2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
అక్టోబరు 18–24. సిద్ధాంతము మరియు నిబంధనలు 121–123: “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?”


“అక్టోబరు 18–24. సిద్ధాంతము మరియు నిబంధనలు 121–123: ‘ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“అక్టోబరు 18–24. సిద్ధాంతము మరియు నిబంధనలు 121–123,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
లిబర్టీ చెరసాల

వసంతకాలంలో లిబర్టీ చెరసాల, ఆల్ రౌండ్స్ చేత

అక్టోబరు 18–24

సిద్ధాంతము మరియు నిబంధనలు 121–123

“ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?”

సత్యాన్ని తెలుసుకోవడం మీ లక్ష్యమైతే, లేఖన అధ్యయనంతో మీ అనుభవం ఉత్తమంగా ఉంటుంది. ప్రార్థనతో మొదలుపెట్టి, ఆత్మను ఆలకించి, మీ మనోభావాలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మిస్సోరిలోని లిబర్టీలో కౌంటీ చెరసాల క్రింది భాగము చీకటికొట్టుగా పేరొందింది. గోడలు మందంగా, రాతినేల చల్లగా, మురికిగా ఉండి, అక్కడ ఇచ్చే కొద్ది ఆహారము క్రుళ్ళిపోయి ఉండేది మరియు పైకప్పు దగ్గరనున్న రెండు సన్నని కిటికీ చువ్వల మధ్య నుండి మాత్రమే వెలుతురు వచ్చేది. ఈ చీకటికొట్టులోనే జోసెఫ్ స్మిత్ మరియు ఆయన సహోదరులలో కొందరు వారి ఖైదులో అధికభాగం గడిపారు—1838–39 చలికాలంలో నాలుగు స్తబ్దమైన నెలలు— మిస్సోరి రాష్ట్రానికి వ్యతిరేకంగా రాజద్రోహం నేరంపై విచారణ కోసం ఎదురుచూస్తూ గడిపారు. ఈ సమయంలో, పరిశుద్ధులు పడుతున్న బాధ గురించి నిరంతరం జోసెఫ్ సమాచారాన్ని అందుకున్నారు. ఫార్‌ వెస్ట్ యొక్క శాంతి మరియు ఆశావాదం కొద్దినెలలే నిలిచింది, ఇప్పుడు మరలా పరిశుద్ధులు నిరాశ్రయులయ్యారు, అరణ్యంలోనికి తరుమబడి మళ్ళీ ప్రారంభించడానికి మరొక ప్రదేశాన్ని వెదుకుతున్నారు—ఈసారి వారి ప్రవక్త చెరసాలలో ఉన్నారు.

“ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?” అని జోసెఫ్ స్మిత్ మొరపెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఆయన పొందిన జవాబులు, దీనస్థితిలోనున్న ఆ చెరసాలలో “పరలోకము నుండి క్రుమ్మరించబడుతున్న జ్ఞానము”, అది ఎల్లప్పుడూ అలా ఉండకపోయినప్పటికీ దేవుడు ఎన్నడూ దూరంగా లేడని నిరూపించాయి. ఏ శక్తి “పరలోకమును ఆపలేదని” ప్రవక్త తెలుసుకున్నారు. “దేవుడు నిరంతరము (విశ్వాసులైన తన పరిశుద్ధులకు) తోడైయుండును.” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1, 33; 122:9.)

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–10, 23–33;122

ప్రతికూలత “(నా) మేలు కొరకైయుండగలదు.”

మనము లేదా మనం ప్రేమించేవారు బాధపడుతున్నప్పుడు, మన గురించి దేవుడికి తెలుసా అని ఆశ్చర్యపోవడం అతిసాధారణం. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–6 చదువుతున్నప్పుడు, జోసెఫ్ స్మిత్‌కు కలిగినటువంటి ప్రశ్నలు లేదా భావాలు మీకు కలిగిన సమయాల గురించి ఆలోచించండి. మీకు అలాంటి ప్రశ్నలు లేదా భావాలు కలిగినప్పుడు మీకు సహాయపడేలా ప్రభువు యొక్క జవాబు నుండి మీరేమి కనుగొంటారు? ఉదాహరణకు, 7–10, 26–33వచనాలలో “(బాధను) సహించిన” వారికి ఆయన వాగ్దానమిస్తున్న దీవెనలను గమనించండి. మీరు 122వ ప్రకరణము చదువుతున్నప్పుడు, మీ ప్రతికూలతలను మీరు ఏవిధంగా చూడాలని ప్రభువు కోరుతున్నారో పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–46

“పరలోక శక్తులు” మనకు లభ్యము కాగలవు.

లిబర్టీ చెరసాలలో శక్తిహీనమైన స్థితిగా అనిపించిన పరిస్థితిలో శక్తి గురించి—పరిశుద్ధులపై ప్రయోగించబడిన రాజకీయ లేదా సైనిక శక్తి గురించి కాదు, కానీ “పరలోక శక్తుల” గురించి జోసెఫ్‌కు బయల్పాటు ఇవ్వబడింది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–46 చదువుతున్నప్పుడు, దేవుని శక్తి గురించి మీరేమి నేర్చుకుంటారు? ఇహలోక శక్తి నుండి ఇది ఏవిధంగా భిన్నంగా ఉంది? ఉదాహరణకు, “శక్తి లేక ప్రభావమును” వర్ణించడానికి 41–43 వచనాలలో ప్రభువు ఉపయోగించే పదాలను చూడండి. దేవుడు తన “శక్తి లేక ప్రభావమును” ఎలా నిలుపుకుంటాడనే దాని గురించి అవి ఏమి బోధిస్తాయి? మీ జీవితం గురించి మరియు ఇతరులతో మీ సంబంధాలలో మంచి ప్రభావాన్ని కలిగియుండేందుకు మీరు చేయగల దానిని ధ్యానించడానికి బహుశా ఈ వచనాలు మిమ్మల్ని ప్రేరేపించగలవు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 122

యేసు క్రీస్తు అన్నిటికంటే హీనమైన వాటిని అనుభవించెను.

ఆయన స్నేహితులు మరియు కుటుంబము వారి ఇళ్ళ నుండి తరిమివేయబడినప్పుడు నాలుగు నెలలకు పైగా జోసెఫ్ స్మిత్ అన్యాయంగా ఖైదు చేయబడ్డారు. ఏ కార్యానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసారో అది విఫలమవుతున్నట్లు అనిపించింది. 122వ ప్రకరణములో జోసెఫ్‌కు ఆయన చెప్పిన మాటల నుండి యేసు క్రీస్తు గురించి మీరేమి నేర్చుకుంటారు? జోసెఫ్ గురించి మీరేమి నేర్చుకుంటారు? మీ గురించి మీరేమి నేర్చుకుంటారు?

ఆల్మా 7:11–13; 36:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:6 కూడా చూడండి.

చిత్రం
గెత్సేమనెలో నేలపై యేసు

యేసు మన బాధను అర్థం చేసుకుంటారు. నా ఇష్టము కాదు, నీ చిత్తమే, వాల్టర్ రానె చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 123

“మన సామర్థ్యము మేరకు అన్నింటిని సంతోషముతో చేయుదము.”

1839 మార్చిలో, భయంకరమైన వారి పరిస్థితిని మార్చడానికి పరిశుద్ధులు చేయగలిగినది ఏమీ లేదనిపించియుండవచ్చు. కానీ లిబర్టీ చెరసాల నుండి వ్రాసిన తన లేఖలలో, వారు చేయగలిగిన దాని గురించి జోసెఫ్ వారితో చెప్పారు: “అన్నిటి జ్ఞానమును (సేకరించి), దేవుని రక్షణను చూచుటకు మిక్కిలి నిశ్చయముతో నిలిచియుండుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 123:1,17). నేటి ప్రపంచంలో ఉన్న మోసము మరియు “మనుష్యుల మాయోపాయములను” మీరు పరిగణించినప్పుడు, “(మీ) సామర్థ్యము మేరకు” మీరు చేయగల వాటి గురించి ఆలోచించండి (12,17 వచనాలు). ఈ విషయాలను “సంతోషముతో” చేయడం ఎందుకు ముఖ్యము? (17వ వచనము). “సత్యమును యెరుగకయున్న” (12వ వచనము) వారెవరు మీకు తెలుసు మరియు దానిని కనుగొనడానికి ఆ వ్యక్తికి మీరెలా సహాయపడగలరు?

ఈ లేఖలో జోసెఫ్ అడిగిన వృత్తాంతాలలో అనేకము ప్రభుత్వానికి సమర్పించబడ్డాయి మరియు Times and Seasons (టైమ్స్ అండ్ సీజన్స్) అనే నావూ వార్తాపత్రికలో 11 వరుస భాగాలుగా ప్రచురించబడ్డాయి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–10.లిబర్టీ చెరసాలలోని “చీకటికొట్టు” కేవలం 14 x 14.5 అడుగులు ఉంది (4.2 x 4.4 మీటర్లు). చల్లని వాతావరణంలో నాలుగు నెలలపాటు అంత చిన్న స్థలంలో నిర్బంధించబడడం ఎలా ఉంటుందో ఊహించడానికి మీ కుటుంబానికి మీరెలా సహాయపడగలరు? లిబర్టీ చెరసాలలో పరిస్థితుల గురించి ఇతర వివరాలను “46వ అధ్యాయము: లిబర్టీ చెరసాలలో జోసెఫ్ స్మిత్” (సిద్ధాంతము మరియు నిబంధనల కథలు, 172–74)లో మీరు కనుగొనగలరు. ఈ సారాంశం చివరనున్న “పునఃస్థాపన స్వరములు: లిబర్టీ చెరసాల” కూడా మీరు చదువవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–10లోని సూత్రాల గురించి మనమెలా భావిస్తున్నామనే దానిని ఈ సమాచారము ఎలా ప్రభావితం చేస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–36, 41–45.బహుశా ఈ పోలిక “పరలోక శక్తులను” అర్థం చేసుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు దేవుని శక్తిని విద్యుచ్ఛక్తితో పోల్చవచ్చు; శక్తిని పొందడం నుండి ఒక విద్యుత్తు ఉపకరణమును ఏది నిరోధిస్తుంది? మన ఆత్మీయ శక్తిని ఎలా పెంచుకోవాలనే దాని గురించి 34–36, 41–45 వచనాలతో పాటు ఈ పోలిక మనకేమి బోధిస్తుంది? ఈ లక్షణాలను ఉదహరించే కథలను రక్షకుని జీవితం నుండి కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 122:7–9.బహుశా కుటుంబ సభ్యులు ఈ వచనాల నుండి వారిని ప్రేరేపించే వాక్యభాగాలను వర్ణించే చిన్న చిహ్నాలను తయారు చేయడాన్ని ఆనందించవచ్చు. ఈ చిహ్నాలు మీ ఇంటిలో ప్రదర్శించబడవచ్చు. “మనుష్య కుమారుడు అన్నింటి కంటే హీనమైన వాటిని అనుభవించాడని” తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 123:12.సత్యమును “ఎక్కడ కనుగొనాలో … తెలుసుకోవడానికి” మనం జనులకు ఎలా సహాయపడగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

చిత్రం
పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

లిబర్టీ చెరసాల

మిస్సోరిలోని లిబర్టీలో నిర్బంధించబడినప్పుడు, గవర్నరు ఆదేశాల వలన రాష్ట్రము నుండి తరిమివేయబడిన కడవరి-దిన పరిశుద్ధుల సంకట స్థితి గురించి సమాచారమిచ్చే లేఖలను జోసెఫ్ స్మిత్ అందుకున్నారు. ఒక తీక్షణమైన లేఖ ఆయన భార్య ఎమ్మా నుండి వచ్చింది. ఆమె మాటలు మరియు వాటికి జవాబుగా జోసెఫ్ లేఖలు సంఘ చరిత్రలో ఈ కష్టకాలములో వారి బాధలు మరియు వారి విశ్వాసాన్ని వ్యక్తం చేసాయి.

జోసెఫ్ స్మిత్‌కు ఎమ్మా స్మిత్ నుండి లేఖ, 1839, మార్చి 7

“ప్రియమైన భర్తకు,

“ఒక స్నేహితుని ద్వారా పంపే అవకాశమున్నందున, నేను వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా మనోభావాలన్నీ వ్రాయడానికి నేను ప్రయత్నించకూడదు, ఎందుకంటే మీరున్న పరిస్థితులు, మనల్ని వేరుచేస్తున్న గోడలు, ఊచలు, గడియలు, ప్రవహిస్తున్న నదులు, పారుతున్న కాలువలు, ఎత్తైన కొండలు, మునుగుతున్న లోయలు, విస్తరిస్తున్న పచ్చికబయళ్ళు మరియు మిమ్మల్ని ముందుగా చెరసాలలో బంధించి, ఇంకా అక్కడే ఉంచడం, అనేక ఇతర ఆలోచనలు నా మనోభావాలను వర్ణింపశక్యము కాకుండా చేసాయి.

“మనం అమాయకులమని నాకు తెలియకపోయినా మరియు దైవిక కృప తిన్నగా అడ్డుపడకపోయినా, నేను భరించిన బాధలను నేను ఎన్నడూ సహింపగలిగి ఉండేదాన్ని కాదని నేను ఖచ్చితంగా ఎరుగుదును…; కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను మరియు మీ కోసం ఇంకా ఎక్కువ సహించవలసి రావడం దయగల దేవుని చిత్తమైతే, అది నాకు సమ్మతమే.

“చాలా అస్వస్థతతో ఉన్న ఫ్రెడ్రిక్ తప్ప, మేమంతా ప్రస్తుతానికి క్షేమమే.

“ఇప్పుడు నా చేతులలో ఉన్న పసివాడు అలెగ్జాండర్ మీ జీవితంలో మీరు చూసిన ఉత్తమమైన చిన్నపిల్లల్లో ఒకడు. అతడు ఎంత బలంగా ఉన్నాడంటే, ఒక కుర్చీ సహాయంతో అతడు గది అంతా పరుగెత్తుతాడు.…

“మన చిన్న పిల్లలు తప్ప, దాదాపు మనం కలిగియున్న వాటన్నిటినీ మరియు మన ఇంటిని విడిచిపెట్టి, ఆ ఒంటరి చెరసాలలో బంధించబడిన మిమ్మల్ని వదిలి మిస్సోరి రాష్ట్రం బయటకు నేను ప్రయాణించినప్పుడు నా మనోభావాలు, నా మనస్సులోని ఆలోచనలు దేవుడికి తప్ప మరెవరికీ తెలియవు. వదలివెళ్ళాలనే ఆలోచనే ఒక మనిషి భరించగలిగిన దానికంటే ఎక్కువ కష్టమైనది.…

“…అయినా ముందుముందు మనకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. … ఎప్పటికీ నీ ప్రియమైన,

“ఎమ్మా స్మిత్”1

జోసెఫ్ స్మిత్ నుండి ఎమ్మా స్మిత్‌కు లేఖ, 1839, ఏప్రిల్ 4

“ప్రియాతి ప్రియమైన భార్యకు.

“గురువారం రాత్రి నీకు వ్రాయాలని, నా పరిస్థితిని నీకు తెలియజేయాలని సూర్యాస్తమయ వేళ, ఈ ఒంటరి చెరసాల కిటికీల గుండా చూస్తూ నేను కూర్చున్నాను. రాత్రి పగలు కోపంతోనున్న కాపలాదారుని పర్యవేక్షణలో, ఒంటరితనం, చీకటి, మురికిగానున్న చెరసాల యొక్క కీచుమనే ఇనుప తలుపులు, గోడలు, కిటికీల లోపల నేను ఉన్నప్పటి నుండి ఇప్పటికి సుమారు ఐదు నెలల ఆరు రోజులు2 అయ్యుండవచ్చని నేననుకుంటున్నాను. దేవునికి మాత్రమే తెలిసిన మనోభావాలతో నేను ఈ లేఖ వ్రాస్తున్నాను. ఈ పరిస్థితులలో నా ఆలోచనలను వ్రాయడం లేదా చెప్పడం అసాధ్యం లేదా మేము అనుభవించిన దానిని అనుభవించని వారికి వాటిని వివరించడం దేవదూతలకు కూడా అసాధ్యం. … మా విడుదల కోసం మేము యెహోవా బలముపై మాత్రమే ఆధారపడతాము, ఇంకెవరిపైన కాదు మరియు ఒకవేళ ఆయన దానిని చేయకపోతే, అది జరుగదు, నువ్వు తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేకమంది మమ్మల్ని చంపాలని కోరుతున్నారు; మేము ఏదో నేరం చేసామని కాదు. … నా ప్రియమైన ఎమ్మా, నేను నీ గురించి, పిల్లల గురించి నిరంతరం ఆలోచిస్తున్నాను. … నేను పసివాడైన ఫ్రెడ్రిక్‌ను, జోసెఫ్, జూలియా, అలెగ్జాండర్, జోయానాలను మరియు ఓల్డ్ మేజర్ (పెంపుడు కుక్క)ను చూడాలనుకుంటున్నాను. … నిన్ను చూడడానికి నేను వట్టికాళ్ళతో, తలపై ఏమీ లేకుండా, అర్థనగ్నంగా ఇక్కడి నుండి నీ దగ్గరకు సంతోషంగా నడుస్తాను, అది నాకు కష్టం కాదు, అద్భుతంగా అనిపిస్తుంది. … నా బాధలన్నిటిని నేను ధైర్యంతో సహిస్తున్నాను, నాతో ఉన్నవారు కూడా; మాలో ఏ ఒక్కరూ సంకోచించడం లేదు. (మన పిల్లలు) నన్ను మరచిపోకుండా చూడమని నిన్ను కోరుతున్నాను. నాన్న వారిని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నారని, వారి దగ్గరకు రావడానికి అల్లరిమూకల నుండి తప్పించుకోవడానికి ఆయన చేయగలిగినదంతా చేస్తున్నారని వారితో చెప్పు. వారు మంచి పిల్లలుగా ఉండాలని, అమ్మ మాట వినాలని నాన్న చెప్పారని వారితో చెప్పు.…

“నీ

“జోసెఫ్ స్మిత్ జూ.”3

వివరణలు

  1. Letter from Emma Smith, 7March 1839,” Letterbook2,37, josephsmithpapers.org; అక్షరాలు, విరామచిహ్నాలు మరియు వ్యాకరణము ఆధునికీకరించబడినవి.

  2. 1838, అక్టోబరు 31న జోసెఫ్ మరియు ఆయన సహవాసులు ఖైదు చేయబడ్డారు మరియు రాత్రి పగలు గట్టి బందోబస్తులో ఉంచబడ్డారు. మిస్సోరిలోని రిచ్‌మండ్‌లో ప్రాథమిక విచారణ తర్వాత, వారు డిసెంబరు 1న లిబర్టీ చెరసాలకు తీసుకుపోబడ్డారు.

  3. Letter to Emma Smith, 4April 1839,” 1–3, josephsmithpapers.org; అక్షరాలు, విరామచిహ్నాలు మరియు వ్యాకరణము ఆధునికీకరించబడినవి.

చిత్రం
లిబర్టీ చెరసాలలో జోసెఫ్ స్మిత్

లిబర్టీ చెరసాలలో జోసెఫ్ స్మిత్ బాధపడుతుండగా, ప్రభువు ఆయనను ఓదార్చి, గొప్ప సత్యాలను బయల్పరిచారు.

ముద్రించు