చేతి పుస్తకములు మరియు పిలుపులు
38. సంఘ విధానాలు మరియు మార్గదర్శకాలు


“38. సంఘ విధానాలు మరియు మార్గదర్శకాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“38. సంఘ విధానాలు మరియు మార్గదర్శకాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

38.

సంఘ విధానాలు మరియు మార్గదర్శకాలు

38.1

సంఘములో పాల్గొనడం

పరలోకమందున్న మన తండ్రి ఆయన బిడ్డలను ప్రేమిస్తారు. “దేవునికి అందరు ఒకే రీతిగా ఉన్నారు” మరియు “తన వద్దకు రమ్మని, తన మంచితనము నందు పాలుపొందమని” అందరినీ ఆయన ఆహ్వానించుచున్నారు (2 నీఫై 26:33).

38.1.1

సంఘ సమావేశాలకు హాజరు

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సంస్కార సమావేశాలు, ఇతర ఆదివారపు సమావేశాలు మరియు సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడానికి అందరూ ఆహ్వానితులే. హాజరైన వారందరూ పవిత్రమైన అమరికను గౌరవించేలా చూసుకోవాల్సిన బాధ్యత అధ్యక్షత్వము వహించు అధికారిపై ఉంటుంది.

హాజరయ్యే వారు ఆరాధనకు లేదా సమావేశానికి సంబంధించిన ఇతర ప్రయోజనాలకు విరుద్ధమైన అంతరాయాలు లేదా పరధ్యానాలను నివారించాలి. వివిధ సంఘ సమావేశాలు మరియు కార్యక్రమాల‌ యొక్క అన్ని వయస్సు మరియు ప్రవర్తనా అవసరాలు గౌరవించబడాలి. దానికి బహిరంగ శృంగార ప్రవర్తన మరియు పరధ్యానాన్ని కలిగించే దుస్తులు లేదా అలంకరణ నుండి దూరంగా ఉండటం అవసరం. ఇది రక్షకునిపై దృష్టి కేంద్రీకరించే సమావేశాల నుండి దూరం చేసే విధంగా రాజకీయ ప్రకటనలు చేయడం లేదా లైంగిక ధోరణి లేదా ఇతర వ్యక్తిగత లక్షణాల గురించి మాట్లాడడాన్ని కూడా నిరోధిస్తుంది.

అనుచితమైన ప్రవర్తన ఉన్నట్లయితే, బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు ప్రేమపూర్వకమైన ఆత్మతో వ్యక్తిగత సలహా ఇస్తారు. పరలోక తండ్రిని మరియు రక్షకుడిని ఆరాధించడానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని చెప్తూ, హాజరైన ప్రతి ఒక్కరికీ పవిత్రమైన స్థలాన్ని కాపాడడంలో సహాయం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని సందర్భానికి తగినట్లుగా ప్రవర్తించని వారిని అతను ప్రోత్సహిస్తాడు.

సంఘ సమావేశమందిరములు సంఘ విధానాలకు లోబడి వ్యక్తిగత ఆస్తిగా ఉంటాయి. ఈ మార్గదర్శకాలను అనుసరించడానికి ఇష్టపడని వ్యక్తులు సంఘ సమావేశాలు మరియు కార్యక్రమాలకు హాజరుకావద్దని గౌరవప్రదంగా అడగబడతారు.

38.2

విధులు మరియు దీవెనల కొరకు విధానాలు

విధులు మరియు దీవెనల గురించి సాధారణ సమాచారం 18వ అధ్యాయంలో అందించబడింది. దేవాలయ విధుల గురించి సమాచారం 27 మరియు 28వ అధ్యాయములలో అందించబడింది. బిషప్పులకు ఏవైనా సందేహాలుంటే స్టేకు అధ్యక్షుడిని సంప్రదించవచ్చు. స్టేకు అధ్యక్షులకు ఏవైనా సందేహాలుంటే వారు ప్రాంతీయ అధ్యక్షత్వమును సంప్రదించవచ్చు.

38.3

పౌర వివాహం

దేవాలయ వివాహానికి అర్హత పొందమని మరియు వివాహం చేసుకుని దేవాలయములో ముద్ర వేయబడమని సంఘ నాయకులు సభ్యులను ప్రోత్సహిస్తారు. స్థానిక చట్టాలు అనుమతించినట్లయితే, సంఘ నాయకులు పౌర వివాహాలు చేయవచ్చు.

పౌర వివాహాలు వివాహం జరిగే స్థలం యొక్క చట్టాల ప్రకారం నిర్వహించబడాలి.

38.3.1

పౌర వివాహాన్ని ఎవరు నిర్వహించవచ్చు

స్థానిక చట్టం ద్వారా అనుమతించబడినప్పుడు, ప్రస్తుతం పనిచేస్తున్న సంఘ అధికారులు పౌర వివాహ వేడుకను నిర్వహించడానికి వారి పిలుపులో పని చేయవచ్చు:

  • మిషను అధ్యక్షుడు

  • స్టేకు అధ్యక్షుడు

  • జిల్లా అధ్యక్షుడు

  • బిషప్పు

  • శాఖాధ్యక్షుడు

ఈ అధికారులు పురుషుడు మరియు స్త్రీ మధ్య పౌర వివాహాన్ని మాత్రమే చేయవచ్చు. క్రింది షరతులన్నీ కూడా తప్పనిసరిగా వర్తిస్తాయి:

  • వధువు లేదా వరుడు సంఘ సభ్యుడైయుండాలి లేదా బాప్తిస్మపు తేదీని కలిగియుండాలి.

  • వధువు లేదా వరుని యొక్క సభ్యత్వ రికార్డు ఉండాలి లేదా బాప్తిస్మము తర్వాత అధికారి అధ్యక్షత్వం వహించే సంఘ విభాగములో వారు ఉండియుండాలి.

  • సంఘ అధికారికి వివాహం జరిగే అధికార పరిధిలో పౌర వివాహాన్ని నిర్వహించే చట్టబద్ధమైన అధికారం ఉంది.

38.3.4

సంఘ భవనాల్లో జరిగే పౌర వివాహాలు

సాధారణ సంఘ కార్యక్రమాల షెడ్యూల్‌కు అంతరాయం కలిగించకపోతే వివాహ వేడుకను సంఘ భవనంలో నిర్వహించవచ్చు. వివాహాలను విశ్రాంతిదినము లేదా సోమవారం సాయంత్రం నిర్వహించకూడదు. సంఘ భవనాలలో జరిగే వివాహాలు సరళంగా మరియు గౌరవప్రదంగా ఉండాలి. సంగీతం పవిత్రంగా, గౌరవప్రదంగా, ఆనందంగా ఉండాలి.

వివాహాలు ప్రార్థనా మందిరంలో, సాంస్కృతిక మందిరంలో లేదా తగిన మరొక గదిలో నిర్వహించబడవచ్చు. వివాహాలు సమావేశమందిరమును సరిగ్గా ఉపయోగించడం కోసం మార్గదర్శకాలను అనుసరించాలి.

38.3.6

పౌర వివాహ వేడుక

పౌర వివాహం చేసుకోవడానికి, సంఘ అధికారి జంటను ఉద్దేశించి, “దయచేసి ఒకరినొకరు కుడిచేత్తో పట్టుకోండి” అని చెబుతాడు. తర్వాత అతను ఇలా అంటాడు, “[వరుడి పూర్తి పేరు] మరియు [వధువు పూర్తి పేరు], మీరు ఇప్పుడు దేవుని సమక్షంలో మరియు ఈ సాక్షుల సమక్షంలో చేయబోయే ప్రమాణాలకు గుర్తుగా ఒకరినొకరు కుడిచేత్తో పట్టుకున్నారు.” (జంట ఈ సాక్షులను ముందుగానే ఎంచుకోవచ్చు లేదా నియమించవచ్చు.)

తర్వాత అధికారి వరుడిని ఉద్దేశించి ఇలా అడుగుతాడు, “[వరుడి పూర్తి పేరు], మీరు [వధువు పూర్తి పేరు] ను చట్టబద్ధంగా వివాహం చేసుకున్న మీ భార్యగా స్వీకరిస్తారా, మీరు మీ స్వంత ఇష్టానుసారం ఆమె సహచరుడిగా మరియు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భర్తగా మీరు ఆమెకు మాత్రమే కట్టుబడి ఉంటారని, మరెవరికీ కాదని; మీరు వివాహం యొక్క పరిశుద్ధ స్థితికి సంబంధించిన అన్ని చట్టాలు, బాధ్యతలు మరియు నియమాలను పాటిస్తారని; మీరిద్దరూ జీవించి ఉన్నంతకాలం మీరు ఆమెను ప్రేమిస్తారని, గౌరవిస్తారని మరియు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తారా?”

వరుడు “అవును” లేదా “నేను చేస్తాను” అని సమాధానం ఇస్తాడు.

ఆ తర్వాత సంఘ అధికారి వధువును ఉద్దేశించి ఇలా అడుగుతాడు, “[వధువు పూర్తి పేరు], మీరు [వరుడి పూర్తి పేరు] ను చట్టబద్ధంగా వివాహం చేసుకున్న మీ భర్తగా స్వీకరిస్తారా, మీరు మీ స్వంత ఇష్టానుసారం అతని సహచరిగా మరియు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యగా మీరు అతనికి మాత్రమే కట్టుబడి ఉంటారని, మరెవరికీ కాదని; మీరు వివాహం యొక్క పరిశుద్ధ స్థితికి సంబంధించిన అన్ని చట్టాలు, బాధ్యతలు మరియు నియమాలను పాటిస్తారని; మీరిద్దరూ జీవించి ఉన్నంతకాలం మీరు అతన్ని ప్రేమిస్తారని, గౌరవిస్తారని మరియు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తారా?”

వధువు “అవును” లేదా “నేను చేస్తాను” అని సమాధానం ఇస్తుంది.

ఆ తర్వాత సంఘ అధికారి జంటను ఉద్దేశించి ఇలా అంటారు, “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క పెద్దగా నాకు లభించిన చట్టపరమైన అధికారం యొక్క సుగుణము చేత, [వరుడి పేరు] మరియు [వధువు పేరు], నేను మిమ్మల్ని మీ మర్త్య జీవితకాలం వరకు చట్టబద్ధంగా మరియు న్యాయబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను.”

(అధ్యక్షత్వము వహించు సంఘ అధికారిగా పని చేయని మతగురువుకు ప్రత్యామ్నాయ పదాలు: “[సైనిక లేదా పౌర సంస్థ యొక్క శాఖ]లో మతగురువుగా నాకు ఇవ్వబడిన చట్టపరమైన అధికారం యొక్క సుగుణము చేత, [వరుడి పేరు] మరియు [వధువు పేరు], నేను మిమ్మల్ని మీ మర్త్య జీవితకాలం వరకు చట్టబద్ధంగా మరియు న్యాయబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను.”)

“మీరు ఏకమై మీ సంతానంలో ఆనందం పొందాలని మరియు సంతోషంగా సుదీర్ఘకాలం కలిసుండాలని దేవుడు దీవించుగాక, మీరు చేసిన ప్రతిజ్ఞలను పవిత్రంగా ఉంచడానికి ఆయన మిమ్మల్ని దీవించుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నేను మీపై ఈ దీవెనలను అమలు చేస్తున్నాను, ఆమేన్.”

సాంస్కృతిక నిబంధనల ఆధారంగా, ఇష్టమైతే భార్యాభర్తలుగా ఒకరినొకరు ముద్దాడడానికి వారిని ఆహ్వానించవచ్చు.

38.4

ముద్రవేయు విధానాలు

దేవాలయ ముద్ర విధులు నిత్యత్వం కోసం కుటుంబాలను కలుపుతాయి, ఎందుకంటే వారు విధిని పొందినప్పుడు వారు చేసే నిబంధనలను గౌరవించటానికి సభ్యులు కృషి చేస్తారు. ముద్ర విధులలో ఇవి ఉన్నాయి:

  • భార్యాభర్తలు ముద్రవేయబడుట.

  • తల్లిదండ్రులతో పిల్లలు ముద్రవేయబడుట.

తమ నిబంధనలను పాటించేవారు ముద్ర ద్వారా అందించబడిన వ్యక్తిగత దీవెనలను కలిగి ఉంటారు. వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ లేదా వివాహం నుండి వైదొలగినప్పటికీ ఇది నిజం.

తల్లిదండ్రులతో ముద్ర వేయబడిన లేదా నిబంధనలో జన్మించిన విశ్వాసులైన పిల్లలు నిత్య తల్లిదండ్రుల దీవెన కలిగి ఉంటారు. వారి తల్లిదండ్రులు వారి వివాహ ముద్రను రద్దు చేసినా, వారి సంఘ సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్నా లేదా వారి సభ్యత్వానికి రాజీనామా చేసినా ఇది నిజం.

ముద్రవేయు విధానాల గురించి ఏవైనా సందేహాలుంటే సభ్యులు తమ బిషప్పుతో చర్చించాలి. బిషప్పుకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, స్టేకు అధ్యక్షుడిని సంప్రదిస్తారు. స్టేకు అధ్యక్షులకు ఏవైనా సందేహాలుంటే వారు తమ దేవాలయ జిల్లాలోని దేవాలయ అధ్యక్షత్వమును, ప్రాంతీయ అధ్యక్షత్వమును లేదా ప్రథమ అధ్యక్షత్వ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

38.5

దేవాలయ దుస్తులు మరియు వస్త్రాలు

38.5.1

దేవాలయ దుస్తులు

దేవాలయంలో వరము మరియు ముద్ర విధుల సమయంలో సంఘ సభ్యులు తెల్లని దుస్తులు ధరిస్తారు. స్త్రీలు క్రింది తెల్లని దుస్తులను ధరిస్తారు: పొడవాటి చేతులు లేదా మూడొంతుల చేతులు గల దుస్తులు (లేదా స్కర్ట్ మరియు పొడవాటి చేతులు లేదా మూడొంతుల చేతులు గల జాకెట్టు), సాక్సులు లేదా స్టాకింగ్‌లు మరియు బూట్లు లేదా చెప్పులు.

పురుషులు క్రింది తెల్లని దుస్తులను ధరిస్తారు: పొడవు చేతుల చొక్కా, నెక్‌టై లేదా బో టై, ప్యాంటు, సాక్సులు మరియు బూట్లు లేదా చెప్పులు.

వరము మరియు ముద్ర విధుల సమయంలో, సభ్యులు తమ తెల్లని దుస్తులపై అదనపు వేడుక దుస్తులను ధరిస్తారు.

38.5.2

దేవాలయ దుస్తులు మరియు వస్త్రాలను పొందడం

వారి స్వంత దేవాలయ దుస్తులను పొందమని వరము పొందిన సభ్యులను వార్డు మరియు స్టేకు నాయకులు ప్రోత్సహిస్తారు. దేవాలయ దుస్తులు మరియు వస్త్రాలను సంఘ పంపిణీ కొట్టు నుండి లేదా store.ChurchofJesusChrist.org వద్ద కొనుగోలు చేయవచ్చు. సభ్యులకు దుస్తులను ఆర్డరు చేయడంలో స్టేకు మరియు వార్డు గుమాస్తాలు సహాయపడవచ్చు.

38.5.5

వస్త్రాన్ని ధరించడం మరియు సంరక్షణ

వరము పొందిన సభ్యులు తమ జీవితాంతం దేవాలయ వస్త్రాన్ని ధరిస్తామని నిబంధన చేస్తారు.

దేవాలయ వస్త్రాన్ని ధరించడం ఒక పవిత్రమైన విశేషాధికారం. అలా చేయడం రక్షకుడైన యేసు క్రీస్తును అనుసరించాలనే అంతర్గత నిబద్ధతకు బాహ్య వ్యక్తీకరణ.

ఈ వస్త్రం దేవాలయంలో చేసిన నిబంధనలను గుర్తు చేస్తుంది. జీవితాంతం దానిని సరిగ్గా ధరించినప్పుడు, అది రక్షణగా ఉపయోగపడుతుంది.

వస్త్రాన్ని బయటి దుస్తుల క్రింద ధరించాలి. ఇతర లోదుస్తులు దేవాలయ వస్త్రంపైన లేదా క్రింద ధరిస్తారా అనేది వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం.

వస్త్రాన్ని ధరించి సహేతుకంగా చేయగలిగే కార్యకలాపాల కోసం వస్త్రాన్ని తీసివేయకూడదు. విభిన్న రకాల దుస్తులకు అనుగుణంగా దీనిని సవరించకూడదు.

వస్త్రం పవిత్రమైనది మరియు దానిని గౌరవంగా చూడాలి. వరము పొందిన సభ్యులు వస్త్రాన్ని ధరించడం గురించిన వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానమివ్వడానికి పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని వెదకాలి.

38.5.7

వస్త్రాలు మరియు దేవాలయ వేడుక దుస్తులను పారవేయడం

పాడైపోయిన దేవాలయ వస్త్రాలను పారవేసేందుకు, సభ్యులు గుర్తులను కత్తిరించి నాశనం చేయాలి. సభ్యులు మిగిలిన బట్టను కత్తిరించాలి, ఆవిధంగా దానిని వస్త్రంగా గుర్తించలేరు. మిగిలిన వస్త్రాన్ని పారవేయవచ్చు.

సభ్యులు వరము పొందిన ఇతర సభ్యులకు మంచి స్థితిలో ఉన్న వస్త్రాలు మరియు దేవాలయ దుస్తులను ఇవ్వవచ్చు.

38.5.8

దేవాలయ ఖననం దుస్తులు

వీలైతే, వరము పొంది మరణించిన సభ్యులను దేవాలయ దుస్తులలో ఖననం చేయాలి లేదా దహనం చేయాలి. సంస్కృతీ సంప్రదాయాలు లేదా శ్మశాన ఆచారాలు దీనిని అనుచితంగా లేదా కష్టతరం చేస్తే, దుస్తులను మడతపెట్టి శరీరం ప్రక్కన ఉంచవచ్చు.

ఒక పురుషుని శరీరానికి దేవాలయ వస్త్రాలు మరియు క్రింది తెల్లని దుస్తులు ధరింపజేయాలి: పొడవు చేతుల చొక్కా, నెక్‌టై లేదా బో టై, ప్యాంటు, సాక్సులు మరియు బూట్లు లేదా చెప్పులు. ఒక స్త్రీ శరీరానికి దేవాలయ వస్త్రాలు మరియు క్రింది తెల్లని దుస్తులు ధరింపజేయాలి: పొడవు చేతులు లేదా మూడొంతుల చేతులు గల దుస్తులు (లేదా స్కర్ట్ మరియు పొడవు చేతులు లేదా మూడొంతుల చేతులు గల జాకెట్టు), సాక్సులు లేదా స్టాకింగ్‌లు మరియు బూట్లు లేదా చెప్పులు.

వరములో సూచించిన విధంగా దేవాలయ వేడుక దుస్తులు శరీరంపై ఉంచబడతాయి. అంగీని కుడి భుజం మీద ఉంచుతారు మరియు ఎడమవైపు నడుము వద్ద తాడుతో కట్టివేస్తారు. నడుము చుట్టూ ఏప్రాన్‌ను కడతారు. నడుము చుట్టూ దట్టీని ఉంచుతారు మరియు ఎడమ తుంటి మీద ఒక కుచ్చులా కట్టివేస్తారు. పేటిక లేదా పెట్టెను మూసివేయడానికి సమయం వచ్చే వరకు సాధారణంగా పురుషుని టోపీ అతని శరీరం పక్కన ఉంచబడుతుంది. అప్పుడు టోపీ ఎడమ చెవిపై కుచ్చు వచ్చేలా ఉంచబడుతుంది. స్త్రీ యొక్క మేలిముసుగు ఆమె తల వెనుకవైపు దిండుపై కట్టిపెట్టవచ్చు. కుటుంబం నిర్ణయించిన ప్రకారం, ఖననం లేదా దహన సంస్కారానికి ముందు స్త్రీ ముఖానికి ముసుగు వేయడం ఐచ్ఛికం.

38.6

నైతిక సమస్యలపై విధానాలు

38.6.1

గర్భస్రావం

“నరహత్య చేయకూడదు, … లేదా అటువంటిదేదియు చేయకూడదు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:6) అని ప్రభువు ఆజ్ఞాపించారు. వ్యక్తిగత లేదా సామాజిక సౌలభ్యం కోసం ఎన్నుకోబడిన గర్భస్రావమును సంఘము వ్యతిరేకిస్తుంది. సభ్యులు గర్భస్రావానికి లోబడకూడదు, నిర్వహించకూడదు, ఏర్పాట్లు చేయకూడదు, చెల్లించకూడదు, సమ్మతించకూడదు లేదా దానిని ప్రోత్సహించకూడదు. సాధ్యమైన మినహాయింపులు ఇవి మాత్రమే:

  • బలవంతపు అత్యాచారం లేదా వావివరసతప్పడము వల్ల గర్భం దాల్చినప్పుడు.

  • తల్లి జీవితం లేదా ఆరోగ్యం తీవ్రమైన ప్రమాదంలో ఉందని సమర్థుడైన వైద్యుడు నిర్ధారించినప్పుడు.

  • పిండంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని , అందువల్ల శిశువు పుట్టిన తర్వాత బ్రతకలేదని సమర్థుడైన వైద్యుడు నిర్ణయించినప్పుడు.

ఈ మినహాయింపులు కూడా యాంత్రికంగా గర్భస్రావాన్ని సమర్థించవు. గర్భస్రావం‌ అనేది అత్యంత తీవ్రమైన విషయం. బాధ్యులైన వ్యక్తులు ప్రార్థన ద్వారా నిర్ధారణ పొందిన తర్వాత మాత్రమే దానిని పరిగణించాలి. ఈ ప్రక్రియలో భాగంగా సభ్యులు తమ బిషప్పుల సలహా తీసుకోవచ్చు.

38.6.2

హింస

హింస అనగా శారీరకంగా, లైంగికంగా, మానసికంగా లేదా ఆర్థికంగా హాని కలిగించే విధంగా ఇతరులను దుర్వినియోగం చేయడం లేదా నిర్లక్ష్యం చేయడం. హింసను సంఘము ఏ రూపంలోనూ సహించదు. జీవిత భాగస్వాములు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను లేదా ఎవరినైనా హింసించేవారు దేవుడు మరియు మనిషి యొక్క చట్టాలను ఉల్లంఘిస్తారు.

సభ్యులందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు నాయకులు అప్రమత్తంగా, శ్రద్ధగా ఉండాలని, పిల్లలను మరియు ఇతరులను హింస నుండి రక్షించడానికి వారు చేయగలిగినదంతా చేయాలని ప్రోత్సహించబడ్డారు. హింస జరిగినట్లు సభ్యులకు తెలిస్తే, వారు దానిని పౌర అధికారులకు నివేదించి, బిషప్పుతో చర్చిస్తారు. సంఘ నాయకులు హింస యొక్క నివేదికలను తీవ్రంగా పరిగణించాలి మరియు వాటిని ఎప్పుడూ విస్మరించకూడదు.

పిల్లలు లేదా యువతతో పని చేసే పెద్దలందరూ వారు ఆమోదించబడిన ఒక నెలలోపు పిల్లలు మరియు యువత రక్షణ శిక్షణను పూర్తి చేయాలి (ProtectingChildren.ChurchofJesusChrist.org చూడండి). వారు ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి శిక్షణను పునరావృతం చేయాలి.

హింస జరిగినప్పుడు, హింసించబడిన వారికి సహాయం చేయడం మరియు భవిష్యత్తులో జరుగబోయే హింస నుండి దుర్బలులను రక్షించడం సంఘ నాయకుల యొక్క మొదటి మరియు తక్షణ బాధ్యత. హింసాత్మకమైన లేదా సురక్షితం కాని ఇంట్లో లేదా పరిస్థితిలో ఉండమని నాయకులు ఒక వ్యక్తిని ప్రోత్సహించకూడదు.

38.6.2.1

హింస సహాయక కేంద్రం

కొన్ని దేశాల్లో, స్టేకు అధ్యక్షులు మరియు బిషప్పులకు సహాయం చేయడానికి సంఘము గోప్యత గల హింస సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒక వ్యక్తి హింసించబడిన లేదా హింసకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రతీ పరిస్థితి గురించి ఈ నాయకులు తక్షణమే సహాయక కేంద్రాన్ని సంప్రదించాలి. ఒక సభ్యుడు పిల్లల అశ్లీల చిత్రాలను వీక్షించడం, కొనుగోలు చేయడం లేదా పంపిణీ చేయడం గురించి వారికి తెలిసినప్పుడు కూడా వారు దానిని సంప్రదించాలి.

సహాయక కేంద్రం లేని దేశాల్లో, హింస గురించి తెలుసుకున్న బిషప్పు తన స్టేకు అధ్యక్షుడిని సంప్రదించాలి. స్టేకు అధ్యక్షుడు ప్రాంతీయ కార్యాలయంలోని ప్రాంతీయ న్యాయ సలహాదారుని నుండి మార్గదర్శకత్వం పొందాలి.

38.6.2.2

హింసకు సంబంధించిన కేసులలో హితబోధ

హింసకు గురైన బాధితులు తరచుగా తీవ్రమైన భయాందోళనను అనుభవిస్తారు. స్టేకు అధ్యక్షులు మరియు బిషప్పు‌లు హృదయపూర్వకమైన కరుణ మరియు సానుభూతితో ప్రతిస్పందిస్తారు. హింస యొక్క విధ్వంసకర ప్రభావాలను అధిగమించడానికి బాధితులకు సహాయం చేయడానికి వారు ఆధ్యాత్మిక సలహాలు మరియు మద్దతును అందిస్తారు.

కొన్నిసార్లు బాధితులు సిగ్గు లేదా అపరాధ భావాలను కలిగి ఉంటారు. బాధితులు అపరాధులు కారు. నాయకులు దేవుని ప్రేమను, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా వచ్చే స్వస్థతను అర్థం చేసుకోవడానికి వారికి మరియు వారి కుటుంబాలకు సహాయం చేస్తారు (ఆల్మా 15:8; 3 నీఫై 17:9 చూడండి).

హింసకు పాల్పడిన వారు పశ్చాత్తాపం చెందడానికి మరియు వారి హింసాత్మక ప్రవర్తనను మానడానికి స్టేకు అధ్యక్షులు మరియు బిషప్పులు సహాయం చేయాలి. ఒక వయోజనుడు ఒక బిడ్డపై లైంగిక పాపానికి పాల్పడినట్లయితే, ఆ ప్రవర్తనను మార్చుకోవడం చాలా కష్టం కావచ్చు. పశ్చాత్తాప ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉండవచ్చు. 38.6.2.3 చూడండి.

సంఘ నాయకుల ప్రేరేపిత సహాయాన్ని పొందడంతో పాటు, బాధితులకు, నేరస్థులకు మరియు వారి కుటుంబాలకు నిపుణుల సలహా అవసరం కావచ్చు. మరింత సమాచారం కోసం, 31.3.6 చూడండి.

38.6.2.3

పిల్లలు లేదా యువతను హింసించడం

ముఖ్యంగా పిల్లలు లేదా యువతను హింసించడం తీవ్రమైన పాపం (లూకా 17:2 చూడండి). ఇక్కడ ఉపయోగించినట్లుగా, పిల్లలు లేదా యువతను హింసించడం క్రింది వాటిని కలిగి ఉంటుంది:

  • శారీరక హింస: శారీరక హింస ద్వారా తీవ్రమైన శారీరక హాని కలిగించడం. కొన్ని గాయాలు కనిపించకపోవచ్చు.

  • లైంగిక హింస లేదా దోపిడీ: పిల్లలతో లేదా యువతతో ఏదైనా లైంగిక చర్యను కలిగి ఉండడం లేదా ఇతరులు అలాంటి చర్యను కలిగి ఉండడానికి ఉద్దేశపూర్వకంగా అనుమతించడం లేదా సహాయం చేయడం. ఇక్కడ ఉపయోగించినట్లుగా, వయస్సులో ఎక్కువ తేడాలేని, యుక్తవయస్సుకు రాని ఇద్దరి మధ్య ఏకాభిప్రాయ లైంగిక చర్య లైంగిక వేధింపు క్రిందికి రాదు.

  • మానసిక హింస: పిల్లలు లేదా యువత యొక్క ఆత్మగౌరవం లేదా స్వాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీసే చర్యలు మరియు పదాలను ఉపయోగించడం. ఇది సాధారణంగా పదేపదే మరియు నిరంతరం అవమానించడాన్ని, తారుమారు చేయడాన్ని, అవమానకరమైన మరియు చిన్నబుచ్చే విమర్శలను కలిగి ఉంటుంది. ఇందులో స్థూలమైన నిర్లక్ష్యం కూడా ఉండవచ్చు.

  • పిల్లల అశ్లీల సాహిత్యం: 38.6.6 చూడండి.

బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు పిల్లలు లేదా యువతను హింసించడం గురించి తెలుసుకున్నట్లయితే లేదా అనుమానించినట్లయితే, అతను వెంటనే 38.6.2.1 లోని సూచనలను అనుసరిస్తాడు. తదుపరి హింస నుండి రక్షించడంలో సహాయపడటానికి కూడా అతను చర్య తీసుకుంటాడు.

ఈ విభాగంలో వివరించిన విధంగా ఒక వయోజనుడు ఒక బిడ్డను లేదా యువతను హింసించినట్లయితే, సంఘ సభ్యత్వ సభ మరియు రికార్డుపై విమర్శ వ్రాయబడడం అవసరం. 38.6.2.5 కూడా చూడండి.

యుక్త వయస్సుకురాని పిల్లవాడు ఒక బిడ్డను హింసించినట్లయితే, నడిపింపు కోసం స్టేకు అధ్యక్షుడు ప్రథమ అధ్యక్షత్వ కార్యాలయమును సంప్రదిస్తారు.

38.6.2.4

జీవిత భాగస్వామిని లేదా మరొక వయోజనుని హింసించడం

హింసకు అన్ని సందర్భాల్లోనూ వర్తించగలిగేలా ఒకే నిర్వచనం ఉండదు. బదులుగా, హింసాత్మక ప్రవర్తనలో విస్తృతమైన తీవ్రత ఉంది. ఈ విస్తృతి అప్పుడప్పుడు పదునైన పదాలను ఉపయోగించడం నుండి తీవ్రమైన హాని కలిగించడం వరకు ఉంటుంది.

జీవిత భాగస్వామిని లేదా మరొక వయోజనుని హింసించడం గురించి ఒక బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు తెలుసుకున్నట్లయితే, అతను వెంటనే 38.6.2.1 లోని సూచనలను అనుసరిస్తాడు. తదుపరి హింస నుండి రక్షించడంలో సహాయపడటానికి కూడా అతను చర్య తీసుకుంటాడు.

హింసను పరిష్కరించడానికి వ్యక్తిగత సలహా లేదా సభ్యత్వ సభ ఏది అత్యంత సముచితమైన అమరిక అని నిర్ణయించడానికి నాయకులు ఆత్మ యొక్క నడిపింపును కోరుకుంటారు. వారు తమ ప్రత్యక్ష యాజకత్వ నాయకునితో కూడా అమరిక గురించి చర్చించవచ్చు. అయితే, జీవిత భాగస్వామిపై లేదా మరొక వయోజనునిపై క్రింద వివరించిన స్థాయిలకు పెరిగే ఏ రకమైన హింస కొరకైనా సభ్యత్వ సభని నిర్వహించడం అవసరం.

  • శారీరక హింస: శారీరక హింస ద్వారా తీవ్రమైన శారీరక హాని కలిగించడం. కొన్ని గాయాలు కనిపించకపోవచ్చు.

  • లైంగిక హింస: 38.6.18.3 లో పేర్కొన్న పరిస్థితులను చూడండి.

  • మానసిక హింస: ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం లేదా స్వాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీసే చర్యలు మరియు పదాలను ఉపయోగించడం. ఇది సాధారణంగా పదేపదే మరియు నిరంతరం అవమానించడాన్ని, తారుమారు చేయడాన్ని, అవమానకరమైన మరియు చిన్నబుచ్చే విమర్శలను కలిగి ఉంటుంది.

  • ఆర్థికపరమైన హింస: ఆర్థికంగా ఒకరి నుండి ప్రయోజనాన్ని పొందడం. ఒక వ్యక్తి యొక్క ఆస్తి, డబ్బు లేదా ఇతర విలువైన వస్తువులను చట్టవిరుద్ధంగా లేదా అనధికారికంగా ఉపయోగించడం ఇందులో ఉండవచ్చు. మోసపూరితంగా ఒకరిపై ఆర్థిక అధికారాన్ని పొందడం కూడా ఇందులో ఉండవచ్చు. ఇది బలవంత ప్రవర్తనకు ఆర్థిక శక్తిని ఉపయోగించడాన్ని కలిగి ఉండవచ్చు.

38.6.2.5

సంఘ పిలుపులు, దేవాలయ సిఫారసులు మరియు సభ్యత్వ రికార్డుపై విమర్శలు

ఇతరులను హింసించిన సభ్యులకు సంఘ పిలుపు‌లు ఇవ్వకూడదు మరియు వారు పశ్చాత్తాపపడి, సంఘ సభ్యత్వ పరిమితులు తొలగించబడే వరకు దేవాలయ సిఫారసును కలిగియుండకూడదు.

ఒక వ్యక్తి పిల్లలను లేదా యువతను లైంగికంగా హింసిస్తే లేదా శారీరకంగా లేదా మానసికంగా పిల్లలను లేదా యువతను తీవ్రంగా వేధిస్తే, అతని లేదా ఆమె సభ్యత్వ రికార్డుపై విమర్శ వ్రాయబడుతుంది. అతనికి లేదా ఆమెకు పిల్లలు లేదా యువతకు సంబంధించిన ఎటువంటి పిలుపు లేదా నియామకము ఇవ్వకూడదు. ఇంట్లో యౌవనులు లేదా పిల్లలు ఉన్న కుటుంబానికి పరిచర్య నియామకం ఇవ్వకపోవడం కూడా ఇందులో ఉంది. పరిచర్య సహవాసిగా యువత లేకపోవడం కూడా ఇందులో ఉంది. ప్రథమ అధ్యక్షత్వము విమర్శను తొలగించడానికి అధికారం ఇచ్చేవరకు ఈ పరిమితులు అమలులో ఉండాలి.

38.6.2.6

స్టేకు మరియు వార్డు సలహాసభలు

స్టేకు మరియు వార్డు సలహాసభ సమావేశాలలో, స్టేకు అధ్యక్షత్వములు మరియు బిషప్రిక్కులు హింసను నిరోధించడం మరియు ప్రతిస్పందించడంపై సంఘ విధానాలు మరియు మార్గదర్శకాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. నాయకులు మరియు సలహాసభ సభ్యులు ఈ సున్నితమైన విషయాన్ని బోధించేటప్పుడు మరియు చర్చించేటప్పుడు ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని వెదకుతారు.

సలహాసభ సభ్యులు కూడా పిల్లలు మరియు యువత రక్షణ శిక్షణను పూర్తి చేయాలి (38.6.2 చూడండి).

38.6.2.7

హింసకు సంబంధించిన చట్టపరమైన సమస్యలు

సభ్యుని హింసాత్మక కార్యకలాపాలు దానికి వర్తించే చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే, బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు ఈ కార్యకలాపాలను చట్టాన్ని అమలు చేసే సిబ్బందికి లేదా తగిన ఇతర ప్రభుత్వ అధికారులకు నివేదించమని సభ్యుడిని కోరాలి.

సంఘ నాయకులు మరియు సభ్యులు హింస గురించి పౌర అధికారులకు నివేదించడానికి అన్ని చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చాలి.

38.6.4

జనన నియంత్రణ

దేవుని ఆత్మ పిల్లల కోసం మర్త్య శరీరాలను అందించడం పిల్లలను కనగలిగే వివాహిత జంటల యొక్క విశేషాధికారము, అప్పుడు వారి పిల్లల పోషణకు మరియు పెంపకానికి వారు బాధ్యత వహిస్తారు (2.1.3 చూడండి). ఎంతమంది పిల్లలను కలిగి ఉండాలి మరియు వారిని ఎప్పుడు కలిగి ఉండాలి అనే నిర్ణయం చాలా స్వకీయమైనది మరియు వ్యక్తిగతమైనది. అది దంపతులకు ప్రభువుకు మధ్య వదిలిపెట్టబడాలి.

38.6.5

పవిత్రత మరియు విశ్వసనీయత

ప్రభువు యొక్క పవిత్రత చట్టము అనగా:

  • స్త్రీ పురుషుల మధ్య చట్టబద్ధమైన వివాహానికి వెలుపల లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం.

  • వివాహంలో విశ్వసనీయత.

భార్యాభర్తల మధ్య శారీరక సాన్నిహిత్యం అందంగా మరియు పవిత్రంగా ఉండాలని ఉద్దేశించబడింది. ఇది పిల్లల సృష్టి కోసం మరియు భార్యాభర్తల మధ్య ప్రేమను వ్యక్తపరచడం కోసం దేవునిచే నియమించబడింది.

38.6.6

పిల్లల అశ్లీల సాహిత్యం

పిల్లల అశ్లీల సాహిత్యాన్ని ఏ రూపంలోనైనా సంఘము ఖండిస్తుంది. ఒక సభ్యుడు పిల్లల అశ్లీల సాహిత్యంతో సంబంధం కలిగి ఉన్నాడని బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు తెలుసుకుంటే, అతను 38.6.2.1 లోని సూచనలను వెంటనే అనుసరిస్తాడు.

38.6.8

స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనం

స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనాన్ని సంఘము ఖండిస్తుంది.

38.6.10

వావివరసలేని సంబంధం

సంఘము ఏ విధమైన వావివరసలేని సంబంధాన్నైనా ఖండిస్తుంది. ఇక్కడ ఉపయోగించినట్లుగా, వావివరసలేని సంబంధం అనగా వీరి మధ్య లైంగిక సంబంధాలు:

  • ఒక తండ్రి లేదా తల్లి మరియు ఒక బిడ్డ.

  • ఒక తాత లేదా మామ్మ మరియు మనవరాలు లేదా మనవడు.

  • తోబుట్టువులు.

  • మామ లేదా అత్త మరియు మేనకోడలు లేదా మేనల్లుడు.

ఇక్కడ ఉపయోగించినట్లుగా, బిడ్డ, మనవడు, తోబుట్టువులు, మేనకోడలు మరియు మేనల్లుడు అనేవి జన్యు సంబంధమైన, దత్తత తీసుకున్న, సవతి లేదా పెంపుడు సంబంధాలను కలిపి ఉంటాయి.

యుక్త వయస్సుకు రాని ఒక వ్యక్తి వావివరసలేని సంబంధ బాధితుడైనప్పుడు, బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు సంఘము యొక్క హింస సహాయక కేంద్రాన్ని అది అందుబాటులో ఉన్న దేశాలలో సంప్రదిస్తారు (38.6.2.1 చూడండి). ఇతర దేశాలలో, స్టేకు అధ్యక్షుడు ప్రాంతీయ కార్యాలయంలోని ప్రాంతీయ న్యాయ సలహాదారుని నుండి మార్గదర్శకత్వం పొందాలి. అతను కుటుంబ సేవల సిబ్బందితో లేదా ప్రాంతీయ కార్యాలయంలో సంక్షేమం మరియు స్వావలంబన నిర్వాహకునితో చర్చించమని కూడా ప్రోత్సహించబడతాడు.

సభ్యుడు వావివరసలేని సంబంధం పెట్టుకుంటే సంఘ సభ్యత్వ సభ మరియు రికార్డులో విమర్శ వ్రాయడం అవసరం. వావివరసలేని సంబంధం ఉన్నప్పుడు దాదాపు ఎల్లప్పుడూ సంఘము ఒక వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని ఉపసంహరించుకోవాలి.

యుక్త వయస్సుకు రాని ఒక వ్యక్తి వావివరసలేని సంబంధం పెట్టుకుంటే, నడిపింపు కోసం స్టేకు అధ్యక్షుడు ప్రథమ అధ్యక్షత్వ కార్యాలయాన్ని సంప్రదిస్తారు.

వావివరసలేని సంబంధ బాధితులు తరచుగా తీవ్రమైన భయాందోళను అనుభవిస్తారు. నాయకులు హృదయపూర్వక కరుణ మరియు సానుభూతితో స్పందిస్తారు. వారు వావివరసలేని సంబంధం యొక్క విధ్వంసకర ప్రభావాలను అధిగమించడానికి వారికి ఆధ్యాత్మిక మద్దతు మరియు సలహాను అందిస్తారు.

కొన్నిసార్లు బాధితులు సిగ్గు లేదా అపరాధ భావాలను కలిగి ఉంటారు. బాధితులు అపరాధులు కారు. నాయకులు దేవుని ప్రేమను, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా వచ్చే స్వస్థతను అర్థం చేసుకోవడానికి వారికి మరియు వారి కుటుంబాలకు సహాయం చేస్తారు (ఆల్మా 15:8; 3 నీఫై 17:9 చూడండి).

సంఘ నాయకుల యొక్క ప్రేరేపిత సహాయాన్ని పొందడానికి అదనంగా, బాధితులు మరియు వారి కుటుంబాలకు నిపుణుల సలహా అవసరం కావచ్చు. సమాచారం కోసం, 38.6.18.2 చూడండి.

38.6.12

క్షుద్ర విద్య

క్షుద్ర విద్యలు చీకటి కార్యాలపై దృష్టి సారిస్తాయి మరియు మోసానికి దారితీస్తాయి. ఇది క్రీస్తుపై విశ్వాసాన్ని నాశనం చేస్తుంది.

క్షుద్ర విద్యలో సాతాను ఆరాధన ఉంటుంది. ఇది యేసు క్రీస్తు సువార్తకు అనుగుణంగా లేని రహస్య కార్యకలాపాలను కూడా కలిగి ఉంటుంది. అటువంటి కార్యకలాపాలలో అదృష్టాన్ని చెప్పడం, శాపాలు మరియు దేవుని యాజకత్వ శక్తిని అనుకరించే వైద్య విధానాలు (కానీ వీటికే పరిమితం కాదు) ఉన్నాయి (మొరోనై 7:11–17 చూడండి).

సంఘ సభ్యులు ఏ విధమైన సాతాను ఆరాధనలో పాల్గొనకూడదు లేదా క్షుద్ర విద్యలో ఏ విధంగానూ పాల్గొనకూడదు. వారు సంభాషణలలో లేదా సంఘ సమావేశాలలో అటువంటి చీకటి కార్యాలపై దృష్టి పెట్టకూడదు.

38.6.13

అశ్లీలత

అశ్లీలత ఏ రూపంలో ఉన్నా సంఘము ఖండిస్తుంది. ఏ రకమైన అశ్లీల సాహిత్యమైనా వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను మరియు సమాజాన్ని దెబ్బతీస్తుంది. ఇది ప్రభువు యొక్క ఆత్మను కూడా దూరం చేస్తుంది. సంఘ సభ్యులు అన్ని రకాల అశ్లీల సాహిత్యాలకు దూరంగా ఉండాలి మరియు దాని ఉత్పత్తి, వ్యాప్తి మరియు వినియోగాన్ని వ్యతిరేకించాలి.

అశ్లీల చిత్రాలను ఉపయోగించినందుకు పశ్చాత్తాపం చెందడానికి ఒక వ్యక్తికి సహాయపడేటప్పుడు సాధారణంగా వ్యక్తిగత సలహా మరియు అనధికారిక సభ్యత్వ పరిమితులు సరిపోతాయి. సాధారణంగా సభ్యత్వ సభలు నిర్వహించబడవు. ఏది ఏమైనప్పటికీ, సభ్యుని వివాహానికి లేదా కుటుంబానికి గణనీయమైన హాని కలిగించిన అశ్లీలత యొక్క తీవ్రమైన మరియు నిర్బంధ ఉపయోగం కోసం ఒక సలహాసభ అవసరం కావచ్చు (38.6.5 చూడండి). ఒక సభ్యుడు పిల్లల అశ్లీల చిత్రాలను తయారు చేసినా, పంచినా, కలిగియున్నా లేదా పదే పదే వీక్షించినా ఒక సలహాసభ అవసరం (38.6.6 చూడండి).

38.6.14

పక్షపాతము

జనులందరూ దేవుని బిడ్డలే. అందరూ ఆయన దైవిక కుటుంబంలో భాగమైన సహోదరులు మరియు సహోదరీలు (“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” చూడండి). దేవుడు “ఒక రక్తముతో సమస్త జనులను సృష్టించెను” (అపొస్తలుల కార్యములు 17:26). ఆయనకు “అందరూ ఒకేరీతిగా ఉన్నారు” (2 నీఫై 26:33). ప్రతీ వ్యక్తి “ఆయన దృష్టిలో విలువైనవాడు” (జేకబ్ 2:21).

పక్షపాతం దేవుని యొక్క బయలుపరచబడిన వాక్యానికి అనుగుణంగా లేదు. దేవుని పట్ల అభిమానం లేదా ప్రతికూలత అనేది ఆయన పట్ల మరియు ఆయన ఆజ్ఞలపట్ల భక్తిపై ఆధారపడి ఉంటుంది, కానీ ఒక వ్యక్తి చర్మం యొక్క రంగు లేదా ఇతర లక్షణాలపై కాదు.

ఏదైనా సమూహం లేదా వ్యక్తి పట్ల పక్షపాత వైఖరిని మరియు చర్యలను విడిచిపెట్టమని సంఘము జనులందరికీ పిలుపునిస్తుంది. సంఘ సభ్యులు దేవుని పిల్లలందరి పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో ముందుండాలి. సభ్యులు ఇతరులను ప్రేమించాలనే రక్షకుని ఆజ్ఞను అనుసరిస్తారు (మత్తయి 22:35–39 చూడండి). వారు ఎలాంటి పక్షపాతాన్నైనా తిరస్కరిస్తూ, అందరి పట్ల సద్భావన గల వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇందులో జాతి, కులం, జాతీయత, తెగ, లింగం, వయస్సు, వైకల్యం, సామాజిక ఆర్థిక స్థితి, మత విశ్వాసం లేదా అవిశ్వాసం మరియు లైంగిక ధోరణి ఆధారంగా పక్షపాతం ఉంటుంది.

38.6.15

స్వలింగ ఆకర్షణ మరియు స్వలింగ ప్రవర్తన

ఒకే లింగానికి చెందిన ఇతరుల పట్ల ఆకర్షితులైన వ్యక్తుల పట్ల సున్నితంగా, ప్రేమ మరియు గౌరవంతో ఉండాలని కుటుంబాలు మరియు సభ్యులను సంఘము ప్రోత్సహిస్తుంది. సంఘము సమాజంలో అవగాహనను పెంపొందిస్తుంది, ఇది దయ, కలుపుగోలుతనం, ఇతరుల పట్ల ప్రేమ మరియు మానవులందరి పట్ల గౌరవం గురించి దాని బోధనలను ప్రతిబింబిస్తుంది. స్వలింగ ఆకర్షణకు గల కారణాలపై సంఘము ఎటువంటి స్థానము తీసుకోదు.

దేవుని ఆజ్ఞలు భిన్న లింగ లేదా స్వలింగ సంపర్కుల అనుచిత ప్రవర్తనను నిషేధిస్తాయి. పవిత్రత యొక్క చట్టాన్ని ఉల్లంఘించిన సభ్యులకు సంఘ నాయకులు సలహా ఇస్తారు. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంపై విశ్వాసం, పశ్చాత్తాప ప్రక్రియ మరియు భూమిపై జీవితం యొక్క ఉద్దేశ్యం గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండడానికి నాయకులు వారికి సహాయం చేస్తారు.

సభ్యులు స్వలింగ ఆకర్షణను అనుభవిస్తే మరియు పవిత్రత యొక్క చట్టాన్ని జీవించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, నాయకులు వారి సంకల్పంలో వారికి మద్దతునిస్తారు మరియు ప్రోత్సహిస్తారు. ఈ సభ్యులు సంఘ పిలుపులను పొందవచ్చు, దేవాలయ సిఫారసులను కలిగి ఉండవచ్చు మరియు వారు యోగ్యులైనట్లయితే దేవాలయ విధులను పొందవచ్చు. సంఘములోని పురుష సభ్యులు యాజకత్వాన్ని పొందవచ్చు మరియు సాధన చేయవచ్చు.

ఈ జీవితంలో నిత్య వివాహం మరియు మాతాపితృత్వం యొక్క దీవెనలను పొందేందుకు వారి పరిస్థితులు అనుమతించినా లేకపోయినా వారి నిబంధనలను పాటించే సభ్యులందరూ వాగ్దానం చేయబడిన అన్ని దీవెనలను నిత్యత్వంలో పొందుతారు (మోషైయ 2:41 చూడండి).

38.6.16

స్వలింగ వివాహము

లేఖనాలపై ఆధారపడి, సిద్ధాంతపరమైన సూత్రంగా, ఆయన పిల్లల నిత్య గమ్యం కోసం సృష్టికర్త యొక్క ప్రణాళికకు స్త్రీ పురుషుల మధ్య వివాహం చాలా ఆవశ్యకమైనదని సంఘము ధృవీకరిస్తుంది. దేవుని యొక్క చట్టం వివాహాన్ని స్త్రీ పురుషుల మధ్య చట్టపరమైన మరియు న్యాయబద్ధమైన ఐక్యతగా నిర్వచించిందని కూడా సంఘము ధృవీకరిస్తుంది.

38.6.17

లైంగిక విద్య

పిల్లల లైంగిక విద్య కొరకు ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఆరోగ్యకరమైన, ధర్మబద్ధమైన లైంగికత గురించి నిజాయితీగల, స్పష్టమైన మరియు నిరంతర సంభాషణలను కలిగి ఉండాలి.

38.6.18

లైంగిక హింస, అత్యాచారం మరియు ఇతర రకాల లైంగిక దాడులు

సంఘము లైంగిక హింసను ఖండిస్తుంది. ఇక్కడ ఉపయోగించినట్లుగా, లైంగిక హింస అనేది మరొక వ్యక్తిపై ఏదైనా అవాంఛిత లైంగిక చర్యను విధించడం అని నిర్వచించబడింది. చట్టపరమైన సమ్మతి ఇవ్వని లేదా ఇవ్వలేని వ్యక్తితో లైంగిక చర్య లైంగిక హింసగా పరిగణించబడుతుంది. లైంగిక హింస జీవిత భాగస్వామితో లేదా డేటింగ్‌లో కూడా సంభవించవచ్చు. పిల్లలు లేదా యువతపై లైంగిక హింస గురించిన సమాచారం కోసం, 38.6.2.3 చూడండి.

లైంగిక హింస అనేది వేధింపుల నుండి అత్యాచారం మరియు ఇతర రకాల లైంగిక దాడుల వరకు అనేక రకాల చర్యలను కలిగి ఉంటుంది. ఇది శారీకంగా, నోటిమాటగా మరియు ఇతర మార్గాల్లో సంభవించవచ్చు. లైంగిక హింస, అత్యాచారం లేదా ఇతర రకాల లైంగిక దాడులను అనుభవించిన సభ్యులకు ఉపదేశము గురించి మార్గదర్శకత్వం కోసం, 38.6.18.2 చూడండి.

సభ్యులు లైంగిక హింస గురించి అనుమానించినట్లయితే లేదా తెలుసుకుంటే, వారు వీలైనంత త్వరగా బాధితులను మరియు ఇతరులను రక్షించడానికి చర్య తీసుకుంటారు. పౌర అధికారులకు నివేదించడం మరియు బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడిని అప్రమత్తం చేయడం ఇందులో ఉన్నాయి. ఒక బిడ్డ హింసకు గురైనట్లయితే, సభ్యులు 38.6.2 లోని సూచనలను అనుసరించాలి.

38.6.18.2

లైంగిక హింస, అత్యాచారం లేదా ఇతర రకాల లైంగిక దాడుల బాధితుల కొరకు ఉపదేశము

లైంగిక హింస, అత్యాచారం లేదా ఇతర రకాల లైంగిక దాడుల బాధితులు తరచు తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. వారు బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడిపై విశ్వాసం ఉంచినప్పుడు, అతను హృదయపూర్వక కరుణ మరియు సానుభూతితో ప్రతిస్పందిస్తాడు. హింస యొక్క విధ్వంసకర ప్రభావాలను అధిగమించడానికి బాధితులకు సహాయం చేయడానికి అతను ఆధ్యాత్మిక సలహా మరియు మద్దతును అందిస్తాడు. అందుబాటులో ఉన్న చోట మార్గదర్శకత్వం కోసం అతను సంఘము యొక్క హింస సహాయక కేంద్రాన్ని సంప్రదిస్తాడు.

కొన్నిసార్లు బాధితులు సిగ్గు లేదా అపరాధ భావాలను కలిగి ఉంటారు. బాధితులు అపరాధులు కారు. నాయకులు బాధితులను నిందించరు. దేవుని ప్రేమను, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా వచ్చే స్వస్థతను అర్థం చేసుకోవడానికి వారు బాధితులకు మరియు వారి కుటుంబాలకు సహాయం చేస్తారు (ఆల్మా 15:8; 3 నీఫై 17:9 చూడండి).

సభ్యులు హింస లేదా దాడి గురించి సమాచారాన్ని పంచుకోవడానికి ఎంచుకున్నప్పటికీ, నాయకులు వివరాలపై ఎక్కువగా దృష్టి పెట్టకూడదు. ఇది బాధితులకు హానికరం కాగలదు.

సంఘ నాయకుల యొక్క ప్రేరేపిత సహాయాన్ని పొందడానికి అదనంగా, బాధితులు మరియు వారి కుటుంబాలకు నిపుణుల సలహా అవసరం కావచ్చు. మరింత సమాచారం కోసం, 31.3.6 చూడండి.

38.6.18.3

సభ్యత్వ సభలు

ఎవరినైనా లైంగికంగా వేధించిన లేదా హింసించిన వ్యక్తికి సభ్యత్వ సభ అవసరం కావచ్చు. ఒక సభ్యుడు అత్యాచారానికి పాల్పడితే లేదా మరొక రకమైన లైంగిక దాడికి పాల్పడితే సభ్యత్వ సభ అవసరం.

38.6.20

ఆత్మహత్య

మర్త్య జీవితం దేవుని నుండి ఒక అమూల్యమైన బహుమతి—అది విలువైన మరియు రక్షించబడవలసిన బహుమతి. ఆత్మహత్యల నివారణకు సంఘము గట్టిగా మద్దతు ఇస్తుంది.

ఆత్మహత్య గురించి ఆలోచించిన చాలామంది వ్యక్తులు శారీరక, మానసిక, భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక బాధల నుండి ఉపశమనం పొందాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తులకు కుటుంబం, సంఘ నాయకులు మరియు అర్హత కలిగిన నిపుణుల నుండి ప్రేమ, సహాయం మరియు మద్దతు అవసరం.

ఒక సభ్యుడు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే లేదా దానికి ప్రయత్నించినట్లయితే, బిషప్పు మతపరమైన మద్దతును అందిస్తాడు. అతను వెంటనే నిపుణుల సహాయాన్ని పొందడంలో సభ్యునికి సహాయం చేస్తాడు.

ప్రియమైనవారు, నాయకులు మరియు నిపుణులు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆత్మహత్య ఎల్లప్పుడూ నిరోధించబడదు. ఇది లోతైన హృదయ విదారకాన్ని, భావోద్వేగ కల్లోలాన్ని మరియు ప్రియమైన వారికి మరియు ఇతరులకు సమాధానం లేని ప్రశ్నలను వదిలివేస్తుంది. నాయకులు ఉపదేశము చేసి కుటుంబాన్ని ఓదార్చాలి. వారు పోషణ మరియు మద్దతును అందిస్తారు.

ఒక వ్యక్తి తన ప్రాణాలను తీసుకోవడం సరికాదు. అయితే, దేవుడు మాత్రమే వ్యక్తి యొక్క ఆలోచనలు, చర్యలు మరియు జవాబుదారీతనపు స్థాయిని నిర్ధారించగలరు (1 సమూయేలు 16:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 137:9 చూడండి).

ఆత్మహత్య వలన ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారు యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంలో నిరీక్షణను మరియు స్వస్థతను కనుగొనవచ్చు.

38.6.23

ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు

ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటారు. తమను ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించే సభ్యులు మరియు సభ్యులు కానివారు—వారి కుటుంబం మరియు స్నేహితులు—సున్నితత్వం, దయ, కరుణ మరియు సమృద్ధిగా క్రీస్తు వంటి ప్రేమతో ఆదరించబడాలి. సంస్కార సమావేశాలు, ఇతర ఆదివారపు సమావేశాలు మరియు సంఘము యొక్క సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడానికి అందరూ ఆహ్వానితులే (38.1.1 చూడండి).

లింగం అనేది పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళికలో ఆవశ్యకమైన లక్షణం. కుటుంబ ప్రకటనలో లింగం యొక్క ఉద్దేశించబడిన అర్థం పుట్టినప్పుడు జన్యుసంబంధమైన లింగం. కొంతమంది వ్యక్తులు వారి జన్యుసంబంధమైన లింగం మరియు వారి లింగ గుర్తింపు మధ్య అసమాన భావాలను అనుభవిస్తారు. ఫలితంగా, వారు ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులుగా గుర్తించడానికి గల కారణాలపై సంఘము ఎటువంటి వైఖరిని తీసుకోదు.

చాలావరకు సంఘములో పాల్గొనడం మరియు కొన్ని యాజకత్వ విధులు లింగ తటస్థంగా ఉంటాయి. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు 38.2.8.10 లో వివరించిన విధంగా బాప్తిస్మము పొందవచ్చు మరియు నిర్ధారించబడవచ్చు. వారు సంస్కారములో కూడా పాల్గొనవచ్చు మరియు యాజకత్వ దీవెనలు పొందవచ్చు. అయితే, యాజకత్వ నియామకము మరియు దేవాలయ విధులు పుట్టినప్పుడు జన్యుసంబంధమైన లింగం ప్రకారం పొందబడతాయి.

పుట్టినప్పుడు వ్యక్తి యొక్క జన్యుసంబంధమైన లింగానికి వ్యతిరేకమైన లింగానికి మారడానికి ప్రయత్నించే ఉద్దేశ్యంతో ఎంపిక చేయబడిన వైద్య లేదా శస్త్రచికిత్స జోక్యానికి వ్యతిరేకంగా సంఘ నాయకులు సలహా ఇస్తారు (“లైంగిక పునర్వ్యవస్థీకరణ”). ఈ చర్యలు తీసుకోవడం సంఘ సభ్యత్వ పరిమితులకు కారణమవుతుందని నాయకులు సలహా ఇస్తున్నారు.

సామాజిక పరివర్తనకు వ్యతిరేకంగా కూడా నాయకులు సలహా ఇస్తారు. ఒక సామాజిక పరివర్తనలో దుస్తులు లేదా వస్త్రధారణను మార్చడం లేదా పేరును లేదా సర్వనామాలను మార్చడం, పుట్టినప్పుడు అతని లేదా ఆమె జన్యుసంబంధమైన లింగం కాకుండా మరొకరిగా తనను తాను ప్రదర్శించుకోవడం వంటివి ఉంటాయి. సామాజికంగా పరివర్తన చెందే వారు ఈ పరివర్తన వ్యవధి కోసం కొన్ని సంఘ సభ్యత్వ పరిమితులను అనుభవిస్తారని నాయకులు సలహా ఇస్తున్నారు.

యాజకత్వాన్ని పొందడం లేదా ఉపయోగించడం, దేవాలయ సిఫారసును పొందడం లేదా ఉపయోగించడం మరియు కొన్ని సంఘ పిలుపులను స్వీకరించడం వంటివి పరిమితులలో ఉన్నాయి. సంఘ సభ్యత్వం యొక్క కొన్ని అధికారాలు పరిమితం చేయబడినప్పటికీ, ఇతర సంఘ భాగస్వామ్యం స్వాగతించబడింది.

ఒక సభ్యుడు అతను లేదా ఆమె ఇష్టపడే పేరును లేదా సంబోధనా సర్వనామాలను మార్చాలని నిర్ణయించుకుంటే, సభ్యత్వ రికార్డులో ప్రాధాన్య పేరు క్షేత్రం‌లో ఇష్టపడే పేరును నమోదు చేయవచ్చు. వార్డులో వ్యక్తి తనకు ఇష్టమైన పేరుతో సంబోధించబడవచ్చు.

పరిస్థితులు విభాగము నుండి విభాగానికి మరియు వ్యక్తి నుండి వ్యక్తికి వేరుగా ఉంటాయి. సభ్యులు మరియు నాయకులు కలిసి చర్చిస్తారు మరియు ప్రభువునుండి ఉపదేశము పొందుతారు. వ్యక్తిగత పరిస్థితులను సున్నితంగా పరిష్కరించడంలో ప్రాంతీయ అధ్యక్షత్వములు స్థానిక నాయకులకు సహాయపడతాయి. బిషప్పు‌లు స్టేకు అధ్యక్షునితో చర్చిస్తారు. స్టేకు అధ్యక్షులు మరియు మిషను అధ్యక్షులు తప్పనిసరిగా ప్రాంతీయ అధ్యక్షత్వము నుండి ఉపదేశము పొందాలి (32.6.3 చూడండి).

38.7

వైద్య మరియు ఆరోగ్య విధానాలు

38.7.2

ఖననం మరియు దహనం

మరణించిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అతని లేదా ఆమె మృతదేహాన్ని ఖననం చేయాలా లేదా దహనం చేయాలా అని నిర్ణయిస్తారు. వారు వ్యక్తి యొక్క కోరికలను గౌరవిస్తారు.

కొన్ని దేశాల్లో, చట్టం ప్రకారం దహన సంస్కారాలు అవసరం. ఇతర సందర్భాల్లో, ఖననం ఆచరణాత్మకమైనది కాదు లేదా కుటుంబానికి అందుబాటులో ఉండదు. అన్ని సందర్భాల్లో, దేహాన్ని మర్యాదగా మరియు గౌరవంగా చూడాలి. పునరుత్థానం యొక్క శక్తి ఎల్లప్పుడూ వర్తిస్తుందని సభ్యులకు భరోసా ఇవ్వాలి (ఆల్మా 11:42–45 చూడండి).

సాధ్యమైన చోట, వరము పొందియుండి మరణించిన సభ్యుని మృతదేహాన్ని ఖననం చేసినప్పుడు లేదా దహనం చేసినప్పుడు దేవాలయ వేడుక దుస్తులను ధరింపజేయాలి (38.5.8 చూడండి).

38.7.3

పుట్టకముందే మరణించే పిల్లలు (మరణించిన మరియు గర్భస్రావం అయిన పిల్లలు)

స్మారక లేదా సమాధి సేవలను నిర్వహించాలా వద్దా అని తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.

పుట్టకముందే మరణించిన పిల్లలకు దేవాలయ విధులు అవసరం లేదు లేదా నిర్వహించబడవు. నిత్యత్వంలో ఈ పిల్లలు కుటుంబంలో భాగమయ్యే అవకాశాన్ని ఇది తిరస్కరించదు. ప్రభువును విశ్వసించమని మరియు ఆయన ఓదార్పును కోరమని తల్లిదండ్రులు ప్రోత్సహించబడ్డారు.

38.7.4

అనాయాస మరణము

మర్త్య జీవితం దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి. అనాయాస మరణము అనేది నయం చేయలేని వ్యాధి లేదా ఇతర పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తి యొక్క జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా ముగించడం. ఆత్మహత్య ద్వారా ఎవరైనా చనిపోవడానికి సహాయం చేయడంతో సహా, అనాయాస మరణములో పాల్గొనే వ్యక్తి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తారు మరియు స్థానిక చట్టాలను ఉల్లంఘించవచ్చు.

ఒక వ్యక్తికి జీవితం చివరలో ప్రాణం నిలపడానికి చేసే తీవ్రమైన సహాయక చర్యలను నిలిపివేయడం లేదా ఆపివేయడం అనాయాస మరణముగా పరిగణించబడదు (38.7.11 చూడండి).

38.7.5

HIV ఇన్ఫెక్షన్ మరియు AIDS

HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) సోకిన లేదా AIDS (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్) ఉన్న సభ్యులను సంఘ సమావేశాలు మరియు కార్యకలాపాలలో స్వాగతించాలి. వారి హాజరు ఆరోగ్యపరంగా ఇతరులకు ప్రమాదకరం కాదు.

38.7.8

వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ

సమర్థ వైద్య సహాయాన్ని కోరడం, విశ్వాసాన్ని సాధన చేయడం మరియు యాజకత్వ దీవెనలు పొందడం వంటివి ప్రభువు చిత్తానుసారంగా స్వస్థత కోసం కలిసి పనిచేస్తాయి.

సభ్యులు నైతికంగా, ఆధ్యాత్మికంగా లేదా చట్టపరంగా సందేహాస్పదమైన వైద్య లేదా ఆరోగ్య పద్ధతులను ఉపయోగించకూడదు లేదా ప్రోత్సహించకూడదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వారు ప్రాక్టీసు చేసే విషయాల్లో అనుమతి పత్రాన్ని పొందిన సమర్థులైన వైద్య నిపుణులను సంప్రదించాలి.

38.7.9

వైద్య సంబంధమైన గంజాయి

వైద్యేతర ప్రయోజనాల కోసం గంజాయి వాడకాన్ని సంఘము వ్యతిరేకిస్తుంది. 38.7.14 చూడండి.

38.7.11

జీవితాన్ని పొడిగించడం (ప్రాణం నిలపడానికి చేసే సహాయక చర్యతో సహా)

తీవ్రమైన మార్గాల ద్వారా మర్త్య జీవితాన్ని పొడిగించడానికి సభ్యులు బాధ్యత వహించకూడదు. ఈ నిర్ణయాలు సాధ్యమైతే వ్యక్తి లేదా కుటుంబ సభ్యులు ఉత్తమంగా తీసుకుంటారు. వారు ప్రార్థన ద్వారా సమర్థ వైద్య సలహా మరియు దైవిక మార్గదర్శకత్వం పొందాలి.

38.7.13

టీకాలు

సమర్థ వైద్య నిపుణులచే ఇవ్వబడే టీకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి మరియు జీవితాన్ని కాపాడతాయి. టీకా ద్వారా వారిని, వారి పిల్లలను మరియు వారి సమాజాలను రక్షించుకోవడానికి సంఘ సభ్యులు ప్రోత్సహించబడ్డారు.

అంతిమంగా, టీకా గురించి వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి వ్యక్తులు బాధ్యత వహిస్తారు. సభ్యులకు ఆందోళనలు ఉంటే, వారు సమర్థులైన వైద్య నిపుణులతో చర్చించాలి మరియు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కూడా వెదకాలి.

38.7.14

జ్ఞాన వాక్యము మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు

జ్ఞాన వాక్యము దేవుని యొక్క ఆజ్ఞ. సిద్ధాంతము మరియు నిబంధనలు 89 లోని బోధనలలో పొగాకు, మత్తు పానీయాలు (మద్యం) మరియు వేడి పానీయాలు (టీ మరియు కాఫీ) వంటివి మానివేయడం ఉన్నదని ప్రవక్తలు స్పష్టం చేశారు.

జ్ఞాన వాక్యములో లేదా సంఘ నాయకులచే పేర్కొనబడని ఇతర హానికరమైన పదార్థాలు మరియు అలవాట్లు ఉన్నాయి. సభ్యులు వారి శారీరక, ఆధ్యాత్మిక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఎంపికలు చేయడంలో జ్ఞానం మరియు ప్రార్థనాపరమైన తీర్పును ఉపయోగించాలి.

38.8

పరిపాలనా విధానాలు

38.8.1

దత్తత మరియు పెంపుడు సంరక్షణ

పిల్లలను దత్తత తీసుకోవడం మరియు పెంచుకోవడం పిల్లలను మరియు కుటుంబాలను దీవించగలదు. దత్తత ద్వారా ప్రేమగల, నిత్య కుటుంబాలు సృష్టించబడగలవు. పిల్లలు కుటుంబానికి దత్తత ద్వారా వచ్చినా లేదా పుట్టుక ద్వారా వచ్చినా, వారు అంతే విలువైన దీవెన.

పిల్లలను దత్తత తీసుకోవాలని లేదా పెంచుకోవాలని కోరుకునే సభ్యులు అందులో ప్రమేయం ఉన్న దేశాలు మరియు ప్రభుత్వాల యొక్క వర్తించదగిన చట్టాలన్నిటిని పాటించాలి.

38.8.4

ప్రధాన అధికారులు, ప్రధాన అధిపతులు మరియు ప్రాంతీయ డెబ్బదుల సంతకాలు మరియు ఛాయాచిత్రా‌లు

సంఘ సభ్యులు ప్రధాన అధికారులు, ప్రధాన అధిపతులు మరియు ప్రాంతీయ డెబ్బదుల సంతకాలను కోరకూడదు. అలా చేయడం వారి పవిత్రమైన పిలుపులను మరియు సమావేశాల స్ఫూర్తిని దూరం చేస్తుంది. అది ఇతర సభ్యులను పలకరించకుండా కూడా వారిని నిరోధించవచ్చు.

సభ్యులు సంఘ భవనాల్లో ప్రధాన అధికారులు, ప్రధాన అధిపతులు మరియు ప్రాంతీయ డెబ్బదుల ఛాయాచిత్రా‌లను తీయకూడదు.

38.8.7

సంఘ పత్రికలు

సంఘ పత్రికలలో ఇవి ఉన్నాయి:

సంఘ పత్రికలను చదవమని ప్రథమ అధ్యక్షత్వము సభ్యులందరినీ ప్రోత్సహిస్తారు. పత్రికలు యేసు క్రీస్తు సువార్తను నేర్చుకోవడానికి, జీవించి ఉన్న ప్రవక్తల బోధనలను అధ్యయనం చేయడానికి, ప్రపంచవ్యాప్త సంఘ కుటుంబానికి అనుసంధానం కావడానికి, విశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు దేవునికి సన్నిహితంగా ఉండటానికి సభ్యులకు సహాయపడతాయి.

38.8.8

సంఘము పేరు, పదముద్ర మరియు చిహ్నం

సంఘ పదముద్ర మరియు చిహ్నం

సంఘము పేరు, పదముద్ర మరియు చిహ్నం కీలకమైన సంఘ గుర్తింపులు.

పదముద్ర మరియు చిహ్నం. సంఘము యొక్క పదముద్ర మరియు చిహ్నాన్ని (పైన ఉన్న దృష్టాంతం చూడండి) ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము ఆమోదించిన విధంగా మాత్రమే ఉపయోగించాలి. వాటిని అలంకార అంశాలుగా ఉపయోగించకూడదు. అలాగే వాటిని వ్యక్తిగతంగా, వాణిజ్యపరంగా లేదా ప్రచార మార్గంలో ఉపయోగించకూడదు.

38.8.10

కంప్యూటర్లు

సంఘ సమావేశమందిరము‌లలో ఉపయోగించే కంప్యూటర్లు మరియు సాఫ్ట్‌వేర్‌లు సంఘ ప్రధాన కార్యాలయం లేదా ప్రాంతీయ కార్యాలయం ద్వారా అందించబడతాయి మరియు నిర్వహించబడతాయి. కుటుంబ చరిత్ర కార్యముతో సహా సంఘ ఉద్దేశ్యాలకు మద్దతు ఇవ్వడానికి నాయకులు మరియు సభ్యులు ఈ వనరులను ఉపయోగిస్తారు.

ఈ కంప్యూటర్‌లలోని అన్ని సాఫ్ట్‌వేర్‌లు తప్పనిసరిగా సంఘమునకు సరైన అనుమతి పత్రాన్ని కలిగి ఉండాలి.

38.8.12

పాఠ్యప్రణాళిక సామాగ్రి

సభ్యులు యేసు క్రీస్తు సువార్తను నేర్చుకోవడానికి మరియు జీవించడానికి సంఘము సామాగ్రిని అందిస్తుంది. వీటిలో లేఖనాలు, సర్వసభ్య సమావేశ సందేశాలు, పత్రిక‌లు, చేతిపుస్తకాలు, పుస్తకాలు మరియు ఇతర వనరులు ఉన్నాయి. గృహములో సువార్తను అధ్యయనం చేయడానికి అవసరమైన లేఖనాలను మరియు ఇతర వనరులను ఉపయోగించమని నాయకులు సభ్యులను ప్రోత్సహిస్తారు.

38.8.14

దుస్తులు మరియు స్వరూపం

సంఘ సభ్యులు తగిన దుస్తులు మరియు స్వరూపం గురించి వారి ఎంపికలలో శరీరం పట్ల గౌరవం చూపించమని ప్రోత్సహించబడతారు. ఏది సముచితమైనది అనేది సంస్కృతులలో మరియు వివిధ సందర్భాలలో మారుతూ ఉంటుంది.

38.8.16

ఉపవాస దినము

సభ్యులు ఎప్పుడైనా ఉపవాసం ఉండవచ్చు. అయినప్పటికీ, వారు సాధారణంగా నెలలో మొదటి విశ్రాంతిదినము‌ను ఉపవాస దినముగా పాటిస్తారు.

ఉపవాస దినము సాధారణంగా ప్రార్థన చేయడం, 24 గంటల పాటు ఆహారం మరియు పానీయాలు లేకుండా ఉండటం (శారీరకంగా చేయగలిగితే) మరియు ఉదారంగా ఉపవాస కానుకను ఇవ్వడాన్ని కలిపి ఉంటుంది. ఉపవాస కానుక అనేది అవసరమైన వారికి సహాయం చేయడానికిచ్చే విరాళం (22.2.2 చూడండి).

కొన్నిసార్లు సంఘవ్యాప్త లేదా స్థానిక సమావేశాలు నెలలో మొదటి విశ్రాంతిదినమున జరుగుతాయి. ఇది జరిగినప్పుడు, స్టేకు అధ్యక్షత్వము ఉపవాస దినము కోసం ప్రత్యామ్నాయ విశ్రాంతిదినమును నిర్ణయిస్తుంది.

38.8.17

జూదం మరియు లాటరీలు

ఏ రూపంలోనైనా జూదం ఆడడాన్ని సంఘము వ్యతిరేకిస్తుంది మరియు వ్యతిరేకముగా ఉపదేశము ఇస్తుంది. ఇందులో క్రీడల జూదం మరియు ప్రభుత్వ ప్రాయోజిత లాటరీలు ఉన్నాయి.

38.8.19

వలస

వారి స్థానిక ప్రదేశములలో ఉండే సభ్యులు తరచుగా అక్కడ సంఘమును నిర్మించడానికి మరియు బలోపేతం చేయడానికి అవకాశాలను కలిగి ఉంటారు. అయితే, వేరే దేశానికి వలస వెళ్లడం అనేది వ్యక్తిగత ఎంపిక.

మరొక దేశానికి వెళ్లే సభ్యులు వారికి వర్తించే అన్ని చట్టాలను పాటించాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:21 చూడండి).

సువార్తికులు ఇతరుల యొక్క వలస‌కు బాధ్యత వహించడానికి ప్రతిపాదన చేయకూడదు.

38.8.22

దేశము యొక్క చట్టాలు

సభ్యులు వారు నివసించే లేదా ప్రయాణించే ఏ దేశంలోనైనా చట్టాలను పాటించాలి, గౌరవించాలి మరియు ఆమోదించాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:21–22; విశ్వాస ప్రమాణాలు 1:12 చూడండి). ఇందులో మతమార్పిడిని నిషేధించే చట్టాలు ఉన్నాయి.

38.8.25

సంఘ ప్రధాన కార్యాలయంతో సభ్యుల సంభాషణ

సంఘ సభ్యులు సిద్ధాంతపరమైన ప్రశ్నలు, వ్యక్తిగత సవాళ్లు లేదా అభ్యర్థనల గురించి ప్రధాన అధికారులకు ఫోను చేయడం, ఈ-మెయిల్ చేయడం లేదా లేఖలు రాయడం వంటివాటికి ప్రోత్సహించబడరు. ఆధ్యాత్మిక మార్గనిర్దేశాన్ని కోరుతున్నప్పుడు సభ్యులు వారి ఉపశమన సమాజము లేదా పెద్దల సమూహ అధ్యక్షుడితో పాటు వారి స్థానిక నాయకులను సంప్రదించాలని ప్రోత్సహించబడ్డారు (31.3 చూడండి).

38.8.27

వైకల్యాలున్న సభ్యులు

నాయకులు మరియు సభ్యులు తమ విభాగములో నివసించే అందరి అవసరాలను తీర్చడానికి ప్రోత్సహించబడ్డారు. వైకల్యాలున్న సభ్యులు విలువైనవారు మరియు అర్ధవంతమైన మార్గాల్లో సహకరించగలరు. వైకల్యాలు మేధోపరమైనవి, సామాజిక, మానసిక లేదా శారీరకమైనవి కావచ్చు.

38.8.29

ఇతర విశ్వాసాలు

స్ఫూర్తిదాయకమైనది, గొప్పది మరియు అత్యున్నత గౌరవానికి అర్హమైనది అనేక ఇతర విశ్వాసాలలో కనిపిస్తుంది. ఇతరుల నమ్మకాలు మరియు సంప్రదాయాల పట్ల సువార్తికులు మరియు ఇతర సభ్యులు సున్నితంగా మరియు గౌరవంగా ఉండాలి.

38.8.30

రాజకీయ మరియు పౌర కార్యకలాపాలు

సంఘ సభ్యులు రాజకీయ మరియు ప్రభుత్వ వ్యవహారాలలో పాల్గొనడానికి ప్రోత్సహించబడ్డారు. అనేక దేశాలలో, వాటిలో ఇవి ఉండవచ్చు:

  • ఓటు వేయడం.

  • రాజకీయ పార్టీలలో చేరడం లేదా సేవ చేయడం.

  • ఆర్థిక సహాయం అందించడం.

  • పార్టీ అధికారులు, అభ్యర్థులతో సంప్రదింపులు జరపడం.

  • స్థానిక మరియు జాతీయ ప్రభుత్వంలో ఎన్నుకోబడిన లేదా నియమించబడిన కార్యాలయాలలో సేవ చేయడం.

తమ సమాజాలను నివసించడానికి మరియు కుటుంబాలను పెంచడానికి ఆరోగ్యకరమైన స్థలాలుగా చేయడానికి యోగ్యమైన కారణాలలో పాల్గొనడానికి కూడా సభ్యులు ప్రోత్సహించబడ్డారు.

స్థానిక సంఘ నాయకులు రాజకీయ విషయాలలో పాల్గొనడానికి సభ్యులను ఏర్పాటు చేయకూడదు. లేదా సభ్యులు ఎలా పాల్గొంటారనే దానిని ప్రభావితం చేయడానికి నాయకులు ప్రయత్నించకూడదు.

నాయకులు మరియు సభ్యులు ఏదైనా రాజకీయ పార్టీ, వేదిక, విధానం లేదా అభ్యర్థికి సంఘ ఆమోదం వలె వ్యాఖ్యానించబడే ప్రకటనలు లేదా ప్రవర్తనకు దూరంగా ఉండాలి.

38.8.31

సభ్యుల గోప్యత

సభ్యుల గోప్యతను రక్షించడానికి సంఘ నాయకులు బాధ్యత వహిస్తారు. సంఘ రికార్డులు, సమాచార గ్రంథములు మరియు అటువంటి మూలవస్తువులను వ్యక్తిగత, వాణిజ్య లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు.

38.8.35

శరణార్థులు

అవసరంలో ఉన్నవారిని చూసుకునే బాధ్యతలో భాగంగా, శరణార్థులను వారి సంఘాల సభ్యులుగా స్వాగతించడానికి సంఘ సభ్యులు తమ సమయాన్ని, ప్రతిభను మరియు స్నేహాన్ని అందిస్తారు (మోషైయ 4:26 చూడండి).

38.8.36

సంఘ ఆర్థిక సహాయం కోసం అభ్యర్థనలు

అవసరంలో ఉన్న సభ్యులు సంఘ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించడానికి లేదా ఇతర సంఘ నాయకులు లేదా సభ్యుల నుండి డబ్బును అభ్యర్థించడానికి బదులుగా వారి బిషప్పుతో మాట్లాడాలని ప్రోత్సహించబడ్డారు.