2023 క్రొత్త నిబంధన
డిసెంబరు 4-10. ప్రకటన 1-5: “గొఱ్ఱెపిల్లకు ఘనతయు, మహిమయు … యుగయుగములు కలుగునుగాక”


“డిసెంబరు 4-10. ప్రకటన 1-5: ‘గొఱ్ఱెపిల్లకు ఘనతయు మహిమయు … యుగయుగములు కలుగునుగాక,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“డిసెంబరు 4-10. ప్రకటన 1-5,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
గడ్డిపై కూర్చున్న గొఱ్ఱెపిల్ల

డిసెంబరు 4-10

ప్రకటన 1-5

“గొఱ్ఱెపిల్లకు ఘనతయు మహిమయు … యుగయుగములు కలుగునుగాక”

ప్రకటనలో మీరు చదివిన దాని గురించి మీకు కలిగిన ప్రశ్నలను వ్రాయడాన్ని పరిగణించండి. తరువాత మీ ప్రశ్నలకు జవాబుల కొరకు మీరు అన్వేషించవచ్చు లేదా కుటుంబ సభ్యునితో లేదా సంఘ తరగతులలో వాటిని చర్చించవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఒక శక్తివంతమైన ఆత్మీయ అనుభవంలో మీరు అనుభవించిన దానిని ఇతరులకు వ్యక్తపరచడానికి మీరు ఎప్పుడైనా ప్రయాసపడ్డారా? రోజువారీ భాష ఆత్మీయ భావనలు మరియు మనోభావాలను వివరించడానికి సరిపోదని అనిపించవచ్చు. బహుశా అందుకే యోహాను తన గొప్ప బయల్పాటును వివరించడానికి గొప్ప ప్రతీకవాదము మరియు చిత్రములు ఉపయోగించాడు. అతడు కేవలము యేసు క్రీస్తును చూసానని చెప్పవచ్చు, కానీ అతడి అనుభవమును మనము గ్రహించుటకు సహాయపడేందుకు, అతడు ఈ మాటలను ఉపయోగిస్తూ రక్షకుడిని వర్ణించాడు: “ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను,” “ఆయన నోటినుండి రెండంచుల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను” మరియు “ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను” (ప్రకటన 1:14–16). మీరు ప్రకటన గ్రంథము చదివినప్పుడు, ప్రతీ చిహ్నము వెనుక అర్థమును మీరు గ్రహించనప్పటికీ, మీరు నేర్చుకొని, అనుభవించాలని యోహాను కోరిన సందేశాలను కనుగొనుటకు ప్రయత్నించండి. సంఘ సమూహములను క్రొవ్వొత్తులతో, సాతానును ఘటసర్పముతో, మరియు యేసుక్రీస్తును ఒక గొఱ్ఱెపిల్లతో అతడు ఎందుకు పోల్చియుండవచ్చు? చివరకు, యేసు క్రీస్తు మరియు ఆయన అనుచరులు మనుష్యులు మరియు సాతాను యొక్క రాజ్యములపై విజయాన్ని పొందుతారు అనే అత్యంత ముఖ్యమైన నేపథ్యముతో కలిపి, దాని ముఖ్యమైన నేపథ్యములను గ్రహించుటకు ప్రకటనలో ప్రతీ చిహ్నమును మీరు గ్రహించనవసరం లేదు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

తన పిల్లలను రక్షించడానికి పరలోక తండ్రి ప్రణాళిక గురించి యోహాను దర్శనము బోధిస్తుంది.

ప్రకటన గ్రంథమును గ్రహించుట కష్టము కావచ్చు, కానీ నిరాశ చెందవద్దు. యోహాను యొక్క వాగ్దానము ప్రయత్నించడాన్ని కొనసాగించమని మిమ్మల్ని ప్రేరేపించవచ్చు: “ఈ ప్రవచనము యొక్క వాక్యములను చదువువాడు, వాటిని విని, గ్రహించుటకు ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు, ఏలయనగా ప్రభువు రాబోయే సమయం దగ్గరపడుతోంది” (జోసెఫ్ స్మిత్ అనువాదము, ప్రకటన 1:3 [బైబిలు అనుబంధములో], వివరణ చేర్చబడింది).

ప్రకటన చదివేందుకు గల ఒక విధానము, రక్షణ ప్రణాళికతో గల సంబంధాల కొరకు చూడడం. ఈ సాధారణ సమీక్ష మీకు సహాయపడవచ్చు:

మీరు చదువుతున్నప్పుడు, “దేవుని ప్రణాళిక గురించి ఇది నాకు ఏమి బోధించుచున్నది?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చెడును జయించి, ఆయన యొద్దకు తిరిగివెళ్ళడానికి నాకు సహాయపడేందుకు దేవుడు ఏమి చేసాడు? విశ్వాసులకు ఆయన చేసిన వాగ్దానాలేవి?

ప్రకటనలో ఇవ్వబడిన కొన్ని చిహ్నాలను సిద్ధాంతము మరియు నిబంధనలు 77 వివరిస్తుందని తెలుసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. అదనంగా, జోసెఫ్ స్మిత్ అనువాదము ప్రకటనలోని అనేక వాక్యభాగాలను స్పష్టం చేస్తుంది, కాబట్టి క్రమం తప్పక పాదవివరణలు మరియు బైబిలు అనుబంధము పరిశీలించండి.

బైబిలు నిఘంటువు, “యోహాను,” “యోహాను ప్రకటన” కూడా చూడండి.

ప్రకటన 1

యేసు క్రీస్తు సజీవుడగు దేవుని యొక్క సజీవుడైన కుమారుడు.

ప్రకటన యొక్క మొదటి అధ్యాయము యేసు క్రీస్తు ఒక దర్శనములో యోహానుకు ప్రత్యక్షమవడాన్ని వివరిస్తుంది. బహుశా మీరు యేసు క్రీస్తు గురించి ఈ అధ్యాయము చెప్పేవి, అనగా ఆయన ఎవరు, ఆయన మనకోసం ఏమి చేస్తారు మరియు ఆయన ఎలాంటి వారు అనేవాటన్నిటిని ఒక జాబితాగా చేయవచ్చు.

మీరు నేర్చుకొనే వాటిలో కొన్ని చిహ్నాల నుండి వస్తాయి. ఈ చిహ్నాల ద్వారా తన గురించి ప్రభువు మీకు ఏమి బోధించాలని ప్రయత్నిస్తుండవచ్చో ధ్యానించండి. ఉదాహరణకు, రక్షకుడు తననుతాను “ఆదియును అంతమును” మరియు “మొదటివాడను కడపటివాడను” అని పిలువడాన్ని గమనించండి. ఈ పేర్లు ముఖ్యమైనవని మీరెందుకు అనుకుంటున్నారు? ఈ పేర్లు రక్షకుని గురించి మీకేమి బోధిస్తాయి?

ప్రకటన 2–3

యేసు క్రీస్తుకు నేను వ్యక్తిగతంగా తెలుసు మరియు నా సవాళ్ళను జయించడానికి నాకు సహాయపడతారు.

ప్రకటన 2–3లో రక్షకుని మాటలు, యోహాను కాలములోని సంఘము యొక్క ప్రతీ శాఖకు గల ప్రత్యేకమైన విజయాలు మరియు కష్టములను ఆయన గ్రహించారని బయల్పరచును. పరిశుద్ధుల ప్రయత్నాలను ఆయన మెచ్చుకున్నారు మరియు వారు మార్చుకోవలసిన విషయాల గురించి వారిని హెచ్చరించారు కూడా. రక్షకుని మెచ్చుకోలు మరియు హెచ్చరికల నుండి మీరేమి నేర్చుకుంటారు?

రక్షకుడు మీ విజయాలను మరియు కష్టాలను కూడా అర్థం చేసుకుంటారు మరియు ఆయన మీకు సహాయపడాలని కోరుతున్నారు. జయించు వారికి ఆయన తరచు చేసే వాగ్దానాలను గమనించండి. ఈ వాగ్దానాల గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది? దేనిని జయించాలని ప్రభువు మిమ్మల్ని కోరుతుండవచ్చు? ఆయన సహాయాన్ని పొందడానికి మీరు ఏమి చేయగలరు?

ప్రకటన 4-5

యేసు క్రీస్తు మాత్రమే పరలోక తండ్రి ప్రణాళికను సాధ్యపరచగలరు.

ప్రకటన 4 నుండి పరలోక తండ్రి గురించి మరియు ప్రకటన 5 నుండి యేసు క్రీస్తు గురించి మీరేమి నేర్చుకుంటారు? యేసు క్రీస్తు (“గొఱ్ఱెపిల్ల”) పరలోక తండ్రి యొక్క ప్రణాళికను సాధ్యపరచునని మనమందరం గ్రహించినప్పుడు, అది ఎలా ఉండియుంటుందో పరిగణించండి (యేసు క్రీస్తు ఏడు ముద్రలను తీసి, … గ్రంథమును విప్పగలరు” [ప్రకటన 5: 5]). యేసు క్రీస్తు మాత్రమే దీనిని ఎందుకు చేయగలరు? మీ రక్షకునిగా ఆయనయందు మీ విశ్వాసమును మీరు ఎలా చూపగలరు?

యోబు 38:4–7; సిద్ధాంతము మరియు నిబంధనలు 77:1-7 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ప్రకటన 1:20.యేసు తన సంఘమును దీపస్తంభములతో ఎందుకు పోల్చారు? (మత్తయి 5:14–16 చూడండి.)

ప్రకటన 2–3.తన కాలమందు సంఘములకు యోహాను ఇచ్చినటువంటి ఒక సందేశమును మీ కుటుంబానికి ఇచ్చుటకు అతడు అడుగబడినట్లు నటించండి. ఏది బాగా జరుగుతున్నదని అతడు చెప్పాడు? మీరు ఎలా మెరుగుపడవచ్చు?

ప్రకటన 3:15-16.ఈ వచనములు చదివిన తరువాత, వేడిగా లేదా చల్లగా ఉన్నప్పుడు రుచిగా ఉండే ఏదైనా పానీయాన్ని మీ కుటుంబము గోరువెచ్చగా త్రాగవచ్చు. ఆత్మీయంగా గోరువెచ్చగా ఉండడం అనగా అర్థమేమి?

ప్రకటన 3:20.మీ కుటుంబము ప్రకటన 3:20 చదువుతున్నప్పుడు, రక్షకుడు తలుపు తట్టు చిత్రమును చూపండి (ఈ సారాంశము చివరలో చూడండి). లోపలికి రావడానికి బదులుగా యేసు ఎందుకు తలుపు తట్టుచున్నారు? కుటుంబ సభ్యులు వంతులవారీగా తలుపు తట్టవచ్చు. తరువాత, కుటుంబములోని వేరొకరు మనం రక్షకునికి “తలుపు తీయగల” మార్గాన్ని సూచించి, కుటుంబ సభ్యునికి లోపలికి రానియ్యవచ్చు. మన ఇంటిలో రక్షకుడిని కలిగియుండడం ఎలా అనిపిస్తుంది?

ప్రకటన 4:10-11.పరలోక తండ్రిని ఆరాధించడం అంటే అర్థమేమిటి? ఆయనను ఆరాధించాలని మనం కోరుకొనేలా ఆయన గురించి మనకేమి తెలుసు?

ప్రకటన 5:6, 12–13.యేసు క్రీస్తు “గొఱ్ఱెపిల్ల” అని ఎందుకు పిలువబడ్డారు? ఈ పేరు ఆయన గురించి మనకు ఏమి బోధిస్తుంది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ప్రశ్నలను ప్రోత్సహించండి. ప్రశ్నలు కుటుంబ సభ్యులు నేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నారనడానికి సూచనగా ఉన్నాయి మరియు వారికి బోధించబడిన దానికి వారు ఎలా స్పందిస్తున్నారనే అంతర్‌జ్ఞానములను ఇస్తాయి. లేఖనాలలో జవాబులను ఎలా కనుగొనాలో మీ కుటుంబానికి బోధించండి. (Teaching in the Savior’s Way, 25–26 చూడండి.)

చిత్రం
తలుపు తట్టుచున్న క్రీస్తు

ఆయనను లోనికి రానిమ్ము, గ్రెగ్ కె. ఓల్సన్ చేత

ముద్రించు