2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
అక్టోబరు 11–17. సిద్ధాంతము మరియు నిబంధనలు 115–120: “అతని ఎదుగుదల కంటె అతని త్యాగము నాకు పవిత్రమైనది”


“అక్టోబరు 11–17. సిద్ధాంతము మరియు నిబంధనలు 115–120: ‘అతని ఎదుగుదల కంటె అతని త్యాగము నాకు పవిత్రమైనది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“అక్టోబరు 11–17. సిద్ధాంతము మరియు నిబంధనలు 115–120,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

ఫార్ వెస్ట్

ఫార్ వెస్ట్, ఆల్ రౌండ్స్ చేత

అక్టోబరు 11–17

సిద్ధాంతము మరియు నిబంధనలు 115–120

“అతని ఎదుగుదల కంటె అతని త్యాగము నాకు పవిత్రమైనది”

ప్రభువు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు, మీ కొరకు ఆయన సందేశాన్ని కనుగొనడానికి మీకు సహాయం చేయమని ప్రార్థించి, ఆయనను అడగండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

1838 జూలైలో, మిస్సోరిలోని ఫార్ వెస్ట్‌లో పరిశుద్ధుల నూతన కూడిక ప్రదేశం గురించి సానుకూల దృక్పథంతో ఉండడానికి కారణం ఉంది. పట్టణం త్వరితగతిన పెరుగుతోంది, ప్రదేశం సమృద్ధిగా కనబడింది మరియు ఉత్తరంవైపు కొద్దిదూరంలో ఆడమ్-ఓన్డై-అహ్‌మన్‌ ఉన్నదని బయల్పరచబడింది, అది గొప్ప ఆత్మీయ ప్రత్యేకత గల ప్రదేశం (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:53–56;116 చూడండి). అయినప్పటికీ, వారు కోల్పోయిన దాని గురించి ఆలోచించకుండా ఉండడం పరిశుద్ధులకు కష్టమైయుండి ఉండవచ్చు. వారు సీయోను యొక్క నియమించబడిన కేంద్ర ప్రదేశమైన ఇండిపెండెన్స్ నుండి తరుమబడ్డారు మరియు త్వరలో అక్కడికి తిరిగివెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా కనబడ్డాయి. అదనంగా, కేవలం రెండు సంవత్సరాల తర్వాత వారి ప్రియమైన దేవాలయాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులు ఓహైయోలోని కర్ట్‌లాండ్‌కు పారిపోవలసి వచ్చింది. ఆ సమయంలో సంఘము వెలుపల ఉన్న శత్రువులు మాత్రమే కాకుండా—మోర్మన్ గ్రంథము యొక్క ముగ్గురు సాక్ష్యలు మరియు పన్నెండుమందిలో నలుగురు సభ్యులతో సహా అనేకమంది ప్రముఖ సభ్యులు జోసెఫ్ స్మిత్‌కు వ్యతిరేకంగా తిరిగి ఇబ్బందులు కలుగజేస్తున్నారు. దేవుని రాజ్యము నిజంగా బలపడుతున్నదా లేక బలహీనపడుతున్నదా? అని కొందరు ఆశ్చర్యపడియుండవచ్చు.

అయినప్పటికీ, అటువంటి ప్రశ్నలు వారిని ఆపడానికి విశ్వాసులు అనుమతించలేదు. బదులుగా, ఈసారి ఫార్ వెస్ట్‌లో వారు క్రొత్త పరిశుద్ధ ప్రదేశాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. ఒక క్రొత్త దేవాలయం కొరకు వారు ప్రణాళికలు వేసారు. జాన్ టేలర్ మరియు విల్ఫర్డ్ వుడ్రఫ్—ఇద్దరితో కలిపి నలుగురు క్రొత్త అపొస్తలులు పిలువబడ్డారు—తరువాతి కాలంలో వారు సంఘము యొక్క అధ్యక్షులయ్యారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 118:6). దేవుని కార్యము చేయడమంటే అర్థం మీరు ఎన్నడూ పడిపోరని కాదు, దానర్థం మీరు “మళ్ళీ లేస్తారని” పరిశుద్ధులు నేర్చుకున్నారు మీరు కొన్ని కోల్పోవలసి వచ్చినప్పటికీ, ఆ త్యాగాలు దేవునికి పవిత్రమైనవి, “(మీ) ఎదుగుదల కంటె … ఎక్కువ పవిత్రమైనవి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 117:13).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4–6

సంఘము యొక్క పేరు ప్రభువు చేత నిర్దేశించబడింది.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అన్నారు, సంఘము యొక్క పేరు “గొప్ప ప్రాముఖ్యత కలిగిన విషయము” (“సంఘము యొక్క సరియైన పేరు,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2018,87). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4–6 చదువుతున్నప్పుడు, ఇది ఎందుకు నిజమో ఆలోచించండి. సంఘము యొక్క పేరుకు, దాని పనికి మరియు నియమిత కార్యానికి గల సంబంధమేమిటి?

3 నీఫై 27:1–11 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 115:5–6

సీయోను మరియు ఆమె స్టేకులు “తుఫాను నుండి రక్షణను” అందిస్తాయి.

1838లో పరిశుద్ధులు కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ, వారి కొరకు ప్రభువు ఇంకా ఉన్నత ఆపేక్షలు కలిగియున్నారు. ఆయన సంఘము మరియు దాని సభ్యులు లోకంలో నెరవేర్చాలని ప్రభువు కోరుతున్న పాత్రను నొక్కిచెప్పే పదాల కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 115:5–6లో వెదకండి. ఉదాహరణకు, “లేచి, ప్రకాశించుటకు” మీరు ఏమి చేయాలని మీరనుకుంటున్నారు? (5వ వచనము). ఏ ఆత్మీయ తుఫానులను మీ చుట్టూ మీరు గమనిస్తున్నారు మరియు సమకూడుట ద్వారా “రక్షణను” మనమెలా కనుగొంటాము? (6వ వచనము).

3 నీఫై 18:24 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 117

నా త్యాగాలు ప్రభువుకు పవిత్రమైనవి.

ప్రత్యేకించి న్యూయెల్ కె. విట్నీ వంటి వారికి కర్ట్‌లాండ్‌ను విడిచిపెట్టడం కష్టమైయుండవచ్చు, ఆయన తన కుటుంబం కొరకు అక్కడ సౌభాగ్యవంతమైన జీవితాన్ని ఏర్పాటుచేసారు. ఈ త్యాగము చేయడానికి వారికి సహాయపడేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 117:1–11లో మీరేమి కనుగొంటారు? నిజంగా ఏది ముఖ్యమైనది అనేదానిపై మీ దృక్పథాన్ని ఈ వచనాలు ఎలా మారుస్తాయి?

ఆలీవర్ గ్రాంగర్ అడుగబడిన త్యాగము భిన్నమైనది: కర్ట్‌లాండ్‌లో నిలిచియుండి, సంఘము యొక్క ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించమని ప్రభువు ఆయనను నియమించారు. అది చాలా కష్టమైన పని మరియు నిజాయితీగా ఆయన సంఘానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ, చివరకు ఆయన ఎక్కువ డబ్బును తిరిగి రాబట్టుకోలేకపోయారు. 12–15 వచనాలలో ఉన్న ప్రభువు యొక్క మాటలు ప్రభువు మిమ్మల్ని అడిగిన వాటికి ఎలా అన్వయించబడతాయో పరిగణించండి.

మత్తయి 6:25–33 కూడా చూడండి.

మిస్సోరిలోని డేవిస్ కౌంటీలో ఆడమ్-ఓన్డై-అహ్‌మన్

న్యూయెల్ కె. విట్నీ ఇక్కడ చూపబడిన ఆడమ్-ఓన్డై-అహ్‌మన్‌కు వెళ్ళాలని ఆజ్ఞాపించబడ్డాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 119–20

దశమభాగమును చెల్లించడం ద్వారా నేను “సీయోను ప్రదేశమును పవిత్రపరచడానికి” మరియు నిర్మించడానికి సహాయపడతాను.

119 మరియు120 ప్రకరణములలో ఉన్న ఉపదేశములు మన కాలంలో ప్రభువు కార్యము కొరకు ఆదాయం సమకూరు విధానాలను పోలియున్నాయి. నేడు పరిశుద్ధులు “తమ వార్షిక లాభమంతటిలో (ఇప్పుడు ఆదాయమని దానర్థం) పదవ భాగాన్ని” విరాళమిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 119:4), మరియు ఈ నిధులు ఒక సలహామండలి చేత నిర్వహించబడతాయి, అందులో ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది సమూహము మరియు అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కు ఉంటారు. మీరు ఈ ప్రకరణములను చదివినప్పుడు, క్రింది ప్రశ్నలను పరిగణించండి:

  • దశమభాగ చట్టమును పాటించడం ఏవిధంగా “సీయోను ప్రదేశమును పవిత్రపరుస్తుంది”? ఈ చట్టము మీరు నివసించే ప్రదేశాన్ని “మీ కొరకు సీయోను ప్రదేశంగా” చేయడానికి ఎలా సహాయపడగలదు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 119:6).

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 120లో “నా వారితో నేను పలికిన మాటల వలన” అనే వాక్యభాగం గురించి మీకు ప్రత్యేకంగా అనిపించినదేమిటి?

మలాకీ 3:8–12 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4–6.సూర్యోదయాన్ని చూస్తూ ఈ వచనాలను చదవడానికి మీ కుటుంబానికి తగిన ఏర్పాట్లు మీరు చేయగలరా? “లేచి, ప్రకాశించుడి” (5వ వచనము) అనేదానికి అర్థమేమిటో చర్చించడానికి ఇది మీకు సహాయపడవచ్చు. లేదా తుఫాను నుండి రక్షణ కోరడమంటే ఏమిటో కూడా మీరు చర్చించవచ్చు. ఆ అనుభవము సంఘములో “రక్షణను” కనుగొనడంలా ఎలా ఉండగలదు? (6వ వచనము). అప్పుడు సంఘము అందించే రక్షణను ఆనందించడానికి మీ కుటుంబము ఇతరులకు సహాయపడగల విధానాల గురించి మీరు మాట్లాడవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 117:1–11.మీ కుటుంబము ఒక “నీటిబిందువును” ఒక కూజా నీరు వంటి “భారమైన” (8వ వచనము) దానితో పోల్చవచ్చు. ఇది మన జీవితాల్లో దేవుని విస్తారమైన దీవెనలను పొందడం నుండి మనల్ని నిరోధించగల తక్కువ ప్రాముఖ్యత గల విషయాల గురించి చర్చకు దారితీయవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 119. మనం దశమభాగాన్ని ఎందుకు చెల్లిస్తామనే దానిగురించి 119 ప్రకరణము ఏమి బోధిస్తుంది? చిన్నపిల్లలు ఒక వస్తుపాఠము నుండి లాభము పొందగలరు: మీరు వారికి చిన్న వస్తువులు ఇచ్చి, వాటిలో పదవవంతును లెక్కించడానికి వారికి సహాయపడి, మీరు దశమభాగాన్ని ఎందుకు చెల్లిస్తారో వారికి చెప్పవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

స్వయంసమృద్ధిని ప్రోత్సహించండి. “(కుటుంబ సభ్యులు) ప్రశ్నలు కలిగియున్నట్లయితే, వెంటనే ఆ ప్రశ్నలకు జవాబిచ్చే బదులు కొన్నిసార్లు వారంతట వారు జవాబులు ఎలా కనుగొనాలో వారికి బోధించడం మంచిది” (Teaching in the Savior’s Way,28).

దశమభాగము యొక్క ఉపయోగాలు

దశమభాగముగా మన పదిశాతాన్ని ప్రభువుకు ఇవ్వడం ఆయన రక్షణ కార్యములో తోడ్పడేందుకు సహాయపడుతుంది.