2023 క్రొత్త నిబంధన
మార్చి 27–ఏప్రిల్ 2. మత్తయి 14; మార్కు 6; యోహాను 5–6: “భయపడకుడి”


“మార్చి 27–ఏప్రిల్ 2. మత్తయి 14; మార్కు 6; యోహాను 5–6: ‘భయపడకుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మార్చి 27–ఏప్రిల్ 2. మత్తయి 14; మార్కు 6; యోహాను 5–6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
రొట్టెల బుట్టలను పట్టుకొస్తున్న శిష్యులతోపాటు నడుస్తున్న యేసు

మార్చి 27–ఏప్రిల్ 2

మత్తయి 14; మార్కు 6; యోహాను 5–6

“భయపడకుడి”

మీరు మత్తయి 14; మార్కు 6; మరియు యోహాను 5–6 చదువుతున్నప్పుడు, మీకు అర్థవంతమైన సత్యముల కొరకు వెదకండి. “ఈ అధ్యాయములలోని వృత్తాంతములు నాకు ఎలా సంబంధిస్తాయి?” వంటి ప్రశ్నలు మీకై మీరు అడుగవచ్చు. “నా జీవితం కొరకు నేను కనుగొనే సందేశాలు ఏమిటి?” లేదా “నా కుటుంబముతో లేదా ఇతరులతో నేను పంచుకోవడానికి ఇష్టపడేది ఏమిటి?”

మీ మనోభావాలను నమోదు చేయండి

ఘోరమైన తుఫాను సమయంలో గలిలయ సముద్రము మధ్యలో తన పడవలోనున్న భద్రతను విడిచిపెట్టుటకు పేతురును ప్రేరేపించినది ఏమిటి? యేసు నీటిపై నడవగలిగిన యెడల, తాను కూడా నడవగలనని నమ్ముటకు అతడిని నడిపించినది ఏమిటి? మనకు నిశ్చయముగా తెలియదు, కానీ బహుశా పేతురు, దేవుని కుమారుడు జనుల కొరకు అద్భుతమైన విషయాలను చేయుటకు మాత్రమే రాలేదు కానీ పేతురు వంటి జనులు అద్భుతమైన విషయాలను చేయుటకు వారిని శక్తిమంతులను చేయుటకు వచ్చెనని గ్రహించాడు. అన్నిటిని మించి, యేసు యొక్క ఆహ్వానము, “వచ్చి, నన్ను వెంబడింపుము” (లూకా 18:22). పేతురు ఈ ఆహ్వానమును ఒకసారి అంగీకరించాడు, తన భయాలను ఎదుర్కొనుట మరియు అసాధ్యమైనదిగా కనబడిన దానిని చేయుట అని దాని అర్థము అయినప్పటికినీ అతడు మరలా దానిని అంగీకరించుటకు సమ్మతించాడు. బహుశా ప్రభువు తుఫాను మధ్యలో పడవలో నుండి బయటకు రమ్మని లేదా వేలమంది తినడానికి అవసరమైనప్పుడు మన కొద్దిపాటి రొట్టె సరఫరాను ఇవ్వమని మనల్ని అడగడు, కానీ మనము ఆదేశాలను పూర్తిగా గ్రహించనప్పుడు కూడా వాటిని అంగీకరించమని ఆయన మనల్ని అడగవచ్చు. మనకు ఆయన ఆహ్వానములు ఏవైనప్పటికీ, కొన్నిసార్లు అవి ఆశ్చర్యకరమైనవిగా లేదా భయపెట్టేవిగా కూడా కనబడవచ్చు. కానీ పేతురు వలె, మనము మన భయాలను, మన అనుమానాలను మరియు మన పరిమితమైన జ్ఞానమును ప్రక్కన పెట్టి విశ్వాసమందు ఆయనను అనుసరించిన యెడల, అద్భుతములు సంభవించగలవు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యోహాను 5:16-47

యేసు క్రీస్తు తన తండ్రిని ఘనపరచును.

పరలోక తండ్రి మరియు ఆయన పిల్లలలో ప్రతీఒక్కరి మధ్య అనుబంధము పవిత్రమైనదిగా ఉండుటకు ఉద్దేశించబడింది. ఈ వచనాలలో, యేసు క్రీస్తు పరలోక తండ్రితో మన అనుబంధములో అనుసరించుటకు ప్రేరేపించే మాదిరిని మనకు ఇచ్చారు. యోహాను 5:16–47 చదవండి మరియు తండ్రి అనే మాట యొక్క ప్రతీ సందర్భమును గుర్తించండి లేదా గమనించండి. కుమారుడు తండ్రిని ఎలా ఘనపరిచాడు మరియు మీరు ఆయన మాదిరిని ఎలా అనుసరించగలరు? కుమారుని గురించి తండ్రి ఎలా భావిస్తున్నారనే దాని గురించి మీరేమి నేర్చుకుంటారు? మీ పరలోక తండ్రితో మీ అనుబంధాన్ని బలపరచడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

యోహాను 17 కూడా చూడండి.

చిత్రం
రొట్టెలు మరియు చేపలు

ఐదు రొట్టెలు మరియు రెండు చేపలతో యేసు అద్భుతంగా 5,000 మంది జనులకు ఆహారమిచ్చారు.

మత్తయి 14:15–21; మార్కు 6:33–44; యోహాను 6:5–14

రక్షకుడు తన ఉద్దేశములను నెరవేర్చుటకు వినయముగల నా అర్పణలను ఘనపరచగలరు.

మీ గృహము, మీ అనుబంధములు లేదా సమాజములో మీ చుట్టూ చూసే అవసరాలన్నిటిని తీర్చడానికి మీరు సరిపోరని మీరెప్పుడైనా భావించారా? ఐదు రొట్టెలు మరియు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నప్పుడు, ఐదువేల మంది ఆకలిగొన్న జనులకు ఆహారమివ్వమని ఆయన వారిని అడిగినప్పుడు, యేసు యొక్క శిష్యులు తాము తగమని భావించియుండవచ్చు. తరువాత జరిగిన అద్భుతము గురించి మీరు చదివినప్పుడు, మీ చుట్టూ ఉన్నవారిని దీవించుటకు మీ వినయముగల సేవార్పణలను దేవుడు ఎలా ఉపయోగిస్తాడో ధ్యానించండి. మీరు ఆయనకు సేవ చేసినప్పుడు మీ ప్రయత్నాలను ఆయన ఎలా ఘనపరిచారు? మిచెల్లి డి. క్రైయిగ్ నుండి ఈ వ్యాఖ్యానాన్ని పరిగణించండి: “మీరు, నేను మనకు కలిగినది క్రీస్తుకు ఇవ్వగలము, మరియు ఆయన మన ప్రయత్నాలను విస్తారముగా చేయును. దేవుని యొక్క కృపపై మీరు ఆధారపడిన యెడల—మీ మానవ దుర్భలతలు మరియు బలహీనతలతో కూడా—ఇవ్వడానికి మీరు కలిగియున్నది సరిపోవును” (“దైవిక అసంతృప్తి,” లియహోనా, నవ. 2018, 54).

మత్తయి 14:22–33; మార్కు 6:45–52; యోహాను 6:15–21

నా భయాలు మరియు అనుమానాలను ప్రక్కన పెట్టి, ఆయన యందు విశ్వాసమును సాధన చేయడానికి యేసు క్రీస్తు నన్ను ఆహ్వానిస్తున్నారు.

మత్తయి 14:22–33; మార్కు 6:45–52; మరియు యోహాను 6:15–21 లో వివరించబడిన దృశ్యము యొక్క వివరాలను మీ మనస్సులో చిత్రీకరించుకొనండి. పేతురు మరియు ఇతర శిష్యులు ఎలా భావించారో ఊహించండి. ఈ వచనాలలో ఉన్న రక్షకుని మాటలు మరియు క్రియల నుండి శిష్యత్వము గురించి మీరు నేర్చుకొన్నదేమిటి? పేతురు యొక్క మాటలు మరియు క్రియల నుండి మీరు నేర్చుకొన్నదేమిటి? (1 నీఫై 3:7 కూడా చూడండి.) పడవ నుండి బయటకు రావడం వంటి దేనిని చేయమని ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు? యేసు క్రీస్తుయందు మీ విశ్వాసమును సాధన చేయుటకు మీకు ధైర్యమిచ్చునట్లు ఈ వచనాలలో మీరు కనుగొన్నదేమిటి?

యోహాను 6:22–71

యేసు క్రీస్తు శిష్యునిగా నేను, అది చేయడానికి కష్టమైనప్పుడు కూడా సత్యమును నమ్మడానికి మరియు అంగీకరించడానికి సుముఖంగా ఉండాలి.

తననుతాను “జీవాహారము” (యోహాను 6:48) అని యేసు సూచించినప్పుడు, అనేకమంది దానిని “కఠినమైన మాటగా” (యోహాను 6:60) కనుగొన్నారు. రక్షకుని సిద్ధాంతమును బట్టి జీవించడం లేదా దానిని అంగీకరించడం కష్టమనిపించినప్పుడు యోహాను 6:68–69 లోని పేతురు మాటలు మీకెలా సహాయపడగలవు? పేతురు సాక్ష్యం గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? రక్షకుడిని అనుసరించడానికి కట్టుబడి ఉండేలా మీకు సహాయపడే కొన్ని “నిత్యజీవపు మాటలు” (యోహాను 6:68) ఏవి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 14:15-21.ఐదు వేలమందికి ఆహారమివ్వడానికి ఎన్ని రొట్టెలు మరియు చేపలు అవసరమవుతాయో ఊహించడానికి మీ కుటుంబానికి మీరెలా సహాయపడవచ్చో ఆలోచించండి. రక్షకుని గురించి మత్తయి 14:15–21లోని అద్భుతము మనకేమి బోధిస్తుంది? మీ దగ్గర ఇవ్వడానికి సరిపోయేంత లేదని మీరు భావించినప్పుడు, రక్షకుడు మీ ప్రయత్నాలను అధికం చేసిన అనుభవాన్ని పంచుకోవడాన్ని పరిగణించండి.

మత్తయి 14:22-33.ఈ వచనాలలోని వృత్తాంతమును నటించి చూపడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు. శిష్యులు ఎందుకు భయపడియుంటారు? పేతురు ఎందుకు తన భయాన్ని జయించగలిగి, పడవను విడిచిపెట్టాడు? అతడు మునిగిపోతున్నప్పుడు కూడా తన విశ్వాసమును ఎలా చూపాడు? మనము కొన్నిసార్లు పేతురు వలే ఎలా ఉన్నాము?

యోహాను 5:1-16.ఈ వచనాలలో “స్వస్థపరచబడెను” అను వాక్యభాగముగల ఉదాహరణలను గుర్తించుటకు కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. ఏ విధాలుగా యేసు క్రీస్తు జనులను స్వస్థపరచగలరు? ఆయన మనల్ని ఎప్పుడు, ఎలా స్వస్థపరిచారు?

యోహాను 6:28-58.ప్రతీ కుటుంబ సభ్యునికి తినడానికి ఒక రొట్టె ముక్కను ఇవ్వండి. రొట్టె మరియు ఇతర ఆరోగ్యకరమైన ఆహారముల నుండి మనం పొందే ప్రయోజనాలను చర్చించండి. తరువాత, యేసు క్రీస్తు తనను తాను “జీవాహారము” (యోహాను 6:35) అని ఎందుకు పిలిచారో వెదుకుతూ ఈ వచనాలను కలిసి పరిశోధించండి. జీవాహారమును “తినుట” అనగా అర్థము ఏమైయుండవచ్చు? (డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “పరలోకము నుండి వచ్చిన జీవాహారము,” లియహోనా, నవ. 2017, 36–39 చూడండి).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీ స్వంత ఆత్మీయ అంతరార్థములను వెదకండి. మీ వ్యక్తిగత మరియు కుటుంబ అధ్యయనములో, ఈ సారాంశములలో చెప్పబడిన లేఖన భాగములకు మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు. బహుశా, ఈ అధ్యాయాలలో ప్రభువు మీ కొరకు ఇక్కడ చెప్పబడని సందేశాలను కలిగియుండవచ్చు. వాటిని ప్రార్థనాపూర్వకంగా వెదకండి.

చిత్రం
పేతురును నీటిలో నుండి పైకి లేపుతున్న యేసు

గాలికి వ్యతిరేకంగా, లిజ్ లెమన్ స్విండిల్ చేత

ముద్రించు