“సెప్టెంబరు 27–అక్టోబరు 3. సిద్ధాంతము మరియు నిబంధనలు 109–110: ‘ఇది నీ మందిరము, నీ పరిశుద్ధతకు ఒక ప్రదేశము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“సెప్టెంబరు 27–అక్టోబరు 3. సిద్ధాంతము మరియు నిబంధనలు 109–110,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
సెప్టెంబరు 27–అక్టోబరు 3
సిద్ధాంతము మరియు నిబంధనలు 109–110
“ఇది నీ మందిరము, నీ పరిశుద్ధతకు ఒక ప్రదేశము”
సిద్ధాంతము మరియు నిబంధనలు 109:24–28ను ఉదహరిస్తూ ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ చెప్పారు, “మీ జీవితంలో మరియు మీ కుటుంబం కొరకు ఈ లేఖనాల అంతర్భావాలను మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేయమని, ప్రార్థనాపూర్వకంగా ధ్యానించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను” (“Honorably Hold a Name and Standing,” Ensign or Liahona, May 2009,99). మీరు చదువుతున్నప్పుడు ఈ ఆహ్వానాన్ని పరిగణించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
కర్ట్‌లాండ్ దేవాలయ ద్వారాలు 1836, మార్చి 27 ఉదయం 8 గంటల వరకు తెరువబడకూడదు. కానీ, ప్రతిష్టిత సేవలకు హాజరు కావాలని కోరిన పరిశుద్ధులు 7 గంటల నుండే బారులు తీరడం మొదలుపెట్టారు. ఆతృత గల ఆరాధికులతో కుర్చీలు, గదులు నిండిపోయినప్పుడు, జోసెఫ్ స్మిత్ మరొకచోటు సూచించారు. అది కూడా నిండిపోయినప్పుడు, రెండవ సభ ప్రణాళిక చేయబడింది. హాజరు కావాలని కోరినవారిలో సజీవులు మాత్రమే లేరు. ప్రతిష్టార్పణ సమయంలో మరియు తరువాత దేవాలయంలో మరియు పైకప్పు మీద కూడా తాము దేవదూతలను చూసామని అనేకమంది సాక్ష్యమిచ్చారు. నిజంగా “పరలోక సైన్యములు” కడవరి-దిన పరిశుద్ధులతో పాటు “పాడడానికి మరియు కేకలు వేయడానికి” వచ్చినట్లు అనిపించింది (“The Spirit of God,” Hymns, no.2).
తెరకు ఇరువైపులా ఎందుకంత ఉత్సాహముంది? పరిశుద్ధులు “ఉన్నతమైన దాని నుండి శక్తిచేత దీవించబడెదరు” అను వాగ్దానము ముందుగా వారు ఒహైయోలో సమకూడడానికి ఒక కారణం (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:32). మరియు భవిష్యత్తు కొరకు గొప్ప విషయాలు వాగ్దానమివ్వబడ్డాయి. “నా జనుల శిరస్సులపై క్రుమ్మరించబడబోవు దీవెనకు ఇది ఆరంభము” అని ప్రభువు ప్రకటించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:10). వేగవంతమైన దేవాలయ కార్యము మరియు లక్షలమంది సజీవులకు, మృతులకు లభ్యమవుతున్న విధులతో—మనమిప్పుడు జీవిస్తున్న యుగము—“భూమిపై కప్పబడిన తెర చిరిగిపోవడం ప్రారంభమైనప్పుడు” (“The Spirit of God”) కర్ట్‌లాండ్‌లో మొదలైంది.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
తన పరిశుద్ధ మందిరంలో ప్రభువు నన్ను దీవించాలని కోరుతున్నారు.
కొన్ని విధాలుగా, నేడు మనకు తెలిసిన దేవాలయాల నుండి కర్ట్‌లాండ్ దేవాలయం భిన్నంగా ఉంది. అక్కడ బలిపీఠములు లేవు, బాప్తీస్మపు తొట్టె లేదు మరియు మృతుల కొరకు బాప్తీస్మము, ముద్రణ వంటి విధులు ఇంకా పునఃస్థాపించబడలేదు. కానీ 109వ ప్రకరణములో వివరించబడిన దీవెనలు, కర్ట్‌లాండ్ దేవాలయం కొరకు ప్రతిష్టిత ప్రార్థన నేడు ప్రభువు మందిరంలో మనం పొందే దీవెనలు. ఈ దీవెనలలో కొన్నింటిని కనుగొనడానికి క్రింది వచనాలను పునర్వీక్షించండి. వాటి గురించి చదివేటప్పుడు, అవి మీకు మరియు మీ కుటుంబానికి ఎందుకు ముఖ్యమైనవో ధ్యానించండి.
5, 12–13 వచనాలు (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:6–8 కూడా చూడండి): దేవాలయంలో ప్రభువు తననుతాను మనకు ప్రత్యక్షపరచుకోగలరు మరియు మనం ఆయన శక్తిని అనుభవించగలము.
9, 17–19, 26, 78–79 వచనాలు: దేవాలయంలో మనం మనపై ప్రభువు యొక్క నామాన్ని తీసుకుంటాము.
22–23 వచనాలు: మనం దేవాలయ నిబంధనలు చేసి, వాటిని పాటించినప్పుడు, ప్రభువు తన కార్యమును చేయడానికి మనకు శక్తినిస్తారు.
24–33 వచనాలు: యోగ్యులుగా మనం దేవాలయానికి హాజరైనప్పుడు, మనం ప్రభువు యొక్క రక్షణను పొందగలము.
ఇతర దీవెనలు:
ఈ దీవెనలు పొందడానికి ఏమి చేయమని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది?
కర్ట్‌లాండ్ దేవాలయ ప్రతిష్టిత ప్రార్థన నాకు ప్రార్థన గురించి బోధించగలదు.
109వ ప్రకరణము బయల్పాటు ద్వారా జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన ప్రతిష్టిత ప్రార్థన (ప్రకరణ శీర్షిక చూడండి). ఈ ప్రకరణము నుండి ప్రార్థన గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? మీరు దీనిని చదువుతున్నప్పుడు, మీ స్వంత ప్రార్థనల గురించి మీరు ఆలోచించవచ్చు. పరలోక తండ్రితో మీ సంభాషణను మెరుగుపరచడంలో మీకు సహాయపడగలిగేలా మీరు పొందే మనోభావాలేవి? ఉదాహరణకు, ఈ ప్రార్థనలో ప్రవక్త దేని గురించి ప్రార్థించారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 110:1–10
దేవాలయంలో ప్రభువు తననుతాను నాకు ప్రత్యక్షపరచుకోగలరు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 110:1–10 చదివిన తర్వాత, రక్షకుని గురించి మీరెలా భావిస్తారు? దేవాలయంలో ఆయన తననుతాను మీకెలా ప్రత్యక్షపరచుకున్నారు? ఆయన మీ ప్రయత్నాలను, త్యాగాలను అంగీకరిస్తున్నారని తెలుసుకోవడానికి ఏ విధాలుగా ఆయన మీకు సహాయపడ్డారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11–16
దేవుని కార్యము సాధించడానికి కావలసిన యాజకత్వ తాళపుచెవులు నేడు సంఘములో ఉన్నాయి.
కర్ట్‌లాండ్ దేవాలయంలో మోషే, ఏలీయా మరియు ఏలీయాలు జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు అప్పగించిన యాజకత్వ తాళపుచెవుల గురించి అర్థం చేసుకోవడానికి మీరు ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ సందేశము చదువవచ్చు “దేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడుట” (ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2018, 114–17). ఈ తాళపుచెవులు నేడు సంఘము యొక్క కార్యానికి అనుగుణంగా ఎలా ఉన్నాయో ఎల్డర్ కుక్ వివరించారు. లేఖన దీపికలో “మోషే,” “ఏలీయా,” మరియు “ఏలీయా” (scriptures.ChurchofJesusChrist.org) గురించి చదవడం ద్వారా ఈ ప్రాచీన ప్రవక్తల గురించి నేర్చుకోవడాన్ని కూడా మీరు పరిగణించవచ్చు. ఈ తాళపుచెవులకు సంబంధించిన పనిలో సహాయపడేందుకు మీరేమి చేయగలరో ధ్యానించండి.
హెన్రీ బి. ఐరింగ్, “ఆయన మన ముందర నడచును,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2020, 66–69.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 109.ఒక కుటుంబంగా, దేవాలయంలో అధిక సమయం గడపడానికి మిమ్మల్ని ప్రేరేపించే కొన్ని వచనాలను 109వ ప్రకరణములో కనుగొనండి (ఉదాహరణకు, “వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు” క్రింద జాబితా చేయబడిన వచనాలను చూడండి). ఏవిధంగా మీరు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సూచించిన దానిని చేయగలరో మాట్లాడండి: “ఆయన పరిశుద్ధ మందిరములో ఆయనతో ఉండుటకు—ప్రభువుతో క్రమముగా సమయాన్ని ప్రణాళిక చేయుటకు, తరువాత ఖచ్చితంగా, సంతోషముగా దానిని నిలుపుకొనుటకు ఒక మార్గమును కనుగొనుము ” (“మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2018,114). మీరు, మీ కుటుంబము ఇప్పటివరకు దేవాలయానికి వెళ్ళనట్లయితే, వెళ్ళడానికి సిద్ధపడేందుకు మీరొక ప్రణాళిక చేయవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 109:78–80.“The Spirit of God” (Hymns, no.2) కీర్తన కర్ట్‌లాండ్ దేవాలయ ప్రతిష్టాపన కొరకు వ్రాయబడింది మరియు అప్పటినుండి ప్రతి దేవాలయ ప్రతిష్టాపనలో పాడబడుతోంది. కలిసి మీరు ఈ కీర్తన పాడి, కడవరి-దిన దేవాలయాల కొరకు మీ కృతజ్ఞతను పెంచే వాక్యభాగాలను కనుగొనవచ్చు. ఈ కీర్తన సిద్ధాంతము మరియు నిబంధనలు 109:78–80లోని సందేశంతో ఏ విధమైన సంబంధం కలిగియుంది?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 110.మీ కుటుంబ సభ్యలు 110వ ప్రకరణము చదువుతున్నప్పుడు మరియు ఈ సారాంశము చివరన ఉన్న చిత్రాన్ని చూసినప్పుడు, కర్ట్‌లాండ్ దేవాలయంలో జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలతో పాటు వారు ఉన్నట్లయితే వారు ఎలా భావించేవారో ఊహించుకోమని వారిని ఆహ్వానించండి. వారు రక్షకుని గురించి ఎలా భావిస్తున్నారో పంచుకోవడానికి మీ కుటుంబానికి ఒక అవకాశమివ్వండి.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 110:15.వారి పూర్వీకులవైపు మీ పిల్లల “హృదయాలను త్రిప్పుటకు” ఏది సహాయపడవచ్చు? దేవాలయ విధులు అవసరమైన పూర్వీకులను గుర్తించి, దేవాలయంలో ఆ విధులను నిర్వహించడానికి ప్రణాళిక చేసేందుకు మీరు కలిసి పనిచేయవచ్చు. కర్ట్‌లాండ్ దేవాలయంలో ఏలీయా చేత పునఃస్థాపించబడిన కార్యము మీ పూర్వీకుల కొరకు మీ ప్రేమను ఎలా అధికం చేస్తుందో కూడా మీరు మాట్లాడవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “The Spirit of God,” Hymns, no.2.
పునఃస్థాపన స్వరములు
ఆత్మీయ ప్రత్యక్షతలు మరియు కర్ట్‌లాండ్ దేవాలయము
క్రిందివి ప్రతిష్టాపన సమయంలో మరియు తరువాత జరిగిన ఇతర సమావేశాల్లో కర్ట్‌లాండ్ దేవాలయంలో ఉన్న కడవరి-దిన పరిశుద్ధుల మాటలు. పెంతెకొస్తు దినమున “ఉన్నతము నుండి శక్తితో వారు దీవించబడినప్పుడు” ప్రాచీన పరిశుద్ధులు అనుభవించిన దానితో అనేకమంది తమ అనుభవాలను పోల్చారు (లూకా 24:49; అపొస్తలుల కార్యములు 2:1–4; సిద్ధాంతము మరియు నిబంధనలు 109:36–37 కూడా చూడండి).
ఎలైజా ఆర్. స్నో
“ఆ ప్రతిష్టాపన వేడుకల గురించి తిరిగి చెప్పవచ్చు, కానీ చిరస్మరణీయమైన ఆ దినము యొక్క పరలోక ప్రత్యక్షతలను ఏ మర్త్య భాష వర్ణించలేదు. అక్కడున్న వారందరు దైవ సన్నిధిని గుర్తించినప్పటికీ, కొందరికి దేవదూతలు కనిపించారు మరియు ప్రతి హృదయం ‘అవ్యక్త ఆనందంతో, సంపూర్ణ మహిమతో’ నింపబడింది.’”1
సిల్వియా కట్లర్ వెబ్
“నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటి దేవాలయ ప్రతిష్టాపన. మా నాన్న మమ్మల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని, మేము ఎందుకు వెళ్తున్నామో మరియు దేవునికి ఒక మందిరాన్ని ప్రతిష్టించడం అంటే అర్థమేమిటో మాకు చెప్పారు. నేను చాలా చిన్నపిల్లనైనప్పటికీ, ఆ సందర్భం నాకు స్పష్టంగా గుర్తుంది. నేను గతంలోకి చూసి, అప్పుడు నేను చూసినట్లుగా ప్రవక్త జోసెఫ్ పరలోకం వైపు చేతులు చాపి నిలబడడాన్ని, పాలిపోయిన ఆయన ముఖాన్ని, చిరస్మరణీయమైన ఆనాడు ఆయన మాట్లాడుతుండగా ఆయన చెంపలపై కారిన కన్నీళ్ళను చూడగలను. దాదాపు అందరూ కన్నీళ్ళు కారుస్తున్నట్లు అనిపించింది. మందిరము జనులతో ఎంతగా నిండియున్నదంటే, ఎక్కువమంది పిల్లలు పెద్దవాళ్ళ ఒడిలో కూర్చున్నారు; మా అక్క నాన్న ఒడిలో, నేను అమ్మ ఒడిలో కూర్చున్నాము. మేము ధరించిన దుస్తులు కూడా నాకు జ్ఞాపకమున్నాయి. దాని ప్రత్యేకతనంతా అర్థం చేసుకోవడానికి నేను చాలా చిన్నదానిని, కానీ కాలం గడిచేకొద్దీ అది నాకు స్పష్టమైంది మరియు అక్కడ ఉండగలిగినందుకు నేనెంతో కృతజ్ఞరాలిని.”2
ఆలీవర్ కౌడరీ
“సాయంత్రం ప్రభువు మందిరంలో నేను సంఘము యొక్క అధికారులను కలుసుకున్నాను. ఆత్మ క్రుమ్మరింపబడింది—ఒక గొప్ప మేఘము క్రిందికి వచ్చి, మందిరంపై నిలిచినట్లు మరియు వీచుచున్న బలమైన గాలివలె మందిరమును నింపుతున్నట్లు నేను దేవుని మహిమను చూసాను. వారు ఇతర భాషలు మాట్లాడుతూ, ప్రవచించినప్పుడు … అనేకమందిపై అగ్ని నిలిచినట్లుగా అగ్నిజ్వాలల వంటి నాలుకలను కూడా నేను చూసాను.”3
బెంజమిన్ బ్రౌన్
“అనేక దర్శనములు కనిపించాయి. మేఘంపైన సూర్యుడు బంగారంలా మెరుస్తున్నప్పుడు ఉన్నంత ప్రకాశవంతంగా ఒక దిండు లేదా మబ్బు మందిరంపై నిలిచినట్లు ఒకరు చూసారు. ముగ్గురు వ్యక్తులు మెరుస్తున్న తాళపుచెవులను, అలాగే మెరుస్తున్న గొలుసును చేతిలో పట్టుకొని గదిలో పరిభ్రమించడం ఇతరులిద్దరు చూసారు.”4
ఆర్సన్ ప్రాట్
“దేవుడు అక్కడున్నాడు, ఆయన దూతలు అక్కడున్నారు మరియు జనుల మధ్య పరిశుద్ధాత్మ ఉన్నాడు … వారు శిరస్సు నుండి పాదాల వరకు పరిశుద్ధాత్మ శక్తి, ప్రేరేపణలతో నింపబడ్డారు.”5
నాన్సీ నయోమి అలెగ్జాండర్ ట్రేసీ
“దేవాలయం పూర్తయి, ప్రతిష్టించబడినప్పుడు … నా జీవితంలో ఉన్న రెండు అతి సంతోకరమైన రోజులవి. ‘The Spirit of God Like a Fire is Burning (దేవుని ఆత్మ అగ్ని వలె మండుచున్నది)’ అనే కీర్తన సందర్భానికి తగినట్లుగా కూర్చబడింది. పరలోక ప్రభావము ఆ మందిరంపై నిలిచియున్నది అనేది నిజంగా వాస్తవము. … అది భూతల స్వర్గమని నేను భావించాను.”6