“అక్టోబరు 31–నవంబరు 6. దానియేలు 1–6: ‘రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“అక్టోబరు 31–నవంబరు 6. దానియేలు 1–6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
అక్టోబరు 31–నవంబరు 6
దానియేలు 1–6
“రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు”
ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ ఇలా వివరించారు, ప్రేరేపణను నమోదు చేయడమనేది “ఆయన సంభాషణలు మనకు పవిత్రమైనవని దేవునికి చూపుతుంది. నమోదు చేయడం బయల్పాటును గుర్తుచేసుకోవడానికి మన సామర్థ్యాన్ని కూడా అధికం చేస్తుంది” (“How to Obtain Revelation and Inspiration for Your Personal Life,” Ensign or Liahona, May 2012,46).
మీ మనోభావాలను నమోదు చేయండి
యేసు క్రీస్తు నందు మీ విశ్వాసము కారణంగా బహుశా ఎవరూ మిమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలోకి లేదా సింహాల గుహలోకి పడవేస్తామని ఎప్పుడూ బెదిరించరు. కానీ మనలో ఏ ఒక్కరూ విశ్వాస పరీక్ష లేకుండా ఈ జీవితాన్ని దాటలేరు. దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో వంటివారి మాదిరి నుండి మనమందరము లాభం పొందగలము, వారు శక్తివంతమైన బబులోను సామ్రాజ్యము చేత యౌవన బందీలుగా కొనిపోబడ్డారు (2 రాజులు 24:10–16 చూడండి). ఈ యౌవనులు భిన్నమైన విలువలతోనున్న అపరిచిత సంప్రదాయము చేత చుట్టుముట్టబడ్డారు మరియు తమ నమ్మకాలు, నీతియుక్తమైన ఆచారాలను విడిచిపెట్టాలనే గొప్ప శోధనలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వారు తమ నిబంధనల పట్ల యధార్థముగా నిలిచారు. ఐగుప్తులోని యోసేపు మరియు పర్షియాలోని ఎస్తేరు వలె బబులోనులోని దానియేలు, అతని స్నేహితులు దేవునియందు తమ విశ్వాసాన్ని నిలుపుకున్నారు మరియు దేవుడు అద్భుతకార్యాలను చేసాడు, అవి నేటికీ విశ్వాసులను ప్రేరేపిస్తున్నాయి.
అంత విశ్వాసంగా నిలిచియుండగల బలాన్ని వారు ఎలా కనుగొన్నారు? దేవుడు మనందరిని చేయమని అడిగిన చిన్న మరియు సరళమైన విషయాలు—ప్రార్థించడం, ఉపవాసం చేయడం, మంచి స్నేహితులను ఎంచుకోవడం, దేవుడిని నమ్మడం, ఇతరులకు వెలుగు కావడం వంటివాటిని వారు చేసారు. ఈ చిన్న మరియు సరళమైన విషయాలను చేయడం ద్వారా మనం బలపరచబడినప్పుడు, మన జీవితాలలో సింహాలను, మండుచున్న అగ్నిగుండాలను మనం విశ్వాసంతో ఎదుర్కోగలము.
దానియేలు గ్రంథాన్ని సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “దానియేలు గ్రంథము“ చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
దానియేలు 1; 3; 6
నా విశ్వాసము పరీక్షించబడినప్పుడు నేను ప్రభువు యందు నమ్మికయుంచగలను.
ఒకవిధంగా, మనమందరము బబులోనులో నివసిస్తున్నాము. మన ప్రమాణాలతో రాజీపడేలా చేసి, యేసు క్రీస్తునందు మన విశ్వాసాన్ని ప్రశ్నించే అనేక శోధనలతో మన చుట్టూ ఉన్న ప్రపంచం నిండియుంది. మీరు దానియేలు 1, 3 మరియు 6 చదువుతున్నప్పుడు, దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు వారికి తప్పు అని తెలిసినవాటిని చేయడానికి ఏవిధంగా ఒత్తిడి చేయబడ్డారో గమనించండి. మీ నమ్మకాలతో రాజీపడేందుకు ఒత్తిడి చేయబడినట్లు మీరెప్పుడైనా భావించారా? మీరు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, ప్రభువునందు నమ్మికయుంచడానికి మీకు సహాయపడగలిగేలా ఈ వ్యక్తుల నుండి మీరేమి నేర్చుకుంటారు?
గొప్ప విశ్వాసము గొప్ప అద్భుతకార్యాలకు దారితీసిన అనుభవాలను దానియేలు గ్రంథము మరియు అనేక ఇతర లేఖనాలు నమోదు చేసాయి. కానీ, మన విశ్వాసము మనం కోరిన అద్భుతకార్యాలకు దారితీయకపోతే ఎలా? (ఉదాహరణకు, ఆల్మా 14:8–13 చూడండి). దానియేలు 3:13–18లో మీరు చదివిన దానిని బట్టి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఈ ప్రశ్నకు ఎలా జవాబిచ్చియుంటారని మీరనుకుంటున్నారు? మీరు మీ విశ్వాసపు పరీక్షలను ఎలా ఎదుర్కొంటారనే దానిని వారి మాదిరి ఎలా ప్రభావితం చేయగలదు?
ఒక వ్యక్తి యొక్క నీతియుక్తమైన ఎంపికలు ఏవిధంగా ఇతరులను ప్రభువునందు గొప్ప విశ్వాసానికి నడిపించగలవోయని కూడా దానియేలు గ్రంథము చూపుతుంది. 1, 3, మరియు6 అధ్యాయాలలో దీనికి ఏ మాదిరులను మీరు కనుగొంటారు? మీ ఎంపికలు ఇతరులపై చూపగల ప్రభావాల గురించి ధ్యానించండి (మత్తయి 5:16 చూడండి).
యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘము భూమి మీద దేవుని రాజ్యము.
నెబుకద్నెజరు యొక్క కల భవిష్యత్తులో ఇహలోకపు రాజ్యాల గురించి, అలాగే భవిష్యత్తులో “ఎన్నడూ నాశనము కలుగని” (దానియేలు 2:44) దేవుని రాజ్యము గురించి ముందుగా చెప్పడాన్ని బయల్పాటు ద్వారా దానియేలు చూసాడు. “ప్రవచించబడిన ఆ కడవరి-దిన రాజ్యమే సంఘము” అని, “మనుష్యుని చేత సృష్టించబడలేదు, కానీ పరలోక దేవుని చేత స్థాపించబడిందని మరియు ‘చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన’ ఆ రాయి ముందుకు పొర్లుతూ భూమిని నింపునని” ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ బోధించారు (“Why the Church,” Ensign or Liahona, Nov. 2015,111). దానియేలు 2:34–35, 44–45లో రాయి యొక్క వర్ణనలను మీరు చదువుతున్నప్పుడు, దేవుని యొక్క కడవరి-దిన రాజ్యము గురించి ఆలోచించండి. రాయి మరియు రాజ్యము మధ్య మీరు ఏ పోలికలను చూస్తారు? దేవుని రాజ్యము నేడు భూమిని నింపడాన్ని మీరెలా చూస్తారు?
నా శోధనలలో రక్షకుడు నాకు సహకరిస్తారు.
మండుచున్న అగ్నిగుండములో షద్రకు, మేషాకు మరియు అబేద్నెగోలతో పాటు నాల్గవ వ్యక్తి కనిపించడం గురించి మీరు చదువుతున్నప్పుడు మీకు కలిగే అంతరార్థములేవి? మీరు ఎదుర్కొనే శ్రమలలో ఈ వృత్తాంతము మీకెలా సహాయపడగలదు? మోషైయ 3:5–7; ఆల్మా 7:11–13; సిద్ధాంతము మరియు నిబంధనలు 61:36–37; 121:5–8లలో మీరు అదనపు అంతరార్థములను కనుగొనవచ్చు.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
దానియేలు 1–2.మీరు దానియేలు 1 మరియు 2 కలిపి చదువుతున్నప్పుడు, రాజు ఇచ్చిన మాంసము మరియు మద్యము తినడాన్ని నిరాకరించడం ద్వారా దానియేలు మరియు అతని స్నేహితులు పొందిన దీవెనల కొరకు మీరు చూడవచ్చు. జ్ఞానవాక్యము వంటి ఆజ్ఞలను మనం పాటించినప్పుడు ప్రభువు మనకిచ్చే వాగ్దానాలను ఆ దీవెనలతో మీరు పోల్చవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 89:18–21 చూడండి). జ్ఞానవాక్యమును పాటించడం వలన ప్రభువు మనల్ని ఎలా దీవించారు?
-
దానియేలు 3.దానియేలు 3లోని కథ గురించి నేర్చుకోవడానికి మీ కుటుంబానికి మీరెలా సహాయపడగలరు? షద్రకు, మేషాకు మరియు అబేద్నెగోల గురించి మనల్ని ప్రభావితం చేసేదేది? మన విశ్వాసాన్ని సవాలు చేసి, మనం దేవుడిని నమ్ముతున్నామని చూపవలసిన అవసరం కలిగించే విధంగా ఏ పరిస్థితులను మనం ఎదుర్కొంటాము?
-
దానియేలు 6:1–23.దానియేలు 6:1–23లోని కథ యొక్క భాగాలను అభినయించడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు (ఉదాహరణకు, 10–12 లేదా 16–23 వచనాలు). దానియేలు ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకుంటాము? అతని వలె ఎక్కువగా కావడానికి మనమేమి చేయగలము?
-
దానియేలు 6:25–27.ఈ వచనాల ప్రకారం, ప్రభువు సింహాల నుండి దానియేలును విడిపించినప్పుడు రాజగు దర్యావేషు ఎలా ప్రభావితం చేయబడ్డాడు? అదేవిధంగా రాజైన నెబుకద్నెజరు ఎలా ప్రభావితం చేయబడ్డాడనే దాని గురించి కూడా మీరు దానియేలు 2:47; 3:28–29 లో చదువవచ్చు. ఇతరులను ప్రభావితం చేయడానికి మనకు గల అవకాశాలేవి? కుటుంబ సభ్యులతో కలిపి ఇతరుల విశ్వాసము, ఇతరులను మంచి కొరకు ప్రభావితం చేసిందనే దానికి మీరు చూసిన ఉదాహరణలను చర్చించండి.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.