“అక్టోబరు 4–10. సిద్ధాంతము మరియు నిబంధనలు 111–114: ‘సమస్త సంగతులను మీ కొరకు నేను సమకూర్చెదను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“అక్టోబరు 4–10. సిద్ధాంతము మరియు నిబంధనలు 111–114,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
అక్టోబరు 4–10
సిద్ధాంతము మరియు నిబంధనలు 111–114
“సమస్త సంగతులను మీ కొరకు నేను సమకూర్చెదను”
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 111–14 చదువుతున్నప్పుడు, ఆత్మ యొక్క నడిపింపు కొరకు ప్రార్థనాపూర్వకంగా అడగండి మరియు మీ మనోభావాలను నమోదు చేయండి. తరువాత ఆ మనోభావాలపై మీరు పనిచేయగల విధానాలను పరిగణించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
మీ విశ్వాసంలో మీరు నమ్మకంగా, భద్రతగా భావించి—తరువాత జీవితంలోని శ్రమలు మీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అంతకుముందు మీరు అనుభవించిన శాంతిని తిరిగి పొందడానికి మీరు కష్టపడుతున్నట్లు కనుగొన్న ఆత్మీయ అనుభవాన్ని మీరెప్పుడైనా కలిగియున్నారా? కర్ట్‌లాండ్‌లోని పరిశుద్ధులకు ఇటువంటిదే జరిగింది. కర్ట్‌లాండ్ దేవాలయ ప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆత్మీయ క్రుమ్మరింపుల తర్వాత సంవత్సరం లోపే కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక సంక్షోభం, పన్నెండుమంది సమూహంలో ఐక్యత లోపం మరియు ఇతర శ్రమలు కొంతమంది తమ విశ్వాసంలో సందేహించేలా చేసాయి.
మనం శ్రమలను తప్పించుకోలేము, కాబట్టి అవి మన విశ్వాసం మరియు సాక్ష్యాన్ని సందిగ్ధంలో పడేయకుండా ఎలా కాపాడుకోగలము? జవాబులో కొంతభాగం, కర్ట్‌లాండ్‌లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు సిద్ధాంతము మరియు నిబంధనలు 112లో ప్రభువు ఇచ్చిన సలహాలో కనుగొనబడవచ్చు. నా యెదుట మీ హృదయాలు శుద్ధిచేసుకొనుడి” (28వ వచనము), “తిరుగుబాటు చేయకుము” (15వ వచనము), “ఆ కార్యము కొరకు నీ నడుముకు దట్టీ కట్టుకొనుము” (7వ వచనము), మరియు “నిన్ను నీవు తగ్గించుకొనుము” (10వ వచనము) అని ప్రభువు చెప్పారు. మనం ఈ సలహాను పాటించినప్పుడు, ప్రతికూలత గుండా స్వస్థత మరియు సమాధానంలోకి ప్రభువు “(మనల్ని) చేయి పట్టుకొని నడిపించును” (10,13 వచనాలు చూడండి).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ప్రభువు “సమస్త సంగతులను (నా) కొరకు సమకూర్చగలరు.”
1836 నాటికి ప్రభువు యొక్క కార్యము చేయడంలో సంఘము అధికమొత్తంలో అప్పులు కూడగట్టుకుంది. ఈ అప్పుల గురించి జోసెఫ్ స్మిత్ మరియు ఇతరులు చింతిస్తూ, వాటిని తీర్చడానికి మార్గాలను పరిగణిస్తున్నప్పుడు, వారు మస్సాచుసెట్స్‌లోని సేలంకు ప్రయాణించారు, బహుశా అక్కడ ఒక ఇంటిలో కొంత డబ్బును వదిలిపెట్టారనే పుకారు దానికి కారణం కావచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 111 యొక్క ప్రకరణ శీర్షిక చూడండి). వారు సేలంకు చేరుకున్న తర్వాత ప్రభువు ఇలా ప్రకటించారు, “మీ కొరకు ఈ పట్టణములో ఒకటి కంటె ఎక్కువ నిధులు కలవు” (10వ వచనము)—“సీయోను ప్రయోజనము కొరకు ఆయన అనుకూల సమయములో ఆయన సమకూర్చు” జనులతో కలిపియున్న నిధులు (2వ వచనము; నిర్గమకాండము 19:5 కూడా చూడండి). సేలంలో ఏమాత్రం డబ్బు దొరకనప్పటికీ, తరువాత అక్కడ సువార్తికుల ప్రయత్నాల వలన పరివర్తన చెందినవారు ప్రభువు వాగ్దానము యొక్క నెరవేర్పులో భాగమయ్యారు.
మీరు 111వ ప్రకరణము చదువుతున్నప్పుడు, మీరు చింతించే విషయాల గురించి ఆలోచించండి. జోసెఫ్‌తో ప్రభువు చెప్పిన మాటలు మీకెలా అన్వయిస్తాయో పరిగణించండి. ఆశించని “నిధులను” కనుగొనడానికి ప్రభువు మీకెలా సహాయపడ్డారు? (10వ వచనము). “సమస్త సంగతులను మీ కొరకు సమకూర్చడానికి” ఆయన ఏమి చేసారో ఆలోచించండి (11వ వచనము). “మీరు పొందగలిగినంత వేగముగా” అను వాక్యభాగము పరలోక తండ్రి గురించి మీకేమి బోధిస్తుంది?
మత్తయి 6:19–21,33 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:3–15
ఆయన చిత్తమును వినయంగా వెదికేవారిని ప్రభువు నడిపిస్తారు.
1837 వేసవిలో పన్నెండుమంది సమూహములో ఐక్యత బలహీనపడుచుండెను. బాధ్యతల గురించి అక్కడ అభిప్రాయ భేదాలున్నాయి మరియు కొంతమంది సభ్యులు ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. థామస్ బి. మార్ష్, అప్పటి పన్నెండుమంది సమూహము యొక్క అధ్యక్షులు చింతించారు మరియు ప్రవక్త నుండి సలహా కోరి ఆయన మిస్సోరి నుండి ఒహైయోకు వచ్చారు. 112వ ప్రకరణములోని బయల్పాటు ద్వారా సహోదరుడు మార్ష్ దానిని పొందారు. అతడికి, అతని సమూహానికి ప్రభువు యొక్క ఉపదేశము ఎలా సహాయపడియుండవచ్చు? మీరు వివాదాన్ని, చెడు భావాలను జయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఇది మీ కొరకు ఏ పాఠాలను కలిగియుంది?
ప్రత్యేకించి, మీరు 10వ వచనమును ధ్యానించవచ్చు. ప్రభువు నిన్ను “చేయి పట్టుకొని నడిపించును” అనగా అర్థమేమిటి? ఈ విధమైన నడిపింపు కొరకు వినయము ఎందుకు అవసరము?
జోసెఫ్ స్మిత్ “క్రీస్తు హస్తములలో ఒక సేవకుడు.”
యెష్షయి సంతతిలో ఒకరని యెషయా “చిగురు” మరియు “వేరు” అని సూచించాడు(యెషయా 11:1,10). 113వ ప్రకరణములో, ఈ వంశస్థుడు, క్రీస్తు యొక్క సేవకుడు అంత్యదినాలలో ప్రభువు జనులను సమకూర్చడంలో సాధనమవుతాడని ప్రభువు వివరించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 113:4, 6 చూడండి)—ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను బాగా వర్ణించే ప్రవచనమిది. కర్ట్‌లాండ్‌లో పరిశుద్ధులు సంక్షోభాన్ని అనుభవిస్తున్న సమయంలో ఇది మరియు 113వ ప్రకరణములోని ఇతర సత్యాలు వారికి ఏవిధంగా ప్రోత్సాహకరంగా ఉండియుండవచ్చు? నేడు ప్రభువు యొక్క కార్యములో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా ఈ బయల్పాటులో మీరేమి కనుగొంటారు?
2 నీఫై 21:10–12; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:40 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 111:2, 9–11.నిత్య “నిధులుగా” మీ కుటుంబము దేనికి విలువిస్తుందో అనేదాని గురించి ఈ వచనాలు ఒక చర్చను ప్రేరేపించవచ్చు. ప్రభువు నిధులుగా యెంచేవి లేదా విలువిచ్చే వాటిని సూచించే వస్తువులను ఇంటిలో దాచిపెట్టడం ద్వారా మీరు ఒక నిధి వేటను తయారు చేయవచ్చు. ప్రతి వస్తువును మీ కుటుంబము కనుగొనినప్పుడు, మీరు దానికి విలువిస్తున్నారని చూపడానికి మీరేమి చేయగలరో చర్చించండి.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:10.వినయము గలవారిని గూర్చి ఎల్డర్ యులిసెస్ సోవారెస్ ఇలా వర్ణించారు: “వినయము గలవారు బోధించదగినవారు, వారు దేవునిపై ఎంతగా ఆధారపడ్డారో గుర్తిస్తూ, ఆయన చిత్తానికి లోబడాలని కోరుకుంటారు. వినయము గలవారు సాత్వీకులు మరియు ఇతరులు కూడా అలాగే ఉండేలా ప్రభావితం చేయగల సమర్థులు” (“Be Meek and Lowly of Heart,” Ensign or Liahona, Nov. 2013,10). వినయంగా ఉండడమంటే అర్థమేమిటో మీ కుటుంబము గ్రహించేలా సహాయపడే విధానాలను పరిగణించండి. మీరు వినయం గురించి ఒక పాట పాడవచ్చు లేదా ప్రభువు మీ కుటుంబ సభ్యులను “చేయి పట్టుకొని నడిపించిన” మరియు “(వారి) ప్రార్థనలకు జవాబిచ్చిన” అనుభవాలను పంచుకోవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:11–14,26.ఒకరి పేరు తెలుసుకోవడం మరియు వారి గురించి తెలుసుకోవడం మధ్య గల తేడా ఏమిటి? ప్రభువు గురించి తెలుసుకోవడం అంటే అర్థమేమిటనే దాని గురించి 11–14 వచనాల నుండి మనమేమి నేర్చుకుంటాము?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:15.ప్రవక్తకు వ్యతిరేకంగా “తిరుగుబాటు” చేయడమంటే అర్థమేమిటి? ప్రవక్తను ఆమోదించాలని కోరుకొనేలా మనకు సహాయపడే విధంగా ఈ వచనంలో మనమేమి కనుగొంటాము?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 113:7--8.“సీయోనును మరలా తెచ్చుటకు”, ఇశ్రాయేలును విమోచించుటకు సహాయపడునట్లు 8వ వచనము నుండి మనమేమి నేర్చుకుంటాము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.