2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
అక్టోబరు 25–31. సిద్ధాంతము మరియు నిబంధనలు 124: “నా నామమున ఒక మందిరము”


“అక్టోబరు 25–31. సిద్ధాంతము మరియు నిబంధనలు 124: ‘నా నామమున ఒక మందిరము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“అక్టోబరు 25–31. సిద్ధాంతము మరియు నిబంధనలు 124,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

నావూ

అందమైన నావూ, లార్రీ విన్బర్గ్ చేత

అక్టోబరు 25–31

సిద్ధాంతము మరియు నిబంధనలు 124

“నా నామమున ఒక మందిరము”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 124 చదువుతున్నప్పుడు, నావూలోని పరిశుద్ధులను పొందమని ప్రభువు ఆహ్వానించిన దీవెనలను మరియు ఆయన మీకు అందించే దీవెనలను ధ్యానించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

గత ఆరు సంవత్సరాలలో పరిశుద్ధుల పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నప్పటికీ, 1839 వసంతకాలంలో మెరుగుపడసాగాయి: ఇల్లినాయ్‌లోని క్విన్సీ నివాసుల మధ్య శరణార్థులైన పరిశుద్ధులు దయను కనుగొన్నారు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులు మిస్సోరిలో నిర్బంధం నుండి తప్పించుకోవడానికి కావలివారు అనుమతించారు. ఇటీవలే సంఘము ఇల్లినాయ్‌లో స్థలము కొనుగోలు చేసింది, అక్కడ పరిశుద్ధులు మరలా సమకూడగలరు. అది బురదనేల, దోమలు నిండిన నేల అయినప్పటికీ, పరిశుద్ధులు అప్పటికే అనుభవించిన సవాళ్ళతో పోల్చితే బహుశా ఇది సంభాళించదగినదిగా కనిపించియుండవచ్చు. కాబట్టి వారు ఆ బురదనంతా ఖాళీచేసి, ఒక క్రొత్త పట్టణానికి ప్రణాళిక రచించారు, దానికి వారు నావూ అని పేరు పెట్టారు. మొదట అది ఖచ్చితమైన వర్ణన కంటే ఎక్కువగా విశ్వాసము యొక్క వ్యక్తీకరణ అయినప్పటికీ, హెబ్రీ భాషలో దానర్థము “అందమైనది”. ఇంతలో ప్రభువు తన ప్రవక్తకు అత్యవసర భావనను కల్పించారు. ప్రభువు మరిన్ని సత్యాలను, విధులను పునఃస్థాపించవలసియున్నది మరియు వాటిని పరిశుద్ధులు పొందగలిగేలా ఆయనకు ఒక పరిశుద్ధ దేవాలయము అవసరమైనది. అనేకవిధాలుగా, విశ్వాసము మరియు అత్యవసరత యొక్క ఇవే భావాలు నేడు ప్రభువు యొక్క కార్యములో ముఖ్యమైనవి.

అందమైన దేవాలయంతో నావూ అందమైన పట్టణంగా మారినప్పటికీ, అవి రెండూ క్రమంగా విడిచిపెట్టబడినవి. అయితే నిజంగా ప్రభువు యొక్క అందమైన కార్యము ఎప్పుడూ “మీకు ఘనత, అమర్త్యత్వము, నిత్యజీవమును కిరీటముగా ఇచ్చుటకైయున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 124:55) మరియు ఆ కార్యము ఎన్నటికీ అంతముకాదు.

Saints, 1:399–427; “Organizing the Church in Nauvoo,” Revelations in Context, 264–71 చూడండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:12–21

ప్రభువు నమ్మే శిష్యునిగా నేను కాగలను.

1830లో అనేకమంది ప్రముఖ నాయకులు సంఘాన్ని విడిచిపెట్టినప్పటికీ, అధికశాతం సభ్యులు విశ్వాసముగా నిలిచారు. ఈ విశ్వాసులలో, మిస్సోరిలో శ్రమలను సహించిన వారితోపాటు క్రొత్తగా సంఘములో చేరిన వారు కూడా ఉన్నారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 124:12–21లో, వారిలో కొంతమంది గురించి ప్రభువు గొప్పగా మాట్లాడారు. ఆయన మాటలలో శిష్యత్వము గురించి ఏ అంతరార్థములను మీరు కనుగొంటారు? వారివలె ఉండడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా ఈ విశ్వాసులలో ఏదైనా ఉన్నదా? మీ కొరకు ఆయన ప్రేమను ప్రభువు ఎలా వ్యక్తపరిచారో కూడా మీరు ధ్యానించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:22–24, 60–61

ఇతరులను ఆహ్వానించి, అంగీకరించమని ప్రభువు నన్ను కోరుతున్నారు.

ఇటీవల మిస్సోరిలో పరిశుద్ధులు అనుభవించిన దానిని పరిగణిస్తూ, వారు తమనుతాము ఒంటరిగా ఉంచుకొనేందుకు మరియు నావూలో సందర్శకులను నిరుత్సాహపరిచేందుకు శోధింపబడియుండవచ్చు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 124:22–24, 60–61 చదువుతున్నప్పుడు, దానిని మనస్సులో ఉంచుకోండి. “ఒక అతిథిగృహమును” నిర్మించడానికి ప్రభువు యొక్క సూచనలలో మిమ్మల్ని ప్రభావితం చేసినదేది? (23వ వచనము). ఆయన సంఘము యొక్క నియమితకార్యము గురించి ఆయన మాటలు మీకేమి బోధిస్తాయి? మీకు, మీ గృహానికి ఈ సూచనలు ఏవిధంగా అన్వయించగలవో ధ్యానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:25–45,55

మనం పరిశుద్ధ విధులను పొందగలిగేలా దేవాలయాలను నిర్మించమని ప్రభువు మనల్ని ఆజ్ఞాపిస్తారు.

కడవరి-దిన పరిశుద్ధులు ఒకసారి నావూలో స్థిరపడిన తర్వాత, ఒక దేవాలయము నిర్మించడం గురించి—ఒహైయో మరియు మిస్సోరిలో ఆయన ఇచ్చినట్లుగానే ప్రభువు వారికి సూచనలివ్వడంలో ఆశ్చర్యం లేదు. “(దేవాలయాలను) ఎల్లప్పుడు నా నామమున నిర్మించవలెనని నా జనులు ఆజ్ఞాపించబడిరి” (39వ వచనము) అని ప్రభువు ఎందుకు చెప్పారో అర్థం చేసుకోవడానికి సహాయపడేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 124:25–45,55లో మీరేమి కనుగొంటారు?

నావూ దేవాలయం నిర్మించబడినప్పటి నుండి, 200లకు పైగా దేవాలయాలు నిర్మించబడ్డాయి లేదా ప్రకటించబడ్డాయి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు: “దేవాలయంలో మనం గడిపే సమయం మన యొక్క మరియు మన కుటుంబాల యొక్క రక్షణకు, ఉన్నతస్థితికి ముఖ్యమైనది. … అపవాది యొక్క ముట్టడులు తీవ్రంగా, అనేకరకాలుగా, శరవేగంగా ఉధృతమవుతున్నాయి. క్రమముగా, తరచుగా దేవాలయములో ఉండుటకు మన అవసరత ఇంత గొప్పగా ఎప్పుడూ లేదు” (“మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2018,114). “అపవాది యొక్క ముట్టడులు” తట్టుకోవడానికి దేవాలయము మీకెలా సహాయపడింది? అధ్యక్షులు నెల్సన్ సలహాను అనుసరించడానికి ఏమి చేయాలని మీరు ప్రభావితం చేయబడ్డారు?

నావూ దేవాలయాన్ని నిర్మిస్తున్న వారితో జోసెఫ్ స్మిత్

నావూ దేవాలయం వద్ద జోసెఫ్ స్మిత్, గ్యారీ ఇ. స్మిత్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:84–118

నా జీవితం కొరకు నాకు నిర్దష్టమైన సలహా ఇవ్వాలని ప్రభువు కోరుతున్నారు.

84–118 వచనాలు నిర్దిష్టమైన వ్యక్తుల కొరకు సలహాతో నిండియున్నాయి మరియు వాటిలో కొంత మీ జీవితానికి తగినట్లుగా అనిపించకపోవచ్చు. కానీ, మీరు వినవలసిన దానిని కూడా మీరు కనుగొనవచ్చు. ఈ వచనాలలో ఆయన మీ కొరకు కలిగియున్న సందేశమేమిటని ప్రభువును అడగడాన్ని పరిగణించండి మరియు దానిని కనుగొనడానికి ఆత్మ యొక్క నడిపింపును వెదకండి. అప్పుడు దానిపై పనిచేయడానికి మీరేమి చేస్తారో నిర్ణయించండి. ఉదాహరణకు, మరింత వినయంగా ఉండడం ఆత్మను పొందడానికి మీకెలా సహాయపడుతుంది? (verse97వ వచనము చూడండి).

ప్రభువు మీకిచ్చిన ఇతర సలహాను కూడా మీరు ధ్యానించవచ్చు. మీరు దానిపై ఎలా పనిచేస్తున్నారు?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:2–11.“ఈ భూలోక రాజులకు నా సువార్తను గూర్చి ఒక గంభీర ప్రకటన చేయమని” (2–3 వచనాలు) ప్రభువు మీ కుటుంబానికి చెప్పినట్లయితే, మీ ప్రకటన ఏమి చెప్తుంది? కలిసి ఒక ప్రకటన తయారుచేయడాన్ని పరిగణించండి మరియు వారు దానిలో చేర్చాలని కోరుకున్న సువార్త సత్యాలను సూచించమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:15.నిజాయితీ కలిగియుండడం అనగా అర్థమేమిటి? ప్రభువు నిజాయితీకి ఎందుకు విలువిస్తారు? నిజాయితీకి సంబంధించి మీ కుటుంబం చూసిన ఉదాహరణలేవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:28–29, 40–41,55.దేవాలయాలు నిర్మించమని ప్రభువు మనల్ని ఎందుకు ఆజ్ఞాపించారనే దాని గురించి ఈ వచనాల నుండి మనమేమి నేర్చుకుంటాము? మీ కుటుంబము దేవాలయ చిత్రాన్ని గీయవచ్చు లేదా బ్లాకులతో లేదా ఇతర వస్తువులతో దేవాలయాన్ని నిర్మించవచ్చు. మీరలా చేస్తున్నప్పుడు, నేడు మనకు దేవాలయాలు ఉన్నందుకు మీరెందుకు కృతజ్ఞత కలిగియున్నారో మరియు వాటిలో క్రమం తప్పక మనమెందుకు ఆరాధించాలో మీరు చర్చించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:91–92.గోత్రజనకుని దీవెనల గురించి ఒక చర్చ వలన మీ కుటుంబము ప్రయోజనము పొందుతుందా? గోత్రజనకుని దీవెన పొందిన కుటుంబ సభ్యులు దానిని పొందడం గురించి మరియు అది వారిని ఎలా దీవించిందో పంచుకోవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

ఉపశమన సమాజ అధ్యక్షత్వము

జోసెఫ్, ఎమ్మా స్మిత్ మరియు ఇతర స్త్రీలు

ఉపశమన సమాజ నిర్మాణము యొక్క వర్ణచిత్రము, పాల్ మన్ చేత

1842లో, ఇల్లినాయ్‌లోని నావూలో ఉపశమన సమాజము ఏర్పాటు చేయబడిన తర్వాత ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా అన్నారు, “స్త్రీలు ఈ విధంగా ఏర్పాటు చేయబడేవరకు సంఘము ఎన్నడూ పరిపూర్ణంగా ఏర్పాటు చేయబడలేదు.”1 అదేవిధంగా, ప్రభువు సంఘము మరియు ఆయన యాజకత్వ పునఃస్థాపన యొక్క అధ్యయనము (సిద్ధాంతము మరియు నిబంధనలు 107 చూడండి) ఉపశమన సమాజము యొక్క అధ్యయనమును చేర్చుకొనే వరకు పూర్తికాదు, అది దానికదే యేసు క్రీస్తు యొక్క ఆడ శిష్యుల “ప్రాచీన విధానము యొక్క పునఃస్థాపన”.2

ఎలైజా ఆర్. స్నో ఆ పునఃస్థాపనలో ముఖ్యపాత్ర పోషించారు. ఉపశమన సమాజము మొదట ఏర్పాటు చేయబడినప్పుడు ఆమె హాజరయ్యారు మరియు సమాజము యొక్క కార్యదర్శిగా, సమావేశాలు జరుగుతున్నప్పుడు వివరాలు నమోదు చేసారు. ఉపశమన సమాజము “యాజకత్వము యొక్క విధానమును బట్టి” ఏర్పాటు చేయబడినదని క్రొత్తగా ఆమె సాక్ష్యమిచ్చారు.3 క్రిందివి ఆమె మాటలు, ఉపశమన సమాజము యొక్క ప్రధాన అధ్యక్షరాలిగా సేవచేస్తున్నప్పుడు, దేవుని యొక్క నిబంధన కుమార్తెలకు అప్పగించబడిన దైవిక కార్యమును ఆమె సహోదరీలు గ్రహించేలా సహాయపడేందుకు వ్రాయబడినవి.

ఎలైజా ఆర్. స్నో

ఎలైజా ఆర్. స్నో, లూయిస్ రామ్సి చేత

“(ఉపశమన సమాజము) అనే పేరు ఆధునికంగా ఉన్నప్పటికీ, నిర్మాణము మాత్రము ప్రాచీన మూలము గలది. ప్రాచీనకాలంలో సంఘములో ఇదే నిర్మాణము ఉండేదని (జోసెఫ్ స్మిత్) చేత మనకు చెప్పబడింది, ‘ఏర్పరచబడినదైన అమ్మగారు’ [2 యోహాను 1:1; సిద్ధాంతము మరియు నిబంధనలు 25:3 చూడండి] అనే నామాన్ని ఉపయోగిస్తూ క్రొత్త నిబంధనలో నమోదు చేయబడిన కొన్ని పత్రికలలో ఇది ఉదహరించబడింది.

“యాజకత్వము లేకుండా ఉండలేనటువంటి నిర్మాణమిది, ఎందుకంటే దాని అధికారము మరియు ప్రభావము మొత్తాన్ని ఆ మూలము నుండే అది గ్రహిస్తుందనేది వాస్తవము. భూమిపై నుండి యాజకత్వము తీసివేయబడినప్పుడు, భూమిపై నున్న యేసు క్రీస్తు సంఘము యొక్క నిజమైన క్రమము యొక్క ప్రతి అనుబంధముతోపాటు ఈ సమాజము కూడా అంతరించిపోయింది.…

“‘నావూ యొక్క స్త్రీల ఉపశమన సమాజము’ యొక్క ఏర్పాటు సమయంలో ఉండి, … ఆ సమాజంతో చెప్పుకోదగిన అనుభవం కలిగియున్న నేను కొన్ని సూచనలివ్వదలిచాను, అవి క్రొత్త మరియు అనేక బాధ్యతలతో నిండిన ఈ అతిముఖ్యమైన స్థానంలో అడుగుపెట్టడానికి సీయోను కుమార్తెలకు సహాయపడతాయి. ఇశ్రాయేలు లోని కుమార్తెలు మరియు తల్లులలో ఎవరైనా తమ ప్రస్తుత అధికారాలలో హద్దులు ఏర్పరచబడినట్లు భావిస్తున్నట్లయితే, మంచిని చేయడానికి అత్యంత ధారాళంగా వారికివ్వబడిన ప్రతి శక్తి మరియు సామర్థ్యం కొరకు ఇప్పుడు వారు కావలసినన్ని అవకాశాలను కనుగొంటారు….

ఎర్ర ఇటుకల దుకాణం

ఎర్ర ఇటుకల దుకాణం యొక్క పైగదిలో ఉపశమన సమాజము ఏర్పాటు చేయబడింది.

“స్త్రీల ఉపశమన సమాజము యొక్క ఉద్దేశ్యమేమిటని ఎవరి మనస్సులోనైనా ప్రశ్న తలెత్తిందా? మంచి చేయడం—బీదవారికి సహాయం చేయడంలోనే కాకుండా ఆత్మలను రక్షించడంలో కూడా మంచిని చేయడానికి మేము కలిగియున్న ప్రతి సామర్థ్యాన్ని ఉపయోగించడం అని నేను జవాబిస్తాను. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగత ప్రయత్నం చేత సాధించబడే దానికంటే ఎంతో ఎక్కువగా సమిష్టి ప్రయత్నం చేత సాధించబడుతుంది.…

“బీదలకు సహాయపడడంలో కేవలం వారి భౌతిక అవసరాలను తీర్చడమే కాకుండా స్త్రీ ఉపశమన సమాజము నిర్వహించవలసిన ఇతర బాధ్యతలున్నాయి. మానసిక పేదరికం మరియు హృదయం యొక్క అస్వస్థత కూడా శ్రద్ధను కోరుతుంది; అనేకసార్లు ఒక దయగల వ్యక్తీకరణ—కొన్ని సలహాలు లేదా వెచ్చని, ప్రేమగల కరచాలనం ఎంతో మంచిని చేస్తుంది మరియు బంగారపు మూట కంటే ఎక్కువగా అభినందించబడుతుంది.…

“పరిశుద్ధులు విదేశాల నుండి సమకూడినప్పుడు, అందరికీ అపరిచితులైయుండి, మోసం చేయాలని చూసేవారి చేత తప్పు దారిలో నడిపించబడేందుకు లోబడినప్పుడు, (వారిని) కాపాడడానికి (ఉపశమన) సమాజము సిద్ధంగా ఉండాలి మరియు వారిని మెరుగుపరచి, వృద్ధిచేయగల సమాజానికి వారిని పరిచయం చేయాలి మరియు అన్నిటిని మించి సువార్త యొక్క విశ్వాసంలో వారిని బలపరచాలి, ఆవిధంగా చేయడంలో అనేకమందిని కాపాడడంలో సాధనంగా ఉండాలి.

“సమాజము యొక్క బాధ్యతలలో వచ్చే కర్తవ్యాలు, విశేషాధికారాలు మరియు బాధ్యతలను నిర్వచించడానికి అనేక పుస్తకాలు అవసరమవుతాయి.… ప్రశాంతంగా, ఆలోచనాపూర్వకంగా, ఉత్సాహంగా, సమిష్టిగా, ప్రార్థనాపూర్వకంగా (మీ బిషప్పు మార్గదర్శకత్వంలో) పనిచేయండి, దేవుడు మీ ప్రయత్నాలను విజయంతో దీవిస్తాడు.”4

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Joseph Smith(2007),451.

  2. Daughters in My Kingdom: The History and Work of Relief Society (2017),7.

  3. Joseph Smith, in SarahM. Kimball, “Auto-biography,” Woman’s Exponent, Sept.1, 1883,51.

  4. “Female Relief Society,” Deseret News, Apr.22, 1868,81.

నావూ దేవాలయం

నావూ దేవాలయం, జార్జ్ డి. డుర్రంట్ చేత