనడంలో మనకు సహాయపడటానికి కూడా నీఫై సలహా ఇచ్చెను:

మీతో “అతని మాటలను పోల్చుకొనండి” (2 నీఫై 11:2).యెషయా యొక్క అనేక బోధనలకు బహుళ అర్థాలు, ఆచరణ మార్గాలు కలవు. ఉదాహరణకు, ఇశ్రాయేలు చెదిరిపోవడం మరియు సమకూర్చబడటం గురించి ఆయన వ్రాసిన రచనలు మీ రక్షకుని వద్దకు తిరిగి “సమకూర్చబడవలసిన” అవసరం గురించి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.

“ప్రవచనాత్మతో నింపబడి” ఉండాలని (2 నీఫై 25:4) అపేక్షించండి.యెషయా ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గం ఆత్మ నుండి ప్రేరణ పొందడం. ఆత్మీయ నడిపింపు కొరకు ప్రార్థించండి. మీరు అన్నింటినీ ఒకేసారి అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ రోజు మీ జీవితం కోసం మీరు తెలుసుకోవలసినది నేర్చుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు.

పాదవివరణలు, అధ్యాయ శీర్షకలు, లేఖన మార్గదర్శి మొదలైన వాటితో సహా లేఖనాలలోని అధ్యయన సహాయాలను ఉపయోగించుట మీకు సహాయకరంగా ఉండవచ్చు.

2 నీఫై 11:2–8; 25:19–29

“క్రీస్తునందు విశ్వసించడమే సరైన మార్గం.”

యేసు క్రీస్తు గురించి తన సాక్ష్యాన్ని వ్యక్తపరచడం ద్వారా నీఫై, యెషయా గురించి తన వ్యాఖ్యానాన్ని పరిచయం చేసి, ముగించాడు (2 నీఫై 11:2–8; 25:19–29 చూడండి). అతని సాక్ష్యం గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది? మీరు ఈ వారం అధ్యయనం చేస్తున్నప్పుడు, “క్రీస్తు నందు విశ్వాసముంచమనియు దేవునితో సమాధానపడుడనియు [తన] సంతానమును ఒప్పించుటకు” నీఫై కోరికల గురించి ఆలోచించండి (2 నీఫై 25:23), అలాగే యేసు క్రీస్తును విశ్వసించడం, అనుసరించడంలో మిమ్మల్ని ఒప్పించు భాగాలను గుర్తించండి.

రక్షకుని గురించి యెషయా బోధనలలో అనేకము చిహ్నాల ద్వారా తెలియజేయబడ్డాయని గుర్తుంచుకోవడానికి ఇది సహాయపడవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక ద్రాక్షతోట యజమాని (2 నీఫై 15:1–7 చూడండి), రాయి (2 నీఫై 18:14 చూడండి), కాంతి (2 నీఫై 19:2 చూడండి) వంటి చిహ్నాలలో రక్షకుని చూడవచ్చు. ఈ అధ్యాయాలలో యేసు క్రీస్తు యొక్క ఏ ఇతర చిహ్నాలను మీరు కనుగొంటారు? ఈ చిహ్నాలు ఆయన గురించి మీకు ఏమి బోధిస్తాయి?

2 నీఫై 12–13

గర్విష్ఠులు, లౌకికవాదులు వినయంగా అవుతారు.

అహంకారం తన ప్రజల పతనానికి కారణమవుతుందని నీఫై ముందుగా చూసెను (1 నీఫై 12:19 చూడండి). కాబట్టి అహంకారానికి వ్యతిరేకంగా యెషయా పదేపదే చేసిన హెచ్చరికలను నీఫై తన ప్రజలతో పంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. అధ్యాయాలు 12 మరియు 13 లో, గర్వాన్ని వివరించడానికి యెషయా ఉపయోగించిన గర్వము మరియు అహంకారం లాంటి పదాల కోసం చూడండి. తరువాత, అహంకారం గురించి హెచ్చరించడానికి మీకు మీరే ఒక సందేశాన్ని వ్రాస్తున్నట్లుగా మీ స్వంత మాటలలో ఈ హెచ్చరికల అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించవచ్చు.

అధ్యాయం 18: అహంకారం పట్ల జాగ్రత్త” (సంఘ అధ్యక్షుల బోధనలు: ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ [2014], 229–40) కూడా చూడండి.

2 నీఫై 12:2–5; 21:9–12; 22; 24:1–3

వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని జనులు శాంతిని పొందుతారు.

నీఫై మరియు అతని ప్రజల స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవడం మీకు సహాయపడవచ్చు. యెరూషలేము నాశనమయ్యే ముందు మీరు అక్కడినుండి పారిపోయారని ఊహించుకోండి (2 నీఫై 25:10 చూడండి), ఇప్పుడు మీరు ఇశ్రాయేలు నుండి చెదరగొట్టబడిన వారిలో భాగం. భవిష్యత్తులో ఇశ్రాయేలు సమకూర్చబడుట మరియు వెయ్యేండ్ల శాంతి గురించి యెషయా బోధనలను చదవడం ఎలా అనిపించి ఉండవచ్చు? కడవరి దిన పరిశుద్ధులుగా, క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనకు సన్నాహకంగా కడవరి దినాలలో దేవుని జనులను సమకూర్చడానికి సహాయం చేసేందుకు మనము పిలువబడ్డాము. మీరు ఈ వచనాలను చదివేటప్పుడు, అవి వివరించే ప్రవచనాలను నెరవేర్చడానికి మీరు ఎలా సహాయం చేస్తున్నారో ధ్యానించండి. దేవుని జనులను సమకూర్చడంలో సహాయపడడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయమలు ఇవ్వబడ్డాయి.

2 నీఫై 12:1–3

మీరు దేవాలయానికి—“ప్రభువు గృహము యొక్క పర్వతానికి”—వెళ్ళినట్లయితే దేవాలయ నిబంధనలు మీకు “[ప్రభువు] మార్గాల్లో నడవడానికి” ఎలా సహాయపడుతున్నాయో మీ కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. మీరు దేవాలయానికి వెళ్ళియుండకపోతే ఈ వచనాలను కలిసి చదవడం, మీరు దేవాలయ దీవెనల కోసం ఎలా సిద్ధం కావచ్చనే దాని గురించిన చర్చను ప్రేరేపిస్తుంది.

2 నీఫై 15:18–23

ఈ వచనాలు వివరించే అన్యాయమైన ఆలోచనలకు ఆధునిక ఉదాహరణల గురించి మీ కుటుంబం ఆలోచించగలదా? మంచి మరియు చెడు గురించి తప్పుడు ఆలోచనల వలన మోసపోవడాన్ని మనం ఎలా నివారించవచ్చు?

2 నీఫై 21

ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడంలో మీ కుటుంబానికి సహాయం అవసరమైతే (అది యెషయా 11కి సంబంధించినది అయితే), మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 113:1–6 లో అంతర్గత విశ్లేషణలను కనుగొనవచ్చు, అందులో ప్రవక్త జోసెఫ్ స్మిత్ యెషయా 11 గురించి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఈ వచనాల నుండి యేసు క్రీస్తు గురించి మనం ఏమి నేర్చుకుంటాము?

2 నీఫై 21:9

“ప్రభువు జ్ఞానం”తో భూమిని నింపడానికి సహాయపడేలా మనం చేయగలిగే కొన్ని నిర్దిష్ట విషయాలు ఏమిటి?

2 నీఫై 25:23–26

మీ కుటుంబ సభ్యులు “క్రీస్తునందు ఆనందించడానికి” మీరు ఎలా సహాయపడగలరు? రక్షకుని గురించి వారికి ఆనందం కలిగించే విషయాలను కాగితపు ముక్కలపై వ్రాయాల్సిందిగా మీరు వారిని ఆహ్వానించవచ్చు. అప్పుడు, భవిష్యత్తులో కుటుంబ గృహ సాయంకాలము లేదా కుటుంబ లేఖన అధ్యయనం సమయంలో ఎవరైనా ఆ కాగితాన్ని చదవగలరు. కుటుంబ సభ్యులు ఏడాది పొడవునా కాగితపు ముక్కలను జోడించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనం మెరుగుపరచుట

నమూనాల కోసం చూడండి. ప్రభువు ఎలా పని చేస్తారో చూపించే నమూనాలను లేఖనాల్లో మనం కనుగొనవచ్చు. ఉదాహరణకు, 2 నీఫై 11–25 లో, ప్రభువు ఎలా హెచ్చరిస్తారో మరియు క్షమిస్తారో చూపించే నమూనాలను మీరు కనుగొనవచ్చు.

చిత్రం
పనామా సిటీ పనామా దేవాలయము

పనామా సిటీ పనామా దేవాలయము. “యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి, … సమస్త జనులు దాని లోనికి ప్రవాహము వలే వచ్చెదరు” (2 నీఫై 12:2).

ముద్రించు