2023 క్రొత్త నిబంధన
ఏప్రిల్ 24-30. యోహాను 7–10: “నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని”


“ఏప్రిల్ 24-30. యోహాను 7–10: ‘నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఏప్రిల్ 24-30. యోహాను 7-10,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
నేలపై పడియున్న స్త్రీతో యేసు

నేనును నీకు శిక్ష విధింపను, ఇవా కొలేవా టిమోతి చేత

ఏప్రిల్ 24-30

యోహాను 7–10

“నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని”

మీరు యోహాను 7–10 చదువుతున్నప్పుడు, ఈ అధ్యాయాలలోని సిద్ధాంత సూత్రాల గురించి మీరు పరిశుద్ధాత్మ నుండి ప్రేరణలు పొందవచ్చు. మీ ప్రేరణలు నమోదు చేయడం వాటిని అనుసరించడానికి మీరు ప్రణాళిక రూపొందించడంలో సహాయపడగలదు.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు క్రీస్తు “మనుష్యులకు సమాధానమును”(లూకా 2:14) కలుగజేయుటకు వచ్చినప్పటికీ, “ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను” (యోహాను 7:43 ). ఒకే సంఘటనలను చూసిన ప్రజలు యేసు ఎవరో అనేదాని గురించి చాలా భిన్నమైన నిర్ణయాలకు వచ్చారు. కొందరాయనను “మంచివాడనిరి,” మరికొందరు “ఆయన జనులను మోసపుచ్చువాడనిరి” (యోహాను 7:12). ఆయన విశ్రాంతి దినమున గ్రుడ్డివానిని స్వస్థపరిచినప్పుడు కొందరు, “ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి,” మరికొందరు, “పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియలేలాగు చేయగలడు?” అనిరి. (యోహాను 9:16). అన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ, సత్యాన్ని శోధించిన వారు ఆయన మాటలలోని శక్తిని గుర్తించారు, ఎందుకంటే “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు” (యోహాను 7:46). తాను క్రీస్తు కాదా అని యూదులు “మాతో స్పష్టముగా చెప్పుమని” యేసును అడిగినప్పుడు, సత్యాన్ని అసత్యం నుండి వేరు చేయడంలో మనకు సహాయపడే ఒక సూత్రాన్ని ఆయన వెల్లడించారు: “నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటినెరుగుదును, అవి నన్ను వెంబడించును”(యోహాను 10:24, 27) అని ఆయన చెప్పారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యోహాను 7:14–17

నేను యేసు క్రీస్తు బోధించిన సత్యాలను జీవిస్తున్నప్పుడు, అవి నిజమని నేను తెలుసుకుంటాను.

కనీసం, వారికి తెలిసిన మార్గాల్లో—యేసు చదువుకోనప్పటికీ, ఆయనకు పాండిత్యమెట్లు వచ్చెనని యూదులు చెప్పుకొనిరి (15వ వచనము చూడండి). యేసు ప్రతిస్పందనలో, విద్య లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ లభించే సత్యాన్ని తెలుసుకోవడానికి ఆయన వేరే మార్గాన్ని బోధించారు. యోహాను 7:14–17 ప్రకారం, యేసు బోధించిన సిద్ధాంతం నిజమని మీరు ఎలా తెలుసుకోగలరు? సువార్త గురించి మీ సాక్ష్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రక్రియ మీకు ఎలా సహాయపడింది?

యోహాను 8:2–11

రక్షకుని కరుణ అందరికీ అందుబాటులో ఉంది.

వ్యభిచారం చేసిన మహిళతో రక్షకుని పరస్పర సంభాషణ గురించి మాట్లాడేటప్పుడు, ఎల్డర్ డేల్ జి. రెన్లండ్ ఇలా అన్నారు: “ఖచ్చితంగా, రక్షకుడు వ్యభిచారాన్ని క్షమించలేదు. అయితే ఆయన స్త్రీని కూడా ఖండించలేదు. తన జీవితాన్ని సంస్కరించుకోమని ఆయన ఆమెను ప్రోత్సహించారు. ఆయన కనికరము మరియు దయ కారణంగా ఆమె మారడానికి ప్రేరేపించబడింది. బైబిలు యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదం ఆమె ఫలిత శిష్యత్వాన్ని ధృవీకరిస్తుంది: ‘మరియు ఆ స్త్రీ ఆ గడియ నుండి దేవుడిని మహిమపరిచెను మరియు ఆయన నామము మీద నమ్మకముంచెను’ [యోహాను 8:11, పాదవివరణ చూడండి]” (“మన మంచికాపరి,” లియహోనా, మే 2017, 30).

ఆ స్త్రీలా రక్షకుని నుండి ఖండనకు బదులుగా దయ పొందినట్లు మీరు ఎప్పుడు భావించారు? మీరు పాపరహితులుగా లేనప్పుడు కూడా ఇతరులను నిందించడం లేదా తీర్పు తీర్చడం ద్వారా శాస్త్రులు, పరిసయ్యుల మాదిరిగా మీరెప్పుడు ఉన్నారు? (యోహాను 8:7 చూడండి). రక్షకుడు శాస్త్రులు మరియు పరిసయ్యులతో, వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిన స్త్రీతో సంభాషించిన విధానం నుండి మీరు ఇంకా ఏమి నేర్చుకోగలరు? మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు రక్షకుని క్షమాపణ గురించి మీరు ఏమి నేర్చుకుంటారు?

యోహాను 9

మనకు విశ్వాసం ఉన్నట్లయితే, దేవుడు మన కష్టాల్లో తననుతాను ప్రత్యక్షపరచుకోగలరు.

జీవితపు సవాళ్ళు మరియు శ్రమల గురించి యోహాను 9:1–3 మీకేమి బోధిస్తుంది? మీరు యోహాను 9 చదువుతున్నప్పుడు, పుట్టు గ్రుడ్డివాని జీవితంలో ఏవిధంగా “దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డాయో” ధ్యానించండి. మీరు శ్రమలతో కలిపి మీ జీవితంలో అవి ఎలా ప్రత్యక్షపరచబడ్డాయి?

యోహాను 10:1-30

యేసు క్రీస్తు మంచి గొఱ్ఱెలకాపరి.

గొఱ్ఱెలు మరియు గొఱ్ఱెలు మేపడం గురించి మీకు తెలియనప్పటికీ, “నేను గొఱ్ఱెల యొక్క మంచి కాపరిని” అని రక్షకుడు చెప్పిన యోహాను 10 చదవడం ఆయన గురించి మీకు ముఖ్యమైన సత్యాలను బోధించగలదు. ఈ సత్యాలను కనుగొనడానికి, మంచి కాపరి ఎలా ఉంటాడో వివరించే వాక్యభాగాల కోసం చూడండి మరియు తర్వాత, ఆ వాక్యభాగాలు రక్షకునికి ఎలా వర్తిస్తాయో పరిగణించండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి:

  • 3వ వచనము: “అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును.”

  • 11వ వచనము: అతడు “గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.”

  • 16వ వచనము: “అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.”

ఈ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీకు సహాయపడేందుకు ఇక్కడ కొన్ని అదనపు ప్రశ్నలున్నాయి: యేసు ఒక ద్వారము వలె ఎట్లున్నారు? (7–9 వచనాలు చూడండి). “జీవితాన్ని… మరింత సమృద్ధిగా” ఆయన మీకు ఎట్లు ఇచ్చారు? (10వ వచనము). ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎరుగుదురని మీరు ఎప్పుడు భావించారు? (14వ వచనము చూడండి). మంచి కాపరి స్వరమును మీరెలా గుర్తిస్తారు? (27వ వచనము చూడండి).

కీర్తన 23; యెహెజ్కేలు 34; ఆల్మా 5:37–39; 3 నీఫై 15:21–16:5; గెరిట్ డబ్ల్యు. గాంగ్, “మంచి కాపరి, దేవుని గొఱ్ఱెపిల్ల,” లియహోనా, మే 2019, 97–101 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యోహాను 7:24.యోహాను 7:24లో యేసు బోధనను గ్రహించడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, బయటకు ఒకలాగ మరియు లోపల మరొకలాగ కనిపించే దేనినైనా మీరు వారికి చూపించవచ్చు. లేదా బయటకు కనిపించే దానిని బట్టి తీర్పుతీర్చకూడదని వారికి బోధించిన అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. ప్రతి కుటుంబ సభ్యునిలో కంటికి కనిపించని లక్షణాలను కూడా మీరు జాబితా చేయవచ్చు (1 సమూయేలు 16:7 కూడా చూడండి).

యోహాను 8:31-36.“పాపము యొక్క సేవకునిగా” ఉండుట అనగా అర్థమేమిటి? (మొరోనై 7:11 కూడా చూడండి). యేసు బోధించిన ఏ సత్యాలు మనల్ని స్వేచ్ఛగా చేయగలవు?

చిత్రం
గ్రుడ్డివానిని స్వస్థపరుస్తున్న క్రీస్తు

గ్రుడ్డివానిని స్వస్థపరుస్తున్న యేసు, కార్ల్ హీన్రిచ్ బ్లాక్ చేత

యోహాను 9.యోహాను 9 లో యేసు గ్రుడ్డివానిని స్వస్థపరిచిన వృత్తాంతమును మీ కుటుంబము దృశ్యీకరించుకొనుటకు మీరు ఏవిధంగా సహాయపడగలరు? యేసు క్రీస్తు సువార్తకు పరివర్తన చెందడం అంటే ఏమిటి వంటి ఏ పాఠాలైనా ఆ వృత్తాంతం నుండి వారు నేర్చుకున్నారేమో గమనించమని వారిని ఆహ్వానించండి.

యోహాను 10:1–18, 27–29.మంచి కాపరి యొక్క ఉపమానము నుండి నేర్చుకోవడంలో కుటుంబ సభ్యులు పాల్గొనేలా చేయడానికి, క్రిందివాటిలో ఒకదాని చిత్రాన్ని గీయమని వారిలో ప్రతి ఒక్కరినీ అడగండి: ఒక దొంగ, తలుపు, గొఱ్ఱెల కాపరి, జీతగాడు (కూలీకి తెచ్చుకున్న పనివాడు), ఒక తోడేలు మరియు ఒక గొఱ్ఱె. యోహాను 10:1–18, 27–29 చదవడానికి వారిని ఆహ్వానించండి, ఆపై వారు గీసిన విషయాల గురించి రక్షకుడు బోధించిన వాటిని కుటుంబంగా చర్చించండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ప్రేరేపించు పదాలు మరియు వాక్యభాగాల కోసం చూడండి. మీరు చదివేటప్పుడు, కొన్ని పదాలు లేదా వాక్యభాగాలను ఆత్మ మీ దృష్టికి తీసుకురావచ్చు, అవి మిమ్మల్ని ప్రేరేపించి, ప్రోత్సహించవచ్చు లేదా మీ కోసం వ్రాయబడినట్లు అనిపించవచ్చు. యోహాను 7–10లో మీకు ప్రేరణనిచ్చే ఏదైనా పదాలు లేదా వాక్యభాగాలను వ్రాయడాన్ని పరిగణించండి.

చిత్రం
గొఱ్ఱెపిల్లతో క్రీస్తు

ఇక ఎన్నడూ తప్పిపోవద్దు, గ్రెగ్ కె. ఓల్సెన్ చేత

ముద్రించు