“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: నిబంధన,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: నిబంధన,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు
నిబంధన
పాత నిబంధన అంతటా మీరు నిబంధన అనే పదాన్ని తరచు చదువుతారు. నేడు మనం నిబంధనలను దేవునితో చేసే పరిశుద్ధ వాగ్దానాలుగా అనుకుంటాము, కానీ ప్రాచీన ప్రపంచంలో జనులు ఒకరితో ఒకరు జరిపే సంభాషణలలో కూడా నిబంధనలు ముఖ్యమైన భాగముగా ఉండేవి. వారి భద్రత మరియు బ్రతుకుదెరువు కోసం జనులు ఒకరినొకరు నమ్మవలసియుండెను మరియు ఆ నమ్మకాన్ని పదిలపరచు విధానమే నిబంధనలు.
కాబట్టి దేవుడు నిబంధనల గురించి నోవహు, అబ్రాహాము లేక మోషేతో మాట్లాడినప్పుడు, ఆయనతో ఒక నమ్మకమైన బంధంలో ప్రవేశించడానికి ఆయన వారిని ఆహ్వానిస్తున్నారు. పాత నిబంధనలో నిబంధనకు ప్రఖ్యాతిగాంచిన ఉదాహరణలలో ఒకటి, దేవుడు అబ్రాహాము మరియు శారయితో చేసినది—తరువాత వారి వంశస్థులైన ఇస్సాకు, యాకోబు (ఇశ్రాయేలు అని కూడా పిలువబడును)లతో నవీకరించినది. పాత నిబంధనలో ఇది కేవలం “నిబంధన” గా చెప్పబడినప్పటికీ, మనం తరచు దీనిని అబ్రాహాము నిబంధన అని పిలుస్తాము. ప్రధానంగా తమనుతాము ఈ నిబంధన యొక్క వారసులుగా—నిబంధన జనులుగా ఎంచుకొనే జనుల వృత్తాంతముగా పాత నిబంధనను మీరు చూస్తారు.
ప్రత్యేకించి కడవరి-దిన పరిశుద్ధులకు అబ్రాహాము నిబంధన నేటికీ ముఖ్యమైనదిగా కొనసాగుతోంది. ఎందుకు? ఎందుకనగా మనం అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల యొక్క ప్రత్యక్ష వంశస్థులం అయినా, కాకపోయినా మనం కూడా నిబంధన జనులము (గలతీయులకు 3:27–29 చూడండి). ఈ కారణం చేత, అబ్రాహాము నిబంధన ఏమిటో మరియు అది నేడు మనకు ఎలా అన్వయిస్తుందో గ్రహించడం ముఖ్యము.
అబ్రాహాము నిబంధన అనగానేమి?
“నీతికి గొప్ప అనుచరునిగా“ (అబ్రాహాము 1:2) ఉండాలని అబ్రాహాము కోరుకున్నాడు, కాబట్టి దేవుడు అతడిని నిబంధన సంబంధంలోకి ఆహ్వానించారు. ఈ కోరికను కలిగియున్న వారిలో అబ్రాహాము మొదటివాడు కాదు, నిబంధనను పొందిన వారిలో అతడు మొదటివాడు కాదు. అతడు “పితరుల దీవెనల కొరకు” (అబ్రాహాము 1:2)—ఆదాము, హవ్వలకు మరియు తరువాత ఈ దీవెనలను శ్రద్ధగా కోరిన వారికి నిబంధన ద్వారా అందించబడిన దీవెనల కొరకు ఆపేక్షించాడు.
అబ్రాహాముతో దేవుని నిబంధన అద్బుతమైన దీవెనలను వాగ్దానం చేసింది: ఒక స్వాస్థ్యము, అధిక సంతానము, యాజకత్వ విధులకు ప్రవేశము మరియు రాబోయే తరతరాలు గౌరవించే ఒక పేరు. కానీ ఈ నిబంధన యొక్క దృష్టి, అబ్రాహాము మరియు అతని కుటుంబము పొందే దీవెనలపై మాత్రమే కాకుండా దేవుని యొక్క మిగతా పిల్లల కొరకు వారు ఎలా దీవెన కాగలరు అనే దానిపై కూడా కేంద్రీకరించబడింది. “నీవు ఆశీర్వాదముగా నుందువు,” “భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును” (ఆదికాండము 12:2–3) అని దేవుడు ప్రకటించెను.
ఈ నిబంధన అబ్రాహాము, శారయి మరియు వారి వంశస్థులకు దేవుని పిల్లల మధ్య విశేష హోదా కల్పించిందా? కేవలము ఇతరులను దీవించుటకు ఇవ్వబడిన విశేషాధికారమని గ్రహించవలెను. “సువార్త యొక్క దీవెనలు, అవే రక్షణ యొక్క దీవెనలు అనగా నిత్యజీవము యొక్క దీవెనలను” పంచుకొనుచూ అబ్రాహాము కుటుంబము ”సమస్త జనములకు తీసుకొనివెళ్ళుటకు ఈ పరిచర్యను, యాజకత్వమును కలిగియుందురు” (అబ్రాహాము 2:9, 11).
ఈ నిబంధనయే అబ్రాహాము ఎంతగానో ఎదురుచూస్తున్న దీవెన. దీనిని పొందిన తర్వాత, అబ్రాహాము తన మనస్సులో ఇలా అనుకున్నాడు, “నీ సేవకుడు నిన్ను శ్రద్ధతో వెదికెను; ఇప్పుడు నిన్ను నేను కనుగొంటిని” (అబ్రాహాము 2:12).
అది వేల సంవత్సరాల క్రితం జరిగింది, కానీ ఈ నిబంధన మనకాలంలో పునఃస్థాపించబడింది (1 నీఫై 22:8–12 చూడండి). ఇది ప్రస్తుతం దేవుని జనుల జీవితాల్లో నెరవేర్చబడుతోంది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలను దీవిస్తూ దేవుని కార్యము పురోగమిస్తుండగా కడవరి దినాలలో నిబంధన యొక్క నెరవేర్పు బలపడుతున్నది. అబ్రాహాము వలె నీతికి గొప్ప అనుచరునిగా ఉండగోరిన వారు, శ్రద్ధగా ప్రభువును వెదికిన వారెవరైనా దానిలో భాగం కాగలరు.
అబ్రాహాము నిబంధన పట్ల నా అభిప్రాయమేమి?
మీరు నిబంధన బిడ్డ. మీరు బాప్తీస్మము పొందినప్పుడు, మీరు దేవునితో ఒక నిబంధన చేసారు. మీరు సంస్కారములో పాలుపొందిన ప్రతిసారీ మీరు ఆ నిబంధనను తిరిగి క్రొత్తగా చేస్తారు. మీరు దేవాలయంలో పరిశుద్ధ నిబంధనలు చేస్తారు. ఈ నిబంధనలన్నీ కలిసి మిమ్మల్ని అబ్రాహాము నిబంధనలో భాగస్థులను చేస్తాయి, దాని సంపూర్ణత్వము దేవాలయ విధులలో కనుగొనబడుతుంది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా, “ఒకనాడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు వారి సంతానానికి వాగ్దానము చేయబడినట్లు చివరకు పరిశుద్ధ దేవాలయంలో మనము ఒక నిత్య కుటుంబము యొక్క దీవెనలకు తోటివారసులము కాగలము.” 1
ఈ నిబంధనలు, విధుల ద్వారా మనము దేవుని జనులమవుతాము (నిర్గమకాండము 6:7; ద్వితీయోపదేశకాండము 7:6; 26:18; యెహెజ్కేలు 11:20 చూడండి). మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి మనం భిన్నంగా మారతాము. మన నిబంధనలు యేసు క్రీస్తు యొక్క నిజమైన, నిబద్ధత గల శిష్యులుగా మారడాన్ని మనకు సాధ్యం చేస్తాయి. “మన నిబంధనలు మనల్ని ఆయనతో బంధించి, మనకు దేవుని శక్తిని ఇస్తాయి” అని అధ్యక్షులు నెల్సన్ వివరించారు. 2 దేవుడు తన జనులను ఆయన శక్తితో దీవించినప్పుడు, వారు ఇతరులను దీవిస్తారని—“భూమి యొక్క సమస్త వంశములకు“ వారు “ఒక దీవెన” అవుతారనే ఆశతో, ఆహ్వానంతో దానిని ఇస్తారు (అబ్రాహాము 2:9, 11).
ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా అబ్రాహాము నిబంధన పునఃస్థాపించబడినందువలన ఇది మనకివ్వబడిన అమూల్యమైన గ్రహింపు. కాబట్టి నిబంధన గురించి మీరు పాత నిబంధనలో చదివినప్పుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుని సంబంధము గురించి మాత్రమే ఆలోచించకండి. మీతో ఆయన సంబంధము గురించి కూడా ఆలోచించండి. సంతానము లెక్కకు ఇసుక రేణువులగును (ఆదికాండము 28:14 చూడండి) అనే వాగ్దానం గురించి మీరు చదివినప్పుడు, నేడు అబ్రాహామును తండ్రిగా పిలిచే లక్షలమంది గురించి మాత్రమే ఆలోచించకండి. నిత్య కుటుంబాలు మరియు నిత్యవృద్ధి గురించి దేవుడు మీకిచ్చిన వాగ్దానమును గూర్చి కూడా ఆలోచించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4; 132:20–24 చూడండి). ఒక స్వాస్థ్యమును గురించిన వాగ్దానము గూర్చి మీరు చదివినప్పుడు, అబ్రాహాముకు వాగ్దానమివ్వబడిన స్థలము గురించి మాత్రమే ఆలోచించకండి. “యెహోవా కొరకు కనిపెట్టుకొను” “సాత్వీకులకు” వాగ్దానం చేయబడిన స్వాస్థ్యమైన భూమి యొక్క సిలెస్టియల్ గమ్యము గురించి కూడా ఆలోచించండి (మత్తయి 5:5; కీర్తన 37:9, 11; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:17–20 కూడా చూడండి). దేవుని నిబంధన జనులు “భూమి యొక్క సమస్త వంశములను” (అబ్రాహాము 2:11) దీవిస్తారనే వాగ్దానం గురించి మీరు చదివినప్పుడు, అబ్రాహాము లేక అతని నుండి వచ్చిన ప్రవక్తల పరిచర్య గురించి మాత్రమే ఆలోచించకండి. మీ చుట్టూ ఉన్న కుటుంబాలకు దీవెనకరంగా ఉండడానికి—యేసు క్రీస్తు యొక్క నిబంధన అనుచరుడిగా—మీరు చేయగల దాని గురించి కూడా ఆలోచించండి.