2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఏప్రిల్ 5–11. సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36: “నా సువార్తను బోధించుటకు మీరు పిలువబడ్డారు”


“ఏప్రిల్ 5–11. సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36: ‘నా సువార్తను బోధించుటకు మీరు పిలువబడ్డారు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఏప్రిల్ 5–11. సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

ప్రారంభ సంఘ సువార్తికులు

ఏప్రిల్ 5–11

సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36

“నా సువార్తను బోధించుటకు మీరు పిలువబడ్డారు”

మన ప్రత్యేక పరిస్థితుల కొరకు లేఖనాలలో మనము అంతరార్థములను కనుగొనగలము. సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36లో మీకు అర్థవంతంగా అనిపించే సందేశాన్ని కనుగొనడానికి మీకు సహాయపడమని ప్రభువును అడగండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

సువార్తను బోధించడానికి “అరణ్యములోనికి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 32:2) అతడు పిలువబడినప్పుడు, పార్లీ పి. ప్రాట్ సంఘ సభ్యుడై దాదాపు నెల కావస్తున్నది. “నీ పరిచర్య గడియ వచ్చియున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 31:3) అని చెప్పబడినప్పుడు, థామస్ బి. మార్ష్ అంతకంటే తక్కువ సమయం నుండి సభ్యునిగా ఉన్నాడు. అదేవిధంగా ఆర్సన్ ప్రాట్, ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ మరియు ఇతరులనేకులు వారి మిషను పిలుపులను అందుకోవడానికి కొంతకాలం ముందే బాప్తీస్మం పొందారు. బహుశా ఆ సమయంలో అది అవసరమైయుండవచ్చు—1830 వసంతకాలంలో, ఏ ఒక్కరూ సంఘ సభ్యులై ఆరు నెలలకంటే ఎక్కువ కాలేదు. కానీ ఈ నమూనాలో నేడు మన కొరకు ఒక పాఠమున్నది: బాప్తీస్మము ద్వారా పునఃస్థాపించబడిన సువార్తను అంగీకరించడానికి తగినంత మీకు తెలిసినట్లయితే, దానిని ఇతరులతో పంచుకోవడానికి తగినంత మీకు తెలుసు. మనము ఎల్లప్పుడూ మన సువార్త జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటాము, కానీ దేవుడు తన సువార్తను బోధించడానికి “విద్యలేని పామరులను” పిలువడానికి ఎన్నడూ సందేహించలేదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 35:13). వాస్తవానికి, “నా సువార్తను ప్రకటించుటకు నీ నోటిని విప్పు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 30:5) అని ఆయన మనందరినీ ఆహ్వానిస్తారు. మరియు మనం దానిని మన స్వంత జ్ఞానముతో, అనుభవముతో కాకుండా “ఆత్మ శక్తిచేత” (సిద్ధాంతము మరియు నిబంధనలు 35:13) బాగుగా చేస్తాము.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36

యేసు క్రీస్తు సువార్తను బోధించడానికి నేను పిలువబడ్డాను.

పద్ధతి ప్రకారం మీరు సువార్తికునిగా పిలువబడినా, లేకపోయినా ప్రభువు తన సువార్తను పంచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నారు మరియు ఈ యుగపు ప్రారంభ సువార్తికులకు ఆయన చెప్పిన మాటలనేకము మీ కొరకైనవి కూడా. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36 చదువుతున్నప్పుడు, సువార్తను బోధించడానికి పిలుపు గురించి మీరు నేర్చుకున్న దానిని నమోదు చేయండి. ప్రభువు తన సువార్తికులను అడిగే విషయాల జాబితా ఒకటి (ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 30:8 చూడండి) మరియు ప్రభువు వారికి వాగ్దానమిచ్చే విషయాల జాబితా ఒకటి (ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 30:11 చూడండి) మీరు తయారు చేయవచ్చు.

మీకు తెలిసి సేవ చేస్తున్న వారు లేక మతాంతర లేక సంఘ-సేవా మిషను చేయడానికి సిద్ధపడుతున్న వారిని ఈ వచనాలు ఎలా ప్రోత్సహించవచ్చు? సువార్తను పంచుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా మీరేమి కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 35:13–15 కూడా చూడండి.

బోధించుచున్న సువార్తికులు

యేసు క్రీస్తు యొక్క సంఘు కొరకు మనమందరము సువార్తికులము.

సిద్ధాంతము మరియు నిబంధనలు 31:1–2, 5–6, 9, 13

నా కుటుంబ సంబంధాలలో ప్రభువు నాకు సహాయపడగలరు.

నేడు కుటుంబాలు ఎదుర్కొంటున్న అవే సమస్యలలో అనేకముతో 1830ల లోని కుటుంబాలు శ్రమించాయి. అతని కుటుంబం గురించి థామస్ బి. మార్ష్‌కు ప్రభువు ఇచ్చిన నడిపింపు మరియు వాగ్దానాలేవి? మీ కుటుంబ సంబంధాలలో ఆయన మాటలు మీకెలా సహాయపడగలవు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 3235

లేమనీయుల కొరకైన సువార్తసేవ అపజయమేనా?

మిస్సోరికి పశ్చిమాన అమెరికన్ ఇండియనులకు బోధించడానికి ఆలీవర్ కౌడరీ, పీటర్ విట్మర్ జూ., పార్లీ పి. ప్రాట్ మరియు జిబా పీటర్సన్‌లు పంపబడినప్పుడు, కడవరి దినాలలో లేమనీయులు సువార్తను పొందడం గురించిన మోర్మన్ గ్రంథ ప్రవచనాలను వారు నెరవేరుస్తున్నారని వారు నమ్మారు (ఉదాహరణకు, 1 నీఫై 13:34–41; ఈనస్ 1:11–18 చూడండి). కొన్ని సమూహాలతో వారు సానుకూల సమావేశాలు కలిగియున్నప్పటికీ, వారి మిషను పూర్తయ్యేనాటికి వారు ఒక్క అమెరికన్ ఇండియనుకు కూడా బాప్తీస్మమివ్వలేదు. కానీ మిస్సోరికి వెళ్ళే దారిలో వారు ఆగిన కర్ట్‌లాండ్, ఒహైయో దగ్గర వందకు పైగా జనులకు వారు బాప్తీస్మమిచ్చారు. పరివర్తన చెందిన వారి మధ్య సిడ్నీ రిగ్డన్‌తో పాటు భవిష్యత్తులో ప్రభావవంతమైన సంఘ నాయకులున్నారు, తరువాత కర్ట్‌లాండ్ సంఘము కొరకు ముఖ్యమైన కూడిక ప్రదేశంగా మారింది. ప్రభువు తన కార్యమును ఏవిధంగా సాధించుననే దాని గురించి ఈ అనుభవం మీకు ఏమి బోధిస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 33:12–18

నేను నా జీవితాన్ని రక్షకుని యొక్క సువార్తపై నిర్మించినట్లయితే, నేను పడిపోను.

ఇటీవల పరివర్తన చెందిన నార్థ్రోప్ స్వీట్, ఎజ్రా థైర్‌లకు సిద్ధాంతము మరియు నిబంధనలు 33 ఉద్దేశించబడింది. ఈ బయల్పాటు ఇవ్వబడిన వెంటనే నార్థ్రోప్ సంఘాన్ని విడిచివెళ్ళాడు. ఎజ్రా కొంతకాలము విశ్వాసంగా సేవ చేసాడు, కానీ కాలక్రమేణా అతడు కూడా దూరమయ్యాడు. ఎంత స్థిరంగా సువార్త యొక్క “బండమీద” (13వ వచనము) మీరు కట్టబడియున్నారో పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాగలదు. రక్షకుని పట్ల విశ్వాసంగా నిలిచియుండేందుకు ఈ వచనాలలోని ఏ సత్యాలు మీకు సహాయపడగలవు?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 30:2.ఒక కుటుంబముగా మనము “భూలోక సంగతులపైన” కంటే దేవుని సంగతులపైన ఎంతగా దృష్టిసారిస్తున్నాము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 31.అతని కుటుంబం గురించి థామస్ బి. మార్ష్‌కు ప్రభువు ఇచ్చిన వాగ్దానాలను మీరు చదువుతున్నప్పుడు, సువార్త సేవ మూలంగా మీ కుటుంబానికి వచ్చిన దీవెనల గురించి మీరు మాట్లాడవచ్చు. “I’ll Go Where You Want Me to Go” (Hymns, no. 270) వంటి సంబంధిత కీర్తన ఏదైనా మీరు పాడవచ్చు. ఇతరులతో సువార్తను పంచుకోవడం ద్వారా మీ కుటుంబము ఏవిధంగా దీవించబడింది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 33:7–10.సువార్తను పంచుకోవడం గురించి వివరించడానికి ఈ వచనాలలో ప్రభువు ఉపయోగించిన ఉపమానాలేవి? మీ కుటుంబము ఆలోచించగల ఇతర ఉపమానాలు లేక ఉదాహరణలేవి? బహుశా ఈ ఊహాచిత్రాలు సువార్తను పంచుకోవడంలో సృజనాత్మక విధానాలను ఆలోచించడానికి మీ కుటుంబానికి సహాయపడవచ్చు. అప్పుడు ఈ చర్చ సువార్తను పంచుకోవడానికి ఒక ప్రణాళికకు దారితీయవచ్చు. సమర్థవంతమైన కొన్ని సందర్భాలను అభినయించడాన్ని పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 34:10.10వ వచనము నుండి ఒక వాక్యభాగాన్ని ఎంచుకొని, దానిని గుసగుసగా చెప్పమని ఒక కుటుంబ సభ్యుడిని ఆహ్వానించండి. ఇతర కుటుంబ సభ్యులు ఆ వాక్యభాగమేమిటో ఊహించడానికి ప్రయత్నించవచ్చు. తరువాత ఆ వాక్యభాగాన్ని బిగ్గరగా చెప్పమని ఒక కుటుంబ సభ్యుడిని అడగండి. “నీ స్వరమును ఎలుగెత్తుము” అని ప్రభువు మనల్ని ఎందుకు ఆజ్ఞాపిస్తారో గ్రహించడానికి ఈ ప్రోత్సాహ కార్యక్రమము మనకెలా సహాయపడుతుంది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

ఆరంభంలో పరివర్తన పొందినవారు

సంఘము స్థాపించబడక ముందే, “పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 4:4) అని ప్రభువు ప్రకటించారు. తరువాతి నెలల్లో, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘమును కనుగొనడానికి సత్యాన్వేషకులు అనేకమంది దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు, ఈ వ్యాఖ్యానము నిజమని నిరూపించబడింది.

ప్రారంభంలో పరివర్తన చెందిన వీరిలో అనేకులు పునఃస్థాపనకు పునాది వేయడంలో సాధనముగా ఉన్నారు మరియు వారి పరివర్తన కథలు నేడు మనకు విలువైనవి. యేసు క్రీస్తు యొక్క సువార్తకు పరివర్తన చెందడానికి వారు చూపిన అదే విశ్వాసము మనకు కావాలి.

అబిగేల్ కాల్కిన్స్ లియోనార్డ్

అబిగేల్ కాల్కిన్స్ లియోనార్డ్ సుమారు 35 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు, తన పాపాల కొరకు క్షమించబడాలని ఆమె కోరుకుంది. అప్పుడప్పుడు ఆమె బైబిలు చదివింది మరియు క్రైస్తవ సంఘాల నుండి జనులు ఆమె ఇంటిని దర్శించారు, కానీ ఒక సంఘము నుండి మరొక దానిని వేరుచేసినది ఏమిటని ఆమె గందరగోళానికి గురయ్యింది. “ఒక ఉదయాన నేను నా బైబిలు తీసుకొని, అడవిలోకి వెళ్ళి మోకరించాను” అని ఆమె చెప్పింది. ఆమె మనఃపూర్వకముగా ప్రభువును ప్రార్థించింది. ఆమె ఇలా చెప్పింది, “వెంటనే నేనొక దర్శనము చూసాను, నా ప్రక్కనుండి ఒకరి తర్వాత ఒకరుగా విభిన్న తెగలు వెళ్ళాయి మరియు ఒక స్వరము నన్ను పిలిచి ఇలా అన్నది: ‘ఇవన్నీ లాభము కొరకు నిర్మించబడినవి.’ తరువాత, దానిని మించి నేనొక గొప్ప వెలుగును చూసాను మరియు పై నుండి ఒక స్వరము ఇలా వినిపించింది: ‘నేను ఒక జనమును ఉదయింపజేసెదను, వారు నా వారని చెప్పుకొనుటకు మరియు దీవించుటకు నేను ఆనందించెదను.’” కొద్దిరోజుల తర్వాత, అబిగేల్ మోర్మన్ గ్రంథము గురించి విన్నది. అప్పటికింకా ఆమె దగ్గర దాని ప్రతి లేనప్పటికీ, “పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు బహుమానము ద్వారా ఆ గ్రంథము యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని” ఆమె కోరుకుంది మరియు ఆమె “వెంటనే దాని ఉనికిని భావించింది”. చివరకు ఆమె మోర్మన్ గ్రంథాన్ని చదువగలిగినప్పుడు, ఆమె “దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉంది.” ఆమె మరియు ఆమె భర్త లైమన్, 1831లో బాప్తీస్మము పొందారు. 1

థామస్ బి. మార్ష్

థామస్ బి. మార్ష్ యువకునిగా ఉన్నప్పుడు, అతడు బైబిలు చదివి, ఒక క్రైస్తవ సంఘములో చేరాడు. కానీ అతడు తృప్తి చెందలేదు, చివరకు సంఘాలన్నిటి నుండి వెనుకకు మళ్ళాడు. అతడిలా అన్నాడు, “నేను కొంత ప్రవచనాత్మను కలిగియున్నాను మరియు ఒక క్రొత్త సంఘము ఉదయిస్తుందని, అది స్వచ్ఛమైన సత్యమును కలిగియుంటుందని (ఒక మత నాయకునికి) చెప్పాను.” అది జరిగి ఎంతోకాలము కాకముందే, బోస్టన్‌, మస్సాచుసెట్స్‌లో ఉన్న తన ఇంటిని వదిలి పశ్చిమానికి ప్రయాణించాలని థామస్ ఒక ఆత్మీయ ప్రేరేపణ పొందాడు. అతడు వెదుకుతున్న దానిని కనుగొనలేక పశ్చిమ న్యూయార్క్‌లో మూడు నెలలు గడిపిన తర్వాత, అతడు ఇంటికి బయలుదేరాడు. దారిలో, “జోసెఫ్ స్మిత్ అనబడే యువకుని చేత కనుగొనబడిన బంగారు గ్రంథము” గురించి అతడు విన్నాడా అని ఒక స్త్రీ థామస్‌ను అడిగింది. ఈ ఆలోచన చేత ఆకర్షించబడిన థామస్ వెంటనే పాల్మైరాకు ప్రయాణించి, ముద్రణాలయము వద్ద మార్టిన్ హారిస్‌ను కలుసుకున్నాడు, అప్పుడే మోర్మన్ గ్రంథము యొక్క మొదటి 16 పేజీలు ముద్రణాలయము నుండి వస్తున్నాయి. ఆ 16 పేజీల ప్రతినొకదానిని తీసుకోవడానికి థామస్ అనుమతించబడ్డాడు మరియు అతడు వాటిని తన ఇంటికి, అతని భార్య ఎలిజబెత్ వద్దకు తెచ్చాడు. “అది దేవుని కార్యమని నమ్ముతూ” గ్రంథాన్ని చూసి “ఆమె చాలా సంతోషించింది” అని అతడు గుర్తుచేసుకున్నాడు. తరువాత థామస్ మరియు ఎలిజబెత్ తమ పిల్లలతో పాటు న్యూయార్క్‌కు బదిలీ అయ్యారు మరియు బాప్తీస్మము పొందారు. 2 (థామస్ బి. మార్ష్ గురించి అదనపు సమాచారము కొరకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 31 చూడండి.)

పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్

థామస్ మార్ష్ వలె, బైబిలు నుండి వారు గ్రహించినట్లుగా సువార్తను బోధించాలనే ఉద్దేశముతో ఒహైయోలో వర్ధిల్లుతున్న తమ పొలమును విడిచిపెట్టాలనే ఆత్మీయ ప్రేరేపణలకు పార్లీ మరియు థాంక్‌పుల్ ప్రాట్‌లు స్పందించారు. పార్లీ తన సోదరునితో ఇలా చెప్పాడు, “ఈ విషయాల యొక్క ఆత్మ ఇటీవల నా మనస్సుపై ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే, నేను విశ్రమించలేకపోయాను.” 3 వారు తూర్పు న్యూయార్క్ చేరుకున్నప్పుడు, ఆ ప్రాంతంలో కొంతకాలం ఉండాలని పార్లీ ప్రేరేపించబడ్డాడు. అతడు లేకుండా థాంక్‌పుల్ ముందుకు సాగుతుందని వారు నిర్ణయించుకున్నారు. “దేశము యొక్క ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ఒకటున్నది మరియు అది ఏమిటో లేక దానిని చేయడానికి ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు; కానీ అది చేయబడినప్పుడు నేను తిరిగివస్తాను” అని పార్లీ ఆమెకు చెప్పాడు. 4 అక్కడే పార్లీ మొదటిసారి మోర్మన్ గ్రంథము గురించి విన్నాడు. “ఆ గ్రంథం మీద వింత ఆసక్తి కలిగింది నాకు,” అన్నాడతడు. 5 అతడు ఒక ప్రతిని అడిగి, రాత్రంతా దానిని చదివాడు. ఉదయానికి, “లోకంలోని సంపదలన్నిటి కంటే ఎక్కువగా దానికి విలువిస్తూ” ఆ గ్రంథము నిజమని అతడు తెలుసుకున్నాడు. 6 కొద్దిరోజులలోనే పార్లీ బాప్తీస్మము పొందాడు. తరువాత అతడు థాంక్‌పుల్ దగ్గరకు తిరిగి వెళ్ళాడు, ఆమె కూడా బాప్తీస్మము పొందింది. (పార్లీ పి. ప్రాట్ గురించి అదనపు సమాచారము కొరకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 32 చూడండి.)

పార్లీ పి. ప్రాట్

పార్లీ పి. ప్రాట్ చిత్రపటము, జెఫ్రీ హీన్ చేత

సిడ్నీ మరియు ఫీబి రిగ్డన్

మిస్సోరిలో సువార్త సేవకు న్యూయార్క్ నుండి వెళ్ళే దారిలో పార్లీ ప్రాట్ మరియు అతని తోటి పనివారు మెంటార్, ఒహైయోలో ఉన్న సిడ్నీ మరియు ఫీబి రిగ్డన్ ఇంటివద్ద ఆగారు—పార్లీ ఒహైయోలో ఉన్నప్పటి నుండి వారతనికి పాత స్నేహితులు. సిడ్నీ ఒక క్రైస్తవ పరిచారకుడు మరియు పార్లీ అతని సమూహములో ఒకప్పటి సభ్యుడు మరియు అతడిని ఆత్మీయ సలహాదారునిగా యెంచాడు. పార్లీ ఆతృతగా మోర్మన్ గ్రంథము మరియు యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన గురించి తన స్నేహితులకు చెప్పాడు. మొదట మోర్మన్ గ్రంథము గురించి సందేహించినప్పటికీ, క్రొత్త నిబంధనలో వివరించబడిన నిజమైన సంఘము యొక్క పునఃస్థాపన గురించి సిడ్నీ వెదుకుతున్నాడు మరియు అతడు కనుగొన్నాడు. “కానీ నేను నీ గ్రంథాన్ని చదువుతాను మరియు అది దేవుని నుండి బయల్పాటో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను” అని అతడు తన స్నేహితుడైన పార్లీతో చెప్పాడు. 7 రెండు వారాలు అధ్యయనం చేసి, ప్రార్థించిన తర్వాత, అతడు మరియు ఫీబి ఇద్దరూ ఆ గ్రంథము నిజమైనదని ఒప్పించబడ్డారు. కానీ సంఘములో చేరడం తన కుటుంబానికి పెద్ద త్యాగమవుతుందని కూడా సిడ్నీకి తెలుసు. సమాజంలో అతని సామాజిక హోదాతో పాటు, ఒక పరిచారకునిగా తన ఉద్యోగాన్ని అతడు తప్పకుండా కోల్పోతాడు. దీని సాధ్యాసాధ్యాలను గురించి అతడు మరియు ఫీబి చర్చించినప్పుడు, ఫీబి ఇలా చెప్పింది, “నేను దాని పర్యవసానాలను ఆలోచించాను, … చావైనా బ్రతుకైనా దేవుని చిత్తాన్ని జరిగించడమే నా కోరిక.” 8

మంచులో నడుస్తున్న వ్యక్తులు

అరణ్యములోనికి వెళ్ళుము, రాబర్ట్ టి. బారెట్ చేత