రండి, నన్ను అనుసరించండి
అక్టోబర్ 12–18. 3 నీఫై 20–26: “మీరు నిబంధన యొక్క సంతానము”


“అక్టోబర్ 12–18. 3 నీఫై 20–26: ‘మీరు నిబంధన యొక్క సంతానము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“అక్టోబర్ 12–18. 3 నీఫై 20-26,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

నీఫైయులకు క్రీస్తు ప్రత్యక్షమగుట

ఆండ్రూ బోస్లే చేత నీఫైయులకు క్రీస్తు ప్రత్యక్షమగుట యొక్క వివరణ

అక్టోబర్ 12–18

3 నీఫై 20–26

“మీరు నిబంధన యొక్క సంతానము”

లేఖనాల గురించి చెప్తున్నప్పుడు, యేసు తరచుగా వెదకుము అనే పదాన్ని ఉపయోగించారు (3 నీఫై 20:11; 23:1, 5 చూడండి). మీరు 3 నీఫై 20–26 చదివినప్పుడు, మీరు దేని గురించి వెదకుతారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

జనులు ఇశ్రాయేలు వంశము వంటి పదాలను ఉపయోగించడాన్ని మీరు వినినప్పుడు, వారు మీ గురించి మాట్లాడుతున్నారని మీరు భావిస్తారా? నీఫైయులు, లేమనీయులు ఇశ్రాయేలు యొక్క నిజమైన వారసులు—వారి కథ కూడా యెరూషలేములో మొదలవుతుంది—కానీ వారిలో కొందరికి యెరూషలేము, “వారు ఎరుగని ఒక దేశము, చాలా దూరములోనున్న ఒక దేశముగా” (హీలమన్ 16:20) కనిపించియుండవచ్చు. అవును, వారు “ఇశ్రాయేలు వృక్షము యొక్క ఒక కొమ్మయై యున్నారు,” కానీ వారు కూడా “దాని శరీరము నుండి తప్పిపోయారు” (ఆల్మా 26:36; 1 నీఫై 15:12 కూడా చూడండి). కానీ రక్షకుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన దృష్టిలో వారు తప్పిపోలేదని వారు తెలుసుకోవాలని ఆయన కోరుకున్నారు. “మీరు ఇశ్రాయేలు వంశము వారైయున్నారు,” “మరియు మీరు నిబంధన వారైయున్నారు” (3 నీఫై 20:25) అన్నారాయన. మీరు ఎవరి వారసులైనప్పటికీ లేక ఎక్కడ నివసించినప్పటికీ, బాప్తీస్మము తీసుకొని, ఆయనతో నిబంధనలు చేయువారెవరైనా కూడా ఇశ్రాయేలు వంశము వారైయున్నారని, నిబంధన వారైయున్నారని, నేడు కూడా అటువంటిదేదైనా ఆయన మీతో చెప్పవచ్చు. దానర్థము, యేసు ఇశ్రాయేలు వంశము వారి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన మీ గురించి మాట్లాడుతున్నారు. “భూమి యొక్క సమస్త జాతులు ఆశీర్వదించబడును” అనే సూచన మీకొరకైయున్నది (3 నీఫై 20:27). “లెమ్ము, నీ బలము ధరించుకొనుము” అనే ఆహ్వానము మీకొరకైనది (3 నీఫై 20:36). “నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు” అనే ఆయన అమూల్యమైన వాగ్దానము మీ కొరకైనది (3 నీఫై 22:10).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

3 నీఫై 20–22

కడవరి దినాలలో దేవుడు ఒక గొప్ప మరియు అద్భుతమైన కార్యము జరిగిస్తారు.

జనసమూహానికి రక్షకుడు కొన్ని విశేషమైన వాగ్దానాలిచ్చారు మరియు ఆయన నిబంధన జనుల భవిష్యత్తు గురించి ప్రవచించారు—అది మిమ్మల్ని కలిపియున్నది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పినట్లుగా: “మనం ప్రభువు యొక్క నిబంధన జనుల మధ్య ఉన్నాము. ఈ వాగ్దానాల నెరవేర్పులో స్వయంగా పాల్గొనే విశేషాధికారము మనకు కలదు. జీవించేందుకు ఎంత ఉత్తేజభరితమైన సమయం!” (“The Gathering of Scattered Israel,” Ensign or Liahona, Nov. 2006, 79).

3 నీఫై 20–22 లోని రక్షకుని మాటలలో అంత్యదినాలను గురించి ప్రవచనాల కొరకు చూడండి. ఈ ప్రవచనాలలో ఏవి ప్రత్యేకంగా మీకు ఉత్తేజభరితంగా ఉన్నాయి? ఈ అధ్యాయాలలోని ప్రవచనాలు నెరవేరుటలో సహాయపడేందుకు మీరేమి చేయగలరు?

దేవుని వాగ్దానాలు నెరవేరుట ఇప్పటికే మొదలైంది అనడానికి మోర్మన్ గ్రంథము యొక్క రాక (2 మరియు 3 వచనాల లోని “ఈ విషయాలు”) ఒక చిహ్నమని 3 నీఫై 21:1–7 సూచిస్తుందని గమనించండి. ఆ వాగ్దానాలేవి, మరియు వాటిని నెరవేర్చుటకు మోర్మన్ గ్రంథము ఎలా సహాయపడుతుంది?

Russell M. Nelson, “Hope of Israel” (worldwide devotional for youth, June 3, 2018), broadcasts.ChurchofJesusChrist.org కూడా చూడండి.

3 నీఫై 20:10–12; 23; 26:1–12

ప్రవక్తల మాటలను వెదకాలని రక్షకుడు నన్ను కోరుతున్నారు.

ఈ అధ్యాయాలంతటా యేసు యొక్క మాటలు మరియు క్రియలు, లేఖనాల గురించి ఆయన ఎలా భావిస్తున్నారో అనేదానిని బయల్పరుస్తాయి. 3 నీఫై 20:10–12; 23; మరియు 26:1–12 లో లేఖనాల గురించి మీరేమి నేర్చుకుంటారు? “ఈ విషయములను శ్రద్ధగా వెదుకవలెనని” మిమ్మల్ని ప్రేరేపించేలా దేనిని మీరు ఈ వచనాలలో కనుగొంటారు? (3  నీఫై 23:1).

3 నీఫై 22; 24

తన వద్దకు తిరిగివచ్చే వారిపట్ల దేవుడు కనికరము కలిగియుండును.

3 నీఫై 22 మరియు 24 లో రక్షకుడు యెషయా మరియు మలాకీ నుండి మాటలను వ్యాఖ్యానించారు, అవి రంగురంగుల పునాది రాళ్ళు, మంటలోని బొగ్గులు, శుద్ధిచేయబడిన వెండి, పరలోకపు వాకిండ్లు—వంటి స్పష్టమైన చిత్రాలు మరియు పోలికలతో నిండియున్నాయి. వాటిని జాబితా చేయడం ఆసక్తికరంగా ఉండవచ్చు. తన జనులతో దేవుని సంబంధం గురించి ప్రతి ఒక్కటి మీకేమి బోధిస్తుంది? ఉదాహరణకు, 3 నీఫై 22:4–8 దేవుడిని భర్తతో, ఆయన జనులను భార్యతో పోలుస్తుంది. ఈ చిత్రాల గురించి చదవడం, ప్రభువుతో మీ స్వంత సంబంధం గురించి ఆలోచించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఈ అధ్యాయాలలోని వాగ్దానాలు మీ జీవితంలో ఎలా నెరవేరాయి? (ప్రత్యేకించి 3 నీఫై 22:7–8, 10–17; 24:10–12, 17–18 చూడండి).

3 నీఫై 25:5–6

నా హృదయము నా పూర్వీకుల వైపు తిరుగవలెను.

వాగ్దానము చేయబడిన ఏలీయా రాక కోసం శతాబ్దాల నుండి ప్రపంచమంతటా యూదులు ఆతృతగా ఎదురుచూసారు. ఏలీయా తిరిగి వచ్చారని, 1836 లో కర్ట్లాండ్ దేవాలయంలో జోసెఫ్ స్మిత్ కు ప్రత్యక్షమయ్యారని కడవరి-దిన పరిశుద్ధులకు తెలుసు (సిద్ధాంతము మరియు నిబంధనలు110:13–16 చూడండి). తండ్రుల తట్టు హృదయాలను తిప్పే కార్యము—దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము—బాగా జరుగుతోంది. మీ హృదయాన్ని మీ పూర్వీకుల వైపు తిప్పడానికి సహాయపడేలా మీరు కలిగియున్న అనుభవాలేవి?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

3 నీఫై 22:2

ఈ వచనం చదివిన తర్వాత, మీరు ఇంటిలో ఒక గుడారాన్ని తయారుచేసి, సంఘము అరణ్యములో ఒక గుడారము వలె ఎట్లున్నదో అనేదాని గురించి మాట్లాడవచ్చు. “(దాని) త్రాళ్ళను పొడుగు చేయుము” మరియు “(దాని) మేకులను దిగగొట్టుము” అనగా అర్థము ఏమైయుండవచ్చు? సంఘంలో “ఆశ్రయం” కనుగొనడానికి మనం ఇతరులను ఏవిధంగా ఆహ్వానిస్తాము?

3 నీఫై 23:6–13

మన కుటుంబము భద్రపరచిన గ్రంథాలను రక్షకుడు పరిశీలించవలసి వచ్చినట్లయితే, ఆయన మనల్ని ఏ ప్రశ్నలడగవచ్చు? మనం నమోదు చేయవలసిన ముఖ్యమైన సంఘటనలు లేక ఆత్మీయ అనుభవాలు ఏవైనా ఉన్నాయా? కుటుంబ గ్రంథాన్ని తయారుచేయడానికి లేక దానిలో చేర్చడానికి మరియు ఏమి చేర్చాలో కలిసి చర్చించడానికి ఇది మంచి సమయం కావచ్చు. ఛాయాచిత్రాలు లేక బొమ్మలతో మీ గ్రంథాన్ని అలంకరించడాన్ని కుటుంబ సభ్యులలో చిన్నవారు ఆనందించవచ్చు. మన కుటుంబం యొక్క ఆత్మీయ అనుభవాలను నమోదు చేయడం ఎందుకు ముఖ్యము?

3 నీఫై 24:7–18

ఈ వచనాలలో వాగ్దానం చేయబడినట్లు దశమభాగము చెల్లించుట వలన మనము ఏవిధంగా దీవెనలు అనుభవించాము? Elder David A. Bednar’s message “The Windows of Heaven” (Ensign or Liahona, Nov. 2013, 17–20) ఈ దీవెనలను గుర్తించడానికి మీ కుటుంబ సభ్యులకు సహాయపడవచ్చును.

3 నీఫై 25:5–6

వారి హృదయాలను వారి తండ్రుల వైపు తిప్పడానికి మీ కుటుంబ సభ్యులకు మీరెలా సహాయపడతారు? మీ పూర్వీకులలో ఒకరి గురించి తెలుసుకొని, వారు తెలుసుకున్న దానిని మిగతా కుటుంబంతో పంచుకోమని మీరు కుటుంబ సభ్యులను నియమించవచ్చు (FamilySearch.org చూడండి). లేక దేవాలయ విధులు అవసరమైన ఒక పూర్వీకుని కనుగొనడానికి మీరు కలిసి పనిచేయవచ్చు మరియు ఆ విధులను నిర్వర్తించడానికి దేవాలయ ప్రయాణాన్ని ప్రణాళిక చేయవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

మీ సాక్ష్యాన్ని జీవించండి. “మీరు ఏమై యున్నారో దానినే బోధిస్తారు,” అని ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ బోధించారు. “ఒక ప్రత్యేక పాఠంలోని ప్రత్యేక సత్యం కంటే … మీ లక్షణాలే ఎక్కువగా జ్ఞాపకముంచుకోబడతాయి” (“But a Few Days” [address to Church Educational System religious educators, Sept. 10, 1982], 2). మీరు జనులకు ఒక సువార్త సూత్రం బోధించాలనుకుంటే, ఆ సూత్రాన్ని జీవించడానికి మీకు తగినంతగా చేయండి.

నీఫైయుల గ్రంథాలను నీఫైతో పాటు చదువుతున్న యేసు

గ్రంథాన్ని తీసుకురమ్ము, గారీ ఎల్. కాప్ చేత